వింటానంటే, ఎన్నెన్నో!

నిరంతరం అలల హస్తాలతో ఒడ్డులు శుద్ధి చేసుకునే సంద్రాన్ని చూసావా?
పారేసుకున్న జ్ఞాపకాలు, పరిగెత్తిపోయిన పాదముద్రలు,
పాడుబెట్టిన ఇసుకగూళ్ళు, పున్నమి జార్చుకున్న వెన్నెలలు 
నిమ్మళం గా తనలోకి పొదుపుకుంటూ

అనవరతం కదలికల్లో జాడ తెలుపుకునే గాలిని చూసావా?
పదిలం గా దిద్దిన ముగ్గుల్లో చిలిపి చిందులు వేస్తూ, 
బిడియపు మడతల్లో చొరవ గా చక్కలిగింతలు పెడుతూ,
చెదరగొట్టినా తిరిగి తిరిగి చుట్టుకుంటూ

ఆకు పచ్చలు మారవు, పూల ఘుమఘుమలు పెరగవు
తేనియల మధురిమలు, తేటనవ్వులు ముగియవు 

ఇలాగే వస్తుంటాయి వాస్తవ చిత్రాలు కనులెదురుగా 

ఇంకా! అవును ఇంకా ఏదో కావాలి, ఏమిటంటే--

తెలిసినదేదో తిరిగి తెలియాలి
తెలియని మగతలో ముంచాలి
తెరుచుకోని తలుపు మీద తట్టాలి
దగ్గరగా వినవచ్చే అడుగుల ధ్వని వినాలి 
'నేను ఎవరిని?' అంటూ నివ్వెరపరచాలి
పరిచితమైన పలకరింపులో పరిమళించాలి

ఎలాగో వస్తాయి చిత్రమైన కలలు మూతపడని కనులలోకి

ఇంకా? అవునో కాదో ఏదో జరగాలి, ఎందుకంటే--

మనసుకి మనసుకి నడుమ పీచుమిఠాయి లా పలుచని తెరలుంటాయి
'మమతలు' అని పిలుద్దామా?
తీయని రుచులు తెలిసేంతలో గట్టిపడతాయి
అపుడిక ఆ మమతల వెంట చీమల దండులా ఆశలు
అవధి లేని అదుపు లేని సీమలోకి పరుగిడుతూ మనం

అలాగే వస్తాయి ఊహాతీత ఊసులు కుదురుపడని మది కి

ఇంకా!? చెప్పు మరి- ఇంకేవిటి మిగులుందో!

బలాలు!?

నేను పిల్లలకి కొత్త విషయాలు చెప్పే ముందు ఒక పాటగా లేదా జింగిల్స్ లా నేర్పి నిదానం గా పాఠం లోకి ఈడ్చుకుని వెళ్తా: ఒక పూర్వ ఉదా: పెళ్ళి కిళ్ళీ కొడిగినహళ్ళి బిసిభెళెబాత్ (వివాహాలు, అందులో విందు ప్రత్యేకతలు, వివాహ వేడుకల్లో ప్రాంతీయ బేధాలు..గట్రా చెప్పటానికి) అలాగ ఈ బలాలకి క్రిందన 3 లైన్స్ కూర్చాను. 

అంగబలం అర్థబలం కండబలం గుండెబలమ్మ్మ్మ్
బుద్దిబలం ఆత్మబలం ముహూర్తబలం మంత్రబలమ్మ్మ్
స్థానబలం సైనిక బలమ్మ్మ్మ్

ఇక అనువాదాల్లోకి వస్తే:

1) అంగబలం- power of support ('amga' = physical support rendered by followers')

2) అర్థబలం – power of money, power of economy

3) ఆత్మబలం - self-confidence

4) ముహూర్తబలం – power of the moment

5) మంత్రబలం – power of manthra (ఈ పదం ఇప్పుడు అమెరికాలో బాగానే ప్రాచుర్యం పొందింది కనక.) 

6) కండబలం - muscle 

7) గుండెబలం - ఇది రైమింగా వుంచాను కానీ - self-confidence నే కావచ్చు 

8) బుద్దిబలం - power of intelligence

9) స్థానబలం - local support

10) సైనిక బలం - army

ఇపుడు ఈ పదింటికీ మీరంతా అక్షింతలో/దీవెనలో వేస్తే నా పనిలో పడతా!

[11) గ్రహబలం – power of stars

12) దైవబలం – By god’s will; or power of prayers. 

ఇవి కూడా కలపనా వద్దా అని ఆలోచనలో పడ్డాను.]

