ఎలా!?

నిన్నటి మేఘం కరిగి నిన్నూ నన్నూ ముసాబు లోకి నెట్టి వెళ్ళాక-

రాలిన వేప రేకుల చేదు
నానిన మావి టెంకల తీపి
వాసనలు మనసు ముంగిట గాఢం గా...

గిల్లికజ్జాల సడి
ఆగక కొట్టుకునే కిటికీ తలుపుల్లో
మళ్ళీ రాని మాటల సందడి
మూయని ద్వారపు తోరణాలలో

కురిసీ కురియని వాన పాయలు గుండె నిండా పరుచుకుంటూ-

ఉండీ ఉండి ఇంకా ఉరిమే ఆకాశం
ఆగి ఆగి కంటిలో మెరిసే అనురాగం

ఇంకోసారి
మునుపటి మునిమాపు గోలలు,
నిన్నా మొన్నటి మాగన్ను మూగ వేదనలు
పలకరించి పలవరించి పోతాయి

ఇకప్పుడు
'మబ్బు కమ్మాలి, ముసురు పట్టాలి' ఆశ పడుతూ
తడిసిన కలలు తుడుచుకుంటూ
తడారిన చేతులు కలుపుకుంటూ...

మనమిలా!

1 comment:

 1. కురిసే మబ్బులను తెలుపుతూ ముందొచ్చే చల్లని తెమ్మెరలా
  నడిచొచ్చే నెమలికి నాట్యం నేర్పే నాగినిలా
  ఎగసిపడే వేదనను ఓదార్చే హిమసుమంలా
  తేలిపోయే తలపులను పట్టితెచ్చే భావఝరిలా
  ఎదురుచూస్తూ..ఎదురుచూస్తూ..ఎదురుచూస్తూనే వుంటాము..

  ReplyDelete