ద్వైతం

ప్రేమారా ఆలింగనం చేసుకునే
'ఏకాంతం' అనే ప్రియుని వదిలి
ఒక్కోసారి
మెత్తగా పిలిచి చేయిచాపే
పాత మిత్రుని వంటి 'ఒంటరితనం'
దరికి పారిపోవాలని ఉంటుంది
కనులారా నీరూరే
తన చెంతన తాకే వెచ్చదనం
కదలనీక నిలిపేసే
చెలికాని ఉనికిని మరిపిస్తుంది
ఎద నుంచి పదాల బరువు
తానూ మోస్తుంటాడు...
కాలపు అడుగుల సడిలో
ఉద్వేగపు ఊపిరి ధ్వనిస్తుంది
ప్రియుని సందిట ఆగిపోయిన
ఉద్రేకం, అనురాగం పిలుస్తూనే ఉంటాయి
అయినా సరే,

ఆలాపన మరిచి
లయ తప్పిన హృదయంతో
ఉడుకుమోత్తనపు అలుకతో
పసితనపు పలుకుతో
స్నేహితునితో
తలపడాలనే ఉంటుంది
మాట పెగనీయని మౌనపు మోముల
ప్రియునికి బందీ కావాలనిపించదు

పలుసార్లు జరిగే ప్రహసనం
ఒక్కోమారు మరీ ప్రియమైనదిగా ఉంటుంది
ప్రియుని చిరునామా కి
చిలిపి లేఖ రాయమని
స్నేహితుని అల్లరి మాట
మది లో పాటగా మారేవరకు

వేదన తో తలపడే తలపు
కోకిల స్వరాల ఊహగా
రూపాంతరం చెందేవరకు

ఇటుగా రానీయని ఆ ధ్యాస
పట్టుకునే ఉంటుంది

ప్రణయం, స్నేహం పల్లవిస్తూ
ఉండే ఉభయ సంధ్యల జీవితాకాశం
వర్ణాలు మారేవి కావు!

నిరాంతకం

పురాతనమే కావచ్చు ఈ చంద్రోదయం
కాస్త వెనుగ్గా రానున్న సూర్యోదయమూ...

చీకటి కమ్మిన హృదయాలు
నీడలో నివృతమైన పరిసరాలు
మరి కాస్త ప్రాచీన ఆచూకీకి
త్రోవ చూపవచ్చు

గమనించాలి, గుర్తించాలి, గమనం సాగించాలి

రిక్త హస్తాలు చాపగానే వెన్నెల నిండినట్లుగా
కనులు తెరవగానే కాంతి చేరినట్లుగా

గాలి, నీరు గలగలలాడుతూ
పూరేకుల్లో,  ఆకుదొన్నెల్లో
మబ్బుగిన్నెల్లో, అలల కుంచెల్లో
కొత్త పరిచయం చేసుకున్నట్లుగా
సరికొత్త పాత చిరునామాలు
గుండె నిండా రాసుకుంటూ ఉంటావు

నడవాలి, నర్తించాలి, ఆంతర్నేత్రం తెరిచి చూడాలి

సనాతనమే కావచ్చు ఆ ఆత్మావలోకనం
అనాది నిధనమనే హితవచనమూ...

తృప్తి, శాంతి పురివిప్పి
చేతనలో, చింతనలో
స్వరంలో, స్పందనలో
నిత్య చలనం గావించినట్లు
సతతం అనునయ స్పర్శనిచ్చే విశ్వజాడలు
ఆత్మ నిండా పరుచుకున్న స్థితిలో ఉంటావు

పయనాలు

పెనుగాలి లా తలపు
చెల్లాచెదురయే ఆకుల్లా ఊహలు
ధ్వనిస్తూన్న దారుల్లోకి
పదేపదే దెస మార్చుతూ
మనసు పరుగులు తీసిన తరుణాన..

నైసర్గిక స్వరూప దర్శనమైంది
లోలోని కాననం కానవచ్చింది

పరిచిత జాడలు
కొన్ని మోడులు
అల్లుకున్న అనుబంధపు లతికలు
ఎరుగని మోహపు పూలు
అలవి కాని తావులీనుతూ

ఇప్పుడక్కడ

చిగురుటాకు మోజుల సవ్వడి
మొగ్గ తొడుగుతున్న సన్ననవ్వుల
ప్రతిధ్వనులు
పరుగు నడకగా మారేటి వేళకి..

కోన దాటి
లోయ దాపున
మాయమైంది
నడిచివచ్చిన దారి

శకలాలుగా ప్రోగు పడిన కలలు
బద్దలువారి బండలైన ఆశలు
మాయ దర్పణమై ఎదుట నిలిచినట్లుగా...

నిశ్శబ్దం రూపు దాల్చి పిలిచినట్లుగా
మార్మికత
ఆజ్యపు ధారకే అణగారిన జ్వాలలా
నిమగ్నత

కదలిక మందగించిన క్షణానికి
కొత్త కుదుపు మొదలౌతుంది
ఝంఝూనిల ప్రభంజనంగా
మారనున్న అనుభవం
బలపడుతూ ఉంటుంది

నాటుకున్న అనుభూతుల
విస్తీర్ణత, ఎల్లలు ఎరగనట్లే
ఎదుగుతుండే
బ్రతుకు వనం లోకి
పయనాలు...!