కథ : నిరంతరం

చీకట్లు వీడని శీతాకాలపు ఉదయపు పొద్దు. అక్కడక్కడా మినుకు మినుకు మంటున్న తారలు చిచ్చుబుడ్డి రవ్వల్లా వున్నాయి. సుమారు ఐదున్నర కావస్తుంది. దాహంగా అనిపించి లేచిన మధుకర్, ప్రక్కన చెస్ట్ మీద వున్న జగ్ లో నీళ్ళు కాసిని గొంతులోకి పోసుకుని, మంచంలోనే తలగడ పైకి సర్దుకుని వొళ్ళో లాప్ టాప్ పెట్టుకుని ముందు ఈమెయిల్స్ తెరిచాడు. శనివారం కనుక ఉదయాన్నే పరిగెట్టాల్సిన పని లేదు.

మైత్రేయి నుంచి రెండు నిమిషాల క్రితం వచ్చింది ఆ ఈమెయిల్.

"కలలోనే తొలి పొద్దు వెలుగులు చూసాను
వెలుగుల నీడల్లో తన రూపు వెదికాను
కలని విడిచి కనులు తెరిచి దోసిలి వొగ్గాను
గుప్పిట పట్టినన్ని కిరణాల నేను తడిసాను
శీతువు పొద్దుల్లో వణికే తనకి వొడి వెచ్చన పంచాను
పసిపాపడిగ తను తోస్తే అమ్మ వొడి నాది కాదా?" - మైత్రి

చిన్నగా నవ్వుకున్నాడు. సాదారణంగా ఉదయం వచ్చే ఈ-లేఖ అలాగే వ్రాస్తుంది. నిజమే కదా తల్లి తర్వాత ఆ స్థాన్నాన్ని నింపేది భార్యేగా. ధ్యానానికి తర్వాత పంపితే యేదో ఒక సందేశం కలుపుతుంది.

"పొగమంచు తెరలో తొలివేకువ ఝామున తూరుపు కన్నియ మత్తుకనులు విప్పనని మారాములు చేస్తుంది.. గారాబు చెలియ కొంగు చాటున తెల్లమొహమేసుకుని అదిగోవాడు.. ఎవరనేం, సూరీడు కాక..వాడిని వెక్కిరించటానికి వెళ్దామంటే చెలి కాలి మువ్వ కి చిక్కుకున్న నా కొనగోరు అడ్డుపడింది." -మధు

అని తిరిగి జవాబు పంపాడు.


తల తిప్పి చూసాడు. వాసవి ఇంకా గాఢనిద్రలోనే వుంది. ప్రశాంతంగా నిదురలో వుంది. ఆరున్నరకి గానీ లేవదు. వేడిగా ఓ కప్పు కాఫీ తాగాలనిపించి, మంచంలోచి దిగి బ్రష్ చేసుకుని క్రిందకి కిచన్ లోకి వెళ్ళాడు.

పాలు కప్పులోకి వంచి మైక్రోలో వేడి చేయటానికి పెట్టి, కిటికీ లోంచి బయటకి చూసాడు. కాస్త తెల్లార వచ్చింది. డెక్ మీద రెండు ఎర్ర రెక్కల పక్షులు, చలికి ముడుచుకుని ముక్కులు మెడకి నొక్కుకుని కూర్చుని వున్నాయి. ఆ వెనగ్గా కరిగీ కరగనట్లున్న స్నో కప్పిన బాక్ యార్డ్. ఆకు రాల్చేసిన మేపిల్ ట్రీ మొదల్లో మఠం వేసి కూర్చున్నట్లున్న బూడిద రంగు కుందేలు.

కాఫీ కలుపుకుని చిన్నగా సిప్స్ తీసుకుంటూ ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అస్వాదిస్తున్నాడు. సహజంగా భావుకుడైన అతనికి ప్రకృతి ఎప్పుడూ యేదో ఒక స్ఫూర్తినిస్తూనే వుంటుంది.


అలా ఎంతసేపు నిల్చుండిపోయాడో తెలియదు. వెనుక నుండి రెండు చేతులతో చుడుతూ ఆరేళ్ళ రాహుల్ "డాడీ" అనగానే కాస్త తృళ్ళిపడి, చేతిలో కప్పు డైనింగ్ టేబుల్ మీద పెట్టి పిల్లాణ్ణి ఎత్తుకున్నాడు. కునాల్ వీ గేం ఆడుకుంటున్నాడు.

