మరువం జన్మదినం - సాహితీమిత్రులందరికీ శతసహస్రకోటి ధన్యాభివందనాలతో ...

మరువం తొలివార్షికోత్సవానికి విచ్చేసిన సాహితీ మిత్రులకు స్వాగతం. నా మానస పుత్రిక మరువానికి ఇది తొలి పుట్టిన రోజు వేడుక. ఏడాది పొడుగునా సాగిన ఘనసంబరాలు మీ రాకపోకలు. పునశ్చరణగా ఓ చిరు యత్నం.


వాడినా వాసన వీడని మరువం .. అంటూ దాదాపు 15 సంవత్సరాలు వదిలేసిన లేఖిని చేత పట్టి వ్రాసిన తొలి పలుకుకి,
"మీలో తిరిగి మేల్కొన్న తృష్ట ద్విగుణీకృతోత్సాహంతో పుంజుకుని, మీమరువంపు మొలక కన్నులపండువుగా నందనవనం కాగలదని ఆశిస్తూ.."
అని వెన్ను తట్టిన మాలతిగారు, తిరిగి నా మూడో టపాకి
"ఎదురుగా వుండి గుక్కతిప్పుకోకుండా చెప్పున అనుభూతి కలిగిందండీ ఒక్కవాక్యమూను. మీరు మొదలుపెట్టడమే తరువాయి. కధలో, కబుర్లో ఏవి అనుకుంటే అవి రాసేయండి."
అని ప్రశంసించటంతో, ముందుగా వచనం వైపు దృష్టి పెడదామనుకున్నాను.

అలాగే రెండో టపాకి కొత్త పాళీ గారు, బొల్లోజు బాబా గారు వ్యాఖ్యలు వ్రాయటం మరిన్ని రచనలు చేయాలన్న తపనని పెంచింది.

తిరిగి స్థబ్దత, ఎన్నో ఏళ్ళుగా పేరుకున్న నైరాశ్యం ఒక్క రోజులో పోదని మళ్ళీ అనుభవంలోకి వచ్చింది. తిరిగి డిశంబరులో నా కలం కవితా పుంతలు తొక్కే వరకు ఆ మధ్యకాలంలో నా నేస్తం ఇచ్చిన చేయూత అంతా ఇంతా కాదు.

కానీ, చదువరుల ఆదరణ, ప్రోత్సాహం, వ్యాఖ్యానం నాలో జ్వలించే కవితా జ్యోతికి తైలం వంటివి. వారు లేని మరువం ఇంత విరివిగా ఎదిగేది కాదు.

అందరినీ పేరు పేరునా తలవలేకపోతున్నాను, మన్నించండి, కానీ తరచుగా తొంగిచూసి నా సాహితీయానంలో సహచరులై, ప్రతి మజిలీలో ఒకరిగా కలుస్తూ వచ్చిన మరి కొందరు - జన్య, ఆత్రేయ, పృథ్వి, రాఘవ, మహేష్, ప్రతాప్, చిలమకూరు విజయమోహన్, దుర్గేశ్వర, జ్యోతి, సుజాత, లలిత, నేస్తం, పరిమళం, మధురవాణి, సుజ్జీ, వేణు శ్రీకాంత్, రవిగారు, మురళి, MURALI, దిలీప్, ఆనంద్, ప్రదీప్, భాస్కర రామి రెడ్డి, ఈగ హనుమాన్, భావకుడన్, చిన్ని, భవాని, పద్మార్పిత, అశ్వినిశ్రీ ...............

అలాగే తమదంటూ ఓ ముద్రతో తమ వ్యాఖ్యలతో నా కవితలకి మరింత జీవం పోసిన వారు మరి కొందరు.

ప్రతి ఒక్కరు - శీర్షిక పెట్టాలని లేదు నా స్వగతం అందరి మనోభావాల్లోని ఏదో ఒక భావసారూప్యతని వెలికి తెచ్చింది. పొద్దు లో 2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం లో స్వగతాలు స్వ గతాలు: విభాగంలో ఈ కవితకి స్థానం దక్కింది.

