అనగా అనగా "చెయ్యి" అనే ఆమెకు ఐదుగురు కొడుకులు - అయితే?

అయితే - వాళ్ళే ఐదు వేళ్ళూను - అనేస్తే చాలదు. వేళ్ళ పాటలు (వేళ్ళ లెక్కలు కాదు, వేలం పాటలూ కాదు) పాడిస్తూ, అయిదువేళ్ళు ఐకమత్యానికి చిహ్నంగానో, లేదూ ఐదు వేళ్ళూ ఒక్కలా ఉండవనో, పంచ పాండువులనో ఇలా అమ్మమ్మ, తాతయ్యలు, మామ్మలు, నాన్నమ్మలు చెప్తుంటే పెరిగినవారం చాలామందిమే ఉన్నామని నా అంచనా. ;) ఆ పంధా లోనే, నిజానికి, ఎక్కువ ప్రాచుర్యం లో ఉన్న పాటల సేకరణ చేస్తూ ఇంకాసిని ఎవరైనా ఇవ్వకపోతారాని ఈ పోస్ట్. ఆపై మా బడి పిల్లల కేరింతలు మీకు చక్కలిగింతలు పెడతాయని హామీ!


1. మా మామ్మ నాకు పాడి ఆడించిన/నేర్పిన కిత కితల పాట ఇది.

ఆకేసి (నా అరచేయి చాపించి తన వేళ్ళతో పాముతూ)
అన్నం పెట్టి (నా బొటనవేలు మడుస్తూ)
పప్పేసి (చూపుడు వేలు మడుస్తూ)
చారేసి (మధ్య వేలు మడుస్తూ)
నెయ్యేసి (ఉంగరం వేలు మడుస్తూ)
బెబ్బేసి (చిటికెన వేలు మడుస్తూ) * బెబ్బిఅంటే పెరుగు :)
ఆం ఆం అంటూ తినేసి (మూసిన ఆ గుప్పిటని మూతి వరకు తీసుకెళ్ళి)
సంతకు పోయే దారేది? (తిరిగి నా అరచేయి తెరిచి, తన వేళ్ళు భుజం వరకు పాకిస్తూ, చక్కిలి గింతలు పెడుతూ, నా కిల కిలలతో మురుస్తూ తానూ నవ్వేసేది)


2. మా మరొక మామ్మ గారి ఆ/పాట. పంక్తికొక వేలు ముడుస్తూ పాడేవారు.

తిందాం తిందాం అందంట (బొ.వే)
ఎట్లా తిందాం అందంట (చూ.వే)
అప్పుతెచ్చి తిందాం అందంట (మ.వే)
అప్పెలా తీరుద్దాం అందంట (ఉం.వే)
ఎగ్గొట్టిపారిపోదాం అందంట (చి.వే)
ఎలా పారిపోయారంటే ఇలా (కిత కితలు)

వెరసి కిలా కిలా నవ్వులు.


3. బాల పిల్లల బొమ్మల పత్రిక (1947 నవంబర్) సంచిక నుంచి సంగ్రహించినది. ఇందులో అనగా అనగా చెయ్యి అనే ఆమెకు ఐదుగురు కొడుకులు. వాళ్ళే ఐదు వేళ్ళు. బొటనవేలు పెద్దన్నయ్య అన్నమాట, చిటికెన వేలు బుల్లి తమ్ముడూను. వాళ్ళ పాట ఇది

తిందాం, తిందాం, తిందాం (చి.వే)
ఏమిటి తిందాం? ఏమిటి తిందాం? ఏమిటి తిందాం? (ఉం.వే)
అప్పచ్చులు తిందాం? అప్పచ్చులు తిందాం? అప్పచ్చులు తిందాం? (మా.వే)
అప్పచ్చు లెలావొస్తాయి? ఎలా వస్తాయి? ఎలా వస్తాయి? (చూ.వే)
నేనే తెస్తాను! నేనే తెస్తాను! నేనే తెస్తాను! (బొ.వే)


4. అమృతవీణ బ్లాగు లో దొరికినది

ఇల్లలికి ముగ్గేసి
ఆకేసి పీటేసి
పప్పెట్టి బువ్వెట్టి
పాలోసి పెరుగోసి
అత్తారింటికి తోవేదంటే
కిత కిత కిత కిత కిల కిల కిల కిల


5. తెలుగుదనం.కో.ఇన్. వారి సైట్ లోనిదిది.

ఆకేసి ఉప్పేసి
పప్పేసి అన్నం పెట్టి
చారేసి నెయ్యివోసి

అమ్మకొక ముద్ద
చెల్లికొక ముద్ద
అక్కకొక ముద్ద
అవ్వకొక ముద్ద
తాతకొక ముద్ద

అందరికి పెట్టి
నువ్వు తిని
నేనూ తిని

ఆకెత్తేసి ఆకేసి వక్కేసి
సంతకు పోయే దారేది
అత్తారింటికి దారేది??


ఇక, మీ మీ పాటలు రచించో, రాగాలు కట్టో పెట్టేయండిక.

6. రసజ్ఞ గారు ఇచ్చినది:
ఇల్లలికి ముగ్గేసి
ఆకేసి పీటేసి
పప్పేసి కూరేసి
ఆమేసి (ఆం అంటే అన్నం) నెయ్యేసి
ముద్ద చేసి తినిపించి
తినిపించి మూతి తుడిచి
అత్తారింటికి దారేదంటే....
గోళ్ళపాలెం నుంచి వేళ్ళపాలెం
వేళ్ళపాలెం నుంచి అరచేతి పాలెం
అరచేతి పాలెం నుంచి ముంజేతి పాలెం
ముంజేతిపాలెం నుంచి మోచేతి పాలెం
మోచేతి పాలెం నుంచి చంకల పాలెం

7. జయ గారు ఇచ్చినది:

ఇల్లు అలికి-ముగ్గువేసి
పీటా వేసి - ఆకు వేసి
పప్పు వేసి - పాయసం వేసి
అన్నం పెట్టి - అప్పచ్చీ పెట్టి
పాలు వేసి - పెరుగు వేసి
కూరా వేసి - చారు పోసి
నెయ్యి వేసి - ముద్దా చేసి
నోట్లో పెట్టి - తినిపించి
చేయి కడిగి - మూతి తుడచి
తాత గారింటికి - దారేదండి?
ఇట్లా పోయి - అట్లా పోయి
మోచేతి పాలెం - ముందుకు పోయి
ఇదుగో వచ్చాం - అదుగో వచ్చాం
చెయ్యి ఎత్తి - చంకలో పెట్టి
వేలు పెట్టి - చక్కిలి గిలిగిలి
చక్కిలి గిలిగిలి - చక్కిలి గిలిగిలి....

అని పాట ఒక్కొక్క లైనుకి ఒక్కో వేలు మూసి తీస్తూ, అరచేయినుంచి మోచేతిమీదుగా చంకలో దాకా వెళ్ళి చేతి వేళ్ళతో చక్కిలిగిలి పెట్టాలి. పిల్లలు విషయం తెలుసుకోటమే గాక అనుభవిస్తారు కూడాను :)