వాసవి రావటమే గమనించలేదు. నూనె రాసి ముడిపెట్టిన పొడుగాటి జుట్టు, పసుపు, గంధం పట్టించిన మొహం. ఉప్మాకి వేసిన పోపు ముక్కుపుటాలకి సోకింది.

"వసు, కాసేపు కూర్చోకూడదా. ఇప్పుడేగా లేచావు." అన్నాడు అతను.

"అలాగని మరి దానికీ చెప్పు మధు." గోడ మీద గడియారం వైపు చూపుతూ చిన్ననవ్వు కలిపి అంది.

"ఇవాళ నేహ బర్త్ డే పార్టీకి కి వెళ్ళాలి రాత్రికి. కునాల్ స్విమ్మింగ్ క్లాస్ అయ్యాక, గిఫ్ట్ షాపింగ్ చెయ్యాలి. రాహుల్ కి టేక్వాండో టెస్ట్ ఇవాళ మధ్యాహ్నం మూడుకి. ఇవాళంతా పరుగులే." అంటూ రవ్వ కోసం పాంట్రీ వైపు వెళ్ళింది.

అట్లకాడతో పోపులో ఉల్లిపాయ వేపుతూ, ఒక జీడిపప్పు పలుకు తీసి నోట్లో వేసుకుంటూ "వసు, కాఫీ కలపనా?" అని అడిగాడు.


శనాదివారాలు పిల్లలు కునాల్, రాహుల్ యాక్టివిటీస్ కి తనే ఎక్కువగా తీసుకు వెళ్తుంది. మధు కి వంట చేయటం ఇష్టం. మిగిలిన రోజుల్లో ఉదయం యేడుకి బయటపడే అతను, రాత్రి యేడుకి కానీ ఇంటికి చేరలేడు. అందుకు వీకెండ్ లో వంట పని అతనిది. తప్పనిసరైతే తప్ప బయటకి కదలడు.

అమెరికా వచ్చిన ఈ పన్నండేళ్లలోనూ వాసవి పిల్లలు కాస్త పెద్దయ్యే వరకు వర్క్ చేయనని నిర్ణయం తో వీలుని బట్టి వాలంటరీ వర్క్ చేయటమే కానీ అంతకు మించి పిల్లల్ని బయటవదలలేదు. మధుకి అన్నిటా అనుగుణంగానే వుంటూ తన మాట నెగ్గించుకునే గడుసరి.

కాఫీ తాగీ తాగగానే పైకి పరిగెత్తింది వాసవి ఆలస్యం అయిపోతుంది అనుకుంటూ. "మధు, వంట యేమీ చేయకు, రెస్ట్ తీసుకో. నీకు నిన్నటి కూరలున్నాయ్. నేను పిల్లలతో లంచ్ బయట చేసేస్తా.." మెట్ల మీద నుంచి అరిచి చెప్పింది.

వాసవి మధుని ఇష్టపడుతుందని గమనించిన, ఇద్దరి కుటుంబాలకీ కలిపి స్నేహితుడైన పాల్ గారి చొరవతో జరిగిన వివాహం వాళ్ళది. మధు స్వతహాగా మితభాషి, బిడియస్తుడు. పెద్దాడు కునాల్ సంవత్సరం పిల్లాడుగా వుండగా వచ్చారు ఇక్కడకి. దాదాపు యేడేళ్ళ గాప్ తర్వాత రాహుల్ పుట్టాడు. అన్యోన్యంగా, ఆనందంగా సాగిపోతున్న కాపురం వారిది.

*** *** *** *** *** *** *** *** *** *** *** ***

మధు వున్న స్టేట్ కి నాలుగు స్టేట్స్ ప్రక్కనున్న స్టేట్ లో పద్నాలుగేళ్ళుగా కాపురమున్న జంట హరి, మైత్రేయి. అదే ఉదయాన అక్కడి ప్రహసనమిది.

ఉదయమే లేచే అలవాటున్న మైత్రేయి ధ్యానం పూర్తి చేసుకుని, అలవాటుగా పంపే వీక్ ఎండ్ ఈ మెయిల్స్ పంపేసి, కాస్త తెరిపిగా వున్న వాతావరణం చూసి అలా కాస్త బయటకి వెళ్ళాలనిపించి పడుకునే వున్న భర్తని లేపటానికి వెళ్ళింది.

