గమనాల గమకం

కొండపాదాన పాకుడురాళ్ళ సోపానం,
శిఖరాగ్రానికి నదికి తెలిసేనా పయనం.
సైకత మేటల్లో స్రవించే త్రుళ్ళింత,
రేయిలోను మెరిసేటి పాషాణపు చెమరింత.

నది గర్భాన సుడిగుండాల మోత,
కదల్లేని కొండ పట్టిన శోకపు కోత.
శిలచెవిలో పరవళ్ళ గుసగుసలు,
తాకిడిలో తప్పనివి విసవిసలు.

కొండకి రెక్కలొస్తే, నది అడిగేనా విరామం?
నది సాగిపోతే, కొండ కోరుతుందా చలనం?
జడికి జడత్వానికీ ఆద్యంతం అలజడి,
చైతన్యం సంకల్పించుకున్న బ్రహ్మముడి.

గాయం కానిది, గేయమూ కాలేనిది

మధువు జుర్రుకున్న జ్ఞాపకాలు
కొత్త రెక్కలొచ్చి వీడు వదిలాయి
బావురన్న తోలుతిత్తి పేరు గుండె
చెట్టునున్న తేనెపట్టు వెక్కిరింత పోటు

నుదుటి బొట్టు నల్లచుక్కగ మారి
నవ్వు తెలుపుకు దింపింది ముల్లు
కనులెదుట ఆరుద్ర వన్నె ఎరుపు
నింగి పోకడలు తెలుపేటి హరివిల్లు

పొడుచుకున్న పచ్చబొట్టుకి,
చెంత మొలిచిన పుట్టుమచ్చ జోడు
చూపు మందగించిన మనసుకి,
అసలు, నకలు నడుమ నడక

అరచేతి గీత నిలువున చీల్చితే
నుదుటిరాత మారునని పేరాశ
ఎదుటా, ఎదలోనా సొదలొకటే
ప్రకృతికి, నాకూ పఠనాలు వేరు

ఒడి నింపిన సావాసం,
కనిపించని సామీప్యం,
ఒరుసుకున్న మానసం
వెరసి బ్రతుకు త్రివేణీ సంగమం

*** *** *** *** *** ***
సాహితీమిత్రులు ఆత్రేయ గారి వ్యాఖ్య:

చాలా బాగుంది ఉష గారు. చివరి మూడిటికీ నాదగ్గర మాటలు లేవు. అభినందనలు.


ఎన్ని తూట్ల మకరందమో
ఎన్ని బ్రతుకుల సంబంధమో
చిటారుకొమ్మన తలక్రిందులుగా తపస్సు
ఎన్ని వెక్కిరింతల ప్రతిఫలమో

హరివిల్లు రంగులేరి అందంగా రంగరించి
పెదవి మాటున దాచుకున్న
మాటలకి అలికి చూడు..
సంబరాలు గాదె తలుపులోంచి సంకురాత్రై ఆడతాయి.


నాకు నేను నేర్పుకునే పాఠాలిలాగే వుంటాయి. తెలుసుకుని మెసులుతున్నావా అన్నదీ మునుపటి పాఠం:
copper bottom heart నా చూడచక్కనమ్మ!

స్వతంత్ర గణతంత్ర యంత్రజీవన తాంత్రికులం!!!

స్వాతంత్రమొచ్చిందని వ్రాయను గుణింతాలునేర్చి,
గణతంత్రమని హెచ్చుతగ్గుల లెక్కలేయను గణితమబ్బించి,
అంతా కలిసివుండాలన్న ఒక్క మాటా విస్మరించి,
నాదిది, నీదది అని ఇంటా బయటా వంతులాడుకుని,
దేశం కుళ్ళిందని వీధులెంట వాదులాడుకుని,
మనం కట్టిన గృహం మనమే కూల్చుకొని,
సగం నేలైన లేని దేశాన్ని నిండా జనంతో నింపేస్తూ
వున్న నీటి వనరుల వూపిరి తీసేస్తూ, వన్య ప్రాణులహరించివేస్తూ,
చెట్టు చేమలు కొట్టివేస్తూ, పొలం పుట్ర చదువులకమ్మివేస్తూ,
అమ్మ నాన్నల ఆలన పాలన పైవాడి దయకొదిలేస్తూ,
మనం అంటే అహం అని వ్యర్థ బ్రతుకు లాగిస్తూ,
పడుతూ, లేస్తూ, చస్తూ, బ్రతుకుతూ, ఇంకోసారి చెప్పేద్దామా,
బోలో స్వతంత్ర భారత్కీ జై, తల్లి భూమిభారతికీ జై, అంటూ వంచన వందనాలు?
ఎందుకంటే మనమంతా ఒక్కటే , స్వతంత్ర గణతంత్ర యంత్రజీవన తాంత్రికులమే!!

కథ : నిరంతరం

చీకట్లు వీడని శీతాకాలపు ఉదయపు పొద్దు. అక్కడక్కడా మినుకు మినుకు మంటున్న తారలు చిచ్చుబుడ్డి రవ్వల్లా వున్నాయి. సుమారు ఐదున్నర కావస్తుంది. దాహంగా అనిపించి లేచిన మధుకర్, ప్రక్కన చెస్ట్ మీద వున్న జగ్ లో నీళ్ళు కాసిని గొంతులోకి పోసుకుని, మంచంలోనే తలగడ పైకి సర్దుకుని వొళ్ళో లాప్ టాప్ పెట్టుకుని ముందు ఈమెయిల్స్ తెరిచాడు. శనివారం కనుక ఉదయాన్నే పరిగెట్టాల్సిన పని లేదు.

మైత్రేయి నుంచి రెండు నిమిషాల క్రితం వచ్చింది ఆ ఈమెయిల్.

"కలలోనే తొలి పొద్దు వెలుగులు చూసాను
వెలుగుల నీడల్లో తన రూపు వెదికాను
కలని విడిచి కనులు తెరిచి దోసిలి వొగ్గాను
గుప్పిట పట్టినన్ని కిరణాల నేను తడిసాను
శీతువు పొద్దుల్లో వణికే తనకి వొడి వెచ్చన పంచాను
పసిపాపడిగ తను తోస్తే అమ్మ వొడి నాది కాదా?" - మైత్రి

చిన్నగా నవ్వుకున్నాడు. సాదారణంగా ఉదయం వచ్చే ఈ-లేఖ అలాగే వ్రాస్తుంది. నిజమే కదా తల్లి తర్వాత ఆ స్థాన్నాన్ని నింపేది భార్యేగా. ధ్యానానికి తర్వాత పంపితే యేదో ఒక సందేశం కలుపుతుంది.

"పొగమంచు తెరలో తొలివేకువ ఝామున తూరుపు కన్నియ మత్తుకనులు విప్పనని మారాములు చేస్తుంది.. గారాబు చెలియ కొంగు చాటున తెల్లమొహమేసుకుని అదిగోవాడు.. ఎవరనేం, సూరీడు కాక..వాడిని వెక్కిరించటానికి వెళ్దామంటే చెలి కాలి మువ్వ కి చిక్కుకున్న నా కొనగోరు అడ్డుపడింది." -మధు

అని తిరిగి జవాబు పంపాడు.


