తోటపనితో నాలో నేను-3

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ ముక్షీయ మామృతాతమహా మృత్యుంజయ మంత్రం జపిస్తూనే పూలు సేకరించుకుని నాన్నగారు పూజలోకి వెళ్ళే సమయానికి వంట పూర్తి అయిపోతుంది. ఒకానొక సమయాన ఆ మంత్రార్ధము తెలియజెప్పారు..అమ్మ ఎక్కువగా దోసకాయ పప్పు లో కూరగాయగా (తర్వాత టమాట, ఆకుకూర, మామిడికాయ ఇలా...) వేసేవారు. ఇంటి తోట పాదుల్లో దోసకాయ వతనుగా ఉండేది. ఇంకా ఎన్ని కూరల్లో తిన్నా ఇష్టమే!

హనుమంతరాజు అంకుల్ నాన్నగారి డిపార్ట్మెంట్ లో తనకి రిపోర్ట్ చేస్తూ ఉండేవారు. ఆయన మీద నాకు కోపం వచ్చేసింది, ఒక్కసారిగా కాదు సుమా! అంచలంచెలుగా.. దోసగింజల పొడి ఆరోగ్యానికి మంచిదని దోసకారం తెచ్చిఇచ్చారు (సాంబారు కారం లో వేపి పొడిచేసిన గింజలు కలపటమే అట). నోటికి సహించదు, తినకపోతే చీవాట్లు. భోజనం లో ఆ పొడి తిన్న రోజు అంకుల్ కనపడితే పళ్ళు నూరుకుని, మొహం తిప్పుకునైనా సరే, బలవంతంగా తింటూనే ఉన్నా దోసకాయ పట్ల విముఖత కలిగించారని కినుక వచ్చేది.

తర్వాత హాస్టల్ జీవితం, దోసకాయ అరుదుగా దొరికేది. తిరిగి ఇష్టం వచ్చి పడింది. నా చేతివంటలో దోసకాయ వండే రకాలు మరిన్ని పెరిగాయి. రెండు దశాబ్దాలకి పూర్వం ప్రవాసం వెళ్ళాల్సి వచ్చింది. ఇక, ఆ కూరగాయ దొరికేది కాదు, దోసావకాయ హైదరాబాద్ ప్రాంతీయులు తెచ్చుకుని రెండు ముక్కలు ఇస్తే అదే మహద్భాగ్యం..ఇంతలో పిల్లలకీ అత్యంత ప్రీతికరంగా మారే కొద్దీ ఇండియన్ షాప్ ఆయన తెచ్చిన నాలుగు పౌండ్స్ లో రెండు దొరకబుచ్చుకుని బయటకి రావటం మొదటాట సినిమాకి రిలీజ్ అయిన తొలిరోజు కొన్నంత పనిలా అయేది.
 

తెలిసినవారు పెంచేవారు, పంచేవారు..వాపిరిగొట్టులా తను ‘ఈ పిందె నీది,’ అని చూపాక అటుగా సాయంత్రపు నడకకి వెళ్ళినప్పుడు ఆరాగా చూసుకోవడం ఎప్పుడు పండుగా మారుతుందా “ఉర్వారుకమివ బంధనాత్” పండిన దోసపండు తనంతట తానుగా ఎలా ఐతే పాదు నుండి విడివడుతుందో చూడాలని...

ఒక ఏడాది మామూలుగా మే నెల మడి సిద్దం చేసి, అమెరికన్ నర్సరీ లో దొరికే కొన్ని రకాల నారు మొక్కలు నాటి, కొన్ని విత్తనాలు నేలలో గుచ్చాను. వారానికి వచ్చిన తీగ పాకటం మొదలయాక తెలియలేదు; అయినా నిండుగా పచ్చగా ఉందని ఎరువు, నీరు ఇస్తూ పసుపుపచ్చని పూవు పూయగానే ఇంకాస్త పదిలంగా చూసుకుని పిందె పడగానే దగ్గరగా గమనిస్తే “ఓ వావ్!” లోపల నుంచి ఆనంద జలధార ఉరికి ఉరికి..ఆ పాదుకి కాసినవి మరేవో కాదు దోసకాయలు. బహుశా ఒక గింజ ఎలానో కలిసి వచ్చి నాటుకుపోయింది. దోసకాయంత దొంగోడు (కుందేలు పిల్ల) కూడా రాకుండా తీగెల తడికె కట్టి సాధించాను, నా చేతి పెంపకం లో నేను సైతం కొన్ని. వండిన కూర ఒకరికి, రెండు కాయలు నచ్చినవారికి, నూరిన పచ్చడి నలుగురికి, దాచుకున్న ఫోటోలు మీ అందరికీ. మా మిడ్వెస్ట్ లో దోసకాయలు, సొరకాయలు, పొట్ల కాయలు, కాకర పాదులు పెంచేవారు మోతుబరులు. కనుక నేను ఒక సన్నకారు రైతుని కావటానికి ఈ దోసకాయ దోహదం చేసింది. 
హనుమంతరాజు అంకుల్ ఆదర్శం; తొక్క, గింజతో సహా ఆరోగ్యానికి పీచు పదార్ధం తో పాటుగా ఎన్నో పోషక విలువలున్న దోసకాయ నా పిల్లలు వదలకుండా తింటారు కూడా!!!

1 comment:

  1. మీ దోస కబుర్లు - గుర్తు తెచ్చుకున్నందుకు ఒకటి, రాయాలనుకున్నందుకు రెండు, రాసి పోస్ట్ చేసినందుకు బోల్డన్ని - ధన్యవాదాలు.

    ReplyDelete