ఎనిమిదో చేప కథ

చేపా చేపా అంటూ నా మీద కథ కట్టి
అనగనగా అంటూ పాపతో ఊ కొట్టించి
ఏమయ్యా మనిషీ ఎన్నేళ్ళిలా?
విన్న నాకే వెగటాయే...
ఇక నేను ఓ కథ నీకు వినిపిస్తానిక

నేనున్న చెరువు నీళ్ళు మక్కువగా
మబ్బు రంగు పులుముకుని
ఒడ్డునున్న రాయి రప్పని ఒరుసుకుని
వెనక్కి ముందుకి వొళ్ళిరుసుకునే యేళ
నీలికళ్ళ చిన్నాడు వేటకనివచ్చినాడు

నా జతగాళ్ళు ఎగిసెగిసి పడి నవ్వినారు
ఏరా ఏరా ఎందుకు నవ్వినారంటే
చూడు చూడు అబ్బాయి వెనక చూడమనే
బంగారుఛాయ వొంటిదా ఆమె కురులదాన్నట్లు
చూడచక్కని చిన్నది వయ్యారి నడకల వచ్చినాది

పిలగాని చేయి గేలం నా వైపు విసిరితే
సొగసరి చూపు వల వాని వంక విసిరేను
చేత చిక్కిన నను చలాగ్గ తిరిగి నీట విసిరే ఆ యువ జాలరి
వోరకంట చిక్కిన చెలికాని పెదవి పంటి క్రింద నొక్కే నా సింగారి
ఇది కదా ఎప్పటి కథ అని నా జతగాళ్ళు మళ్ళీ కిసుక్కుమనే

ఈ సిత్రాలు చూడను చుక్కపొద్దాయే
సందమామ నడుమ సర్దుకుని కళ్ళిప్పి చూసేను
ఇసుక పక్క మీద ఆ పడుచుజంట చేయి చేయి కలిపి
కనుల వెన్నెల్లు, కబుర్ల తెమ్మెరలు కలబోసుకుని
వలపు వొలకబోస్తే చుక్కంటి ఓ చేపపడుచు నా వంక కనుగీటి నవ్వేను.

The inspiration behind this poem.


One of our sub-contractors come on Fri to do fishing. he catches and throws them back. Last week he caught a foot long 1/2 foot wide fish, I took pic of it and we let it go in to waters. that's it. His girl friend and him were enjoying after fishing on a moonlit night lying down on the sand I put to mimic a beach near the lake and it is so nice to observe them watching the skies and whisper to each other in smiles. I am so spell bound for the magic of bonding two hearts make. A feel that I could see from the eyes of nature. Hence took fish to tell this on my behalf.

విశ్వామిత్ర 4 - ఆ నలుగురు

మరో ఆర్నెల్లు గడిచాయి. సుబ్బాలు వచ్చి ఐదు నెలలైంది. పట్నపువాసానికి అలవాటు పడింది. శోభ, అమృతలతో మరింత స్నేహం దృఢపడింది. అప్పుడప్పుడు ఆదివారాలు ఎవరో ఒకరింట్లో కలవటం జరుగుతుంది. శోభ కన్నడిగ. చదరంగంలో మంచి నిష్ణాతురాలు. మిత్రాకి పట్టుపట్టి నేర్పించింది. అమృత మీరట్ నుండి వచ్చింది. వంటల్లో దిట్ట. మంచి మాటకారి. రోజు మిత్ర ఇంట్లో కలిసారు. భోజనాలయ్యాక మాటల్లో పెళ్ళి ప్రసక్తి వచ్చింది.

సంభాషణ ఎక్కువగా ఇంగ్లీష్ లోను, హిందీ లోను సాగుతుంది. సుబ్బాలు కూడా అక్కడే కూర్చునికుతూహలంగాచూస్తూ కూర్చుంది. మిత్ర సుబ్బాలు విషయం చెప్పింది. ఇద్దరూ సానుభూతిగా చూసారు. మాటలేమీ అర్థం కానీ సుబ్బాలు నవ్వుతూ చూస్తూ కూర్చుంది. సాయంత్రం వరకు వుండి వాళ్ళెల్లిపోయినా ఎడతెగని ఆలోచనలతో కాస్త అలసటగా అలాగే కూర్చుండిపోయింది మిత్ర.

రాత్రికి ఏమీ తిననని గ్లాసుడు పాలలో చిటికెడు తేనె కలుపుకుని, నెమ్మదిగా డాబా మీదకి చేరి ప్రక్కగాకూర్చుంది. ఆకాశంలో మిల మిల మెరుస్తూ తారలు. పున్నమికి చేరువగానున్న చంద్రుడు. ఏవేవో ఆలోచనలు ఆ లెక్కలేనన్ని చుక్కలకిమల్లేనే తన మనసులో.

సుబ్బాలు, నలుపైనా చక్కటి కళవుట్టిపడే మనిషి. నవ్వితే ముత్యాల్లా మెరిసే పలువరస. అమాయకంగా మాట్లాడేతీరు. భర్త చేతిలో శారీరకహింసకి గురై, దాదాపు అపస్మారక స్థితిలో తనకి పన్నెండేళ్ళవయసప్పుడు రాత్రి తమ గుమ్మం ముందుకి వచ్చింది సుబ్బాలు. అప్పటికి సుమారు ముప్పైయేళ్ల మనిషని నానమ్మ చెప్పేది. తాతగారే వైద్యం చేయించి కోలుకున్నాక వివరాలు అడిగినా చెప్పటానికి ఇష్టపడలేదు[]. వాళ్ళవాళ్ళూ వెదుక్కుంటూ మరోమూణ్ణెల్లకి వచ్చినా ససేమిరా వెళ్ళనని మొండికేసి బలవంతంగా పంపితే చావనైనా చస్తాను కానీ ఇక అతనితో నాకు సంబంధం వద్దని తెగేసి చెప్పేసిందట.

తన దగ్గరే నెమ్మదిగా చదవటం వ్రాయటం నేర్చుకుంది. ఇప్పుడు వారపత్రికలు చదవగలదు. చురుకు ఎక్కువ. ఇప్పుడు హిందీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైనా కళ్ళనీళ్ళు పెట్టుకుని గతించిపోయిన మాటలు చెప్తుంది. అక్కడక్కడా కాల్చిన మచ్చలు. తనే ఇందాక "మళ్ళీపెళ్ళిచేసుకో" అని ప్రసక్తి తెస్తే నవ్వేసింది.

"పదేళ్ళ నాడే మారు మనువన్నపుడు యాభైఏళ్ళున్న మా బావకి మా అక్క వుండగానే దానికి కంటిచూపు తగ్గిందని, నన్ను చేయమని అడిగారు మిత్రమ్మా. తాతగారే కేకలేసి పంపేసారు. ఇక ఇప్పుడు కాటికి కాలు చాచిన ముసలోడు వస్తాడు. ఎందుకమ్మా నాకీ లంపటాలు హాయిమంటూవున్నాను. దేముడే అన్నీ చూస్తాడు." అంది.

నిజమే. సుబ్బాలు మానసికపరిణితి దృష్ట్యా ఎక్కువ ఆలోచనలు వుండవు. రేపు అన్నది తనకి అంత ముఖ్యం కాదు. తనకి తోడు అన్నది ప్రక్క మనిషిలో చూసుకుంటుంది. అది ఒక పురుషుడే కానవసరం లేదు. తను అలా వుండగలదా? ఎప్పటికీ ఇలా ఒంటరిగా .. ఏమో తన ఆలోచన సరైనదేనా?

శోభకి తల్లి లేదు, ముభావంగా వుండే తండ్రి. చనువు పెరగనీయని మారుటితల్లి. కళాశాలలో పరిచయమయిన సుధీర్ ని ప్రేమించి, ఉత్తరాది వాడని ఇంట్ళో వారు అభ్యంతరపెట్టినా తన నిర్ణయం మార్చుకోలేదు. వచ్చే నెలలో పెళ్ళి. మధ్యాహ్నం మాటల్లో చెప్పింది.

