ధనుర్మాసపు లోగిలి

కనులెదుటా, మది లోపలా కదిలే బొమ్మల కొలువు ...

ఇప్పుడు:

రెమ్మలకొనగోళ్ళ
మంచు గోరింట పెట్టుకున్న మొక్క,
వసంతాన
చివురెరుపులు
చూపుతానంటుంది.


యే పొద్దూ మెరిసేటి కెంపుపూస
దోబూచులాడుతుంటే,

ముణగదీసిన గువ్వ
రెక్కరాపిడిలో చలికాచుకుంటుంది.

తెల్లార్లూ కురిసిన వాన
యేమీ తెలియనట్లు మిన్నకుంటే,

భారమైన వళ్ళు కదిపి
వుండుండి వీస్తున్నదీ చలిగాలి.

నన్నూ చుట్టుముట్టాలని
చూసిందేమో,

కిటికీ అద్దానికి
మైనపుముద్దల్లే పోతపోసుకుంది.

కుచ్చుల పావడాలో
బొచ్చుకుక్క పిల్ల నన్నెక్కిరించి,

వీధికడ్డం పడి కుందేలు జతపట్టి
ఒప్పులకుప్పలాడుతుంది.

కనులెదుట మారని
చిత్రమిది
హేమంతపు ఉదయాల్లో,
మనసుకి మాత్రం చెప్పరాని పరవశం
యేవంక చూసినా.


ఒకప్పుడు:

తాతయ్య ప్రక్కన వెచ్చగా తొంగున్న పసిదనం
అమ్మమ్మ చెంగులాగి ఆటాడించిన ఆకతాయితనం
సంకురాత్రి ముగ్గులకి గొబ్బిళ్ళ దొంగతనం
భోగిమంటలకి చెక్కాముక్కా పోగేయటం
పాలతాలికలకి అక్కా చెల్లి సంవాదం
తంపటేసిన తేగలకి అన్నదమ్ముల ఆరాటం
వచ్చిపోతున్నా మళ్ళీ అలకపాన్పెక్కే అల్లుళ్ళ అట్టహాసం
అరిశలపిండి వేగేదాకా ఆగలేని అమాయకత్వం
గుమ్మడి పాదుల్లో కోడిపిల్లలతో పారాడటం
ముక్కోటి తిరణాళ్ళలో గోళీసోడా దొమ్ములాటలు
రాములోరి గుడికి శివాలయం పూజారి ఆగమనం
ఆదమరిచి నిదరోనీయని చలిబారిబడ్డ వొళ్ళ కోలాటం
అన్నీ వతనుగా ఏటేటా ముంగిళ్ళకి తెచ్చే మా సంక్రాంతి
అమ్మో, ఎంత తీపి గురుతులో ఈ ధనుర్మాసం వేకువలు!

No comments:

Post a Comment