"కాసేపలా వాకింగ్ వెళ్ళొద్దాం, లే హరి." భుజం మీద తడుతూ మైత్రేయి అన్నామాటకి "అబ్బా ఈ చలిలోనా?" బద్ధకంగా అటునుండి ఇటు తిరుగుతూ అన్నాడు హరికృష్ణ.

"చిన్నపిల్లాడిలా మారాం చేయకు. మరీ చలి లేదు." కంఫర్టర్ లాగేస్తూ అంది.

"మొండి వదలవు కదా." ముద్దుగా విసుక్కుంటూ దిగి ఫ్రెషప్ అవటానికి వెళ్ళాడు.

సిరి లేచిందేమో చూసొస్తానని ఆ గదిలోకి వెళ్ళింది . మంచి నిద్రలో వుంది. నుదుట మృదువుగా చుంబించి, బెడ్ ప్రక్కనే పడున్న పుస్తకం తీసి సరిగ్గా పెట్టి, తన టెడ్డీని ఇంకొంచం దగ్గరకి జరిపి, తలుపు దగ్గరగా వేసివచ్చింది. కిచన్ లో ఫోన్ పక్కన పోస్ట్ ఇట్ నోట్ మీద వాకింగ్ కి వెళ్ళాం అన్న మెసేజ్ పెట్టింది. సిరి కి అలా అలవాటు చేసారు.

మరో పావు గంటకి ఇద్దరూ బయటకొచ్చారు.

హరికి తీరిక తక్కువ వృత్తి. ఆపై ప్రాక్టికల్ గా అలోచించే మనిషి. ఇతరత్రా వ్యాపకాలు చాలా తక్కువ. మాట్లాడేది తక్కువే అయినా నికార్సుగా వుంటాడు.

మైత్రేయి కి వృత్తిపర వత్తిడి వున్నా వృత్తీతర వ్యాపకాలు, అభిరుచులు యెక్కువే. మాట మెత్తన, మనసు మెత్తన అన్నట్లుగా వుంటుంది. కాస్త భావుకత పాళ్ళు కలిసిన రచనలు చదవటం. స్పందించినపుడు వ్రాసుకోవటం. అతనికి స్పోర్ట్స్, స్టాక్ మార్కెట్ పట్ల మక్కువ. ఆమెకి ఆసక్తి తక్కువ.

ఇద్దరూ మాత్రం కలిసి ఇష్టంగా చేసే గార్డెనింగ్. కానీ ఇంటిపని, బయటపని అతను సగం పైన చేసేస్తాడు. ఆమె ఇష్టాయిష్టాలు అతనికి తెలుసు. అలాగే అతనికి నచ్చని విషయాల్లో వత్తిడి చేయదు. కనుక ఒక విధంగా ఇద్దరూ కాపాడుకుంటూ వస్తున్న సామరస్యం ఆ సంసారానికి మొదటి సూత్రం.

మాట తూలటం తక్కువ, తూలనాడుకోవటం ఇంకా తక్కువ. పరస్పర అవసరాలు గమనించుకోవటం, అవగాహనతో మెలగటం. పెద్దవారు కుదిర్చి చేసిన వారి వివాహం, వాళ్ళ జీవితాల్ని ముడివేసాక ఇద్దరూ ఒకరినొకరు తెలుసుకుని ఆ స్థాయికి రావటానికి పదేళ్ళ పైనే పట్టింది.


పన్నెండేళ్ళ సిరి ఇద్దరి పోలికలు, లక్షణాలతో పుట్టింది. అందుకే ఇద్దరికీ అదో సరదా, ఒకరినొకరు ఆట పట్టించుకోవటం. "మంచి గుణాలు నావి. అల్లరి నీది" అని అతను, "అదేమీ కాదు, భావుకత నాది, నిక్కచ్చితనం నీది" అని ఆమె మురిపాలు పోతుంటారు. ఆ నడుమ మహా తెలివిగా రాణించేది ఆ చిన్నారి.