రేగొడియాలు - ఇవి మా ఇంటి రుచులు



మరీ మిగలముగ్గని దోరగా పండిన రేగిపళ్ళు (ఇవే భోగిపళ్లకి వాడేవి), -వడియాల కన్నా ముందే పెట్టేవాళ్ళు ఎండిపోకుండా- మరీ ముదురెండలు కాని కాలం లో కొని, కడిగి, నీడన ఆరబెట్టి, సుతారంగా ముచ్చిక తీసి, కొద్దిపాటి వత్తిడితో సగానికి చీల్చి, పుచ్చుపట్టలేదని నిర్థారించి, అప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, బెల్లం (ఎవరి పాళ్ళు వాళ్ళవి) వేసి రోలు లో (రుబ్బురోలు కాదు) రోకటి పోటు నిదానంగా వేస్తూ (గింజ ముక్కలై పగలకుండా) పచ్చడి చేసి, ఎండలో తుంగ/తాటాకు/ఈతాకు చాప మీద, నేతచీర పరిచి, చిన్ని ఉండలుగా తీసుకుని బొటనవేలితో వత్తి, వడియాలుగా పెడతాము. కనీసం ఒక వారం ఎండాలలా, డబ్బాకి ఎత్తటం, ఆరబెట్టటం, పిల్లల్నీ, పిల్లకాకుల్నీ కాచుకోవటం..కుంచాల లెక్కన కొలుచుకుని కూతుళ్ళకి పంపటం - అదన్నమాట! అసలు ప్రహసనం..తడి తగిలినా, బెల్లం పులిసిపోయినా, ఆఖరుకి పోటు బలం గా తగిలినా ఆగవు. ఇలా ఎన్నో జాగ్రత్తలు పడాలి. వతనుగా పళ్ళు తెచ్చే మనుషులు, ఒకే నేలలో పెరిగే చెట్ల కాయలూను- వానాకాలం, శీతాకాలం విటమిన్ సి ఇస్తాయివి. రుచికి ఏ పద్యం చాలదు వివరించటానికి. ఎంత శ్రధ్ధగా ఇంటిల్లిపాదిమీ కబుర్లు, పెద్దల మందలింపుల నడుమ పడతామో వీటిని- అమ్మమ్మ->అమ్మ-> ఇపుడు వదిన ల సారధ్యంలో..మా తర్వాతి తరం వారికీ "రేగొడియాలు తింటే రేపన్నది లేనట్లే తినాలి" అని నేర్పిస్తూ, మా హయాం లో ఆ గింజల రాపిడికి నోరు కొట్టుకుపోతే అన్నంకి ఎసరు పెట్టిన కాణ్ణుంచి కంగారు, యేయే నానా వంకలు చెప్పి కూరన్నం ఎగ్గొట్టి మీగడ తో చారన్నం,పెరుగన్నం మాత్రమే తినాలా అనే జిత్తులు ఎలా వేసేవారమో కూడా విప్పి చెప్పేస్తూ, కొత్తవారికి వీటి రుచి మలిపేస్తూ- (కొందరికైనా మీ బాల్యపు ఇష్టమైన తిళ్ళు తలపుకి తెప్పిద్దామని).

నదీసంగమం

గాథల్లో ఎన్ని నదులు..
వరదతో ముంచెత్తాయని
కరువులో ముంచేసాయనీను
అంతిమంగా సాగర సంగమాలు

ఓ 'నది' కొత్త మలుపు తీసుకుంది
వనానికి వలస వెళ్ళింది
నడక ఆపిన నదిలో 
పుడమి ఈదులాడుతుంది
కదలని నది, కదులుతున్న నేల
కలిపి కట్టిన రాగం-
సృష్టి పెదవులు ఉచ్చరించిన ఓంకారం!
కొంగ్రొత్త భావనతో అనాదిగానం! 

ఇక, ఎక్కడి మేఘాలో వానధారలై
ఆ హ్రదంలో సంగమిస్తున్నాయి
అక్కడక్కడే తిరుగాడే గాలులు
తెప్పలై తిరుగుతున్నాయి

జీవం

దిగంతం మీదుగా ఎగిసిన బింబంతో పాటుగా, 
మరో రోజు లోకి సాగుతూ మనం

కాలసాగరాన క్షణాల అలలు-
కొంత నురుగు, కొన్ని సాంద్ర లవణాలు, 
మరి కొన్ని గవ్వలు, ఆల్చిప్పలు. 
ఆవిరయేవి కొన్ని, ఆరని తడిలో కొన్ని.
ఉదయాస్తమయాల నడుమ ఆటుపోట్లలో మనం
సంద్రాన ఉప్పుకీ, కన్నీటికీ సుంకం కట్టాలి.

కాలం ఎడారిలా మారవచ్చు-
ఒంటె మెడలో గంటల ధ్వనిలా జ్ఞాపకాలు,
మృగతృష్ణలో నీటిలా ఆశనిరాశలు,
అనంత రేణువులై జీవితాలు.
ఓయాసిస్సులో వసిస్తూ,
ఇసుక తూఫానులో కంపిస్తూ,
కదలిక కరువైన గతంలో మనం
బిడారికీ, ఒంటరికీ గుడారపు నీడ కావాలి. 

జీవితం వాలుతున్న వేళకి ఉదయిస్తున్న కాంతిలో
మరి కాస్త జాగృతిలోకి మనం గా సాగుతూ...