తల తిప్పి చూసాడు. వాసవి ఇంకా గాఢనిద్రలోనే వుంది. ప్రశాంతంగా నిదురలో వుంది. ఆరున్నరకి గానీ లేవదు. వేడిగా ఓ కప్పు కాఫీ తాగాలనిపించి, మంచంలోచి దిగి బ్రష్ చేసుకుని క్రిందకి కిచన్ లోకి వెళ్ళాడు.

పాలు కప్పులోకి వంచి మైక్రోలో వేడి చేయటానికి పెట్టి, కిటికీ లోంచి బయటకి చూసాడు. కాస్త తెల్లార వచ్చింది. డెక్ మీద రెండు ఎర్ర రెక్కల పక్షులు, చలికి ముడుచుకుని ముక్కులు మెడకి నొక్కుకుని కూర్చుని వున్నాయి. ఆ వెనగ్గా కరిగీ కరగనట్లున్న స్నో కప్పిన బాక్ యార్డ్. ఆకు రాల్చేసిన మేపిల్ ట్రీ మొదల్లో మఠం వేసి కూర్చున్నట్లున్న బూడిద రంగు కుందేలు.

కాఫీ కలుపుకుని చిన్నగా సిప్స్ తీసుకుంటూ ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అస్వాదిస్తున్నాడు. సహజంగా భావుకుడైన అతనికి ప్రకృతి ఎప్పుడూ యేదో ఒక స్ఫూర్తినిస్తూనే వుంటుంది.


అలా ఎంతసేపు నిల్చుండిపోయాడో తెలియదు. వెనుక నుండి రెండు చేతులతో చుడుతూ ఆరేళ్ళ రాహుల్ "డాడీ" అనగానే కాస్త తృళ్ళిపడి, చేతిలో కప్పు డైనింగ్ టేబుల్ మీద పెట్టి పిల్లాణ్ణి ఎత్తుకున్నాడు. కునాల్ వీ గేం ఆడుకుంటున్నాడు.

వాసవి రావటమే గమనించలేదు. నూనె రాసి ముడిపెట్టిన పొడుగాటి జుట్టు, పసుపు, గంధం పట్టించిన మొహం. ఉప్మాకి వేసిన పోపు ముక్కుపుటాలకి సోకింది.

"వసు, కాసేపు కూర్చోకూడదా. ఇప్పుడేగా లేచావు." అన్నాడు అతను.

"అలాగని మరి దానికీ చెప్పు మధు." గోడ మీద గడియారం వైపు చూపుతూ చిన్ననవ్వు కలిపి అంది.

"ఇవాళ నేహ బర్త్ డే పార్టీకి కి వెళ్ళాలి రాత్రికి. కునాల్ స్విమ్మింగ్ క్లాస్ అయ్యాక, గిఫ్ట్ షాపింగ్ చెయ్యాలి. రాహుల్ కి టేక్వాండో టెస్ట్ ఇవాళ మధ్యాహ్నం మూడుకి. ఇవాళంతా పరుగులే." అంటూ రవ్వ కోసం పాంట్రీ వైపు వెళ్ళింది.

అట్లకాడతో పోపులో ఉల్లిపాయ వేపుతూ, ఒక జీడిపప్పు పలుకు తీసి నోట్లో వేసుకుంటూ "వసు, కాఫీ కలపనా?" అని అడిగాడు.


శనాదివారాలు పిల్లలు కునాల్, రాహుల్ యాక్టివిటీస్ కి తనే ఎక్కువగా తీసుకు వెళ్తుంది. మధు కి వంట చేయటం ఇష్టం. మిగిలిన రోజుల్లో ఉదయం యేడుకి బయటపడే అతను, రాత్రి యేడుకి కానీ ఇంటికి చేరలేడు. అందుకు వీకెండ్ లో వంట పని అతనిది. తప్పనిసరైతే తప్ప బయటకి కదలడు.

అమెరికా వచ్చిన ఈ పన్నండేళ్లలోనూ వాసవి పిల్లలు కాస్త పెద్దయ్యే వరకు వర్క్ చేయనని నిర్ణయం తో వీలుని బట్టి వాలంటరీ వర్క్ చేయటమే కానీ అంతకు మించి పిల్లల్ని బయటవదలలేదు. మధుకి అన్నిటా అనుగుణంగానే వుంటూ తన మాట నెగ్గించుకునే గడుసరి.

కాఫీ తాగీ తాగగానే పైకి పరిగెత్తింది వాసవి ఆలస్యం అయిపోతుంది అనుకుంటూ. "మధు, వంట యేమీ చేయకు, రెస్ట్ తీసుకో. నీకు నిన్నటి కూరలున్నాయ్. నేను పిల్లలతో లంచ్ బయట చేసేస్తా.." మెట్ల మీద నుంచి అరిచి చెప్పింది.

వాసవి మధుని ఇష్టపడుతుందని గమనించిన, ఇద్దరి కుటుంబాలకీ కలిపి స్నేహితుడైన పాల్ గారి చొరవతో జరిగిన వివాహం వాళ్ళది. మధు స్వతహాగా మితభాషి, బిడియస్తుడు. పెద్దాడు కునాల్ సంవత్సరం పిల్లాడుగా వుండగా వచ్చారు ఇక్కడకి. దాదాపు యేడేళ్ళ గాప్ తర్వాత రాహుల్ పుట్టాడు. అన్యోన్యంగా, ఆనందంగా సాగిపోతున్న కాపురం వారిది.

*** *** *** *** *** *** *** *** *** *** *** ***

మధు వున్న స్టేట్ కి నాలుగు స్టేట్స్ ప్రక్కనున్న స్టేట్ లో పద్నాలుగేళ్ళుగా కాపురమున్న జంట హరి, మైత్రేయి. అదే ఉదయాన అక్కడి ప్రహసనమిది.

ఉదయమే లేచే అలవాటున్న మైత్రేయి ధ్యానం పూర్తి చేసుకుని, అలవాటుగా పంపే వీక్ ఎండ్ ఈ మెయిల్స్ పంపేసి, కాస్త తెరిపిగా వున్న వాతావరణం చూసి అలా కాస్త బయటకి వెళ్ళాలనిపించి పడుకునే వున్న భర్తని లేపటానికి వెళ్ళింది.

"కాసేపలా వాకింగ్ వెళ్ళొద్దాం, లే హరి." భుజం మీద తడుతూ మైత్రేయి అన్నామాటకి "అబ్బా ఈ చలిలోనా?" బద్ధకంగా అటునుండి ఇటు తిరుగుతూ అన్నాడు హరికృష్ణ.

"చిన్నపిల్లాడిలా మారాం చేయకు. మరీ చలి లేదు." కంఫర్టర్ లాగేస్తూ అంది.

"మొండి వదలవు కదా." ముద్దుగా విసుక్కుంటూ దిగి ఫ్రెషప్ అవటానికి వెళ్ళాడు.

సిరి లేచిందేమో చూసొస్తానని ఆ గదిలోకి వెళ్ళింది . మంచి నిద్రలో వుంది. నుదుట మృదువుగా చుంబించి, బెడ్ ప్రక్కనే పడున్న పుస్తకం తీసి సరిగ్గా పెట్టి, తన టెడ్డీని ఇంకొంచం దగ్గరకి జరిపి, తలుపు దగ్గరగా వేసివచ్చింది. కిచన్ లో ఫోన్ పక్కన పోస్ట్ ఇట్ నోట్ మీద వాకింగ్ కి వెళ్ళాం అన్న మెసేజ్ పెట్టింది. సిరి కి అలా అలవాటు చేసారు.

