వేసట

అలిసిన పాదం మలుపుకొక పదపు ఊపిరి విడుస్తూ
పొదలు, ఎద సొదలు ఒక్కటై విరబూస్తూ
సిరల్లో ఉరకలెత్తే ఆశ పూల నీడలై తేలుతూ
వనమాలీ! నీ జాడకై ప్రకృతినై, పరవశమై సోలిపోయాను, దరికి రావూ!?
పాట కడతావో, పదాలు పాదాలు స్పర్శించిపోతావో...
వెలుగునీడల వేళ, వెన్నెల మరిగిన పూట,
అడుగులు తడబడిన నడకల
అలికిడి మరిచిన అడవి దారుల
ఆకలి దప్పులు వీడిన పగటిలో, కలత చెదరని మనసుతో
నదులుగా, నది వరదల దిగులుగా, పొగులుతూ పొంగుతూ చివరికిలా కృంగుతూ

వేచేటి వేళ

విరియబూస్తూన్న వేళ
పెనుగాలి దాడి చేసింది
ఏ తావున మలిగిపోతాయో నలిగి వాకిట పడి ఉన్న ఈ రేకులు!
కలలు, పూలు కలిసి రాలిపోతున్నాయి
నిన్నటి తావి ఒకటి గుండెలో తలదాచుకుంది,
నిదురని తొలిచే మెలకువలో తన పిలుపు నిలిచినట్లు.
ఆకులు కొమ్మని హత్తుకున్నట్లు తలపులు-
మరొక ఆమనికై తోటలా
తన రాకకై విధి వంకా, వీధి దిక్కుగా ప్రతి క్షణమూ ప్రతీక్షణము...

విస్మయం

తెలతెల్లని ఉదయపు సనసన్నని వాన- ఆదమరిచి గాలి, తానూ నిలిచి చూసిన వేళ
పులకింతలు సు జాతి పూలలా విప్పుకుని తనువునా తరువునా నిలవనంటున్నాయి
పక్కకు తప్పుకు పోనీయని పొన్న పూలలా పలుకరింతలు పట్టి లాగుతున్నాయి
అప్పటికప్పుడు విప్పుకునే పద్మాల్లా పలవరింతలేవో ఎదని తొలుచుకువస్తున్నాయి
పట్టువదలని కలలేవో కలవరింతల కదంబాలు అల్లుతుంటే,
పట్టలేనితనమొకటి వేటాడి తనువుని విప్పిపోసిన పూల పొట్లం చేసి వదిలింది.
చింత, పరికింత పసరు కట్టని చిగురు ఆకుల్లో దాగున్నాయేమో!?
పండుటాకు రాసులలో నిరాశలు నేల ఒడిలోకి జారిపోయాయా...
పుటము లో మిగిలిన తావిలా మనమున వీడని మొహమే ఇప్పుడిక!

యశస్వి "రెండుమాటలు", కవితత్వాల సంకలనం నుంచి...

Park Full of People...

నిర్జన వాడల్లో వాడని వసంతం పొంగుకొస్తుంది...
చిట్టి చిలుకలు పరుగులు పెడుతున్నాయి
గడ్డి పరుపులు మీద దొర్లాడుతున్నాయి
మాటలు చిగురు వేసి మనుషులు ఎదుగుతున్నారు
నవ్వులు విచ్చుకుని గుభాళిస్తున్నాయి!

at last it is Spring Magic !!!

మౌనగీతం

పచ్చిక మైదానపు తనువు మీదుగా పలుచని కాంతి వలువ
పశ్చిమ కనుమలోకి జారిపోతూన్న సాయం వేళ,
నీడ వెంట నీడగా గాలితెరలు తరలిపోతున్నవేళ...
నెలవంక అంచున జిగి, శ్యామాంబరం జతకడతాయో,
వాగువంకల దాపున పిట్టలు, కీచురాళ్ళు జతులాడుతాయో!?
దేహం మేఘావృతం అవుతుంది, ఒంటరి వాన వెల్లువౌతుంది.

ఒక తూరుపు వెచ్చని తొలి తాకిడి
ముసుగు కప్పుతున్న నీహారికనూ, తడికళ్ళనూ
తనలోకి తీసుకునే వేళవరకు తీరని దిగులే మౌనగీతమౌతుంది