నూతన సంవత్సరానికి స్వాగతం పలుకవే, నా మరువపు మొలకా!!!

మోడులైన చెట్లు చెప్తున్నాయి ఆమనిలో పచ్చని చివురేస్తాం,
మాకెందుకిక దిగులని.

గూడొదిలి పోయిన గువ్వపిట్ట కబురంపింది,
వేసవికి ముందే నా ఇల్లు విడిదడుగుతానని.

మంచుకప్పిన నేల నవ్వేసుకుంటుంది,
పచ్చ చీర నేత పూర్తవొచ్చిందని.

నిద్ర నటిస్తున్న బుల్లి బన్నీ వ్రాసుకుంటోంది,
అది చేయనున్న చిలిపి పనులచిట్టా.

ఋతువు కూడా ఒప్పేసుకుంది,
శీతువునంపి వసంతునికి కబురంపుతానని.

మాసం మాత్రం మోసం చేస్తదా ఇక మరి,
తాను తరలి వెళ్తదేమో.

కొత్త కొత్త ఆశలు, వూహలు ఇలా
నిత్యం ప్రకృతి నాకు కానుకిస్తూనేవుంటది.

ప్రతి ఏడు వెళ్ళ్తూ వెళ్ళ్తూ ఇచ్చిన మాటా తప్పక తీర్చుకునేతీరతది.
ఇహం, పరం, యోగం, భోగం, సూక్ష్మం, మోక్షం ...
అన్ని కలిసిన ఈ ఆరు ఋతువుల జీవనం అమోఘం!!!

రండి అంతా కలిసి పలుకుదాం మరో ఏటికి సుమధుర స్వాగతం!!!
మీ అందరకూ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు...

నీకొక లేఖ - ఇట్లు నీ అభిసారిక!

ఎంత మౌనమీ ఉదయం!
గలగలల కొబ్బరాకుకే కదలిక రాని మౌనం,
విడివడని మొగ్గల్లో విడదీయలేని మౌనం,
అంతటా స్తంభించిన గాలిలో మౌనం,
తెల్లగా విస్తరించిన మబ్బులో మౌనం,
ఇవే నీకు నా రాయబారం!

ఇన్నిటా మరింత మౌనంగా చలించే నా హృదయం,
మెల్లగా సాగుతున్న నా నిరీక్షణం,
చల్లగా వస్తున్న మన సంగమతరుణం,
నీకై నాకై నేల్కాంత వేసిన పూపొదరిళ్ళు,
తరువులు పరిచిన చివురు పరుపులు,
నీ ఒడిలో నిదురించే నా కళ్ళు,
అవిగో అక్కడే నా వూహల వేణువులు,
నాలోని మౌనం తటాలున పరుగిడే నీ దర్శనం!

సెలవిక ప్రియా! అపూర్వమీ ప్రేమ జీవనం,
అంతులేనిదీ మధుర కవనం.

మావో మనియాద పడకే!

అయ్యో, ఇట్టనిద్రపోయానేంటి? అమ్మో బారెడు పొద్దెక్కిందే? నడాలి నడాలి మేకపిల్లల్లారా, పాక దాపుల్లో లేదు. నిన్ననంగా వచ్చాము, పాడు సూపు, చంద్రున్ని సూసి నిలుచున్నకడనే నిదరోబెట్టింది. తియ్యంగ కలలుగంట ఈడనే తొంగున్నా, పాడుకుంటా తొంగున్నా, ఏదబ్బ నే పాడిన పాట, ఆ గురుతుకొచ్చేసింది

గాలి గొల్లడు మళ్ళీ మళ్ళీ తోలుతున్నా
మత్తు వీడని నల్ల మబ్బు మేకపిల్లలు ఒళ్ళు విరిచి దొల్లిగింతవేసినట్లు
ఆకసాన అదో అందం
రేయి తొలగి వెళ్ళివస్తానంటున్నా
హత్తుకున్న తీపి తలపులు ఎద వీడి వెళ్ళమన్నట్లు
పరవశాన మదిదీచందం

మావెంత
గుబులెత్తినాడో? గుండేపగిలేలా అరిసినాడో? అసలేమైనాడో, నా కోసమని మంచేమీనే తొంగునేవున్నాడేమో పిచ్చి నా మగడు. వేగిరం పోయి ఆడాకలి తీర్చాలి. పదవే తల్లీ నా మచ్చల మేక, నన్నొగ్గీసినావంటే మెకమో నిన్నేసుకపోతది.