*** *** *** *** *** *** *** *** *** *** *** ***

వాసవి దాదాపుగా గంట నుండి మాట్లాడుతున్న ఫోన్ కాల్ అవగానే, కాస్త నిట్టూరుస్తూ వచ్చి మధు ప్రక్కన కూర్చుంది. యేదో చెప్పాలని వచ్చినట్లుగా వుంది. చేతిలోని దిన పత్రిక ప్రక్కనుంచి "యేమైంది?' అని అడిగాడు.

"నీరజ, మురళి విడిపోతున్నారట." కాస్త ముభావంగా అంది. నీరజ వాసవికి చిన్ననాటి స్నేహితురాలు.

"ఏమిటో వినటానికి చిన్నవే అనిపిస్తున్నా దాని మనసు ఎందుకు నొచ్చుకుందో." కాస్త బాధ మిళితమైన స్వరం.

"వసు, అదే పరిస్థితి నీకు వస్తే యేమి చేస్తావు?" ప్రశ్నించాడు మధు.

"చెప్పలేను మధు. నేను సమస్యకి వెలుపల వున్నాను కదా." అంది వాసవి.

"అదే నేను చెప్పాలనుకున్నది. మూడో వ్యక్తికి కనిపించనిదే ఒక ఇద్దరి మధ్య ఘర్షణ. అది సమసిపోయినా, విడదీసినా ఆ ఇద్దరి మధ్య వున్న అవగాహన, సంయమనం, సర్దుబాటు కారణం." అన్నాడతను.

"మళ్ళీ మాట్లాడదాం. కునాల్ క్లాస్ కి టైం అయింది." అంటూ పిల్లల్ని తొందరిస్తూ కదిలింది.

అలాగే కూర్చున్న మధుకి వారం క్రితం తను, మైత్రేయి వైవాహిక సంబంధాల గురించి చర్చించుకోవటం "ఒక్కోసారి విడిపోవటం కూడా సరైన పరిష్కారమేనేమో మధు" అన్న మైత్రి మాట గుర్తుకొచ్చింది.

ఇద్దరి స్నేహం ఇంటర్ చదువుకునే రోజుల నాటిది. ఒకచోటే చదవటం కాకుండా కంబైన్డ్ స్టడీస్ కూడా చేసేవారు. ఒకరి మీద పోటిగా ఒకరు చదువటంతో పాటు, కవితలు, కథలు కలిసి చదవటం, ఆ మీదట కాస్త చర్చలు దాదాపుగా ఆరేళ్ల పైన ఒకేచోట వున్నారు. పెళ్ళి తర్వాత కూడా అదే స్నేహం మొదట్లో ఉత్తరాల్లో, ఆ తర్వాత ఫోనుల్లో, అపుడపుడు కలవటంలో, తరుచుగా జరిపే ఈమెయిల్స్ వలన నిలిచేవుంది.

వాసవి వెళ్ళాక కూడా మధ్యాహ్నం వరకు అదే ఆలోచనల్లో మధు కి మైత్రి పెళ్ళినాటి సంఘటన గుర్తుకు వచ్చింది.


*** *** *** *** *** *** *** *** *** *** *** ***

పెళ్ళి అయ్యాక అప్పగింతల యేర్పాట్లకి ముందు పందిట్లో విశ్రాంతిగా కూర్చున్న మైత్రి తాతగారు మాధవయ్య ప్రక్కగా వెళ్ళి కూర్చున్నాడు.

ఆమె తల్లి శ్రీలక్ష్మి, తండ్రి రామకృష్ణ ఇంకా హడావుడి పడుతూనే వున్నారు. మైత్రి మావయ్య నాగేంద్ర, అత్తయ్య ప్రమీల పెళ్ళికి వచ్చి వెళ్తున్న బంధువుల వీడ్కోలిస్తూ తిరుగుతున్నారు. అమ్మమ్మ జానకమ్మ గారు కూర్చున్న చోటనుండే అన్నీ పురమాయిస్తూ నేర్పుగా పనులన్నీ సవ్యంగా అయ్యేలా చూస్తున్నారు.

"చూసావయ్యా మా జానమ్మ, ఎంత జాణో. కూర్చునే చక్రం తిప్పేస్తుంది" నవ్వుతూ అన్నారు.

ఆయన చమత్కారపు మాట తీరు అలవాటే కనుక "భలేవారే తాతగారు." అన్నాడు మధు.

"లేదయ్యా, మా పెళ్ళిలో ఇలా అప్పగింతల్లోనే పంతాలు వచ్చాయి. రెండేళ్ళు కాపరానికి పంపలేదు." అన్నారు.

