ఏడాది గడిచిపోయాక, ఎదుగుదల కనపడుతున్నాక..

మరిక ఈ బ్లాగులో ఇది చివరి టపా. ఇక్కడ వ్యాఖ్యలతో, వ్యక్తిగత ఈ-మెయిల్స్ ద్వారాగా ప్రోత్సాహించిన అందరికీ ధన్యవాదాలు - ఉషారాణి.

ఉగాది తో నా తెలుగు బడి మొదటి ఏడాది పూర్తి చేసుకుంది. నిజానికి ఈ బ్లాగు ఒక ఏడాది పాటు మా బడి ఎదుగుదల తెలిపే పట్టిక గా రాసినది. దీన్నుంచి useful and compelling content అన్న ప్రాతిపదిక ఆధారంగా చెప్పింది ఏమీ లేదు. కాకపోతే, తగు సలహాలు, సూచనలు అందటానికి నాకు ఉపయోగపడింది. పిల్లలలో క్రమేణా శ్రద్ద, ఆసక్తి పెరిగాయి. క్రొత్తవారు చేరారు. "నేను బీహార్ లో పెరిగాను, నాకు సరీగ్గా తెలుగు రాదు, కానీ మా పాపకి నేర్పించాలని ఉంది, పంపనా?" అని ఒక తల్లి, భారతదేశానికి తిరిగి వెళ్ళిపోతున్న ఇద్దరు పిల్లలూ "నాకు ఇంకా ఈ బడికి రావాలనుంది" అనటమే నాకు గురుదక్షిణ. అలాగే పాతికేళ్ల యువకుడొకరు ఈ చిన్నారులతో పాటుగా కూర్చుని పాఠాలు నేర్వటం ఒక సరదా. నేను కూడా మరింత ఇష్టంగా వాళ్ళు నేర్చుకునే పద్దతులు అన్వేషిస్తూ, నాకూ ఇదొక అధ్యయనంగా ఉపయోగించుకున్నాను. జాలంలోని ఎన్నో విషయాలు నేను చదివి, వారికి విశదీకరిస్తున్నాను.

ప్రస్తుతం:
- వేమన, సుమతీ శతకాలు వల్లె వేయటం మొదలు పెట్టాము.
- గుణింతాలు, సంయుక్త అక్షరాలు గుర్తుగా/అచ్చుతప్పులు లేకుండా వ్రాస్తున్నారు.
- పుస్తకాలు చదవగలుగుతున్నారు. పండుగలు, వేడుకలు - ఎందుకు చేస్తాము? ఎలా జరుపుతాము? వంటి వివరాలు, మన సంస్కృతి, కట్టుబొట్టు, భాష, ఆహారం, సాంప్రదాయాలు
- కుటుంబ వాతావరణంలోని విషయాలు, చుట్టరికాలు - ఇలా వారికి తెలియాల్సినవి అని నేను నమ్మినవి నేర్చుకుంటున్నారు/తెలుసుకుంటున్నారు.

ప్రతి వారం ఒక ఇంటరాక్టివ్ సామూహిక సాధన - చిట్టిపొట్టి కథలు (మన సామెతలు, పంచతంత్ర, కొంగ-నక్క, కాకి-పిచ్చుక వగైరా); పాటలు (లెక్కలేనన్ని, వీలైనంత అభినయం/నృత్యం కలిపి); నాటకాలు (ఇవి అప్పటికప్పుడు అంశం తీసుకుని వారితోనే సంభాషణలు రాబట్టటం);ఆటలు (వైకుంఠపాళీ/అష్టాచెమ్మా/వామనగుంటలు/..)

నాకు తోచిన మార్పులు, చేర్పుల వలన వారిలో బిడియం తగ్గి, నేనంటే నేనని ఉత్సాహంగా పాల్గొనగలుగుతున్నారు. ఈ ఏడాది మొదట్నుండీ "Student Of The Month" బహుమతులు ఐదారు ఏళ్ళలోపు చిన్నారులే గెలుచుకున్నారు.

ఉదాహరణలు:

పిల్లలకి కూరగాయల పేర్లు పెట్టి, వాళ్ళకి నచ్చే కూర పేరు చెప్పించటం [బెండకాయ - నాకు బెండకాయ వేపుడు ఇష్టం/ వంకాయ - వంకాయ మసాల మా అక్కకి ఇష్టం/ కాకర - మేము తినము], లేదా మేము చెప్పిన రెండు కూరగాయలు చేతులు కలపటం [పాలకూర, టొమాటో; సొరకాయ,ములక్కాయ]. ఇదే ఆట దినుసులు/పప్పుధాన్యాలు తో పొడిగింపు.

అంకెలు ఇచ్చి ఒక్కొక్క అంకెకి వాళ్ళ అవగాహనకి తగిన విశేషణం, వివరాలిస్తూ చర్చలు - రెండు/జత (పౌర్ణమి-అమావాశ్య; రాత్రి-పగలు), మూడు (త్రిమూర్తులు), నాలుగు దిక్కులు, ఐదు (పంచేంద్రియాలు, పంచపాండవులు),..... తొమ్మిది (నవ గ్రహాలు)

రూపు ఇచ్చి వస్తువులు కనుక్కోవటం, బొమ్మలు గీయటం, రంగులు అద్దటం - గుండ్రం - బఠాణి, బంతి, గోళీ...

ఒక పాట వినిపించి/సన్నివేశం చూపించి - అవి పలకల మీద వ్రాయటం/అందులోని వ్యక్తుల సంబంధాలు, సంబాషణలు దేని గురించి అన్న ప్రశ్నోత్తరాలు.

ఈ ఏడాదికి సరిపడా నాకు అంశాలు సిద్దంగా ఉన్నాయి. వాళ్ళతో పాటుగా నేనూ ఇంకా నేర్చుకోగలవి చాలా ఉన్నాయి. ఇలా ఆ బడిని నిరాటంకంగా కొనసాగించగలననే నమ్మకం.


నాకు ఈ సంకల్పం కలగటానికి ఆధ్యాపకవృత్తి పట్ల గల గౌరవం, ఇష్టం కారణమైతే, మీ పిల్లలతో పాటుగా మా వాళ్ళకీ చెప్పండి అన్న తల్లిదండ్రుల అభిమానం మరో కారణం. ఈ ద్వారాగా వస్తున్న ఆదాయం విద్యార్థులకీ, ఆధ్యాపకులకి శిక్షణ ఇప్పించటానికి http://janyaa.org/projects.php వినియోగపడటం అందరికీ ముదావహం.

సెలవిక.