కాలం లోకి

అప్పుడక్కడ
చీకటి కమ్మి చాలాసేపయింది
నేల కి సమీపంగా
తారకల వంటి మిణుగురులు
నింగిని తాకుతూన్న
మిణుగురుల వంటి నక్షత్రాలు
కంటిలోనూ, కాంతితోనూ చిత్రాలుగా
సర్దుకున్నాయి

ఆమె పెదవి విప్పుకుని
చిన్న నవ్వు మొలిచింది
'మోటబావి గోడలు చీల్చుకున్న పచ్చని మొలకలా'
దృశ్యం, సాదృశ్యం నడుమ
నడయాడే మది ఊసూ పుట్టింది
అంతలో-

ఏదో అసంబద్ధమనిపించింది..

మొలకది జీవితేచ్ఛ, అస్తిత్వ పోరాటం
మిణుగురు ఉనికితో చలిస్తున్న జీవి
రాలినదో, రగులుతున్నదో తెలియని తార
ముఖాన నిరంతరం వేసుకునే ముసుగు, నవ్వు..
సామ్యం లేని సంగతుల
అసహజచిత్ర ప్రదర్శన,
వ్యూహం పన్ని సాగిస్తున్న 
బతుకురణపు అర్థవిహీనత
నశించిపోయాయి

వేకువ కావచ్చింది..

ఆ వేకువని మించిన ఎరుక
మరేదీ కలగలేదు
అయినప్పటికీ
ఆ వెనుగ్గా నిశి కమ్ముతూనే ఉంటుంది

ఇక నుంచి,
ప్రతి అస్తిత్వం అనుపమం
అనునిత్యం అసమానం
సూత్రంగా
నిరాంతకంగా సాగే పయనంలో
ఆమె...!

సూచన

లోపల వాతావరణం నెలకుని ఉంది-

మిణుగురులు ముసిరిన మునిమాపుల్లో
పట్టువిడవని మబ్బుల మారాము వేళల్లో
ఉండుండి ఉరుము ఒకటి ధ్వనిస్తూ ఉంది,
మెరుపు ఉలిక్కిపాటున దాగినట్లుగా మాయమైపోతూ...
వాన మొదలైంది

మది నదిగా మారింది
వాగులు వచ్చి కలుస్తున్నాయి
దొంతరలుగా మేటవేసిన ప్రాయం
తెప్పలై సాగే కలల తాకిడిలో కరిగినట్లుగా...
జల్లులు వచ్చి పడుతూనే ఉంటాయి

ఎందుకంటే!?ముదమారా పెంచుకున్న
తోటలోకి
అనుదినం
అనురక్తితో నడిచినప్పుడు-
నేల ఫలకం మీద
నీటిజాడ, ఎండా చిత్రిస్తున్న
నిత్యనూతన దృశ్యాలు 
జీవితానికొక పోలికనిస్తూ...
మనసు కదంబంలో
తలపు, తపన మెలికపడి
పూలమడిలో
స్వీయ దర్శనమౌతూ...

ఒక్కసారిగా
తోట పిలిచినట్లౌతుంది,
పూలు నవ్వినట్లు తోస్తుంది.
ఊహ మాయమౌతూ
మనిషి రూపు ఎదురౌతుంది.
చేయి, చేయీ తాకిన క్షణాన
తనువు చేతన సంతరించుకుని
మేలువచనం పలుకుతుంది
అంతఃకరణలో
కొత్త నారు మొలకెత్తుతుంది
కాలం తీసుకొచ్చిన
శుభతరుణం
సారభూమిగా మారిపోతుంది

మరో మనిషి తోటగా
తనలో ఎదగాలి
ప్రతి మనిషీ తోటమాలిగా
అనుభవాలు, అనుభూతుల
విత్తులు వెదజల్లుతూ
కాలం గడపాలి, అందుకే!

ఉదయ నాదం

నీటి గుసగుసలు,  ఏటి గలగలలు, రెక్క హోరు, గాలి జోరు పందిరి గుంజలై నిన్ను అల్లుకోమంటే...పాదాలు పరుగిడి,  మళ్ళీ మళ్ళీ రావాలి ఈ ఉదయం అనిపించిన ఒకానొక వాహ్యాళి కథనం; ఈ నది, నేను అతి సమీపం గా ఉంటూ ఆ పిట్టల పాటలలో మునిగి తేలుతూ ఉంటాము. అవేమో నదితో, గాలితో కలిసి కచ్చేరీలు కడుతూ ఉంటాయి.