తరుచుగా

దేహమే శిలువగా మోసుకుంటూ, లేదా
దేహపు గదిలో బందీ అయిన ఆత్మగా
విశ్వపు ఒడికై ఆర్తి చెందుతూ
విడుదల కొరకై వేచి ఉంటాను

గోడల్ని ఒరుసుకు మొలిచిన రావిఆకులు 
కదులుతాయి, కంటి చూపుని కదుపుతాయి 
నీటిలో పడ్డ కిరణాల పరావర్తనమో, వక్రీభవనమో
మెరుపు నీడలై కనులెదుట నిలుస్తాయి
వార్తాహరులు వచ్చిపోతున్నట్లే ఉంటుంది

కమ్ముకుని కట్టిపడేసిన భయపు కౌగిలి లో 
ఊపిరి అందని ఉక్కిరిబిక్కిరి లో
దిగంతపు దిశ గా, ఏవేవో ఆనవాళ్ళ వెంట 
చివరి మజిలీ కి తరలిపోతుంటాను

గాలి ఊయలులు సేద తీరుస్తాయి
కెరటాల వీవెనలు కుదుటపరుస్తాయి
ప్రకృతిలో మనుషులు, మనుషుల్లో ప్రకృతి
పలుకరిస్తాయి, గృహానికి చేరిన భావన ఇస్తాయి
ఇవన్నీ నిండిన లోకపు వాకిలి లో నిలిచి, 

కృతజ్ఞతల తోరణాలు కట్టిపోతాను

1 comment:

  1. మీ మది (గది) నిండా అనేకానేక కవితా వనర్లు...
    వేటికవే వేరు వేరు ప్రత్యేకమైన జానర్లు...
    ఇలా కురిశాక మీపై నా ప్రశంశా పన్నీర్లు...
    తెలియదా మీరు చెబుతారని తప్పక నెనర్లు...

    మేడం నెనర్లు...
    కేవలం ఫన్నీర్లు(funny ర్లు)...
    (జస్ట్ కిడ్దింగ్)...

    తెలిసిన (తేట) తెలుగు, ఆరణాలు...
    పరికించండి కృతజ్ఞతల తోరణాలు...
    'తరచుగా' అలంకరించుతున్నందుకు అక్షరాలకు ఆభరణాలు...
    ఇంతకన్నా ఏమీ ఇవ్వలేను భరణాలు...

    (గది : భాండాగారం అన్నారుగా మునుపు)

    ReplyDelete