Darkness and Silence

As if you are imprisoned
Did walls grow around you?
Well, does it matter, when you aren’t alone
And your steps still see no light?

Darkness is the only comrade,
Silence shivers at the slightest tremor
A drama goes behind the un-raised curtain,
And all the characters play the same tune.

From the cracks of the window
Light sneaks in like a thief,
Having had to live with an adamant lizard
Was the cursed fate of the winged insect.

On the door ajar lie,
The finger prints of the unknown
Even on the life of unrealised dreams
Runs the writ of anonymous Wills.

Darkness got familiar with speech,
Stillness appreciated the angst; and,
When the un-ceding lamps knocked at the door,
Silence receded to far off shores.

*****
చీకటి – నిశ్శబ్దం  

చుట్టూగోడలు కట్టుకున్నాయా,
గదిలోపల బందీలా?
ఏదైతేనేం ఒంటరి కానపుడు,
వెలుగు వైపు అడుగు పడనపుడు?
గది లోపల సహవాసులు చీకటి,
సవ్వడికి వణుకుతూ నిశ్శబ్దం.
తీయని తెర వెనుక నాటకం,
పాత్రలన్నిటికీ ఒకటే స్వరం.
కిటికీ పగుళ్లలోంచి
వెలుగు దొంగ జొరబాటు,
మారని బల్లితో సావాసం
రెక్కల పురుగు గ్రహపాటు.
ఓరగ మూసిన తలుపు మీద
అగంతకుల వేలి ముద్రలు,
తీరని కలల బతుకు మీదా
అ/పరిచితుల వీలునామాలు.
చీకటికి భాష అలవడింది,
స్తబ్దతకి ఘోష అర్థమైంది.
మలగని దీపాలు తలుపుతడితే,
నిశ్శబ్దం దూరతీరాలకి నడిచిపోయింది…

Restless Traveler

When I look back now,
behind me I see,
miles-long amaranthine trail of life
I walked through to reach my temple of satiation…
It might be rough, rugged and patchy
yet it was my becoming; and people
true, intimate and uninhibiting were the landmarks.
Tossed about the passage were
the hillocks of my successes;
vales of despair and ladders of life’s longings
that lifted me up from abysses;
moments of merry broadcast by the treescape;
plains of perennial flowers;
and was dotted with cactuses of agony,
which even grief would refrain itself from.
It was an ineluctable marathon run,
no matter whether I was thirsty or tired.
And, whenever I suspended the run to catch my breath,
neither could I appropriate the sojourn,
nor it turned out to be a breather.
There were scores of colleagues,
to the left, to the right, to the fore and behind,
each going their own way,
making no meritable streak on my touchstone.
Now, when I look ahead,
an inexplicable impulse seizes me to move forward.
Seas of disturbing nightmares and
volcanoes of distresses have passed memory’s reach.
Calling of meadows of fulfilment
and turfs of salvation is invitingly alluring.
Unto the last step of my journey,
I am a restless traveler.

*****

బహుదూరపు బాటసారి

ఈ తరుణాన వెనుదిరిగి చూస్తే వేవేల క్రోసుల నా జీవితబాట,
తృప్తిసౌధం చేరగ నేను పరుచుకుని నడిచొచ్చిన రహదారి.
గతుకులున్నాయి, అతుకులున్నాయి, అయిననూ పొందికైన అమరిక.
అరమరికలేక అంటిపెట్టుకున్న ఆత్మీయులే అట మైలురాళ్ళు.

అచటచట బాట ప్రక్కగా నా లక్ష్యసిద్ధి నిలిపిన గిరులు,
నిరాశలో కృంగిన లోయలు, వెలికి తెచ్చిన ఆశయాల నిచ్చెనలు.
నవ్వుల క్షణాలు విత్తులుగా నాటిన తరులు, పూల వనాలు,
నడుమ వేదన ఘడియలే తాకవలని ముళ్ళజెముడు పొదలు.

బడలిక వున్నా, దప్పికగొన్నా కొంత పరుగూ తప్పలేదు.
పరుగాపి విశ్రమించిన ఏ మజిలీ నాది కాలేదు, నిలవనీయలేదు.
ఇరుప్రక్కా, వెనుకా ముందూ పయనించే సహచరులు కోకొల్లలు.
ఎవరి దారి వారిదే, వేగమెంచ ఎవరి గీటురాయీ నాది కాదులే!

ముందువైపు చూపుసారిస్తే ఎందుకో వేగంగా సాగాలన్న అత్రుత.
కలల కల్లోల సాగరాలు, వెతల అగ్ని పర్వతాలు కనుమరుగైనాయి.
సాఫల్య మైదానాలు, కైవల్య పచ్చిక బయళ్ళు వూరిస్తున్నాయి.
నా త్రోవ తుది వరకు నేను అలుపెరుగని బహుదూరపు బాటసారినే!!!