"అవునా తాతగారు. వినలేదెప్పుడూను." అన్న మధు మాటకి బదులిస్తూ, "అవునయ్యా, మాది ఓ రకంగా మేనరికం. జానకి పిన్ని భర్త మా మేనమావ. ఆయన పట్టుదల వల్లే జరిగింది మా పెళ్ళి. జానకి కూడా మొదట్లో ఇష్టపడలేదు నన్ను. తన స్నేహితురాలు పెళ్ళయి పుట్టింట వుందని ఎద్దేవ చేసిందని నన్ను రమ్మని జాబు వ్రాసి, చెప్పాపెట్టకుండా నాతో వచ్చేసింది. ఆ అభిమానంతోనే తను నన్ను అంగీకరించేలా చేసుకున్నాను. " ఆయన పూర్వ స్మృతుల్లో మునిగి మాట్లాడుతున్నారు.

మధుకి ఆపాలనిపించలేదు. అలా అలా ఆయన జానకమ్మ గారి ఇష్టాయిష్టాలు తెలుసుకుని మెలగటం, ఆవిడ కూడా ఆయన పట్ల గౌరవాభిమానాలు పెంచుకోవటం, ఆయన కున్న ఒకటీ రెండు బలహీనతలైన ముక్కోపం, యేకపక్ష నిర్ణయాలని సహనంగా స్వీకరించటం చెప్పుకుంటూ పోతున్నారు.


మధులో ఆలోచన, ఆవిడ అప్పటి సాంఘిక పరిస్థితులకి వెరసి ఆయనతో కలిసి జీవించారా? లేక ఇష్టం కలిగి అదే ప్రేమగా మారిందా?

మైత్రి ని కన్నీళ్ళతో సాగనంపాక మౌనంగా కూర్చుని వున్న జానకమ్మ గారిని కదపాలనిపించక వూరుకున్నాడు.

"మధు, ఇలారా బాబు." అని ఆవిడే పిలిచారు. "కాస్త లోపలికి వంట పాకలోకి వెళ్ళి చిన్నాలమ్మ గారినడిగి ఆయనకి మజ్జిగ తెస్తావా?" అని అడిగారు.

చిత్రం, అంత హడావుడి, మనవరాలెళ్ళిందన్న దిగుల్లో కూడా ఆయన అలవాట్లు మరవలేదావిడ.

మాధవయ్య గారికి మజ్జిగ ఇచ్చి జానకమ్మ గారి దగ్గర కూర్చుని "మామ్మగారు, తాత గారు మీ పెళ్ళి నాటి ముచ్చట్లు నెమరేసుకుంటున్నారు." అన్నాడు.

మైత్రి, హరిల మెడల్లోని కర్పూరపు దండలు తీయించి, గంగిరెద్దుకి వేయించాలని జాగ్రత్త పరుస్తున్న జానకమ్మ గారు "యేమిటటా అల్లుడు మర్యాదలు చాల్లేదని ఇంకా అలక పానుపెక్కుతానంటున్నారా?" నవ్వుతూ అడిగారు.

"ఒకమాట అడగనాండి." అన్నాడు. "కాబోయే పెళ్ళి కొడుకువి, అడుగు మరి, సందేహాలు సహజమే" అన్నారు. మరుసటి నెలలోనే మధు పెళ్ళికి లగ్నం పెట్టారు.

"మరి... మరి మీరు తాతగారిని ఇష్టపడలేదట. ఆ తర్వాత ..." అర్థోక్తిగా ఆగిపోయాడు.

