నిత్యం..

తడి చుంబనాలతో
నేలని ఆవరించుకున్న
ఆకాశపు ఉనికి,
కమ్ముకునే ఉంది ఇంకా
వాన పెదవులు విచ్చుకుని...

పొడి ముద్దులతో
ధూమ్ర వర్ణపు మేఘాన్ని తోసుకుంటూ
పుడమి,
ఎండ పొడతో పొగమంచు దేహంలో దాగి
నింగి కౌగిట చేరుతూ..అనునిత్యం!!!

ఊరట

సముదాయింపు
సముద్రపు అలలా
తీరాన ఆగక వెనుకకు పరుగులు తీస్తుంటే-


వేదనలో నానిన మనస్సు
సారం పెట్టిన భూమిలా తోస్తుంటే
స్థిరంగా తెలుస్తుంది..
విషాదం వెదుక్కునేది
సాంత్వన కాదని.


ఫలించిన దుఃఖ్ఖం విచ్చి
ప్రశాంత విత్తులుగా రాలుతుంటే
తెరిపిన పడుతుంది..
మొలకెత్తే భావోద్వేగం
శోకం వెలిసాక.


ఓ ఘటన అనంతరం-
నడి కడలి నీటి వంటి మనస్సు
నిదానిస్తుంది..నిరంతరం...!

శరదృతువు


గాలి కడలి మీద అలల్లా
రాలిపడే రంగుటాకులు
ఆకుకొసనో, కొమ్మ మూలనో
మొగ్గతొడుగుతూ
చినుకు ముత్యాలు


వాన కాలువ మీద పడవల్లా
తేలియాడే పూరేకులు
మొండిపూలలో, నీడగీతలలో
లెక్క తేలని
ఎండ సమయాలు

శిశిరానికి తరలిపోయే తరుణాన
కలలు, ఊహలు... !!!

కొమ్మ...!!!

వెన్నెల దయగా వర్షిస్తూ
దారి వదిలినట్లే ఉన్నా
బెదురుపోని చీకటి

గదిలోకి చొరబడి
వెలుగు చేరని దరికి

దాగిపోతూ ఉంది.
పూలమొముతో 
నిటారుగా నిలిచిన కొమ్మ
కిటికీ నీడ కట్టిన ఫలకంలో చేరి
తలవాల్చి నిలుచున్న కొమ్మలా 

కనపడుతోంది, 
ఏమీ పాలుపోని స్త్రీ ఊహలోకి వచ్చింది.
'బహుశా నా ప్రతిబింబమేన'ని భ్రమింపచేస్తుంది...

ఎదలో దీపపు వత్తి సర్ది, 
నూనె తిరిగి నింపుకుని
వదలిపోని దిగులు చీకట్లని

పట్టించుకోక
కళ్ళలో ఆశలు వెలిగించుకుని,
నీ ఊహల కొమ్మకి నా ఊసుల పూలు అతికిస్తూ-

కాలం దయతో దారిచూపితే
నీవిటుగా వస్తావని, 

నా ఆచూకీ తెలపాలని
పుప్పొడి రాగమొకటి

ఈ చుట్టుపక్కల చల్లుతున్నాను
(కొమ్మ అంటే స్త్రీ అని కూడా అర్థముంది)

శేష గీతి

'కిటీకీ నుంచి ప్రపంచాన్ని చూడాలి, ద్వారాలు తెరుచుకు వీధుల్లోకి నడవాలి,'
అని అనిపించనప్పుడు-
నీడల గుర్రాల వెలుగు జీను

గోడల మీద పరుచుకుంటుంది
      చీకటిని చిధ్రం చేసి

కంటి తెరలు తెరుస్తుంది.
ఆత్మ పథానికి సోపానాలు,
పెదవులు విచ్చుకు ఉబికే పాదాలకి

      పదములు తానైన
           కాంతి ఒకటి

నిన్ను వెంటే అంటిపెట్టుకుని ఉండి
 అనంత విశ్వంలోకి నడిపిస్తుంది...

విడివడిపోవటం!?

I dread the day I will no longer hear from someone I am morally and emotionally attached.. నేను దగ్గర ఉండగా కోల్పోయిన నా కుటుంబంలోని ఐదుగురి మరణాల వెంబడి నా జీవిత గమనం నుంచి... ఎవరైనా మనని విడిచిపోతే 'వారితో సంతోషంగా గడిపిన సంఘటనలు గుర్తుచేసుకుని నిలవాలి,' అంటారు; కానీ, చిత్రంగా అలా ప్రయత్నిస్తే మనం వారికి ఎన్నటికీ తీర్చలేని కొన్ని కోరికలు లేదా మనం నొప్పించిన సంఘటనలు తలపుకి వచ్చి "జీవితం ఇంకొక అవకాశమిస్తే మరొకలా జరిగేది, సరిదిద్దుకునేవారం," అనుకుంటాము. ఎన్ని వీలునామాలు రాసుకున్నా విడమరచలేని కొన్ని మానసికమైన లెక్కలు మిగిలే ఉన్నాయి అని తేల్చుకోవాలో, తెలుసుకోవాలో తెలియని వ్యధలో కొట్టుమిట్టాడుతాము...
కానీ, ఆ మనస్థితి రావటానికి ఆ బాధ, ఆ విడివడిపోవటం ముందుగా సంభవించాల్సిన షరతులు. అందుకే ఎవరినైనా ఏదైనా అనే ముందు లేదా ఒక చర్య జరిపే ముందు ఈ సత్యం అంతః చేతన లో ఉంచుకొనే సాధన చేయాలి అని మాత్రం అవగతమౌతుంది.

ఏకాంతధార!

కాలం కొమ్మన విరబూస్తున్న క్షణాలు..
రిక్త హృదయంలోకి యే ఒక్కటీ జారిపడటం లేదు.
లిప్త పాటైనా ఆ ఆచూకీ వెదకాలన్న కాంక్ష-
ఇంకా కాంక్ష పండి, కోరికలా రాలిపోయి-
అనుభూతికి జ్ఞాపకాల అస్తిత్వమిచ్చేటంత ఆర్తి మిగిలే ఉంది!

స్వర్ణ తీరంలో

రాత్రంతా
మేలుకునే ఉన్నాను, 
వేసట తో వేచి ఉన్నా..
ఓపలేని ఆత్రంతో

ఆకాశపు అద్దం చేత బుచ్చుకుని
నీలిమేఘాలు దులుపుతూ,
చీకటి అంటిన చేతులతో

కరిగిన కాలపు కాటుక మరకలు
తుడుపుతూ.
వెనమాటుగా వచ్చి

కనులు మూసింది
నిదుర
తొట్రుపడి రెప్పలు తెరవగానే
కలలకి వెండితెర తీసి

గుండె నిండా ఊహల జాడలు
వదిలిపోయాడు
మెరుపువేగంతో...