17/01/2014

ఋతంభర

"జీవరాశుల, నిర్జీవ రాశుల చైతన్యమంతా ఇమిడి ఉండి వాటిని నిర్దేశించే ఓ దివ్య శక్తి జాలం ఋతంభర. ఋతంభర మనసు మాట్లాడే ప్రక్రియ. మనసుతో వినాలి. మనసు ఇంద్రియంగా ఆలోచనలని 'ప్రోసెస్ ' చెయ్యాలి." - (సుజనరంజని సౌజన్యంతో). విశ్వం మనకి తెలియాల్సిన సందేశాన్ని సరైన అదును చూసి ఆ మనసు అనుసంధానం చేసుకునే స్థితి కి వచ్చాకనే తెలియచేస్తుందా!? ఎపుడూ తీరని సందేశమే...మొన్న రాత్రి సుమారు 1:30AM ప్రాంతాన త్రయోదశి చంద్రుడు, పక్కగా నిదానంగా ఎగురుతున్న విమాన దీపాలు, వేగుచుక్క, గంపెడు నక్షత్రాలు, వీధి దీపాలు, షికాగో దారిపట్టిన వాహనాల దీపాలు - నింగి నేల ఏవేవో శోభలు..అవే నిత్యమన్నట్లు, 4:00AM వరకు వాటి గమనం చూస్తూనే ఉండిపోయానలా! అలా అలా ఓ కునుకు, ఇంతలో ఆరైపోయింది తెలతెలవారుతున్న సూచనలు, కూతలు, మోతలు , ఆకాశమంతా నిర్జీవంగా ఆ శోభలు, మెరుపులు లేవిక..సూర్యుడి జాడ లేదు; కాసేపు నిస్పృహ. 7 గంటల సుమారుల్లో చిక్కని వెలుగు రేఖలు. రాత్రి గమనించిన ఆ 6 రకాల కాంతుల జాడ లేనే లేదు. భానుడు నిదానంగా జరుగుతూ రోజుని నడిపిస్తున్నాడు. ఈ తేజస్సే సత్యం కదా! అనేసుకున్నాను..మళ్ళీ మబ్బులు, గాజు గుళికల జడి, గాలితో కలిసి మంచువాన వెర్రిగా 2 గంటలు. నేలంతా స్ఫటికపు మెరుపులు. శివమెత్తిన ప్రకృతీ పురుషుల నర్తన. సరీగ్గా 12PM కి అన్నీ స్తంభించిపోయాయి, గాలి లేదు, పొడారిపోయిన నేల, మబ్బుల్లోకి మాయమైన సూర్యుడు- సుందరమైన జగత్తు... "సత్యం శివం సుందరం" కదా! ఎంత అందమైన ఊహ కైనా సత్యపు పునాది లేనిది సౌందర్యం నిలబడలేదు, కవితలో అయినా, జీవితంలో అయినా. మనసుకి కావాల్సిన సమాధానం అందింది. జీవితంలో ఏదీ నిత్యసత్యం కాదు. ఏదీ ప్రకృతి పంచే సుందర రూపాన్ని, ప్రకృతిని మించిన సాంగత్యాన్ని ఇవ్వదు. ఊపిరి పీల్చుకుని జీవితంలోకి చలించాను...

అనగనగా

వాన స్వైర విహారం, 
తెల్ల కిరణాల విచ్ఛిన్నం-
ఒకానొక పగటికాలపు రంగుల చరిత్ర 
ఆకాశ వీధుల్లో విప్పుకున్న శాంతి ఛాపంగా వెల్లడైంది  

అనుకోని హిమోత్పాతం, 
వాహన కాంతుల పోరాటం-
ఒకానొక చీకటిరేయి విప్లవ చైతన్యం   
నగర వీధుల్లో పరుచుకున్న జీవన క్రాంతిలో వెల్లివిరిసింది  

ఉపద్రవాలు వస్తూ పోతుంటాయి ఎదలోనూ,
-అనామక దిగుళ్ళు, ఆశించని అడియాసలు-
వెనువెంబడే వాన వెలిసిన తేటదనం
విషణ్ణ వదనం లో చిగురించే చిరునవ్వు పచ్చదనం

09/12/2013

సాయంవేళ సాయం

గొల్లకావిడి, పిల్లలకోడి అంటూ ఎవరు పెట్టేరో బృందనామాలు!
పాలపుంత, ఒరయాన్ అంటూ మరెవరెవరు చేసారో విభజనలు... 
నామకరణాలు, వర్గీకరణాలు లేనేలేని లోకం ఒకటుంది

నక్షత్రాలు నవ్వుతూ పలుకరిస్తాయి అక్కడ
నేల దిక్కుగా ఆదరంగా చూస్తూ,
నడుమ నడుమ దిగులుగా ఉల్కలై రాలిపడుతూనో,
మబ్బు తెరల వెనుక దాగుడుమూతలాడుతోనో,
నీటి అద్దాల్లో మురిపాల మోములతో వెలుగుతూనో... 
సందళ్ళు చేస్తాయి, సవ్వళ్ళు పుట్టిస్తాయి ఎద కనుమలలో