ఇదేంటి దారికాచావ్ దొరా? బాబ్బాబు, పాలు కాసుకోవాల? మురిపాలు కూర్సుకోవాలా? మావ కడకు పరుగులెట్టాలా? సాల్లే నాకేటి పొద్దున్నే నీతోటి సరసం? మరి నే పోయొస్తా, కూసింత తప్పుకో. మాపటికి మళ్ళీ తీరిగ్గా వస్తేవస్తా [నా మావ నన్నింటికంపిస్తే], వూసులాడుకుందాం. ఇప్పటికి ఇదిగో నాకో సాయంసేత్తావా, మా మల్లి నడిగి గుప్పెడు బంతిపూలట్టుకొచ్చి ఇచ్చిపో సామే ;) మరదే అన్నీ ఆరాతీకూడదు, మొగుడూ పెల్లాల మధ్య మరి లచ్చుంటాయ్, అన్నీ ఎట్టాగేటి ఇప్పిసెప్పేది? సూసినడేం, మూల్లోనే మరం మొక్కేసా, మావకిష్టమని, తొక్కీసినావనుకో, మావ మనియాద పడతడు, నా మీద సెయ్యేయనంటడు. పాపం నీకెందుకని ఇద్గో ముందే చెప్పుంచుతున్నా మరి...చదువరులకో గమనిక: వ్రాతల్లో మాండలికాన్నీ వెదక్కండేం. ఏదో పిల్లగాలికి తొణికిన చిలిపి వూహ మాత్రమే.

నారాయణ నారాయణ ఇదీ కథ కాని కథే!

నెప్పో, నొప్పో ఏదో ఒకటి అనుకుందాం. అది తలకో, వంటికో,పంటికో రానూవచ్చు, పోనూవచ్చు. పోదూ అంటే వుంటదేమో పూట, కాదూ రోజు, కాదు కూడదు అంటే ఒక వారం. కానీ మన, పోనిద్దురూ, అలా అనుకుంటే పోలా, అంతా మనవాళ్ళేగా?, నారాయణకి మాత్రం పంటి బాధ పట్టిపీడిస్తూనేవుంది. అదీ ఒక రకంగా కాదు. అసలందులోనే వుంది అసలు సిసలు తిరకాసు. ఎందుకొచ్చిందీ గాని, కాస్త పరమ రహస్యం కూడా చె[వి]ప్పేస్తున్నాను.
******************************

ప్రొద్దు ప్రొద్దున్నే పానకాలస్వామి/పాకాలు తాత పొలికేకలకి వులిక్కిపడుతూ లేచేవాడు పదేళ్ళ వయసున్న నారాయణ. "ఒరే అబ్బీ, ఏం నిద్రరా ఇది. మారిలా రా, పాకెనుక యేపచెట్టెక్కి నాల్గు పందుం [పళ్ళు తొమే] పుల్లలిరుచుకురారాయ్యా" - అదీ వాటికర్ధం. తప్పదు మరి మరమరాలు, నిమ్మతొనలు, తేగలు ... ఇలా లాభాలు కోకొల్లలు. ఒక్కోకాలంలో ఒక్కో బాధ - చెట్టునున్న చీమలకాట్లు, పళ్ళకాలంలో నెత్తిన మొత్తిపోయే కాకులు. బుల్లబ్బాయికి [అబ్బ! వీడేలేండీ అబ్బి, బుల్లబ్బి అన్నీనూ] మరో నాలుగేళ్ళువచ్చేసరికి వాళ్ళ శంకరమన్నయ్య పెళ్ళీనూ, వదిన నాగలక్ష్మి ఆగమనమూను. నూగుమీసాల మన మరిదిగారికి లక్ష్మన్న కన్నా హనుమంతు లక్షణాలు అబ్బాయంటే అది వదినమ్మ చేవేను. సరే, కథలోకి వచ్చేస్తే చిగురు జామ ఆకులు సుతారంగా నమిలి దంతధావనం చేసేది బంగారి. అత్తగారు మాత్రం దాలిపొయ్యిలోని వెలిబూడిదే వెండంత గొప్పగా తన పంటి మెరుగులకి వాడేది. నాల్గు వీధులు తిరిగి, చివురాకులు ప్రోగేసే రంధిలో తన పళ్ళుతోమటం తప్పదుగా పిచ్చికుంక - చప్పారిందో లేదో చూడక పొయ్యిలో వేలెట్టి కాల్చుకు చచ్చేవాడు.

ప్రక్కింట్లో దిగిన డ్రాయింగుమాస్టారి మరదలు మాధవి మరీ సుతారం. నేరేడుపుల్లతొనే పళ్ళకి బలం అని దృఢంగానమ్మేది. నారిబాబు [మనోడేలేండి] పనీ తననెత్తినేసుకుని నాల్గు మైళ్ళు [నాలుగు తనకి అచ్చొచ్చినట్లుగా వుందే?] నడిచి మునసబుగారి తోటనుండి నేరేడుపుల్లలేరుకొచ్చేవాడు. అక్కడితో ఆగితే సరి, తనకున్న పళ్ళపొళ్ళ [ఇంగ్లీషులో టంగుట్విస్టరంటారేమో పదాన్ని?] సరదాని తల్లేలాగూ సాగనివ్వదని టోకున వూరందరికీ టౌను నుండి గోపాల్ పళ్ళపొడి, డాబర్ వారి దంతమంజనం వంటివి తెచ్చిస్తూ సంబరపడేవాడు. అదేపనిగా తిరిగేవాడేమో సంచికట్టు దంతాచార్యుడైపోయాడు.

