తెరవని తలుపుల నుంచి...


కిటీకీ నుంచి ప్రపంచాన్ని చూడాలి; ద్వారాలు తెరుచుకు వీధుల్లోకి నడవాలి', అని అనిపించనప్పుడు
నీడల గుర్రాల వెలుగు జీను గోడల మీద పరుచుకుంటుంది; చీకటిని చిధ్రం చేసి కంటి తెరలు తెరుస్తుంది 

Shadows and Windows so inseparable
World comes to you when your eyes are reluctant

ఆలాపన

అసహాయత నుంచి నిర్భయ గా మారనున్న చిన్నారీ!
"శుభ్ర జ్యోత్స్నా పులకిత యామినీమ్
Where nights are made joyous by sparkling light
నిసప్త కోటి భుజైర్ధృఉత ఖరకరవాలే
many million hands have taken swords (for your protection)"
శతాబ్దాల పర్యంతం నిలిచిఉన్న న్యాయం ఒకటే,
బలిమితో ఒకరు, ఓరిమితో ఒకరు ఒద్దిగ్గా మెలగటమే.
ఆనాడు "సతి" అంటూ అగ్నిజ్వాల కి,
ఈనాడు ఆమ్ల ధారల "చితి" కి బలయ్యే అభాగిని చేసే నేరం
మగాడి నిర్వచనం లో మగాడికొరకు మెసలటమా!?
బలాత్కారాల, భంగపాట్ల పచ్చబొట్లు
గత చరితల, గతించని వెతల నుదుటి మచ్చలు
అమానుష చర్యల, అంతులేని పోరాటాల నిత్య సత్యాలు
అడుగడుగునా క్రుంగదీసే జాతిముద్రలు చెరిగిపోవాలిక...
గతపు గాధలు దాటుకుని కొత్త పుంతలు తొక్కే నవతరం రావాలి
ఘాతుకాలెరుగని ఘటనలతో శాంతి బావుటాలు ఎగరాలి
సమానహక్కులు, సమస్థాయి ఎరిగిన నాడు-ఆలపిద్దాం
"సుఖదాం వరదాం మాతరం వందేమాతరం"

(*** అరాచకం అన్నిటా తావు చేసుకుంటుంది, బలపడి తీరాల్సిన పరిస్థితి కుటుంబంలోనే సంభవిస్తుంది; వెనుకడుగు లేదా ముందంజ తప్పా మరే దిశా దిక్కూ లేవిప్పుడు బలహీనులకు/అబలలకు కూడా, ఆడ మగ అన్నదిప్రశ్న కాదు అంచేత (ఈ వచనం లో స్త్రీ భాష్యం వెలికి తెచ్చినా గానీ)

"కలాం" కలకాలం నిలిచేపోయే కథనం, కదనం, కాదనలేని కమనీయ గానం!

ఉన్నత విద్యాభ్యాసం, ఉద్యోగం వివాహం - 20సం. వయసు కి ఆడపిల్లకి ముప్పేటలా ముప్పిరిగొనే జటిలమైన సమస్య. నాకూ తప్పలేదు, మొదటిదాన్ని ఎంచుకోక! కలాం గారి చలువ అది.

DRDO: Defence Research and Development Organization కి దాదాపు పితృ సమానుడైన ఆయన దూర దృష్టి వలన ప్రవేశ పెట్టబడిన సాఫ్ట్వేర్ లో మాస్టర్స్ కోర్స్ చేసిన మొదటి కంప్యూటర్ నిపుణుల బృందం లోని శాస్త్రవేత్తని నేను. నను కన్నవారికీ, నేను కన్నవారికీ అదొక అపురూపమైన వరం, దీవెన.

ఆ గర్వించే ఉద్యోగ క్షణాలు, అనుభవాలు పక్కన పెడితే సాంకేతికరంగ తండ్రి వంటి వారు ఆయన నాకు. బాబు పసిబిడ్డ గా ఉండగా- ఆయన నివాసం (ఆఫీసర్స్ మెస్) నా గృహం (సైంటిస్ట్ హాస్టల్) చాలా దగ్గర మూలాన- సాయంత్రాలు యువా ని ప్రాం లో తోసుకుంటూ ఆయన గది పక్కగా తిరిగేదాన్ని; ప్రశాంతమైన వదనం తో వీణ వాయిస్తూనో లేదా మౌన ముద్రతో (పుస్తకం, సాలోచన ధరించి) కనిపించేవారు. ఒక్కోసారి నిదానంగా, మరోసారి గౌరవంగా, పలుసార్లు సగర్వం గా చూస్తూ దాటుకునేదాన్ని. చాలా అరుదుగా నన్ను చూసి నవ్వేవారు, ఒకటీ రెండుసార్లు మృదువైన సంభాషణ. బాబుకి మాత్రం ఆయన చూపులు చాలా ఆదరంగానే తాకేవి పెక్కుసార్లు...
ఆయనకీ తెలీదు బహుశా తన ద్వారా స్ఫూర్తితో వెలిగే జ్ఞానజ్యోతి ని నేను ప్రమిదలా కాస్తున్నానని.
భగవంతుని పరీక్షా సమయం జన్మనిచ్చిన నాన్న, జీవనాన్ని కల్పించిన తండ్రి ఒక్కమారు నా ప్రపంచం నుంచి నిష్క్రమించటం...ఒక అందమైన ఊహకి, జ్ఞప్తికి మనిషి భౌతికం గా లేకపోవటం చాలా వెలితి. తప్పదు, మరణం పిలుస్తూ రాదు కానీ చటుక్కున ఒడిసిపట్టుకు లాక్కుపోతుంది ఆత్మీయులని మనసైనవారిని. జీవితమూ తప్పదు వారి పరోక్షం లో నడవక. ఎన్నెన్నో అవధులు ఎరుగని విజయాలకి, వికసించిన వదనాల చిరునవ్వులకి, ఫలించిన కలలకి చిరునామా అయిన వారికి శిరస్సా నమస్కరిస్తూ ఈ అశ్రు నివాళి!
ఎందుకో ఈ సామ్యం, మా నాన్న గారికీ, ఈ పితృ సమానులుకీ ఇది సాధ్యం పడింది, భాగ్యశాలులు;
"అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితం, దేహాంతే తవ సాయుజ్యం, దేహిమే పార్వతీపతే!"
దేహిమే పార్వతీపతే = O Lord! give me
వినా దైన్యేన జీవితం = a life without pleading someone
అనాయాసేన మరణం = an easy natural death
దేహాంతే తవ సాయుజ్యం = ability to reach your abode after leaving the body

