బెల్లం ఆవకాయ టూ బ్లాక్ బీన్ బర్గర్

హూ వంట అంటే అమితంగా ఇష్టపడేవారెవరికైనా ఇంతేనేమో, నాకూ అంతే తలుచుకుంటే - అబ్బా..ఎన్నేళ్ళ పాకశాస్త్ర అచ్చట్లు ముచ్చట్లు అని. అగచాట్లు కొండకచో గ్రహపాట్లు. నిజ్జంగా. కాకపోతే అసలు వారి వంటలు ఎవరు తిన్నారో గానీ ఇంకా "నలభీములు" అని ఇంకా మోత...మనకేమో తిన్నవారు బ్లాగుల్లో వసించరు/సంచరించరు కాన నాకు ఈ "స్కోత్కర్ష" [అదేలేండీ సొంతడబ్బా] తప్పట్లేదు "నళిని భీమ్లీ" అని నన్ను నేను కంచుగంటలా మోగించను. పైగా దేశం కాని దేశాల్లో పదహారేళ్ళ ఉప్పు కారాల వైనాలివి.

చేతులు కాల్చుకున్న లెక్కలు చెప్పలేను

ఇక ఈ సచిత్ర కథనం నా నిజ జీవితానుభవమే అదీకాక హరికథ/బుర్రకథలననుకరిస్తూ పిట్టకథలూ వస్తాయి. కాస్త ఓపిగ్గా చదివితే కొత్తావకాయ ఘాటు / పాతావకాయ వూరిన ఊట తగుల్తాయి లేండి. మా నానమ్మ పెంపకం ప్రభావం ఎక్కువ నామీద. "పెద్ద కుండకి ఎసరు పెట్టి, పొత్తల్లే వండి, అన్నం వార్చటం, విస్తరాకంత దోశ పెనానికి అంటకుండా వేసి తీయటం" కాబోయే కోడలికి క్షాత్రపరీక్షలని ఆవిడ ఉవాచ. మరేమో శ్రీరమణ గారి "బంగారు మురుగు" లో బామ్మ గారు "అరటిదూట కూర చేయటం, పెద్ద పెద్ద ముగ్గులు వేయటం - పనితనానికి, ఓర్పు, ఓపికలకి మచ్చుక" లని నుడివారు. పదిహేనేళ్ళ క్రితం ఇవన్నీను, మరిప్పుడో..

అస్సలు దంతసిరి లేని పిల్లని నేను [మా మామ్మ దృష్టిలో], "కల్లో గంజో" అన్న లెవల్లో "పాలో మజ్జిగో" తాగి పెరిగేసానా..కాస్త ఎదిగాక ఆవకాయ, మాగాయ మొదలుకుని పులిహోర, ముద్దపప్పు..దారి పట్టాను. ఇదిగో ఈ పళ్ళెరం వంక కొన్ని వేలసార్లు వేవేల నిమిషాలు కళ్ళప్పగించి చూస్తూ కూర్చునేదాన్ని అందులోని ఇడ్లీలు, ఉప్మా ల వంక. అందుకే ఇదిగో నా భోషాణం పెట్టెలో దాచిన పళ్ళేంతో పాటుగా ఊర మిరపకాయలు వంటి ఊసులు.


ఇక్కడో మెలిక ఉంది. మా వదిన మాటలివి "నీకు నీసు పడదు, నువ్వు వచ్చినపుడు మా వంటింటి నాచు వాసన నాకు పడదు." :) ఆకుకూరలకి తన పర్యాయపదం - నాచు. పాపం అర్థమొగుణ్ణి కనుక రోజుకో ఆకుకూర ఇంగువ పోపు వేసి వండటం మానదు. అసలీ సమస్య ఏనాటిది.

నాకు ఇంగువ చచ్చేంత ఇష్టం - ఇందులోఒకటి ఢిల్లీలో తెచ్చాను మరి..

అమ్మమ్మ గారు: "ఈ పిల్లదిలా తయారయిందేవిటీ, గుడ్డు కూడా ముట్టకపోతే ఎలా?" [నేనంటే కాసింత కోపం, బోలెడంత ప్రేమ]
మామ్మ/నానమ్మ: "పోనీలేద్దూ వదిన, అసలే పోతపాల పిల్ల" [ఈవిడే ఎన్నో సార్లు నాన్నగారి కూరుడు తిళ్ళ నుంచి నన్ను కాపాడిన దేవత]
అ: "అసలు దీనికి పెళ్ళెలా అవుతుంది?"
మా: "దానికి తగ్గవాడు పుట్టే ఉంటాడులే వదినా"
ఇక నా రంగ ప్రవేశం..
నే: "నేను పెళ్ళి చేసుకోను."
అ: "అన్నీ నీ ఇష్టమేనా, పల్లయ్య గారి మనవడికి కట్టబెడ్తా" [అతగాడు బకాసురుని మరుజన్మ]
నే: "ఊహు, నేను పూజారి గారబ్బాయిని చేసుకుంటా" [హతోస్మి, తర్వాతి అతి కొద్దికాలంలో ఈ కథ అమ్మమ్మ గారి ఊర్నించి నా నోటే మా ఊరు చేరి సత్యనారాయణ స్వామి గుడి లో తేలింది. కట్ చేస్తే, నా మొహం "స్వర్ణకమలం" లో సాక్షి రంగారావు, పూజారి గారబ్బాయి "శ్రీలక్ష్మి" ను :( ]
అ: "అప్పుడు గానీ మడి ..."
నే: "అయితే నేను నక్సలైట్ అయిపోతా"

అంతే దెబ్బకి అమ్మమ్మగారి నోరు మా నీళ్ళ గంగాళమంత తెరుచుకుపోయింది. [క్షమించండి అమ్మమ్మ, నిజాలు వెలుగు చూడాలిగా!] లేకపోతే పదమూడేళ్ల పిల్లని గదిలో పెట్టి పిల్లిని కొట్టినట్టు నిలదీస్తే ఈ రకం వాగుడేగా వచ్చేది.

ఇక రెండోసారి గట్టెక్కిన గండం:

"ఒకసారి ఇదేమిటీ ఈ పిల్లనిలా తయారుచేసావు, మన ఇళ్ళలో మాంసం తిననంటే కుదురుతుందా" అని ఎవరో ఆయన్ని అడిగారు. అంతే రొయ్యలు తెప్పించి ఇవాళ ఎలాగైనా తినిపిస్తాను అని కూర్చున్నారు. నేను కంటిమింటికి ఏకధారగా ఏడుస్తూ అందరికీ తండ్రి అయిన ఆ దేముడు దగ్గర కూర్చుని "మా నాన్నని ఎక్కడికైనా తీసుకుపో, నన్నీ కష్టం నుండి బయటపడవేయ్" ప్రార్థించాను. అంతే ఆయనకి బాస్ నుండి కబురు, అర్జంట్ గా వెళ్ళాల్సిన కాంప్. దేముడున్నాడనీ నమ్మకం పెట్టేసుకున్నాను. ;)

మాంసాహారులు! శాపనార్థాలు పెట్టకండి. ఈ డప్పు హోరు నా కడగళ్ళు టముకు వేయటం మాత్రమే. నా శాఖాహార వ్రతం కొనసాగటానికి నాకెదురైన పరీక్షలు కడుపువిప్పి చెప్పటం. లైట్ తీస్కోండి.

చివరాఖరు కథకి ఇంకా సానా వెళ్ళాలి కానీ..పుట్టాక నేను వండిన మొదటి వంట ఇది.

ఒకసారి అంటే ఇంకా గరిటె తిప్పటం కూడా తెలియని, అవాలు అంటే ఏమిటి, పాలు పొంగించటం అంటే గిన్నె ఖాళీ అయ్యేదాకా మంట మీద వదలకూడదు, చింత పండు పులుసులో ఉప్పు కూడా వేయాలి అని తెలియని రోజుల్లో ఒకానొక వేసవి మధ్యాహ్నం, కొబ్బరి పాలు రుబ్బి తీయించి పాకం పట్టి ఓ వెఱ్ఱి తీపి ఘనపదార్దం చేసాను. రుచి చూట్టానికి ఎవరూ ముందుకు రాకపోయేసరికి, నా కళ్ళలో నీళ్ళు మాత్రం మున్ముందే ఉరికాయి. అపుడు నాన్న గారు, అన్నయ్య మాకివ్వరా ఉషడు అని తిన్నారు. పాపం ప్రేమ కారణంగా ఎంత భాదించబడ్డారో. నిజానికి నేను కూడా దాన్ని నోటపెట్టలేదు. సరాసరి కుడితి తొట్టిలోకి వెళ్ళిపోయిందది.

కుక్కర్లో అన్నం వండటం, మిక్సీలో దోశకి రుబ్బటం, అరటి పూవు, దూట వండితే తినేయటం, ముగ్గులు వేయటం - వచ్చేసాయి. నా ఇల్లు, వంట కూడాను - అలా బావిలో కప్పలా బతుకుతుండగా ఆస్ట్రేలియాకి లాక్కెళ్ళింది, ఇంకెవరూ జాతకం..ఎవరైనా కాస్త ప్లాన్ చేసుకు వెళ్తారు.. మాదంతా ఊదర, అనుకోవటం అక్కడకి వెళ్ళిపడటం అంతా ఆర్నెల్ల లోపే..ఏవెక్కడ దొరుకుతాయో తెలియదు. ఓ నాలుగు చిన్న సీసాల్లో తీసుకెళ్ళిన ఊరగాయలు, అ పది గిన్నెలు తప్ప వంట ఇంటి సామగ్రి, సరుకులు ఏమీ లేకుండా మళ్ళీ రెండోసారి పాలు పొంగించటం జరిగిపోయింది. చేతికింద పనికి సుబ్బాలు లేదు. ఇక చూడండి లెక్కకు అందనన్ని తిప్పలు.

*********************************************

80:20/60:40 గోలాయింపులు: సిడ్నీకి వెళ్ళిన పదిరోజులకి ఒకరు భోజనానికి పిలిచారు. ఆవిడ చేసిన పూరీలు నిజంగా నా నోము ఫలం. ఒక్కోటి ఒక్కో షేప్ - ఒకటి ఆస్ట్రేలియా మాప్, ఒకటి కొబ్బరి బోండాం ఎడపెడా చెక్కితే రాలిపడే ముక్కలా..ఇలా ఎంతొ వైవిధ్యం..పాపం ఆవిడే తర్వాత మరెన్నో విషయాలకి నాకు గుర్వాణి. అలా మొదటి పచారీ కొట్టుకి దారి తెలిసింది. కనీసం పూరీలు చేయొచ్చని ఫీజీ ఇండియన్ గ్రోసరీ షాప్ కి పరుగు. మొదటిసారి గోధుమ పిండిలో ఇలా మైదా/ప్లెయిన్ ఫ్లోర్ కలిపి ఆ పాళ్ళని బట్టి 80:20/60:40 అంటారని తెలిసింది. ఇంతలో ఓ రోజు మరొకరు వంట సాయం రమ్మన్నారు. పూరీలు గోలా/ళాయించమన్నారు. గుండెల్లో రాయి - ఉండలు గుండ్రం గా చేయాలా? పూరీలు గుండ్రంగా చేయాలా? అడిగితే ఏమనుకుంటారు? చివరికి తేలింది - ఏదో ఒక షేప్ లో చేసినవాటిని నూనెలో వేపటమే గోలాయించటం.


కళ్ళుప్పు/కళ్ళు ఉప్పు: పుట్టి బుద్దెరిగిన నాటి నుంచీ జాడిల్లో ఉప్పు వాడకం మా ఇంట, అదీ కళ్ళు ఉప్పు. కళ్ళు ఆల్చిప్పల్లా విప్పి వెదికినా దొరకలేదెక్కడాను. అసలే బెంగ. అమ్మకి ఫోన్ చేస్తే పూడిన గొంతు విప్పి ఏమీ అడగలేకపోయేదాన్ని ఉప్పు మాటతో సహా. కానీ చల్లారిన పాల రుచి ఉప్పగా తగిలినప్పుడల్లా ఎన్నో సార్లు అమ్మమ్మ గారి జాడీ కళ్ళ ముందు కదలాడేది. ఎలాగైతేనేం, కొన్నాళ్ళకి "సీ సాల్ట్" అన్నది పట్టాను.

