తోటపనితో నాలో నేను-5

"పూచేనమ్మా పూచేనమ్మా
ఏమి పూచేను?
మా పెరటితోటలో చిలకడ పూచేనూ...
కాదు కాదు కానే కాదు
పాప మోమున నవ్వు పూచేను" - మరువం ఉష
జాన్ నా సహోద్యోగి.. వృత్తిలో పోటీ కాకుండా సహకారంతో మెసిలినవారం. తన పూర్వీకులు చాలా తరాల క్రితం యూరోప్ దేశాల నుంచి ప్రవాసం వచ్చినవారు; కాస్త జర్మన్ కాస్త స్వీడిష్ వారసత్వం ఉంది ఇంకా చాలానే కలిసాయి క్రమేణా వారి తరతరాల పరంపర లో. అయినప్పటికీ జాన్ తాత, తండ్రి తరంలో వ్యవసాయదారులే, తనకీ చాలా శ్రద్ద. తల్లి తోటలవీ పర్యవేక్షిస్తూనే ఇలా కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో సీనియర్ స్థాయి ఉద్యోగ జీవితం కూడా సాగించాడు. మా ఇద్దరికీ వెనక 3-4 తరాల వారిపట్ల గౌరవం, వారి జీవితాల పట్ల అవగాహనతో పాటుగా ఆథ్యాత్మికత, తోటపని, వంట పట్ల ఇష్టాలు కలిసేవి.

ఒక సంవత్సరం మే నెల 3వ వారంలో సంభాషణలో " ఈ ఏడాది కొత్తగా ఏ మొక్క పెంచనున్నావు?" అని అడిగాడు. ఏడాదికొక కొత్త వంగడం/రకం కూరగాయ పెంచటం నాకు అలవాటు. "ఇంకా ఏమీ అనుకోలేదు.." అంటుండగానే అటుగా వచ్చిన రాబ్ (దక్షిణ అమెరికా మూలాలు ఉన్నవాడు) "హే! ఆలీ (లెబనాన్ నుంచి వచ్చిన ప్రవాసి) చిలకడదుంపల నారు ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్నాడు. మేము నలుగురం ఉన్నాము, మీరిద్దరూ కలిస్తే ఆరుగురం కలిపి కొంటే 25 మొక్కల కట్ట అందరం తీసుకోవచ్చు," అన్నాడు. కనీసం పాతిక కొనాలి అన్నమాట. నేను ఎప్పుడూ నర్సరీలో చూసి తెచ్చుకోవటమే కానీ అలా తీసుకోలేదు. సరదా వేసింది కాస్త సంశయం ఎలాగ వస్తాయో అన్చెప్పి... "సరే!" అంటూ నేనూ, జాన్ కలిసాము. ఒక వారానికి వచ్చింది నారు జాగ్రత్తగా నలగకుండా సర్ది పంపిన పాకేజీ. రాబ్ గబగబా వాటిని సగం వరకు నీరు పోసిన చిన్న జగ్ లో పెట్టి మా అందరికీ ఈమెయిల్ ఇచ్చాడు. మీటింగ్ కారణం గా నేను వెళ్లేసరికి ఆరోగ్యవంతమైన నారు మొక్కలు కొత్త యజమానులు చేతికి వెళ్లి కాస్త బక్కచిక్కిన ఆరేడు మాత్రం మిగిలి ఉన్నాయి. సరేలెమ్మని ఒక నాలుగు తీసుకుని, రాబ్ కి డబ్బు ఇచ్చి, ఫర్వాలేదు అన్నా తాను ఎవరినో అడిగి నాచేతిలో కచ్చితంగా పెట్టేసిన చిల్లర కూడా పుచ్చుకుని ఇంటికి రాగానే ముందుగా వెనుక ఉన్న మడిలో రెండేసి చొప్పున కలిపి పాతి, పోషణ చేసాను. జూన్ మొదటివారానికి (అంటే 15 రోజులకి) మొక్కలో కాంతి, చిగురాకు వేసే తేజస్సు కనపడ్డాయి. అసలు అంతవరకూ అవి తీగెలా పాకే వత్తైన కుదురుగా ఉంటాయని తెలియదు. ఇక ఆ పక్కన ఉన్న తోటకూర, చుక్కకూర వంటి మొక్కల మీద పాత మోజు పక్కదారి పట్టి కొత్తదారి తీసుకుంది. జాన్ తో అప్పుడప్పుడు 'నీ మొక్కలెలా ఉన్నాయి' అని అడిగి నా తీగె సంగతి చెప్పేదాన్ని. అలా నిండుగా ఉంది చాల్లే అని కూడా అనేసుకున్నాను ఇంతలోకి చిగురుల మీదుగా మొగ్గలు వచ్చి పూలు పూశాయి. తూటిపూల లా ఉన్నాయి.. తెలియకుండానే దేవులపల్లి పాట అని గుర్తు ఆ ఎత్తుగడ తో "పూచేనమ్మా పూచేనమ్మా ఏమి పూచేను? మా పెరటితోటలో చిలకడ పూచేనూ... " అని పాట అందుకుంది నా మనస్సు. అదే తర్వాత పూర్తి చేసాను. నాన్నగారికి ఫోన్లో చెప్తూ, సాయంత్రపు నడకకి వెళ్తూ నా మొక్కలు చూడ్డానికి ఆగేవారికి చూపుతూ సంబరంగా ఆ ఎదుగుదల చూస్తుండగా కాస్త ఛీడ పట్టినట్లుగా ఆకుల తీరు చూసి గ్రహించినా, క్రిమిసంహారక మందు చల్లితే పక్కనున్న అన్ని మొక్కలమీదా ఆ ప్రభావం తో దుష్ఫలితం ఉండవచ్చని, సాధారణంగా ఛీడ పీడలను తట్టుకునే వంగడాలను మాత్రమే ఆ కంపెనీ వారు పెంచుతారని విన్నాను కనుక అలా వదిలేసాను. అక్టోబర్ నెలలో మొక్కలు చలికి వడిలిపోవటం మొదలుపెట్టినా ఇంకా పూత మీద జోరుగా ఉన్న తీగెలు ఫోటో తీసి, జాన్ తో చెప్పాను. ఒక పదిరోజులకు హడావుడిగా వచ్చి "ఓయ్! ఇవాళ తీసేయ్.. అలా వదిలేస్తే నీకేమీ దుంపలు మిగలవు," అన్నాడు. ఎలా దుంప సేకరించాలి కూడా వివరించాడు. కాస్త ఆసక్తితో విన్నాను..ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఎప్పటిలానే మొక్కల్లోకి వెళ్తూ పిల్లకి చెప్పాను "ఇవాళ జాగింగ్, డాన్స్ చెయ్యను కానీ నీకొక వింత చూపిస్తా!" అని. లోలోపల అనుమానం అసలు పైన పూలు ఉన్నాయంటే లోపల దుంపలు ఉండి ఉంటాయా అనేసి...