"వూ చెప్పారూ..." అని "అవునయ్యా, ఇద్దరికీ చిన్నతనం. పెద్దవాళ్ళ పట్టింపులు. అలా కాస్త యెడ మొఖం పెడ మొఖం. కానీ ఎంత గడుసువారని. నాకేవి ఇష్టమో కనుక్కుని, నా మనసు మార్చారు. కొన్నేళ్ళకి ఇద్దరికీ మా సమస్యలు మేమే తీర్చుకోవాలి. పెద్దల మాట గౌరవించాలి కానీ ఆవేశంలో వారితో నిలకడ లేని ఆలోచనలు పంచుకోకూడదు. మాట తూలటం ఆయనకి అలవాటైనా, ఆ క్షణం నాకు సహనం కావాలి. అభిప్రాయాల్లో పట్టు విడుపు వుండాలని అర్థం అయింది. అయినా నిర్ణయాల్లో మాత్రం తనదే పై చేయి. అక్కడ నాది సర్దుబాటు. ఈ రోజు శ్రీలక్ష్మి, నాగేంద్ర ఇంతా హాయిగా కాపురాలు చేసుకోవటానికి మా పెద్దల పట్ల మా గౌరవాలు, మా ఇద్దరి నడుమా వున్న అవగాహన కారణం." అంటూ తృప్తిగా చెప్తున్న ఆవిడలో మధుకి పరిపూర్ణత గోచరించింది.

*** *** *** *** *** *** *** *** *** *** *** ***

ఫోన్ మోగటం తో ఈ లోకం లోకి వచ్చి ఆన్సర్ చేసాడు.

"మధు, నేను మైత్రి." అటు నుండి పలకరింపు స్వరం.

"నీ గురించే అనుకుంటున్నాను" అన్నాడు మధు.

అలా ఆ సంభాషణ నీరజ విషయం మీదిగా మైత్రి అమ్మమ్మ, తాతగార్ల పైకి మళ్ళింది.

"అవును మధు, నాకు చాలా ఆశ్చర్యం గా వుంటుందెపుడూను. ఆయనలా తాటాకు మంటలా ఎగిసి పడతారా, అంతలోనే 'నీ మాటేంటో చెప్పు' అని చిన్న పిల్లాడిలా అమ్మమ్మ నోటితోనే అసలు నిర్ణయం రప్పిస్తారు. చివరికి ఇద్దరిదీ ఒకటే మాట." అంది నవ్వుతూ.

"బహుశా వాళ్ళు తన భాగస్వామి ఇలా వుండాలన్న ఆశింపుతో వివాహ బంధంలోకి రాలేదేమో మైత్రి. కలిసి జీవించాకనే ఒకరినొకరు మలుచుకున్నారేమో." అన్నాడు మధు.

"అలా అయితే మరి మా జేజమ్మ విషయం అలా కాదుగా మధు." అంటూనే మైత్రి కాస్త గొంతుకేదో అడ్డం పడ్డట్లు ఆగిపోయింది.

"ఊ, వూరుకో మైత్రి. అనవసరం గా అవన్నీ కదిపానా?" అని అడిగాడు. మైత్రి అలా చలించిపోవటం అతనికి కొత్త కాదు.


"లేదు మధు, చెల్లీ అంతేగా. తన ఆలోచనలు తను దాచేసుకుని, భర్త దురాగతాలకి తలవంచే కదా అలా అర్థాంతరంగా మరణించింది. ఈ కాలం లో వుండి కూడా తన జీవితానికి తను న్యాయం చేసుకోలేకపోయింది. సర్దుబాటుకీ ఒక హద్దు వుంది. అది ఇద్దరికీ ఆపాదించాల్సిన నియమం అని ఎందుకు తను తెలుసుకోలేకపోయిందో.." అని "అందుకే అన్నాను ఆ మధ్య, విడాకులు తప్పని సరైనపుడు దాన్ని నేను సమర్థిస్తాను అని" భారంగా అంది.

కాసేపు మాట మళ్ళించి ఆమె కాస్త తేరుకున్నదనుకున్నాక ఫోన్ పెట్టేసాడు.

*** *** *** *** *** *** *** *** *** *** *** ***

మైత్రి ఆలోచనలు తన స్వానుభవాల వైపు మళ్ళాయి. పూర్తి వైరుధ్య స్వభావాలు తనవి, హరివి.

అనుభూతులు సంపదలుగా తన జీవన విధానాలు. ప్రతి నిమిషం వెల కట్టినట్లు గడపటం హరికి అలవాటు. మొదటి నుండీ
Don't wash your dirty laundry in public అన్నది ప్రధాన సూత్రంగా మెలిగినా, ఇరువురి నడుమా ఎన్నిసార్లు ఘర్షణలు. వాదోపవాదాలు.

