లేక్ మిషిగన్
ఒడ్డు నుంచి దిగంతం వరకు నురగల నూలుపోగులని గాజుపచ్చ నీటిలో తడుపుకుంటూ, 
నావల, తెరచాపల మీదుగా నీటి బిందువుల గులకరాళ్ళు విసురుకుంటూ
జనసందోహాల ఉనికిలో ఉండుండి తన అలికిడి ఒకటి చొప్పిస్తూ
నది నడకలతో, సంద్రపు పోటుతో, నిలవని పయనంతో 'లేక్ మిషిగన్' సౌందర్యం...
షికాగో నగరి, ఆ చుట్టుపక్కల పల్లెపట్టణవాసులు చెప్పుకునే ఊసుల్లో చెదరని మాధుర్యం.  

(ఈ ఇల్లినోయ్ రాష్ట్రం వదిలే ముందు మిస్సవుతాను అనుకున్న సంగతుల్లో- పచ్చటి నేలతల్లి సోయగాలను, మంచుపాతాలను ముందుగానే పంచాను కనుక- మిగిలినది ఈ సరోవరం). Of all the places I visited in Chicago, Lake Michigan and Navy Pier are the only places I may consider for revisit.  

వాన వెలిసాక

మబ్బులు కమ్ముతున్న ఆకాశం, మనసు- రెండిటా 
కలియజూస్తే వర్ణాలెన్నో లోపలా, వెలుపలా.

దీర్ఘ నాదం తో 
కొరడాలు ఝుళిపిస్తూ గాలులు  
మెలితిరిగే జ్ఞాపకాల్లో 
చిక్కులు /చిక్క/పడుతున్న గుర్తులు

వర్షం మొదలౌతుంది ఏదో నిమిషం లో-
వినువీధుల్లో దారితప్పిన పిడుగు,
నేల దారి పడుతుంది.
వ్యాకులపాటుతో అలజడిలో 
మనసు అల్లాడుతుంది 

పెళపెళరావాలతో దిగ్గుళ్లిన ఆకాశం
నీలి సరోవరం గా నిశ్చలం గా మారి,
రెక్కల తెడ్లతో సాగే కొంగల గుంపు కనిపిస్తుంది
మనసులో కొలనులో
నిర్మలమైన భావాలు పురివిప్పుతాయి

నక్షత్రాలు జనిస్తాయి-
మెరుపు నవ్వులు రువ్వుతూ
దారులు పరుచుకుంటూ 
వెన్నెల తీరానికి చేరతాయి.
మనోనేత్రానికీ తారాపథం అందుతుంది-
అంతర్వాహినిలోకి పయనిస్తూన్న యోచనలు
తీరానికి వచ్చే తరుణం కొరకు చూస్తూ మనసిలా...

ఆథ్యాత్మిక రచనల్లో ప్రవేశం/అభినివేశం ఉన్నవారూ! ఒక్కమాట...

"భోజనమైనా చేయరే ఓ పెద్దల్లారా అరిషడ్వర్గములనే ఆరు కూరలతో పంచేంద్రియములనే పచ్చళ్ళైదుతో రజితగుణమనె పప్పుచారుతో సత్వగుణమనె చల్లను కూడుక ॥భో॥ "
విన్నట్లుగా ఉందా?


-1-
"వాక్కియ్యవే వేడగా పాడగా తోడుగా నీడగా తార్కాణమై చెప్పగా గొప్పగానో జేసి రక్షించుమో దేవ దేవా యీశా సర్వేశా విశ్వేశా నమస్తే నమస్తే నమస్తే నమః 

భోజనమైనా చేయరే ఓ పెద్దల్లారా అరిషడ్వర్గములనే ఆరు కూరలతో పంచేంద్రియములనే పచ్చళ్ళైదుతో రజితగుణమనె పప్పుచారుతో సత్వగుణమనె చల్లను కూడుక ॥భో॥ 

-2-
దండకము
ఓ మహాదేవ దేవా చిన్మయానందరూపా  చిత్కళాసందర్శనాకలాపా  శుద్ద నిరాలంబనివాసా శుద్ద పరిపూర్ణసంధాన సచ్చిదానందసహితా ఆద్యంతరహితా అప్రమేయవరదా అశరీరా షట్కర్మరహితా    సర్వాంతర్యనివాసా ఆత్మసందర్శనహరా శ్రీమత్ పరమహంస స్వరూపా రాజయోగానందరసమగ్నరాజా త్రిమూర్త్యాత్మకస్వరూపా యిడా పింగళ...ఘం మ్మాంతర్గతవాసా..." 

