ఈ సిగ లెక్కెక్కడ తప్పుతోందబ్బా?

"గంపడక్కడుంటే గుప్పెడేనా నాకు మల్లెమొగ్గలు?"
అక్క కెప్పుడింతే తెలియవసలు లెక్కలు!

దాని జెడ జానెడు, నాది బారెడూ.
నా నడుము సన్ననైతే, దాని జుట్టు సన్నం.
దాని ఛాయ ఎరుపు, నా కురులు మరీ నలుపు.
నా సగటు లెక్క దానికవదేంటో అర్థం?

అందుకే మేమిద్దరం ఎపుడూ ఎడమొఖం, పెడమొఖం.
మూరెడు జాజులు ముడిచినా, మొగలిరేకులు తురిమినా,
నా అందం నాదేను, నా పూలజెడ నిండు గోదారేను.
టెక్కు దీనికెక్కువని, తప్పులొప్పని లెక్కకే మా అక్క తిప్పలు.

ఓ మూర గౌరమ్మత్త సవరానికిచ్చినా,
మరో మూర ఏడుకొండల ఎంకన్న మొక్కు దీర్చనిచ్చినా,
మా తోటమాలి రాములికెరుక నా సిగ పరవళ్ళ గంగమ్మేనని,
తాను వేసిన విరజాజి కుదురు నా ముడి ముందు తలవంచకతప్పదని.

గుబురు నా జుట్టు గోరింటలడిగినా, ఇపుడూ ముప్పేట పేనిన కొబ్బరితాడేను.
గొప్పలకి పోయి ఎదురింటి బబితక్కలా బాబ్కట్టేయించుకున్న, మా అక్క మొఖం కొబ్బరిచిప్పేను.
వీపంతా నాకు వుంగరాల జుట్టేను, అక్కకి మాత్రం ఐదు వేళ్ళకే వున్నాయి ఆరు వుంగరాలు.
ఇన్నేసి లెక్కలు విపులంగా విప్పి చెప్పినా తెలవదంటదే తెలివితక్కువ మా అక్క నా గొప్ప?

*** ఇదిగో ఇదేం బాగా లేదు, నువ్విక బాధల్ని సినిమాల్లో కూడా చూడకన్న మా అపురూప చిన్నారికి [సబ్ టైటిల్స్తో తమిళ "ఆటోగ్రాఫూ", అవి లేకుండా తెలుగులో "మాతృదేవోభవా" చూసేడ్చానని ఎందుకొప్పుకున్నానబ్బా?] నా నెనర్లు

***** నాలో వెలితికి తన హాస్య శైలి, శిల్పం నింపి ఆ లోతు కప్పుతున్న నేస్తానికి నా జోహార్లు

17 comments:

  1. something special..ఎక్కడో ఏదో బావున్నటుంది.. ఆలోచనల అగాదాలు చూపించబడుతున్నాయి...ఎంతయినా కొంత వింతగానే వుంది చదువుతుంటే...ఒక రకంగా బాగానే వుంది. చివరికి నవ్వుకున్నాననుకోండి..:D

    ReplyDelete
  2. ధన్యురాలను పృద్వీ! అగాథాలు, దిగంతాలు వదిలి తిరిగి ఈ లోకంలోకి ఇప్పుడిప్పుడే తొంగిచూస్తున్నానులేండి. వింతలలాగే వుంటాయి కాదు మరీ వింతవింతగా!!! చివరికి నవ్వేసారు కదా అదే పదివేలు.

    ReplyDelete
  3. మరువం అంటే అర్దం ఏంటండీ?

    ReplyDelete
  4. మీరు భలేవారేనండి, ముఖచిత్రం చూడలేదూ, బాపు బొమ్మంత వుంది కదా! ఆ నాకు తెల్సిపోయింది లేండి, మీ మాటల్లో శ్లేష. సంతోషమండి, నను 'మరవం' అని మీ వంటి సాహిత్యమిత్రులు చెప్పకనే చెప్తుంటే. "అబ్బే! ఇవేవీ కాదు నాది సూటి ప్రశ్న" అంటారా then we are not on same page, so http://maruvam.blogspot.com/2008/12/blog-post_18.html చూడండి, బహుధీర్ఘంగా చర్చించాం ఈ అంశమక్కడ.

    ReplyDelete
  5. మరువం అంటే సువాసనలు వెదజల్లే ఒక మొక్క శరత్ గారు.. వాటి ఆకులు తుంపి మల్లెలలో .. జాజులలో .. కనకాంబరాలలో కలిపి మాల కడతారు .. మరి ఇంకేమన్నా అర్దం ఉందేమొ నాకు తెలియదు :)మొత్తానికి నా వాలు జడ క్రిష్ణవేణి.. నా పూల జడ వెన్నెలా గోదారి అని బలే చెపారు ఉష గారు :)

    ReplyDelete
  6. ఓ పిక్ లోనే పెట్టారా! మరువం అని ఎక్కడో విన్నా అని లీలగా గుర్తుకువస్తోంది, ఏంటబ్బా అనుకున్నాను. మీ ఆ టపా చూసాక అర్ధం అయ్యింది. మీ బ్లాగ్ చూస్తుంటే వెన్నెల్లో నడుస్తున్నట్లుగా వుంది.