ఎవరిని వదలను? - ఈ శీర్షిక మీరే పెట్టాలి నాపై నాకు నమ్మికని నిలిపిన రచన ఇది. కాని కొసమెరుపు మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ వ్యాఖ్య -
"అలనాడు శంకరుడు తన సతి గౌరి మరణించాక, విలయం సృష్టించాడట. అటు పిమ్మట పార్వతిగా జన్మించి శంకరుని చేరిందట. ఆ పార్వతి ఏమి కోరిందా అనుకుంటున్నా ఇన్నాళ్ళు. ఇలా కోరి చేరిందన్నమాట ఆ శంకరుని."
అలాగే నిషిగంధ, శివ, రాధిక వంటివారి చేత వ్యాఖ్యానం చేయించిన ఏకైక రచన ఇది.

చిలమకూరు విజయమోహన్ - నేను క్రమం తప్పకుండ చూసే బ్లాగుమీది.

బుసాని పృథ్వీరాజు వర్మ - అంబరచిత్రం :-
"నా కంటికి ఓ చక్కని దృశ్యాన్ని చూపారు."
ఆయన చిత్రాలకి నేను కవితలు వ్రాయటానికి ఇది ఆరంభం.

కొత్తపాళీ గారు - ఈ సిగ లెక్కెక్కడ తప్పుతోందబ్బా? :-
"చాలా బాగా రాశారు. ఈ మధ్య కాలంలో మన బ్లాగుల్లో ఈ మాత్రం పట్టున్న రచన చదవలా."
పట్టున్న రచన చేయాలన్న పట్టుదల వచ్చిందీ మాటతో.

బొల్లోజు బాబా - మంచు పూల పేరంటం :-
"ఆకాశపు సంబరాలు అన్న ఊహే హృద్యంగా ఉంది. మీ పదచిత్రాల సొబగు కూడా అందంగా అమరింది."
నా పదాల్లోని అందాన్ని స్పర్శించినవారు.

ఆత్రేయ - copper bottom heart నా చూడచక్కనమ్మ! :-
"మీ కాపరు బాటము గుండే, ఈ జీవితపు ప్రెషరు కుక్కరులో అమరుతుందా? బ్రతుకు వంట బానే వండుతుందా? ఐతే ఎక్కడ (కను)కొన్నారో చెప్పండి. నాకొకటి బాగా అవసరం.
చాలా బాగుందండి"


రాఘవ - నీవు - నా అలక :-
"ఇది చదివి నాకు దేవులపల్లివారు గురుతుకొచ్చారు...

నీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల నీరిడి కలయజూచితిని
గడియ యేని యిక విడచిపోకుమా
చెదరిన హృదయము పగులనీకుమా"
ఇంతకన్నా ఏమి కావాలి, ఒకరి మదిలో ఆ మహనీయుని సరసన తృటికాలమైనా నిలవగలగటం.

డా. ఆచార్య ఫణీంద్ర - దశావతారాలు నీవేనైనావే? ఇదేం లీల? :-
"’ఉష’ గారికి నమః

ఉ|| మానవ జీవితంబనెడు మాన్య విశేష విచిత్ర చిత్రమే
కానగ దివ్యమైనదని, కాల పథాన దశావతారముల్-
మీనము, కూర్మమాదులును మేళవమై నర జన్మమందునే
లీనమునౌచు తోచునని లీలగ చెప్పిన మీకు వందనాల్! :- "
డా.ఆచార్య ఫణీంద్ర గారు, మీ ఈ పద్యం నా మరువపు వనానికి ఇకపై సంజీవని వంటిది. ఎపుడైనా నా కవితా శక్తి సన్నగిల్లినట్లుంటే ఇదే తారకమంత్రం. నాకీ రోజు పట్టభద్రురాలినైనంత సంతసం, అంబరమంటిన హృదయం అన్న అనుభూతి అమాంతంగా అనుభవమైంది.

నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) - నీలోనే లోకంవుంది, గమ్యం వుంది, సమస్త జగత్తువుంది! :-
"మీ ఆలోచనలు చాలా బాగున్నాయి.వాటిని గేయ కవిత్వం రూపంలో కంటే పద్యకవితా రూపంలోకి మలచగలిగితే శాశ్వతత్వం సంతరించు కుంటాయి. ఎందుకంటే పద్య కవిత్వానికున్న చంధస్సు ఆ గుణాన్ని పెంపొందిస్తుంది. పైగా ధారణ కనువై మనసులో గుర్తుండి పోడానికి వీలు కలుగ జేస్తుంది. ఆ దిశగా కూడా ప్రయత్నం ప్రారంభించండి.శుభం భూయాత్."