మరో పావు గంటకి ఇద్దరూ బయటకొచ్చారు.

హరికి తీరిక తక్కువ వృత్తి. ఆపై ప్రాక్టికల్ గా అలోచించే మనిషి. ఇతరత్రా వ్యాపకాలు చాలా తక్కువ. మాట్లాడేది తక్కువే అయినా నికార్సుగా వుంటాడు.

మైత్రేయి కి వృత్తిపర వత్తిడి వున్నా వృత్తీతర వ్యాపకాలు, అభిరుచులు యెక్కువే. మాట మెత్తన, మనసు మెత్తన అన్నట్లుగా వుంటుంది. కాస్త భావుకత పాళ్ళు కలిసిన రచనలు చదవటం. స్పందించినపుడు వ్రాసుకోవటం. అతనికి స్పోర్ట్స్, స్టాక్ మార్కెట్ పట్ల మక్కువ. ఆమెకి ఆసక్తి తక్కువ.

ఇద్దరూ మాత్రం కలిసి ఇష్టంగా చేసే గార్డెనింగ్. కానీ ఇంటిపని, బయటపని అతను సగం పైన చేసేస్తాడు. ఆమె ఇష్టాయిష్టాలు అతనికి తెలుసు. అలాగే అతనికి నచ్చని విషయాల్లో వత్తిడి చేయదు. కనుక ఒక విధంగా ఇద్దరూ కాపాడుకుంటూ వస్తున్న సామరస్యం ఆ సంసారానికి మొదటి సూత్రం.

మాట తూలటం తక్కువ, తూలనాడుకోవటం ఇంకా తక్కువ. పరస్పర అవసరాలు గమనించుకోవటం, అవగాహనతో మెలగటం. పెద్దవారు కుదిర్చి చేసిన వారి వివాహం, వాళ్ళ జీవితాల్ని ముడివేసాక ఇద్దరూ ఒకరినొకరు తెలుసుకుని ఆ స్థాయికి రావటానికి పదేళ్ళ పైనే పట్టింది.


పన్నెండేళ్ళ సిరి ఇద్దరి పోలికలు, లక్షణాలతో పుట్టింది. అందుకే ఇద్దరికీ అదో సరదా, ఒకరినొకరు ఆట పట్టించుకోవటం. "మంచి గుణాలు నావి. అల్లరి నీది" అని అతను, "అదేమీ కాదు, భావుకత నాది, నిక్కచ్చితనం నీది" అని ఆమె మురిపాలు పోతుంటారు. ఆ నడుమ మహా తెలివిగా రాణించేది ఆ చిన్నారి.


*** *** *** *** *** *** *** *** *** *** *** ***

వాసవి దాదాపుగా గంట నుండి మాట్లాడుతున్న ఫోన్ కాల్ అవగానే, కాస్త నిట్టూరుస్తూ వచ్చి మధు ప్రక్కన కూర్చుంది. యేదో చెప్పాలని వచ్చినట్లుగా వుంది. చేతిలోని దిన పత్రిక ప్రక్కనుంచి "యేమైంది?' అని అడిగాడు.

"నీరజ, మురళి విడిపోతున్నారట." కాస్త ముభావంగా అంది. నీరజ వాసవికి చిన్ననాటి స్నేహితురాలు.

"ఏమిటో వినటానికి చిన్నవే అనిపిస్తున్నా దాని మనసు ఎందుకు నొచ్చుకుందో." కాస్త బాధ మిళితమైన స్వరం.

"వసు, అదే పరిస్థితి నీకు వస్తే యేమి చేస్తావు?" ప్రశ్నించాడు మధు.

"చెప్పలేను మధు. నేను సమస్యకి వెలుపల వున్నాను కదా." అంది వాసవి.

"అదే నేను చెప్పాలనుకున్నది. మూడో వ్యక్తికి కనిపించనిదే ఒక ఇద్దరి మధ్య ఘర్షణ. అది సమసిపోయినా, విడదీసినా ఆ ఇద్దరి మధ్య వున్న అవగాహన, సంయమనం, సర్దుబాటు కారణం." అన్నాడతను.

"మళ్ళీ మాట్లాడదాం. కునాల్ క్లాస్ కి టైం అయింది." అంటూ పిల్లల్ని తొందరిస్తూ కదిలింది.

అలాగే కూర్చున్న మధుకి వారం క్రితం తను, మైత్రేయి వైవాహిక సంబంధాల గురించి చర్చించుకోవటం "ఒక్కోసారి విడిపోవటం కూడా సరైన పరిష్కారమేనేమో మధు" అన్న మైత్రి మాట గుర్తుకొచ్చింది.

ఇద్దరి స్నేహం ఇంటర్ చదువుకునే రోజుల నాటిది. ఒకచోటే చదవటం కాకుండా కంబైన్డ్ స్టడీస్ కూడా చేసేవారు. ఒకరి మీద పోటిగా ఒకరు చదువటంతో పాటు, కవితలు, కథలు కలిసి చదవటం, ఆ మీదట కాస్త చర్చలు దాదాపుగా ఆరేళ్ల పైన ఒకేచోట వున్నారు. పెళ్ళి తర్వాత కూడా అదే స్నేహం మొదట్లో ఉత్తరాల్లో, ఆ తర్వాత ఫోనుల్లో, అపుడపుడు కలవటంలో, తరుచుగా జరిపే ఈమెయిల్స్ వలన నిలిచేవుంది.

వాసవి వెళ్ళాక కూడా మధ్యాహ్నం వరకు అదే ఆలోచనల్లో మధు కి మైత్రి పెళ్ళినాటి సంఘటన గుర్తుకు వచ్చింది.


*** *** *** *** *** *** *** *** *** *** *** ***

పెళ్ళి అయ్యాక అప్పగింతల యేర్పాట్లకి ముందు పందిట్లో విశ్రాంతిగా కూర్చున్న మైత్రి తాతగారు మాధవయ్య ప్రక్కగా వెళ్ళి కూర్చున్నాడు.

ఆమె తల్లి శ్రీలక్ష్మి, తండ్రి రామకృష్ణ ఇంకా హడావుడి పడుతూనే వున్నారు. మైత్రి మావయ్య నాగేంద్ర, అత్తయ్య ప్రమీల పెళ్ళికి వచ్చి వెళ్తున్న బంధువుల వీడ్కోలిస్తూ తిరుగుతున్నారు. అమ్మమ్మ జానకమ్మ గారు కూర్చున్న చోటనుండే అన్నీ పురమాయిస్తూ నేర్పుగా పనులన్నీ సవ్యంగా అయ్యేలా చూస్తున్నారు.

"చూసావయ్యా మా జానమ్మ, ఎంత జాణో. కూర్చునే చక్రం తిప్పేస్తుంది" నవ్వుతూ అన్నారు.

ఆయన చమత్కారపు మాట తీరు అలవాటే కనుక "భలేవారే తాతగారు." అన్నాడు మధు.

"లేదయ్యా, మా పెళ్ళిలో ఇలా అప్పగింతల్లోనే పంతాలు వచ్చాయి. రెండేళ్ళు కాపరానికి పంపలేదు." అన్నారు.