దైవం సర్వస్వం స్వయం సంకల్పితం + విశ్వప్రేమ = సోహం

దైవం-సర్వస్వం-స్వయం సంకల్పితం + విశ్వప్రేమ = సోహం
పసిమొగ్గ కానీ ప్రాయం లో ఉన్న మనిషి కానీ ఆఖరుకు ముసలివగ్గు అయినా బలాత్కార మరణానికి పాల్పడటం కుటుంబం, సమాజం వైఫల్యం.. "మృత్యువా! నీ అకాల ఆగమనం మటుకు మానవతని మట్టి కరిపించడమే..." అని నిరసిస్తూనే-
"మదనమంజరి"చలన చిత్రం నిర్మాణ సమయంలో personality, voice, behavior, talent ఉండీ రాణించలేకపోవడానికి విఠలాచార్య చెప్పినట్లు 1980 నుంచి 19 సం. ల శనిమహాదశ లో జీవితం సాగడమే నని దృఢం గా నమ్మిన వ్యక్తి రంగనాథ్ గారు. అప్పుడే "శని జ్ఞానకారకుడు, ఎంత జ్ఞానం మనిషికి ఇవ్వాలో అది ఇచ్చేసాడు నాకు," అని విశ్వసిస్తూ, "ఆ జ్ఞాన సముపార్జన తో నాదైన ఆథ్యాత్మిక సిద్ధాంతం కనిపెట్టాను 'అసలు దేముడంటే ఏమిటని?'" అంటూ "శనిని ఎంతగానో ప్రేమించాను," అని ధీమాగా పలికిన తొలి వ్యక్తి కూడాను. నా వరకు ఆరాధ్యనీయుడు, మార్గదర్శి, destiny అనేది భవిష్య దర్శిని అయితే అది తనకు కొంతవరకు తెలుస్తుంది అని మరే అనుమానానికీ, ప్రశ్నకీ తావీయనంత బలమైన ఋజువులు కూడా చూపారు.. ఉదయపు ఆవేదన ఉద్వేగం అణిగాక ఇపుడు ఆయన స్వచ్చందం గా లోకాన్ని వీడిపోయారు కావచ్చు అని ఆశ గా భావిస్తూనే, ప్రాపంచిక దృష్టిలో అనుమానాస్పదం అయిన ఆ మరణం రవంత శంక కి తావీయకపోవడం మనసుకి నేర్పలేదు కనుక..
రంగనాథ్ గారు నాకు నాలుగు సార్లు ఎదురయారు, ప్రతిసారీ ఒక కొత్త పార్శ్వాన్ని పరిచయం చేస్తూ. 1975 ప్రాంతాల్లో ఆయనది సాటిలేని నటుని స్థానం, బాలు గళమా, రంగడి నటనా 'మేటి?' అన్నది తేల్చుకోలేని మేలుకలయిక. అప్పటి సినీ గీతాభిమానులు అందరిలానే తరువాతి 5 ఏళ్ళు ఆ పాటల మననం చేస్తూ ఒక రూపుని పరిచయం చేసుకున్నాను. తిరిగి 1985 లో ఆయన మేకప్ఆర్టిస్ట్ అత్తామావగార్ల ద్వారా సినిమాలు లేకపోయినా నెల జీతం ఇచ్చి కాచుకుంటున్న మంచిమనిషిగా (అపుడపుడే బలపడుతున్న జీవితాదర్శాలకు వాస్తవ మూర్తి గా తోస్తూ) మరొక లోపలి వ్యక్తిని కలుసుకున్నాను. ఆ తరువాత చాలా కాలం అవే ఆయన పట్ల అభిప్రాయాలు ఒకింత గౌరవం తో కూడిన అభిమానము, సాధారణ స్థాయి గుర్తింపు. ఈ మధ్యనే 2012-14 ప్రాంతాల్లో తనలో ఉన్న కవి ఒక్కసారిగా సాక్షాత్కరించాడు, అప్పటి నుండి అందరికీ అదే చెప్పేదాన్ని "గొప్ప తాత్త్వికత ఉన్న కవి, కవిలా బ్రతికే ఉన్నతుడు," అని "పదేళ్ళకు పైగా పసిబిడ్డలా భార్య సాకిన పవిత్ర మూర్తి" అని ఆపేక్షగా. అప్పుడే ఒక్క సారి కలవాలని అంతగా బలం లేని విఫల యత్నాలు చేసాను. 2015మార్చ్ లో " open heart with rk " చూస్తూ కొన్ని మాటలు నోట్ చేసుకున్నాను. అవే ఆయనలోని దార్శినికతను, ఆథ్యాత్మిక పటిమను చూపి ఒక గురువు గా నాలుగవ- మూర్తిమంతమైన- ఆ మానస దేహాన్ని కనులెదుట ఆవిష్కరించాయి. అవి నాన్నగారికి చెప్పకుండానే ఆయన నా జీవితం నుంచి నిష్క్రమించారు. అటు పిమ్మట నా నైరాశ్యం వలన ఒకరిద్దరికి చెప్పినా ఒక పోస్ట్ గా రాయగల స్ఫూర్తి కూడదీసుకోలేకపోయాను. ఇక, ఇవాళ కూడబలుక్కునో, కూడగట్టుకునో ఈ పదిముక్కలు చెప్పలేకపోతే నాలోని పశ్చాత్తాపం ఆయన నేర్పిన పాఠాన్ని మర్చిపోయేలా శిక్షిస్తుంది, కనుక-
1) కవిగా చెప్పాలంటే ఇంకా మంచివి రాసారు; ఈ వస్తువు "భగవంతుడు" ని ప్రక్షాళన చేయడమే దేవుని లక్ష్యం అన్న అంశం తో వెలువరించారు. కనుక, ఒక ఉదాహరణగా అదొక్కటి చాలు ఆయన ప్రతిభకి ప్రతీక గా, సున్నితమైన తన కవిత్వ ధోరణిని తెలుపడానికీను (జత పరిచాను)
2) భగవంతుడు ఎవరు? దేముడిని ఆల్జీబ్రా లో x ను చేసినట్లుగా ఎలా workout చేయాలి? అని దాదాపుగా 2 దశాబ్దాల పాటు యోచన అనుభవాల మీదుగా తనదైన ఆథ్యాత్మిక సిద్ధాంతం కనిపెట్టారు. సున్న/0 గా దేముణ్ణి ఊహించుకుని తరచి తరచి దైవం సర్వస్వం అయితే ఆ రెంటినీ కలిపే సూత్రం 'స్వయం సంకల్పితం' అని తీర్మానించారు. ఎలా కలిపి చూసినా ఏంటో అర్థవంతమైన పదార్థం ఆత్మని తాకుతుంది దైవం సర్వస్వం, దైవం సర్వస్వం స్వయం సంకల్పితం, స్వయం సంకల్పితం దైవం అనే ఈ cyclic phenomenon నాకెంత ప్రియంగానో తోచింది. "సంకల్పశక్తే దైవం, దైవ సంకల్పమే విశ్వం గా రూపు దిద్దుకుంది. అది మనలోనూ ఉంది. విశ్వ సంకల్ప శక్తికి plug చేసుకుని మనలోకి charge చేసుకోవాలి అంటూ ఎంతో విపులంగా చెప్పారు. ఆ ప్రక్రియే "సోహం/ అది నేను" అన్న మూల సూత్రం అంటూ ఆ power లోనికి ప్రవహింప చేసుకోవచ్చు. సంకల్ప శక్తి ఎంత పెరిగితే అనుకునేవి అంత త్వరగా అవుతాయి (ఇదే మహర్షులు సాధించిన శక్తి)..ఆలోచన అన్నది diversion కి దారి తీస్తుంది, అదీ guilt అన్న భావన మరింత సంకల్ప శక్తిని కోల్పోయేలా చేస్తుంది కాబట్టి నిత్యం ధ్యానం లో ఉంటూ, తప్పు లేవి చేయని మంచి మనసు తో పవిత్రంగా ఉంటే సంకల్ప శక్తిని retain అవుతుంది. అందునా విశ్వప్రేమ- విశ్వం లో అన్నిటినీ సమానం గా ప్రేమించగలిగే గుణం- ని అలవరుచుకుంటే మనమే దైవ సమానం," అని ఒక గొప్ప ప్రవచనం ఇచ్చారు. ఆ స్థితిని సాధిస్తే you can touch god stretch hand అంటూ నవ్వేసారు. ఈ విధమైన మానసం, స్వభావం అన్నవే Buddhism షిర్డీ బాబా, జీసస్ చెప్పినవి, చూపినవి అని చెప్పటంలో ఆయనెంత క్షుణ్ణంగా అధ్యయనం చేసారో తెలుస్తుంది. కనుక, కనిపించే ఆనవాళ్ళలో, ఉనికిలో దైవాన్ని వెదుక్కునే నాకు ఆ మానవతా మూర్తిలో ఒక పరిశుధ్ధాత్మ, పవిత్ర జీవన యానం తో స్థితప్రజ్ఞత సాధించిన కారణ జన్ముడు గోచరిస్తున్నారు. ఆ ఆత్మ కి పాదాభివందనం తో ఈ స్మృత్యంజలి !!! _/|\_
* An art by Brahmachari Purna Chaitanya of Chinamaya mission as sent to us in a letter dated 19th Dec 1977 (See the date coincidence as I just noticed) 38 years old "an art Tree with 'Om'" from my first spiritual guru is used as a memorial for a soul I respect much. Universe has a reason for everything.. and, రంగనాథ్ గారి ఆథ్యాత్మిక సిద్ధాంతం, I drew it with my understanding based on his explanation

అడవిమనిషి

జనారణ్యంలో ఇంకేముంది?
మాటల ఈటెల పోట్లు,
చూపులు దింపే బరిశెలు,
ఆలోచనకి పట్టిన గ్రహణాలు,
ఆగడాలు ముదిరిన వ్యసనాలు,
అసమర్థచేతల అంటురోగాలు,
జీవన్మృతుల మైలలు,
మాటతెలిసిన మృగాలు,
వేటమరిగిన వ్యాఘ్రాలు,
గాండ్రించు జింకలు,
గర్జించే నెమలిపిట్టలు,
ఈ మెట్టినింట నేను నడిచే బొమ్మని.

అభయావాసం ఇంకెక్కడవుంది?
అడవి నా పుట్టినిల్లు,
అడుగడుగున నేస్తాలు,
పచ్చికబైళ్ళు పట్టుకంబళ్ళు,
పూలసరాలు ఆభరణాలు,
లేతరెమ్మలు వీవెనలు,
గాలిస్వరాలు వేణువులు,
ఎగిరే రెక్కల కచ్చేరీలు,
కదిలే పాదాల నాట్యాలు,
స్వస్థానాన నేను నవ్వే మనిషిని.