దిలీప్ - పై కవిత మీద
"ఏంటమ్మా ఇది? ఈ శక్తి ఎలా చేకూరుతుంది? అది వ్యక్తిత్వ మహిమా? లేక సాహిత్య పిపాస వల్లా? ఎక్కడినుండి పుట్టుకొస్తున్నాయి ఇవన్నీ? ఇంతటి చిక్కని భావాలు"


మహేష్ - నిరీక్షణ - సమర్పణ :-
"మీ కవిత చదివినప్పుడల్లా నాకు తెలిసిన తెలుగు మీద సందేహం వస్తుంది. ఇక కవిత్వమంటారా top class."


వేణూ శ్రీకాంత్ - శృంగార సూరీడు! :-
"చాలా బాగుంది ఉష గారు. ఈ పాట గుర్తొస్తుంది. "గోరు వెచ్చనీ సూరీడమ్మా...పొద్దుపొడుపులో వచ్చాడమ్మా...
వద్దన్నా రావద్దన్నా గుండెల్లో గుడిశ వేసి అది గుడిగా చేసీ ఆ గుడి లో దాగున్నాడమ్మా.."
ఇదే కాదు ఎన్నో చక్కని పాటల్ని ఆవలీలగా గుర్తుకి తెస్తారీయన.

భాస్కర రామి రెడ్డి ఇంకా తెలియదీ నిర్వచనం! :-
"కవిత చదవగానే కామెంట్ రాయాలనిపించింది. కామెంట్ రాయడానికి ఏదో ఒక ప్రేరణ కావాలి. ఆ ప్రేరరణ ఏపాదమో అని తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ చదివా.. ఏ పాదము తీసి వేసి కవిత చదివినా అసంపూర్తిగా అనిపించింది. అందుకే ఏ పాదానికాపాదమే సరిసాటి."


సుజాత - కాలంతో సాగే నా ఈ గానం, కాదనవనే నీకు అంకితం! :-
"మీకింత చిక్కని భావాలు ఉప్పెనలా ఎలా వస్తాయి? ప్రిపేర్ అయి రాసినట్లు అసలే ఉండదు.ఒక్కోసారి చదివి మూగబోడమే తప్ప తిరిగి ఇది బాగుందని రాయడానికి భాషే దొరకదు నాకు. I'm jealous..! "


ఆనంద్, ప్రదీప్, మధుర, నేస్తం, పరిమళం - ఎంత చెప్పినా వీరిచ్చే ప్రోత్సాహాన్ని సరీగ్గా తెలుపలేను. కృతజ్ఞురాలను అని ఒక మాటగా చెప్పటం తప్ప. మచ్చుకి ఒక్కో వ్యాఖ్య...

ఆనంద్ - మన్నించవా మిత్రమా? :-

"Some emotions never have reasons.
Some relations never have endings.
Some tears are never forgotten.
Some hugs are never felt enough.
Some smiles never have meanings.
Some feelings never need voices."


మధుర వాణి - మనమీ సుందర ప్రపంచాన అందవిహీనులమా? :-
"ఉష గారూ, మీ కవితలన్నింటినీ తప్పనిసరిగా పుస్తకం వేయించాలండీ.. ఈ సరికే ఒక పుస్తకానికి సరిపడినన్ని అయ్యే ఉంటాయి కదూ..!"


పరిమళం - ఏ ఇల్లు వదిలాడమ్మ ఈ తుంటరి వసంతుడు వలపు వెల్లవేయకుండా? :-
"టైటిల్ చూడగానే మైకం లో పడిపోయా ...
తుంటరి వసంతుడు....వలపు వెల్ల....
మీ పద ప్రయోగం
శరదృతు వెన్నెల కిరణం !"


నేస్తం - పై కవిత మీద
"ఉషగారు టైటిల్ కూడా ఇంత అందం గా పెట్టెస్తే ఇంక కుళ్ళిపోవడం తప్ప ఏం చేయగలను.. అద్భుతం ఇంతకు మించి పదం దొరకడం లేదు నాకు :("
;)

వీరంతా కుమ్మరించిన పాలధారలిక్కడ చూడండి - నేనూ నండూరి ఎంకికేం తీసిపోను...


ఇకపోతే ఇలా మెచ్చుకోళ్ళు, ప్రశంసల వర్షాలే కాక సద్విమర్శలతో నాకు మరింతగా ఎదిగే అవకాశం కల్పించిన వారు కొందరు.