"అవునా తాతగారు. వినలేదెప్పుడూను." అన్న మధు మాటకి బదులిస్తూ, "అవునయ్యా, మాది ఓ రకంగా మేనరికం. జానకి పిన్ని భర్త మా మేనమావ. ఆయన పట్టుదల వల్లే జరిగింది మా పెళ్ళి. జానకి కూడా మొదట్లో ఇష్టపడలేదు నన్ను. తన స్నేహితురాలు పెళ్ళయి పుట్టింట వుందని ఎద్దేవ చేసిందని నన్ను రమ్మని జాబు వ్రాసి, చెప్పాపెట్టకుండా నాతో వచ్చేసింది. ఆ అభిమానంతోనే తను నన్ను అంగీకరించేలా చేసుకున్నాను. " ఆయన పూర్వ స్మృతుల్లో మునిగి మాట్లాడుతున్నారు.

మధుకి ఆపాలనిపించలేదు. అలా అలా ఆయన జానకమ్మ గారి ఇష్టాయిష్టాలు తెలుసుకుని మెలగటం, ఆవిడ కూడా ఆయన పట్ల గౌరవాభిమానాలు పెంచుకోవటం, ఆయన కున్న ఒకటీ రెండు బలహీనతలైన ముక్కోపం, యేకపక్ష నిర్ణయాలని సహనంగా స్వీకరించటం చెప్పుకుంటూ పోతున్నారు.


మధులో ఆలోచన, ఆవిడ అప్పటి సాంఘిక పరిస్థితులకి వెరసి ఆయనతో కలిసి జీవించారా? లేక ఇష్టం కలిగి అదే ప్రేమగా మారిందా?

మైత్రి ని కన్నీళ్ళతో సాగనంపాక మౌనంగా కూర్చుని వున్న జానకమ్మ గారిని కదపాలనిపించక వూరుకున్నాడు.

"మధు, ఇలారా బాబు." అని ఆవిడే పిలిచారు. "కాస్త లోపలికి వంట పాకలోకి వెళ్ళి చిన్నాలమ్మ గారినడిగి ఆయనకి మజ్జిగ తెస్తావా?" అని అడిగారు.

చిత్రం, అంత హడావుడి, మనవరాలెళ్ళిందన్న దిగుల్లో కూడా ఆయన అలవాట్లు మరవలేదావిడ.

మాధవయ్య గారికి మజ్జిగ ఇచ్చి జానకమ్మ గారి దగ్గర కూర్చుని "మామ్మగారు, తాత గారు మీ పెళ్ళి నాటి ముచ్చట్లు నెమరేసుకుంటున్నారు." అన్నాడు.

మైత్రి, హరిల మెడల్లోని కర్పూరపు దండలు తీయించి, గంగిరెద్దుకి వేయించాలని జాగ్రత్త పరుస్తున్న జానకమ్మ గారు "యేమిటటా అల్లుడు మర్యాదలు చాల్లేదని ఇంకా అలక పానుపెక్కుతానంటున్నారా?" నవ్వుతూ అడిగారు.

"ఒకమాట అడగనాండి." అన్నాడు. "కాబోయే పెళ్ళి కొడుకువి, అడుగు మరి, సందేహాలు సహజమే" అన్నారు. మరుసటి నెలలోనే మధు పెళ్ళికి లగ్నం పెట్టారు.

"మరి... మరి మీరు తాతగారిని ఇష్టపడలేదట. ఆ తర్వాత ..." అర్థోక్తిగా ఆగిపోయాడు.

"వూ చెప్పారూ..." అని "అవునయ్యా, ఇద్దరికీ చిన్నతనం. పెద్దవాళ్ళ పట్టింపులు. అలా కాస్త యెడ మొఖం పెడ మొఖం. కానీ ఎంత గడుసువారని. నాకేవి ఇష్టమో కనుక్కుని, నా మనసు మార్చారు. కొన్నేళ్ళకి ఇద్దరికీ మా సమస్యలు మేమే తీర్చుకోవాలి. పెద్దల మాట గౌరవించాలి కానీ ఆవేశంలో వారితో నిలకడ లేని ఆలోచనలు పంచుకోకూడదు. మాట తూలటం ఆయనకి అలవాటైనా, ఆ క్షణం నాకు సహనం కావాలి. అభిప్రాయాల్లో పట్టు విడుపు వుండాలని అర్థం అయింది. అయినా నిర్ణయాల్లో మాత్రం తనదే పై చేయి. అక్కడ నాది సర్దుబాటు. ఈ రోజు శ్రీలక్ష్మి, నాగేంద్ర ఇంతా హాయిగా కాపురాలు చేసుకోవటానికి మా పెద్దల పట్ల మా గౌరవాలు, మా ఇద్దరి నడుమా వున్న అవగాహన కారణం." అంటూ తృప్తిగా చెప్తున్న ఆవిడలో మధుకి పరిపూర్ణత గోచరించింది.

*** *** *** *** *** *** *** *** *** *** *** ***

ఫోన్ మోగటం తో ఈ లోకం లోకి వచ్చి ఆన్సర్ చేసాడు.

"మధు, నేను మైత్రి." అటు నుండి పలకరింపు స్వరం.

"నీ గురించే అనుకుంటున్నాను" అన్నాడు మధు.

అలా ఆ సంభాషణ నీరజ విషయం మీదిగా మైత్రి అమ్మమ్మ, తాతగార్ల పైకి మళ్ళింది.

"అవును మధు, నాకు చాలా ఆశ్చర్యం గా వుంటుందెపుడూను. ఆయనలా తాటాకు మంటలా ఎగిసి పడతారా, అంతలోనే 'నీ మాటేంటో చెప్పు' అని చిన్న పిల్లాడిలా అమ్మమ్మ నోటితోనే అసలు నిర్ణయం రప్పిస్తారు. చివరికి ఇద్దరిదీ ఒకటే మాట." అంది నవ్వుతూ.

"బహుశా వాళ్ళు తన భాగస్వామి ఇలా వుండాలన్న ఆశింపుతో వివాహ బంధంలోకి రాలేదేమో మైత్రి. కలిసి జీవించాకనే ఒకరినొకరు మలుచుకున్నారేమో." అన్నాడు మధు.

"అలా అయితే మరి మా జేజమ్మ విషయం అలా కాదుగా మధు." అంటూనే మైత్రి కాస్త గొంతుకేదో అడ్డం పడ్డట్లు ఆగిపోయింది.

"ఊ, వూరుకో మైత్రి. అనవసరం గా అవన్నీ కదిపానా?" అని అడిగాడు. మైత్రి అలా చలించిపోవటం అతనికి కొత్త కాదు.


"లేదు మధు, చెల్లీ అంతేగా. తన ఆలోచనలు తను దాచేసుకుని, భర్త దురాగతాలకి తలవంచే కదా అలా అర్థాంతరంగా మరణించింది. ఈ కాలం లో వుండి కూడా తన జీవితానికి తను న్యాయం చేసుకోలేకపోయింది. సర్దుబాటుకీ ఒక హద్దు వుంది. అది ఇద్దరికీ ఆపాదించాల్సిన నియమం అని ఎందుకు తను తెలుసుకోలేకపోయిందో.." అని "అందుకే అన్నాను ఆ మధ్య, విడాకులు తప్పని సరైనపుడు దాన్ని నేను సమర్థిస్తాను అని" భారంగా అంది.

కాసేపు మాట మళ్ళించి ఆమె కాస్త తేరుకున్నదనుకున్నాక ఫోన్ పెట్టేసాడు.

*** *** *** *** *** *** *** *** *** *** *** ***

మైత్రి ఆలోచనలు తన స్వానుభవాల వైపు మళ్ళాయి. పూర్తి వైరుధ్య స్వభావాలు తనవి, హరివి.

