"మరువం" పుస్తకావిష్కరణ - మరువలేని స్మృతుల నెమరువేత

ఈ ఏడాది సహస్ర పూర్ణ చంద్ర దర్శన భాగ్యశీలి అయిన మా నాన్న గారికి అనురాగ పురస్కారం గా - తనకి అంకితమిచ్చిన - 'మరువం' కవితా సంకలనం ఆగష్టు నెలలో ఆయన చేతుల మీద గా  విడుదల అయింది.  ఆ సందర్భం గా హైదరాబాదులో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కాసిని కబుర్లు పంచుకుందామని- 

నాన్న చూపనిదేదీ నాకు అపరిచితం.
అస్థిత్వం విసిరిన సవాలుకి నా జవాబు,
ఆ నాన్న కూతురు నేనంటేనే నాకు ఇష్టం


పుస్తకం చేతిలో పడినా ఇంకా కలగానే ఉంది! గత సంవత్సరం గడిచిన తీరుకి ఇది సాధ్యపడుతుందనుకోలేదు కనుక-



ముందు గా బ్లాగు ముఖం గా తప్ప నన్నెరుగకపోయినా, ఆహ్వానాన్ని మన్నించి, వీలు చేసుకుని, నాతో సమయం గడిపిన, లేదూ ఫోనుల్లో అభినందించిన బ్లాగు మిత్రులందరికీ కృతఙ్ఞతలు!!! ముఖ్యం గా జ్యోతి, శ్రీలలిత గారు, మాలాకుమార్ గారు, పి.యస్.యం లక్ష్మిగారు, సి.ఉమాదేవిగారు, జయ, నీహారిక, ఫణి ప్రదీప్, నూతక్కి రాఘవేంద్ర గారు, ఆచార్య ఫణీంద్రగారు, శ్యామలీయం గారు, కస్తూరి మురళీకృష్ణగారు - మరపురాని ఘటనలో మీరంతా పాలుపంచుకున్నందుకు చాలా సంతోషం. మమతల ఎద్దడిలో, పరుగుల రద్దీలో ఎప్పటిలా లేత వత్తిడిలో అల్లల్లాడుతున్నా గంపెడు జ్ఞప్తుల వొద్దిక ఇంకా రాలేదు కనుకా అవీ ఇంకా ఉక్కిరిబిక్కిరి జడిలో తడుపుతున్నాయి. (ఎవరినైనా మరిచిపోయుంటే మన్నించండి)-

అలాగే అడగగానే బ్లాగులో చదివిన గురుతులు నెమరువేసుకుని ఆప్తవాక్కులు అందించిన ఫణి ప్రదీప్, భావన, జ్యోతి, ఆనంద్, శ్రీలలిత, బాబాయ్, తృష్ణ, యన్. యస్. మూర్తి, కెక్యూబ్ వర్మ గార్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.  నా కవితలకి తన అనువాదాలు జతపరచటానికి అనుమతించిన మూర్తి గారికి నమస్సులు.  చిత్రకారునికి కళ అందుకునే అభినందన చాలునన్న - నా ఊహ ని తన సృజనతో చక్కని చిత్రం గా మలిచిన - స్నేహితునికి ప్రత్యేకాభివాదాలు. ఈ పుస్తక ప్రచురణ అనుకున్న ఘడియ నుంచి ఆ సంకల్పం సిద్ధించటానికి జ్యోతి చేసిన సాయం మాటల్లో ఇమిడ్చే నేర్పు నాకు లేదు.   సింహ భాగపు పని అందుకోవటం చాలా శ్రమతో కూడినది.  తను చాలా సమర్థవంతం గా దాన్ని నిర్వర్తించింది.  ఇక్కడ ప్రస్తావించటం సబబు కనుక చెప్పటం, అది స్నేహపూరిత భావన అయినా కూడా...సత్వరమే ఒక సమీక్ష ని అందించిన మాలిక పత్రిక యాజమాన్యానికి,  చిక్కని అభిప్రాయాలు ఇచ్చిన శైలజామిత్ర గారికి నా కృతఙ్ఞతలు.  
మరువమా నిన్ను మరవగలమా! అంటో మాలాకుమార్ గారు దాదాపుగా అన్ని కబుర్లూ చెప్పేసారు. ఇకిప్పుడు రెండు ముక్కలు చెప్పి తప్పుకుంటాను:

అపుడపుడూ నేను విడి కాగితాల మీద వ్రాసుకోవటం చూసి నాన్నగారు తనే స్వయంగా చేత్తో కుట్టి ఒక బుల్లి పుస్తకం ఇచ్చారు. ఆ అట్ట మీద "భావాలు-భాష్యాలు, కవితలు-కల్పనలు" అని వ్రాసుకున్నాను. నా 12-18సం. వయసు వరకు రాసుకున్నవి అందులోనే ఉంటాయి. 