శరత్ జగతి

కొమ్మలు విరుచుకుంటూ తీరిగ్గా ఈ చెట్లు-కొందరు గోళ్ళు కొరుక్కుంటూ కూర్చున్నట్లుగా-
పుట్టింటికొచ్చిన ఆడపిల్ల అమ్మఒడిలో కూరుకుపోయినట్లు
మంచు కొంగులోకి ముడుచుకుంటూ ఉన్నాయి
పొట్టితోకతో ఇటుకెరుపు పిట్ట ఒకటి కొమ్మ చివర్న రేకు మందారం లా రెక్కలు విచ్చుకుని
పాటలు నా వంతు అన్నట్లు కిటికీలోకి వంగి వంగి చూస్తుంది
టీ కప్పులో సెగలు బిగిసిన చర్మాన్ని తొలుచుకుని ముఖాన ఆవరించుకుంటున్నాయి,
ఫాక్టరీ గొట్టపు పొగలూ మంచు తునకల పైకి ఎగిసి ఆకాశాన్ని ఎక్కుపెట్టుకున్నాయి
తొలిచీ తొలవని గుట్టలోకి కలుగులో ఎలుకల్లా పిలకాయల చేతులు లాఘవం గా పాకుతున్నాయి,
మట్టికావచ్చు, ముద్దలు కట్టిన మంచు కావచ్చు ప్రతిమగా మలిచేందుకు...
ఎక్కడా చురుకు లేదు, కదలికలు మలిగిందీ లేదు
చిక్కగా ఎండలేదు, చలి చెర వీడేదీ కాదు- మరి ఇకప్పుడు
ముక్త కంఠం తో ప్రకృతి జీవనగీతికి హారతి పడుతూ,
తనువున, మనమునా శరత్కాంతుల చంద్రుని చందనాల, ఉధత్కిరణజలుని జాలంలోకి నెడుతూ...
వెన్నెల మాసపు వన్నెల చిన్నెల వగపు వెల్లువలో ముంచెత్తుతూ ఇలా!!!

ప్రవాహమైన "త్రిపద" లట!

1-
పాట
ప్రవాహం
పరవశం
-2-
నది
ప్రవాహం
సాగరకాంత
-3-
కథ
ప్రవాహం
పాత్రోచితం
-4-
మాట
ప్రవాహం
ఇష్టాగోష్టి
-5-
వేట
ప్రవాహం
మత్స్యజీవి
-6-
బాధ
ప్రవాహం
విలాపము
-7-
నవ్వు
ప్రవాహం
సంజీవని
-8-
ధ్వని
ప్రవాహం
సంగీతము
-9-
భక్తి
ప్రవాహం
కైవల్యము
-10-
కళ
ప్రవాహం
అక్షయము

*****
(సహృదయతతో అందరినీ ఆకట్టుకునే నూతక్కి బాబాయ్ గారికి సహకారం ఇస్తూ, ఇలా ఓ పావుగంట ప్రయోగం, నాకు కాస్త సవాల్ నేనే కల్పించుకుని 'ప్రవాహం' అనే పదం రెండవ పదం గా వాడాను ఈ పది త్రిపదల లోనూ
"ట్రై."
"త్రిపద"
రచన: నూతక్కి రాఘవేంద్రరావు.

చిరు పద కవితా ప్రక్రియలలో
స్వీయ మనోజనిత సృజితం
వినూత్న ఆవిష్కరణం.

రెండక్షరాలు తొలిపాదం
మూడక్షరాలు రెండోపాదం
నాలుగక్షరాలు మూడవపాదం
భావసారం చిలుకుదాం .

ప్రయత్నించండి
సాధన చేయండి
వస్తువుకా కొదవలేదు
అక్షరాలా అడుగంటవు

కాని
అక్షరాల పొదుపు
భవ్యతకోమలుపు.
..........................................
ఇలా రాద్దాం .నచ్చితే కొనసాగిద్దాం.)

బందీ

ఆగక కురిసే వెన్నెల్లో అప్పుడప్పుడు తారలు వడగళ్ళు అవుతాయి
రాలిపడే ఉల్కల వెంట బాల్యపు నేర్పుతో వెళ్తాను- ఇప్పటికే ఎన్ని వడగళ్ళు కరిగించాను
ఉల్కల, తోకచుక్కలను చల్లార్చాను!?
ఇకిక్కడ వానవిల్లు విరిసింది, లోలోపల ఒక పందిరి నింగిలా ఒంగి
ఇంకాస్త పరుచుకుని రంగుల కలలు, అతుక్కుని, అతికీ అతకక 
అయినా నిరంతరం గా సాగే గానమై!

అందుకే
నెలబాలుడు వస్తాడనుకున్న పిమ్మట అమాస బాధించదు
పున్నమి రానుంది అనేకున్నాక వేకువ రాకపోకలు పట్టవు
నడుమ కృష్ణపక్షపు పూర్వపక్ష కాంతులలో అవే నీలాలు
ఉన్నవి రానివి లెక్కేసుకున్నాక వేదన మనసున నిలవదు...


అయినా...
మసక తెరలు తొలగవు; చీకటి మొగ్గలూ విచ్చుకోవు
రేయంతా యాష్టగా వేసట యెరుగని ఆత్రుతగా 
వెలుగు కొసలు ముడివేస్తూ- నిదుర నిప్పులు ఊదుతూ-
నీడల్లో నీడగా, కదలాడే గోడగా ఇదిగో ఇక్కడే బందీగా విరిసే ఓ కల కోసం...

ప్రదర్శన

తల్లివేరు, తాము విడివడిన కొమ్మారెమ్మల జాడ తెలియని ఆకులు
ఎన్ని ప్రదక్షిణాలు చేస్తూ వెదుకులాటలో!  చీరికలు, మచ్చలు, చీకిన ఈనెలు...
వానధారలో అమ్మదనం కురిసినట్లు-
ఆకులలో మెరుపు వచ్చింది,  నిశ్చలంగా నేలలోకి ఒదిగిపోయాయి

విచ్చుకున్న రేకుల్లో వన్నెకొక వయ్యారాలతో గాలికి ఊగిన పూలు
ఎన్నలేని బింకపు చేతల విరగబాటులో! తుమ్మెదలు, తూనీగలు, చుట్టూ గిరికీలు...
కిరణమాలి సెగదనం కమ్మినట్లు-
సెకనులో వర్ణాలు మాయమైనట్లు, సూర్యకాంతి బింబిస్తూ కొమ్మలోకి ఒదిగిపోయాయి

ఎండావానల ఇంద్రజాలం ఇలాతలం లో ఎందరికి మేలుకొలుపు!? 

జుగల్‌బందీ

చిందులు వేసే ఆకొకటి సీతాకోక చిలుక రెక్కల్లో చిక్కుకుపోయింది
బిత్తరపోయిన గోరువంక చిర్రున ఎగిరిపోయింది. 
చీకట్లు వీడకుండానే తిష్టవేసిన చిక్కటివాన పగటిరేడుకి దారి కాచినట్లుంది,
చిమ్నీ చుట్టూ దీపపు పురుగుల మాదిరిగా నిప్పుగూడు తెరకి గాలులు   

చిత్రమైన కచ్చేరీ:
డెక్ మీద డప్పుల్లా వాన జల్లులు,  
గట్టర్ పైపు వేణువులో నీటి ధారలు
తోచిన ఆటపాటలలో కూరుకుపోతూ పిల్లమూకలు

విచిత్రమైన మౌనం: 
నానిన పూరేకులు కురుస్తున్నాయి కుంపట్ల మట్టిలోకి; తోడుగా,
దొరికిన ధాన్యాలు పోగేసుకుని ఉడుతలు, పిచ్చుకలు
చెదిరిన మొక్కలు సర్దుకుంటూ తోటమాలులు

తెరిచిన కనుల్లో గుండె ని నింపుకుని తేరిపారా చూస్తే,
విరించి కదలాడినా, కృతులు నడయాడినా తనువూ తరిస్తుంది.
తరువుల దాపున ఆకాశ పందిరిలో తడినేల మీద
విరులు పిలిచినా, మొగులు కురిసినా మనసూ మయూరమౌతుంది.

శీతకారు గమనాన

ఓరుగాలి, జడివాన జతపడిన విలయ తాండవం:
కోటానుకోట్ల పత్రాలు ఏరులై, ఏటి నడుమ మేటలై
చీకటి దాగలేని తోపుల్లో,  పిట్టలు విడిచిన మోడుల్లో
అనేకానేక కిరణశలాకలు ఆకులై, ఆకులపొదిలో పూలగుత్తులై
దుఃఖపాటు ఘడియలు ఉన్నపళంగా వచ్చిపడ్డట్టు, 
ఓదార్చే హృదయాలు చరాలున  చేరువైనట్లు 
ప్రకృతి ఉగ్గబట్టిన ఊసుకి వార్థక్యము యుగాంతం వరకు రాదు. 