వినిపించే గతం

ఈవేళ ముసాబు నిదుర లేపింది.
'అర్జున ఫల్గుణ కిరీటి పార్దా'
ఉరుము తో మెదిలే గ్యాపకం-
చెవులు మూస్తూ,
చేరువగా పొదుపుకుంటూ
ఓ హస్తం.
అమ్మ కప్పే చెంగు
వాన కురవక మునుపే
విచ్చుకునే ఛత్రం.

పదిలం గా గుండె తలుపు తీసుకుని
వెలికి వచ్చే గతకాలం-
పడవ పందేలతో,
పిల్లకాలువల్లో చిందులతో
ప్రాయం ఎరుగని మనసుల
పనుల తొందర..
మందలిస్తూ, మన్నిస్తూ,
వేడినూనె మర్దిస్తూనో,
వసాట్లో వేసిన పక్కలు మడుస్తూనో,
అమ్మకి, వాళ్ళమ్మకి, నానమ్మకి, నాన్నకీ
వానాకాలపు పనుల ఊదర.

సందెచీకట్లో-
కట్టెలపొయ్యి వెలుగులో
ఆరీఆరని బట్టల రెపరెపలు
రేగివడియాల చప్పరింపులు.
కిటికీ రెక్కల సందు,
ద్వార బంధాల మీదుగా
రేయంతా తేమగాలి విసురులు.
చెప్పుకోవాలని, చెప్తూనే
చెవులురిక్కించి వినాలనిపించే
గతించని మంద్రస్వరాలు
వానతో కలిసి కురుస్తూ.
ఇక, యీ పగలంతా
తడితడిగా లోపలా వెలుపలా...

Night Rain: నా కవిత "రేయి మొయిలు" కి ఆంగ్లానువాదం

- by Indira Babbellapati

A collective consciousness
manifests as drops of rain, and as thoughts;
times immemorial, often
walls come as obstacles
to drench and absorb
the rain. The body sways
to the tune of thought
while, 'aakash Ganga'
showers as amrous
raindrops.

Is the sprightly young
girl's heart a prisoner
in the embrace of raindrops? Do the
unopened doors
drench in the shower of
thoughts to reach the
heavens above as perfumed smoke?

As I lift the veils of
thoughts that gate crash
the doors of pre-dawn,
all that's found in the shadows was last night's
dissonance; and the siege
of clouds...
It's the lone journey of
liberated souls that can
never unify...


*****
- రేయి మొయిలు-

సమూహ ఆత్మ ఒకటి
చినుకులు, తలపులు గా విడివడి ఉంది అనాదిగా
వానలో తడవటానికి, చిందులేయడానికి గోడలు అడ్డుపడతాయ్ తరుచుగా.
ఇద్దరు బందీలు; చీకటి వేళ వానలో చిందులేసే క్రీడలో
తలపు ఊపుతో తనువు, ఆకాశగంగ హొయలుతో చినుకు

చలాకీ చిన్నది, చిన్నదాని మనసు
చినుకుల కౌగిలిలో బందీనా?
తెరవని తలుపుల తెరిచిన తలపులలో తడిసి
దివికి రాలిన విరివానల
పరిమళాల ధూపమైపోయిందా!?

తెలవారి తలుపులు తోసుకువచ్చే
తెరలు తొలగించుకుని తొంగిచూసే
నీడల్లో నిన్న రేయి కలవరం,
తొలగని మేఘాల ఆవరింపు...
ఏకం కాలేని విముక్తాత్మల ఒంటరి పయనం!

Summer Showers: నా కవిత "వేసవివాన" కి ఆంగ్లానువాదం

- by Indira Babbellapati

On a summer night
i dreamt a sweet dream:
purple clouds had clung to
my multi-hued bed and hid
the light secretly forcing me
into an illusion that it's yet
time for the day-break while
someone in the courtyard of
the 'vana devata' performed
a trick; the clouds were melted
and were gathered in a receptacle.
The invisible hand threw the liquified
clouds on to the earth-- beads of
black pearls slid down in a continuum
folding them within the verdant leaves.
The leafy-rain morphed them into
rain drops as the leaves fallen to the earth
swayed with the wind and drenched
themselves in the shower of pearls.
I drew in warm breath all set to run...

"There, there, there runs the Child of Day!"
heartily laughed Time.


-వేసవివాన-
ఒకానొక రేతిరిలో కమ్మని కలకన్నాను...
చిక్కని నేరేడు వన్నె మబ్బులు
నా పానుపుని అంటిపెట్టుకున్న
కెంజాయ ని కమ్ముకుని
ఆ జిలుగుని గుట్టుగా దాచి
తెలవారలేదని నమ్మజూపుతుంటే
వనదేవత వాకిలి లో
ఒక గారడీ చేసారెవరో;
మబ్బు ని కరిగించి
చషకం నిండుగా పట్టి
పుడమి పైకి విసిరారు.
గిన్నె నుంచి నల్ల ముత్యాలు
ధారలుగా జారుతున్నాయి,
వాటి మెరుపుల్లో
పచ్చని రంగు దాచుకుని ఆకులు
రవ్వల వాన నీటి చుక్కలుగా మారుస్తున్నాయి.
నేలకి వాలిన గాలులు
ఆకు ఊయలలో
ముత్యాల జల్లులో తడిసిపోతున్నాయి.
వెచ్చని ఊపిరితో
చప్పున లేచి పరుగులు తీసిన
నన్ను చూసి "అదిగో పగటి బాలుడు," అంటూ
కాలం కలకలా నవ్వింది.


రేయి మొయిలు

సమూహ ఆత్మ ఒకటి
చినుకులు, తలపులు గా విడివడి ఉంది అనాదిగా
వానలో తడవటానికి, చిందులేయడానికి గోడలు అడ్డుపడతాయ్ తరుచుగా.
ఇద్దరు బందీలు; చీకటి వేళ వానలో చిందులేసే క్రీడలో
తలపు ఊపుతో తనువు, ఆకాశగంగ హొయలుతో చినుకు

చలాకీ చిన్నది, చిన్నదాని మనసు
చినుకుల కౌగిలిలో బందీనా?
తెరవని తలుపుల తెరిచిన తలపులలో తడిసి
దివికి రాలిన విరివానల
పరిమళాల ధూపమైపోయిందా!?

తెలవారి తలుపులు తోసుకువచ్చే
తెరలు తొలగించుకుని తొంగిచూసే
నీడల్లో నిన్న రేయి కలవరం,
తొలగని మేఘాల ఆవరింపు...
ఏకం కాలేని విముక్తాత్మల ఒంటరి పయనం!