సందె పొద్దులో నింగి పందిరిలో జాజులై విరగబూస్తూ,
చీకటి వేళల చిరుకాంతులతో కంటిపాపల్లో మెరుస్తూ,
ఏకాంతాలు, ఎదురుచూపులు లెక్కకురాని లోకానికి తీసుకుపోతాయి

జవాబు లెరుగని ప్రశ్నలు

అయినా, ప్రశ్నల్లో ఎప్పుడూ ఏమీ ఉండదు. మనలో ఏముందో అది బయటికొస్తుందంతే...

1

కిటికీ అద్దానికి అతుక్కున్న తూనీగ కి
ఎగిరిపొమ్మని అరిచరిచి చెప్పాక, 
అద్దానికి ఈవలి వైపు నాలో అలజడి

దాని రెక్కల హోరు అంటే నాకు మక్కువ: ఎందుకు?
నా వీపు మీద చరిత్ర వదిలిన మూటల బరువు ని మరిపిస్తాయనా!

ఈ జడత్వం లో నా అస్తిత్వమంతా ఒక్క మూసలోకి ఇరికిస్తూ,
తరాల కుబుసాలు విడవలేక, 
ఈ ఒక్క అంతరాత్మ తో కలహిస్తూ పడి ఉన్నానెందుకు?

2

తామరాకు మీద బొట్టు బతుకు ఎందరికి తెలుసు?

అతుక్కుపోలేక, నిలవలేక, ప్రవాహం లో కలిసిపొలేక 
ఆకు మీద నర్తిస్తూ..

విశ్వం పత్రం లా పరుచుకుని ఉంది 
శయనించలేని దుర్బలతలో,
'లాలి పాట' ఎరుగని ఓ పసితనం,
యుగాల పర్యంతం నిద్రలేమి లో అలమటిస్తూనే ఉంది
మాట నేర్పిన మౌనం తో జతకడుతూనే ఉంది.

మరణాలు, సంవత్సరీకాలు

నుదుటి మీద కాల్చిన మచ్చలా,
ఎదలోని కారుచిచ్చుని
బతుకంతా మోస్తూ

మారణహోమపు భస్మం ధరిస్తూ, 
మంటగలిసిన మానవతకి
అమర్యాద చేస్తూ

మనిషిని మనిషి కాటేసిన ఉదంతాలు,
ద్వేషపు జ్వాలలు రగిలిన సంగతులు
నిత్యం జపిస్తూ

మదాంధుల పదఘట్టనలు,
పైశాచిక కామక్రీడలు
అమరచరిత్ర గా వర్ణిస్తూ 

జ్ఞప్తుల విలువ-కడుపు కదిలిన, గుండె తరుక్కుపోయిన- 
కొందరు చూస్తామంటారు
ఆ నాణెపు రెండో వైపు-కంపించని, తొణకని మదితో- 
పలువురు చూస్తూనే ఉంటారు

మరకువ మరొకసారి విర్రవీగుతుంది
అంతే! అంతే! అంతే! ముమ్మాటికీ అదంతే!

కాటిలో, కాలంలో కలిసిపోయినవారు
కథలోనో, కవితలోనో వెలికివస్తారు

ఉదయపు కాఫీ సెగల్లో 
మరొకసారి కాలి,
వెగటు నిట్టూర్పుల్లో కరిగిపోతారు..
లేదూ, ఓ సాయంత్రపు అలసటలో
తిప్పేసిన పేజీ మడతలో
ప్రకటనల పక్కన పడి ఉంటారు

మరి, పట్టిన గ్రహణం విడిచేదెన్నడు
తలారా- దిగులు తీరేలా- స్నానాలు చేసేదెప్పుడు 
వెలుగులో చీకటి కనపడ్డట్టే,
చీకటినుంచి వెలుగుకి బాట పడవచ్చు

ఒక అస్తమయపు చిరుచీకటిలో
ఓ పసితనపు చిరుదీపం
జాతిలో కాంతి నింపవచ్చు
జగతిలో శాంతి గా వెలగవచ్చు

గతపు గాధలు దాటుకుని
కొత్త పుంతలు తొక్కే
నవతరం రావొచ్చు

లోహపు లోగిళ్ళలో
మోటబావి పగుళ్ళలో రావి మొలకల్లా
వసంతం రావొచ్చు 

ఇంతే, ఇంతకన్నా ఆశావహమైన సంగతుందా!? 

మనిషితో మనిషిని కలిపే,
మంచిని జ్ఞాపకంగా మార్చని 
మనిషితనం కానవచ్చేలోకానికి 
త్రోవ దొరకవచ్చు
హృదయపు అగాధాల అంచులు అందవచ్చు!