సాచిన కొమ్మలతో వారిస్తూ "ఉన్నదొక్కటే వసంతానికి ప్రతీక్ష" ఎవరి స్వరమో!?

నేలపొరలో వత్తిగిల్లుతూ విత్తనమొకటి "అంకురమై వస్తా,"నన్నట్లే   

మేల్కొలుపు లోలోపల ఊహలకి, ఊహకందని ఊర్పులకి.

లెక్కకందని భాష్పధారలు ఏరులై, ఏటి నడుమ గుండాలై
తడారని కనులు, తడారిన ధమనులు తెరిపిన పడతాయి
చిగురు తొడిగిన మనిషి పచ్చని వృక్షమై నీడనిస్తే
మొలకల మేనిలో రంగుపూల ఉనికి పెల్లుబుకుతుంది
చిట్టచివరికి జీవనం- గమ్యం చేరిన గమనం- ప్రకృతిపరం
వరమూ అవుతుంది, వేళ్ళూనిన నమ్మికతో విశ్వాత్మ ని దర్శిస్తే.

(తానా పత్రిక నవంబర్ 2015 సంచిక లో ప్రచురితం)

http://patrika.tana.org/november2015/#p=38

సుమసందేశాల...

కథ చెపుతాను 'ఊ..' కొడతారా మరి, ఊహల పల్లకిలో ఊరేగుతారా!?
అనగనగా ఓ గూడు లేని వాడు- బుజ్జిగాడు- చూసినాడు ఒక చిన్నారిని.
బుట్టలో పూలగుట్ట పెట్టుకుని పడినాడు క్రీగంటనైనా చూడని చిగురుటాకుబోడి వెంట
'అకటా! వీడిక సుమసందేశాల పాలబడినాడ'ని నవ్వెనట చెట్టూ పుట్టల పూచేటి పూలన్నీ పులకించి.
(Dt of clicks: 10/07/15 9:12 - 9:15am)

తరు తన్మయం

వెలుగు రేఖలు విప్పుతూ వస్తున్న ఉదయభానుని పలకరించాలని ఉంటుంది-

కొమ్మని పట్టుకుని వేలాడే నిన్నటి జాజులు, మొన్నటి కరవీరలు
పరుచుకున్న పారిజాతాలు, రేకులు తెరుచుకుని తామరలు
వికసిస్తున్న మందారాలు, వేళకాని వేళకే సిద్ధంగా ఉన్న నిత్యమల్లెలు
గిన్నెమల్లి, పొన్న పూలు, కాశీరత్నాలు ...పూచేటి పూలు పిలుస్తుంటాయి

మెలకువ, మరకువ వంతులేసుకుని నా నుంచి నన్ను విడదీస్తాయి

మల్లెలు మధ్యాహ్నానికే వనాలు వీడిపోతాయి 
రాధామనోహరాలు రాత్రీపగలు ఎరుగవు 
కనకాంబరాలు, వాడాంబరాలు, నీలాంబరాలు నిలువరిస్తాయి 
సందె పొద్దు వరకు గాలుల వెంటా, చూపుల నిండా పరిమళాలు, రంగులే రంగులు

రజనీకాంతుని రాకకి సన్నాహాలు మొదలౌతాయి

కలువకి కంగారు మరీ ఎక్కువ కొలను నిండా ఒరుసుకుని...
సంపెంగ గంధాలు చిలుకరిస్తూ గాలులు
మైమరపు మలాము అద్దుతూ ఎన్నెన్నో జాజరలు, నిదురలోకి జారిపోతూ నేను 
వెలుగు ముడుచుకోదని నా రెప్పలే మూసుకున్నానని తలపోస్తాను, చీకటి గుండెలో చిత్రాలు కంటాను

నేనొక తరువునై నర్తిస్తాను- రెమ్మకొక రంగుగా, వన్నెకొక పూవుగా, నాలోకి నేను వికసిస్తాను- ఆనందోదయాన పునః ప్రభవిస్తాను..నేలని వాటేసుకుని పులకిస్తాను.

విడివడ్డ క్షణంలో

ఆ వేకువఝామున
వెన్నెల ఇంకా మలిగిపోలేదు
సందె ముగ్గులు చెదిరిపోలేదు
పారిజాతాలు కొమ్మనే పట్టుకుని ఉన్నాయి
కొబరాకుల మీద కచ్చేరీలు మొదలవలేదు...
ఆ పక్క మీద నుంచి తనూ లేవలేదు
ఫోను తాలూకు ధ్వనులు ప్రాకిపోయాయి
వచ్చినవారు వస్తున్నవారికి చెప్పుకుపోతున్నారు
ఊరివారు వెనకముందుల సంగతులు వీపున వేసుకున్నారు
పనులు జరిగిపోయాయి.
ఇకప్పుడు జరగనివి, జరిగినవి ఒక్కసారిగా ఉప్పెనై
తనవారు, తను మిగిల్చినవి మాత్రమే మునకలు వేస్తూ.
మరణం మరునాటికి ఇంకొక చిరునామా వెదుక్కుంది
జరగరానిది, జరగనున్నవి సాగిపోతున్నాయి
రోజుకొక బతుకువెత బుద్భుద భరితంగా...

కాలమాగదు

వసంత వనాలు, వానమేఘాలూ బోసిపోయాయి
శిశిర సుమాల కాలం ఆసన్నమైందిక-

వెచ్చని ఉదయాల్లో నింగి వరకు పొగమంచు పొంగుతుంది
చిక్కని చీకటితో వెన్నెల మాసాలూ తలపడతాయి

ఖండాంతర వాసానికి వలన పిట్టలు పయనమైపోయాయి
నలుచెరగులా మౌనం ఆవరిస్తుందిక-
బిగిసిన ద్వారబంధాల్లో గాలి గుర్రమై సకిలిస్తుంది
పెరిగిన చలితో నిప్పుల కుంపట్లు పేచీపడుతుంటాయి

ఇందుమూలంగా, నేను చెప్పేది యేముంది!?
శీతాకాలం తాకిపోతేనే వేసవికి విలువుంటుంది
కొన్ని సందెల్లో మరికొన్ని మధ్యాహ్నాల్లో ఇంకొన్ని రాత్రుల్లో
వాతావరణం పలుకరిస్తే శీతకన్ను వేయబోకు, చిన్ననవ్వు విడిచివెళ్ళు

సచిత్రం

పెరుగుతూనో తరుగుతూనో సగమయ్యాడు చంద్రుడు నేటికి
పరుచుకున్న చీకటిని చీల్చుకుంటూ.
తారలుంటాయి ఎపుడో అపుడు మినుకు మినుకుమంటూ
వాలిన పొద్దు దిక్కున-
దిగంతంలోకి మునకలుగా అటుగా సూర్యుడు ఇంకా అక్కడే.
విదుల్చుకుని, విడివడి- ఒకటి వెంట మరొకటిగా మబ్బులు సాగిపోతూ రంగులు మార్చుకుంటూ
వాకిట్లో గాలులకి కొమ్మల ఊగిసలాట,
కిటికీ తెర నుంచి దూసుకుని నీడల కుంచెతో గోడలు నింపుతూ
గడ్డి పక్కల మీద రాలిన ఆకులు పొర్లాడే పాపాయిల్లా
రాత్రి నుంచి రాత్రికి కొన్ని లెక్కలు; ఉదయం నుంచి మరునాటికి ఇంకొన్ని మార్పులు
కాలప్రవాహానికి కొండగురుతులుగా.
ఋతువు రాకపోకలకి అడ్డూ అయిపూ ఉండవు; అయినా శ్రుతిలయలు చూపుకందుతాయి...

కాలప్రవాహం

ఉరుములు వినవస్తూ, ఉప్పెనలు కానవస్తూ
ముసురులు వీడని మనసున-
మబ్బులు గడ్డిదుబ్బులై మొలుచుకు వస్తూ,
నిబ్బరపు నిగ్గు తేలుతూనే, నిలవనీయని వేదనకి నిట్టూర్పు నీడగా...

