'వస్తావు పోతావు నాకోసం' !

నాబోటి జానపద గీత/ ఆలాపనగా తోచే తత్త్వాల ప్రియులకు,
ప్రేమలో పడ్డాక ఎన్ని పాటలని, సాకులని చాటుచేసుకుని పెద్దవారి కంట పడకుండా ప్రణయకలాపాలు సాగించాలి!? ;) నాకు భలే నచ్చింది ఈ పాట; సందర్భం పాతదే కానీ పాట లో కవి చూపిన చమత్కారం మాత్రం భళారే!!! అటు కావలి కాసే తండ్రిని గూర్చి గోడదూకనున్న ప్రియునికి హెచ్చరిక చేయటం కొరకు పాడినా, ఇటు ఆ కారణం ఎరుగని తండ్రికి బ్రహ్మంగారి వేదాంతతత్త్వం లా వినిపిస్తుంది.. ఆ గీత సాహిత్యంతో పాటుగా అప్పుడు ఆ తండ్రీకూతుళ్ళ నడుమ సంభాషణ మీకోసం. వినాలంటే యూట్యూబ్ లో ఉంది. మునుపు ఈ సాహిత్యం టైపినవారి version లో కొన్ని అచ్చుతప్పులున్నందున నేనే విని రాసుకున్నాను.

ప: వస్తావు పోతావు నాకోసం
వచ్చి కూర్చున్నాడు నీకోసం
యముడు వచ్చి కూర్చున్నాడు నీకోసం

చ1: పొరపాటుపడి చేత దొరికిపొయ్యావంటే
నా బంగారు చేపా..ఆ..
డొక్క చీరుస్తాడు డోలు కట్టిస్తాడు

చ2: నిక్కి నిక్కి పైకి చూసేవు
తళుకు బెళుకు చూసి మురిసేవు
కదలలేడని పిచ్చికలలు కన్నావంటే.. |2|
ముక్కముక్కలు చేసి తిక్క వదిలిస్తాడు

-2-
తండ్రి: అమ్మాయ్! ఇదేదో బ్రహ్మం గారి వేదాంత తత్త్వం లా ఉందమ్మా
అమ్మాయి: అవున్నాన్నా చేపకు ఎరకు సంవాదం, ఒక జానపద కవి వేదాంత సారాన్ని కురిపించాడు

*****
చిత్రం: మునిపల్లెరాజు రాసిన ‘పూజారి’ నవల ఆధారంగా రూపొందించబడిన "పూజాఫలం"
రాజశ్రీ, రేలంగి పొట్టి ప్రసాద్‌లపై చిత్రీకరించిన ఈ గీత రచన కొసరాజు, గానం: బి.వసంత, సంగీతం: సాలూరు రాజేశ్వరరావు
సినిమా అనుసరణ చేసి సంభాషణలు రాసినవారు డి.వి.నరసరాజు

No comments:

Post a Comment