డ్రం స్టిక్స్: ఇంకా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న రోజులు, ఓ రోజు ఒక కొట్టు మీద "డ్రం స్టిక్స్" అన్న బోర్డ్ చూసి "భోజనం తయార్" అన్న బోర్డ్ కరకరలాడే ఆకలి మీదున్న వాడికి కంటపడ్డట్టు తెగ సంబరం. రెండో ఆలోచన లేకుండా దూరాను. అది లెబనీస్ వారిది. ఎన్ని కావాలి అని అడిగాడు ఆ ఆసామి. "పప్పుచారుకి నాలుగు, రామములగ-ములక్కాయ పాలకూరకి ఐదు, బెల్లం పులుసుకి ఆరు" ఇలా లెక్కలేసి పదైదు అని చెప్పానా, అప్పుడు ఈ లోకంలోకి వచ్చిపడ్డాను. "ఇదేవిటీ బోన్స్ తూకం వేస్తున్నాడు?" నాకు మరొక నిమిషంలో తెలిసింది. "డ్రం స్టిక్స్, లవ్లీ లెగ్స్" ఇవన్నీ కూడా అవేనని. :) ఇక పరుగో పరుగు.
ఇవండి ముచ్చటగా నా మూడు సిడ్నీ పచారి కొట్టు కథలు. పోగా పోగా శ్రీలంక తమిళుల వారి కొట్లు దొరికాయి. ఎంతగా అలవాటంటే శనివారం ఉదయాన్నే "ఫ్లెమింగ్టన్ మార్కెట్స్" కి వెళ్ళి తాజా కొబ్బరికోరు కోరించుకుని, లేదూ "మరూబ్రా" రకం మామిడి కాయలు తెచ్చుకుని మా ఊర్లో ఉన్న భోజనప్రియులకి వండి, వార్చి, వడ్డించి షడ్రుచులతో ఆతిధ్యం, తాంబూలం ఇచ్చేవారం. అదీ ఓ పిచ్చేనేమో!మన వంటలు - బయటివారి గాధలు:

తెలిసినవారొకరు ఆఫీసుకి రవ్వలడ్డు పాకం పట్టి చేసుకెళ్ళారట. హడావుడిలో తను ఒక్కటీ తినలేదు. సరే టీ టైం కి నలుగురికీ పంచారట. ఏమిటి ఈ వంటకం అంటే, "సెమోలినా కోక్" అని చెప్పిన రెండు నిమిషాల్లో "ఈస్ దిస్ కేక్ ఆర్ రాక్?" అన్న ప్రశ్నకి జవాబిచ్చే ముందుగానే ముదురుపాకం తెచ్చిన తంటా అని తెలిసిందట.

ఇక నా కలీగ్ కారెన్ కి మన శెనగకారం చాలా ఇష్టం. కాకపోతే ఆ తినే విధానమే నాకు నిజంగా వికారం పుట్టించేది. మిగల ముగ్గిన అరటి పండు చక్రాల్లా కోసి, ఈ పొడి జల్లి తినేది. ఛీ యాక్ కదూ?

నా లంచ్ బాక్సుల్లో కాస్త పండు మిరప, టమాట ఊరగాయలు, అమ్మో బెల్లం ఆవకాయ, అల్లం పంచేంత ఉదారత నాకు ఈనాటికీ లేదు కనుక, రుచి చూసి హెల్ముట్ తెగ ఇదైపోయాడని కాస్త ఇచ్చాను. మర్నాడు ఆరడుగుల మనిషీ మూడడులకి వంగిపోయి వచ్చాడు. "ఏమా కథ?" అంటే బీర్ తాగుతూ, బీర్ నట్స్ [వేపిన వేరుశెనగ పప్పులు] తో పాటుగా ఓ ఐదారు పండుమిరప పచ్చడి స్పూన్లు లాగించాడట. మిగిలిన రాత్రి "బాతు" రూమ్లో "బల్లి" లా పాకి అలాగే ఆఫీసుకీ దేకివచ్చాడు....:) హ హ్హ హ్హా అర్థం చేసుకోరు.. నవ్వండి బాబులు/అమ్మలు. జాలిపడి కాస్త పెరుగన్నం తినిపించి, అసలు పాలు కాసి తోడు పెట్టటం కూడా నేర్పేసా. తను చేసిన పెరుగు మీద స్ట్రాబెర్రీలు పేర్చి గురు దక్షిణగా ఇవ్వటమే కాక, జర్మన్ వారి సాలాడ్స్, బ్రేక్ ఫాస్ట్ ఫూడ్స్ అవీ తెచ్చి ఇచ్చేవాడు. బార్టర్ సిస్టం మళ్ళీ అమల్లోకి తెచ్చామలా.

కాకపోతే "డు యు హావ్ అనీ అన్మారీడ్ సిస్టర్ విత్ యువర్ లుక్స్ అండ్ కుకింగ్ స్కిల్స్స్" అన్నాడని అంబశక్తిలా మీద పడి "హన్నన్నా నాకు బాబాయ్ వంటివాడివి.ఇలాంటి మాటలు తగునా?" అని కరిచానని, ఓ రోజు దూరదూరంగా తిరిగి మర్నాడు రాత్రి అంతా కూర్చుని నేను చేసిన కోడ్ డీబగ్ చేసి, ఓ చక్కని డి యల్ యల్ నాచేత రాయించిన ఘనత తనదే. సో, మళ్ళీ ఫ్రెండ్స్ - నేను అమెరికాకి తను హాంగ్ కాంగ్ కి వెళ్ళేవరకూను.

ఇక ఐవన్ బల్గేరియన్. పెద్దగా మన దేశం గురించే తెలియదు. పైగా ఆంగ్ల భాషా సమస్య. "మామ్" అనేవాడు వాళ్ళమ్మ తర్వాత పళ్ళెంలో వేసి తినబెట్టిన మరో అమ్మని నేనేనని ["ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు, ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు" గా] అనేవాడు. నాకు పాప పుట్టినపుడు వాళ్లమ్మగారి నడిగి తీపి పదార్థాలు అవీ తెచ్చి ఇచ్చాడు. తనకి మన పాలకూర పప్పులో, పిండి వడియాలు నంజుకు తినటం ప్రాణం. కాస్త కష్టమైనా గుత్తొంకాయ కూడా అప్పుడప్పుడూను. నేను వచ్చేసే ముందు ఇదిగో ఇలానే మా అమ్మకి వీడ్కోలు ఇచ్చి వస్తాను ఎప్పుడూను అని ఆప్యాయంగా హగ్ చేసి, కన్నీటితో కాండీ బాక్స్ ఇచ్చాడు. ఎప్పుడైనా "హే మామ్" అని ఓ ఈ-లేఖ రాస్తాడు ఇప్పటికీను. ఎప్పట్లానే ఏడిపిస్తాను, పెద్ద కొడుక్కి బాధ్యత ఎక్కువరా అబ్బీ, అందునా నీకన్నా చిన్నది మీ అమ్మ కనుక నువ్వు పోయేదాకా నేనూ పోనని.

అందరికీ మాత్రం నేను చేసే వంటలు మలిపేసాను.

సరే అన్ని రోజులూ వండటం పడదుగా.

బయటి తిళ్ళు - మన గోడు:

మొదట అనుభవం - చైనీస్ రెస్టారెంట్ లో. అంతకు మునుపే మరొక మిత్రురాలికి జరిగినదిది. ఈవిడ పేరు వాసవి, ఆవిడ తో సంభాషణ జరిపిన వియత్నామీస్ స్త్రీ పేరు చంగ్. తెలుగులో రాస్తున్నాను.

వా: మేము మాంసాహారులం కనుక నాకు ఉషకి మల్లే పెద్ద ఇబ్బంది ఉండదు.
చం: ఓ ఏమేమి తింటారు
వా: చికెన్, ఫిష్
చం: ఓ అవి వెజ్
వా: ష్రిమ్ప్, గోట్
చం: చా అవేమి లెక్క
వా: మరి అసలు నీ లెక్కలోకి వచ్చేవేవి
చం: క్రోకోడైల్, టైగర్, కాంగరూ
వా: .... [నోటిమాట పడిపోయిందన్నమాట]

సో, వాసవి నాకు హెచ్చరికలు, ఎలా మాట్లాడాలో, ఏం అడగాలో చెప్పింది.

ఫ్లైడ్ లైస్ అంటే బెదిరిన రోజుల నుంచి బాగా ఎదిగి, ఇప్పుడు "నో మీట్, నో చికెన్ స్టాక్, నో యెమ్ యెస్ జి, ..." ఇలా సాగే నా మంత్రాలకి "మమ" అని లేదూ నాతో పాటు జపమంత్రం చదివి చేయగల ఒక్క ప్లేస్ కే వెళ్ళేదాన్ని అక్కడుండగా. ఇక్కడా ఒకరు దొరికారలా. ఇక్కడ రెస్టారెంట్ ఓనర్ కాస్త స్నేహితురాలు కూడ. మొన్నా మధ్యన నా జీవితంలో కాస్త ప్రాధాన్యత ఉన్న రోజున ఇదిగో ఇలా గుడ్ లక్ అని ఒక డాలర్ నోట్ తో ఓరగామి చేసి ఇచ్చింది. అచ్చంగా మన బొట్టు పెట్టి పంపినట్లే.

ఇక శాఖాహార భోజనానికి మారే వారి సంఖ్య పెరగటం తో రాన్రాను నాకు ఇబ్బంది అనేది లేదసలు ఏ ప్లేస్ లో తిన్నా, ఏ కిచన్ కి వెళ్ళినా..ఎక్కడో ఒకటీ అరా తప్ప..పైగా అందరికీ తెలుసు నేను Ovo Lacto vegan [so eat egggs, dairy products and vegetarian] .. అని. :)

*************************************************************

ఇక నా వంటల విషయాలు: ఒక కారాలు, మిరియాలు కవితగా చెప్పేసా ఏనాడో :)

తొక్కుడులడ్డు/బందరు లడ్డు/సాదా లడ్డు సన్యాసం: అమ్మ ఆవలీలగా చేసేసేవోరు మనకెందుకు రాదని దిగానా..మరే దేవతల దీవెనో మొదటిసారే దిమ్మ దిరిగేంత రుచిగా వచ్చేసాయి - అవి పాతిక. ఆ ధీమాతో రెండోసారి ఆరింతలు చేయాలని నిచ్చెన వేసాను. నా వంటకి ముందు ఏర్పాట్లివి. హాయిగా మధ్యాహ్నం పడకేసి రాత్రి ఎనిమిది సుమార్లలో మొదలెడ్తాను పిండి వంటలు మాత్రం. సన్నగా పాటలు, మధ్యలో నృత్యం చేయ వీలగు దుస్తులు, వేడి పాలు ఇవన్నమాట. అలా అలా ఆ రాత్రి పన్నెండుకి జంతికలు వేపి తీసి, పిండి పట్టటం అయింది. కాసేపు కునుకు తీసి మళ్ళీ రెండుకి పాకం మొదలెట్టాను. పైన రవ్వలడ్డుకి ముదురు పాకం, మనకి లేత పాకం తెగులు పడ్తాయని ఒక్క బ్రహ్మకే తెలుసునేమో! రెండు తీగల పాకం వచ్చిందని మంట ఆర్పి, పిండి కలిపి, నెయ్యి పోసి, తిప్పి, పప్పు గుత్తితో కుమ్మి లడ్డూ చుట్టి కాసేపలా వత్తిగిల్లి లేచి వద్దును కదా, తొక్క తీసిన సపోటాల్లా మెత్తగా తగిలాయి. ఉసూరుమని అక్షరాల నూట ఇరవై లడ్లు ట్రాష్ చేసేసా. అది విన్న ఫ్రెండ్ "అయ్యో, పైన క్రష్డ్ నట్స్ పోసి లెంటిల్ పుడ్డింగ్" అని ఆఫీసులో ఇచ్చేయాల్సింది అన్నప్పుడూ గానీ తెలిసిరాలేదు పాపం మన చేతిలో వీళ్ళు ఇలాగూ బలవుతారని. :) ఏదేమైనా ఇప్పటికి మళ్ళీ చెయ్యలా.. చేసేవారితో మాత్రం సత్సంబంధాలు ఉన్నాయి.