"ఇప్పటివరకు విషయంలోను నన్ను వత్తిడి పెట్టలేదు. మా మధ్య సరైన అవగాహన కలగటానికి ఇద్దరి ప్రయత్నమూ వుంది. ఎప్పటికీ మా మధ్య స్నేహమన్నది వీడదు. ఇది మేము ఒకరినొకరు కావాలనుకున్న నిర్ణయం తప్పితే ఒకరికొరకు ఒకరం మారాలన్న నియమం కాదు." మాటల్లో ఎంత ఆత్మ విశ్వాసం?

అమృత విడాకులు తీసుకుని పదేళ్ళు కావస్తుంది. ఇద్దరు పిల్లలు తనతోనే వుంటారు. చిన్నవాడు బాబుపుట్టినసంవత్సరానికి మరొక స్త్రీని తీసుకువచ్చి, "పెద్దల మాట కాదనలేక నిన్ను వివాహం చేసుకోవాల్సివచ్చింది. కోమల్ నేను మన వివాహానికి ముందే దగ్గరయ్యాం. ఇప్పుడు విడాకులు అడుగుతున్నాను" అన్న అతని మాటల్తో ఐదేళ్ల తమ కాపురంలో అతని అంటీముట్టని స్వభావానికి అర్థం గ్రహించి ఇల్లు వదిలి బయటకి వచ్చేసింది. అప్పటికే ఉద్యోగం చేస్తుంది కనుక పిల్లల పోషణ భారం కాలేదు. కానీ ఒక్కతే అన్ని సంభాళించుకురావటం చాల కష్టమైందని, పెద్ద వయసులోనున్న తల్లి, తండ్రీ అంతగా తనకి సాయపడలేకపోయారని చెప్పింది.

పిల్లలిద్దరూ చక్కని మానర్స్ చూపుతారు. తల్లి పట్ల ఆపేక్ష. అపుడపుడూ వచ్చే తండ్రిని ఒక అథిదిగా మాత్రమేచూస్తారట. నాకంటూ సమయం మిగలదు. ఆలోచన చేసే తీరికా లేదు. ఇప్పటికి నా జీవితం తల్లి పాత్రకి పరిమితం. భార్య పాత్ర నాకు ఎక్కువగా ఇవ్వలేదు బాలాజీ అంటూ నవ్వినా కళ్ళలో నిర్వేదం తన చూపుకి ఇట్టే తెలిసిపోయింది. అందం, చదువు, ఉద్యోగం, వ్యక్తిత్వం వున్న ఆమె జీవితం ఎందుకిలా అసంపూర్ణమయింది? ఎవరిని నిందించాలి. పెద్దలని ఒప్పించలేక పెళ్ళి పేరిట ఆమె జీవితంతో ఆడుకున్న అతనినా? పిల్లల పట్ల మమకారం తో తన జీవితాన్ని పణం గా పెట్టిన ఆమెనా? తండ్రి సంరక్షణ లేని పిల్లలో ఏదైనా అభద్రతాభావన కలిగితే అది ఎవరి భాద్యత? అసలు మన వివాహ వ్యవస్థలోనే మార్పు రావాలా?

నవీన పెళ్లై సిడ్నీకి వెళ్ళిపోయింది. తనలో మార్పు చాలా ఆశ్చర్యంగా వుంది. భర్త భరత్ కోసం ఎన్నోపద్దతులుమార్చుకుంటుంది. సర్దుబాట్లు అలవాటు చేసుకుంది. చిన్న చిన్న విషయాలకి అందరి మీద విరుచుకుపడేనవీయేనా ఇంతగా మారింది. ఫోనులో మాట్లాడే మాటల్లో సగం పైన అతని గురించే. అతన్ని తను చూసినంతలోఆధునిక భావాలతో కనిపించాడు. నవీ మీద వత్తిడి తెచ్చే వ్యక్తిలా కనిపించలేదు. ఇది అతని అనురాగ ప్రభావమా? లేక క్రొత్తదనం కోరుకున్న నవీ మనస్తత్వమా? తన లో మార్పుకి పెళ్ళి దోహదపడిందే కానీ పూర్తిగా కారణం కాదా?

తలంతా భారంగావుంది. సుబ్బాలు, శోభ, అమృత , నవీ - నలుగురు తన మీద ఏదో ప్రభావం చూపుతున్నారు. వివాహం పట్ల కుతూహలం, విముఖత రెండూ కల్గిస్తున్నారు.

"అమ్మలు గారండీ, ఇంకెంతసేపలా కూర్చుంటారు?" అన్న సుబ్బాలు అరుపుతో లేచి క్రిందకి వచ్చింది.

"నలిగిపోయావు తల్లీ" అంటూ ఉప్పు తిప్పి పారేసింది. వద్దన్నా వినదు. నెమ్మదిగా మంచం మీదకి చేరి ఆలోచనలోనే నిద్రకుపక్రమించింది.

"మర్చిపోయానమ్మా! ఇందాక విశ్వం బాబు వచ్చారమ్మ విష్ణు వున్నాడా అంటూ. లేరంటే, లోపలికి రమ్మన్నా వద్దని గుమ్మంలోంచే వెళ్ళిపోయారు. మహా సిగ్గరి." అని అంది.

"నిజమేనే ఇన్ని నెలలైనా అతనంతే" ప్రక్కకి తిరిగి పడుకుంటూ అంది. చిత్రమైన మనిషి. విష్ణుతో ఫర్వాలేదు. తనతోనే మరీ దూరం దూరం గా మెసులుతాడు. స్వగతంగా అనుకుంది. మరో ఐదు నిమిషాల్లో నిద్రలోకి జారిపోయింది.

****************************************************************
అదే సమయానికి, సుమారు రాత్రి పది కావస్తుంది. రెండు చేతులూ మడిచి తలక్రింద పెట్టుకుని పడుకుని ఏదోసాలోచనలో పడ్డాడు. ఎందుకు మిత్ర తన మనిషిగా తోస్తుంది? "ప్చ్ సాయంత్రం తను కనపడలేదు. లోపలికి వెళ్ళటానికి కారణం కనపడక వచ్చేసాను". ఎంత చిత్రం ఒక మనిషి నాలుగు విధాలుగా తనని ప్రభావితం చేస్తుంది.

మొదటిసారి తన రూపు చూసే ఆకర్షించబడ్డాడు. ఇప్పటికీ ఆవిషయాన్ని నిజాయితిగానే ఒప్పుకుంటాడు తను. అందం అంతా పెదవి వంపులో వుంది. సన్నగా విచ్చుకునే పెదాలు, నవ్వేప్పుడు వంపు తిరిగే పెదాలు. మూసుకుపోయే చిన్న కళ్ళు. సందేహంలేదు ఆమెది చక్కని అందం. అప్రయత్నంగా తన సాధారణ రూపం గుర్తుకు వచ్చింది. తనది వంటి ఛాయా తక్కువే. ఆమెది గంధపు చెక్క మాదిరి నిగారింపున్న రంగు. కానీ తనని పట్టివుంచున్నది అందమ్ ఒక్కటే కాదు. అంతకు మించి మరేదో తనని ఆమె పట్ల ఆసక్తి పెంచుకునేలా చేస్తుంది. ఇన్నిరోజులుగా గమనిస్తున్నాడు.

తను వచ్చిన చోట ఏదో హుషారు నింపేస్తుంది. పెద్దల్నీ చిన్నవార్నీ కలేసి కలుపుగోలుగా మాట్లాడేస్తూ గలగలాడుతూ అలాగే చూస్తూవుండిపోవాలనిపిస్తుంటుంది. ఎప్పుడూ ఏదోఒక పాట నోటినుండి కూనిరాగంగా పలుకుతూనే వుంటుంది. దృష్టి తన మీద నుండి మళ్ళించటం కష్టమైపోతుంది. మధ్య తన స్నేహితుడు హర్ష అమెరికా నుండి వచ్చినపుడు వారిద్దరి మధ్య జరిగిన చర్చలో ఆమె ఎంత స్పష్టం గా, తన అభిప్రాయాన్ని తెలియజేసింది. తను, విష్ణు చర్చలో వున్నా కూడా వాదనలో వారిద్దరిదీ బలమైన వాదోపవాదం. అప్పుడే విష్ణు చెప్పాడు తనకి వక్తృత్వం, వ్యాసరచనల్లో రాష్టృస్థాయి బహుమతులు వచ్చాయని. ఆమెలోని ధీరవనిత లక్షణం చూస్తే ముచ్చటేస్తుంది.