'ఉంటుండేవి,' అని చెప్తూ ఉన్నానిప్పుడు

నవ్వుల జల్లులు కురిసి, జ్ఞాపకాల మునకల మురిసి  
ఊసులు కమ్మిన మనసున-
పచ్చని కలలు కమ్ముకువస్తూ,
అబ్బరపు అంచులు తాకుతూ, నిలవనీయని వేడుకలె ఓదార్పు జాడగా...

'వస్తున్నాయి,' అని చెప్తా ఇకిప్పుడు

Remembrance

 సంస్మరణ
నిత్య సాధన
I released my fathers work based of his experiences of daily yoga practices on "Yoga Day" this year. He was in my hands while his soul left from us on 15th May. This is reproduction of his handwritten "yoga for self practice" as a gift to me. I am not willing to accept and acknowledge his sudden disappearance. I feel him more intensely and eternally...

5y @జీవని

అనగనగా ఒక చిన్నారిలోకం,
అమ్మ ఒడి, నాన్న పంచే బలిమి కలబోతల "జీవని"
ఆ చల్లని జీవన వాహిని లో గలగలలు ఈ పిల్లలు
అందరిదీ ఒకే మూలం...మానవత్వం!

పూల రంగులు, పాల పొంగులు చిన్ని ఊసుల్లో
మంచి గంధాలు, ఫల మాధుర్యాలు చేతల్లో
లేడి పరుగులు, తువ్వాయి చిందులు పాదాల్లో
బడి గుడిగా, బ్రతుకు లక్ష్యంగా...బాల్యం!

అమ్మైనా నాన్నైనా ఉండుంటే సాగని సరదాలు
అర్థం పర్థం ఎరుగని పోటీ లేని పయనాలు
ఆటపాటలు, లలితకళలు మురిసి విరిసే ప్రాంగణాలు
ఎదుగుతూ- ఎదుగుతున్న ఒద్దికలో- ప్రతిభా ప్రావీణ్యాలు

"జీవని" ఎవరంటే!? చిందే నవ్వులా, చెదరని మమతలా-
ఉత్తేజం ఉత్ప్రేరకం ఉత్సాహం ముప్పేట అల్లిన దారం,
ఆ లోగిలి మమతలు పెనవేసి కట్టిన దండకి.
మానవీయ వైనాలు కొలువుదీరిన ఆలయం

/* తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలను సమాజంలో భాగస్వాములను చేయడం, తరచుగా వారిని దాతలతో మాట్లాడించడం అన్న ప్రధాన లక్ష్యాలతో జీవని పని చేస్తోంది. ఈ విధంగా పిల్లల్లో మానవ సంబంధాలను నెలకొల్పడం మన ఉద్దేశ్యం. ఈ సంవత్సరం 10 మంది పిల్లలతో జీవని స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభం అవుతోంది. కరువు జిల్లా అయిన అనంతపురంలో మేము తలపెట్టిన ఈ యగ్నం విజయవంతం కావాలని అందరి ఆశీస్సులు కోరుతున్నాం.*/

Source: http://jeevani2009.blogspot.com/2009/06/blog-post.html

స్నేహాన్ని తలుచుకోవాలా?


Every friendship starts when a heart extends a hand: Happy Friendship Day! ఒక రోజున, ఒక మాటగా, ఒక తీరుగా వెలికి తేలేని క్షణాన అసంబంధంగా తోస్తూనే అవ్యక్తానందం మిగిల్చేది ఏది? చెలిమి కాదా?! తాటాకు బొమ్మ, ఈతాకు బూర, కొబ్బరిపుల్లల విల్లంబులు, రేగివడియాల పంపకాలు, తాయిలాల తన్నులాటలు, ఏడు పెంకుల కుమ్ములాటలు, చింత గింజల చిరు కయ్యాలు, కోనేటి గట్టున కలబోతలు, పుస్తకాల మడతల్లో ముసిముసి నవ్వులు, గుప్పిట్లో రహస్యాలు, దోసిట్లో జాజులు, సందిట్లో సంబరాలు, ఇంకు మరకల ఉత్తరాలు, చేతిలో చెయ్యేసి ఊసులు, ఫోను ముచ్చటలు, ఈ-మెయిలు కొసమెరుపులు, బ్లాగు బంధాలు, ముఖపుస్తకపు అనుబంధాలు, వాట్సాప్ వాలకాలు... ఎక్కడో ఒక చోట స్నేహపు ఆనవాలు నాకు గురుతే. "చెలిమికి ఇన్ని చిరునామాలా!?" అని అబ్బురపడుతూ ఒక్కో పేరు చేరువగా చేర్చుకోవటమూ షరా మామూలే.
తెలిసినదానినుంచి, తెలియనిదానినుంచి, వాస్తవంనుంచీ, ఊహనుంచీ అనుభూతిని తవ్వి తీయగలాది మైత్రి కాక మరేవిటీ? కలిమిలో బలిమిలో లేమిలో ఓటమిలో కలలో, కలకలం లో తోడై, కొన్ని సార్లు వెనుక నీడై, మరిన్ని సార్లు ముందరి దారై, మరి మిగిలిన మార్లు అడుగు కలిసి చేయి కలిపి నడిచిన నేస్తపు పేరు, రూపు చెప్పనా? వద్దులే, ఇదిగో ఈ చాపిన చేతికి అద్దుకున్న జాజర చాలదూ, స్నేహ పరిమళం నిన్నూ కమ్ముకుపోను...

తెరవని తలుపుల నుంచి...


కిటీకీ నుంచి ప్రపంచాన్ని చూడాలి; ద్వారాలు తెరుచుకు వీధుల్లోకి నడవాలి', అని అనిపించనప్పుడు
నీడల గుర్రాల వెలుగు జీను గోడల మీద పరుచుకుంటుంది; చీకటిని చిధ్రం చేసి కంటి తెరలు తెరుస్తుంది 

Shadows and Windows so inseparable
World comes to you when your eyes are reluctant

ఆలాపన

అసహాయత నుంచి నిర్భయ గా మారనున్న చిన్నారీ!
"శుభ్ర జ్యోత్స్నా పులకిత యామినీమ్
Where nights are made joyous by sparkling light
నిసప్త కోటి భుజైర్ధృఉత ఖరకరవాలే
many million hands have taken swords (for your protection)"
శతాబ్దాల పర్యంతం నిలిచిఉన్న న్యాయం ఒకటే,
బలిమితో ఒకరు, ఓరిమితో ఒకరు ఒద్దిగ్గా మెలగటమే.
ఆనాడు "సతి" అంటూ అగ్నిజ్వాల కి,
ఈనాడు ఆమ్ల ధారల "చితి" కి బలయ్యే అభాగిని చేసే నేరం
మగాడి నిర్వచనం లో మగాడికొరకు మెసలటమా!?
బలాత్కారాల, భంగపాట్ల పచ్చబొట్లు
గత చరితల, గతించని వెతల నుదుటి మచ్చలు
అమానుష చర్యల, అంతులేని పోరాటాల నిత్య సత్యాలు
అడుగడుగునా క్రుంగదీసే జాతిముద్రలు చెరిగిపోవాలిక...
గతపు గాధలు దాటుకుని కొత్త పుంతలు తొక్కే నవతరం రావాలి
ఘాతుకాలెరుగని ఘటనలతో శాంతి బావుటాలు ఎగరాలి
సమానహక్కులు, సమస్థాయి ఎరిగిన నాడు-ఆలపిద్దాం
"సుఖదాం వరదాం మాతరం వందేమాతరం"

(*** అరాచకం అన్నిటా తావు చేసుకుంటుంది, బలపడి తీరాల్సిన పరిస్థితి కుటుంబంలోనే సంభవిస్తుంది; వెనుకడుగు లేదా ముందంజ తప్పా మరే దిశా దిక్కూ లేవిప్పుడు బలహీనులకు/అబలలకు కూడా, ఆడ మగ అన్నదిప్రశ్న కాదు అంచేత (ఈ వచనం లో స్త్రీ భాష్యం వెలికి తెచ్చినా గానీ)

"కలాం" కలకాలం నిలిచేపోయే కథనం, కదనం, కాదనలేని కమనీయ గానం!