'అయ్యో! సందెవేళ పచ్చటి మొక్కని అలా ఎలా తవ్వి తీయాలి?! నాన్నగారితో చెప్తే కోప్పడతారు..' అనుకుంటూ పైపైన తవ్వేసే ఆషామాషీ పనిలా నాలుగుసార్లు చిన్ని గునపం వంటి పరికరంతో మొదలు చుట్టూ కదిపి చూస్తే, చలికి బిగిసి ఉన్న మట్టి ఒక చిన్న పెళ్ల కూడా కదల్లేదు. అలా అలా ఒక గంట పైనే చీకటి పడిపోతున్న ఆ మునిమాపు వేళలో (సాధారణంగా వాన పడదు కానీ ఆరోజు అదీ తోడయింది) కొంకర్లు పోతున్న అంతగా బలమైన పనులకి అలవడని చేతులతో, దాదాపుగా ముద్దకట్టుకుపోతున్న స్థితిలో, "ఓ రంగయో..పూల రంగయో" వంటి పాటలు "చెల్లియో చెల్లకో.." వంటి పద్యాలు నాన్నగారిని అనుకరిస్తూ పాడుతూ మరి నా పూర్తి జాగృత, స్పృహ వదిలి మనస్సు జాయింట్స్ నెప్పి, రక్తం గడ్డ కట్టే తిమ్మిరులని దాటుకుని చేతులకి శక్తి ని పంప్ చెయ్యాలి కదా!- నా త్రవ్వకాలు కొనసాగించా. 