అందర్లానే ఏవో ప్రయోగాలు - బీట్ రూట్ ఆకు పప్పు, క్రాన్ బెరీ పచ్చడి, గ్రీన్ యాపిల్ ఊరగాయ, సెవెన్ కప్ స్వీట్ ఇవన్నీ కాదు గానీ, మొత్తానికి ఇక్కడికొచ్చి బతుకుతెరువు నేర్చుకున్నట్లే "బతికుంటే బలుసాకు" కూడా పట్టేసాం. ఇదిగో ఇదే. ఆకు, సగం పెసర, సగం శెనగ పప్పు కలిపి ఉడికించి తీసి, జీలకర్ర, మెంతి పిండి, కారం, ఉప్పు, చింతపండు, పచ్చిమర్చి వేసి ఉడికించి ఇంగువ పోపు వేసి తింటే దేవేంద్ర వైభోగమే.


బలుసాకు

అమెరికా సన్నికెల్లు

ఇక వచ్చిపోయినప్పుడల్లా అక్కడి నుంచి రవాణా చేసేవి వంట పాత్రలే. నేను నాన్ స్టిక్ వాడను. అమ్మ వాడిన మూకుళ్ళు, పెనాలు ఇప్పుడు నా ఆస్తులు.


అమ్మలు ఇవ్వమంటే లోకల్ స్టోర్స్ లో ఇలా కాస్ట్ ఐరన్ వి దొరుకుతాయి

రోటి పచ్చళ్ళకి ఇదిగో నా ఉపకరణాలు. ఒకటి ఇందిరా పార్క్ దగ్గర నేను దాదాపుగా దగ్గరుండి చేయించుకున్న సనికెల్లు. నాతో ఇలా దేశాలు పట్టి తిరుగుతూను.

ఇక, ఇదేమిటీ ఈ సాన, గంధం చెక్కా అంటారా? అదే మన సౌందర్య రహస్యం. :) ఈ చెక్క నా పెళ్ళికి అమ్మవాళ్ళు కొన్నది. నా చితిలో వెయ్యాలి సాంప్రదాయం ప్రకారం అట, కానీ ఇదిగో నా కన్నా ముందే అరిగిపోతుంది. పగటి పూట వంటకి ఇలా గంధం, పసుపు, పాలు, తేనె కలిపి రాసి మరీ దిగుతాను వంటలోకి. లేదా వండే కూరగాయలు, తినే పళ్ళు పేస్ట్ అద్దేస్తా.. ఆ మధ్య బొబ్బాస కాయ సగం చెక్కలో ఫోర్క్ వేసి లాగిస్తూ, కొంచం మొహానికి కూడా అద్దేసా, ఈ రూపం సంగతి మర్చి పోయి కాలింగ్ బెల్కి బదులిచ్చానా? అవతలి మనిషి మొహమ్లో చూడాలి కంగారు. తర్వాత చెప్పాడు మీరు భలే ఇన్నోవేటివ్ గా చర్మ రక్షణ చేస్తున్నారల్లే ఉందే అని.
************************************************************

ఇక పోతే భావితరం/పిల్లకాయలు వచ్చేసారుగా వాళ్ళ పరిభాష చెప్తే హడలిపోతారేమో..

మూడేళ్ళ క్రితం ఎనిమిదేళ్ళైనా లేని నా బిడ్డీకి వంట పిచ్చి ఇప్పుడు నాకున్న స్థాయికి పైనే. కాకపోతే అది వాడే ఒవెన్ మాత్రం నా స్టవ్ కి క్రింద ఉంది. :) దాదాపుగా భీమ్లీ పేరు అది కొట్టేసి నన్ను వట్టి నళిని గా వదిలింది.ఎవరి సాధనాలు వారివే మరి

నమ్మనివారొకరిద్దరు మా ఇంటికి వచ్చి దాని ప్రజ్ఞాపాటవాలు చూసి వెళ్లారు - పూరీలు పిండి కలుపుకుని వేపే వరకూ అంతా తనే + ఇడ్లీలు చక్కగా వాయ వేసి తీసి పళ్ళాల్లో పెట్టటం, కూరగాయలు తరగటం గట్రా. కనుక అనుమానిస్తున్న చదువరులు ప్రయాణపు ఖర్చు పెట్టుకుంటే వసతి, భోజన సదుపాయాలు మేము కల్పించి మరీ పిల్ల ని పరీక్ష చేయనిస్తాము. నిజంగానే - అదొక అదృష్టం. అన్ని పనులూ వచ్చు - లాండ్రీ, ఇల్లు క్లీనింగ్, గ్రోసరీ షాపింగ్ ఇలా. ఒక విధంగా నాకు పెద్ద దిక్కు అదే. వెంటుండి అన్నీ గుర్తు చేయను.


కాకపోతే బ్లూ పులిహోర చేయించటం, ఊతప్పాన్ని రకరకాల టాపింగ్స్ తో స్టఫ్డ్ స్పైసీ ఇండియన్ పాన్ కేక్ అని మార్చి పడేయటం వంటి ఇన్నోవేటీవ్ ఆలోచనలతో బుర్ర తింటుంది కాని. :) నిజానికి నేను ఒక ముగ్గురు పనిచేసేప్పుడు నోరు మెదపను - హాయిగా అరటిపండో, కారెట్టో నవుల్తూ కూర్చుంటా, ఒకరు పిల్లది, రెండోవాడు వీకెండ్ ఇల్లు క్లీన్ చేయటానికి వచ్చే చైనీస్ వాడు, మూడో మనిషి అప్పుడప్పుడు యార్డ్ క్లీనింగ్ కి వచ్చే మెక్సికన్ వాడు - ఒకరితో తలపడటానికి తర్కశాస్త్రం, మిగిలిన ఇద్దరితో సకిలించాలంటే బహు భాషా పరిజ్ఞానం అవసరం. ఆ రెండూ నాకు శూన్యం కనుక మనం చేయగలా పనల్లా ఇకిలింపులు, సైగలతో పని పూర్తి చేయించటమే.

అప్పుడప్పుడు నాకు దానికీ పరస్పర క్విజ్ పెట్టుకోవటం అలవాటు. ఉదా: అమ్మ టిక్ టిక్ అంటే జీలకఱ్ఱ; బిడ్డీ టిక్ టిక్ అంటే ఆవాలు. ఇదిగో ఈ క్రింద శాల్తీల పేర్లు మీరూ చెక్ చేసుకోండి. దాదాపుగా మాకు నూరు వచ్చేస్తాయి.


గవ్వల చెక్క కనుక్కున్నారా?


నెయ్యి దేనితో వడగట్టాలి?చోద్యం కాకపోతే యాపిల్ కొయ్యటానికొకటి, గుడ్డు తరగటానికొకటి :)

ఇక నా బిడ్డడికి జామకాయ ఏదో, గ్రీన్ యాపిల్ ఏదో తెలియని అయోమయం కనుకా నేను ఏది వండి పెట్టినా అమ్మ చేతి ముద్ద, నా కడుపు చలవ అని లాగించేస్తాడు. వాడితో చిక్కల్లా తాజా కూరలు కావాలి, నూనె తడి తగలకూడదు అంతే.

ఇక కాస్త విస్తరించి ఈ పిల్లజాతికి నా వంట ఉద్దారణ ఇస్తే, ఒక ఘటికురాలు "ఉషాంటీ యువర్ చికెన్ లెగ్స్ ఆర్ యమ్మీ" అని కాప్లిమెంట్. మా గోదావరి స్పెషల్ స్వీట్ "పనసతొనలు" లేక "కిళ్ళీ బుట్టలు" కి పట్టిన అధోగతి. మరొకడు "యెల్లో థింగీ ఈస్ ఆవ్ సం" ఇవి పకోడీలు.. అలాగే "బాదుషా" == ఇండియన్ డోనట్. "నిమ్మకాయ పులిహోర" == సాల్టీ లెమొనేడ్ రైస్ [లెమన్ రైస్ అన్నా చాలు కదా] ఏదేమైనా పిల్ల స్కూల్లో నా పులిహోర, రవ్వ కేసరి, ఉల్లి పకోడీ కి మాత్రం నూటికి నూరు మార్కులు పడతాయ్.నా దినుసులు కొత్తవేమీ కాదు - తరతరాల వాడకంలోవే
ఇక నాకు ఆర్గానిక్ కూరగాయల వాడకం ఎక్కువ. బ్రౌన్ రైస్ దాదాపు సంవత్సమున్నర నుంచీను. నేను అన్ని విధాలుగా తినేస్తాను. మొదలుపెట్టాలనుకున్నవారు అన్నంగా కాదు కానీ, దోశతో శ్రీకారం చుట్టవచ్చు

రైస్ - ఒక కప్పు
మినప్పప్పు - ఒక కప్పు
కంది పప్పు - మూడు స్పూన్లు
మెంతులు - ఒక చెంచా

నానబెట్టి రుబ్బేప్పుడు ఒక అరస్పూన్ జీలకర్ర, చిన్న మిగల పండిన అరటి పండు ముక్క కలిపి, ఉప్పేసి రుబ్బి, ఆ దోశలకి సీమ వారి టమేటో+ఉల్లి పచ్చడి రంగరించి తింటే వాహ్ హుజూర్ అనాల్సిందే ఎంతవారలైనా గాని.

అలాగే ఓట్స్ దోశ. ఒన్ మినిట్ ఒట్స్ సగం, గోధుమ పిండి సగం, కాస్త మజ్జిగ, నీరు పోసి కలిపి - జీలకర్ర, మిరియాల, కొబ్బరికోరు [ఆప్షనల్] ఉప్పు వేసి ఒక పావుగంట నాననిచ్చి... దోశలు మరీ పలచగా రావు... పెసరట్టులా కాస్త మందంగా వేయాలి... మధ్యలో అల్లం, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారెట్ కోరు, రోస్టేడ్ నట్స్ వేసుకుని కాలాక, వేడిగా తింటే ఇక ప్రక్కన పచ్చడి అధరువు అవసరం లేదు.

మీరు తింటే అందులోనే ఎగ్ బీట్ చేసి కలిపి [అప్పుడు మజ్జిగ కలపకండి], తరిగిన మష్రూం మైక్రోలో లైట్ గా స్టీం చేసి వేసుకుని అలా కూడా వేయొచ్చు..

గోధుమ బదులు అప్పుడప్పుడు బియ్యం పిండి కలపపొచ్చు... అల్లం పచ్చడి సైడ్

లేదా బ్రౌన్ రైస్ నానబెట్టి, ఒకటికి ఒకటి ఒట్స్ వేసి రుబ్బుకుని [దాదాపుగా అటుకుల దోశ మాదిరి] చేయొచ్చు. దీనికి పల్లి చట్నీ అదుర్స్..

నేను ఆరోగ్యం కి మంచిది అనే ప్రతి గడ్డీ తినేస్తా... మందులకన్నా ఇవి నయమని నా నమ్మకం.. ;) ఈ పాటికి చెప్పకపోయినా మీకు అర్థం అయుండాలి.