అందుకని, ఈ ఒక్కసారికీ-
వేదనని అవతనం చేద్దామా?
శాంతి బావుటా ఎగురవేద్దామా

ఇంకొక్కసారి సాధన చేద్దామా దేహాల ఆలింగనం,
మనిషితనపు ఆనవాళ్ల అనుసంధానమై,
మమకారులమై, విప్లవకారులమై
నిశ్శబ్దం గా దగ్దమౌతూ, ధూపం లా పరిమళిస్తూ
అవిస్మరణీయమైన మరణాన్ని మౌనంగా నినదిస్తూ?

ఒంటరి గూడు

ఊరు సద్దుమణుగుతుంది, ఎప్పటిలానే

అదే నువ్వు...

మందలించినా లొంగని మొండి పిల్లల్లా- 
వీధి దీపాలు ముసుగు కప్పని చీకటి పెళ్ళలు,
కొమ్మలు, రెమ్మలు ఆపలేని ఈదురుగాలులు- 
నీ రెప్ప సారింపుకి అడ్డుపడుతూ

గుమ్మానికి కావలి కాస్తూ,
క్షణ సమూహాలని విడుదలచేస్తూ,
"ఒక్కొక్కసారి నిశివేళకి ఎందుకీ వినోదం?"
నువ్వు వెయ్యిన్నొక్కసారి వేసుకున్న ప్రశ్న

పారేసుకున్న తాళం వెదుక్కున్నట్లు
జ్ఞాపకాల్లోకి తచ్చాడుతూ,
నిలవనని మొరాయించిన మేను వాలుస్తావా:
ఇక, ఆ పక్కంతా పెనుగులాట మడతలు,
గోడల మీద నిస్సహాయ నిట్టూర్పు నీడలు

పొడి కనుల గడపలోకి రాని నిద్ర,
తొలిపొద్దు రేఖలోకి అదృశ్యమవుతుందిక

ఊర్లో సవ్వడి మొదలౌతుంది, ఎప్పటిలానే

తలుపు తీయగానే అల్లరి పిల్లల్లా-
బీరువాలు, బల్లల కిందకి కాంతిరేఖలు
గోడలు, గుమ్మాల మీద పిట్టలు-
పరుగులు తీస్తూ, నిన్ను ఏమారుస్తూ

గుమ్మానికి కావలి కాస్తూ,
క్షణ సమూహాలని విడుదలచేస్తూ,
"ఒక్కొక్కసారి కాలానికి ఎందుకీ నిదాదం?"
నువ్వు మరొకసారి వేసుకునే ప్రశ్న

ఒలకబోసుకున్న విత్తులు పోగేసుకున్నట్లు
ఆశలు కలబోసుకుంటూ, 
నిలవనని మొరాయించిన మేను వాలుస్తావా:
ఇక, ఆ పక్కంతా పెనుగులాట మడతలు,
తలగడల మీద ఆరీఆరని కన్నీటి చారలు 

తడి కనుల వాకిలి లోకి తొంగి చూడని వెలుగు
మలిపొద్దు వంపు లోకి అదృశ్యమవుతుందిక

ఏమౌతుందిక? సద్దు పొద్దుల పద్దులు రాస్తూనే,
రా/లే/ని వారికోసమో, రానున్న వారికోసమో ఏకతమాడుతూ-

అదే నువ్వు...

పరిపాటి

కిటికీ వారగా కుర్చీతో స్వగతం-

వలువలు మంచు కుప్పలుగా జారిపడి
నగ్నదివ్యత్వం లో నీలి విలాసాల నింగి

మొండి మాను కి మూగ ఉయ్యాల
కుండీలో ఊపిరిరాడనట్టు మూడ్నాలుగు కొమ్మలు

దీపపు స్తంభాలకి సాగిలపడ్డ స్ఫటికపోగులు
బిర్రబిగిసిన నేలలో కీచురాళ్ళ జుగల్‌బందీ

మేజా బల్ల మీద మడిచిన కొత్త పుస్తకం
పుట కొక అతుకుగా పాతకాగితాల ముక్కలు

అతుక్కుపోయి పుట్టిన కవలల్లా
ముక్కల అడుగున తేలుతూ కొత్త అక్షరాలు

తడి సిరా లో మిలమిల్లాడుతూ మరొక లేఖ
చేర్చాల్సిన చిరునామా దొరక్క వెర్రి నిర్వేదం 

నిదుర రాని చలిరాత్రి జాగారం:

నిశ్శేషం

చక్కని వనం పుట్టింది-
వనానికి యజమాని లేడు:
చిక్కని పూల పొదలు,
కమ్మని ఫలాల నిండుదనం.
అందరూ ఆనందం గా
పంచుకున్నారా ఫలపుష్పాలు

వైషమ్యం పుట్టింది-
పంపకాలు వచ్చాయి:
సొంతదారుకి మాత్రమే నేల,
సొత్తు ఉంటేనే సాగు.
ముక్కలైన భూమిలో
వనం ముగిసిపోయింది

