ఆథ్యాత్మిక రచనల్లో ప్రవేశం/అభినివేశం ఉన్నవారూ! ఒక్కమాట...


-1-

"వాక్కియ్యవే వేడగా పాడగా తోడుగా నీడగా తార్కాణమై చెప్పగా గొప్పగానో జేసి రక్షించుమో దేవ దేవా యీశా సర్వేశా విశ్వేశా నమస్తే నమస్తే నమస్తే నమః 

భోజనమైనా చేయరే ఓ పెద్దల్లారా అరిషడ్వర్గములనే ఆరు కూరలతో పంచేంద్రియములనే పచ్చళ్ళైదుతో రజితగుణమనె పప్పుచారుతో సత్వగుణమనె చల్లను కూడుక ॥భో॥ 

-2-
దండకము
ఓ మహాదేవ దేవా చిన్మయానందరూపా  చిత్కళాసందర్శనాకలాపా  శుద్ద నిరాలంబనివాసా శుద్ద పరిపూర్ణసంధాన సచ్చిదానందసహితా ఆద్యంతరహితా అప్రమేయవరదా అశరీరా షట్కర్మరహితా    సర్వాంతర్యనివాసా ఆత్మసందర్శనహరా శ్రీమత్ పరమహంస స్వరూపా రాజయోగానందరసమగ్నరాజా త్రిమూర్త్యాత్మకస్వరూపా యిడా పింగళ...ఘం మ్మాంతర్గతవాసా..." 

*****

ఆ అసంపూర్ణ ప్రార్థన/గీతాలపై ఎంతో కొంత సమాచారం ఇవ్వగలరా!? మా నాయనమ్మ గారిని సీతమ్మామ్మ అని పిలవడం అలవాటు. తన దగ్గరే ఎక్కువగా ప్రాపకం. తన మాటలు, తీరు కాస్త అవగతమై, మరి కాస్త అయోమయంగా ఉండేవి. నాకు మతం అనేకన్నా ఆథ్యాత్మిక ధోరణిలోకి బాట వేసింది తనే. ఊహ తెలిసిననాటి నుంచి తను రాసుకోవడం గమనించినా కుతూహలం కలగలేదు. ఆసక్తి కలిగేసరికి చదువులరీత్యాగానో, ఇతరత్రా కారణాల వలననో ఇంటికి దూరంగా ఉండిపోయాను. 

ఇంతకీ విషయం వినతి ఏమిటంటే మా సీతమ్మామ్మ డైరీ భద్రం చేయలేకపోయాను/ము/.  ఒక కాగితం ముక్క మాత్రం నాన్నగారు దాస్తే తెచ్చుకున్నాను. ఆ దాదాపుగా జీర్ణమైపోతున్న పుట రెండువైపుల నుంచి తన మాటలు నాకు అర్థమైనంత (చదవగలిగిన అనాలేమో) వరకు ఇక్కడ టైపాను...చాలా ఆనందం ఆమె కి అంత ఆథ్యాత్మికమైన దృష్టి ఉన్నందుకు- తను ఎందులో చూసి రాసినవో ఈ మాటలు కానీ నాకు అమితానందం కలిగించాయి. 

రమణుల వారి అప్పడపు పాటని పోలిన "భోజనమైనా చేయరే" అన్న తత్త్వ పదం, కాస్తంత అద్వైత ధోరణి/తత్త్వ చింతన కలగలిసిన ఆ దండకం లను గూర్చి మరి కాస్త వివరాలు తెలిస్తే బావుణ్ణు. ఎవరైనా తెలిసిన సమాచారం అందిస్తారా? నాకు ushaaడాట్raaniయట్gmailడాట్com కి విడిగా మెయిల్ పంపినా సరే. ముందుగానే నెనర్లు.

No comments:

Post a Comment