అనుభూతులు సంపదలుగా తన జీవన విధానాలు. ప్రతి నిమిషం వెల కట్టినట్లు గడపటం హరికి అలవాటు. మొదటి నుండీ
Don't wash your dirty laundry in public అన్నది ప్రధాన సూత్రంగా మెలిగినా, ఇరువురి నడుమా ఎన్నిసార్లు ఘర్షణలు. వాదోపవాదాలు.

మధ్యేమార్గం ఇద్దరూ పాటించాలని, ఒకరినొకరు పూర్తి ప్రభావితం చేయకూడదని
గట్టి నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి వుండడానికి ఇద్దరిలోనూ దృఢసంకల్పం రావటానికి ఎన్నో యేళ్ళు పట్టింది. ఇన్నిటా తమ మధ్య బంధాన్ని ఆపింది కేవలం మూడు ముళ్ళూ కాదు, సమాజమూ కాదు. తమరిరువురిలోని ఆలోచనలు, అదుపు తప్పని ఆవేశం, పరస్పర అనురాగం కారణం. అవే మనస్తత్వాల రాపిడిని ఆపాయి.

తనలోని భావుకత ఎప్పటి మాదిరే ఆ అభిరుచి వున్న మధు వలన పరస్పరం ప్రోత్సాహించుకుంటూ, విమర్శించుకుంటూ సాగుతుంది. మధు కి తను వాసవికి తగిన జోడు కాదేమో అన్న ఆలోచన ఒకసారి తనతో పంచుకున్నాడు. వాసవి చురుకుదనం, ఇతర వ్యాపకాల్లో అతను తను సరికాదేమోనన్న విధంగా ఆలోచించాడు. సాఫీగా సాగిపోతున్నా తన వలన యేదైనా వెలితి వుండివుండవచ్చేమోనని మైత్రితో ప్రస్తావించాడు.

"మధు, యే ఇద్దరూ ఒకేలా వుండరు. ఇద్దరి జీవితం ఒక త్రాటి మీద నడవాలంటే ఇద్దరికీ సర్దుబాటు గుణం కావద్దా? వాసవి కూడా నీ పట్ల ఒక అవగాహనకి వచ్చేవుంటుంది. తననే అడిగి చూడు. ఇలా నాలా మూడో మనిషి మాటకి తావీయకు." సున్నితంగా హెచ్చరించింది తను.

ఆ తర్వాత ఎప్పుడూ తమ మధ్య వైవాహిక సమస్యల ప్రస్తావనలు రాలేదు. వివాహ జీవితాలు, చుట్టూ గమనిస్తున్న పరిణామాలు అప్పుడప్పుడు చర్చించుకోవటం మాత్రం జరుగుతుంది.

జేజమ్మ, అమ్మమ్మ, తన తల్లి తరంలోని ఒకరిద్దరు, మొదటి వివాహంలో శారీరక హింసకి గురై, విడాకులతో బయటపడి, తనమాదిరే ఒంటరైన వంశీని రెండవ వివాహం చేసుకుని హాయిగా వున్న దేవిక, ఇప్పుడు నీరజ ఇలా ఒకరి తర్వాత ఒకరు మైత్రి ఆలోచనల్లో తారసపడతున్నారు.

ఈ వ్యవస్థలో రక్షణ, స్వేఛ్ఛకి వెసులుబాటు వున్నాయి. తరం వెనుక తరం అనుసరణలు మారుతున్నాయి. అన్నిటా సహచర్యం సాఫీగా సాగిపోగల దిశగానే జంటలు నడుస్తున్నారు. ఎందులోనైనా అవుట్ లయ్యర్స్ తప్పవు. ఇక్కాడా ఇంతే అని నిట్టూర్చింది.


ఆలోచనలు కట్టి పెట్టి, డిన్నర్ కి వంట చేద్దాం అనుకుంటూ కిచెన్ వైపు నడిచింది. చపాతీకి పిండి కలుపుతుండగా హరి ఫోన్. "మైత్రి, సిరి మెక్సికన్ రెస్టారెంట్ కి వెళ్దామందిగా. నేనొక అరగంటలో వస్తాను. మీరు రడీగా వుండండి." అంటూ. "అదికాదు హరి .." అంటుండగానే "యేది కాదురా, సిరి గాడి ఆర్డర్ మేమ్, నాది కాదు కనుక మన రూల్ ఇక్కడ వర్తించదు." అతని గొంతులో ఆట పట్టిస్తున్న ధోరణి.

చిన్నగా నవ్వుకుని కలిపిన పిండి ఫ్రిజ్ లో పెట్టేసి, కామిక్ బుక్ చదువుతున్న సిరిని పిలిచి తయారు చేసే ప్రయత్నంలో పడింది.


*** *** *** *** *** *** *** *** *** *** *** ***

రాత్రి వెళ్ళాల్సిన బర్త్ డే పార్టీకి గిఫ్ట్ కొనటానికి వెళ్తూ, కునాల్ ని దార్లో లైబ్రరీ దగ్గర దింపి, అక్కడ కలిసిన సరితకి తమ ఇంటి దగ్గర డ్రాప్ చేయమని రిక్వెస్ట్ చేసి, అప్పగించి రాహుల్ తో మాల్ కి వెళ్ళింది వాసవి. అక్కడ ప్లే యేరియాలో ఆడుకుంటానని మారాం చేసి ఆపేసాడు. ప్రక్కనే వున్న చైర్స్ లో కూర్చుని పది నిమిషాలు ఆడుకోమని పంపింది.

ప్రక్కనే భార్యా భర్తల్లా వున్న ఇద్దరు కాస్త ఘర్షణ పడుతున్నారు. గొంతులు తగ్గించి మాట్లాడుతున్నా కాస్త అర్థం అవుతుంది. షాపింగ్ లో అనవసరమైనవి కొన్నదని అతని వాదన. ఆ ఆమ్మాయి నువ్వెప్పుడూ ఇంతే అని అలా అలా ఎప్పటెప్పటివో ఎత్తి మాట్లాడుతుంది.

ఎందుకో మధు గుర్తుకొచ్చాడు. ఒకసారి తనే అడిగింది. "నేను యేమి కొన్నానో కూడా పట్టించుకోవా?" అని.

"వసు, అది ఇద్దరం చర్చించాల్సిన విషయమా. అవసరాలు తెలియని మనిషివా?" అని నవ్వేసాడు.

నిజానికి ఎప్పుడూ అతని పూర్తి అభిమతం కనుక్కోవాలని తను ప్రయత్నించిందా? స్వగతం గా అనుకుంది.

ఇష్టపడింది, పాల్ గారు కదిపి పెళ్ళి చేయించారు. మధు కి సర్దుకుపోయే తత్వం. మొహమాటం. సాఫిగా సాగిపోతున్న విషయాన్ని కదపని తనం. ఆ స్వేఛ్ఛ అతను ఇవ్వబట్టే తను ఇంతవరకు పెద్ద తర్క వితర్కాలు చేసే అవసరం రాలేదు. ఇప్పటి వరకు ఒక్కసారీ అతని కవితలు కానీ, ఇతర రచనలు కానీ తనని చదవమని బలవంతం చేయలేదు. తను యేడిపించటానికి మైత్రిని, అతన్ని కలిపి కవి సమ్మేళనం పెట్టుకుని, మీకు మీరే సన్మానాలు చేసుకోండి అన్నా నవ్వుతూనే తప్పా యేనాడూ తిరిగి తన పద్దతులనేమీ ఎత్తి చూపడు.