వర్థని ఆంటీ తో మాట్లాడేటప్పుడు ఆథ్యాత్మిక పరమైన ఎన్నో విషయాలు వాళ్ళిద్దరు మాట్లాడుకుంతుంటారు. తనలెక్చరర్ సుమతి గారి మూలంగా తనకి విషయాల పట్ల అవగాహన వచ్చిందని, పుస్త పఠనం, ధ్యానం మరి కాస్తపురోగతిని కల్పించాయని చెప్పింది. సత్సంగ్ అనీ, ఆత్మశోధన అని ఎంతో అనుభవసారం గడించిన పెద్దవారిలామాట్లాడేస్తుంటే తనకి ఆశ్చర్యంగా వుంటుంది. అన్నింటికీ మించి తన జ్ఞాపకశక్తి అమోఘం. చిన్నప్పటి పద్యాలతో సహా గుర్తే. యోగ సాధన కూడా ఎంతో నిష్టగా, క్రమంగా చేయటం గమనించాడు. ప్రతి దాన్ని ముందుగా అనుకున్న తీరులో చేస్తుంది. అంత నిబద్దత తనలో ఏనాడూ లేదు. మనసుకి తోచింది చేసేయటమే కాని. అవును ఎందుకు తన ఇలా తమిద్దరినీ పోల్చి చూస్తున్నాడు. అతని పెదాల మీదకి నవ్వు దూసుకువచ్చింది.

ప్రక్క ఉద్యోగం చేస్తూనే సామాజిక సేవా సంస్థ ఒకదానికి వాలంటీర్ గా వెళ్తుంటుంది. ఎంతో అంకితభావంతోఆకార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకుంటుంది. ప్రక్కవారిని ఉత్సాహపరుస్తూ అలసట కనపడనీయకుండాపనిచేస్తుంది. రెండు మూడు సార్లు విష్ణుతో కలిసి వెళ్ళాడు. మిగిలినవారంతా కూడా మిత్ర ఇదిలా వుంది, మరి అలాగ చేద్దాం అంటూ తనని సంప్రదిస్తూనేవున్నారు. ఒక్క లక్షణం తనని ఇప్పటికీ అబ్బుర పరుస్తుంది. ఒక్కతే కూతురు, అదీ కలవారి కుటుంబం. తనకి వ్యక్తిత్వం ఎలా అలవడింది. విషయాలన్నీ చాలా సహజంగా తన జీవితంలో భాగంగా ఎలా మలుచుకుంది!

మిత్ర - అందం, ధీరగుణం, ఆథ్యాత్మికత, సేవాతత్పరత. అన్నిటా తనలోని అంకితభావం, స్పష్టత, జంకులేనితనం, స్నేహం కోరే గుణం - నాలుగు రూపాల్లో తనని పూర్తిగా ఆమె వైపుకు తిప్పుకున్న అందాల అతివ. విశ్వాకి చిత్రలేఖనంలో మంచి ప్రవేశం వుంది. నిద్ర పట్టేట్లు లేదని, లేచి ఆమె చిత్రిస్తూ దాదాపు తెల్లవార్లూ అలాగే గడిపేసాడు. మిత్ర తన ఇంటిలో లేచి ఉదయం ధ్యానం చేసుకునే సమయానికి విశ్వ మూసుకుపోతున్న కళ్ళతో మంచం మీదకి చేరాడు. అతని కళ్ళ నిండా ఆమె రూపే!!!!!!!!

ఆరని దీపం

తవ్వి తోడి పారేద్దామన్న
నీ జ్ఞాపకాల్లో నేనే మునిగిపోయాను

పూడిక తీయని ఆ లోతుబావిలో
వూపిరి సలపక సొమ్మసిల్లిపోయాను

పాతాళజలలో శీతలమై

నీ మమత నను కలిసింది

అలముకున్న ఆ నీటి నీడల్లో

నీ నవ్వు నను కదిపింది

ఆ నిశీధి నీరవంలో

నీ మాట తోడై రాగం పలికింది

ఎదుట నిన్ను చూసి

ఎప్పటిమాదిరి తెప్పరిల్లాను

చెమ్మగిల్లిన కనుల

నీ అరచేతుల్లొ సేదదీరాను

మౌనంగా నను లాలించు

నీ ఆత్మీయతలో తనువుమరిచాను

నేనుగా ముగిసి

నీ ప్రతిమగా మారిపోయాను

నీలోసగం నాలోసగం ఉనికితో

ప్రేమ కోటికాంతుల దివ్వె తానైంది

క్షతగాత్రురాలు

సంధి వలదని సమరం నీవె కోరితివి
అస్త్రశస్త్రాల సంభారమూ నీదైనది
నీవు పరిచిన అంపశయ్య మీద నేను
నీ జ్ఞాపకాల బాణపు గాయంతో
ఎంతకూ రాని సంక్రమణానికై
ఇన్ని యుగాంతాల ఎదురుచూపులో
నీ అనురాగ గంగాతీర్థం గుండె తడుపుతుంటే
ఏ ఏకాదశికో నీవే సర్వాంతర్యామివై
ప్రేమ సహస్ర నామాల నన్నలరిస్తావని

విశ్వామిత్ర ౩ - చూపులు కలిసిన శుభవేళ


సుమారుగా ఏడేళ్ల క్రితం విశ్వ డైరీలో ఓ పేజీ:

ఈ రోజు తను మళ్ళీ కనపడింది. విష్ణు ఇంటిలో పునర్దర్శనం. చాలా ఆనందంగా వుంది. మొదటిసారి చూసినపుడు అక్క పెళ్ళి సందడి. ఎవరు ఎవరన్నది తెలియదు, కానీ మళ్ళీ చూడాలనిపించే ఆ నవ్వుతో అంతమందిలోను ఒక్కసారిగా ఆకర్షణలో ముంచేసింది.

మొదటిసారి నా మొహమాటం మీద నాకు కోపం వచ్చింది, తనని గురించి కనుక్కోకుండానే పెళ్ళి అయిపోయింది. కొన్నిరోజులు గుర్తుకు వచ్చేది. మర్చిపోయానా, మర్చిపోవాలని ప్రయత్నించానా నాకు తెలియదు, కానీ ఇన్నిరోజులకి ఇంత హఠాత్తుగా కలవటం.

"మిత్రవింద"

క్రొత్తగా వుంది పేరు. అక్కకి వరసకి పినమావగారి అమ్మాయట. సల్వార్ కమీజ్ లో కాజువల్ గా వుంది. వుంగరాల జుట్టు మొహమ్మీద పడుతుంటే అలవోకగా వెనక్కి సర్దుకుంటూ సన్న గొంతుతో మాట్లాడుతూ ఓ ప్రక్కగా వొరిగి కూర్చున్న తనని ఒక్కసారి తలెత్తి చూసానా? గడ్డం మీద పుట్టుమచ్చ. మాట్లాడేప్పుడు గడ్డం క్రింద చిన్న చొట్ట. ఎందుకో కళ్ళలోకి చూడలేకపోయాను. బిడియస్తుడు అనుకుందేమో. మళ్ళీ కలవాలని వుంది. కళ్ళలోకి చూడాలనివుంది. ఇదేమి భావన. ప్రేమ అంటారు ఇదేనా.



********************************************************


విశ్వ డైరీలో ఆ పేజీ వ్రాసిన కొద్దిరోజులకి ఓ ఆదివారం. మధ్యాహ్నం భోజనానికి వచ్చింది మిత్ర. విష్ణు అమ్మగారు వర్ధని గారికి వండటం, వడ్డించటం రెండూ ఇష్టమే. సాయంత్రం ఆరు అయినా ఇంకా ఎండతీవ్రత తగ్గలేదు. వర్ధని గారు ఇచ్చిన సన్నజాజులు, ఉప్మా డబ్బా తీసుకుని "వస్తానండి" అంటూ గుమ్మం దాటింది. తోడుగా వస్తున్న విష్ణుతో నెమ్మదిగా నడుస్తూ మాట్లాడుకుంటున్నారు. ఎక్కువగా వూర్లు తిరిగే ఉద్యోగం మూలంగా ఇంటిపట్టున వుండటం తక్కువతనికి.