ఉన్నత విద్యాభ్యాసం, ఉద్యోగం వివాహం - 20సం. వయసు కి ఆడపిల్లకి ముప్పేటలా ముప్పిరిగొనే జటిలమైన సమస్య. నాకూ తప్పలేదు, మొదటిదాన్ని ఎంచుకోక! కలాం గారి చలువ అది.

DRDO: Defence Research and Development Organization కి దాదాపు పితృ సమానుడైన ఆయన దూర దృష్టి వలన ప్రవేశ పెట్టబడిన సాఫ్ట్వేర్ లో మాస్టర్స్ కోర్స్ చేసిన మొదటి కంప్యూటర్ నిపుణుల బృందం లోని శాస్త్రవేత్తని నేను. నను కన్నవారికీ, నేను కన్నవారికీ అదొక అపురూపమైన వరం, దీవెన.

ఆ గర్వించే ఉద్యోగ క్షణాలు, అనుభవాలు పక్కన పెడితే సాంకేతికరంగ తండ్రి వంటి వారు ఆయన నాకు. బాబు పసిబిడ్డ గా ఉండగా- ఆయన నివాసం (ఆఫీసర్స్ మెస్) నా గృహం (సైంటిస్ట్ హాస్టల్) చాలా దగ్గర మూలాన- సాయంత్రాలు యువా ని ప్రాం లో తోసుకుంటూ ఆయన గది పక్కగా తిరిగేదాన్ని; ప్రశాంతమైన వదనం తో వీణ వాయిస్తూనో లేదా మౌన ముద్రతో (పుస్తకం, సాలోచన ధరించి) కనిపించేవారు. ఒక్కోసారి నిదానంగా, మరోసారి గౌరవంగా, పలుసార్లు సగర్వం గా చూస్తూ దాటుకునేదాన్ని. చాలా అరుదుగా నన్ను చూసి నవ్వేవారు, ఒకటీ రెండుసార్లు మృదువైన సంభాషణ. బాబుకి మాత్రం ఆయన చూపులు చాలా ఆదరంగానే తాకేవి పెక్కుసార్లు...
ఆయనకీ తెలీదు బహుశా తన ద్వారా స్ఫూర్తితో వెలిగే జ్ఞానజ్యోతి ని నేను ప్రమిదలా కాస్తున్నానని.
భగవంతుని పరీక్షా సమయం జన్మనిచ్చిన నాన్న, జీవనాన్ని కల్పించిన తండ్రి ఒక్కమారు నా ప్రపంచం నుంచి నిష్క్రమించటం...ఒక అందమైన ఊహకి, జ్ఞప్తికి మనిషి భౌతికం గా లేకపోవటం చాలా వెలితి. తప్పదు, మరణం పిలుస్తూ రాదు కానీ చటుక్కున ఒడిసిపట్టుకు లాక్కుపోతుంది ఆత్మీయులని మనసైనవారిని. జీవితమూ తప్పదు వారి పరోక్షం లో నడవక. ఎన్నెన్నో అవధులు ఎరుగని విజయాలకి, వికసించిన వదనాల చిరునవ్వులకి, ఫలించిన కలలకి చిరునామా అయిన వారికి శిరస్సా నమస్కరిస్తూ ఈ అశ్రు నివాళి!
ఎందుకో ఈ సామ్యం, మా నాన్న గారికీ, ఈ పితృ సమానులుకీ ఇది సాధ్యం పడింది, భాగ్యశాలులు;
"అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితం, దేహాంతే తవ సాయుజ్యం, దేహిమే పార్వతీపతే!"
దేహిమే పార్వతీపతే = O Lord! give me
వినా దైన్యేన జీవితం = a life without pleading someone
అనాయాసేన మరణం = an easy natural death
దేహాంతే తవ సాయుజ్యం = ability to reach your abode after leaving the body

ఎలా!?

నిన్నటి మేఘం కరిగి నిన్నూ నన్నూ ముసాబు లోకి నెట్టి వెళ్ళాక-

రాలిన వేప రేకుల చేదు
నానిన మావి టెంకల తీపి
వాసనలు మనసు ముంగిట గాఢం గా...

గిల్లికజ్జాల సడి
ఆగక కొట్టుకునే కిటికీ తలుపుల్లో
మళ్ళీ రాని మాటల సందడి
మూయని ద్వారపు తోరణాలలో

కురిసీ కురియని వాన పాయలు గుండె నిండా పరుచుకుంటూ-

ఉండీ ఉండి ఇంకా ఉరిమే ఆకాశం
ఆగి ఆగి కంటిలో మెరిసే అనురాగం

ఇంకోసారి
మునుపటి మునిమాపు గోలలు,
నిన్నా మొన్నటి మాగన్ను మూగ వేదనలు
పలకరించి పలవరించి పోతాయి

ఇకప్పుడు
'మబ్బు కమ్మాలి, ముసురు పట్టాలి' ఆశ పడుతూ
తడిసిన కలలు తుడుచుకుంటూ
తడారిన చేతులు కలుపుకుంటూ...

మనమిలా!

కడపటి వందనం

ఒక చల్లని చీకటి రేయిలో తడికళ్ళ శైత్యం మరింత వణికిస్తే-
గాజుల సడి, జాజుల స్పర్శగా
నుదుటన అద్దిన కుంకుమ గా
అమ్మ జాడ నాకు వీడ్కోలు పలికింది

ఆ తెలవారిన వెచ్చని పొద్దుతో పోటీగా కంటినీటి ఉష్ణోగ్రత
నిర్జీవ దేహపు నివాళి అననా!?
అంతిమ చూపుకి సమర్పణమా...
గాజు బొట్టు పూవు ఫలం- ఇవే చేతులు, మరప్పుడు నా నుంచి అమ్మకు

పుష్కర కాలం ప్రవాహమై, పదిలపరిచిన జ్ఞప్తులు పొరల భారంతో పొదగబడి
అమ్మని వెదుకుతూ నాన్న నడిచి వెళ్ళిపోయాక ఇక అనాధ నామం నా నుదుటివ్రాతగా
నిట్టూర్పు నిప్పుల సెగలు, రాజీ తప్పని దినసరి వెతలు నడుమ
ఇప్పుడూ అవే ఆనవాళ్ళు- తాంబూలాలుగా, ప్రసాదాలుగా- ఇంటి కంచాల మారుగా పంచిన విస్తళ్ళలో

శీత శ్రవణం

చిదుగులు  రాలుతుంటాయి, ఏదో ఒక దిక్కు నుంచి గాలి వీస్తుంటుంది

మాగిన పూరేకులు, పలకమాగిన పళ్ళు కంటి చూపు మేరా-
రంగులు మారిన ఆకుల వెనుగ్గా ముసురు తాకిళ్ళ ఆకాశం  
చిగురు తొడుగుతున్న తీగకిక సమయం లేదు
విచ్చీ విచ్చని మొగ్గలూ ముగిసిపోతాయిక...

వడిలిపోతున్న ఆకులు, వెచ్చని ఉభయ సంధ్యలు సెలవు తీసుకోనున్నాయి

గుబులుగా ఉడుతలటూ యిటూ  తిరుగాడుతూ పికాన్ నట్స్ పోగేసుకుంటూ
కుదురుగా పిట్టలూ అదే పనిగా మట్టి గుట్టల్లో, చెట్టు తొర్రల్లో తవ్వితోడిపోస్తూ
ఉన్ని దుస్తులు, తోలు పాదరక్షలు వెలికి తీసి ఉసూరంటూ అందరమూ
వచ్చి పోయే శీతువు ని ఎప్పుడూ కొత్త ఋతువుగానే ఊహిస్తూ...

నిరుడు, ఆ మునుపటేడూ ఇవే మాటలు చెప్పుంటాను,  ఊసులు రాసి పోగుపడుతుందిలా మరి!