ఈ మధ్య ఒక కలీగ్ కి ఆలుగోబీ రెసిపీ ఇచ్చి బదులుగా స్వీట్ రైస్ కేక్ చేసే విధానం తెలుసుకున్నాను. కావాల్సిన వారు అడగండి. చెప్తాను. అది దాదాపుగా మన పంచదార అరిశెల రుచిలో ఉంటుంది.


ఎన్ని వందలసార్లు పాయసం, పరమాన్నం, చక్ర పొంగలి, కేసరి ఘుమఘుమలో!


అలాగే Textured vegetable protein [TVP] గోరు వెచ్చని నీళ్ళలో నానబెట్టి, కాస్త రెడ్ ఆనియన్, సోంఫు అవీ వేసి వండితే యమ్మీ. ఇది నేను ఒక శ్రీలంక తమిళుల వద్ద నేర్చుకున్నాను. సింగళీస్ దగ్గర బేబీ బనానా కూర ఒకటి [తొక్క తీయరు, కాస్త మసాల దట్టించి దాదాపు గోదావరి జిల్లాల్లో పెళ్ళిళ్లకి వండే పనసతొనల కుర్మా లా ఉంటుందీ కూర].

పిల్లదాని పుణ్యమాని కాస్త బర్గర్స్ తినటం అలవాటైంది. బేక్డ్ టోఫూ ఒకటి, బ్లాక్ బీన్ బర్గర్ ఒకటి బావుంటాయి.

చివరిగా, పోపులకి నూనె బాగా కాగనిచ్చి కాకమీద పోపు దినుసులు వేయాలి, నిలవ పచ్చళ్ల పోపుకి చివర్లో రోస్ట్ చేసిన మెంతుల పొడి, వెల్లుల్లి గుండా వేస్తే రుచీ శుచీ అనీన్ను, పులిహోరలో గసగసాలు, కొబ్బరి, జీలకర్రల పేస్ట్ కలిపినా [దీనికి ఆవ పెట్టకూడదు] అదొక బెమ్మాండమైన రుచన్నీను - ఇవన్నీ అమ్మమ్మల, మామ్మల చిట్కాలనీ చెప్పనవసరం లేదు, జస్ట్ గుర్తు చేయటమంతే..

ఇదంతా చెప్పటం అయ్యాక గంజి కలేసిన అన్నాలు, ఐసుపెట్టె కూళ్ళు సర్వసాధారణం అయినా కూడా ఎప్పుడో చదివిన ఒక కథతో ముగిస్తాను.

ఒక సెమినార్ అదీ శాస్త్రీయంగా మనమెంత వృద్దిలోకి వచ్చామన్న అంశం మీద అన్నమాట. అందరి చేత భేష్ అనిపించుకున్నా గానీ ఇంకెక్కడో సామాన్య జననీకం నుంచి అభిప్రాయం తెలుసుకోవాలని ఒక శాస్త్రవేత్త ఒక బిచ్చగాడిని పట్టుకుని అడుగుతాడు. "అయ్యా, మా తాతల తరంలో కడుపుకింత కూడు బిక్షగా దొరికేది. లేదూ గంజి దొరికేది. కుక్కర్లు వచ్చాయి. ఆ గంజీ కరువైంది. దయగల అమ్మ కాస్త సద్దన్నం విదిల్చేది. ఐసు పెట్టెలొచ్చాయి, అదీ కరువైపోయింది." అని నిట్టూరుస్తాడు. నిజమే కదా?

ఇవండి అచ్చంగా మాగాయ పెరుగన్నం మీద బతికిన ఓ మనిషి పదారేళ్ళూగా కలప కంబషన్ తో వజ్రం గా మారినట్లు, ఆటుకీ పోటుకీ తట్టుకుని వంద రకాలు వంద మందికి వండి పెట్టే శక్తి, సామర్థ్యాలని పెంపొందించుకున్న యాత్రానుభవాలు. ఇంకా ఎన్నో ఊసులు కదలాడుతున్నాయి. నిజ జీవితానుభవాలు కనుక కోతలేకుండా రాసాను. భేషజంగా తోస్తే మన్నించండి. మీ మాటలు పంచుకోండిక.

తెగిపడిన ముత్యాల సరాలు

ముందు మాట: ఇవి నా ఎనిమిది-పది తరగతుల్లో రాసుకున్న కవితలు. కాలంతో సాగిన నా గానం తీరు చూస్తారని.. నన్నూ నేనూ తిరిగి చూసుకోవచ్చనిన్ని :)

1 *** *** *** *** *** *** ***

ఈ వసంతాన కర్మసాక్షికి మేలుకొలుపై

కెందామరలు విరిసేను..
మలయమారుతం తొంగి చూసి
మంచుతెరలు వీడేను..
కోమల శీతల శిరీషంపై
ప్రత్యూష బిందువు మెరిసేను
ప్రకృతి పరవశించి వెల్లువై
పలికింది స్వాగతం ఉషోదయానికి
ఉప్పొంగింది నవ చైతన్యం జగతిలో, నేస్తం!

2 *** *** *** *** *** *** ***

ఇరు మేఘాల చిరు సందడిలో చినుకుల జడి
మేరు గర్జనల అలజడిలో మెరుపుల ఒరవడి
సరిసరి రాగాల నెత్తావి గుసగుసల గుంభన సడి
విరి తరుల వయ్యారి పూవుల పొంగారు పుప్పొడి
గోధూళివేళల, పున్నమి రాత్రుల జాలువారెడి
తెమ్మెరలు, వెన్నెలవెలుగులు
ఈ పుత్తడి జాడల పొంగిన వెల్లువ ఏదని, ఎలా చెప్పేది?

3 *** *** *** *** *** *** ***

గతపు చంద్రోదయానికి నే పలికిన మేలుకొలుపు
స్మృతుల వెన్నెలై నీలో వెల్లువవలేదా నేస్తం?
కాలం కదిలి బహుదూరంగా తోస్తున్న వాస్తవం
మదికడలిపై చిరుగీత కాబోలు..
నీ జాడల వెనుక నా నీడలు కావా అవి?
నేనొక నిశ్శబ్ద నిశీధి అవుతాను
ప్రతిరేయీ చిరుచుక్కవై పలుకరిమ్చిపోవా?
కాలం కలంగా ఒక పుఠని లిఖించాం
అది చాలు నా జీవితాంతానికి పఠనం

4 *** *** *** *** *** *** ***

సందెపొద్దుతో పందెం వేసి పరుగెత్తి
వెన్నెలమ్మని తోడ్కొని చల్లగా వచ్చింది వెలుగు
చుక్కలన్నీ చక్కగా ఎదురేగి
రేరాజు చెంతన పరిచాయి జిలుగు
వెలుగుని విశ్లేషించి,
జిలుగుని పరివేష్ఠించి
మది వాకిట ఆశల పరిమళం
పరిచిఉంచాను పదిలంగా
నీ జ్ఞాపకాల జాడలపై అద్దిన మధురిమ
సింధూరమై ఎగిసివస్తే
ఆ రంగుల నీడల్లో
నీ రూపుని పరావర్తించి
దాచిఉంచాను మౌనపు క్షణంలో
ఆ క్షణం వికిరణమై,
ఈ మౌనం శబ్దతరంగమై
అనురాగమేళావింపున
నను అలరించేదెపుడో..

5 *** *** *** *** *** *** ***

నింగమ్మ నేలమ్మ నవ్వేటియేళ
చెట్టమ్మ, పుట్టమ్మ పిలిచేటియేళ
గుండె ఊసులన్నీ పొంగేటియేళ
సడిరాని నీవులేని ఈ యేళ
ఏమి చేతును?

6 *** *** *** *** *** *** ***

ఆమని రాకల ఆనందం
కోయిల గొంతున కువకువలే
తీరని చూపుల ఆహ్లాదం
తీయగ చేరే చిరులేఖలే

7 *** *** *** *** *** *** ***

సఖి,
మనసనే పూలతోటలో
అనుభూతుల విరులన్నీ
ఏరి ఏరి తెచ్చేనా
ఎంచి ఎంఛి తురిమేనా
నీ నీలికురులలో..

8 *** *** *** *** *** *** ***

ప్రభు, నీవు పెంచిన ఈ పూలవనాన
పూచిన ఓ పిచ్చిపువ్వును
నా మధురిమ నిను చేరేలోపే
వసివాడిపోతానేమో..

9 *** *** *** *** *** *** ***

నేస్తం,

జీవితపు ఎలమావి తోటలో
స్నేహపు చివురింపు చిరుపంట కొరికిన
కాలపు కోయిల గళాన జీవనగీతమై,
రాగాలు రువ్వే ఈ తరుణం నిత్య శాశ్వతం చేద్దామా?
సాగిద్దామా నిండుగా ఈ ఆమని గానం?

10 *** *** *** *** *** *** ***

కాలపుటెడారిలో నా జీవిత జాడలు
నీకోసం మిగిల్చి పోతున్నా,
కాల్పనిక వాస్తవం కనిపించే ఋజువు కాదు
కన్నీరింకిన కళ్ళన్నీ ఆర్తి తప్త హృది తలుపులే
ఇగిరిపోని ఆ చెలమల్లో నిండు కలువ మన చెలిమి

అనుకరణ/అనుసరణ: సుందరరామునికొక నూలిపోగు

ముందుమాట: ఇంతవరకు చదవనివారు తప్పక తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారి తిరిగి పొడవని పొద్దు మాత్రం చదివే ఇక్కడి నుంచి పొడిగించండి. ఇక్కడ ఆ ప్రస్తావనకి మన్నిమ్చినందుకు వారికి కృతజ్ఞతలు.

మీ రచనలకి ముడిసరుకు ఎక్కడిది? అన్న ప్రశ్నించబడినపుడు "స్యయంభువునో, బుట్టల మీద కాగితపు పేస్ట్ రాసి చేసే పోత బుట్ట మాదిరి నేనూ తెలియకనే చదివినవన్నీ పోత పోసుకుని పుట్టిన కవినో... ఇక నా రచనలు అన్నీ సాధారణ స్థాయివే. నేను సగటు కవిని కూడా కాను." ఇది నా మనస్సాక్షి ఇచ్చిన బదులు.

ఇక వ్యాసంలో నన్ను నిలవరించిన పంక్తులివి.

"..ఆయన్ని అనుకరిస్తున్నవారు చాలామంది ఉన్నారు. నాకు పాటలు రాయడం రాదు. కానీ రాయాల్సివస్తే అలాంటివారిలో ఒకడుగా మారడానికి నాకభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయన్ని మించడం సంగతలా ఉంచి, అనుకరించడం కూడా కష్టసాధ్యమే. సాధారణంగా అనుభూతులు మాటలకు కారణమవుతాయి. కానీ ఇందుకు విపర్యాసంగా వేటూరి ప్రయోగించిన మాటలే శ్రోతల్లో అనుభూతుల్ని సృష్టిస్తాయి..."

ఎంత అక్షరసత్యం? అక్కడినుంచి పుట్టినదే ఈ ఆలోచన.

అలాగే ఫణీంద్ర, మౌనమై పాడనీ బాధగా అంటూ ఒక కవితగా ఆయనకి నివాళి ఇచ్చారు.

ఇక తనికెళ్ళ భరణీ గారి సన్మానపత్రం, ఒరేయ్ సుందర్రాముడూ...! కంటినీటి కుండల్ని బద్దలు చేసేసింది.

మిగిలిన మిత్రులూ రాసి ఉంటారు కానీ సమయాభావం వలన నేను అన్నీ చూడలేదు, అన్యధా భావించవద్దు.

ఆ అక్షరశిల్పికి నా వంతుగా ఒక్కటైనా పాట/గేయం వంటి చిరు రచనతో ఆయనకి అంజలి ఘటించాలని. నేను భాషాపరంగా, భావన పరంగా ఆయన ముందు ఒక గడ్డిపోచనే. నాది పేలవమైన రచనే. కానీ ఒక ప్రేరణ నుంచి వచ్చిన రెండు రచనలు ఇక్కడ పెడుతున్నాను. తప్పక కొన్ని కాదు అన్ని పదాలు విన్నవే అని కూడా అనిపిస్తాయి. ఇది అనుకరణ/అనుసరణ ఏది అన్నది నాకు తెలియదు.


