ఒక వీడ్కోలు లో

రైలు తప్పదన్నట్టుగా కసిరి కూత విసిరింది,
వాన చినుకుల బరువుకి ఒళ్ళు కదలనందేమో!
గాలిహోరుని చీల్చుతూ చక్రాలు,
చెరుకు తోటలో పిల్లల పరుగుల్ని జ్ఞప్తికి తెస్తూ.

చిననాటి ఊసొకటి నవ్వుని వెంటేసుకువచ్చింది-
అమ్మమ్మ వూరిలో ఆగని రైలుబండికి
అమ్మ ఎర్రచీర చూపి ఆపుదామన్న ఆన్నయ్య మాట,
ఎప్పటికీ మరవలేని మాగాయి ఊట.

అదేమిటో మనసిక్కడ ఆగదే, ఏళ్ళ వెనక్కి పరుగిడుతూ?
పట్టాల దాపున పొంచిన ఆకతాయితనం,
రైలెళ్లిపోయాక పిన్నీసుల వెదుకలాటలో రణం,
ఎన్నిపదులు ముగిసినా మరుగున పడని జ్ఞాపకం. 

బోసినోటి నారాయణ తాత పాడే పదాల్లా
గణ గణా గానాలు చేసిన గంటలిక ఉండవట.
మా ఊర్లో ఇక అనౌన్సర్ శషభిషలు వినక తప్పదట
రద్దీలో, ఎక్కిదిగే తిప్పల్లో ఇదొకటా గోల!

"చుక్ చుక్ రైలు" వెళ్ళిపోయింది-
చురుకైన యంత్రాలు కట్టి కొత్త రైలొచ్చింది,
దాని కూత మాత్రం పాత గాయాన్ని కెలుకుతుంది.
తెలవారకనే వచ్చే రైలేదైనా "దెయ్యాల బండి" ఆనాడు,
పొద్దుగూకులూ పరుగుల్లో మనమే దెయ్యాలమిప్పుడు.

కిటికీకి కట్టేసిన నా కళ్ళలో వానతడి వేడిగా ఉంది
కదిలిన రైలుతో కదిపిన తన పాదాలు జారతాయేమో?
పక్కవారి పలకరింపుతో తప్పని ముక్తసరి.
గండి పడిన ఏరులా తన ఒడిలోకి దూకాలనుంది,
నా స్వగతాలు వినని రైలు కదిలిపోయింది...
దూరాలు రగిల్చే తలపుల్ని మోస్తూ నేనూ వెళ్ళిపోయాను.
అగరు వాసనలు మోసే గాలిలా తను మాత్రం మిగల్లేదూ?

(ప్రతి ప్రయాణం లో ఆత్మీయుల ఎదుర్కోలు ఆహ్లాదమే, కానీ ఎవరో ఒక ఆప్తుల వీడ్కోలు మాత్రం మరణయాతన/మరవలేని ఖేదమూను)

4 comments:

 1. ...తెలవారకనే వచ్చే రైలేదైనా "దెయ్యాల బండి" ఆనాడు,
  పొద్దుగూకులూ పరుగుల్లో మనమే దెయ్యాల మండీ ఈనాడు,
  (క్షమించండి...సరదాకు) ...

  ...దూరాలు రగిల్చే తలపుల్ని మోస్తూ నేనూ వెళ్ళిపోయాను.
  అగరు వాసనలు మోసే గాలిలా తను మాత్రం మిగల్లేదూ? ...

  ఎందుకండీ మా గుండెలు కూడా
  సెలవు దినం గుర్తుచేసి ఇంత బరువెక్కిస్తారు?
  బాల్యంతో మొదలెట్టి యెనలేని బాధతో ముగిస్తారు?

  ReplyDelete
  Replies
  1. కవులు ఏ భావంతో రచించారో అదే భావంతో, ఆ హృదయానికి దగ్గరగా వెళ్ళి అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారే నిజమైన రసాస్వాదన చేయగల సహృదయులు. నెనర్లు nmraobandi గారు- నా మస్తిష్క చైతన్యం కలం జార్చుకునే ఎన్నో పదబంధాలలో ఇదొకటే అయినా మీ హృదయ తంత్రులకి తెలిసిన లయ కనుక అంతగా కదిలారనిపిస్తుంది!

   Delete

 2. ... అగరు వాసనలు మోసే గాలిలా తను మాత్రం మిగల్లేదూ? ...

  ఒక వాక్యంతో ఒక మనిషి ఎదలో
  ఎంతటి అలజడి కలిగించ వచ్చో
  ఇది చదివాక తెలిసింది...
  మనసొక అవ్యక్త...
  లోతైన బాధలో మునిగిపోయింది...
  (వ్యక్తిగతంగా నాకీ సందర్భం
  ఇప్పటికి అనుభవం కానిదైనప్పటికీ)

  రియల్లీ disturbed ...

  ReplyDelete
  Replies
  1. nmraobandi గారు, స్పందనకి అన్నీ అనుభూతమైన భావనలే కానక్కరలేదుగా? In a way I am glad to have you disturbed...the write-up stood its own challenge of making the reader see the soul in it!

   Delete