అవునూ ఎందుకు తనీవాళ ఈ ఆలోచనలో పడింది. తనకు తనే ప్రశ్న వేసుకుంది. బహుశా నీరజ తో జరిపిన సంభాషణ తాలూకు ప్రభావమేమో. ఇన్నేళ్ల తన వైవాహిక జీవితసావాసం యేనాడు శృతి తప్పలేదు. ఇకపై కూడా అది సంభవించదు. మనసులో యేదో విశ్వాసం.

ఇంతలో మధు ఫోన్ ఇంకా రాలేదేమిటని. రాహుల్ ని తీసుకుని ఇంటికి బయల్దేరింది.


*** *** *** *** *** *** *** *** *** *** *** ***

నిజమే ఎన్ని తరాలు మారినా వివాహవ్యవస్థ బలంగా నిలిచేవుంది. భాగస్వాముల నడుమ అవగాహనలో కుటుంబం అన్నది చెదరక సాగుతూనే వుంది. అర్థవంతమైన సర్దుబాట్లలో అది బలపడి ఆ తరానికి ఆ తరానికి స్థిరపడనున్నది. అపుడపుడు ఒక తడబాటు చవిచూస్తున్నా, విడిపడిన జంటలు మళ్ళీ క్రొత్త తోడు వెదుక్కుంటున్నాయి. ఆ మారు పయనంలో గమ్యాన్ని చేరుకుంటున్నాయి. ఆ బాంధవ్యం ఇకపై కూడా ఇలాగే జంటల్ని కలిపుంచి తరతరాలకీ నిలవనున్నది. ఇది నిరంతరం చివురులు వేస్తున్న కల్పవృక్షం.

స్వప్న గీతం

నిన్న రాతిరది నా కలేనేమో? అయితేనేం
కలలో నీవు మాత్రం నిజమే కదా?
కలలోను నా కనులనిండా నీవేనాయే,
అందుకే...
ఇది కల కాదనుకున్నదీ నేనే కదా,
నీవేదంటే అదే నన్నది నీవేకాదా.

నీ నవ్వుల వెన్నెల పోగులు యేరుకున్నాను
తెల్లమొహమేసిన జాబిలికి వెలుగుగ అద్దాను
రేయి పగలుగ మార్చే ఎర్రవూలు బంతి ఎగురవేసాను
కిరణాల వూడలెక్కి అకాశపు మఱ్ఱి మీద ఎగబాకాను
దోబూచులాడే మేఘకన్నియల కోసం వెదుకులాడాను

గాలి చొరవకి నా వూపిరి వేగమిచ్చాను
నీటి వరవడికి నా పరవశమడ్డువేసాను
అగ్గి సెగలకి నా విరహపు ఆజ్యమేసాను
నీ యెదుట మళ్ళీ మనసు పుట తెరిచి వదిలేసాను
కలలోనూ కావలసింది నువ్వేనని
మరోమారు లిఖించాను

ఎందుకని?

మంచు కరుగుతూ చెరిపిన చిత్రాలల్లే
శోకం కక్కుతున్న నివేదనలు

వేల పదాలు కలుపుతూ ఎద రాసిన గీతాలు
నేల పలక మీద గరిక బలపాల గీతలు

సమాధి పునాదుల్లో కదలికలా
కన్నీటి చెలమలో ఉప్పెన

భస్మరాసి మీద మమత చిలకరింపున
మనసునున్న రూపు పునరుజ్జీవనం

మోడువారిన వనం ఎదురుచూపు ఆపదెందుకని
వస్తూనే వీడ్కోలు పలికే ఆమని కోయిల కోసం

కలం నింపిన కల్లం

గుండె నిండా వెదజల్లిన విత్తులు
నిన్నా మొన్నటి నీ జ్ఞాపకాలు

నారుమళ్ళలో పైరగాలులు
నడిరాతిరి స్వగతాలు

పాలకంకుల మధురిమలు
నీవు పంచిన చిర్నవ్వులు

తూర్పారబోసిన గింజలు
నీవు మిగిల్చిన అనుభూతులు

సారం తరగని మాగాణి
సంక్రాంతి శోభల మన చెలిమి

--ఉష

*********************
కొన్ని స్పందనలు చదువరుల మనసులకి మరింత ఆస్వాదించే సమయాన్ని కలిగిస్తాయని...

స్నేహమంటే గుండె గోడల మలచిన నీ రూపాన్ని అడుగు
ఏమిటో దాని అర్ధం చెపుతుంది
స్నేహమంటే నా గొంతు లో దాగిన నీ మాట నడుగు
రాగం కట్టి నీకొక అనురాగాన్ని కలబోసి ఇస్తుంది

స్నేహమంటే నా కళ్ళ వెనుక దాగిన కన్నీటి చెలమనడుగు
వలపు తలపుల మనం ఈదులాడిన క్షణాన్ని
వర్ణించలేని వర్ణాలతో కలిపి ఇంద్ర ధనుస్సు ను చేసి
నీ ముంగిట ముత్యాల ముగ్గుల రంగులను అద్ది వివరిస్తుంది..

-- భావన
*************************

తీరం దాటిన కెరటం
తిరిగి చూసేనా నేస్తం కోసం
గుండెలు బండల్ని కొట్టుకుంటున్నా
ముందుకేగా దాని పయనం.

వరి కంకుల వయ్యారాల్ని
మాగాణి భూముల బంగారాన్నీ
తలచి తలచి అలసిపోడం కన్న
ఇలకు దిగి మనసును
సమాధాన పరచుకోలేమా...

ఙ్ఞాపకాలు, స్వగతాలు,
చిరునవ్వులు, అనుభూతులు
ఇవేకదా మన చెలిమికి సంక్రాంతి శోభల
వేల వేల మాణిక్యాలు..

-- శ్రీలలిత గారు

*********************************
అరుదుగా అభిప్రాయం తెలిపే మరొకరి మాటలివి.

"సరళంగా, అందంగా చాలా చాలా బావుందీ కవిత.. సంక్రాంతి మీద ఇంత చక్కని కవిత చదివి చాన్నాళ్ళైంది.. మామూలుగా ఏదైనా సందర్భాన్నో లేక ఉత్సవాన్నో వర్ణించేప్పుడు కాస్త క్లిష్టమైన భాష ఉపయోగిస్తారు.. కానీ మీరు అతి సులువైన మాటలలో బోల్డంత అనుభూతిని కలిగించారు.. ముఖ్యంగా మన పల్లెలను కళ్ళముందు ఉంచారు! ఇలాంటివి మీరు మరెన్నో రాయాలని కోరుకుంటున్నాను :-)"

ధనుర్మాసపు లోగిలి

కనులెదుటా, మది లోపలా కదిలే బొమ్మల కొలువు ...

ఇప్పుడు:

రెమ్మలకొనగోళ్ళ
మంచు గోరింట పెట్టుకున్న మొక్క,
వసంతాన
చివురెరుపులు
చూపుతానంటుంది.


యే పొద్దూ మెరిసేటి కెంపుపూస
దోబూచులాడుతుంటే,

ముణగదీసిన గువ్వ
రెక్కరాపిడిలో చలికాచుకుంటుంది.