**************************************************
ఇక ఇది ఒక కవిగా నాకు నేను వెళ్ళిన మనస్థితి/అనుభూతి అలాగ వచ్చిన గాయాలో/గేయాలో.


ప్రేరణ :- కలిసిన క్షణాల సంబరం, విడిపోవటం, ద్వేషించబడుతున్నానేమోనన్న సంశయం, పోనీ ఆ దూరం వద్దు, మళ్ళీ మొదలుపెడదాం అన్న ఆశ కలగలిపి, ముందుగా ఒక వచనమైతే..

విధికి/కాలానికి/తనకి గోడు వెళ్ళబోస్తూ..

నువ్వు రావన్న తలపు నాలో వేళ్ళూనిన వటవృక్షమల్లే పాకిపోతే ఆ వేళ్ళు మదిగోడలను బీట వారుస్తాయి. ఎప్పటికో ఆ బీట పెద్దదై గుండె పగిలి పోవొచ్చు, కాదనను. కాని, నీ ఉదాసీనత విషమై మైకంలా నన్ను కమ్మేసినప్పుడు మొత్తం గా నేను కుప్పకూలి పోకముందే చిగురులు వేసే తలపులు వాడి.... తలపనేదే మొదలు కంటా మాడీపోనూ వచ్చు, ఆ మదిని పూర్తి గా ఆ శిధిలాల కిందకి తోసేసి ఏమి జరగనట్లు ఒకప్పుడూ నాకు మనసు ఉండేది అనే ఆనవాలే లేనట్లు బతికెయ్యొచ్చు.

ఇలా జరిగే అవకాశం కూడా వుంది కాని ..............................

నీ ద్వేషం నన్ను చావనీదు బతకనీదు... ఏదో నీదగ్గర నుంచి వస్తోంది..... అది ద్వేషం తో నిండిన వడగాలో, ఆ వడగాలిలో నువ్వు నన్ను అలా ఐన తలచుకుంటూన్నావన్న చిన్ని శీతల పవనమో..!! ఏది చంపుతోందో, ఏది బతికిస్తుందో తెలియని అయోమయం లో నిర్వేదం గా ఆ ద్వేష కీలాగ్ని లో దగ్ధమవుతూనే, ఆ అగ్నికీలల నుంచి పునీతమైన నన్నేలే రారాజువు నువ్వని ఆశ తో మనస్సు కాలుతున్నా జీవించటం, కన్నీళ్ళతో మంటలార్పటం ఎంత కష్టం ఎంత కష్టం మనసు ఎగిసిపడుతుంది ఎండూటాకులా .....

అందుకే ఇష్టపడిన వాళ్ల దగ్గర్నించీ ద్వేషం ప్రతిగా తీసుకోవటం కన్నా, అసలేమీ లేకపోవటం, మళ్ళీ అపరిచితులుగా మారిపోవటం... ఇదే నయమనిపిస్తుంది. మళ్ళీ నిన్ను పరిచయం చేసుకునే వీలుందా..పోనీ వీలు కల్పిస్తావా, నీవు వలదన్నా వీలుచేయమన్న నా వినతి ఆలకిస్తావా.. అసలింకా మనసు ఖాళీగా ఉందా, ఇరుకు గోడల్లో బందీవైపోయావా.

ఇది మామూలుగా నేను నైరాశ్యం కలేసిన కవితగా రాసుకుంటే, ఇలాగ వచ్చేది..

***************

కరిగే మంచు..
గుండె బరువు.

తేలిపోయే మబ్బు
కంటి చెమ్మ.

సుడి తిరిగే గాలి
ఎడతెగని యోచన

విరిసే పువ్వు
ముడిచిన నవ్వు

మనసున పరవశం
మతిచెడి అలౌకికం

అదే నేను, ఇదే ప్రకృతి
ఓనాడు ఒకవైపు నిలబడలేదా?

ఏది సత్యం? ఏది నిత్యం?
శబ్దం ఎందుకు మౌనాన్ని కల్తీచేయను..
మరణాన్ని ఆపటమెందుకు
జననంలోనే శోకం వూపిరి పోసుకోలేదా?

నాలుగు గోడల విశ్వం,
రెక్కలేని అంగం,
దిగుడుబావిలో బింబం,
గుండెలవిసే కురూపి

************************

అలాకాక, ఆ బాధని కాసేపైనా కల/ఊహ/ఆశ కలేసిన పాటలో దాచేస్తే ఇలా...

*************

ఏటిగట్టున మాట
మూగనోము పట్టింది
ఏమెరుగని మనసు
గాలి పాట పాడింది ॥ప॥


వెన్నెల్లో, వేకువల్లో
ఎదలో పూచే గోవర్ధనాలు,
నీ కోసమే, ఒక్క నీ కోసమే
పరిమళించిన ప్రేమసుమాలు.
సందెవేళకి రాలిపడిన మందారాలు,
పొద్దుపొడుపున జారిపడిన పారిజాతాలూ
వెక్కిరించినా, ఎత్తిపొడిచినా
ఎదలోపల పదిలం అనురాగం... ॥చ॥


కన్నుల్లో, కలల్లో,
ఎవరో వేసిన రంగవల్లులు,
నీ కోసమే, ఒక్క నీ కోసమే
ప్రభవించిన సచిత్రకథనాలు.
ఒడ్డువీడి విరుచుకుపడే కల్లోలసాగరాలు,
కావిరంగులో నిస్తేజమైన చిత్రలేఖనాలూ,
నిలదీసినా, విసిగించినా,
ఎదవీడని కవనం అపురూపం.. ॥చ॥

*************

అదే మరోలా ఇంకాస్త భరోసా కలుపుకుని ఆలపిస్తే ...


*************

నీడ వదిలి వెలుగులోకి రమ్మంటే
నా అస్తిత్వమే నీ నీడని నవ్వేవు,
నేనెక్కడ ఉన్నానని నిలదీస్తే,
నీ ఊపిరి నేనని ఉడికించావు ॥ప॥

పలుకులన్ని కలిసి పలకరించే చినుకై,
తనువునంతా తడిపి నా కంటి లో నిలిచింది.
తోడున్న నిన్ను చూసి నీ గుండెలోకి దూకింది.
నిన్నూ నన్నూ కలిపి కట్టిన సూత్రం తానని,
నింగిలోని మబ్బు నిబ్బరంగా నవ్వింది.
కడలి పొంగు తన కొంగులోకి మళ్ళీ నింపుకుంది. ॥చ॥

నవ్వులన్ని విరిసి పరవశించే చినుకై,
తనువునంతా తడిమి నీ కంటిలో నిలిచింది.
ఎదురుగ నన్ను చూసి ఎగిసెగిసి పడింది.
నన్నూ నిన్నూ వదలని బంధం తానని,
నదిలోని నీరు ఎత్తిపోతలై దూకింది.
కొండాకోనల్లో కూతపెట్టిన వాగుని కలేసుకుంది. ॥చ॥


*************

ఈ మూడు రచనలూ ఆ మహానుభావునుకి నా నుంచి నీరాజనంగా సమర్పిస్తున్నాను.

ఈ చిరు ప్రయత్నాన్ని కొందరైనా హర్షిస్తారని, తప్పులుంటే మన్నించి సరిదిద్దుతారని ఆశిస్తూ..

జాతస్యహి ధృవో మృత్యుః ధృవం జన్మ మృతస్యచఆత్మబంధువు, చిత్రకారులు శ్రీ విజయమోహన్ గారికి కృతజ్ఞతలతో.. ఈ చిత్రం ఆయన అనుమతితో తన బ్లాగు నుంచి ఈ లింక్ ద్వారాగా సంగ్రహించటమైనది.

ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే
చందమామకి రూపముండదు తెల్లవారితే
ఈ మజిలీ ఈ మూడునాళ్ళే ఈ జీవయాత్రలో

ఎగిరి ఎగిరిపోయింది సీతాకోక చిలక
మిగిలిందీ వేళ్ళపై అది వాలిన మరక

[ఈ పాటని గూర్చి ఒకమాట చెప్పాలి - “సినిమా పాటల్లో సాహిత్యం, కవిత్వం ఏమిటి?” అని ప్రశ్నించే వారికి సమాధానంగా "ఇక్కడ మీరు పాటని చదవడానికి రావాలి, పాడుకోడానికి కాదు!" అంటూన్న ఫణీంద్ర గారి బ్లాగు, "తెర చాటు చందమామ" లో వివరణ చూడండి


వేటూరి వారికి అశ్రునివాళి ఘటించటానికి నాకున్న అర్హత ఆయన మాటల్లోనే “పాట నాకు ప్రాణం.. పాట లేనిదే నేను లేను”. వేటూరి అస్తమయం - నిన్న రాత్రి జెమిని టీవీ లో రాత్రి పదిన్నరకి ఈ వార్త వచ్చే సమయానికి నేను ఆ గదిలోకి రావటం ఒకసారే జరిగాయి, ఒక్క క్షణం నిస్త్రాణ. మరు నిమిషం ధ్యానించుకున్నాను.

సుళ్ళు తిరుగుతున్నట్లు బాధ. ఇది చాలదు ఇంకా ఏదో చేయాలి, తెలియని ధ్వని చెవులకి వినపడకుండా గుండెని బద్దలుచేస్తూ. ఇలాగే ఉండివుంటాడనిపించిన సన్నిహితునికి ఈ-లేఖ రాసాను. నిమిషాల్లో అటునుంచి వినపడిన ప్రతి ధ్వని మళ్ళీ నా గుండెల్లో మారుమ్రోగుతూ .."నిశ్శబ్దం గా వుంది అంతా. కన్నీరొచ్చేంత, గుక్క పట్టి ఏడ్చేంత బాధ అయినా బాగుండేది కదా అనిపిస్తుంది... మృత్యువు తేలుస్తుంది మన దైనందిన జీవితంలో ఏ ప్రాధాన్యతల విలువ ఎంతో. అంతకన్నా గొప్ప గీటురాయి లేదు." ఇలా ఎన్ని గుండెల్లో ఈ వేదన మారు మ్రోగుతుందో..


అంతా
అందరు చెప్పే ఉంటారు. ఆ టీవీ వార్త తప్పా ఇంకేమీ చూడకపోయినా కొంత వరకు ఊహించగలను. అందుకే నా మనసులో ఉన్నవరకు మీ ఎదుట పరుస్తూ..
ఈ మధ్య మూడు సార్లు వేటూరి గారు కళ్ళెదుటకో/తలపుల్లోకి వచ్చారు..

ఒక
మిత్రుని ఈ-లేఖ ద్వారాగా

ఓసారి
ఎవరో ఆయన్ని మీరు రెండర్థాల పాటలెందుకు రాస్తారు అంటే, ఆయన సమాధానం -
"చందమామలో మచ్చని మెచ్చని సచ్చినోళ్ళదా సరసత? వేపపువ్వులో తీపిని వెదికే తేనెటీగదే రసికత."

అనుకోకుండా ఒక రోజు - చేతిలో ఉన్న పుస్తకం మీద నుంచి టీవీలో వస్తున్న ప్రోగ్రాం మీదకి దృష్టి/చెవి నిలిపించిన దృశ్యం - వేటూరి గారి చిరు ప్రసంగం. ఆయనకి ఏదో అవార్డ్ ఇచ్చినట్లున్నారు. ప్రక్కన దాసరి గారు. "అయ్యో! ఈ మనిషేమిటి ఇంతలా పాడయిపోయారు. తెలియని దీనత్వం, నిర్లిప్తత [నాకలా అనిపించింది]
కళ్ళలో కొట్టొచ్చినట్లు కనపడుతూ.." అనుకున్నాను.