"మిత్ర! విస్సు పరిచయం అయ్యాడట. అమ్మ చెప్పింది. నిదానస్తుడు కాని మంచివాడు. ఏ సహాయం కావాలన్నా మొహమాటపడకు. పైగా మీకు బంధుత్వం కూడ వుంది. అమ్మకి చాలా చేదోడువాదోడుగా వుంటాడు. వాడి మూలంగానే అమ్మ ఆరోగ్యం తక్కువైనా నేను అలా నిశ్చింతగా తిరగగలుగుతున్నాను."

"ఫర్వాలేదు విష్ణు. అలవాటైపోయింది. ఆఫీసులో పరిచాయాలు అవుతున్నాయి. ప్రక్క వీధే కదా. మీ అమ్మగారు వుంటారు. అయినా చిన్న పిల్లనా" నవ్వేస్తూ అంది మిత్ర.

"ఇంకేంమిటి కబుర్లు." విష్ణు మాట పూర్తయ్యేలోగానే మిత్ర వడివడిగా ముందుకు నడిచి క్రింద పడిన ఓ చిన్నారిని లేవనెత్తి, బుజ్జగిస్తూ కనపడింది. ఇప్పుడే కాదు ఎప్పుడూ ఇంతే. ఎలా అలవడింది ఇంతగా ఒకరికోసం ఆలోచించే తీరు. ఎంత గారంగా పెరిగినా అంత అణకువ అని అమ్మ ఎన్నిసార్లు అంటుందో.

"సుబ్బాల్ని నాకు తోడుగా పంపుతున్నారు. తాత గారు వద్దన్నా వినిపించుకోవటం లేదు. వచ్చే వారం వెళ్ళినపుడు నాతో తీసుకువస్తాను" మాటల్లోనే మిత్ర అద్దెకి తీసుకున్న ఇంటికి చేరారు. "విస్సుని కూడా కలవాలి. ఇక వెళ్తాను మరి" అంటూ గుమ్మం లోంచే వెనక్కి తిరిగాడు.



********************************************************



మరొక నెలా నెలన్నరకి, ఈ సంఘటన జరిగింది.

కాలింగ్ బెల్ మ్రోగుతుంటే చదువుతున్న పుస్తకంతోనే వెళ్ళి తలుపుతీసింది. ఎదురుగా విస్సు. "విష్ణు చెప్పాడు, కంప్యూటర్ లో ఏదో ప్రాబ్లం అన్నాడు" తడబడుతున్నట్లు, కళ్ళు దించుకునే అన్నాడు. ప్రక్కకి జరిగి "రండి" అంటూ లోనికి దారి తీసింది.

దాదాపు గంట పట్టింది అతనికి ఫిక్స్ చేయటానికి. పొడి పొడి మాటలు. మధ్యలో "ఇఫ్ యు డోంట్ మైండ్" అంటూ గది బయట పిట్టగోడనానుకుని సిగరెట్ కోసం ఓ పది నిమిషాలు గడిపాడు. ఒకసారి కాఫీ కలిపి ఇచ్చింది. దుస్తుల మీద శ్రద్ద తక్కువనుకుంట. నలిగిన టీ షర్ట్. మాచింగ్ సరిగ్గాలేని పాంట్. నిర్లక్ష్యంగా వదిలేసిన జుట్టు. సాదాసీదాగా వున్నాడు. నిజానికి ఏ ప్రత్యేకత కనపడలేదతనిలో.

తనే మాటలు కలపటానికని వివరాలడిగింది. విశ్వనాథ్ అట. పేరు మాత్రం నచ్చింది. అనంత వదినకి ఇతనికి అసలు రూపులో కానీ, మాట తీరులో కానీ పోలికే లేదు. అతను వెళ్ళిపోయాక నాలుగు అగరవత్తులు వెలిగించింది.



********************************************************



అదే రోజు రాత్రి సుమారు 11 గంటలకి కిటికీ ప్రక్కగా కూర్చుని ఆకాశాన్ని తదేకంగా చూస్తూ కాసేపు గడిపాక, మిత్ర తన ప్రాణమిత్రురాలు నవీ(న)కి ఉత్తరం వ్రాయటం పూర్తిచేసి, బద్దకంగా వళ్ళు విరుచుకుని మళ్ళీ ఒక్కసారి చదివి చూసుకుంది.

నవీ,

ఎలా వున్నావే? అప్పుడే నేనీ వూరు వచ్చి మూడు నెలలై పోయింది. మన మధ్య ఉత్తరాలు తగ్గిపోతున్నాయి కదు. వ్రాసే తీరిక లేదా అని నిష్టూరాలాడకు. క్రొత్త ప్రదేశం, ఒంటరి జీవితం ఇలా ఒకటొకటి అలవాటు కావాలి కదా?

విష్ణు గురించి మునుపటి ఉత్తరంలో వ్రాసాను కదా. వాళ్ళ అమ్మగారు వర్ధని ఆంటి నాకు చాలా నచ్చారు. ఇద్దరం బాగా కలిసిపోయాం. ఉదయాన్నే యోగా చేస్తున్నాము. వంట నేర్పుతున్నారు. విష్ణు స్నేహితుడు విస్సు పరిచయం అయ్యాడు. విశ్వనాథ్ అసలు పేరు. మా రాఘవ చిన్నాన్న గుర్తున్నారా? నాకు లోకల్ గార్డియన్. వాళ్లబ్బాయ్ దేవేంద్ర అన్నయ్యకి బావమరిది. ఆఫీసులో శోభ, అమృత కాస్త పరిచయమైన వారిలో నేను చనువుగా మెలిగేది. కోటేష్ అని వున్నాడు. కాస్త విసిగిస్తున్నాడు.

మనిద్దరం కలిసి పుస్తకాలు చదివేవాళ్లం, కాసేపు అందులోని పాత్రల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు నాకు అవి, వాటికి నేను తోడు. సుమతి మేడం మాటలు ఇంకా నన్ను వదలలేదు. అలా అని అప్పుడే పెళ్ళికి మానసికంగా సిద్దంగా లేను. నిజానికి ఆ విషయం గురించి అప్పుడే ఆలోచించాలనిలేదు.

నీ విషయాలతో వ్రాయి.

-మిత్ర

మన చుట్టరికం?

బొల్లోజు బాబా గారి కవిత నాకు అర్థం కాదు ...... ఇచ్చిన స్ఫూర్తి -
******************************************
నేను విడిచి వచ్చిన బాల్యం
నన్ను విడవని నీలో సాక్షాత్కారం.
నీవు నన్ను చేరుసరికి
నా కనులు మూసున్నాయో ఏమో?
అందుకే నీ మృదుస్పర్శ తప్ప
రంగు మాసిన నీ రూపు నాకంటికానదు.
ఆ కంటినీరు తుడవను నీవు కాక
నాకెవరూ లేను కూడా లేరు.

ఆ ప్రక్క అమ్మ, ఈ ప్రక్క నువ్వు
నాకు తెలిసింది అమ్మ మాట చల్లన
నీవొడి మరింత చల్లన అని.
కన్నియ కలలు నిన్ను హత్తుకుని
వలపు వలువగ నిన్నే చుట్టుకున్నాను
అతని పేరు ముందుగా నీకే తెలిపాను
ఆ అధరం అద్దిన ముద్దు నీకూ రుచి చూపాను
తన కౌగిట నిన్నూ జత కలిపాను

విరహాన నిన్నూ వేగించాను

వినోదానా నిను మరువలేదు.
నాతో ప్రసవ వేదన నీవూ పడ్డావు
నా పురిటికందుని నీవె అద్దుకున్నావు.
ఎన్నిమార్లు వోడేసి పిండారో
నీ మెత్తని తనువెంత తల్లడిల్లెనో.
నన్ను నిన్ను దూరం చేసిన కసాయి గుండెలెన్నో
కాళికనై కరకుదేలి నిను చెంతచేర్చున్నాను.