తెల్లార్లూ కురిసిన వాన
యేమీ తెలియనట్లు మిన్నకుంటే,

భారమైన వళ్ళు కదిపి
వుండుండి వీస్తున్నదీ చలిగాలి.

నన్నూ చుట్టుముట్టాలని
చూసిందేమో,

కిటికీ అద్దానికి
మైనపుముద్దల్లే పోతపోసుకుంది.

కుచ్చుల పావడాలో
బొచ్చుకుక్క పిల్ల నన్నెక్కిరించి,

వీధికడ్డం పడి కుందేలు జతపట్టి
ఒప్పులకుప్పలాడుతుంది.

కనులెదుట మారని
చిత్రమిది
హేమంతపు ఉదయాల్లో,
మనసుకి మాత్రం చెప్పరాని పరవశం
యేవంక చూసినా.


ఒకప్పుడు:

తాతయ్య ప్రక్కన వెచ్చగా తొంగున్న పసిదనం
అమ్మమ్మ చెంగులాగి ఆటాడించిన ఆకతాయితనం
సంకురాత్రి ముగ్గులకి గొబ్బిళ్ళ దొంగతనం
భోగిమంటలకి చెక్కాముక్కా పోగేయటం
పాలతాలికలకి అక్కా చెల్లి సంవాదం
తంపటేసిన తేగలకి అన్నదమ్ముల ఆరాటం
వచ్చిపోతున్నా మళ్ళీ అలకపాన్పెక్కే అల్లుళ్ళ అట్టహాసం
అరిశలపిండి వేగేదాకా ఆగలేని అమాయకత్వం
గుమ్మడి పాదుల్లో కోడిపిల్లలతో పారాడటం
ముక్కోటి తిరణాళ్ళలో గోళీసోడా దొమ్ములాటలు
రాములోరి గుడికి శివాలయం పూజారి ఆగమనం
ఆదమరిచి నిదరోనీయని చలిబారిబడ్డ వొళ్ళ కోలాటం
అన్నీ వతనుగా ఏటేటా ముంగిళ్ళకి తెచ్చే మా సంక్రాంతి
అమ్మో, ఎంత తీపి గురుతులో ఈ ధనుర్మాసం వేకువలు!

స్పందనా? బంధమా?

ఏ సడీ ఆగని రేయిలో అలజడీ ఆగని మదికి
అమ్మ జోకొడితే ఇలాగే వుంటుందనిపిస్తూ
చిరుసవ్వడితో లాలిస్తున్న హృదయం

హృదిలో మెదులుతున్న ప్రతి భావనకీ
జలదరింపుగా, గగుర్పాటుగా, ఉలికిపాటుగా
ప్రతిస్పందనతో ఊపేస్తున్న శరీరం

అనుభూతి, అనుభవం పడుగు పేకలుగా
సన్ననేతతో గతపు వస్త్రాన్నల్లుకుని
తన కట్టుతీరులో ఎవరినాకట్టుకోవాలనో మానసం

బొట్టుకొక రెప్పపాటు కాలాన్ని,
చుట్టుకున్న పాశాన్ని త్రుంచుకుంటూ
అలవికాని పనుల అలిసిన నయనం

పెదవి కదపకనే రాగాలు పాడినట్లు,
పాదం కదిలి పయనం ఆగినట్లు
నేనెన్నడూ చూడని కలవరం

నీకూ, నాకూ నడుమ యెన్నిమార్లు,
అంగప్రదక్షిణ చేసిందీ అక్షరం?

నాకొరకు నీవున్నంత వరకు ఆగదీ చలనం

వరవడికి వేయక తప్పని అడ్డుకట్ట!

సాధారణంగా అలుపన్నది యెరుగక పరవళ్ళతో, ఉరవళ్ళతో ఉరికే నదిని చూస్తే నాలో కలిగే భావన ఉప్పొంగే ఆనందం. అలాగే అంతులేని అనురాగం, ఆవేశం, అదుపులేని ఆరాటం కూడ కనిపించేది. అలా కొండల్లో, కోనల్లో పరుగులు పెట్టి సాగరసంగమం అయ్యే నది ఈ ప్రకృతిలోని స్వేఛ్ఛకి ప్రతీక అనిపించేది.

ఎప్పుడోనే ఓ కవి మనసు నది గమనాన మరో కోణాన్ని చూసింది. నాగార్జుగసాగర్ ఆనకట్ట నిర్మాణానికి కొత్త భాష్యం వెదికింది. రెండు దశాబ్దాల పైనాటి ఈ ప్రదర్శన నాకు కళ్ళకు కట్టినట్లు గుర్తు. [మూల రచన సి
.నా.రె. గారి "నాగార్జున సాగరం" అననుకుంటున్నాను.] అది ఒక నాట్యకారుని చేత "సాగరసౌధం" అనే రసవత్తరమైన సంగీతభరిత నృత్యనాటికగా రూపొందించబడ్డాక, కృష్ణానదిని ఒక స్త్రీగా అన్వయించి ఆమె కన్న కల తాలూకు వేదనని అలాపిస్తూ మొదలయ్యే ఈ నృత్యనాటిక మేము చేసేవారం. నేను నాగార్జునాచార్యుడిగానో, నదిగానో, మరొక పాత్రలోనో అభినయంచేదాన్ని. పిన్న వయసులో పలుమార్లు ఈ ప్రదర్శనకై చేసిన నిరంతర సాధన వలన నాకు బాగా గుర్తుండిపోయింది.

"నిజమేనా, నిజమేనా నేను కన్న కల నిజమేనా.... కష్టాలను నష్టాలను కవితలల్లుకున్నాను.. ఎటు తోచక పోయితినే సాగరమునకు" అని తన అపార జలశక్తి వృధాగా రాళ్ళలో, ముళ్ళలో ప్రవహించి, అడవుల్లో సాగి, సముద్రపు పాలవుతుందని విలపించే నదీమతల్లిని ఓదారుస్తూ ఆధునిక మానవుడు వస్తాడు. "రండి రారండి వెలుగు జెండా ఎగరేయండి, కృష్ణమ్మ ఎద నిండే ఖిల్లా నిర్మించండి..సుత్తులు మ్రోగించండి సుర దుందుబులెందుకండి" అని నినాదాలిస్తూ ఆనకట్ట నిర్మాణం తలెపెట్టి పూర్తిచేసి "నీ ఆశలు, ఆశయములు నిండిన సాగరమిదే, సాగర సుధా సౌదామిని సాగరసౌధమ్మిదే.." అని ఆమెను సంతృప్తి పరచటం, ఆ సమయాన రిజర్వాయరు తవ్వకంలో నీట మునిగిన బౌద్ధారామాన్ని నాగార్జునకొండ పైకి మార్చటం జరుగుతుంది. అపుడు నాగార్జునాచార్యుని పాత్ర వస్తుంది. "ఎవరో నను పిలిచినారు, విధియే పడత్రోసి చనిన శిధిలాలను కదలించి.. " అని సమాధి/తపో ముద్ర విడిచి లేచి జరుగుతున్న ఆధునికదేవాలయ నిర్మాణానికి సంతుష్టుడై నిష్క్రకమిస్తాడు. తన జలాల సద్వినియోగం కాంచిన ఆనంద నాట్యం చేసే కృష్ణమ్మ "ఆహా ఆహా ఎంతటి అమర పురాంగణమిది, విద్యా విజ్ఞాన శక్తి విజయ ప్రాంగణమిది.." అని సంతృపిగా రాగాలాపన చేయటం తో ఆ నృత్యనాటిక ముగుస్తుంది.