అలాగే ఈ మధ్యన దాదాపు రోజూ చూస్తున్న ఒకరి బ్లాగులో ఉటంకించిన వేటూరి గారి పాట లోని పదాలు పరిచితం గా ఉన్నా వెంటనే జ్ఞప్తికి రాలేదు. కనుక గుర్తుకు వచ్చిన ప్రతిసారీ ఇది కావచ్చునేమో అనుకున్న పాట పాడుకోవటం..కాదని తల వూపేసుకుని మరో పాట తట్టేవరకు వాయిదా వేయటం.


రకంగా రోజూ కాకపోయినా తరుచుగా తలుచున్నాను.

*******************************************

సిడ్నీలో ఉండగా యన్. టి. రామారావు
గారు చనిపోయినపుడు మర్నాటి ఉదయం జరిగే సంతాపసభకి నన్ను రమ్మనమని నాలుగు మాటలు చెప్పమని ఆ నిర్వాహకులు అడిగారు. అందరి పెద్దల సమక్షం లో ఆయన్ని గూర్చి నేను ఏమి చెప్పగలను అని సందేహం వ్యక్తపరిస్తే, నన్ను పిలిచిన వ్యక్తి ఒకమాట చెప్పారు "ఉష, ఇది ఆయనకి మాజీ ముఖ్యమంత్రిగా కాదు. ఒక కళాకారునిగా తెలుగు సినీ రంగానికి చూడామణిగా అంజలి ఘటిస్తున్న సభ. అందుకే కళల పట్ల అభిమానం కలిగి, తెలుగులో ఉచ్చారణ దోషం లేకుండా మాట్లాడగల నిన్ను అడుగుతున్నాము." అన్నారు.

ఆ రాత్రి కూర్చుని రాసుకున్న ఆ నాలుగు మాటల కి ముందు మాట ఈ శ్లోకమే. తిరిగి వేటూరి గారు కూడా అక్కడికే తరలిపోయారు అనుకోగానే తోచింది. జననానికి, మరణానికి ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఇది అందరికీను. కానీ కళాకారులకి స్థలకాల పరిధులు లేవు, జరామరణాలు ఉండవు. దేహాంతమే కానీ వారి జ్ఞాపకాలు చిరంజీవులు. "ఏ పాట నే పాడను, బతుకే పాటైన.." అన్న ఆయన పదాల్నే అరువడిగి నాకు తెలిసిన ఆయన పాటలన్నీ మాలగాచేసి ఆయనకి సమర్పించటం తప్పా
.

ఎందుకో
ఎప్పుడూ ఆ ప్రక్కగా వెళ్ళినా లోనికి వెళ్ళలేదు. ఇవాళ ఈ శ్మశానంలో కాసేపు గడిపి వచ్చాను. ఎందరివో సమాధులు, అయినవారి వేదనలు. నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్నారేమో వారంతా. ఈ సమాధి చూడగానే ఫొటో తీయాలనిపించింది. ఆ పూల వనంలో ఎన్ని ఆత్మలో...


వేటూరి అంతే ... పాటల పూల పరిమళాల్లో తేలి వస్తూనే ఉంటారు. సమాధి కాని పదాలు ఆయనని సజీవులుగా ఉంచుతూనే ఉంటాయి. నారుమళ్ళలో పైరగాలి తాకిడిలా ఆయన పాటలకి అద్దిన స్వర రచనలు మరెన్నో గొంతుల్లో సానపెట్టబడుతూనే ఉంటాయి, మరిన్ని చెవుల్లో రింగుమని మ్రోగుతూనే ఉంటాయి.

వేటూరి వారు మరే సీమలనో తన పాటలతో తరింపచేయటానికి వెళ్ళుంటారు. చివరి కోరికా చెప్పి తీర్పించుకుంటూ ఉండి ఉంటారు కానీ నాకు మాత్రం ఆయన్ని పరిచయం చేసిన పాటలతో నాతోనే ఉంటారు. నా నోట పలికే తన పాటల్లో వసిస్తుంటారు నా శ్వాస తుదవరకు.


ఏమిటో మళ్ళీ ఇదెవరి గొంతు? మనస్సాక్షిదా "
అమ్మని మరుస్తాం, ఆత్మీయుల్ని ఏమారుస్తాం కాదా? ఈ బ్రతుకు బండి లాగడానికి తప్పదుగా. ఇంకా ఎన్నో చేస్తాం, పాడు దేముడు ముందుగానే నుదిటి వ్రాత ఇలా రాసివుంచాడు. ఇక్కడా మరొకరికి, పైవాడికో పక్కవాడికో అంటగట్టాలనే వృధా ప్రయాస. నిష్టూరాలకి దొరక్కుండా పారిపోవాలన్న విఫల ప్రయత్నం.

చాలా చాలా గుండె కోతగావుంది. నాకు తెలియని ఎక్కడికో, ఇంక వెనక్కి రామని వదిలి వెళ్ళినవారంతా నా కంటి నీటి తీర్థం పుచ్చుకోను తిరిగి వచ్చారులా వుంది." అయినా
కొన్నిసార్లైనా మనస్సాక్షిని ఎదిరించి నిలవగలుగుతాం.

వస్తూనే ఉంటుంది మరణం అనుకోని సమయాన..పునరావృతం చేస్తూనే ఈ సంవేదనని..కానీ కొందరు మాత్రం మరణాన జీవిస్తుంటారు, అయినవారి, అభిమానించేవారి గుండె లయలో.

చీకటి-నిశ్శబ్దం

చుట్టూగోడలు కట్టుకున్నాయా,
గదిలోపల బందీలా?
ఏదైతేనేం ఒంటరి కానపుడు,
వెలుగు వైపు అడుగు పడనపుడు?

గది లోపల సహవాసులు చీకటి,
సవ్వడికి వణుకుతూ నిశ్శబ్దం.
తీయని తెర వెనుక నాటకం,
పాత్రలన్నిటికీ ఒకటే స్వరం.

కిటికీ పగుళ్లలోంచి
వెలుగు దొంగ జొరబాటు,
మారని బల్లితో సావాసం
రెక్కల పురుగు గ్రహపాటు.

ఓరగ మూసిన తలుపు మీద
అగంతకుల వేలి ముద్రలు,
తీరని కలల బతుకు మీదా
అ/పరిచితుల వీలునామాలు.

చీకటికి భాష అలవడింది,
స్తబ్దతకి ఘోష అర్థమైంది.
మలగని దీపాలు తలుపుతడితే,
నిశ్శబ్దం దూరతీరాలకి నడిచిపోయింది..

***************************
పట్ట పగలు పచ్చని పచ్చిక మీద ఆడుకుంటూ పాడుకుంటున్న పిట్టల పాటలు వింటూ పరవశించాల్సిన మనసు ఈ పదాలు రాసిందంటే ఏమిటర్థం? ఏమీ లేదు :) కాకపొతే నాకు బాగా నచ్చిన ఒక అభిప్రాయాన్ని ఇక్కడ పంచులోవాలనిపిస్తుంది.. మరి కొందరికి "నిజంగానే కదా" అనిపించవచ్చని..." కవిత్వం ప్రధానంగా వైయుక్తికము అంటే, యుక్తికి సంబంధించినది అని -- అంటే, దీన్నో థీరమ్లా అబ్జెక్టివ్ గా ఏది గొప్పది, ఏది తక్కువ అని నిర్ధారించలేం.."

మనమిక ఈలపాట రఘురామయ్య లేదూ మరో ఈడియట్!

తిరుపతి వేంకట కవుల భారత నాటకాలలో కృష్ణ పాత్రలో రఘురామయ్య గారు


..కనుక మనమిక ఈలపాట రఘురామయ్య [ఈలపాట రఘురామయ్యగా ప్రఖ్యాతిచెందిన కల్యాణం వెంకట సుబ్బయ్య గారిని గూర్చి తెలియనివారు ఆయన పేరు మీద నొక్కి చదువుకోండి] లేదూ మరో ఈడియట్.

“second place is the first loser.”

అయితే అవవచ్చు గాక అనుకుని ఆ మొదటి స్థానం భగవంతునికే వదిలేసి... నాకు నేను "“second place is the winner over third place.” అని గడుపుతూండగా మిగిలినవారంతా మొక్కులు, ముడుపులు, పొర్లు దండాలతో [a.k.a. దీక్ష, పట్టుదల, సాధన] తో నన్ను నెట్టివేసారని ఇక ఇప్పుడు నా వెనుక ఉన్నది మరొక్కరే, నా నీడ, అని గ్రహించి ఇంతవరకు రాని పని ఒక్కటైనా సాధించలేనా అనుకుంటుండగా నాన్నగారి మాటలు గుర్తుకువచ్చాయి.

తనకి చిన్నప్పుడు నత్తి ఉండేదట. పెద్దలెవరో నివారణ చెప్తే ఉదయాన్నే గోదావరి కాలువ దగ్గర గులకరాళ్ళు గొంతులో ఉంచుకుని, ఎలుగెత్తి అరిచేవారట. క్రమంగా నత్తి పోయిందట. అలాగే నాన్నగారి స్వానుభావపు మరెన్నో కథనాలు వినివున్నాను. సరే ఇక సాయంత్రం మళ్ళీ బైక్ తొక్కటం మొదలెడదామని 3 idiots చిత్రం లోని ఈపాట వింటూ సింగ్ అలాంగ్ చేస్తుండగా హఠాత్తుగా ఈ పార్ట్ నుంచి నేనూ ఈల వేయగలిగానని గమనించాను. అదీ రాని విద్యనే. ప్రయత్నించినంత కాలం రానిది అనుకోకుండా పట్టుబడింది. వచ్చేసిందోచ్...


దిల్ జో తేరా బాత్ బాత్ పె గబ్రాయె
దిల్ పె రఖ్ కే హాత్ ఉసే తు ఫుస్లా లే
దిల్ ఇడియట్ హై ప్యార్ సే ఉస్కో సంఝ లే హొంత్ ఘుమ
సీటి బజా
సీటి బజా కే బోల్
భయ్యా ఆల్ ఇజ్ వెల్

దీనికి వివరణ ఇవ్వలేను. 'మనసు లోని భావనకి ఈ పాటలోని పదాలకి సరిపడిందా, ఎక్కడో లోలోపల ఈల నేర్చుకోవాలనున్నా తెలియని జంకు ఆపిందా, లేదా ఆలోచన అటుగా ఉంది కనుక వెలికి వచ్చి సాకారమైందా నాకు తెలియదు. అసలిలా అన్నిటికీ కారణాలు, analysis ఎందుకూ,' అని విసుకొచ్చి, 'అంతే నాకు వచ్చేసింది కనుక మనమిక ఈలలో మరీ లైన్ చివర కాదు ముందుకు జరిగాం,' అని సర్దిచెప్పుకుని సంబరపడ్డాను.

నెమలి ఈకలు

ఈ శీర్షిక చూడగానే నోట్ బుక్స్ గుర్తువచ్చాయా అని అడగను. మీరంతా ఎంతో పదిలంగా దాచుకున్న ఈకలు నా మీద వీవెనల ఉప్పెనలై విరుచుకుపడతాయి. అయినా ఈకలు పుస్తకం పుటల్లో బతకడవేవిటి? వాటికి లేత తాటాకు బూజు భోజనమేవిటి? అవి పిల్లలు పెడతమేవిటీ? దొరికిన ఈకని దాచిపెట్టిన మర్నాటి నుంచీ ఈక పిల్లలు పెట్టిందా లేదా అని ఆరాలు తీయటమేవిటీ.. కదా?

అదే బాల్యం మహిమ. అప్పటికి మనసుకి తెలిసేది మమతలొకటే. ఆ మమతలు పోషించే మానవత్వం ఆ పనులన్నీ చేయిస్తుందేమో. ఇప్పటికీ నెమలి ఈక కనపడగానే దాయాలనే మనసు పీకుతుంది.