అదేదో లంకె బిందెలు తవ్వితే కలిగే అనుభవం లా నా టూల్ కి అడ్డమొస్తూ గట్టిగా ఏదో తగిలే సరికి బలమంతా పెట్టి మట్టి తిరగబడేలా పెళ్లగించి చూద్దును కదా! "యురేకా, బింగో, వామ్మో, హైలెస్సా" అన్ని భాషల్లో శ్రామిక ఆశ్చర్యం, కృషీవలుల విజయహాసం, పరిశోధనల ఫలితపు సమయాలు నాలో ప్రాణం పోసుకున్నాయి. స్నేహ పరిగెత్తుకుని వచ్చింది. ఆ మునిమాపు వేళలో అలా ఒకటొకటిగా బయటకు తీస్తూ 'అమ్మా! మన్నించు, భుక్తి కొరకు భక్తి తో చేసే పని' అని నేల తల్లికి మొక్కుతూ పోగేసినవి దాదాపుగా 10 పెద్ద దుంపలు, ఐదారు చిన్నవి. మిగిలిన తీగె ఆకులు జాగ్రత్తగా బాగ్ లో దాచాను, కమ్యూనిటీ కలక్షన్ వారికి ఇవ్వటానికి (కంపాస్ట్ చేస్తారు) ఇక నిద్రపోతే ఒట్టు ఆ రాత్రంతా.. నాన్నగారు, అన్నయ్య కి ఫోన్లు, లోకల్ కాల్స్, వాటిని రకరకాలుగా కిచెన్ ఐలెండ్ మీద పేర్చి, ఫోటోస్ తీసుకుని, నాలుగు నాకు ఉంచుకుని తెలిసినవారికి వెళ్లి ఇచ్చి, మర్నాడు జాన్ దగ్గరకి పరిగెత్తుకుని వెళ్లి చెప్పాను. "ఓ! నిజమా" అని తాను అరిచిన ఆ అరుపుకి మిగిలిన నలుగురూ లగెత్తుకు వచ్చారు. ఇక ఒక హరికథ లా మొదలెట్టి, బుర్రకథకి మార్పిడి చేసి, పాడిందే పాట లా ఒక వారం పాటుగా నేను ఆ దుంపల సాగు ఎలా చేసాను, నాకు అత్యంత అధికమైన ఆ దిగుబడి ఎలా సాధ్యం అయింది అనే అంశం మీద మా అధ్యయనం సాగింది. సంగతి ఏమిటంటే వాళ్లెవరి తీగెలకీ పూత తప్పా దుంప రాలేదు. జాన్ వాళ్ళ అబ్బాయి/అమ్మాయి కాకపొతే భార్యో ముందుగా పెకిలించి తీసేసరికి లేత దుంపలు ఓ నాలుగు మాత్రం వచ్చాయి.

కనుక నేను మరొకమారు కాలర్ ఎగరేసి కనుబొమ్మలు కూడా కలిపి కళ్ళతో నవ్వుతూ కలకాలమని కోయిల లా పాడుతూ ఒక పక్షం వరకు చిలకడ దుంపల వంటకాలు చేసి (లావయ్యాను అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే) సగం చిక్కిపోయా పిల్లదానికి తినిపించి.. చూస్తూ చూస్తూ నేను తినలేక. (ఎంతైనా తొలి పంట అప్పుడు కాస్త తల్లితనపు తత్తరపాటు వస్తుంది). ఒక దుంప మాత్రం నెల పైనే అట్టిపెట్టాను. ఎందుకంటే Thanksgiving పండుగ అనాది సాంప్రదాయాన్ని అనుసరించి ఈ దుంపలు, మొక్కజొన్న వంటలు తప్పనిసరి. 

