తోటపనితో నాలో నేను-2

ప్రముఖ కవి శ్రీ నాయని సుబ్బారావు "జన్మభూమి" కావ్యంలో నవ్వుల శోభ వర్ణన;
నాయిక హాసం 'పూత కొత్తిమిర చేను' లాగానూ
నాయకుడు పగలబడి నవ్వటం పండిన బూరుగు కాయలు పెటిల్లు పెటిల్లుమని పేలినట్లు గానూ ఉన్నదట
("మా నాన్నగారు" పుస్తకం నుంచి ఆయన కుమార్తె నాయని కృష్ణకుమారి మాటల్లో)*****
ఎక్కడకి వెళ్లి మొదలు పెట్టాలీ గతానుభూతుల కదంబంలో ముక్కలు త్రుంచి, పరిమళం పీల్చుకోమని ఇక్కడి కొన్ని పచ్చదనపుప్రియ మనస్సు కొమ్మలకి (రాత్రి కట్టిన పూలమాల కొంచం తెల్లారి తలలో తురమటానికి పదిలం చేసినట్లుగా) తగిలించటానికి!?

పూర్తిచేసిన పాలకప్పు అమ్మ చేతికి ఇచ్చి, నాన్నగారి చెయ్యి పట్టుకునో, వెనకమాల అడుగేస్తూ (వెక్కిరిస్తూ, అంటే ఆ రోజు తోటపని చెయ్యటం ఇష్టం లేదన్నమాట) పెరటి తోట వైపు వెళ్తుంటే సీతమామ్మ (నానమ్మ) ఓ వెదురుసజ్జెలో మందారాలు, పారిజాతాలు పేర్చుకుని ఇంట్లోకి వస్తుంటుంది..లేదా, మా వెనుగ్గా ఓ 2-3 గుప్పిళ్ళ ధనియాలు తెస్తూ వస్తారు. తన చేతిలో చివరి గింజలు ఓ చెంచాడు సుమారు నా *నోటికి*; తతిమావి నేలలోకి వెళ్ళటానికి... (*) ఆ మాత్రం లంచం లేనిదే మనం ఎందుకు మాట వింటాము, నిండా పదేళ్ళు లేని వయస్సులో!?
చిన్న మడి కడతారు నాన్నగారు, ఆకుకూరల పక్కగా కొత్తిమీర విత్తటానికి, కాస్త తడిగా గుల్ల చేసిన నేల సిద్దం చేస్తుండగా.. నా హవాయి చెప్పు ఒకటి కడిగి, వరండా గచ్చు మీద ఆ ధనియాలు పోసి చేతికి తొడిగిన చెప్పుతో గట్టిగా నొక్కి బద్దలు చేస్తా నేను. బబుల్ గం కన్నా మేలైన ఆ గింజల సారం పీల్చుతూ, పరపరా నవులుతూ మామ్మ, నేను మడి వైపు దారితీస్తాము. ఒక అంగుళం కన్నా లోతుకి వెళ్ళకుండా విత్తనాలు జల్లి, ముగ్గురం చెరొక పురిషెడు నీళ్ళు చిలకరించి, ఆ పక్కనే సిద్దమైన మడి నుంచి నాలుగు మొక్కలు తీసుకుని (చారులో పోపుకి) ఇంట్లోకి వస్తాము. నేను కాన్వర్స్ షూస్ తో కాన్వెంట్ కి, నాన్నగారి జీప్ తనని తీసుకుని ఆఫీస్ కి కదిలేప్పుడు, “ఎంచక్కా నువ్వు మీ నాన్న లా చదువుకుని జీప్ లో తిరగాలి,” అని సీతమ్మామ్మ దీవిస్తుంది. అమ్మ నవ్వుతూ కొత్తిమీర పూలు ఉంటె గిల్లినవి నా చేత పోసి, రెమ్మలు కాస్త శుభ్రం చేసుకుని వంటగది వైపు వెళ్తారు. ఆ పూల ఘుమఘుమ పీల్చుకుంటూ, వంటగదిలో ఇంకేమైనా రుచుల జాడ ఉందేమోనని ముక్కులు ఎగపీల్చుతూ అన్నయ్య తన బడికి తను సాగుతాడు.
-2-
ఎంత ప్రయత్నించినా ఇండియన్ స్టోర్ లో ధనియాలు మొలకెత్తలేదు. అమెరికన్ గ్రోసర్స్ దగ్గర “సిలాన్త్రో” గా కొత్తిమీర కట్ట ఉంటుంది, లేదా పొడి దొరుకుతుంది. ఒక మెక్సికన్ కొట్టులో దొరికిన ధనియాల పొట్లం నుంచి చేసిన ప్రయత్నంతో లెక్కకి పది మొలకలు వచ్చాయి. డెక్ మీద తిరుగుతూ ఆ ఫోటో తీస్తుంటే, నిద్ర లేచి వచ్చి “అమ్మా! ఇది “ధనియా పత్తా” కదా? I know Hindi,” అంటూ నా చిన్నారి కూతురు బడాయి పోతూ ఉంది!!!

1 comment:

  1. కొత్తిమీర మొలకెత్తాలంటే ధనియాలు చెప్పుతో నలపాలంటారు కదండీ? దాన్నుంచే "ధనియాల జాతి" అనే తిట్టు కూడా పుట్టిందట.

    ReplyDelete