Showing posts with label కవిత. Show all posts
Showing posts with label కవిత. Show all posts

తరువుకో ప్రణామం

నగరపు నడిబొడ్డున
నిలవనీయని /మనిషి/తనాన్ని
ఒప్పుకోని చెట్టు ఉంది
నిజానికి ఉంటుంటాయి బోలెడన్ని విడివిడిగా.

అడవిలో గుంపులుగా ఉంటాయోమో
వేరు వేరు కలుపుకుని
వెన్నుదన్నుతో ఎదుగుతుంటాయి.

ఇక్కడేమో-
ఇంటికొక ఒంటరి చెట్టు తప్పనిసరి
మీటలు నొక్కి విరిచిపడేసే
ఎందరెందరో యంత్రాల మరిడయ్యలు
చేతబడి చేస్తుంటారు.
బతుకులేని, చావలేని
మొండిమాను
ఎండుదనంతో నిండిపోయాక
ఆకృతులు చెక్కుతారు
‘అందమైన నగరం’ అని పేరు పెడతారు.

మరెందుకో..
గాలికీ, వానకీ అంత అక్కసు?
ఎడాపెడా వీస్తాయి,
లేరెమ్మలని, చిటాకులనీ చిద్రం చేసిపోతాయి
పాడుబెట్టిన గూటి నుంచి ఈక ఒకటి
నిశ్శబ్ద గానంతో రాలిపడుతుంది.

అంతలోనే..
ఎగురలేక ఆగే పిట్టలు,
మొదలున లేచే పిలకలు
ఎదగమని, ఎదురు నిలవమని చెప్పినట్లే
మొక్కవోని తెంపరి అవుతుంది ఆ చెట్టు
కొమ్మమీద కొమ్మతో తిరుగుబాటు చేస్తుంది
గరగరలాడే ఆకొకటి బాకా ఊదినట్లే తోస్తుంది.

విచ్చుకునే గుత్తులలో
ఆవురావురంటూ తుమ్మెదలు వచ్చి వాలతాయి
పరుచుకునే నీడలలో
రాలిపడే రేకుల జాజర పచ్చిపచ్చిగా పడుతుంది
నిలబడిన, నిలకడ గలిగిన చెట్టు
మనిషికి సవాల్ విసురుతుంది.

అక్కడక్కడ,
మనసున్న మనుషులూ ఉంటారు
చెట్టుని హత్తుకోవటానికి
ప్రాణిగా ఎంచటానికీ!

మూడు చెట్లు


అంగుళాలు, అడుగుల ప్రమాణంలో
నేను ఎదుగుతున్న దశలో, మా నాన్న
మూరెడు బారున్న ఓ వేపమొక్కని నాటారు
గుప్పెడు మట్టి చల్లిన ఊసు నాకెంతో గొప్ప ఈనాటికీనూ!

వసారా నిండా మనుషులు, మాటలు
పరుచుకుని ఉన్న సమయాల్లో
నేను, మొక్క ఏపుగా ఎదిగాము
మొక్క చెట్టు అయింది, నేను ఎదగటం నేర్చుకున్నాను.

చెట్టు నీడకి, నాన్న కాలక్షేపానికి లంకె పడింది,
వచ్చే పోయేవారి లెక్క తరిగిపోయింది, నాన్న నేను మిగిలాము.
చెట్టుకి పూలు, పళ్ళు, కాకులు, ఆకులు క్రమం తప్పని కృత్యం
నాలోనూ తను పెంచిన కలలు, కళలు, లోకాలు, ఆచరణలు విస్తరిస్తూ...

వేప పండు, నాన్న మాట ఒకటే రుచిగా ఉండేవి.. నాన్నని ఒక వృక్షం గా దర్శించాను
తన మందలింపు, చేదు వేపాకు రక్షలా నన్ను కమ్ముకునేది
పందుంపుల్ల వాడేవారున్నారు ఇంకా.. తరుచు కొమ్మల మీద కన్నేసి ఉంచుతూ.
నాన్న మాటలు నేనూ పంచుతూ ఉంటాను..తరిచి నా చేతల మీద మనసు పడ్డవారికి.

వసారాలో నేను ఒంటరిగా పుస్తకాలు, కాగితాలు
పరుచుకుని ఉండే సమయాల్లో
చెట్టు, గాలి సందడి చేస్తాయి
నాన్న ఈ నడుమే జీవితం చాలించారు, నాలో తిరిగి పెంచడం నేర్చుకున్నాను- మరో మహా వృక్షంగా...!