(ప్రచురణ కౌముది 100వ సంచిక ఏప్రిల్, 2015)

దాటుకుంటూ...

దారి చూసుకునో, వీలు చేసుకునో
వెళ్ళాలి, వెనక్కు మళ్ళాలి, తప్పదు-

బాటలు వేసుకుని, బాసలు దాటుకుని
మమతలకి మనసునొదిలి
మనసైనవారిని మోసుకుంటూ,

దాచిన కన్నీరు దోసిళ్ళలో
గడిపిన క్షణాలు గుప్పిళ్ళలో తప్పవిక.

దాటుకుంటూ, దాటినవి దాచుకుంటూ
వెళ్తుండాలి అటుగా, ఇటుగా, అటోఇటో తెలియని ఎటో-

అందుకే, సందోహంలో ఒక /గతి/తప్పిన మది తారసపడితే
నేస్తమా! ఆశ్రయమో, ఆసరానో అండగా ఇవ్వు

మరి నిన్నూ ఒంటరిని చేసే భావిని నీవు చేరే సరికి
గతపు జ్ఞాపకం తోడై వస్తుంది...
వేదన గిరులు దాటుకుంటూ వెళ్ళటానికి.

ఏన్నాళ్ళు ఎన్నేళ్ళు!?


ఈ గుత్తిలో పూలు నాలుగు దశల్లో ఉన్నాయి.  ప్రతి ఏడాది వసంతంలో మాత్రమే ఈ చెట్టున పూలు పూస్తాయి,  ఒక రోజు గడువుతో సెలవు పుచ్చుకుంటాయి.  తిరిగి ఏడాది వరకు ఆ చెట్టు కూడా నాలుగు దశలు మార్చి నిలుస్తుంది.  ఈ బ్లాగు కూడా అలానే ఆ చెట్టు/ పూల పోకడతో మనుగడ సాగిస్తూ...సప్త వార్షిక దినోత్సవం ఇవాళతో గడుపుకుంది.

అభిరుచులు వేరైనా, అభినివేశం అతకకపోయినా అభిమానంతో నా బ్లాగు ని ఆదరించిన/రిస్తున్న అందరికీ వందనాలు. 

కొందరున్నారు కదు ఇలా!?

నిన్నటి రాత్రే శుభ్రపరిచిన గిన్నెవైపుకి కనులుగా
అడుగులు స్థిరంగా కదులుతూ
మొన్నో మునుపో మిగిలిన కలదో కథదో
అక్షరాలు అస్థిరంగా మెదులుతూ
ఉదయాన్ని తేనీటితో తడమటానికి సిద్దపడతాను
మరిగే నీరు, పొంగే పాలు, విరిగిపడే పొడి, కరిగిపోయే చక్కెర
ఒక్కొక్క దశగా శ్రద్ధగా చూసుకుని కప్పులోకి వంచుకున్నాక-

కొనసాగింపులు వేగం పుంజుకుంటాయి,
కప్పుని కావలించుకున్నంత దగ్గరగా తీసుకున్నాక
ఊపిరిలోకి సాగే ఆవిరితో...

కప్పుని అడ్డంపెట్టుకుని కన్నీరు దాచిన ఊసు
ఇంకొకసారి పొలమారుతుంది
తదేకంగా టీ లోకి విసుగ్గా చూస్తూ
వదిలించుకున్న వ్యక్తి నీడ కప్పులో తేలుతుంది
మరొకసారి నవ్వుకి తెర తొలుగుతుంది

చురుక్కుమనే వేడితోనో, ఊదుకుంటూ తాగే రుచితోనో
ఇంకొక పది నిమిషాల సాగిపోతాయి
రోజులోకి సాగే ఊహలతో...

రోజూ ఎదురుచూపు విధిగా ఈ తంతుకి:
కొత్త ఆఘ్రాణింఫు కప్పు నుండి కావచ్చు,
ఖాళీ అవుతున్న కప్పు నింపుతున్న ఉత్సాహానిది కావచ్చు
రెండూ మారకపోవచ్చు, అయినా ఫర్వాలేదు...

తేనీటి సమయాలు, ఉదయాలు విసిగించవు
తప్పనిసరైతే తప్పా పంచుకోవాలనీ అనిపించదు

Song of Myself: అనువాదము: "నా కావ్యము"

WALT WHITMAN—SONG OF MYSELF (1891 edition)

పచ్చిక అంటే ఏమిటి? చేతుల నిండా పట్టి నాకు తెచ్చిస్తూ ఒక బిడ్డ అడిగాడు
ఎలా ఆ పిల్లవాడికి జవాబివ్వగలను?....వాడికి తెలిసినదాని కన్నా నాకు అదనంగా యేమీ తెలియదు
ఇది ఆశాజనకమైన పచ్చని పదార్థంతో నేసిన నా స్వభావానికి సూచిక అనుకుంటున్నాను
లేదా ఇది ప్రభువు చేతిరుమాలు అనుకుంటున్నాను
మూలల్లో ఎలాగోలా సొంతదారు పేరు కలిగి,
మనము చూసి గుర్తించి, ఎవరిదో చెప్పగలిగేలా
జ్ఞాపకార్థం గా విడిచిపెట్టబడిన సుగంధభరిత కానుకా?
లేదా, ఈ పచ్చికే శిశువు కావచ్చనుకుంటున్నా...పైరుపచ్చల నుంచి పుట్టిన బిడ్డని
లేదా ఏకరీతిగా ఉన్న గూఢ లిపి అక్షరాలనుకుంటున్నా
మరి దీనికర్థం, విశాలమైన భూముల్లోను ఇరుకైన మండలల్లోను మొలకెత్తడం ఒకలానే ఉంది
నల్లజాతి వారి నడుమ తెల్లవాఋ, కెనడావారు, టుకాహో వారు, కాంగ్రెసు వారు నడుమ ఎదుగుతూ
సంబంధాలు నడుపుతూ నేను అందరినీ ఒకేలా ఆదరించాను, స్వీకరించాను
మరిప్పుడు సమాధుల మీద కత్తిరించబడని రోమముల వలె కనిపిస్తుంది
చుట్టలుగా ఉన్న పచ్చిక, నిన్ను మృదువుగా వాడతాను
యువకుల వక్షస్థలము నుంచి బయల్పడ్డావేమో
వారు నాకు తెలిసిఉండి ఉంటే నేను వారిని ప్రేమించి ఉండేవాడిని
వృధ్ధుల వనితల నుంచి వచ్చావేమో, మరి
అమ్మ ఒడి నుంచి త్వరితంగా తీసుకుపోబడిన శిశువుల నుంచి వచ్చావేమో
మరిక్కడ నువ్వే తల్లుల ఒడివి
ముదుసలి స్త్రీల నెరిసిన తలల నుంచి రావడానికి ఈ గడ్డి చాలా ముదురు వర్ణం లో ఉంది
రంగు వెలిసిన వృధ్ధుల గడ్డం కన్నా గాఢమైనరంగులో ఉంది
లేత ఎరుపు అంగిళ్ళ లో మొలకెత్తడానికీ చిక్కనైన రంగుకలది
ఓ! నేను చాలా స్వరాలను గుర్తిస్తున్నాను
అవన్నీ అంగిళ్ళ నుంచి ఊరకనే వెలికిరావడం లేదని గ్రహిస్తున్నాను
ముసలివారివి, తల్లులవి, వారి ఒడి నుండి త్వరితంగా తీసుకుపోబడిన శిశువుల సైగలు,
చనిపోయిన స్త్రీల యువకుల సూచనలను తర్జుమా చేయగలగాలని అభిలషిస్తున్నాను
యువకులు వృధ్ధుల నుంచి యేమి వచ్చిందని అనుకుంటున్నావు?
స్త్రీలు శిశువుల నుంచి యేమి అయిందని అనుకుంటున్నావు?
వారంతా సజీవులుగా క్షేమంగా ఎక్కడనో ఒకచోట ఉన్నారు
అన్నిటికన్నా చిన్నదైన అంకురం నిజమైన మరణం అంటూ లేదని చూపుతుంది
మృత్యువు ఉన్నా జీవితాన్ని ముందుకు నడిపించింది తప్పా ముగింపు వద్ద బందీ చేయడానికి వేచి ఉండలేదు
జీవము కనపడగానే ముగిసిపోయేది
అన్నీ ముందరికీ వెలుపలికి వెళ్తాయి, మరేదీ పతనమవదు
ఎవరెలా అనుకున్నా చనిపోవడమన్నది చాలా వేరు, ఒక భాగ్యము
*****
Song of Myself
-------------------
A child said What is the grass? fetching it to me with full hands;
How could I answer the child? I do not know what it is any more than he.
I guess it must be the flag of my disposition, out of hopeful green stuff woven.
Or I guess it is the handkerchief of the Lord,
A scented gift and remembrancer designedly dropt,
Bearing the owner's name someway in the corners, that we may
see and remark, and say Whose?
Or I guess the grass is itself a child, the produced babe of the vegetation.
Or I guess it is a uniform hieroglyphic,
And it means, Sprouting alike in broad zones and narrow zones,
Growing among black folks as among white,
Kanuck, Tuckahoe, Congressman, Cuff, I give them the same, I receive them the same.
And now it seems to me the beautiful uncut hair of graves.
Tenderly will I use you curling grass,
It may be you transpire from the breasts of young men,
It may be if I had known them I would have loved them,
It may be you are from old people, or from offspring taken soon out of their mothers' laps,
And here you are the mothers' laps.
This grass is very dark to be from the white heads of old mothers,
Darker than the colorless beards of old men,
Dark to come from under the faint red roofs of mouths.
O I perceive after all so many uttering tongues,
And I perceive they do not come from the roofs of mouths for nothing.
I wish I could translate the hints about the dead young men and women,
And the hints about old men and mothers, and the offspring taken soon out of their laps.
What do you think has become of the young and old men?
And what do you think has become of the women and chil- dren?
They are alive and well somewhere,
The smallest sprout shows there is really no death,
And if ever there was it led forward life, and does not wait at the end to arrest it,
And ceas'd the moment life appear'd.
All goes onward and outward, nothing collapses,
And to die is different from what any one supposed, and luckier.
(Walt Whitman’s “Song of Myself” is the great American epic poem. The poem means so many things to so many different people, and its diversity and openness are its greatest strength. It has influenced almost every major American poet of the 20th century, including T.S. Eliot, Wallace Stevens, William Carlos Williams, Langston Hughes, Allen Ginsberg, and John Ashbery. It has also been profoundly important to writers of other nationalities, especially Latin American writers like Pablo Neruda and Jorge Luis Borges. In many ways, "Song of Myself" represents the best that American poetry has to offer. As the poem has taken on new life in other languages, it has been read less as a distinctly “American” poem and more as a universal evocation of a human self searching for definition in a quickly changing world.)

