వింటానంటే, ఎన్నెన్నో!

నిరంతరం అలల హస్తాలతో ఒడ్డులు శుద్ధి చేసుకునే సంద్రాన్ని చూసావా?
పారేసుకున్న జ్ఞాపకాలు, పరిగెత్తిపోయిన పాదముద్రలు,
పాడుబెట్టిన ఇసుకగూళ్ళు, పున్నమి జార్చుకున్న వెన్నెలలు 
నిమ్మళం గా తనలోకి పొదుపుకుంటూ

అనవరతం కదలికల్లో జాడ తెలుపుకునే గాలిని చూసావా?
పదిలం గా దిద్దిన ముగ్గుల్లో చిలిపి చిందులు వేస్తూ, 
బిడియపు మడతల్లో చొరవ గా చక్కలిగింతలు పెడుతూ,
చెదరగొట్టినా తిరిగి తిరిగి చుట్టుకుంటూ

ఆకు పచ్చలు మారవు, పూల ఘుమఘుమలు పెరగవు
తేనియల మధురిమలు, తేటనవ్వులు ముగియవు 

ఇలాగే వస్తుంటాయి వాస్తవ చిత్రాలు కనులెదురుగా 

ఇంకా! అవును ఇంకా ఏదో కావాలి, ఏమిటంటే--

తెలిసినదేదో తిరిగి తెలియాలి
తెలియని మగతలో ముంచాలి
తెరుచుకోని తలుపు మీద తట్టాలి
దగ్గరగా వినవచ్చే అడుగుల ధ్వని వినాలి 
'నేను ఎవరిని?' అంటూ నివ్వెరపరచాలి
పరిచితమైన పలకరింపులో పరిమళించాలి

ఎలాగో వస్తాయి చిత్రమైన కలలు మూతపడని కనులలోకి

ఇంకా? అవునో కాదో ఏదో జరగాలి, ఎందుకంటే--

మనసుకి మనసుకి నడుమ పీచుమిఠాయి లా పలుచని తెరలుంటాయి
'మమతలు' అని పిలుద్దామా?
తీయని రుచులు తెలిసేంతలో గట్టిపడతాయి
అపుడిక ఆ మమతల వెంట చీమల దండులా ఆశలు
అవధి లేని అదుపు లేని సీమలోకి పరుగిడుతూ మనం

అలాగే వస్తాయి ఊహాతీత ఊసులు కుదురుపడని మది కి

ఇంకా!? చెప్పు మరి- ఇంకేవిటి మిగులుందో!

No comments:

Post a Comment