వేసవివాన

ఒకానొక రేతిరిలో కమ్మని కలకన్నాను...
చిక్కని నేరేడు వన్నె మబ్బులు

నా పానుపుని అంటిపెట్టుకున్న
కెంజాయ ని కమ్ముకుని
ఆ జిలుగుని గుట్టుగా దాచి
తెలవారలేదని నమ్మజూపుతుంటే
వనదేవత వాకిలి లో
ఒక గారడీ చేసారెవరో;
మబ్బు ని కరిగించి
చషకం నిండుగా పట్టి
పుడమి పైకి విసిరారు.
గిన్నె నుంచి నల్ల ముత్యాలు
ధారలుగా జారుతున్నాయి,
వాటి మెరుపుల్లో
పచ్చని రంగు దాచుకుని ఆకులు
రవ్వల వాన నీటి చుక్కలుగా మారుస్తున్నాయి.
నేలకి వాలిన గాలులు
ఆకు ఊయలలో
ముత్యాల జల్లులో తడిసిపోతున్నాయి.
వెచ్చని ఊపిరితో
చప్పున లేచి పరుగులు తీసిన
నన్ను చూసి "అదిగో పగటి బాలుడు," అంటూ
కాలం కలకలా నవ్వింది.

జీవన కవిత్వం!

మల్లెరెక్కకి
తాపిన అత్తరుగా,
ఉసిరిదబ్బలో
దాగిన తేనియలా,
బావినీరు.
మరి,
కంటిరెప్ప చాటు
ఉప్పెనగా ఉప్పగా...
ఎందుకని?

జవాబు చెప్పనివనీ,
పిల్లనగ్రోవిలో
దాగిన రాగాలుగా,
కిరణాలలో
విరిగిన వర్ణాలుగా,
అక్షరాలు.
కానీ,
సిరాబుడ్డిలో ఒదిగిన
సుడిగుండంలా, ఊబిలా...
ఎందుకని?

సవాలుగా నిలిచేవనీ
ఊటబావిలో పుటలు
తేలుతున్నాయి
సరోవరాన పదాలు
మొగ్గతొడుగుతున్నాయి

జ్ఞప్తి

వంతెన దాటే క్షణాన, మనో యవనిక మీద రూపాలో మరి అవి అమూర్తభావనలో తెలియకపోదు; కానీ- అంతకు మునుపే ఆ ఉనికి నీదేనని, నీవు మిగిల్చిన అనుభూతుల కాంతులేనని- నేనూ నీకు ప్రతిబింబమేనని తెలిపే స్పృహ మనని కలిపి ఉంచిన వారధిగా మిగిలుందని పదే పదే గుర్తుకు వస్తుంది...

నిత్యశోభ

పగలంతా
ఆకాశం నోరావలించి
తెల్లబోయి చూసింది,
నక్షత్ర భరిణెలు
తెరుస్తూ 
నడిచి పోయినట్లున్నారెవరో!
పరుగులు పెడుతూ
వెన్నెల కాంతులు
నేలపై వాలుతున్నాయి.
రేకుల దోసిలి పట్టిన
జాజుల నెత్తావి
అద్దుకుంటున్నాయి
కలం మూయకనే
ఊహలు నిదురలోకి
జారుకున్నాయా?
కలల పుస్తకం పుటలు
రంగుల్లో
మెరిసి పోతున్నాయి
నిన్న విన్న పాటొకటి
తలపుల
తడారనివ్వట్లేదు.
పొడిబారిన కన్నులు
రెప్పతోడుకని
తహతహలాడుతున్నాయి
నీడ ఒకటి
బాట మీద ఇటుగా సాగింది.
నిట్టూర్పు సడలిన ఊపిరి
నిమ్మళించింది...
ఆకు కంబళిలో
తలదాచిన గాలి
తొంగిచూసింది.
నవ్వుల మూటలు
వీపునెత్తుకుని
వాకిలి దాటింది

సడి

విశ్వం వేణువై
మోవికి తాకితే
హృదయం ఆలపించే గానానికి-
వాగుల్లోకి జారిపడిన వెన్నెలలు
హొయలొలికించే రాతి శిలలు
పున్నాగ బూరలూదే తుమ్మెదలు
సొబగులీనే కడిమి పూలు
భాష్యాలు పంపినట్లు కలగన్నాను
గుమ్మపాల పొదుగులో తువ్వాయిలు
అమ్మవొడి ఊయలలో పాపాయిలు
ధ్వజ స్తంభపు మేడలో పావురాయిలు
ఏటి గట్లు ఎక్కి దిగుతూ బొమ్మడాయలు
స్వరాలు కట్టాయని కలగన్నాను
విశ్వవేణువులో
ఉదయించిన రాగాలు
ఉనికిని మరువనీయని ఆనవాళ్ళు...

జాడ

కాలాంతరం లో
మది కి
దర్పణ బింబం కాగలది
నది మాత్రమే!
నెర్రెలు బారిన
నేలవంటి బ్రతుకులో
ఒకప్పుడు-
నిగనిగలాడే నీటి
సొబగుతో
ఉప్పొంగి పారేటి
నది ఉండేది.
ఇంకాస్త చెప్పాలంటే,
వరద భీభత్సాలకి
నిస్పృహలో నిలిచి,
గండి పడని గట్ల మీద
తనువు బద్దలు కొట్టుకుంది...
అంతలోనే
సుడులు తిరుగుతూ
ఉప్పెన గాట్లకి చీలిపోతూ
కలవని కయ్యల్లో ముగిసిపోతూ
మౌన చాతుర్యం మరిగిన ఒడ్డుకి
మరణ వాంగ్మూలం చెప్పుకుంది
నది నిజానికి హత్య చేయబడింది
ఇప్పుడిక
గగనాంకిత దృక్కుల్తో
విగతనది
ఎండిన ఒండ్రులో
ఇనికిపోయింది
నిమజ్జనానికి నది కావాలి
మరి,
ఆ మది ఆచూకీ ఎక్కడ?