నీ చిరుగుల్లో నేను చలించాను.

నా అతుకుల్లో నీవు చెమ్మగిల్లావు.
నీవు చీకిపోయావు
నేనూ ముగిసిపోతానేమో?
అందుకే ఆఖరి కోరికగా నాకు
నిన్నే కట్టి సాగనంపమన్నాను
ఎవరడిగినా లెక్కచేయని తెగువతో
నొక్కి చెప్తాను నీవు నా " సిల్కు దుప్పటి" వని.

పదం నేర్చి, పాదం కూర్చి, పథం పరిచి.. మరి ఆపై?

ఆశలు ఆలోచనలు అక్షయపాత్రలు
కలలు కన్నీళ్ళూ కావడికుండలు

కాలం నింపేటి జీవిత
పుటలు
సగం చెక్కి వదిలిన శిల్పాలు

గతం దాచుకున్న లంకెబిందెలు
భవిత అల్లుతున్న పడుగుపేకలు

ఆనంద శిఖరారోహణ అధిరోహణలు
విచలిత మనస్క అవరోహణలు

విభ్రమ తారసిల్లిన మోహావేశాలు
క్షమ మోసుకొస్తున్న ప్రేమానురాగాలు

రాజసమున భాసిల్లు అనుభూతులు
తామసమున బాధించు నిట్టూర్పులు

సాత్త్వమున మమేకమైన రెండు జీవితాలు
సంప్రీత హృదయాల అనుసంధానాలు

విశ్వామిత్ర 2 - రూపకల్పన

ఆ వీధిలో సింహాలగేటు ఇల్లు అంటే తెలియనివారుండరు. దాని ప్రక్కనే చిన్న డాబా ఇల్లు. గుమ్మం నుండి ముందు వసారా వరకు పాకించిన గిన్నెమాలతి తీగ, అటునుండి ఇటు పాకించిన సన్నజాజి తీగ. గుమ్మం వరకు సన్నని బాట. ముందు గదిలో నుండి వినిపిస్తున్న శ్రావ్యమైన సంగీతం. ఓ వారగా గోడకి చేరగిలబడి కూర్చుని, సన్నగా మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరిని చూడగానే వారి నడుమనున్న సన్నిహితత్వం అర్థమైపోతుంది.


నడివయస్కురాలి ఎదురుగా పాతికేళ్ళలోపు యువతి. ఒకరి కళ్ళలో ఆపేక్ష, మరొకరి కళ్ళలో అభిమానం. "మిత్ర, చాలా సంతోషంగా వుందమ్మా. అనుకున్నది సాధించావు. నీమీద నేను పెట్టుకున్న అంచనాలు తప్పలేదు". ఆ మాటలు అన్నది మిత్రాకి అమితమైన ఇష్టమైన సుమతి మేడం. ఆవిడకి అభిమాన శిష్యురాలు.


కళాశాలలో చేరిన మొదటి రోజు నుండి తన చురుకుదనంతో ఆవిడని ఆకట్టుకుంది మిత్ర. అందరికీ హడలుపుట్టించే ఆవిడకి ఒకవిధమైన ఆకర్షణీయమైన నవ్వుతో, ఆత్మవిశ్వాసం తొణికిసలాడే నడతతో ప్రీతిపాత్రురాలైపోయింది. అది మొదలు ఈ రోజు వరకు మిత్ర వున్నత విద్యాభ్యాసంలో ఆవిడ పాత్ర ఎంతోవుంది. స్నేహితులంతా "సుమతీ శతకం బట్టీయం వేసావా?" అని ఆట పట్టించినా, ఇంతకాలం ఆ అనుబంధాన్ని నిలుపుకోవటంలో ఇద్దరి వంతు వుంది.


"ఉద్యోగంలో చేరబోతున్నావు, అదో జీవితం, పోటీ లోకం, కాని నువ్వు వృత్తిపరమైన ఏ విషయంలోనైనా రాణించగలవు..." ఎందుకో అర్థోక్తిగా ఆగిపోయినట్లనిపించింది. అలవాటుగా కుడిచేతి చూపుడు వేలితో ఎడమ అరచేతిలో సున్నాలు చుడుతూ వింటున్న మిత్ర తలెత్తి పరీక్షగా ఆవిడ మొహంలోకి చూసింది. ఏదో తెలియని విచారం. "మేడం! ఏమిటలా వున్నారు? ఉదయం నుండి ఉపవాసమున్నారు, నీరసంగా వుందేమో. కొంచం బత్తాయి రసం తీయనా?" మిత్రా ఆ మాట అంటూనే లోనికి దారి తీసింది.


మరొక పది నిమిషాల్లో చెరొక గ్లాసులో రసం తీసుకుని పెరటి వైపుగా నడిచి, బొడ్డుమల్లి కుదురు ప్రక్కగా వున్న సిమెంట్ అరుగు మీద కూర్చున్నారు. "ఊ ఇప్పుడు చెప్పండి, నేనొక అరగంటలో బయల్దేరకపోతే నానమ్మ కంగారుపడుతుంది, మీకు తెలిసిందే కదా. కానీ మీరిలావుంటే నేను వెళ్ళను" గొంతులో మారాము ధ్వనించింది. "తాతగారు మొన్న ఫోను చేసారు. పెళ్ళికి విముఖత చూపుతున్నావట. నిజమేనా?" ఆశ్చర్యంగా చూసింది. అవివాహిత అయిన మేడం తనని అలా అడుగుతున్నారేం లోలోపల సందిగ్దత.


"మిత్ర, నాకు తెలుసు. నీ మనసులో కదలాడుతున్న ఆలోచన." సన్నగా నవ్వేసారు. కోరారంగు గద్వాల్ చీర, ముత్యాల గొలుసు, చెవులకి ఏడురాళ్ళ పోగులు, ముక్కుకి సన్న ముక్కు పుడక, చూడగానే హుందాతనం ఉట్టిపడే ఆవిడ నవ్వులో సందె వెలుగుకి మెరిసే ముక్కెర మెరుపు కలిసి అదో అందం. రసం చివరి గుక్క పూర్తి చేసి గ్లాసు క్రింద పెట్టి, కొద్దిగా కొమ్మల నుండి వీస్తున్న గాలికి కొంగు భుజం చుట్టూత్ర్రిప్పి కప్పుకుని, తిరిగి సంభాషణ కొనసాగించారు.


"నీ వయసులో దేన్నైనా సాధించగలనన్న ధీమా, అక్కని బావ పెట్టిన కష్టాలు, కొడుకులు లేక వృద్దాప్యం ఎలా అన్న మీమాంసలో పడ్డ అమ్మానాన్నలు, సమాజంలోని అసమానతలు నన్ను ఈ నిర్ణయానికి పురికొల్పాయి. కానీ ఒక స్థాయికి చేరాక జీవితం వెలితిగా అనిపించింది. అప్పటికి నా వయసు నలభైకి దగ్గర పడింది. ఒకవిధమైన జీవితానికి అలవాటు పడ్డాను. నా అభిరుచులు, అర్హతలు ఇష్టపడ్డ వ్యక్తి అశోక్ తారసపడ్డాడు. ఇద్దరిదీ దాదాపు ఒకే అనుభవం. తండ్రి చనిపోయి తల్లి, చెల్లెళ్ల బాధ్యతలు చేతిలోకి తీసుకుని అవన్నీ పూర్తిచేసేసరికి నలభైలో పడ్డాడు. ఒకసారి కాన్ఫరెన్స్ కి వెళ్ళినపుడు పరిచయమయ్యాడు. ఇద్దరం మానసికంగా సిద్దపడి పెళ్ళి ప్రస్తావన వచ్చేసరికి మరొకసారి జీవితం నన్ను పరీక్షించింది, యాక్సిడెంట్లో తను మరణించాడు. ఇప్పుడు తోడులేని లోటు తెలుస్తుంది. ప్రేమరాహిత్యాన్ని మనసు తన ఓటమిగా అంగీకరించపోయినా అపుడపుడు అనిపిస్తుంది గృహస్తు జీవితం పరిపూర్ణతని తెచ్చేది అని", గొంతుకి ఏదో అడ్డం పడ్డట్లు ఆగిపోయారు.