చిన్న మనసు పుట్టింది-
ఆ మనసు కి అదుపు లేదు:
అబ్బరం, సంబరం
కలగలుపుగా నింపుకుంది.
అవధిలేని ఆనందాలతో
మనసూ వనమై పరిమళించింది

మనసైన వారు వచ్చారు-
మనసు విప్పి చూసారు:
భావనలు నాటారు.
పాతుకుపోయిన అనుభవాల్లో,
శాఖలై పరుచుకున్న గతంలో,
జ్ఞాపకానికొక సొంతదారు మిగిలితే
ఏమీ మిగలని మనసు ముడుచుకుపోయింది

తత్త్వమసి

ఎవరో ఒక 'నేను' తప్పక అవతారమూర్తి 
సుషుప్తిలో జన్మ రహస్యం విస్మరిస్తూ-

ముల్లోకాలనేలే దేహాన్ని విస్మరించి
స్వాప్నిక జగత్తులో విహరిస్తూ:
సంకోచ వ్యాకోచాలు
సంచలనాలు
సంవేదనలు
సాగర మధనాలు
జాగృతి అనివార్యమౌతుంది
అప్పుడిక నాలో నేను సృజన చేస్తాను ఒక్కో 'నిన్ను'
ఎదిగిపోతావు, నన్ను నిలవనీయనంతగా,
కమ్మేస్తావు

అంతం చేస్తాను
అనంతంలోకి విసిరిపడేస్తాను
దిగంతాల్లో ఎటు చూసినా
నువ్వే కనిపిస్తూ వుంటే... 
ఆ అనంతాన్నే దోసిళ్ళలో తీసుకుని
తాగెయ్యాలనే ఆరాటంలో...
శూన్యమవుతూ...
అనంతమవుతూ...
నిన్ను చేరుకుంటాను...!

తిరిగి నాలోకి మనం పయనిస్తాము

చట్రాల్లో, పరిధుల్లో, నియమాల్లో, నియంత్రణల్లో
ఇలా ఉత్పాతాలు సంభవిస్తాయి
బీభత్సాల తాకిడి నిశ్శబ్దం గా ముగుస్తుంది
స్తబ్దత తాళలేని సంఘర్షణ లో
సృష్టిలయల చక్రాలు కదులుతుంటాయి
ఈ ఘర్షణలో 
"అహం బ్రహ్మాస్మి" కి
అంకురార్పణ జరగదా!?
"అయమాత్మాబ్రహ్మ" దిశగా
అవలోకనం ఆరంభమిక...
"ప్రజ్ఞానం బ్రహ్మ" గా ఆత్మ సాక్షాత్కారం తధ్యం
వైతరిణి ముఖంగా దేహ వాహికలో
కోటి కాంతుల ప్రాణ ప్రస్థానం మొదలౌతుంది
అనిమేషుల వనాల్లో
ముకుళించని బ్రహ్మకమలం
ఉద్భవిస్తుంది

తత్త్వమసి ఎరుకలో మోక్ష సాగరాన 'నేను' తిరిగి సుషుప్తి లోకి-

01/07/2013

చిత్రం

ఒక రేయిలో సగం మోముతో పచ్చటి పలుకరింపు 
ఆవపూల గుట్ట చూసినట్లుగా అనిపించింది

మరొక రేయిలో ఇంకాస్త దాచుకుని అదే మిడిసిపాటు 
మరి కాస్త బంగారు రజను అద్దుకుని

ఎందుకో కలవరం, ఎదమాటున కలకలం
వెన్నెలతో నలుగు పెట్టుకున్నట్టుగా

ఏనాడూ జరగనిది, ఎదురుగా లేని ఎవరో 
ఇంకేవో పనులు పురమాయించినట్లుగా

పరాగ్గా, ఉదాసీనంగా నడుస్తున్న నన్ను 
ఆదమరిచి తనకే అతుక్కునేలా చేసాడు

05/01/2014

వ్యాఖ్యానం

మూసుకుంటున్న మబ్బు చేతుల్లో నాణెంలా చందమామ
బొమ్మా బొరుసుకి వేచిన ఆటగాళ్ళలా చుక్కలు
నింగి సీమలకి విరామం సరిపడదు కాబోలు

శీర్ణ తనువుల నగ్న నిర్మలత్వంతో తరులు
శిథిల సోయగాల కుబుసం విడుస్తూ ప్రకృతి 
నేలమాళిగలు తెరిచి ఆకు దుప్పట్లు పరుచుకుంటూ ఉడుతలు
నేలవాడల్లో విశ్రాంతి వేళల వింత కోలాహలాలు 

మరి నేను?