    మీ పేరే - చాలా మామూలుగా వుంది - ఏ నిషిగంధ లానో చక్కటి కలం పేరు పెట్టుకోకూడదూ! (నిషిగంధ - తన కలం పేరో, నిజం పేరో తెలియదు). పేరులోనేమున్నది అంటారా? సరే.

    ReplyDelete
  7. ఏం బావుందో చెప్పలేనుకాని నిజంగా చలా నచ్చింది
    ఒక్కోలైన్ నాలో కొన్ని జ్ఞపకాలను కూడా గిచ్చి లేపినట్టయిది
    చిన్నప్పుడు గ్లాసుతో కొలిచి పంచుకున్న మల్లెమొగ్గల సువాసన ఒక్కసారి పీల్చినట్టైంది

    ReplyDelete
  8. నా బ్లాగుకి వెన్నెలంత అందాన్ని అపాదించటం, నాకు వేయి పున్నములు చూసినంత పున్నెం.
    అవేమీవద్దుగానీ నన్ను నాతోనే పుట్టిన నా పేరుతోనే పోనీయండి శరత్ 'కాలం' గారు. ఈ x గారి కూతురు, y గారి కోడలు, z గారి ? వివి విసిగిన ప్రాణమిది, నా పేరుతో నన్ను పిలిచే, తలిచే ఈ ఒక్క లోకంలోనైనా నన్నిలా ఉషగా వుండనీయండి :) అమ్మో ఒక్క మాట ఎంత పని చేసిందీ అనుకుంటున్నారా?

    లలిత గారు, లెస్స పలికారు, మా అమ్మమ్మ పెరటి బొండుమల్లె ఎపుడూ నిండు మొగ్గల చూలింత. ఎటొచ్చీ నూజివీడు కృష్ణవేణమ్మ గారి 5 పైసల గాజుగ్లాసే 100 మొగ్గకూడా పట్టనంత ఇరుకు, ఆమేమో 10 మొగ్గలు కూడా కొసరీయని పిసినారి, ఏంచేస్తాం తప్పలేదు అపుడపుడూ ఆమే నాశ్రయించటం మేమావూర్ళో వున్న ఒక్క ఏడాదీ సగం వేసవి ...

    ReplyDelete
  9. అవునండి నేస్తం, అదే పాట గుర్తుకొచ్చింది నిజంగా, "నా వాలు జడ క్రిష్ణవేణి.. నా పూల జడ వెన్నెలా గోదారి, నా వళ్ళు గంగమ్మ పరవళ్ళుగా, నర్తించిన ..." అవునూ, మీరా సినిమా చూసారా? భానుప్రియ ఎంత బాగా నర్తించిందో ఈ పాటకి. మరువంపై మీ ఈ మరో నీటిచిలుకు తప్పక వేయిస్తుంది మరో పచ్చనిచివురు.

    ReplyDelete
  10. చాలా బాగా రాశారు. ఈ మధ్య కాలంలో మన బ్లాగుల్లో ఈ మాత్రం పట్టున్న రచన చదవలా.

    ReplyDelete
  11. మీ మాట నాకెంతో ముదావహం. పొగడ్త పన్నీరువంటిది చల్లుకోవటానికే కాని తాగటానికి పనికి రాదు [చదివి మనసుకి వంటబట్టించిన పాఠం]
    ఇక ఈ బ్రతుకు పయనంలో, వేల మజిలీల్లో నేర్చినవి...
    ప్రశంస పాలవంటిది - దాహం తీర్చలేదు
    కళాదాహం తీర్చేవి - భావసారూప్యం, సహవాసుల సామీప్యం. That's why please see me soon in here. And please please come again and again :)

    ReplyDelete
  12. మీ అల్లనల్లన పదాలలలో ఏదో తెలియని ఆర్తి, మనస్సుని పట్టి లాగేసే పదాల లాలిత్యం, చదివాక ఇదీ అని చెప్పలేని ఓ భావన,.....మీ బ్లాగు పేరుకి తగ్గట్టుగానే ఉన్నాయి మీ భావాలు కూడా.

    ReplyDelete
  13. శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా మాదిరే ఈ సిరిసిరిమువ్వ నటనమాడ తరియించె నా కవితజన్మ. మీ వ్యాఖ్యకి వందనం.

    ReplyDelete
  14. ఇంతకీ మీది వాలే జెడా మీ అక్కది వాలని జెడా అంటారు. అంతేనా? :P

    ReplyDelete
  15. అయితే లెక్కల్లో మీరు ఘనాపాటేనన్నమాట. మా అక్కకి వెంటనే చెప్పాలి ;)

    ReplyDelete
  16. తామసి మీ కొప్పున దూరిందో, మల్లెల వన్నెల వెన్నెలపై పగ పట్టిందో

    ReplyDelete
  17. ఆ తామసి సమసిపోయే ఈ ఆశ్రమవాసిని జనించింది. ఇక కొప్పూ లేదు ఆ కొప్పున మల్లెలూ లేవు :) [జుట్టు డొనేట్ చేసేసా] మల్లెల వన్నెల వెన్నెల మాత్రం ప్రతి పున్నమికీ వతనుగా పలుకరించిపోతుంది. చెలిమి చేయ రమ్మని చెంతకొచ్చి చిలిపినవ్వులూ నవ్వుతుంది. పగలులేవు వగలూ లేవు. ప్రశాంత వన విహారాలు, అపుడపుడూ వినోదాలూ, విలాపాలూ మిగిలాయిట.

    ReplyDelete