ఎలా!?

నిన్నటి మేఘం కరిగి నిన్నూ నన్నూ ముసాబు లోకి నెట్టి వెళ్ళాక-

రాలిన వేప రేకుల చేదు
నానిన మావి టెంకల తీపి
వాసనలు మనసు ముంగిట గాఢం గా...

గిల్లికజ్జాల సడి
ఆగక కొట్టుకునే కిటికీ తలుపుల్లో
మళ్ళీ రాని మాటల సందడి
మూయని ద్వారపు తోరణాలలో

కురిసీ కురియని వాన పాయలు గుండె నిండా పరుచుకుంటూ-

ఉండీ ఉండి ఇంకా ఉరిమే ఆకాశం
ఆగి ఆగి కంటిలో మెరిసే అనురాగం

ఇంకోసారి
మునుపటి మునిమాపు గోలలు,
నిన్నా మొన్నటి మాగన్ను మూగ వేదనలు
పలకరించి పలవరించి పోతాయి

ఇకప్పుడు
'మబ్బు కమ్మాలి, ముసురు పట్టాలి' ఆశ పడుతూ
తడిసిన కలలు తుడుచుకుంటూ
తడారిన చేతులు కలుపుకుంటూ...

మనమిలా!

కడపటి వందనం

ఒక చల్లని చీకటి రేయిలో తడికళ్ళ శైత్యం మరింత వణికిస్తే-
గాజుల సడి, జాజుల స్పర్శగా
నుదుటన అద్దిన కుంకుమ గా
అమ్మ జాడ నాకు వీడ్కోలు పలికింది

ఆ తెలవారిన వెచ్చని పొద్దుతో పోటీగా కంటినీటి ఉష్ణోగ్రత
నిర్జీవ దేహపు నివాళి అననా!?
అంతిమ చూపుకి సమర్పణమా...
గాజు బొట్టు పూవు ఫలం- ఇవే చేతులు, మరప్పుడు నా నుంచి అమ్మకు

పుష్కర కాలం ప్రవాహమై, పదిలపరిచిన జ్ఞప్తులు పొరల భారంతో పొదగబడి
అమ్మని వెదుకుతూ నాన్న నడిచి వెళ్ళిపోయాక ఇక అనాధ నామం నా నుదుటివ్రాతగా
నిట్టూర్పు నిప్పుల సెగలు, రాజీ తప్పని దినసరి వెతలు నడుమ
ఇప్పుడూ అవే ఆనవాళ్ళు- తాంబూలాలుగా, ప్రసాదాలుగా- ఇంటి కంచాల మారుగా పంచిన విస్తళ్ళలో

శీత శ్రవణం

చిదుగులు  రాలుతుంటాయి, ఏదో ఒక దిక్కు నుంచి గాలి వీస్తుంటుంది

మాగిన పూరేకులు, పలకమాగిన పళ్ళు కంటి చూపు మేరా-
రంగులు మారిన ఆకుల వెనుగ్గా ముసురు తాకిళ్ళ ఆకాశం  
చిగురు తొడుగుతున్న తీగకిక సమయం లేదు
విచ్చీ విచ్చని మొగ్గలూ ముగిసిపోతాయిక...

వడిలిపోతున్న ఆకులు, వెచ్చని ఉభయ సంధ్యలు సెలవు తీసుకోనున్నాయి

గుబులుగా ఉడుతలటూ యిటూ  తిరుగాడుతూ పికాన్ నట్స్ పోగేసుకుంటూ
కుదురుగా పిట్టలూ అదే పనిగా మట్టి గుట్టల్లో, చెట్టు తొర్రల్లో తవ్వితోడిపోస్తూ
ఉన్ని దుస్తులు, తోలు పాదరక్షలు వెలికి తీసి ఉసూరంటూ అందరమూ
వచ్చి పోయే శీతువు ని ఎప్పుడూ కొత్త ఋతువుగానే ఊహిస్తూ...

నిరుడు, ఆ మునుపటేడూ ఇవే మాటలు చెప్పుంటాను,  ఊసులు రాసి పోగుపడుతుందిలా మరి!

(ప్రచురణ కౌముది 100వ సంచిక ఏప్రిల్, 2015)