శీతగాలికి పొడిబారిన పాదాలని తాకుతూ స్నిగ్ధధూళులు
కనురెప్పల్లో, నాసికద్వారాల్లో మంచురేణువులు
శైత్యం తో శరీర కంపనలు

కుదురెరుగని మనసు,
అమూర్త సమూహాల ప్రకృతి.
మెరమెరలు, అవిరామ సమరాలు
అనామక దిగుళ్ళ కలకలాలు 

02/01/2014

కనువిందు

నదీతీరాన ఎవరివో అదృశ్య హస్తాలు
రాళ్ళ అడ్డిగలు పదిలంగా కడుగుతున్నట్లుగా

చెరువులోకి రాలిపడిన పండుటాకు
జీవితకాలపు అలసట తీరేలా స్నానిస్తూ

ఉల్లిపొరలా పలుచని మంచుతెర
తలుపు తట్టి పారిపోయిన గాలితో జతకడుతూ

ఉదయపు వెన్నెలలా పదునులేని సూర్యకిరణం
తలుపుల సందుల నుంచి మెల్లగా చేతులు జొనుపుతూ

ఆట మరిగిన ఉడుత గుంపులు-
కుచ్చుతోకల అందాలు కొమ్మకళ్ళకి ఆరబోసి,
తెంపి పోసిన ఆకులు
నేల వస్త్రానికి కుట్టిన రంగుదారపు పోగుల్లా

ఒక్కోసారి ఉదయాన్నే లేవాలనిపిస్తుంది, ఇందుకే:
నిన్నా మొన్నా కాంచని వైనాలతో
నిండుకున్న వెచ్చాలు నింపుకుని
జీవిత విస్తరిలోకి వడ్డించుకోవాలని

30/12/2013

శీతగానం

మడత విప్పి పరిచిన నూలుచీరలా మంచుతెర,
ఇంద్రధనుస్సు లో ముంచితీసిన కుంచె గీతల్లా వెలుగుధారలు... 
కంటి ముందు కదలాడే దృశ్య కావ్య పఠనం సాగుతుంటే

లాకు తీయగానే పరిగెట్టే కాలువల సవ్వడిలా రెక్కలహోరు,
ప్రకృతి నాట్యానికి నట్టువాంగం లా కొమ్మలచిటికెలు...
శ్రవణ నిఘంటువు లో శృతులు, స్మృతుల పుటలు చేర్చుతూ 

ఉదయం పాటగా మారింది, పదచిత్రాలు పాడమని ఊరిస్తుంది
పాదమై పల్లవిస్తూ, పదపదానికి నర్తిస్తూ...
పరవశాన మెరిసాను, ప్రకృతిగానమై నిలిచాను. 

28/12/2013

వల్మీకం

"నేను"న్నది ఒక కుటీరం - దాని గోడ ఒకటి కాస్త చెద పట్టి పైన కప్పు కిందన ఒక చిల్లు పడింది. ఒక పురుగు లోపలికి దిగుతుంది. అలా పురుగులు, చెదలు రావటం, చేటలోకి తీసి బయట వేయడం అలవడిన నేను ఆ పురుగు ని కాస్త నిశితం గా చూస్తుండగా మరొక ఊహ కలిగింది. "ఇలా ప్రతి సారీ శుభ్రం చేసేకన్నా ఆ గోడ ని మరామ్మత్తు చేసి కట్టుదిట్టం చేస్తే పురుగన్నది రాలేదు కదా!"

దాన్నుంచి వచ్చిన నా ఆలోచన/దర్శనం.

ఆ కుటీరం నా మస్తిష్క చైతన్య ప్రదర్శనశాల... ఆ 'నేను' నా అంతరాత్మ. ఆ గోడలు మనసు. అది బలహీనపడి తొలిచే ఆలోచనలని లోనికి రానిస్తుంది. కానీ ఆత్మ తదుపరి వివేచన తో వాటిని నిర్మాల్యం వలె ఎత్తి పారేసి శుభ్రమైన/సరళమైన జీవనాన్ని సిద్ద పరుచుకుంటుంది. నిదుర ని పోలిన స్థితికి, ఆ ఆవరణలో లలితమైన కలలకి సంసిద్దమౌతుంది. 

స్వచ్చమైన కలలు చాలు. చుట్టూ పురుగులు మెసిలే పుట్టలో రమణీయమైన రామాయణాన్ని కలగన లేదూ వాల్మీకి! ప్రపంచం లోపల వుంటుంది, బయట కాదు. మస్తిష్కమే వల్మీకం. వైవిధ్యభరిత యోచనలే సర్పాలు, పురుగులు. అంతరాళలో నిరంతర ఉద్భవమే సౌందర్యభరిత జీవన గ్రంథం. ఎవరి విశ్వం వారి వారి అంతఃకరణల లోనే వుంటుంది; అదే జీవితపు విశ్వరూపం. దాన్ని సాక్షాత్కారమే ఈ ప్రదర్శనలకి మూలం!