పడుగుపేక

ఎండ, నీడా పరుచుకున్న
గరిక తివాచీ
తాకీతాకగానే
దృశ్యవ్యామోహానికి
గురిచేసింది
పరుగులు నేర్చి
ఇల్లంతా పీకిపందిరేసే పాపాయిలా
అల్లరి గాలి కొమ్మల నుంచి
ఆకులు, కాడలు తెంపిపోస్తూ ఉంది
సంబరాల్లో పులివేషగాడు
వెంటపడే ఆటకాయల్ని
సడలించి నవ్వుకున్నట్లు-
మారు వేషం వేసుకున్న
పులులు, చిరుతల్లా కొన్నిపూలు
అవే రూపురేఖలతో
నిలవరిస్తూ, నవ్వినట్లే ఊగుతున్నాయి
ధ్వజస్తంభపు గంటల్లా
చిటారుకొమ్మన ఎండుటాకులు
చిరుమోతలతో
అడవిదేవర గుడి దిక్కుకి మళ్లిస్తూ...
మాగిన పళ్లు,
విత్తుల పొత్తాలు విచ్చుకుని
రాలిపడుతున్నాయి.
గూడు దాటి కూనలు
వచ్చిపోయేవారిని
పలకరిస్తున్నాయి
బారులు తీరిన చీమలు,
వాగులు నిండిన నీటిధారలు
వడివడిగా సాగుతున్నాయి
తిరుగాడిన కోనలు,
తిరునాళ్ళగా సాగిన క్షణాలు
పడుగుపేకగా
మనసు మరొక అనుభవం అల్లుకుపోతూ ఉంది

ఆర్తి

వాన రానున్నదని చెప్పాను
తను చూస్తున్న చెట్టు,
తానూ తలవూచినట్లుగా ఉంది

కొమ్మల అంచున ఆకులు,
గుమ్మానికి కట్టిన తెరలు కదుపుతూ
చిన్న గాలి
ద్వారం దాటుకుని తాకిపోయింది

విడివిడిగా
పగలంతా దూదిపింజలై
ఎగిరిన మేఘాలు
మూకుమ్మడిగా
నల్లరాతి గుట్టలై
పేరుకుపోతున్నాయి

తేలికపడలేని తానూ
వాన మబ్బులా మారినట్లు
తెలియనేలేదు

మెరుపు రెక్కలు కట్టుకుని
నేలకి వాలిన నల్ల మబ్బుల
ఉరిమినట్లు వీచే ఈదురుగాలుల మోత
వెక్కిళ్ళ లో కలగలిసి,
మాటలు జారిపడుతున్నాయి
మనసు నుంచి...

తడి స్పర్శ
వాననీటి నుంచి,
తనని తట్టిన నా వేలి కొస నుంచి
వెచ్చగా చలిస్తున్న నాలోకి ఇనుకుతూ

దుక్కిచినుకులు నింపుకున్న
దుఃఖపు నేలనై

నాలోన ఉప్పెన ఊపు
ఓదార్పు కా/లే/దని
ఒప్పుకుంటూ

వరదలై పారుతున్న
విషాదపు నదులలో
మునిగిపోయాను

రంగు రంగు రెక్కల సీతాకోకచిలుక త్రోవ చూపుతూ...

గుప్పెడు క్షణాలు ఎవరికీ సొంతం కానీయక దాచిపెట్టి,
నడుచుకుంటూ పోతూ కొన్ని విరిసిన పూలపై విరజిమ్ముతుండగా
పూదేనెతో మత్తిల్లిన సీతాకోకచిలక కుసుమపరాగపు జాడ ఎరుగనట్లు
రెక్కలు చుడుతూ హత్తుకున్న అనుభూతికి నాదంటూ మిగలనీయక బట్వాడా చేసేసింది; నీలి కనుల తూనీగ తుంటరి నవ్వుతో కమ్మేసింది
చిత్రంగా పూలన్నీ ఎగిరి నావైపు వస్తున్నట్లుగా ఎందుకిలా మాయ కమ్ముతూంది!?... This click is from 1 Jul, 2016


The next 4 are from Jul 2015  సంగతి అంటూ యేమీ లేదు, "ఆకులో ఆకునై" అని పాడుతూ నన్నేదో మభ్యపెట్టాలనుకున్న బుజ్జి చిలుకని బుజ్జగిస్తూ ఓ నాలుగు తీతలు
Butterflies of Illinois
(మరి కొంత స్వగతం పిక్స్ క్రిందన కలిపాను)
These pics taken over last 16 years
Check how close the colors of Butterfly's wings and designs on my leggings are. It just stayed on me refusing to leave for about 15min.

Cabbage White Butterfly
 
 

Black Swallowtail


Chickweed Geometer MothClouded Yellow Butterfly

Black striped yellow butterfly

Common Buckeye

Painted Lady
 
Tawny Emperor

Queen
Monarch


Waved Sphinx Moth

ఎన్నెన్నో ప్రేరణలు, అనుభూతులు కలదిరిగిన నా మానస వనం లో కొన్నైనా వచనాలు విరిసాయి...
"భాషా నియమాలు, యతి ప్రాసలు ఎందుకిక-
మణిప్రవాళ కృతులుగా సృష్టి విభజన జరిగిపోయాక-
నీ మోవిపై సీతాకోకచిలుక వదిలివెళ్ళిన పాటమరక కి!?"

"నాలోకి శబ్దాల జడివాన కురవాలి. ఎద కనుమలలో పిట్ట పాటల పిడుగులు పడాలి. నిదురలోకి, నిర్ణిద్ర గానంలోకి గొంతెత్తే జీవన గళం కావాలి. కనురెప్పల హోరులో సీతాకోకచిలుక రెక్కల ధ్వని కలవాలి..."

ఆ రెండూ అచ్చంగా ఇక్కడ చిత్రాలుగా వెలిసిన కొన్ని సీతాకోకచిలుకలకి అంకితం కావాలి. అన్నట్లు, As a pastime, watching butterflies and moths is known as butterflying and mothing, అట. మరి కవితల ప్రేరణకి ఆ అందాలు హేతువైతే ఆ భావనకి ఏమని పేరిడాలి?  తరుచుగా ఎక్కడ రెక్క ధ్వని విన్నా మనసు వినిపించే గీతాలివి:

సీతాకోకచిలుక తీసుకుపో నీ వెనుక వనమంతా చూపించగా, ఆ మొక్క ఈ మొలక అన్నీ తెలుసు కనుక వివరించు ఇంచక్కగా (సినిమా: అంతం; సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి): 
http://www.sirivennela-bhavalahari.org/?p=5024

రంగు రంగు రెక్కల సీతాకోకచిలుకా - సీతాకోకచిలుకా తోటంతా తిరుగుతావమ్మా నువ్వు తీరికే లేక (సినిమా: అల్లుడుగారు వచ్చారు; సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి) : http://www.sirivennela-bhavalahari.org/?p=6077

"The deepest craving of human nature is the need to be appreciated." - William James అవునంటారా?  ఏమో, కావచ్చు...కానీ, ఒక షరతుతో నేను ఆమోదిస్తాను; as long as it's true appreciation ;)