పుణ్యం శ్రీశ్రీమాన్ "చిట్టి" తండ్రిగారిది. ఆయన పేరు అప్రస్తుతం. కంచెల్లో దొరికే గుంటగలగరాకు, తుప్పల్లోని త్రుంటికాడలు, దినుసుల డబ్బాలోని లవంగమొగ్గ వీటన్నిటినీ ఏదోవిధంగా ఎవరో ఒకరి పంటినెప్పికి వైద్యంగా వాడేవాడు. అసలు ప్రయత్నమూ నెరవేరింది. మనవాడికి కావాల్సిందీ దొరికింది - చిట్టి కటాక్షం. సరే వీడూ పెళ్ళికొడుకయ్యడు. చిట్టికి మొగుదూ అయిపోయాడు. మనుగుడుపుల మర్నాడే జానకి [ఇంకా చిట్టంటే కొట్టదా మరి] కుంకుడు కాయ చేతిలో పెట్టి పళ్ళు తోముకురమ్మంది. పనిలో పనిగా పదకింటి గూట్లో తల్లికంట పడకుండా దాచుకున్న తెల్లగా, మెత్తగా, తోమితే తిమ్మిరిగా పైన చల్లగా వుండే కాల్గేట్ పౌదరు డబ్బా వీధి చివరికి విసిరిపారేసింది.

మోజుపడి తను కొనుక్కున్న టూత్ బ్రష్ తల్లి మసిలేనీళ్లలో ముంచి తీసినఫుడు కరిగిపోయిన దాని కుంచెని చూసినపుడు రానంతగా, అది చూసి అబ్బడిగారి అమ్మాజి కిసుక్కున నవ్వినా రానంతగా బాధ పొంగుకొచ్చింది. అయినా మరి మరీ వలచి చేసుకున్న వయ్యరి పడుచాయె. అప్పటుంచీ కుంకుళ్ళే వాడి పళ్ళకి, తలకి, మొలకీను. విధంగా మూడు పదుల పైనేసాగిపోయినంది. జానకి ఆరోగ్యసూత్రల్లో సులువైందీ, మొదట [డిగ్రీది] అదని యెవరూ చూడనపుడు చెప్పి, యేడ్చినంతపని చేసేవాడు వెఱ్ఱి వెధవాయ్.

పిల్లలు ముగ్గురూ పెద్దయ్యారు. పిల్లలకి పిల్లలూ పుట్టుకొచ్చారు. వారి కొరకు అమెరికా ఎగిరివచ్చారు తాతా, మామ్మలు. జానకమ్మ కాస్త పట్టు సడలించి మొగుడి మోజులకి కాస్త వూపిరాడనిచ్చింది. మనవరాలు నోరంతా గిరగిరా తిరిగే బ్రష్ వాడటం చూసి, ఈయన ముచ్చట పడితే కోడలు మావగారికీ ఒకటి కొనితెచ్చింది. రంగుల రంగుల బ్రష్ మీద మరిన్ని వన్నెలున్న జెల్ పేస్ట్ వేసి తొలిసారిగా చేస్తున్న దంతధావనంలో మునిగి తేలుతూ, మునకలేస్తూ [ఆనందంలో] మైకం [, అదే అదే సంబరం] వదిలించుకొనేసరికి ముందు మూడు పళ్ళూ వూడివచ్చాయ్ ముసలి పీనుక్కి.. ఇక ఆపై వాడి ఏడుపో, శోషో, సోపో మనకి అనవసరం కాని పంటి దాక్టర్ జాన్ అబ్రహాం గారికి మాత్రం కాదు సుమీ! అయినా సొంతూర్లో వతనుగా వెళ్ళే రాంబ్రహ్మం గారి కన్నా సులువుగా, సూక్ష్మంగా, పనికానిచ్చాడట. మానవుడు. అబ్బబ్బబ్బా ... చెప్పే కొలదీ చేట భారతమండీ బాబు!

కట్టుడు పళ్ళు, కష్టాలు, పాపం పరాయి వారికి కాదు కదా, పగ వారికి కూడా రాకూడదని పాట్లు పడ్డ నారాయణ గారి పంటి బాధ [గమనిక: బాధ చాలా లోతైంది యెందుకంటే కనీసం ఓవెయ్యిమంది వాడి ఖాతాదారులు సేవలందుకొనివుంటారు (పాకాలు మొదలుకొని, నూకాలుమీదుగా, సీతాలు చెంతగా .. నూకాలు)]. మీరు నవ్వేస్తే నా కథ ధన్యం అలాగే నిజమూను. వాడితోనే పుట్టి, వాడు చెట్టెక్కి విరిచి విసిరేసే పుల్లలేరి, తనే క్రింద పడితే కట్లు కట్టి, అవి చూసి అమ్మాయిలు ఏడిపించారని వుడుక్కుంటే ఓదార్చి,నారాయణుడికి నరుడి మాదిరిలా వాడి వెన్నంటే వున్న వీ[]ర్రబాబు మాటలివి.

ఇపుడు చెన్నైలో పంటి డాక్టరీ చదివే మనవరాలికి తోడుగా వున్నాడులేండి. వీలయితే కలవండి, సశేషమైన కథకి తరవాయి భాగం దొరకొచ్చు, మీరు మన బ్లాగర్లందరకూపంపొచ్చు.