కొత్త పాళీ, బొల్లోజు బాబా గారు - మనమీ సుందర ప్రపంచాన అందవిహీనులమా? వ్యాఖ్యల్లో చక్కని వివరణగా వారి అభిప్రాయాలు చూడండి.

"పద్యంలో భావం చాలా బావుంది. మీరేమనుకోనంటే దీన్ని కొంచెం డిసెక్ట్ చేస్తాను. రెందు విషయాల మీద మీరు శ్రద్ధ పెట్టాలని నా విన్నపం. ఒకటి విషయానికి తగిన క్లుప్తత. రెండోది వాక్య నిర్మాణం. ఈ రెంటి మీదా శ్రద్ధ పెడితే మీ పద్యాలకి అంతస్సౌందర్యమే కాక బాహ్య సౌందర్యం కూడా వస్తుందని నా హామీ :)"


"మీలో అద్భుతమైన కల్పన శక్తి ఉంది. అలవోకగావివిధ భావాల పరంపర మీ కవితలలో తొణికిసలాడుతుంది. సందేహంలేదు మీ కవితలు చదువరి మనో యవనికపై మంచి ఆలోచనలను నాట్యం చేయిస్తాయి.

ఈ క్రింది విషయాలు మిమ్ములను నొప్పిస్తే వాటిని ఇగ్నోర్ చేయండి. ఈ కారణం మన అనుబంధానికి అడ్డంది కాబోదనే ధైర్యం చేస్తున్నాను. ఈ అభిప్రాయాలన్నీ కవిత్వంపైనే కానీ వ్యక్తులపై కాదు.

అభియోగాలు
1. మీకు కలిగిన భావాన్ని మీరు యధాతధంగా చదువరిలో ప్రవేశపెట్టటంలో కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది. ఇది కూడా మీరెంచుకొన్న పదాల వల్లకానీ, లేక పదాల కూర్పువల్ల కానీ జరుగుతుంది...."


ప్రదీప్ - కాలంతో సాగే నా ఈ గానం, కాదనవనే నీకు అంకితం! :-
"కోడిగుడ్డుపై ఈకలు అనుకోపోతే ..."
అంటూ సాగిన సుధీర్ఘ చర్చ ఇంకా సశేషంగానేవుంది. కానీ నాకు గుర్తుంది తనకి సమాధానమివ్వాల్సివుందని.

విజయ్ - మాయో, మర్మమో, మోక్షమో, సఫలమో ఈ జీవితం? :-
"ఉష గారూ! మొదటి 12 లైన్లలో తీసుకున్నంత శ్రద్ధ తరువాత 8 లైన్లలో తీసుకోలేదేమో అనిపిస్తోంది. ఎందుకంటున్నానంటే...
ఈ లైన్లలో పదాలు ఏదో అందం కోసం ప్రయోగించినట్లుగా ఉందే గానీ, అంత భావుకత కనిపించక తేలి పోతున్నాయి.. అలాగే ఒకే అర్ధం వచ్చే పదాలు అదే లైన్లో కనిపిస్తున్నాయి...
"కూర్పు, చేర్పు
కూరిమి, చెలిమి "

నాకు తోచింది చెప్పాను .. అన్యదా భావించకండి...
అలా రాకుండా జాగ్రత్త తీసుకుంటే మరింత బాగుంటాయి మీ కవితలు.
కవిత చాలా బాగుంది. all the best :)"


భావకుడన్ - ఏ ఇల్లు వదిలాడమ్మ ఈ తుంటరి వసంతుడు వలపు వెల్లవేయకుండా? :-
"ఈ కింది విధంగా....... మీ కవితనే ....విడగొడితే?......కొంచం పాఠకుడికి సులువుగా ఉంటుంది....ఇంకొంచం అందం కూడా వస్తుంది అని నా భావన "


నల్లమోతు శ్రీధర్ - నీవు - నా అలక :-
"ఉష గారు, మంచి భావుకత. బాగుంది. స్పేసింగ్, bold, italic వంటి ఫార్మేటింగ్ అనుసరించడం వల్ల మీ కవిత మరింత ఆకర్షణీయంగా కన్పిస్తుంది. చూడడానికి మొత్తం ఒక పేరాగా అనిపిస్తోంది. మున్ముందు వీలైతే దీనిపై దృష్టి పెట్టగలరు. మంచి పోస్టులు రాస్తారని ఆశిస్తూ.."