పుస్తకంలో మొదటి పేజీ:




నేను అలా తొంగిచూసుకుంటే అసలు మొదటిది ఒక మతిస్థిమితం లేని అమ్మాయి "వస్తున్నా వస్తున్నా వట్లమ్మా.."  అని రోడ్ల వెంట పరిగెట్టేది.  తన మీద యేదో వ్రాసుకున్నాను కానీ గుర్తు లేవా పంక్తులు.  తెగిపడిన ముత్యాల సరాలు గా మునుపు పంచినవి ఈ పుస్తకం లోవే.  

నాన్న గారికి - ఆయన నా పదేళ్ళ ప్రాయం లో చేసిన ఓ చిన్న ఆపేక్షతో కూడిన చర్య నా కవితలకి శ్రీకారం కనుక - నా పుస్తకమే సరైన వందనం అనిపించింది. కంప్యూటర్ యుగపు తాకిడి ఆయన్ని ఇంకా తాకలేదు, అందుకే అచ్చు పుస్తకపు గోరువెచ్చని ఆపేక్షగా మిగిలింది ఈ అనుభూతి.  అమ్మ లేని లోటు తో వెలితి పడతారని వీలైనంత క్లుప్తం గా నాన్న గారి స్వస్థానం/గృహం లో - నేను, నా వాళ్ళు, అతి కొద్ది బంధు మిత్రుల సమక్షం లో (సమైఖ్యాంధ్ర బంద్ వలన ఇంకా కుంచించిన ఆహుతులతో) సహస్ర పూర్ణ చంద్ర దర్శన యజ్ఞం, సత్యనారాయణ వ్రతం, గీతాపారాయణం గరిపాక -నాన్న గారి చేత పుస్తకం ఆవిష్కరణ చేసాము. పుస్తకం విడుదల ముందు వెనుకల్లో మరి కొందరు సాహితీ మిత్రులతో భేటీ కూడా చిక్కని అనుభూతి.  

ఇక చివరగా, ఒక మనవి:  ఈ పుస్తకం అమ్మకాలు అన్నవి ముందు నుంచి అనుకున్నవి కావు.  కానీ,  ఈ ద్వారా నాతోపాటు పుస్తకం లో పాలు పంచుకున్న కళాకారులు, సాంకేతిక నిపుణుల పనితనమూ మరిందరికి చేరుతుందని కొంత,  ఈ ద్వారా వచ్చే రాబడి కొందరు కళాకారులకి చేయూత గా ఇవ్వొచ్చని మరి కొంత భావనతో నవోదయ వారికి ఇవ్వటం అయింది. విడి గా ఇండియాలో జ్యోతి వద్ద, లేదా, అమెరికా లో నా నుంచి ప్రతులు కొనవచ్చును.  ఈ ప్రయత్నానికి మీరు అందించే సహకారానికి ముందు గానే ధన్యవాదాలు. నన్ను ushaaడాట్raani యట్ gmail డాట్ com ఐడి పై సంప్రదించండి లేదూ జ్యోతిని  jyothivalaboju యట్ gmail డాట్ com పై గానీ,  దిగువ ఇచ్చిన చిరునామా కి రాసి కానీ తెప్పించుకోవచ్చు. 



నిజానికి ఇవి కూడా ఒకరికి పురమాయించినవి కావు,  నీహారిక, బాబాయ్, బంధుమిత్రులు తమ తమ కామెరాల్లోవి పంచితే నేను ఒక సముదాయం గా ఇక్కడ పెట్టాను కనుక చాలా రాండం ఆర్డర్ లోను కవరేజ్ లేనట్లో ఉన్నాయి.  జ్ఞాపకాలు మాత్రం మెండు! విందు కి విచ్చేసిన మిత్రుల నుంచి నాకు అనుమతి ఉన్నంత వరకు పిక్స్ పంచుతున్నాను:  మరువపుతావి నద్దుకున్న పూవులు గా