నాకు మరొక రకం నెమలి ఈకలు గురించి తెలిసింది. వాటి గురించే ఈ టపా.

నా బ్లాగు చదివే వారికి తెలిసే ఉంటుంది నేను ఆస్ట్రేలియా లో కొంత కాలం నివసించాక అమెరికా కి వచ్చానని. మేము అక్కడకి వెళ్ళిన నెల లోపే ఉద్యోగం గురించిన ఇంటర్వ్యూ కి వెళ్ళటం తటస్థిమ్చింది. అప్పటికి ఇంకా అక్కడి వారి యాస నాకు అబ్బలేదు. కాస్త ఇబ్బంది కనుక అవసరపడినంత వరకే మాట్లాడటం ఉండేది.

రైల్లో ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తుండగా ఒక విచిత్ర వేషధారణలో ఉన్న వ్యక్తి కనపడ్డాడు. అంత దాకా ఏవో దిగులు, గుబులు కమ్మిన మనసు ఒక్కసారిగా సంభ్రమం లో మునిగిపోయింది. అతను దాదాపుగా మన కోయదొరల్లా ఉన్నాడు. ఈత ఆకు తలలో పెట్టుకుని, మెడలో రంగు రంగుల పూసలు, చేతిలో నెమలి ఈక. ఇంకా ఏవేవో ఉన్నా నాకివే గుర్తు ఉన్నాయి.

అంతే టకా టకా నా చిన్నప్పటి నుంచి నేను దాచుకున్న నెమలి ఈక ఇండియాలోనే మర్చిపోయి ఆస్ట్రేలియాకి వచ్చేసానన్న బాధ ముంచుకు వచ్చేసింది. కానీ అతన్ని అడగాలంటే మొహమాటం. బెరుకు. వాళ్ళు అక్కడి అబారిజినీ తెగలు అని తర్వాత తెలిసింది. అందరూ కాకపోయినా అక్కడక్కడా అలా తయరయి కనపడతారు.


అలా అప్పుడప్పుడు నెమలిని తలుచుకుంటేనో, ఎక్కడైనా చూడటమో సంభవిస్తే నా ఈక ఎక్కడ పోయిందో, పెట్టిన చోటనే ఉందో అని ఆలోచన కలిగేది. కానీ ఈ రోజు ఈ కొత్త నెమలి ఈకలు దొరికాయి. మీకూ దొరుకుతాయి నా మాట వింటే మరి!

*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

ఓ వేసవి సాయంత్రం. అలా కారులో షికారుకెళ్తుంటే సుమారు ఏడేళ్ళ వయసు పిల్లాడు రోడ్డు వారగా నిలబడి చెయ్యి ఎత్తి ఆపమన్నట్లుగా సైగ చేసాడు. కాస్త సందిగ్ధగా ఆపగానే పక్కకి చూపించాడు. ముద్దుగారే మూడు పిల్లల్ని వెనకేసుకుని ఓ చిన్న బాతు రోడ్డు దాటటానికి వచ్చింది.

ఈ బుడ్డాడు దానికి అంగరక్షకుని మాదిరి అన్నమాట. అది దాటే వరకు నన్ను నిలవరించి "యు ఆర్ నైస్, యు కెన్ గో నౌ" అని దారి వదిలాడు. ఆ దారికాచిన చిన్న పిల్లాడు చూపిన మానవత్వం ఆ పక్షి కూనల రెక్కల సవ్వడిలో ఇప్పటికీ గుర్తు కొస్తుంటుంది. వాడు తప్పక మరిన్ని ప్రాణుల సంరక్షణ చేస్తాడు. వాడి నీలి కళ్ళలో మమత ఒక నదిలా వెల్లువవటం నేను ముదమారా చూసాను.

పదిలంగా మనసు పుటల్లో దాచుకున్న ఈక ఇది. మరెన్నో ఈకల్ని చిత్రించను వాడుకునే తూలికాను. నా పిల్లలిద్దరికీ చాలా సార్లు చెప్తాను ఆ సంఘటన గురించి.


*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

ఇక ఈ ఈక మన నేల మీద పడితే నా మనసులోకి ఎగిరి వచ్చేలా చేసింది దాని తాలూకు మానవత్వపు స్పర్శ. నా సమీప కుటుంబీకులు ఓ నాటి రాత్రి ప్రయాణంలో వారి కారు లారీకి గుద్దుకుని స్పృహ కోల్పోయినప్పటి ఘటన ఇది.

ఒక వేడుకకి వెళ్తున్న కారణం గా వారి వెంట చాలా సొమ్ములు, రొక్కం కూడా ఉన్నాయి. ప్రమాదం జరగగానే ఉన్న ఇద్దరూ దెబ్బలతో తీవ్రమైన నెప్పులతో ఉన్నారు. డ్రైవర్ ది అదే స్థితి. దాదాపుగా ముగ్గురికీ స్పృహ లేని మాటే. ఆ సమయాన ప్రక్కనే ఉన్న చిన్న టీ కొట్టు ఆసామి వారికి కావాల్సిన ప్రధమ చికిత్స చేసి, సమయానికి ఫోన్లవీ చేసి ఇతరత్రా సహాయం అందేలా చేసాడు.

అది కాదు ఇక్కడ గొప్పతనం. వారి సూట్ కేస్ దాచి భద్రంగా వార్త తెలిసి వెళ్ళిన కుటుంబ పెద్దకి చేరవేసాడు. కనీసం పోలీసులకి కూడా తెలియనీయలేదా విషయం. ఒక్క రూపాయ గానీ, ఒక్క నగ గానీ తీసుకోలేదు. ఈ రోజుల్లో అలా రెండు అంకెల పైన లకారాల విలువైన నగా నట్రా ఆశించకుండా సహాయం తో పాటు, సంరక్షించి ఇవ్వటం కూడా అపురూపమైన విషయమే.

ఇంటివారే మోసగిస్తున్న వార్తలు విన్నాక ఆ మనిషి పట్ల నాకు అపారమైన గౌరవాభిమానాలు కలిగాయి. అమ్మ ఈ మాట చెప్పారు. స్వతహాగా మితభాషి అయిన తను ఎంతో ఇదైతే తప్ప బయటకి చెప్పరు. అందుకని ఇది బంగారు నెమలి ఈక.


*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

ఇక ఇది నా స్వానుభవం. తాజా వార్తలు వినటం అదీ పనికి వచ్చే వాతావరణ సూచనలవీ వినటం నాకు రాదు. అలవాటు అవలేదు ఇన్నేళ్ళైనా. అందువలనే మంచి భారీగా స్నో పడే రోజున ఉన్ని దుస్తులు, కార్లో కావాల్సిన సామగ్రి పెట్టుకోవటం మర్చిపోయి రయ్యిన వెళ్ళి ఎక్కడో ఇబ్బందుల్లో పడటం జరుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఖాళీ లంచ్ డబ్బా మూతలతో మంచు గీకాల్సి వస్తుంది. మనతో పని అంతే [అని సన్నిహితుల భావన! :)]

లేదా మంచు కప్పేసిన కారుని వదిలి పైన వెన్నెలని చూస్తూ మైమరిచిపోయో, సన్నగా కదిలే గుర్రాల వెంట కళ్ళు పరిగెట్టిస్తూనో, "ఎటో వెళ్ళిపోయింది మనసు" అని పాడేసుకుంటూ, చివరికి బాహ్య స్పృహ కలిగాక కలీగ్ నో, స్నేహితులనో పిల్చి సాయం అడిగి ఇబ్బంది పెడ్తాను. :( ఆ మాత్రం చెయ్యకపోతే వాళ్ళెందుకటా..

అలాగే వెచ్చగా కంఫర్టర్ లో తొంగున్న పిల్లదాన్ని ఇవాళ సెలవు అన్నా కాళ్ళు పట్టి ఈడ్చి లేపి, స్కూలు దాకా లాక్కెళ్ళి మూసిన తలుపులు చూసాక అది బెంగాలీ కాళీ లా "కాలండర్ చూడవు.." అని మీద పడి రక్కేదాకా తెచ్చుకుంటాను. ఇవి నా గురించి తెలియని వారికి కాస్త తొలి పలుకులు.

సరే అలాంటి దివ్యమైన మరో రోజు అంటే నిన్న గాక మొన్న మంచి భారీ వాన.

ఉదయం లేవగానే రయ్యి రయ్యిన వీస్తున్న గాలులు, జడివాన అలాగే కారు తీసేసి "గరజ్ బరస్ సావన్ గిరి ఆయో.." వింటూ నేనూ కూనిరాగాలు తీసేస్తూ గ్రోసరీ షాప్ కి వెళ్ళిపోయాను. ఇక్కడ ఇరవై నాలుగు గంటలూ తెరిచే ఉంటుందది. అలా తెల్లారుఝామునే వెళ్లటం నాకూ అలవాటే.

కాస్త దూరంగా ఆపి కావాలనే వానలో తడుద్దామని దిగాక, మరీ జోరు వాన కాస్త గొడుగు తెచ్చుకోవాల్సింది అనుకుంటూ, బూట్ లో వెదకటం అనవసరమే తెచ్చి ఉండను అని కూడా అనుకుంటూ నాలుగు అడుగులు వడి వడిగా వేసానో లేదొ వెనక నుంచి దబ దబా పరిగెడుతున్న ధ్వని.

అసలు మనసు ఎందుకలా పొరబడిందో కానీ ఎవరో నాకేదో హాని చెయ్యటానికేనేమో అన్న వెర్రి భయం వెన్నులో జర జరా పాక్కుంటూ వచ్చేసింది. ఆ కనుచీకటి వచ్చీరాని వెలుగు, వెనక అగంతుకుడు, కాస్త వేగంగా పెరిగెట్టాను, మా ఇద్దరి మధ్యన దూరం తరగటం తెలుస్తూనే ఉంది. మొత్తానికి దొరికిపోయాను. వగురుస్తూ తన చేతిలోని గొడుగు నాకూ పట్టి [అతని ఆంగ్ల సంభాషణ నేను తెలుగులో చెప్తున్నాను] "ఈ చలిగాలిలో అలా తడుస్తుంటే ఎందుకో సాయపడాలనిపించింది. ఓ పక్కన నీకు అది అపార్థం గా తోస్తుందేమో అనుకున్నాను. కానీ నీకు గొడుగు పంచాలనే పరిగెట్టి వచ్చాను." అన్నారు.

ఆ తర్వాత మేము కలిసి వేసిన ఆ పది అడుగులూ నాకు నా అపరాధభావనకి, అతని మానవత్వానికి కంటినీరు వస్తూనే ఉంది. పరిచితులా అపరిచితులా అని కాదు మనకి తోడుగా రావటమన్నది మానవత్వం కదిపిన అడుగే కదా. ఇది మూడో ఈక.


సత్యనారాయణ స్వామి వ్రత కథల్లా ఇంకెన్ని ఈకలు, కొబ్బరి కాయలు అంటారా.. ఇక చివరిదేలే...

*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

నాకు తొలి కాన్పుకి ఇక పది పదిహేను రోజుల గడువు. అంతకు పూర్వం నెల క్రితం నన్ను వెంటబెట్టుకు పుట్టింటికి తీసుకువెళ్ళటానికి వచ్చిన అమ్మ అనుకోని పరిస్థితిలో హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయించాల్సిన స్థితికి వెళ్ళారు. సర్జరీ రేపనగా అమ్మమ్మ గారు మరణించారు.

అప్పటికి ఆపరేషన్ మానినా జరిగేవి జరగక మానవిక అని, వైద్య నిపుణులు దొరకరనీ, అమ్మని ఇంకా ఆ బోన్ మూలాన నెప్పి భరించనీయకూడదని, ఇలా ఓ పక్కన మా చేతలకి సమాధానం వెదుక్కుంటూ, నచ్చజెప్పుకుంటూ, అక్క, నేను ఇలా ఎవరం కనపడకపోయినా అమ్మకి అనుమానం వస్తుందని కాస్త బాధ ఓర్చుకుని అందరం అక్కడే ఉండి, ఏమీ కానట్లు నటిస్తూ, ఓ ప్రక్కన తను ఒక్కరే కూతురు కదా, ఇలా దాచి తప్పు చేస్తున్నామాని బాధ పడ్తూ, మర్నాడు ఆపరేషన్ చేయించాము.

