తోటపనితో నాలో నేను-1

"భూమిలో ఉన్న చిన్నారి గింజ మెడ బయటకు పెట్టి మొదట వచ్చిన రెండాకుల్ని
చేతులుగా జోడించింది కృతజ్ఞతతో " - గుంటూరు శేషేంద్ర శర్మ


తోట పనిలో ఉండే తాదాత్మ్యత అనుభవంలోకి వచ్చిన వారికి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. నా వరకు జీవితంలో ఒక భాగం తోటపని. "నా పాతిక సంవత్సరాల శోధనలో దొరకని ప్రశాంతత తోటపనిలోనే లభ్యమైంది." అన్న ఒక సన్యాసిని మాటలు చదివాక నా నమ్మకం మరింత దృఢపడింది. నిజానికి ఇది ఆరాధనా లేక అభిరుచా అన్నది నేను చెప్పలేను..నేపధ్య సంగీతం మాదిరి నానమ్మ నాతో కలిసి చేసిన తోటపని జ్ఞాపకాలో, నాన్నగారు చదివించిన పుస్తకాల తాలూకు ఘడియలనో కలుపుతాను. నేను పేరుకి/ పేరు/కు/న్న కవిని కాను, నా చుట్టూ ఆవరణ లో ఆహ్లాదం, ఆనందం కావాలి..నాకు బ్రతుకే పెట్టుబడిగా కవి జీవనం కావాలి!!!

"ఉష మరువం గారి ' మొక్కల పెంపకంలో అనుభవాలు-అనుభూతులు ' రేపు ఉదయం.." అంటూ తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు ముందుగా చెప్పారు కానీ నిజానికి ఇవి తోటపనిలో కిటుకులు, మెళకువలు నేర్పేవి కావు. నా ఎత్తుగడలోనే అది అర్థం అయి ఉండాలి. వీటి నుంచి మరొకరికి నాలో తోటమాలి గోచరించినా, వారిలో వనారాధన ఉద్భవించినా సార్థకత ఉంటుందని నమ్ముతూ... బీజం నుంచి అంకురం వచ్చినంత సులువుగా ప్రేరణ నుంచి ఆచరణ రాదనీ తెలుసు, అయినా అసాధ్యం కాదు.

1 comment:

  1. మంచి series మొదలు పెట్టిన మీకు అభినందనలు!

    ReplyDelete