*****

ఆ అసంపూర్ణ ప్రార్థన/గీతాలపై ఎంతో కొంత సమాచారం ఇవ్వగలరా!? మా నాయనమ్మ గారిని సీతమ్మామ్మ అని పిలవడం అలవాటు. తన దగ్గరే ఎక్కువగా ప్రాపకం. తన మాటలు, తీరు కాస్త అవగతమై, మరి కాస్త అయోమయంగా ఉండేవి. నాకు మతం అనేకన్నా ఆథ్యాత్మిక ధోరణిలోకి బాట వేసింది తనే. ఊహ తెలిసిననాటి నుంచి తను రాసుకోవడం గమనించినా కుతూహలం కలగలేదు. ఆసక్తి కలిగేసరికి చదువులరీత్యాగానో, ఇతరత్రా కారణాల వలననో ఇంటికి దూరంగా ఉండిపోయాను. 

ఇంతకీ విషయం వినతి ఏమిటంటే మా సీతమ్మామ్మ డైరీ భద్రం చేయలేకపోయాను/ము/.  ఒక కాగితం ముక్క మాత్రం నాన్నగారు దాస్తే తెచ్చుకున్నాను. ఆ దాదాపుగా జీర్ణమైపోతున్న పుట రెండువైపుల నుంచి తన మాటలు నాకు అర్థమైనంత (చదవగలిగిన అనాలేమో) వరకు ఇక్కడ టైపాను...చాలా ఆనందం ఆమె కి అంత ఆథ్యాత్మికమైన దృష్టి ఉన్నందుకు- తను ఎందులో చూసి రాసినవో ఈ మాటలు కానీ నాకు అమితానందం కలిగించాయి. 

రమణుల వారి అప్పడపు పాటని పోలిన "భోజనమైనా చేయరే" అన్న తత్త్వ పదం, కాస్తంత అద్వైత ధోరణి/తత్త్వ చింతన కలగలిసిన ఆ దండకం లను గూర్చి మరి కాస్త వివరాలు తెలిస్తే బావుణ్ణు. ఎవరైనా తెలిసిన సమాచారం అందిస్తారా? నాకు ushaaడాట్raaniయట్gmailడాట్com కి విడిగా మెయిల్ పంపినా సరే. ముందుగానే నెనర్లు.

ఎప్పటి మాదిరిగానే...

నీకొక లేఖ రాద్దామని కూర్చున్నానిలా: ఎదురుగా-

అలవాటుగా గాయాలకి దేహం అరువిస్తూ నేల
నిర్దయగా నడిచిపోయే పాదముద్రలు వంటిమీద గాట్లుగా
పొడిబారిన రక్తపుటేర్లు ధూళి తెరలుగా

వానలు పడాలి,  వాగుల కంబళ్ళు కప్పాలి
వనాలు నవ్వాలి, పచ్చిక బయళ్ళు పరవాలి
తాకీతాకనట్లు నేలని నిమిరే ఆరుద్రలు పరుగులిడాలి

గాయాలకి తావులేనంతగా చిద్రమైన మనసు
కవాటాల చలనం లో ప్రవహిస్తూ జ్ఞాపకాలు   
నిస్సహాయతలోనూ ప్రేమ, క్షమా కంటి ధారలుగా

ఎండ కాయాలి, వడగాలుల్లో ముంచాలి
గుండె మండాలి, ఎడారిగా మారాలి
అక్కడక్కడా మొలుచుకొచ్చే చెట్ల నీడలో సేదతీరాలి

నేల నేనే, మనసూ నేనే, 'నేను'ల పొరల్లో నీకై-
ప్రకృతి నై వేచిన నేను- ప్రకృతిగా మారుతున్న నేను
ఇక 'నువ్వు': తనలోని మహాధాతువులు కావచ్చు,
వచ్చిపోతున్న ఋతువులూ కావచ్చు...అంటో ఇంకేదో మరి-
నా ఎదురుగా ఉండ/లే/ని నీకు- చెప్పాలని ఉందని రాస్తున్నానిలా