భూమి అంటే?

ఏమి కావాలి?
'చివురించే చెట్టు
ప్రవహించే వాగు
కురిసే మబ్బు
ఎగిసే పిట్ట
నేలని తడిపే వాన
మెల్లగా వీచే గాలి
ఎడతెరిపిలేని ఎండావెన్నెలలు
ఇవి మాత్రం చాలా!
ఇన్నిటినీ కాచే మనిషి కావద్దూ!?'
ఏనాడో ఇన్నీ ఇచ్చిన భూమి
ఈనాడు ఏవీ మిగలని ఆగామి ని
తలచి కుమిలినట్లు, అన్నీ కావాలి అని అరిచినట్లు...

అడవి దాటి అభయావాసం లోకి,
నేల వదిలి ఆకాశసౌధం లోకి
నడత మార్చిన మనిషికి
'భూమి అంటే
ఎండావానల స్నేహమని
పూలు గాలుల పాటలని
వెన్నెల్లో మెరిసే నదులని
ఎడతెగక కరిగే మంచుగుట్టలని
ఎండని దాచే ఎడారి ఒయాసిస్సులని
సంద్రాన ఊయలూగే మొప్పల బాలలని
పచ్చికలో పరుగిడే జీవులని
కొమ్మల్లో గూడు కట్టే ప్రాణులని
సమస్త విశ్వం కాచుకునే సృష్టి అని...
భూమి తల్లి మాత్రమే కాదు,
తప్పిపోయిన కూన కూడానని
వెదికి తెచ్చుకునే వారమని తలపోయద్దూ
ఎన్నిటినో కనిపెట్టే మానవమేధ
తన మూలాల్ని అంటిపెట్టుకుని ఉండొద్దా...?'
అని తెలిసిరావాలి, ఇదే కావాలి.

That road I travel daily


ఇప్పుడు యీ త్రోవ లోనే వస్తూ పోతూ ఉంటాను
తరుచుగా...
తొలిసారి అగమ్యగోచరంగా చీకాకుగా అనిపించింది
త్వరపడి
చేరాల్సిన స్థలి దిశగా, దృష్టి మారకుండా
దాటిపోయాను
ఏదో పోటీ పందెపు ఉద్విగ్నత
నాతో ప్రయాణిస్తూ ఉంది ఆనాడు


ఇంకొన్నాళ్ళు గడిచాక
ఏదో దేవాలయం ఉందని
వెదుకుతూ నిదానంగా సాగాను
బాట వెంబడి గురుతులు
పదిలంగా పోగేసుకుంటూ
వెళ్లిన పని ముగించేసరికి
ఏదో శాంతి నిండిన నిలకడ
నన్ను వెన్నంటి ఉంది ఆనాడు


కాలగమనాన ఇపుడు రోజూ ప్రయాణిస్తుంటాను
ఈ త్రోవలోకే పోవాలని చూస్తాను
కొన్ని దృశ్యాలు కుతూహలం గా గమనిస్తాను
కొందరి పయనం లోకి చూపు సారిస్తాను
కొన్ని వేగాలకి నివ్వెరపోతాను
ఎన్నో తెరలు తీసుకుని నాలోకి జారిపోతాను


త్రోవ మెలికలు తిరుగుతూ ఆటో ఇటో గమ్యాలకి
దారి తీయిస్తూ ఉంటుంది
నేనూ సుడులు తిరిగే యోచన వెంటా
పరుగులు తీస్తూ ఉంటాను
చీకాకు, నెప్పి, నవ్వు, బెంగ, పేరు తెలియని భావన
నా నుంచి విడివడి, తోడుగా ఉంటాయి


ఇప్పుడు క్రొత్త బాట ఎదురైనా తెలిసినట్లే ఉంటుంది
తెలియని దారులు పాత పరిచయాలుగానే అగపడతాయి

మరికాస్త ఆస్వాదిస్తే

ఎవరో నన్ను కౌముదికి తప్పా, వేరే పత్రికలకి పంపరా? అని నిష్టూమాడారు..కిరణ్ ప్రభ గారు- అరుదైన అభిరుచి కలిగిన సంపాదకులు,- ఒద్దికైన తీరు కలిగిన సాహిత్యాభిమాని. చాలా పదిలంగా భావన చెడని విధంగా మార్పులు చేస్తారు, విలువైన సమయం వెచ్చిస్తారు. అందుకు ఉదాహరణ, నేను పంపిన ఈ క్రింది పాదం లో తను చేసిన సూచన ప్రచురించిన కవితలో ఉంది. ఆపై, ఆయన సునిశితం గా నా అల్లికలోని బిగి కనిపెట్టిన తీరు నాకొక బంగారు మురుగు వంటి కానుక! నిజమైన ప్రోత్సాహం ఎలా ఉంటుందో అనేదానికి చిహ్నం...
"'మేఘాలు కరిగి నేలని తాకుతుంటే
మట్టి బంతులు చేసి కానుకిచ్చిన మురిపెం

