విడివడ్డ క్షణంలో

ఆ వేకువఝామున
వెన్నెల ఇంకా మలిగిపోలేదు
సందె ముగ్గులు చెదిరిపోలేదు
పారిజాతాలు కొమ్మనే పట్టుకుని ఉన్నాయి
కొబరాకుల మీద కచ్చేరీలు మొదలవలేదు...
ఆ పక్క మీద నుంచి తనూ లేవలేదు
ఫోను తాలూకు ధ్వనులు ప్రాకిపోయాయి
వచ్చినవారు వస్తున్నవారికి చెప్పుకుపోతున్నారు
ఊరివారు వెనకముందుల సంగతులు వీపున వేసుకున్నారు
పనులు జరిగిపోయాయి.
ఇకప్పుడు జరగనివి, జరిగినవి ఒక్కసారిగా ఉప్పెనై
తనవారు, తను మిగిల్చినవి మాత్రమే మునకలు వేస్తూ.
మరణం మరునాటికి ఇంకొక చిరునామా వెదుక్కుంది
జరగరానిది, జరగనున్నవి సాగిపోతున్నాయి
రోజుకొక బతుకువెత బుద్భుద భరితంగా...

కాలమాగదు

వసంత వనాలు, వానమేఘాలూ బోసిపోయాయి
శిశిర సుమాల కాలం ఆసన్నమైందిక-

వెచ్చని ఉదయాల్లో నింగి వరకు పొగమంచు పొంగుతుంది
చిక్కని చీకటితో వెన్నెల మాసాలూ తలపడతాయి

ఖండాంతర వాసానికి వలన పిట్టలు పయనమైపోయాయి
నలుచెరగులా మౌనం ఆవరిస్తుందిక-
బిగిసిన ద్వారబంధాల్లో గాలి గుర్రమై సకిలిస్తుంది
పెరిగిన చలితో నిప్పుల కుంపట్లు పేచీపడుతుంటాయి

ఇందుమూలంగా, నేను చెప్పేది యేముంది!?
శీతాకాలం తాకిపోతేనే వేసవికి విలువుంటుంది
కొన్ని సందెల్లో మరికొన్ని మధ్యాహ్నాల్లో ఇంకొన్ని రాత్రుల్లో
వాతావరణం పలుకరిస్తే శీతకన్ను వేయబోకు, చిన్ననవ్వు విడిచివెళ్ళు