క్రొత్తగా వుంది. తెలియని ఉద్వేగం, ఇది నిజమా, మేడం ఒంటరితనాన్ని వ్యతిరేకిస్తున్నారా? స్వేఛ్ఛాజీవితాన్ని సమర్థించటం లేదా? "అవును మిత్రా, ఒకరిమీద ఒకరికి ఆధిపత్యం కాక అనురాగంతో సహకరించుకుంటూ సాగించే సమాజం మీ తరంలోనైనా సాధ్యం కావాలి. నీ మీద నా ప్రభావం చాలావుందని తెలుసు. ఈ ఒక్క విషయంలో నన్ననుసరించి కాక, నా అనుభవం నుండి నిర్ణయం తీసుకోమ్మా. పద పద చీకటి పడుతుంది. మాటల్లో పడిపోయాము" అంటూ లేచారు. ఆలోచన ఇంకా తెగలేదు, పరధ్యాసగానే కదిలింది.


గుమ్మం వరకు వచ్చి "చంద్రయ్యా, జాగ్రత్త" అంటూ హెచ్చరించి కారు కదిలి, సందు మలుపు తిరిగే వరకూ చూసి చిన్నగా నిట్టూరిస్తూ లోనికి కదిలారు. ఐదడుగుల నాలుగంగుళాలు ఎత్తు, సరిపడా ఒళ్ళు, లేత గోధుమ రంగు ఛాయ, తెలియని ఆకర్షణ, నడకలో నాట్యసాధన తాలూకు పోకడ. చక్కని రూపు, అంతకన్నా చక్కని మనస్తత్వం. మిత్రాకి మంచి భవిష్యత్ వుంది. ఆవిడకి తెలుసు మిత్ర కొంచం సమయం తీసుకున్నా తను చెప్పిన మాటల్ని అలక్ష్యం చేయదని.


**********************************************************************

"నాన్నమ్మా, ఇంక చాలు. పొట్ట పగిలిపోతుంది. " మిత్ర మాట పూర్తి కాకమునుపే మరొక ఉలవచారు ముద్ద కూరేసారు లక్ష్మీ దేవమ్మ గారు. వడియాల పాలకూర, తెలగపిండి కూర, ఉలవచారు ఘుమ ఘుమలు గదంతా పరుచుకునున్నాయి. మరొక నాల్గు ముద్దలు గడ్డపెరుగుతో తినిపించటం పూర్తయేసరికి సాంబ్రాణి సిద్దం చేసుకుని సుబ్బాలు రానే వచ్చింది. నడుంకట్టు వరకు గిరజాల నల్లటి కురులు. జుట్టు ఆరి జడ అల్లటం పూర్తయే సరికి జగదాంబ గారు పంపిన విరజాజి మాలతో, బట్టల మూట వీపున పెట్టుకుని ముత్యాలు వచ్చింది.


"రేపు అమ్ములుగారు ప్రయాణం అంటగా అమ్మగారు, ఇక సందడేమీవుండదండి" అంటూ ఓ మూల మూట దింపుకుని కూర్చుంది. ఒక క్షణం దిగులు ఆవరించినా ఆవిడ వెంటనే సర్దుకుని "మరి అంత ఉద్యోగం రావటం మాటలేమిటే? కష్టపడింది. ఇంకా వృద్దిలోకి రావాల్సిన పిల్ల" అన్నారు. నానమ్మ అంటే అందుకే ఇష్టం తన చిన్నతనంలో అయిదో క్లాసుతో ఆగిపోయిన చదువు పట్ల ఆవిడకి వున్న అసంతృప్తి మిత్ర ద్వారాగా తొలగించుకున్నారు. ఉద్యోగరీత్యా వూళ్ళు పట్టుకుతిరిగే కొడుకు, కోడల్ని వప్పించి చిన్నప్పటినుండి తన దగ్గరే వుంచుకుని చదివించారు. టెన్త్ వరకు ఇంటి నుండే పంపారు. ఇంటర్ నుండి మాత్రం దగ్గరలో వున్న టౌన్ లో హాస్టల్లో వుంచి చదివించారు.


"ఇలా తాగివస్తే అమ్మాయిగారు కేకలేస్తారు" వెంకన్న గొంతు గట్టిగా వినిపిస్తుంది. "సర్లేలేరా ఈ భుజాల మీద మోసిన బంగారం కాదా" అజ్జి ముద్ద మాటలతో లేచి ఆ ప్రక్కగా నడిచింది మిత్ర. లేత ముంజలు తాటాకులో చుట్టి పట్టుకువచ్చాడు. "తల్లీ, ఇదిగో నీకు ఇష్టమని బాసిగాడితో దింపించాను." ఆ అప్యాయతకి కళ్ళు చెమర్చాయి.


భుజాలమీద మోసి మామిడి కాయలు కోయించిన అజ్జి తాత. అలాగ పిలవటమే అలవాటు. వీపు మీద కూర్చోబెట్టుకుని తామర చెరువులో ఈదుతూ, కావాల్సినన్ని పూలు కోసుకునేదాక తిప్పేవాడు. గేదల దగ్గర పాలేరుగా మొదలైనవాడు ఏళ్ళ తరబడి తమ కుటుంబాన్నే నమ్ముకుని వుండిపోయాడట. ఎంత ప్రయత్నించినా ఆ కల్లు అలవాటు తప్పించలేకపోయింది. కానీ తను చూపే ప్రేమలో మాత్రం ఏ మార్పూ లేదు. నిన్న వస్తూ అజ్జికి ఇష్టమని కొన్న బేకరీ బిస్కట్స్ తేవటానికి లోపలకి నడిచింది మిత్ర.

"పెద్దయ్య గారేరి?" అజ్జి మాటకి వంట గదిలోంచి వస్తూ లక్ష్మీ దేవమ్మ "శర్మ గారి అబ్బాయి వచ్చాడురా, ఏదో పొలం వ్యవహారమట. ఇద్దరూ కలిసి మెట్టమీదకి వెళ్ళారు" అంటూ "ఏ నువ్వు ఆ ప్రక్కగా రాలేదా" అని అడిగారు.


"మిత్ర, ఎవరొచ్చారో చూడు" మాధవయ్య గారి మాటకి అటుగా వెళ్ళిన మిత్రాకి పలకరింపుగా నవ్వుతున్న యువకుడిని చూడగానే గుర్తుకు వచ్చిరానట్లుగా వుంది. "మాట్లాడుతూ వుండండి." ఆయన లోనికి వెళ్ళాక మరోసారి పరకాయించి చూసింది.


"ఏయ్ ఎర్రకోతి.." ఆ గొంతు వినగానే మొహం మీదకి నవ్వు దూసుకుని వచ్చేసింది విష్ణు, అవును తనని ఆటలుపట్టిస్తూ యేడిపించేప్పుడు కంది ఎర్రబడ్డ మొహం చూసి అలా పిలిచేవాడు. "చాలా మారిపోయావు." మిత్ర మాటకి బదులుగా "మరి నువ్వు మారలేదేమిటి?" సన్నగా నవ్వేసాడు. ఇద్దరు కలిసి మాటల్లో పడ్డారు. టెన్త్ అవ్వగానే తండ్రి చనిపోవటంతో మేనమామ గారి వూరికి వెళ్ళిపోయారు. మాధవయ్య గారే ఇన్నాళ్ళూ వాళ్ళ పొలాలు,కౌలు వసూలు అవీ చూస్తున్నారు. విషయాలు తెలుస్తున్నా కలవటం పడలేదిన్నాళ్ళు.