* వల్మీకం=పుట్ట

10/27/2013

గుర్తుంచుకోవాలి

చేతివేళ్ల ఖాళీల్లో
మునుపెపుడో ఒదిగిన మెత్తని స్పర్శ
జ్ఞాపకమై పలకరిస్తుంది-

చెరువు గట్టున తొలిచిన గుంటల్లో
చేతికందక ఈదులాడిన చేపపిల్లదా
ఊరే నీటిలో కరిగిపోయిన ఒండ్రు మట్టి దా

వేప పళ్ళలో దూర్చిన గుఫ్ఫిళ్లలో
బుల్లి ముక్కు దూర్చిన కోడి పిల్లదా
దొంగలా జారిపోయిన గాజు పురుగు దా

మూసిన కళ్ళ లోగిళ్ళలో
వెనుకటి నడకల అడుగుల గురుతులు
బాల్యపు లోకానికి ఆనవాళ్ళు చెప్తున్నాయి-

అదలింపులకి ఆగని జట్టు పందాలు
బుల్లి తువ్వాయి వెనుక పరుగులవా
తాయిలాలు దోచుకున్న ఆకతాయితనానివా

బెదురు చూపుల బిత్తరితనాలు
బడి తలుపు దగ్గర ఆగిపోయిన నాన్న ని చూసా
తిరనాళ్ళలో తాత తప్పిపోయాడని ఏడ్చినప్పటివా

అరచేతులు చల్లగా తగులుతున్నాయి
వెచ్చని కన్నీటి కాపడం పెట్టాలి
కళ్ళు మసకబారుతున్నాయి
ఆనవాళ్ళు చెదరకుండా లోతుగా చెక్కుకోవాలి

01/04/2014

సరేనా?

గుప్పిళ్ళు విప్పని వృక్షమొకటి
వేళ్ళు కూడదీసుకుని లేచి నుంచుంది 
పసిరాకులకి పురిటి వాసన పోలేదు
ఆశ చివురించే కాలం కాబోలు!

అడుగులో అడుగేస్తూ నది పరుగులు నేర్చింది
నడకరాని పడవ కి ఈత నేర్పుతుంది
నురగ ఊసులు మోస్తూ నత్తలొస్తున్నాయి
ఊహకి అందని చిత్రం ఏది?

ఇవాళ నిద్రలో ఏమి చేస్తానో డైరీలో రాసుకున్నాను 
నత్తలా బాల్యపు కాండానికి బలం గా అతుక్కుపోతాను
పరాగ్గా పోయే నిన్నూ పక్కకి లాగి వాటేసుకుంటా..
గుప్పిళ్ళు విప్పుకుని ఒట్టు పెట్టుకుందాము,ఏదో ఒకటి-
పసితనపు రేఖలు తోవ చూపితే కలలలోకానికి దారితీద్దాము

12/29/2013

శోభ

పొగమంచు చాందినీ కప్పిన భూమి: ఒకే పందిరిగా

ఈదురుగాలి వాద్యాల వింతైన మేళాలు,
నీటిగాజు పూసలతోరణాలు, మట్టిపెళ్ళల గజ్జెలమోతలు. 
ఉదయకాంతులు, వెన్నెల ఛాయలూ
కలిపి కట్టిన మాలలు.

నైసర్గిక స్వరూపాలలో అతిథి రాకకి సన్నాహాలు. 
నదీ దర్పణాలలోఅదృశ్య రూపుల అలంకారాలు.

ఋతువంతా వేడుకగా ఎవరది?

12/26/2013

సెగ

ఎండలో సాగుతున్న నీడలు,
అక్కడక్కడా ఎగురుతున్న రెక్కలు

ఉదయం గుంభనగా కూర్చుని ఉంది,
రాత్రి వదిలివెళ్ళిన కదలికలు ఎరుగనట్లే

గడ్డిబయళ్ళు, చెట్టుమోళ్ళు సెలవు దినాల్ని
బద్ధకం గా గడుపుతూ,
మట్టిపెళ్ళలు, పిట్టగూళ్ళు మంచు పొరల్ని
నెమ్మదిగా కరిగిస్తూ...

సాయంత్రం ఉదారంగా ఉంటుంది
రాత్రి చొచ్చుకుని వస్తుంటే ఒద్దిగ్గా సర్దుకుపోతూ 

చలిలో వణుకుతున్న దేహంలో
లోలోపలికి ముడుచుకునే వ్యధలో
మళ్ళీ ఎదురుచూపు వేకువ కలకి, వేకువలకి.

దర్శిని

నివురుని, 
గతాన్ని చుట్టబెడుతున్న విస్మృతి ని
తాకాలంటే వెరపు
కంటికానని నిప్పుకణిక
చిటపటగా చీకాకు పడుతుంటే

నీహారికలో,
సమయ సందర్భ మెరుగని స్వప్నంలో
విహరించాలని ఊపు
కంటికెదురుగా విశ్వద్వీపాల్లో
చిద్విలాసంగా సాగుతుంటే

కంటి కటకం మీద వక్రీభవనాలు
చిత్రమైన చలనాలుగా,
ఎందుకంటే చెప్పనలవి కాని ఊసులుగా,
విస్మరించలేని విషయాలుగా,
ఉంటుంటాయి రవ్వంత అలికిడి గా