శరత్, జ్యోతి, యోగి :- టెంప్లేటు మార్చమనో, మార్చిపెట్టో, మంచిది వెదికి పెట్టో సహకరించినవారు.


చివరిగా, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నా 64 కవితల్లోకి, ఒక్కగానొక్క వచనం "నారాయణ నారాయణ ఇదీ ఓ కధే" లోకి తొంగిచూస్తే నాకే అబ్బురంగావుంది నా చిరు మొలకని అచ్చంగా నిడదవోలు మాలతి గారన్నట్లు ఇంత నందనవనంగా తీర్చిదిద్దటానికి మీరంతా ఎంతగా సహకరించారో కదాని.

నా వరకు నేను క్రొత్త కోణంలోకి చూసాననిపించినవివి -

copper bottom heart నా చూడచక్కనమ్మ!
చక్రభ్రమణం
శృంగార సూరీడు!
అష్టనాయికలూ నేనేనై, నీ ఒక్కడికై వేచానిట...
లక్ష జన్మల కోటి లేఖల్లో ...
అద్దంలో నా బొమ్మ నవ్వుతుంది! ఎందుకబ్బా?
ఉరుము భేరి మ్రోగించి, మెరుపు దీపాలు వెలిగించి సమరం చేసె ఆకాశం!
ప్రాణ వాయువుగ పాటనే నింపేస్తా!
నేనూ నండూరి ఎంకికేం తీసిపోను...
నీలోనే లోకంవుంది, గమ్యం వుంది, సమస్త జగత్తువుంది!
స్వతంత్ర గణతంత్ర యంత్రజీవన తాంత్రికులం!!!
ఇంకా తెలియదీ నిర్వచనం!
మాయో, మర్మమో, మోక్షమో, సఫలమో ఈ జీవితం?
నానమ్మ నవ్వుకి అర్థం మీరైనా చెప్పరా?
ఆ ఒక్కటీ అడక్కు!

ఏడాది నిండుతుందనగా "ఏది ఏమైనా కాని ఒక మంచి కవిత.......నాకు చాల నచ్చింది......నా బ్లాగ్లో పెట్టుకోనా? (www.nemechchinaraatalu.blogspot.com) అంటూ భావకుడన్ గారు బ్లాగ్లోకంలోని మహామహుల రచనల సరసన నా చిరు కవిత ఏ ఇల్లు వదిలాడమ్మ ఈ తుంటరి వసంతుడు వలపు వెల్లవేయకుండా? కి స్థానం కల్పించారు. మరువానికదొక అనుకోని అపురూపమైన పుట్టినరోజు కానుక.

సాహితీమిత్రులందరికీ శతసహస్రకోటి ధన్యాభివందనాలతో ...

17 comments:

  1. ఈ మరువానికి ఏడాది నిండిందా.... నేను మీ రచనలు చదవడం మొదలుపెట్టింది డిశంబరులో దశావతారాల మీద రాసిన కవిత నుంచే....
    వార్షికోత్సవ శుభాకాంక్షలు.
    నా వ్యాఖ్యలు మీకు ఎంత ఉపయోగపడ్డాయో నాకు తెలియదు కానీ, మీ కవితలకు వ్యాఖ్యానించడం ద్వారా నా జ్ఞానాన్ని పెంచుకుంటున్నాను.

    ఈ మరువం ఉరకలేసే నది కావాలి
    చిన్ని లోకంలోనే బందీ అయ్యే కొలను కారాదు
    మీ మరువపు పయనం ఒక ప్రవాహంలా పయనించాలి
    ఆ సాహితీ సాగరంలో సంగమమవ్వాలి
    మరువపు తోటలోని పరిమళం అందరికీ అందాలని కోరుకుంటున్నాను

    * కోడి గుడ్డుపై ఈకలు ఇంకా గుర్తున్నాయన్నమాట, నేను పీకడానికి సిద్దం... కాకపోతే కోడిగుడ్డు కాస్తా కోడి పెట్టయ్యింది ఇప్పటికే.... ఏమి చేస్తాం... :)