రజనీముఖ వివశతఒక మలి సంధ్యవేళ- 
మబ్బులు తాండవిస్తూ ఉన్నాయి ఆకాశాన, 
కాంక్ష గాఢంగా తాకే సమయం ఆసన్నమైనట్లు మదిలో కలవరం 
పళ్లెరాల కొలదీ రంగులు వంపుతూ పోయిందొక కిరణం 
మిణుగురులు పోగడినట్లుగా, మంటలు చెలరేగినట్లుగా 
మబ్బులు దహించుకుపోతున్నాయి
రెక్కలు మొలిచిన ఊహల రణం 
వేటలాట మరిగిన వాంఛల కలకలం 
ఎగిసిపడుతున్న మోహజ్వాలలో 
సమిధగా దేహం 
నిశి చొరబాటుదారులా... 
చీకటి లో దాగినవి నిశ్శబ్దం వెల్లడి చేస్తుంది
ధ్వనికి ప్రతిధ్వని తోడై రూపం కళ్ళకు కడుతుంది
దృశ్యాదృశ్య మార్మికత జగతిని ముసుగులోకి లాగుతుంది
తొలిసంధ్య వరకు మబ్బులు వలువలు సెలవు పుచ్చుకుంటాయి! 
విచ్చుకునే మొగ్గలు

నిస్సహాయత పుష్పిస్తూ ఉంటుంది, 
రాజీపడ్డం లో నవ్వు పుట్టినప్పుడు.
వర్షిస్తూ ఉంటుంది కూడా

ఓటమి ఊట రెప్పమాటున ఉప్పెన అయినప్పుడు.
రాలిన రేకుల, రాలిపడే చినుకుల నిర్మాల్యం 

కాలపు హస్తాలు తుడిచి శుభ్రపరిచిన జీవన ప్రాంగణంలో
మనసు నిర్మలంగా కనులలో వికసించి దోగాడుతూ...

Rain Coated!

నల్లమబ్బు నిశ్శబ్దం గా ఆవరించుకున్నది కాబోలు
కాలం, నేను పోటీపడ్డట్లు సాగుతున్నప్పుడు-
ఉరిమినట్లో ఉలిక్కిపడినట్లో
ఆ మేఘం, నా దేహం
జల్లుగ జారి, ఝల్లున పొంగి పందెం వేసుకుని ...


పరుగులు పెట్టించిన పనుల లెక్క తేలిపోయింది
ఊపందుకున్న ఆనందం త్వరపెడుతుంది
తడిగారు కొమ్మల తోడుచేసుకుని
తలారా తనువారా నేను తడిచిపోతున్నాను
గొడుగుల్లో దూరినవారిని వెక్కిరిస్తూ...


వాననీటి అద్దకపు మెరుపు,
సద్దులేని వణుకున తనువూ రహస్యమేదో విప్పుతుంటే
తేమ దాగిన చిలిపి గాలి గిలిగింతలతో
వెచ్చటి ఊహ చిత్రమైన పాటగా మారుతుంటే
మరొక మబ్బు కమ్ముకోనున్న గుట్టు దాయలేకున్నాను.

Captive: నా కవిత "బందీ" కి ఆంగ్లానువాదం!

- by NS Murthy
In the relentless rain of moonlight
The stars occasionally seem balls of hail …
I run after falling meteors
With the swiftness of childhood …
I have already melted enough hails
And cooled off comets and meteorites!
A rainbow opens up on the sky, but
Within, a firmament snuggles smugly
Some more colourful dreams try to hang about
Unsuccessfully… but the canticle endures….

New moon looks not gloomy
When you think of the crescent in the offing
When you are sure of the full moon,
You are not conscious of the dawn or nightfall.
Between, when you balance your Blues and Brights
You reconcile and find there is no room for angst.

Yet, neither the bleak veils cease,
Nor buds of darkness blossom
Night long, as restlessness endures
And an unremitting anxiety seizes
I patiently twine the frills of light
And billow the fires of sleep
Becoming a shadow among shadows
Like the screen behind chiaroscuro
Lying alone incarcerated to redeem a dream.


(https://teluguanuvaadaalu.wordpress.com/2015/11/10/captive-usha-rani-telugu-indian/ )

*****
బందీ 
-----
ఆగక కురిసే వెన్నెల్లో అప్పుడప్పుడు తారలు వడగళ్ళు అవుతాయి
రాలిపడే ఉల్కల వెంట బాల్యపు నేర్పుతో వెళ్తాను- ఇప్పటికే ఎన్ని వడగళ్ళు కరిగించాను
ఉల్కల, తోకచుక్కలను చల్లార్చాను!?
ఇకిక్కడ వానవిల్లు విరిసింది, లోలోపల ఒక పందిరి నింగిలా ఒంగి
ఇంకాస్త పరుచుకుని రంగుల కలలు, అతుక్కుని, అతికీ అతకక 
అయినా నిరంతరం గా సాగే గానమై!

అందుకే
నెలబాలుడు వస్తాడనుకున్న పిమ్మట అమాస బాధించదు
పున్నమి రానుంది అనేకున్నాక వేకువ రాకపోకలు పట్టవు
నడుమ కృష్ణపక్షపు పూర్వపక్ష కాంతులలో అవే నీలాలు
ఉన్నవి రానివి లెక్కేసుకున్నాక వేదన మనసున నిలవదు...


అయినా...
మసక తెరలు తొలగవు; చీకటి మొగ్గలూ విచ్చుకోవు
రేయంతా యాష్టగా వేసట యెరుగని ఆత్రుతగా 
వెలుగు కొసలు ముడివేస్తూ- నిదుర నిప్పులు ఊదుతూ-
నీడల్లో నీడగా, కదలాడే గోడగా ఇదిగో ఇక్కడే బందీగా విరిసే ఓ కల కోసం...

ఎం.నారాయణ శర్మ గారి 'ఈనాటి కవిత' వ్యాఖ్యానం: శీతగానం

కవిత్వం కావాలి కవిత్వం అనుకుంటుంటాం..కాని కవిత్వమంటే..అనే ప్రశ్న చాలా సార్లు..వస్తుంది..ఒక్కో మార్గంలో ఒక్కో రకంగా నిర్వచించు కుంటారు.ఇవన్నీ సరైనవని ఎలా చెప్పలేమో సరికాదనివాదించడానికీ అంతే అవకాశంలేదు.

కవిత్వం కళాతాత్వికభావనలు కనిపించి ఒకసాధారణ దృశ్యాన్ని ప్రతిమగా మహొన్నతంగా అందించాలని కళాతాత్వికులభిప్రాయపడతారు.దృశ్యాన్ని ఆమూర్తంగా కళావ్యాఖ్యానాలు నిలబెడతాయి.ఇందుకు ప్రతీకలు,భావచిత్రాలు ఎక్కువ ఉపయోగపడతాయి.