హైదరాబాదులో ఇల్లు కొనటానికి పొలాలు బేరం పెట్టటానికి వచ్చాడు. రాత్రి గౌతమికి ప్రయాణం. తను కూడా రేపే హైదరాబాదుకి వస్తున్నట్లు చెప్పింది. "తాతగారు చెప్పారు. ఇల్లు దొరికే వరకు మాతోవుండమని చెప్పాను" అన్నాడు. "ఊ, కానీ .." "అదేమీ కుదరదు, కావాలంటే ఒకటి రెండు రోజులు సెలవు పెట్టి ఇల్లు వెదుకుతాను" అంటూ వొప్పించాడు. ఒక సమస్య తీరిపోయింది. తను వుండగలనన్నా తాతగారికి ఆందోళన. ఆయన కోసమైనా తప్పదు. సర్దుకోవాల్సినవి ఇంకా వున్నాయి.


మరో గంటకి భోజనం చేసి విష్ణు బయల్దేరి వెళ్ళటం, తను సర్దుకోవటమ్ పూర్తయింది. వెళ్ళి తాత గారి ప్రక్కన పడుకుంది. ఆయన మాట్లాడటం తక్కువే కానీ మనవరాలితో మాత్రం అన్నీ కూలంకషగా చర్చిస్తారు. "అమ్మలు, ఇంతకాలం ఇక తీరు,ఇప్పుడిక మరోతీరు ఉద్యోగం, క్రొత్త లోకం, జీవితమే గురువు. మనుషులతో కలిసిమెలిసి సాగటమే ఆధ్యయనం. తోడు అన్నది మనిషికి ముఖ్యం. మా నుండి బలవంతం వుండదు కానీ సంబంధాలు వస్తున్నాయి, తల్లీ. నీఇష్టానుసారమే అన్నీను..." అలా చెప్తూనే నిద్రలోకి జారుకున్నారు. దుప్పటి కప్పి తలుపు జారవేసి బయటకి నడిచింది. కాసేపు ధ్యానం చేసుకుని, ప్రక్క మీదకి చేరింది.


నిన్న సుమతి మేడం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఇంతవరకు ఈ ఇరవై రెండేళ్ళు చదువుకోవాలి అన్న ధ్యాస తప్పితే స్త్రీ సహజమైన భావనలు ఎందుకు కలగలేదు. సాలోచనగా మగత నిద్రలోకి జారుకుంది. ఆ ఆలోచన అతి త్వరలో తన మీద ఏ ప్రభావం చూపనుందో?

విశ్వామిత్ర 1- మాటే మంత్రము

డిశంబర్ మాసం. అమెరికాలో చలి ఎక్కువగా వుండే ఓ స్టేట్, భారతీయులు అంతగా వుండని ఓ వూరు, ఆ అపార్ట్మెంట్స్ లో విశ్వది రెండవ అంతస్తులో సింగిల్ బెడ్ రూం అపార్ట్మెంట్. శనివారం సుమారు ఉదయం 8 గంటల సమయం. ప్రక్క మీద అటునుండి ఇటు బద్దకంగా దొర్లిగింత వేసిన విశ్వ, కంఫర్టర్ తిరిగి సర్దుకుంటూ యధాలాపంగా ఫొన్ వంక చూసాడు. వాయిస్ మెసేజ్ వున్నట్లుగా బ్లింకింగ్. బహుశా మిత్ర చేసివుంటుందనుకుంటూ చేతిలోకి తీసుకుని, అలాగే వెనక్కి వాలి మెసేజ్ విన్నాడు.


"విశ్వ, ఉదయం 6 కి రమ్మన్నాను గుర్తువుందా?" మిత్ర గొంతు వినగానే ఒక్కసారిగా నిటారుగా లేచి కూర్చున్నాడు. బుధవారం సాయంత్రం చెప్పింది, ఒక ముఖ్యమైన విషయంవుంది శనివారం ఉదయం కలుద్దాం అని. సాధారణంగా తన ఫ్లాట్కి రావటానికి ఇష్టపడదు, అలా కాస్త బయట తిరిగినట్లువుంటుందని ఆర్చిడ్ దగ్గర కలుస్తుంది. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఓ గంట నడిచాక ఆమె ఇంటికి వెళ్ళటం, ఫిల్టర్ కాఫీ తాగితను వెనక్కి రావటం పరిపాటి. అలాగని కలవటం తక్కువే. ఇద్దరివీ భాధ్యతాయుతమైన పదవులు, తీరిక తక్కువ. ఇలా ముందుగా చెప్పి కలవటం అలవాటే. దాదాపు తను మరిచిపోవటం మిత్ర సత్య మాదిరి చిరు అలకలు పోవటం ఇదీ మామూలే.


"ప్చ్ ఈ చలిలో వచ్చి 2 గంటలు వేచివుంటుంది. ఎలా మర్చిపోయాను" స్వగతంగా అనుకుంటూ చక చకా బ్రష్ ముగించి, స్నానం వచ్చాక చేద్దాం అనుకుంటూ, కాస్త పెరిగిన గడ్డం చూసుకున్నాడు. పోయిన వారం మిత్రని కలిసినపుడు ఎంత సున్నితంగా చుంబించినా తన గరుకు గడ్డం ఆమె పసిమి బుగ్గమీద ఎర్రని గుర్తు వదిలింది. ఒక క్షణం తటపటాయించి, కార్ తాళాలు, వాలెట్ అందుకుని బయటకి నడిచాడు. ఈ హడావుడిలో సెల్ తీసుకోవటం మరిచిపోయాడు.


కార్ స్టార్ట్ చేసి రోడ్డు మీదకి చేరగనే ఒకసారి ఫోన్ చేస్తేనో అనుకుంటూ పాకెట్ లో చేయి పెట్టగానే గుర్తుకొచ్చింది సెల్ వదిలేసానని. సరే కానీ ఎలాగూ చీలి రాకాసి ముందుగా అలకలు తీర్చనిదే మాట్లాడదెలాగు అనుకున్నాడు. ఇద్దరివీ so predictable behaviors. I love you Mitra.... రేడియోలో వాతావరణం వింటూ డ్రైవ్ చేయటం మొదలు పెట్టాడు.


***********************************************************************

5 మైళ్ళే అయినా మంచు కురిసిన కారణంగా అక్కడకి చేరేసరికి 20 నిమిషాలు పట్టింది. పార్కింగ్ లాట్ లో అక్కడక్కడా మాత్రం కార్స్, అన్ని కలిపి ) 10 వుంటాయి. ఓ మూలగా వున్న మిత్ర కార్ ప్రక్కగా తీసి ఆపాడు. డోర్ తీసుకుని దిగి, తన కార్ దగ్గరకి వెళ్ళి, విండో మీద చేయి వేయబోయి ఆగిపోయాడు. తనకిష్టమైన నల్ల చీర, తలస్నానం చేసినట్లు ఆరీ ఆరని కురులు, చిన్న బొట్టు, బ్లాక్ పెర్ల్ డ్రాప్తో సన్న గొలుసు, చేతికి వాచ్. సాధారణంగా చెవులకి ఏమీ పెట్టుకోని తను, ముత్యాల జుంకీలు వేసుకుంది. ఆ మధ్యనే చెప్పాడు తను, పొడుగాటి లోలకులు నీకు బాగుంటాయి అని.


కళ్ళు మూసుకుని సన్నగా తల వూపుతూ పాటలు వింటూ కొద్దిగా సీట్ సరిచేసుకుని వెనక్కి వాలి వుంది. కొద్దిగా ఆశ్చర్యమనిపించింది, వాకింగ్ చేయనపుడు ఇంత ఉదయానే ఇక్కడికి ఎందుకు రమ్మందో అని. అలాగే తదేకంగా చూస్తూవుండిపోయాడు. ఆమె మొహంలో ప్రశాంతత యోగినిని గుర్తు చేస్తుంది. ఇపుడు తనని చూస్తే ఆ కళ్ళు కొద్దిగా అరుణిమ దాలుస్తాయి అంతకు మించి ముక్కు ఎర్రబడుతుంది, అతని పెదాలపై చిలిపి నవ్వు కదలాడింది, మాటలు కూడా సిద్దం చేసుకునేంత సమయం ఇచ్చి మరీ వచ్చాడు.