    ReplyDelete
  2. ఇక్కడ అప్రస్థుతమైనా ఒక్క విషయం చెప్పదల్చుకున్నాను, కవితా ప్రపంచంలో ఒక బుల్లి కూడలిలో ఉండే వాళ్ళలో కవితలు ఎప్పటికప్పుడూ చదువుతూ వ్యాఖ్యానించే వారి సంఖ్య గట్టిగా వంద కూడా ఉండదు. అలాంటిది, ఎవరో ఒక్కరి వ్యాఖ్య వస్తే గొప్ప... అనే ఉద్దేశ్యంలో మాత్రం ఉండవద్దు. (ఇది ఎవరినీ విమర్శించడానికి కాదు. ఒకవేళ నన్ను విమర్శించాలనుకుంటే నా బ్లాగుకి రండి. మరువపు తోటలో వద్దు).
    అయితే ఇక్కడ రెండవ కోణం కూడా లేకపోలేదు, వంద మందినే మెప్పించకపోతే ఇక కవితా ప్రపంచాన్నేమి మెప్పిస్తాం అని. నేను ఈ కోణాన్ని ఒప్పుకోలేను. ఎందుకంటే ఈ వంద మంది మొత్తం ప్రపంచానికి ప్రతినిధులూ కారు, మహారధులూ కారు.
    ఎవరో వ్యాఖ్యానించాలనో, వ్యాఖ్యానించలేదనో ఎదురు చూస్తూ మీ మరువపు తోటకు నీళ్ళు పొయ్యడం ఆపద్దు. ఎందుకంటే, గీతలో కృష్ణుడు చెప్పినట్టు
    ఫలితాన్ని ఆశిస్తూ పని చెయ్యరాదు.

    ReplyDelete
  3. తప్పకుండా! నేను కూడా "కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన" లో నమ్మకమున్నదాన్ని. ప్రశంస పన్నీరువంటిది, పొగడ్త అత్తరువంటిది అవి జల్లుకోవటానికే కానీ దాహార్తిని తీర్చలేవు. సరైన పోలిక దొరకటం లేదు కానీ, కవిత అన్నది నా వరకు ఒక అవేశమో, అనుభూతి నుంచో వస్తుంది. నేను నిజాయితీగా ఒప్పుకునే మాట ఆ భావాలకి ఒకరే మూలం. ఆ పై చదువరుల అభిప్రాయాలు దానికి ఓ వన్నెనద్దుతాయి. నాలోని ఈ ఆర్ధ్రతని తిరిగి మునుపటి స్తబ్థత కబళించనంతవరకు మరువం చివురేస్తుందనేవుంది. ఇకపోతే భువనవిజయం మాదిరిగా ఒకరి అండ ఆదరణ ఎంతో కొంత అవసరం. ఇదీ వ్యక్తిగత అభిప్రాయం.

    మరువం గురించిన నా మనోగతమిది. మహేష్ గారి టపాకి వ్యాఖ్యగా వ్రాసాను.

    "నా మనసు స్పందనని తానే వెలికి తెచ్చుకుంటుంది. నాకోసమే నేను వ్రాసుకుంటాను. అవి చదివి మెచ్చే మరో మనసుంటే దానికి ఓ సార్థకత, అలాగని అదే నా కవితలకి భవిత కాదు. అవి జనిస్తూనేవుంటాయి. నా కలం నుంచి జారే వరకే అది మాట మార్చగల మనసు, జాలువారిన ప్రతీ పదం నా బిడ్డే ఇక ఎవరిని వదిలేయమంటే ఏ తల్లి మాత్రమేమంటుంది? దాదాపుగా నావన్నీ నా వరకు ఉత్తమ రచనలే, ఇది ఆత్మవిశ్వాసమే. అవి బ్లాగులో ఉనికి సంతరించుకున్నాయా, లేక ఓ పత్రికాముఖంగా వెలుగు చూపాయా అన్నది నాకు అప్రస్తుతం. నాది సాహిత్యం కాదంటే తర్కించను. సమకాలీన తీరుల్లో వున్నదని మాత్రం నమ్ముతున్నాను. పాఠకులు వస్తున్నారు, ఇకపై వస్తారు. వ్రాసాక తిరిగి తిరిగి చదువుకుంటాను, మనం ఎపుడో తిన్న మామిడి రసాల్ని మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకున్నట్లు. నా మటుకు నేను ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతాను కనుక, మన రచనలకీ చదువరులు పుట్టుకొస్తూనేవుంటారు. జయహో బ్లాగ్లోకం. జయహో బ్లాగ్వ్యాఖ్యాస్వాతంత్రం జయహో బ్లాగ్సాహీతీమిత్రత్వం ... "

    ReplyDelete
  4. ఈ మధువనంలో మీ మరువపు పరిమళం అసమానం.

