జాబు

మరేం లేదు, నిన్న ఉత్తరం లో 
నిట్టూర్పు తో  నీకున్న చింతలేవో తెలిపావు,
స్పర్శ గ్రాహకం కా/లే/ని 
- మేఘావృత ఆకాశమో,  ప్రభంజనమో-
ప్రత్యక్ష విషయాలను గూర్చి రవ్వంత విచారం తో.

నా చీ/కా/కులని కాస్త తేలిగ్గా నిశ్వసిస్తూ,
ఈ జవాబు రాస్తున్నానోయ్, స్నేహితుడా!
అహ్: ఇప్పటికి ఆశలు ఇవి - రేపో మాపో
కలతలు గా,  నలతలు గా మారనూ మారొచ్చు-

ద్రాక్ష సారాయిలో ఈదాలని ఉంటుంది,
స్వేదాన్నీ, కన్నీటినీ కల్తీ చేస్తూ.
తెల్లని వస్త్రానికి కాటుక మరకతో
చిరిగినా చెరగని అద్దకం వెయ్యాలని కూడా!

అసలు సంగతి ఏమిటంటే నీది అమాయకత్వం
నీ కళ్ళలో గూడుకట్టిన మేఘాలు గమనించవు
నీ హృదయం లో చెలరేగే ప్రచండమైన వేదనలో
చిగురుటాకులా వణికే దేహాన్నీ పట్టించుకోవు

మరి నా విషయం చెప్పాలంటే అసంబద్ధం  
విషాదాన్ని కడగగలనా? 
దశమ రసం కనిపెట్టగలనా?
అస్పష్టమైన సంగతి విశదీకరిస్తే మాత్రం
తెలుపు నుంచి నలుపు విడదీయగలనా?

No comments:

Post a Comment