దీపపు స్తంభం

పగలు ఆ స్తంభం తాలూకు కదలికలుండవు
నిలువెత్తు శిలలా నిలుచున్న నీడలా నిశ్శబ్దం గా,
పొగమంచు లో పరుగుపెట్టే ప్రపంచం లో ఒంటరిగా. 
విసుగెత్తని గాలులు అక్కడక్కడే దొర్లుతాయి


చీకటి కమ్ముకొచ్చే సమయాల్లో
పరిసరాల్లో నిదానం మొలుచుకొచ్చి
దీపపు వెలుగులోకి దూసుకువస్తుంది.


స్తంభం లో చలనం వస్తుంది-
రెక్కలు రాల్చుకు ఒరిగే ఉసుర్లు ఉండవు కానీ,
మంచు తునకలు సెగకి కరిగి చుక్కలుగా
సవ్వడిని చిలరిస్తూంటాయి

వాహనాల వీపు మీద నీడలుగా
అటూ ఇటూ స్తంభపు ఉనికి తాపీగా తిరుగాడుతుంది
తప్పని నడకల పాదాలు నిలకడ తప్పి తూలుతాయి

అర్థరాత్రి వేళకి వలయాకారపు ప్రపంచం-
వింత వన్నెలో స్తంభానికొకటిగా చలిస్తుంది
నిదుర తాకని తనువులు ఎన్నోకొన్ని
కిటికీలు, కనులు తెరిచి పెట్టుకుని ఊరట వెదుక్కుంటాయి.

మీకు, మీ వారికందరకీ సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతికి చంకలు లేపనివ్వని చలి, 
(1) శివరాత్రికి శివశివా అని పోతుందనేది, లేదా 
(2) ఉగాదికి ఊడ్చిపెట్టుకుపోతుందనేది: వాడుకలో ఉన్న సామెతలు.

కాబట్టి అందరం గబగబా భోగిమంటల పిండివంటల హడావుడితో శ్రామికులను కలేసిన వేడుకతో సంక్రాంతి కానిచ్చేసి, రథసప్తమికి చిక్కుడు ఆకులు తెచ్చేసుకుని పరవాన్నం నైవేద్యాలు పెట్టేసుకుని, శివయ్య తో జాగారం జరిపేసుకుని, ఉగాది కి హమ్మయ్య చలి పోయే అని నిట్టూర్చుదాము!

అందాకా మీకు, మీ అత్మీయులందరికీ అన్ని పర్వదినాలకీ కలిపి శుభాకాంక్షలు!!!

స్వరకల్పన

ఒక్కసారిగా ఊరంతా వెల్లవేసిన గోడలా-
పెళ్ళలుగా రాలిపడి
చిక్కగా పరుచుకున్న మంచుతో

రాలిన ఆకుల రంగులు
పిల్లల దుస్తుల్లో...
వాహనాల్లో కుదురుగా అమిర్చిన
పూల గుత్తులై పిల్లలు
రానున్న ఆమని కి
ఇంకాస్త చిక్కని ఎదురుచూపులు

ఆదమరిచి నిదుర పోనీయని గాలుల,
మూసిన తలుపులు తోసుకు వచ్చే
ఆకతాయితనాలు
చలిమంటలు పలు రూపులో
ఇంటింటా అఖండ దీపాలు

కొత్త రాగం కట్టమని
ఋతువుకొక పాట రాసుకొస్తూ ప్రకృతి-
గుప్పెడు విత్తులు వెదజల్లితే
గంపెడు రంగుల గుత్తులై విరిసే
బంతి పూలలా
మత్తు వీడని తలపులు
అక్షరాల బాణీలు కూర్చుకుంటూ ఇలా...

జాబిల్లి రాకలు/Melodies of Moon!

Moon in a rainwater puddle
This small dent on the road formed a puddle for moon to set in! A wow indeed!!!

Moon in forceps of tree!? 
The moon on 01/05/2015 night sky seemed being captured in the branches of tree- The peach color of moon and grey shade of branches are indeed a great color mix...the night sky hue is not any less in treating the eye.

Leaf Landed on Moon!
Yeah, true this fallen leaf finally had its mission accomplished... :) Landed on moon but in waters of a small rainwater puddle in the middle of the road!

 Moon riding in a Bat!
This time the moon choose to pick a bat-shaped puddle to get a ride to the earth!!! 

అంతిమంగా...

కరిగిన మైనం లో తనలోని తను చూసుకున్న మంట రూపు...
జీవితకాలం ఇలా వెలిగించిన వత్తిలా కాలుతూ, ఆయుష్షుని మైనం లా కరిగిస్తూ ఉన్నట్లుగా, అదిగో ఆ పక్కన అద్దం లో కనిపించిన ప్రతిబింబాలుగా కొన్నిసార్లు కొన్ని అనుభవాలు/అనుభూతులు ఇంకాస్త మెరుగ్గా వెలుగుతూ, హృదయాన్ని దీప్తివంతం చేస్తూ, కొన్ని ప్రేరణలు మనసు చీకటి లోకి జారిన వేళల్లో దీపశిఖలా నిలిచి బతుకుని వెలిగిస్తూ (This candle on breakfast table reflected in the mirror on the cupboard so philosophical way that I can't these musings once again!
This is when I first noticed the candle reflections as I sat right in front of in a rather wandered mind. With this realization my soul felt so peace and harmony...
అంతిమంగా