ఇవాళ అమెరికా అంతా అన్ని జాతీయులు దాదాపుగా ప్రతి పిల్లాపాప సంతోషంగా గడుపుకునే ఈ పండుగకి ఒక విశేషం ఉంది. మన సంక్రాంతి మాదిరిగా పంట ఇంటికి వచ్చాక సంబరంగా, తిరునాళ్ళగా జరిపేవారుట.. ప్రతి ఇంటా సమృద్ధిగా పాడిపంటలు ఇచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞత తెలుపుతూ. అలా Native People జరుపుకునే ప్రాచీన వ్యవసాయ సాంప్రదాయ వేడుకలోకి స్పానిష్ వారి రాకతో కొంత మార్పు, చివరిగా 1621 లో Mayflower నౌక ఐరోపా/ఇంగ్లండ్ నుంచి బయల్దేరాక- సముద్ర పయనం లో ఎన్నో ఇక్కట్లు పాలయి, రోగాలతో ఎందరో చనిపోయి- చాలా మందిని కోల్పోయి మిగిలిన కాందిశీకులు విచ్చేసినప్పుడు స్థానికులు వారికి ఎదురేగి విందు భోజనం పెట్టటంతో ఆ విందులు, వినోదాలు కలగలిసి మరింత చారిత్రిక ప్రాముఖ్య కలగలుపుకుని నేటికీ పాత కొత్తల మేళవింపుతో సాగుంతోంది. ఈమధ్య చివరిగా 2014 లో నేను 90 సంవత్సరాల వృద్ధులతో గడిపాను, వారిలో ఒకరు హిట్లర్ సమకాలీనులైన తాత మామ్మల అనుభవాలతో ఒక నవల రచించిన పోలిష్ రచయిత్రి.

నేను దుంపలు కాల్చి తినటం, ఉడకబెట్టి తినటం కాకుండా కాక పులుసు, వేపుడు, మా వైపు కాజాలో మడతల నడుమ ఉడికించిన దుంపల పేస్ట్ రాయటం, సిడ్నీలో శ్రీలంక తమిళుల వలన పాయసం, ఇక్కడ sweet potato casserole, sweet potato fries and mashed sweet potatoes చేస్తూ ఉంటాను.

(సమస్త జగతికి, సకల జీవకోటికి కృతజ్ఞత తెలుపుతూ నా పాట, కవిత జతపరుస్తున్నాను.)
మీ అందరికీ Thanksgiving సందర్భంగా నా నెనర్లు! మీ మాటలకి మప్పిదాలు.
-1-
పూచేనమ్మా పూచేనమ్మా
ఏమి పూచేను?
మా పెరటితోటలో చిలకడ పూచేనూ...
కాదు కాదు కానే కాదు
పాప మోమున నవ్వు పూచేను

కాచేనమ్మ కాచేనమ్మ
ఏమి కాచేను?
మీ ఇంటి ముందరి గులాబీ కాయ కాచేనూ...
కాదు కాదు కానే కాదు
నీలాకాశాన వెన్నెల కాచేను

పండేనమ్మ పండేనమ్మ
ఏమి పండేను?
మా అత్తగారి బీరపాదుకి పండు పండేనూ...
కాదు కాదు కానే కాదు
నేను కన్న కలలు పండేనూ

-2-
దేహమే శిలువగా మోసుకుంటూ, లేదా
దేహపు గదిలో బందీ అయిన ఆత్మగా
విశ్వపు ఒడికై ఆర్తి చెందుతూ
విడుదల కొరకై వేచి ఉంటాను

గోడల్ని ఒరుసుకు మొలిచిన రావిఆకులు
కదులుతాయి, కంటి చూపుని కదుపుతాయి
నీటిలో పడ్డ కిరణాల పరావర్తనమో, వక్రీభవనమో
మెరుపు నీడలై కనులెదుట నిలుస్తాయి
వార్తాహరులు వచ్చిపోతున్నట్లే ఉంటుంది

కమ్ముకుని కట్టిపడేసిన భయపు కౌగిలి లో
ఊపిరి అందని ఉక్కిరిబిక్కిరి లో
దిగంతపు దిశ గా, ఏవేవో ఆనవాళ్ళ వెంట
చివరి మజిలీ కి తరలిపోతుంటాను

గాలి ఊయలులు సేద తీరుస్తాయి
కెరటాల వీవెనలు కుదుటపరుస్తాయి
ప్రకృతిలో మనుషులు, మనుషుల్లో ప్రకృతి
పలుకరిస్తాయి, గృహానికి చేరిన భావన ఇస్తాయి
ఇవన్నీ నిండిన లోకపు వాకిలి లో నిలిచి,

కృతజ్ఞతల తోరణాలు కట్టిపోతాను.

2 comments:

  1. Usha,

    Chala samtOsham. nenu try chesanu, kani tige adavila perigipotumdani nanna pIkesaru. :(
    kani mIru sadhimcharu. good work.

    ReplyDelete
  2. మీ చిలకడ-నిలకడ కబుర్లు బాగు-బహు బాగు!

    ReplyDelete