ఆ నాటికని ఎందుకో నా స్వానుభవంతో పోల్చుకోవాలనిపించింది. నేను, చదువరి/పాఠకురాలు[/డు] ఒకేలా చూడకపోతే ఈ టపా సమంజసంగా తోచకపోవచ్చు. అయినా చెప్తున్నాను.

నాలో సహజంగా స్పందన ఎక్కువ. చిన్న, పెద్ద అన్న బేధం కానీ, స్వల్ప, గాఢ అన్న విధం కానీ వుండదు. భావావేశం ఇట్టే ఉరికి వస్తుంది. "ఒకటి మాత్రం నిజం, మన మనసులో ఉన్న భావతీవ్రత బయటకు వచ్చేప్పుడు, ఖచ్చితంగా దానికి కావల్సిన పదాలను అదే తెచ్చుకొంటుంది. దానిని చదివి ఎడిట్ చేయవలసి వచ్చినప్పుడు, ఒక్క అక్షరాన్ని కూడా తొలగించటానికి, మనసొప్పుకోదు." అన్నట్లుగా కవితలో/వచనాలో వ్రాసుకునేదాన్ని. కవిత అంటే ఇది, కవిత్వం అంటే ఇది అన్న అధ్యయనం యేమీ చేయలేదు.
రాలే పూలు చూసి నా కంటి నీటి నుండి జలజల రాలే నీరే ఎక్కువ. ఇది సున్నితత్వమా, బలహీనతా నాకు తెలియదు.

యూనివర్సిటీ చదువవగానే వివాహం, ఉద్యోగజీవితం వలన నా అభిరుచులు చాలా రిప్రైయాటైజ్ చేయాల్సిరావటంతో వెనుకపడ్డ అభిరుచుల్లో ఒకటి నాకు తెలిసిన భాషలో నాకు వచ్చిన భావాన్ని వెలికి తేవటం. సరే కొన్నాళ్ళపాటు అపుడపుడు కొన్ని కవితలు, చిన్న ఆర్టికిల్స్ వ్రాసాను. అవి పంపినవి పంపినట్లుగా ప్రచురించబడ్డాయి కానీ నేను ఆపేసాను. ఆ స్తబ్దత మరికొన్నాళ్ళు, చివరికి కారణాలు, ప్రోత్సాహం, ప్రోద్భలం యేమైనా గానీ మరువం తెరిచాను. దానికి వూపిరి మాత్రం ఒకేఒక వ్యక్తి, ప్రేరణ. ఈ క్రొత్త పయనం మొదలైంది,
నాలోని అనురాగం ఎంత ఉధృతమో అంతే వేగంగా ఈ మరువం చిలవలు పలువలుగా కొమ్మలు వేసింది. నాలో వున్న భావావేశం వృధా కాకుండా వెలికితెచ్చానేమో అనుకున్నాను. అలా అలా నా రచనల వేగం పెరుగుతూ పోయింది. కాస్త పునరావలోకనం గత రెండు నెలల క్రితం మొదలైంది.

క్రొత్త వ్యాపకం కలిపిన ప్రతిసారి మిగిలినవాటిపై ప్రభావం పడుతుంది. టైం మానేజ్మెంట్ చాలా కష్టమైనది. కాస్తైనా ప్లానింగ్ లేనిదే అన్నీ అనుకున్నట్లుగా సగం శాతమైనా చేయలేము. అయినా ఈ రోజుల్లో టైం మానేజ్మెంట్, ప్రైయారిటీస్ ప్రమాణకంగా సాగే జీవితాల్లో ఎన్నో వదిలేస్తాం, మరెన్నో చేస్తాం, కొన్ని సఫలం, కొన్ని విఫలం. కనుక నేను ప్రతి ఏడాది మొదట్లో కొన్ని గోల్స్ పెట్టుకుని సం. ఆఖరుకి ఎన్ని సఫలమయ్యయో, ఎన్ని విఫలమయ్యాయో బేరీజు వేసుకుంటాను.

నాకు వ్యాపకాలు చాలా వున్నాయి. అందులో ఒకటి మాత్రమే ఈ బ్లాగింగ్. ఈ ఏడాది ఇతరత్రా ముఖ్యంగా నేను మరువం మొదలు పెట్టక మునుపున్న వ్యాపకాల వైపు దృష్టి సారించాలనివుంది. మిగిలిన వ్యాపకాలు హాండిల్ చేయటం సాపేక్షికంగా తేలిక. వద్దనుకుంటే కాస్త వ్యవధి తీసుకోగలుగుతున్నాము. బ్లాగింగ్ అలాకాదు. It's like an extension to our identity. ఏ పని చేస్తున్నా ఇక్కడి టపాల ద్వారా వచ్చే వ్యాఖ్యలు, వ్రాసినవారు, సంబంధిత వ్యవహారాలు మనసు మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతూనేవున్నాయి.


ఈ వరవడి లో ప్రశంసలు, సద్విమర్శలు, తటస్థ వైఖరులు అనుభవంలోకి వచ్చాయి "
Literary appreciation comes with all of these necessary thorns. A budding writer has to go through this" అన్న రీతిగా. మీరు స్త్రీ కనుకనే ఇంత సందడి మీ బ్లాగులో అనే ఆక్షేపణా విన్నాను. కానీ ఇవన్నీ నా రచనా విధానానికి ఎంత ఉపకరించాయి అంటే వ్రాయాలన్న ఉత్సాహం, తపన పెంచాయి. తృప్తి, స్ఫూర్తి ఇస్తున్నాయి.

కానీ ఎందువలనో ప్రశంస, బ్లాగ్ హిట్స్ అన్నవి నేను సెకండరీగానే చూస్తున్నానా, విమర్శని నా పురోగతికి వాడుకున్నానా, నాకోసమే వ్రాసుకుంటున్నానా అన్న మీమాంసకి కూడా గురయ్యాను. అదీకాక ప్రతి కవితకీ, ప్రేరణకీ నాలోని ప్రేమపూరిత/మమతావేశపు భావనలు జతపరిచి వ్రాయటంతో కొంత వ్యక్తిగతానుభవాలు, అన్వయింపులు ఇలా పలుచనయ్యాయా అని నైరాశ్యం. నాలోని నన్ను ఎవరికి తెలపాలని నా తాపత్రయం అన్న ప్రశ్న. అలా నిరంతర ద్వైదీభావనలతో నలిగిపోయిన భావన. అలసట యెరుగని మనసు ఆగాలని చూసిన ఫీలింగ్. ఇలా నాలో అదుపు, అలుపు ప్రవేశించాయి.
కానీ కొన్ని ప్రశ్నలనీ మిగులుస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నీ వివిధ అనువజ్ఞులు వివిధ రీతుల్లో చెప్పే సమాధానాలుగా దారితీయవచ్చు. నా సమాధానాలు నేనే నిర్వచించుకోవచ్చు.

అందాక, ఇకపై నా టపాలకి వ్యాఖ్యలు, నా నుండి ప్రతి-వ్యాఖ్యలు వుండవు.
నా రచనలను ఇంత వరకు ప్రోత్సాహించిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇకపై కూడా మీ రాకని అహ్వానిస్తూ, ఇంతవరకు నేర్చిన అనుసరణీయమైన పద్దతులు పాటించే ప్రయత్నం చేస్తూ... మీ నేస్తం