మధ్యేమార్గం ఇద్దరూ పాటించాలని, ఒకరినొకరు పూర్తి ప్రభావితం చేయకూడదని
గట్టి నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి వుండడానికి ఇద్దరిలోనూ దృఢసంకల్పం రావటానికి ఎన్నో యేళ్ళు పట్టింది. ఇన్నిటా తమ మధ్య బంధాన్ని ఆపింది కేవలం మూడు ముళ్ళూ కాదు, సమాజమూ కాదు. తమరిరువురిలోని ఆలోచనలు, అదుపు తప్పని ఆవేశం, పరస్పర అనురాగం కారణం. అవే మనస్తత్వాల రాపిడిని ఆపాయి.

తనలోని భావుకత ఎప్పటి మాదిరే ఆ అభిరుచి వున్న మధు వలన పరస్పరం ప్రోత్సాహించుకుంటూ, విమర్శించుకుంటూ సాగుతుంది. మధు కి తను వాసవికి తగిన జోడు కాదేమో అన్న ఆలోచన ఒకసారి తనతో పంచుకున్నాడు. వాసవి చురుకుదనం, ఇతర వ్యాపకాల్లో అతను తను సరికాదేమోనన్న విధంగా ఆలోచించాడు. సాఫీగా సాగిపోతున్నా తన వలన యేదైనా వెలితి వుండివుండవచ్చేమోనని మైత్రితో ప్రస్తావించాడు.

"మధు, యే ఇద్దరూ ఒకేలా వుండరు. ఇద్దరి జీవితం ఒక త్రాటి మీద నడవాలంటే ఇద్దరికీ సర్దుబాటు గుణం కావద్దా? వాసవి కూడా నీ పట్ల ఒక అవగాహనకి వచ్చేవుంటుంది. తననే అడిగి చూడు. ఇలా నాలా మూడో మనిషి మాటకి తావీయకు." సున్నితంగా హెచ్చరించింది తను.

ఆ తర్వాత ఎప్పుడూ తమ మధ్య వైవాహిక సమస్యల ప్రస్తావనలు రాలేదు. వివాహ జీవితాలు, చుట్టూ గమనిస్తున్న పరిణామాలు అప్పుడప్పుడు చర్చించుకోవటం మాత్రం జరుగుతుంది.

జేజమ్మ, అమ్మమ్మ, తన తల్లి తరంలోని ఒకరిద్దరు, మొదటి వివాహంలో శారీరక హింసకి గురై, విడాకులతో బయటపడి, తనమాదిరే ఒంటరైన వంశీని రెండవ వివాహం చేసుకుని హాయిగా వున్న దేవిక, ఇప్పుడు నీరజ ఇలా ఒకరి తర్వాత ఒకరు మైత్రి ఆలోచనల్లో తారసపడతున్నారు.

ఈ వ్యవస్థలో రక్షణ, స్వేఛ్ఛకి వెసులుబాటు వున్నాయి. తరం వెనుక తరం అనుసరణలు మారుతున్నాయి. అన్నిటా సహచర్యం సాఫీగా సాగిపోగల దిశగానే జంటలు నడుస్తున్నారు. ఎందులోనైనా అవుట్ లయ్యర్స్ తప్పవు. ఇక్కాడా ఇంతే అని నిట్టూర్చింది.


ఆలోచనలు కట్టి పెట్టి, డిన్నర్ కి వంట చేద్దాం అనుకుంటూ కిచెన్ వైపు నడిచింది. చపాతీకి పిండి కలుపుతుండగా హరి ఫోన్. "మైత్రి, సిరి మెక్సికన్ రెస్టారెంట్ కి వెళ్దామందిగా. నేనొక అరగంటలో వస్తాను. మీరు రడీగా వుండండి." అంటూ. "అదికాదు హరి .." అంటుండగానే "యేది కాదురా, సిరి గాడి ఆర్డర్ మేమ్, నాది కాదు కనుక మన రూల్ ఇక్కడ వర్తించదు." అతని గొంతులో ఆట పట్టిస్తున్న ధోరణి.

చిన్నగా నవ్వుకుని కలిపిన పిండి ఫ్రిజ్ లో పెట్టేసి, కామిక్ బుక్ చదువుతున్న సిరిని పిలిచి తయారు చేసే ప్రయత్నంలో పడింది.