తడి నేల మీద పాదాలు సాగుతుంటే
మనస్సు పసిపాపలా నవ్విన సత్యం' కవితలో అన్ని చరణాల్లోనూ మొదటి పాదంలోని అనుభవాన్ని రెండో పాదంలో అనుభూతితో పోల్చారు. బావుంది..
ఈ క్రింది చరణంలో మాత్రం మొదటి పాదంలోని వస్తువే రెండో పాదంలో రిపీట్ అయింది. అది మార్చి మిగతా పాదాలతో సరితూగేలా చేస్తే
మంచి కవిత అవుతుంది.. కౌముదిలో ప్రచురిద్దాం.." - కిరణ్ ప్రభ

మరికాస్త ఆస్వాదిస్తే
- మరువం ఉష
పసిపాప చూసి నవ్వగానే
గుండెల్లో పక్షులు వాలినట్లుగా హాయి,
చిటారుకొమ్మల్లో పిట్టలేవో పాడుతుంటే
తోటల్లో పిల్లగాలులు ఆడుకున్నంత శాంతి,
వాగు మీద గాలి అలలు ఊగుతుంటే
ఒడ్డున నావలు నాట్యమాడినట్లు ఊహ,
నావలో తెరచాప రెపరెపలాడుతుంటే
ఆకసాన మబ్బులు ఎగిరినట్లు భ్రాంతి,
మేఘాలు కరిగి నేలని తాకుతుంటే
మట్టి బంతులు చేసి కానుకిచ్చిన మురిపెం,
తడిమట్టి మీద అడుగులు వేస్తుంటే
మనస్సు పసిపాపలా నవ్విన సత్యం,
అనుభవం భావనగా మలచుకుంటే
గమనం నుంచి సాగే అనుభూతిది నిత్య గమనం
(ఫిబ్రవరి 2018 కౌముది పత్రికలో ప్రచురితం)

ఋతుభ్రమణంలో


లెక్కకి పాతిక వారాలు మా పూలసాగుకి-
ఈ యేటి మధుమాసపు వెచ్చనల్లో
మరోమారు ఉత్సాహపు పల్లవింపు
పడమర నేలలోనూ, నాలోనూ.

ఓ గ్రీష్మ సంధ్యాసమయాన పచ్చని మడుల్లో
లెక్క పెంచుతూ ఈ రెండు మొక్కలు.
కలుపుగా పెకిలించలేని నా తనం
వల్లమాలిన ప్రేమ ఉబికే ప్రతి వనమాలి వైనమే!

ఉదయారుణ కాంతిలో వాటినే చూసుకుంటాను
ఒకవైపు పసుపు పచ్చని పూలు
ఆ వంక చివురు మెత్తని మ్రోల
కలివిడిగా తిరుగుతూ గాలులు, నా మురిపాల వలెనే..

శరదృతువు రానున్న దండోరాతో
పెంచుకున్న పూరెక్కలు, వన్నె మారిన పండుటాకులు
కోలాటాలు కట్టి వీడు వదిలే వేళ
కలవరపాటుని కప్పిపుచ్చలేని నా కనులు, నేలలోని వేరులూ...

అయితేనేమి, శిశిరపు ఘడియని పక్కకి నెడుతూ
ముదురాకు కొమ్మలతో ఆ మొక్క,
మొగ్గ వెనుక మొగ్గగా పుష్పిస్తూ ఈ పూల తీగె
ఎవరివైతేనేమి ఎగురుతున్న ప్రకృతి బావుటాలు?

పదిలమైన గురుతుల దిగుబడి మోస్తూ
పదును తగ్గని పచ్చదనాలు మోస్తూ-
నేనూ,  నేలనంటిపెట్టుకున్న నా వలస మొక్కలు
పొగమంచు, లేతెండల పోరు చూస్తూనే ఉన్నామింకా...!

(కౌముది డిశంబర్ 2017 ప్రచురితం)