    మీ నమ్రతకు అచ్చెరువొంతుతున్నాను.

    అభినందనలు

    ReplyDelete
  5. నా మనసు స్పందనని తానే వెలికి తెచ్చుకుంటుంది. నాకోసమే నేను వ్రాసుకుంటాను. అవి చదివి మెచ్చే మరో మనసుంటే దానికి ఓ సార్థకత, అలాగని అదే నా కవితలకి భవిత కాదు. అవి జనిస్తూనేవుంటాయి...

    well said.

    congratulations Usha garu.

    ReplyDelete
  6. మరువం కి జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  7. మరువానికి జన్మదిన శుభాకాంక్షలు. మీ ప్రయత్నం నిరంతరంగా కొనసాగాలని...

    ReplyDelete
  8. అప్పుడే ఏడాది అయిపోయిందా, ఇంకా నిన్నో మొన్నో అనుకున్నాను. ఉషగారూ, నాకు పరమానందంగా వుంది. మీరే చెప్పినట్టు మనం రాసుకునేది మొదట మనలో ఆలోచనలకి ఒకరూపం ఇవ్వడానికే. మరొకరు స్పందించినప్పుడు, మనతో నడిచే బాటసారులు ఇంకా వున్నారన్న తృప్తి కలుగుతుంది. నేను కవితలు అంతగా చదవడంలేదు. ఇకమీదటనయినా, అలవాటు చేసుకోవాలి. మీ మరవంపు పరిమళాలు ఇతోధికంగా దిగంతాలకు చొచ్చుకుపోవాలని ఆకాంక్షిస్తూ,
    శుభాకాంక్షలు.
    - మాలతి

    ReplyDelete
  9. మరువం గారు,
    బుడి బుడి నడకల పాపాయి అకాశమంత ఎదగాలని ఆశిస్తూ,
    శుభాకాంక్షలు

    ReplyDelete
  10. వార్షికోత్సవ శుభాకాంక్షలు ఉషగారు.

    ReplyDelete
  11. మరువం ! పుట్టిన రోజు జేజేలు !
    ఏటేటా ఇలాగే పండుగ జరుపుకోవాలని
    బ్లాగ్ వనంలో మీపరిమళాలు మరింత వెదజల్లాలని
    ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తూ .......పరిమళం !

    ReplyDelete
  12. ఉష గారూ,
    మీ మరువపు తోటకి అప్పుడే ఏడాది నిండిందా.? మీ మరువపు పరిమళాలతో పాటుగా సాగినా ఈ ప్రయాణం మాక్కూడా ఎంతో చక్కని అనుభూతిని మిగిల్చింది. ఈ ఆనందం ఇలాగే పదికాలాల పాటు హాయిగా సాగాలని కోరుకుంటున్నాను. మీకివే అభినందన మందార మాలలు.!

    ReplyDelete
  13. మరువాన్ని పలుకరించి, ఇంకా పద పదమని ప్రోత్సాహం, పైకెదగమని ఉల్లాసం నింపిన మీఅందరకూ పేరు పేరునా ఇదే నా వందనం. మళ్ళీ మళ్ళీ రావాలని మనవితో రెండో ఏడాదిలోకి అడుగిడాను.

    ReplyDelete
  14. పై అందరి అభిప్రాయమే నాదీనూ :)

    ReplyDelete
  15. నేస్తం, ధన్యవాదాలు. అభిమాన జల్లుల్లో తడిసిపోయానో! తరించిపోయానో!!

    ReplyDelete
  16. మరువానికి జన్మదిన శుభాకాంక్షలు. మీ మరువ-వనం ప్రతిదినం మరింత అందంగా రూపొందాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. సమయాభావంవల్ల నెను నెట్లో ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాను. మరువవనంలో తచ్చాడటం ఎప్పుడూ అహ్లాదజనకమే... మళ్ళీ వస్తా.. మరోసారి అభినందనలు.

    ReplyDelete
  17. ఆత్రేయ గారు, మరువపువనం వృద్ధికి మీ ఆకాంక్షకి ధన్యవాదాలు. మీరు కనపరుస్తున్న నెయ్యానికి నా నెనర్లు. ఈ సమయాభావం నన్నూ నలిబిలి చేస్తుందండి. అందరం దాని బారినపడ్డవారమే. :(

    ReplyDelete