"నా లేత బంగారు" మురిపంగా అనుకుంటూ సన్నగా శబ్దం చేసాడు. ఉలిక్కి పడినట్లుగా సన్న కదలిక, కనులు తెరిచి చిర్నవ్వుతో కార్ తెరుచుకుని దిగింది. కుడిచేతి గుప్పిట్లో ఏదో వున్నట్లు బిగించి పట్టుకుంది. సన్నగా వణుకుతూ అతని చేరువకి వచ్చింది, తన కోట్ బటన్స్ తీసి ఆమెకీ కలిపి చుట్టి పొదివిపట్టుకుని నుదిటి మీద చిన్న ముద్దు అద్దాడు. నెమ్మదిగా అతని కుడిచేయి తన చేతిలోకి తీసుకుని, గుప్పిట విప్పి అతని చేతిలో ఏవో పెట్టి చలికి సన్నగా వణుకుతున్న గొంతుతో మిత్ర అడిగిన మొదటి మాట "మన బంధాన్ని శాశ్వతం చేసుకుందామా, కన్నా?" అంత చలిలోనూ అతని మొహం మీడ వేడి ఉద్వేగపు తాలూకు ఆవిరి, గుప్పిట విప్పి చూస్తే, ఒక పగడం, ముత్యం, చిన్న నల్ల పూస వున్నాయందులో. వెంటనే గుర్తువచ్చింది, తనకి ప్రాణమైన నానమ్మ మంగళ సూత్రం నుండి చివరి గుర్తుగా మిత్ర దాచుకున్నవవి. మిత్ర ఆ పిలుపు తన మీద ప్రేమాతిశయం అధికమైనపుడే "కన్నా" అని సంభోదిస్తుంది.


"అమ్మలూ, ధన్యుడిని రా, ఈ జన్మకిది చాలు నాకు.." విశ్వ మాట తడబడుతూ అక్కడే ఆగిపోయింది. "మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం" చుట్టూ మంచుతో కప్పబడిన చెట్లు మంత్రాలు జపిస్తున్నాయి, ఆ జంటని దీవిస్తున్నాయి.


***********************************************************************

ఆ రాత్రి విశ్వ డైరీలో పుఠని నింపిన మాటలివి. "మిత్ర, నేను ఈ ఉదయం కలిసాం. తనకి ఇష్టమైన సూర్యోదయపు వేళలో, ఒకరిలో ఒకరం ఒదిగున్నపుడు సన్నగా చలికి వణుకుతూ, తానడిగిన మాట "మన బంధాన్ని శాశ్వతం చేసుకుందామా, కన్నా?" ఈ ఒక్క మాట నాకు పూర్తిగా అర్థం అయింది.

అపరిచితులుగా, విభిన్న మనస్తత్వాల మేము స్నేహితులమవటం, ఐదేళ్ళ సహవాసం, ఒకరి మనసులోకి మరొకరి పయనం. This journey has brought us so close and bridged the gap కవితలల్లే తన ఆవేశం, మాటలు వెదికే నా ఆలోచనలు, క్రమేణా నాపై తన ప్రభావం, She had taught me the way to look at things. అన్నీ వెరసి ఈ మధుర క్షణం. ఈ నిమిషాన విశ్వ విజేతనయిన ఫీలింగ్. మిత్ర రూపుదిద్దిన నా వ్యక్తిత్వం, నాకు నన్ను క్రొత్తగా పరిచయం చేసిన తీరు ఇంకా నమ్మలేనట్లుగా వుంది. లోకం కొత్తగా కనిపిస్తుంది, మనుషులు కొత్తగా కనిపిస్తున్నారు. ఇన్ని మార్పులకి కారణమైన నా బంగారుకి కూడా తెలియని సత్యం ఈ నా డైరీ. మా కథ మళ్ళీ చదువుకోవాలనుంది." వెనక్కి వాలి పడుకుని బెడ్ ప్రక్కన చెస్ట్ నుండి పాత డైరీ చేతిలోకి తీసుకున్నాడు.

[సశేషం]

విశ్వామిత్ర 0 - ప్రేమాన్వేషి : మిత్రవింద

విశ్వ,

రేపు మనం కలుస్తున్నాము. నీకు చెప్పే మాట ముందుగా నాకు చెప్పుకుంటే తెలియని ఉద్వేగం. క్షణాలు లెక్కిస్తూ, రేపుకై వేచివున్నాను. ఎందుకో ఈ రాత్రి గుబులుగావుంది. నీ తలపులే నింపిన గుండెలోకి తొంగిచూసుకుంటుంటే, ఆణిముత్యం వంటి నీ నవ్వు నా పెదాలకి అద్దిన నీ ముద్దుతో నా కళ్ళలో విరిసినట్లుగావుంది. ఇక ఏమి చెప్పాలో కూడా తెలియనన్ని వూసులు చెప్పేసాను. ఇప్పటికే నీ మోముపై చిరుదరహాసం పరుచుకుపోయుంటుంది. ఆ వెలుగులు తెచ్చి నా వాకిట పరిచిన వెన్నెలమ్మకి కాసినన్ని మల్లెలిచ్చి పంపుతాను నీ ముంగిట పరిచి రమ్మని. వేకువ ప్రొద్దుల్లో నా లేఖలై నీ మనసు రంజింపచేస్తాయేమో...

అవును, ఇది నీకు సగంసగం మాత్రం అర్థమయ్యే భాషే. రెండేళ్ల క్రితం నేను నీకు వ్రాసిన లేఖజతపరుస్తున్నాను. ఇలా ఎన్నో నా డైరీ దాచేసుకుంది. నీతో సంభాషించటం నాకు నిత్యకృత్యం.

- నీ మిత్ర.

*******************************
చుక్కాని లేనిది నా బ్రతుకు నావ,

చుక్కానే నీవై నడుపుతున్నది నీ నావ.
నిన్ననుసరించి నా గమనం.
నను నడిపించగ నీ చలనం.
నడిసంద్రాన మన పయనం,
నావకి ఎరుకలేని గమ్యం.
ఆటుపోటుల అరిషడ్వర్గాలు.
యేడేడు లోకాలంటి ఈ యేడేడు భవసాగరాలు,
యెన్నెన్నో మన జన్మల ఎదురీత పడవల్లో,
కలవలేని మనం ఇలా కలిసే సాగుతున్నాం.
కలవలేమని సందేహపడకున్నాం.
కలిసితీరాలని ప్రమాణాలు చేస్తున్నాం.
ప్రేమనన్వేషించే సిద్దసాధకులై
తిరిగి తిరిగి ఈ లోకానే ఉద్భవిస్తున్నాం.

విశ్వామిత్ర - ఉపోధ్ఘాతం

విశ్వ,మిత్ర - వారి జీవితాలే వారి పయనం. ఒకరి ప్రేమ అన్వేషణ ఆఖరి మజిలీ మరొకరు. సహవాసులు, సహజచిత్రాలు. గలగల గోదారి మిత్రవింద. నల్లనయ్య అష్టభార్యల్లో నిదానస్తురాలి పేరున్నా సత్యభామవంటి స్వాధీనపథిక. అపురూప సౌందర్యవతి. అసమాన ప్రతిభాశీలి. లక్ష్యసిద్దికి తపించే ధీరోదాత్త.

ఆ పరవళ్ళ గోదావరి చుట్టుకు ప్రవహించే నిశ్చల కీలాద్రి విశ్వనాథ్. తనని తాను ఆమె ప్రేమలో ఆవిష్కరించుకున్న మౌనమూర్తి. సాదాసీదా జీవితాన్ని కోరుకునే అసమాన వ్యక్తిత్వం కలవాడు. మంచికి మారుపేరు.


ఇరువురి కలయిక చిత్రం. కలవరేమోననిపించే వైరుధ్యం. అయినా కలిసిన మనసులవి.
ఈ ఇద్దరి కథే నా "విశ్వామిత్ర". ఈ సజీవశిల్పాలని చెక్కేందుకు సమయం కావాలి, కాస్త అనుభవాన్ని పునశ్చరణ చేయాలి. మరికాస్త శైలి మీద పట్టుకై అధ్యయనం చేయాలి, అంతవరకు కాస్త గడువు కోరుకుంటూ స్వల్ప విరామం తీసుకుంటున్నాను.
ఇంతవరకు మీ మనసుకు ఏర్పడిన అభిప్రాయాన్ని నాతో పంచుకోమని మనవి.