భావచిత్రం అంటే కనిపించే దృశ్యాన్ని అంతే కళాత్మకంగా వర్ణించడం.దీనికి కవి అందులోని సౌందర్యమూలాలని విడదీసుకుని అనుభవించగలగాలి.మొత్తం వాతావరణంలోని ప్రధాన క్షేత్రాలని తీసుకుని వర్ణించాలి.అలా ఎన్నుకునే అంశాలు కవిచూసిన వాతావరణాన్ని ,దాని సౌందర్యాన్ని ప్రదర్శించగలగాలి.తాననుభవించినదాన్ని అంతే సౌందర్యంగా పాఠకులకు చేర్చాలి.

మరువం ఉష శీతాకాలంలోని ఉదయంలో కనిపించే వాతవరణమ్నించి రెండుదృశ్యాలను,రెండు శబ్దాలను చేదుకుని కళాత్మకంగా ఆదృశ్యాలను వ్యాఖ్యానించి కవిత్వం చేసారు,ఉదయంలోని రాలుతున్న మంచు,కొద్దిగా రంగు రంగుల్లో విస్తరిస్తున్న వెలుగురేఖలు...ఆసమయంలో ఎగురుతున్న పక్షుల రెక్కలచప్పుడు,కదులుతున్న కొమ్మలచప్పుడు ఈవాతవరణాన్ని చిత్రించిన కవిత ఇది.

"మడత విప్పి పరిచిన నూలుచీరలా మంచుతెర,
ఇంద్రధనుస్సు లో ముంచితీసిన కుంచె గీతల్లా వెలుగుధారలు...
కంటి ముందు కదలాడే దృశ్య కావ్య పఠనం సాగుతుంటే"

"లాకు తీయగానే పరిగెట్టే కాలువల సవ్వడిలా రెక్కలహోరు,
ప్రకృతి నాట్యానికి నట్టువాంగం లా కొమ్మలచిటికెలు...
శ్రవణ నిఘంటువు లో శృతులు, స్మృతుల పుటలు చేర్చుతూ"

"ఉదయం పాటగా మారింది, పదచిత్రాలు పాడమని ఊరిస్తుంది
పాదమై పల్లవిస్తూ, పదపదానికి నర్తిస్తూ...
పరవశాన మెరిసాను, ప్రకృతిగానమై నిలిచాను. "

మంచుని మడతవిప్పిన చీర-గా .తొలి కిరణాలని ఇంద్రధనుస్సులో ముంచితీసిన కుంచెగీతలు-గా చెప్పారు..అట్లే శబ్దాలని రెక్కల హోరులా ,ప్రకృతి నట్టువాంగంలా ఉందని అన్నారు.

ఇందులో మంచినిర్మాణంకూడా ఉంది.మొదటివి రెండు దృశ్యాన్ని ప్రకటిస్తే మూడవవాక్యం తన అనుభవాన్ని చెప్పింది.ఇందులోని రెండవభాగంలో లోనూ ఈనిర్మాణం ఉంది కాని ఇందులో శ్రవణానుభవాన్ని ప్రకటించారు.
కాళిదాసు-"ఉద్గాస్యతామిచ్చతి కిన్నెరాణాం తానప్రదాయిత్వమివోపగంతుం"అన్నాడు.-హిమాలయాలలో వీచేపిల్లగాలుల సవ్వడి కిన్నెరలగానానికి కోరస్ లా ఉందని భావం..ప్రకృతితో స్నేహం చేస్తేనే ఇలాంటి అల్లికలు సాధ్యమేమో.-స్నేహమంటే 
చూడటం,వినటం,స్పర్శించటం,దాని గురించి మాట్లాడటమని దానికోసం మనసు ఆరాటపడటమని నీతిశాస్త్రం చెప్పింది.

"దర్శనే స్పర్శనేవాపి శ్రవణేభాషనేపివా
యత్రద్రవత్యంతరంగః సస్నేహ ఇతి కథ్యతే"

ఆస్నేహంలోంచి మంచి భావచిత్రాన్ని కవితగా అందించినందుకు ఉష గారికి అభినందనలు

*****
-శీతగానం-

మడత విప్పి పరిచిన నూలుచీరలా మంచుతెర,
ఇంద్రధనుస్సు లో ముంచితీసిన కుంచె గీతల్లా వెలుగుధారలు... 
కంటి ముందు కదలాడే దృశ్య కావ్య పఠనం సాగుతుంటే

లాకు తీయగానే పరిగెట్టే కాలువల సవ్వడిలా రెక్కలహోరు,
ప్రకృతి నాట్యానికి నట్టువాంగం లా కొమ్మలచిటికెలు...
శ్రవణ నిఘంటువు లో శృతులు, స్మృతుల పుటలు చేర్చుతూ 

ఉదయం పాటగా మారింది, పదచిత్రాలు పాడమని ఊరిస్తుంది
పాదమై పల్లవిస్తూ, పదపదానికి నర్తిస్తూ...
పరవశాన మెరిసాను, ప్రకృతిగానమై నిలిచాను.  
(28/12/2013)

కాసుల ప్రతాప రెడ్డి గారి 'కవిస్వరం' లో : "లోపలి చూపు"

ఆత్మను పిడికిట పట్టుకుని లోలోతుల్లోకి పయనిస్తూ అనుభవాలను, అనుభూతులను నెమరేసుకుంటూ సాగిన కవిత ఉష రాసిన లోపలి చూపు. ఆత్మానుభూతిని అల్పక్షరాల్లో వ్యక్తీకరించి పాఠకులకు గొప్ప అనుభూతిని కలిగిస్తుందీ కవిత. ఇల్లు కేవలం ఓ భౌతిక రూపం కాదనే ఎరుకను కలగజేస్తుంది. ఇంటి చుట్టూ, ఇంట్లోనూ మన జీవితం పరుచుకుని ఉంటుంది. జీవన యానంలో ముందుకు నడిచిన తర్వాత గతంలోని పలు విషయాలు, సంఘటనలు గుర్తుకు వచ్చినప్పుడు పొందే అనుభూతిని కేవలం భౌతిక విషయంగా కాకుండా లోలోతుల్లోని ఆత్మ తండ్లాటగా ఆమె ఈ కవితను తీర్చిదిద్దారు. ఇల్లును దర్శించడానికి ఆమె ఆత్మ కిటికీ తెరిచి లోలోనికి ప్రయాణించారు. మెదడు తోట అయినప్పుడు ఆలోచనలు విత్తనాలవుతాయి. ఆ విత్తనాలు మళ్లీ తోటలో కొత్త మొక్కలై వ్యాపిస్తాయి. ఇలా జీవితం ముందుకు సాగుతూనే ఉంటుంది. భౌతిక ప్రపంచంలోంచి ఆత్మలోకంలోకి ప్రయాణం చేసిన ఈ కవిత పాఠకుడికి జీవితం పట్ల నిర్మమకార స్థితిని కలగజేస్తుంది. ఈ నిర్మమకారం మనిషిని ఈర్ష్యాద్వేషాలకు, రాగానురాగాలకు దూరం చేసి లోకాన్ని ఉన్నదున్నట్లుగా చూసే తత్వాన్ని మాత్రమే కాకుండా జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయాన్ని వస్తుగతంగా దర్శించే చూపును ఇస్తుంది. కవిత మొత్తంగా మానవ జీవితంలోని సారాన్ని అందిస్తుంది. - కాసుల ప్రతాప రెడ్డి