*** *** *** *** *** *** *** *** *** *** *** ***

రాత్రి వెళ్ళాల్సిన బర్త్ డే పార్టీకి గిఫ్ట్ కొనటానికి వెళ్తూ, కునాల్ ని దార్లో లైబ్రరీ దగ్గర దింపి, అక్కడ కలిసిన సరితకి తమ ఇంటి దగ్గర డ్రాప్ చేయమని రిక్వెస్ట్ చేసి, అప్పగించి రాహుల్ తో మాల్ కి వెళ్ళింది వాసవి. అక్కడ ప్లే యేరియాలో ఆడుకుంటానని మారాం చేసి ఆపేసాడు. ప్రక్కనే వున్న చైర్స్ లో కూర్చుని పది నిమిషాలు ఆడుకోమని పంపింది.

ప్రక్కనే భార్యా భర్తల్లా వున్న ఇద్దరు కాస్త ఘర్షణ పడుతున్నారు. గొంతులు తగ్గించి మాట్లాడుతున్నా కాస్త అర్థం అవుతుంది. షాపింగ్ లో అనవసరమైనవి కొన్నదని అతని వాదన. ఆ ఆమ్మాయి నువ్వెప్పుడూ ఇంతే అని అలా అలా ఎప్పటెప్పటివో ఎత్తి మాట్లాడుతుంది.

ఎందుకో మధు గుర్తుకొచ్చాడు. ఒకసారి తనే అడిగింది. "నేను యేమి కొన్నానో కూడా పట్టించుకోవా?" అని.

"వసు, అది ఇద్దరం చర్చించాల్సిన విషయమా. అవసరాలు తెలియని మనిషివా?" అని నవ్వేసాడు.

నిజానికి ఎప్పుడూ అతని పూర్తి అభిమతం కనుక్కోవాలని తను ప్రయత్నించిందా? స్వగతం గా అనుకుంది.

ఇష్టపడింది, పాల్ గారు కదిపి పెళ్ళి చేయించారు. మధు కి సర్దుకుపోయే తత్వం. మొహమాటం. సాఫిగా సాగిపోతున్న విషయాన్ని కదపని తనం. ఆ స్వేఛ్ఛ అతను ఇవ్వబట్టే తను ఇంతవరకు పెద్ద తర్క వితర్కాలు చేసే అవసరం రాలేదు. ఇప్పటి వరకు ఒక్కసారీ అతని కవితలు కానీ, ఇతర రచనలు కానీ తనని చదవమని బలవంతం చేయలేదు. తను యేడిపించటానికి మైత్రిని, అతన్ని కలిపి కవి సమ్మేళనం పెట్టుకుని, మీకు మీరే సన్మానాలు చేసుకోండి అన్నా నవ్వుతూనే తప్పా యేనాడూ తిరిగి తన పద్దతులనేమీ ఎత్తి చూపడు.

అవునూ ఎందుకు తనీవాళ ఈ ఆలోచనలో పడింది. తనకు తనే ప్రశ్న వేసుకుంది. బహుశా నీరజ తో జరిపిన సంభాషణ తాలూకు ప్రభావమేమో. ఇన్నేళ్ల తన వైవాహిక జీవితసావాసం యేనాడు శృతి తప్పలేదు. ఇకపై కూడా అది సంభవించదు. మనసులో యేదో విశ్వాసం.

ఇంతలో మధు ఫోన్ ఇంకా రాలేదేమిటని. రాహుల్ ని తీసుకుని ఇంటికి బయల్దేరింది.


*** *** *** *** *** *** *** *** *** *** *** ***

నిజమే ఎన్ని తరాలు మారినా వివాహవ్యవస్థ బలంగా నిలిచేవుంది. భాగస్వాముల నడుమ అవగాహనలో కుటుంబం అన్నది చెదరక సాగుతూనే వుంది. అర్థవంతమైన సర్దుబాట్లలో అది బలపడి ఆ తరానికి ఆ తరానికి స్థిరపడనున్నది. అపుడపుడు ఒక తడబాటు చవిచూస్తున్నా, విడిపడిన జంటలు మళ్ళీ క్రొత్త తోడు వెదుక్కుంటున్నాయి. ఆ మారు పయనంలో గమ్యాన్ని చేరుకుంటున్నాయి. ఆ బాంధవ్యం ఇకపై కూడా ఇలాగే జంటల్ని కలిపుంచి తరతరాలకీ నిలవనున్నది. ఇది నిరంతరం చివురులు వేస్తున్న కల్పవృక్షం.

No comments:

Post a Comment