నిత్యం..

తడి చుంబనాలతో
నేలని ఆవరించుకున్న
ఆకాశపు ఉనికి,
కమ్ముకునే ఉంది ఇంకా
వాన పెదవులు విచ్చుకుని...

పొడి ముద్దులతో
ధూమ్ర వర్ణపు మేఘాన్ని తోసుకుంటూ
పుడమి,
ఎండ పొడతో పొగమంచు దేహంలో దాగి
నింగి కౌగిట చేరుతూ..అనునిత్యం!!!

ఊరట

సముదాయింపు
సముద్రపు అలలా
తీరాన ఆగక వెనుకకు పరుగులు తీస్తుంటే-


వేదనలో నానిన మనస్సు
సారం పెట్టిన భూమిలా తోస్తుంటే
స్థిరంగా తెలుస్తుంది..
విషాదం వెదుక్కునేది
సాంత్వన కాదని.


ఫలించిన దుఃఖ్ఖం విచ్చి
ప్రశాంత విత్తులుగా రాలుతుంటే
తెరిపిన పడుతుంది..
మొలకెత్తే భావోద్వేగం
శోకం వెలిసాక.


ఓ ఘటన అనంతరం-
నడి కడలి నీటి వంటి మనస్సు
నిదానిస్తుంది..నిరంతరం...!

శరదృతువు


గాలి కడలి మీద అలల్లా
రాలిపడే రంగుటాకులు
ఆకుకొసనో, కొమ్మ మూలనో
మొగ్గతొడుగుతూ
చినుకు ముత్యాలు


వాన కాలువ మీద పడవల్లా
తేలియాడే పూరేకులు
మొండిపూలలో, నీడగీతలలో
లెక్క తేలని
ఎండ సమయాలు

శిశిరానికి తరలిపోయే తరుణాన
కలలు, ఊహలు... !!!