అప్పుడప్పుడు గుర్తుకు వస్తాయి-
చావిట్లో ధ్వనించిన ఎద్దు మెళ్ళో గంట
తువ్వాయి తుంటరి గంతులకి నలిగిన గడ్డిపరకలు

పెరట్లో చెదిరిపడిన గింజల వెంట ముక్కులు సాగదీసిన చుక్కలకోడి
రాలిపడిన పారిజాతాల కింద బారులు తీరిన నల్లచీమలు

వసాట్లో వాలుకుర్చీలో మడతలు విప్పి పరిచిన దినపత్రిక
ముక్కాలి పీట మీద విరిచిపోసిన పుగాకుకాడలు

"Home is where the heart is!!!"
అపరిచితుల వ్యాఖ్యలు వాస్తవానికి, గతానికి వంతెనలు కడుతూ
అలవోకగా మనసు తలుపు తెరిచి గదుల్లో కలదిరగటం మొదలౌతుంది
కొన్ని మాయమౌతూ
మరిన్ని గోచరమౌతూ
కలగా ముగిసినవో కథలై మిగిలినవో కలిసికట్టుగా నిలబడతాయి, ఏమిటవి?!

"Your Mind Is A Garden. Your Thoughts Are The Seeds" కావచ్చు...
అనుభవాలు మొలుచుకొస్తూనే ఉన్నాయి
వనాలు, జనావాసాలు కిక్కిరిసిపోతున్నాయి
దృశ్యం నుంచి జ్ఞాపకంలోకి పయనాలు సాగిపోతున్నాయి...

*****

-లోపలి చూపు-

అప్పుడప్పుడు గుర్తుకు వస్తాయి-

చావిట్లో 
ధ్వనించిన ఎద్దు మెళ్ళో గంట
తువ్వాయి తుంటరి గంతులకి నలిగిన గడ్డిపరకలు

పెరట్లో 
చెదిరిపడిన గింజల వెంట ముక్కులు సాగదీసిన చుక్కలకోడి
రాలిపడిన పారిజాతాల కింద బారులు తీరిన నల్లచీమలు

వసాట్లో
వాలుకుర్చీలో మడతలు విప్పి పరిచిన దినపత్రిక
ముక్కాలి పీట మీద విరిచిపోసిన పుగాకుకాడలు

"Home is where the heart is!!!"
అపరిచితుల వ్యాఖ్యలు
వాస్తవానికి, గతానికి వంతెనలు కడుతూ 

అలవోకగా మనసు తలుపు తెరిచి
గదుల్లో కలదిరగటం మొదలౌతుంది
కొన్ని మాయమౌతూ మరిన్ని గోచరమౌతూ

కలగా ముగిసినవో
కథలై మిగిలినవో
కలిసికట్టుగా నిలబడతాయి, ఏమిటవి?!

"Your Mind Is A Garden. Your Thoughts Are The Seeds"

కావచ్చు...

అనుభవాలు మొలుచుకొస్తూనే ఉన్నాయి
వనాలు, జనావాసాలు కిక్కిరిసిపోతున్నాయి
దృశ్యం నుంచి జ్ఞాపకంలోకి పయనాలు సాగిపోతున్నాయి...
(09/05/2014)

వేసట

అలిసిన పాదం మలుపుకొక పదపు ఊపిరి విడుస్తూ
పొదలు, ఎద సొదలు ఒక్కటై విరబూస్తూ
సిరల్లో ఉరకలెత్తే ఆశ పూల నీడలై తేలుతూ
వనమాలీ! నీ జాడకై ప్రకృతినై, పరవశమై సోలిపోయాను, దరికి రావూ!?
పాట కడతావో, పదాలు పాదాలు స్పర్శించిపోతావో...
వెలుగునీడల వేళ, వెన్నెల మరిగిన పూట,
అడుగులు తడబడిన నడకల
అలికిడి మరిచిన అడవి దారుల
ఆకలి దప్పులు వీడిన పగటిలో, కలత చెదరని మనసుతో
నదులుగా, నది వరదల దిగులుగా, పొగులుతూ పొంగుతూ చివరికిలా కృంగుతూ

వేచేటి వేళ

విరియబూస్తూన్న వేళ
పెనుగాలి దాడి చేసింది
ఏ తావున మలిగిపోతాయో నలిగి వాకిట పడి ఉన్న ఈ రేకులు!
కలలు, పూలు కలిసి రాలిపోతున్నాయి
నిన్నటి తావి ఒకటి గుండెలో తలదాచుకుంది,
నిదురని తొలిచే మెలకువలో తన పిలుపు నిలిచినట్లు.
ఆకులు కొమ్మని హత్తుకున్నట్లు తలపులు-
మరొక ఆమనికై తోటలా
తన రాకకై విధి వంకా, వీధి దిక్కుగా ప్రతి క్షణమూ ప్రతీక్షణము...

విస్మయం

తెలతెల్లని ఉదయపు సనసన్నని వాన- ఆదమరిచి గాలి, తానూ నిలిచి చూసిన వేళ
పులకింతలు సు జాతి పూలలా విప్పుకుని తనువునా తరువునా నిలవనంటున్నాయి
పక్కకు తప్పుకు పోనీయని పొన్న పూలలా పలుకరింతలు పట్టి లాగుతున్నాయి
అప్పటికప్పుడు విప్పుకునే పద్మాల్లా పలవరింతలేవో ఎదని తొలుచుకువస్తున్నాయి
పట్టువదలని కలలేవో కలవరింతల కదంబాలు అల్లుతుంటే,
పట్టలేనితనమొకటి వేటాడి తనువుని విప్పిపోసిన పూల పొట్లం చేసి వదిలింది.
చింత, పరికింత పసరు కట్టని చిగురు ఆకుల్లో దాగున్నాయేమో!?
పండుటాకు రాసులలో నిరాశలు నేల ఒడిలోకి జారిపోయాయా...
పుటము లో మిగిలిన తావిలా మనమున వీడని మొహమే ఇప్పుడిక!

యశస్వి "రెండుమాటలు", కవితత్వాల సంకలనం నుంచి...

Park Full of People...

నిర్జన వాడల్లో వాడని వసంతం పొంగుకొస్తుంది...
చిట్టి చిలుకలు పరుగులు పెడుతున్నాయి
గడ్డి పరుపులు మీద దొర్లాడుతున్నాయి
మాటలు చిగురు వేసి మనుషులు ఎదుగుతున్నారు
నవ్వులు విచ్చుకుని గుభాళిస్తున్నాయి!

at last it is Spring Magic !!!

మౌనగీతం

పచ్చిక మైదానపు తనువు మీదుగా పలుచని కాంతి వలువ
పశ్చిమ కనుమలోకి జారిపోతూన్న సాయం వేళ,
నీడ వెంట నీడగా గాలితెరలు తరలిపోతున్నవేళ...
నెలవంక అంచున జిగి, శ్యామాంబరం జతకడతాయో,
వాగువంకల దాపున పిట్టలు, కీచురాళ్ళు జతులాడుతాయో!?
దేహం మేఘావృతం అవుతుంది, ఒంటరి వాన వెల్లువౌతుంది.

ఒక తూరుపు వెచ్చని తొలి తాకిడి
ముసుగు కప్పుతున్న నీహారికనూ, తడికళ్ళనూ
తనలోకి తీసుకునే వేళవరకు తీరని దిగులే మౌనగీతమౌతుంది

Despondence

Some vague fears rake up flares to torment the heart,
Wrench and reduce you to a heap of ashes.
You long for the caressing touch of either memories or dear ones,
And would be eager to resist the arresting angst.
Strangely, they too get incinerated and transform into you.
And you ultimately remain…
A purple glow of doleful despondence.
*****
నిర్వేదం...
ఏవేవో దిగుళ్ళ నెగళ్ళు సెగలు రేపి ఎదని కాల్చుతూ ఉంటాయి,
మెలిపెట్టి బూడిద రాసిగా మారుస్తుంటాయి
జ్ఞాపకాలవో ఆత్మీయులవో స్పర్శ తెచ్చి అద్దుకోవాలని,
ఆవేదనని అడ్డుకోవాలని ఆత్రుత పడతావు
చిత్రంగా అవీ కాలిపోతాయి,నీ రూపుగా మారిపోతాయి,
చివరికి ఒక ఊదా మెరుపు నిర్వేదం గా మిగిలిపోతావు…

ఒక ఉదయం

జల్లెడ లో మిగిలిన మొరుం లా
నేల కి నింగి వంపిన మంచు
నిన్నటి మెత్తని పిండి వాన ని మించిన నిస్సవ్వడి తో

అడుగు బొడుగు గోదారి గీక్కుని నేతి వాసన పీల్చుకునే పిల్లల్లా
ఈ పిట్టలు పేరుకున్న మంచు కింద మేత గింజలు పొడుచుకు తింటూ

ఆరిన పొయ్యి దాపున దింపిన కావడి కుండల్లా
వెచ్చజూపిన నిన్నా మొన్నల ఎండ కనరాని శీతకట్టు పొద్దున
లోనంతా పచ్చని జీవం నింపుకుని కాండమెల్లా బిగిసిన ఈ చెట్లు

ముప్పేట అల్లికలైన ఈ రెప్పపాటు...గుండె కండెకి కాలం చుట్టిన దారప్పోగు!

తనలోని తానైన తను

ఒక పరి

వెర్రెత్తి పీల్చుకున్న సంద్రాన్ని ఎత్తి విసిరి ఆకాశం వరకు పారేస్తుంది
చంచల చిత్తయై, వర్ష నాళికల వేయి నాలుకల లాలాజలమై సొంగలు కారుస్తూ
మబ్బుల ఉదరం పిండుకుని ఉరుములై పిడుగులై వ్రక్కలై ఎదురౌతుంది
నేల కి ఇనికిన నీరే జీవమై జవసత్త్వమై చివురాకుల మొగ్గల పిందెల వన్నెలలో ఉపశమిస్తుంది
ఇంకొక పరి వైరాగ్యమా, త్యజించటమా- ఎవరెరుగని పోకడ

రేకులు రాల్పుకుని వసంతం ఊరు వాడలు విడిచి పోయే వరకు వడగాడ్పు గాలుల రమిస్తూ
పండుటాకులు విసర్జించుకున్న ఋతువు రాకపోకలు సాగే వరకు
ఉందనిపించే అందం ఆగదనిపించే చందం...
ప్రశాంత గగనం, తేలిక పడ్డ వనం తనకు మిగిలే- వరకు ప్రకృతి
తాను నేను...నేనైన తానో, తనౌతున్న నేనో?

ఎరుక

కొన్ని దుఃఖాలు నీలో కొన్ని మరణాంతర యానాలకి సాగరాలై సంగమిస్తాయి మరి కొన్ని పూలు నీలో ఎన్నో భవ/భావన అగాధాలలో ఎగిరే మిణుగురులై ఎదురౌతాయి. ఒక నిష్క్రమణ నిర్దయగా కన్నీటి కడలిలో ముంచెత్తుతూ నడుమ నడుమ తన తాలూకు కొత్త పరిమళపు గాలులలో సేదతీరమని వీలునామా వదిలి పోతుంది...ఎన్నో వేల పూలలో ఆచూకీలు వెదుక్కున్నప్పుడు ఎరుకకి వస్తుంది జ్ఞాపకాలు అలా పూలగా రూపప్రక్రియకి లోనయ్యే ఘటనలు మటుకు గాయపూరితమేననీ, ఎన్నో పూల చెట్లు మొక్కలు నీ కనుమరుగయ్యాయని, నీలో ఒకానొక కడలి కూడ ఉప్పుదేరి బరువైన స్ఫటికలుగా మారిందని, మరొకటీ గ్రహణకి వస్తుంది- కొత్త కడలి పాత కడలికి మరుజన్మనిస్తుంది, ఒక్కొక్క శోకం మరిచామన్న వాటిని పూడిక తీసి పారేలా తీస్తాయని. దుఃఖాలు పూలు ఒక జత అని- రెంటికీ నీలో ప్రేమ మాత్రమే ధాతువని...

ఎందరో ?

గాజు దేహపు నీటి గుండె తిత్తి లో ఒక పురిషెడు జలం ఉండొచ్చునని
జీవమై, జీవనరాగమై దేహవాటికలో పారుతుందనీ- ఆశ, ఆసరా కలేసి అనుభవైక్యం చేసున్నా
ఘటనగా, మాటగా తొలుచుకుంటూ ఆ పాత్ర- వంటిలో భాగమో, బతుకులో భాగమో- నామరూపాలు కాలం మార్చివేసాక
తొణికిన చుక్కలన్నీ కంటి పల్లం దిక్కుగా జారిపోయాక పొడిగుండెల సవ్వడితో ఒక నేను, ఒక తను, మరెవరో,మరెందరో...