ఎనిమిది గంటల మేజర్ సర్జరీ అలా నిలబడి ఉన్నాం. అనుకున్నదాని కన్నా రక్తం ఎక్కించాల్సిన అవసరం కలిగిందని, ఆ వారా మేము డొనర్స్ తెచ్చి రీప్లేస్ చేయించాలని అప్పటికప్పుడు చెప్పారు. నాకు నీరసం, నిస్సత్తువ, మిగిలిన వారికి అమ్మ కన్నా నా గురించి ఆదుర్దా. తెలుస్తున్నా ఇంటికి వెళ్ళి ఒక్కదాన్నీ ఉండలేనని అక్కడే ఉంటానని వేళ్ళాడుతున్నాను.

ఈ స్థితిలో హాస్పటల్ వాళ్ళు వత్తిడి. రక్తం బాటిల్స్ కి డబ్బు కడతామంటే అలా కాదు అన్నారు. ఇది జరిగి కొన్ని సంవత్సరాలు కనుక నియమాలు మారి ఉండొచ్చు. ఎలాగా అని తర్జన భర్జనలో ఉండగా మా స్నేహితులొకరిని దింపటానికి వచ్చిన ఆయన విషయం కనుక్కుని మరో ఆలోచన లేకుండా నేను ఇస్తాను అని చక చకా ఆ కార్యక్రమం పూర్తి చేసారు.

ఆయన వెళ్ళేముందు కృతజ్ఞత తెలుపుదామని వెళ్ళాను కానీ నా శారీరక అలసటకి, ఆ క్షణం ఉన్న ఎమోషనల్ మూడ్ కి మాటకి ముందే గొంతు పూడుకుపోయి, జోడించిన చేతులు, కంటి నీరు తప్పా నాకు మాట రాలేదు. "ఛా అదేంటమ్మా, ఊరుకో, నిండు నెలల మీద ఉన్నావు, బాధ పడకూడదు. నేను చేసినదేముంది." అంటూ వారించి వెళ్ళిపోయారు. కనీసం పేరైనా అడగలేకపోయాను. కానీ ఈ రోజుకీ ఎవరైనా వైద్య సహాయం అనగానే నాకు తోచినది అందించటానికి స్ఫూర్తి ఆయన కావచ్చు. ఇది బరువైన ఈక.


*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

ఇలా పుటలు తిరగబడుతుంటే మమతల, మానవత్వపు రెప రెపల ఈకలు జారిపడుతున్నాయి. నిజానికి ఒక్కో ఈక మరో వేయి ఈకల్ని పెట్టినట్లే అనిపిస్తుంది. ఎమోషనల్ ప్లేన్ లో మెసిలే నా బోటి మనిషికి అతి సాధారణ విషయాలు ప్రత్యేకంగా కనపడతాయేమో అంటారా. కానే కాదు, సరైన రూపునే కనపడతాయి. ఇలాంటివి తలుచుకుంటే ఏదో భరోసా. మన చుట్టూ ఉన్న నలుగురిలోనే తన ఉనికి చూపే మమతానురాగాలు పల్లవిస్తూనే ఉంటాయని.

కొసమెరుపు, చిన్నప్పుడు 'చీలిది' అని ఎవరైనా అంటే [నాది అన్న ఏదైనా వదిలే రకాన్ని కాదు, మాట వరసకి ఇది నీదని అన్నారో దాన్ని చావో రేవో నా సొతం చేసుకునేదాక వదిలేదాన్ని కాదు, అందుకు ఆ పేరు], ఉడుక్కుంటుంటే మా నానమ్మ గారు "వాళ్ళంటే మట్టుకు నువ్వు అయిపోతావారా ఉషమ్మడు" అని ఊరడించేవారు. ఇప్పుడు ఎవరైనా మీరు మంచివారు, మమతలెరిగిన వారు అంటే నా మనసు "వాళ్ళంటే మట్టుకు నువ్వు అయిపోతావారా ఉషమ్మడు" అని ఉడికిస్తుంటుంది.

నిజానికి "చీలిరాకాసి" నా మనసే కానీ ఇలా అప్పుడప్పుడు రక రకాల నెమలి ఈకలు తీసి, విసన కర్రలు కట్టి ఇస్తుంటుంది. ఆ వీవెనలతో గాలి వీచుకుంటూ, ఇదిగో ఇలా నేను మిమ్మల్ని మీ ఈకలు ఏవని వివరం ఆడుగుతూ.. ఇవే కాక వివిధ రకాల మనస్థితికి ఆయా ఈకలు సమయానికి తమ పుటల్నుంచి జారిపడతాయి.


ఎలా ఉన్నాయి నా నెమలి ఈకలు అనను, ఇలాంటివి అందరికీ ఉంటాయి. వేటి విలువ వాటిదే. అందరం భాగ్యశాలులమే.

అష్టాచెమ్మా/కర్రాబిళ్ళ/చార్ పత్తర్ .. (కోచింగ్ ఇవ్వబడును, పిల్లలు/పంతుళ్ళు కావలెను)

"వానా వానా వల్లప్పా చేతులు చాచు చెల్లప్పా తిరుగు తిరుగు తిమ్మప్పా తిరగలేను నరసప్పా..." మొన్న వానలోకి వెళ్లగానే నోటిమీద తారాడిన పాట. మనసు కోరుకుని చిన్నతనపు రోజుల్లోకి మళ్ళిందా, ఆ చిన్నతనపు పుట యధాలాపంగా తెరుచుకుపోయి జల జలా రాలాయా ఆటలు, వేడుకలు మూటలు?

వాన పడని ప్రాంతాలవారు, లేదూ ఈ టపా కాస్త వర్షం పడుతున్నప్పటి వాతావరణంలో చదవాలనుకునేవారు ఇక్కడ నొక్కి మిగిలిన భాగం చదువుకోండి.

ఏమైందో తెలియదు కానీ "అష్టాచెమ్మా, కర్ర బిళ్ళ, ఏడు పెంకులాట, గోదారి కాలవలో ఈతలు, ముంజెల బండి, కోతి కొమ్మచ్చి, నేలబండ, పైరాకు-పచ్చనాకు, సబ్ జావ్ ఇండోర్, ఏడు పెంకులాట, వెన్నెల్లో వెన్నముద్ద, వైకుంఠపాళి, వామనగుంటలు, చింతగింజలాటలు, తొక్కుడుబిళ్ళ, బంక మట్టి బొమ్మలు, గోళీలాటలు, తాటాకు బొమ్మల పెళ్ళిళ్ళు, కబడ్డీ, కోకో, చార్ పత్తర్, స్తంభాలాట, కోలాటాలు, పూలజడలు, ముంగిట ముగ్గులు..." వాన జల్లు కన్నా వేగంగా మనసుని చుట్టుముట్టి మీద పడ్డాయి.

అన్నీ విప్పి మీకిలా మాటల ఊటలుగా జారవిడుస్తూ..
అలాగే ఇది ఒక వ్యాసం కాదు కనుక ఒక పద్దతిగా రాయలేను. అలా మస్తిష్కం లో మెదులుతున్నవి ఇలా దింపేస్తున్నాను, మరొక్కరికైనా అమాయకపు బాల్యం తాలూకు స్ఫూర్తిని/ప్రేరణనీ ఇవ్వకపోతాయాని పేరాశ పడుతూ మరీ.

ఇక శీర్షిక చూసి నమ్మి వచ్చిన వారికి, బడి, పిల్లకాయలు, పంతుళ్ళు అంతా మనమే... మననం చేద్దాం, మరిచిపోలేనివి, మర్చిపోయినవీ ఒకరికొకరు చెప్పుకుందాం. నా అనుభవం వరకు నేను ఆడిన ఆటలు, ఈ తీరాన ఎలా ఎన్ని మేమూ ఆడి పిల్లలకీ నేర్పగలుతున్నాము అని పంచుకుంటున్నాను. అందువలన ఇక్కడ పాఠాలు లేవూ, వల్లె వేయటాలూ లేవు - అంతా వట్టిదే. :) అక్కడక్కడా ప్రశ్నలు వేయబడును. తమకి తోచిన సమాధానాలు రాసుకుని లేదా ఇక్కడ రాసి వెళ్లండి.
  • ముంజెల బండి నడపడం ఎందరికి వచ్చును? పోనీ ముంజెలు తినటం ఎందరికి తెలుసు?
దీనికి మీరే తిన్న మూడు తాటికాయలు, ఓ కర్ర కావాలి. మిగిలిన సమాచారం కొరకు మీ ఊరు వెళ్ళిరండి. లేత కొబ్బరి నీళ్ళలో ముంజెలు వేసి కాస్త చల్లబరిచి తింటే దాన్ని మించిన డిసర్ట్ లేదని నాకు నమ్మకం.


గచ్చకాయలు, అచ్చంగిల్లాలు ఆడని అరచేతికి ఎన్ని గోరింటలు పెట్టినా అందం రాదు. నేర్పుగా ఒకటి ఎగరేసి మిగిలిన నాల్గిట్టితో రకరకలా విన్యాసం చెయ్యని వేళ్ళకి వీణ మీటినా ఆ గొప్పతనం రాదు! కాదా?

  • "తొక్కుడుబిళ్ళా ఆడే నాతో" ఇది ఎవరు సినిమాలో పాడారు?
జాలం లోకి వెళ్ళకుండా మీ జ్ఞప్తుల్లోకి తొంగి చూసి చెప్పగలరేమో ప్రయత్నించండి. పిల్లలూ మీకు మాత్రం ఇది ఓపెన్ బుక్ ఎగ్జాం, కనుక చీటీలు తెచ్చుకున్నా, గైడ్స్ మోసుకొచ్చినా, అయ్యోరికి మస్కా కొట్టినా వాకే. ఇక్కడివారు హాప్ స్కాట్చ్ అని ఆడతారు ఇదే.
  • ఈతపళ్ళు కాక ఇంకేమేమి మీ పొలం గట్ల మీద చూసిన/తిన్న/తాగిన :) గుర్తు?
మా మళ్ళకి కట్టామంతా ఈత, తాటి చెట్లే. కల్లు గీసే వెంకటెసు, బాసి గాడు నాకు దోస్తులే కనుక గెలలు దింపించటం, పండేయటం అన్నీ అలా సాఫీగా జరిగిపోయేవి [కాస్త అప్పటి గరాణా (మేం ముందు ప్రెసిడెంటు గారి మనవలం, తర్వాత మేనకోడళ్ళం కనుక మా మాటే చెల్లేది.)]. ఇంకా పుల్ల రేగి (క్రాన్ బెరీ కి ట్విన్స్), సీమచింత, గొబ్బిపూలు చాలా వుండేవి.

అప్పుడప్పుడు పక్క ఊరినుంచి వచ్చే బంజారా స్త్రీ దగ్గర గిద్ద బియ్యానికి రెండు గిద్దలు దుద్ది పళ్ళు (అచ్చంగా ఇక్కడి చెర్రీల్లా ఉండేవి) కొని లాగించేసేవాళ్ళం. జీడి మామిడి ముక్కల్లో ఉప్పూ కారం అద్దుకుని, నోరు కొట్టుకుపోయేదాకా తిన్న మధ్యాహ్నాలు మరవగలమా?నాలుగు గింజలు కలిపి పుంజీ, రెండు పుంజీలు ఒక కట్టు, ఐదు కట్టులు ఒక గుర్రం...

చింతగింజలాటలో నిష్ణాతులెవరైనా ఎన్ని గుర్రాలు కలిస్తే ఒక ఏనుగు అవగలదో, ఆ లెక్క చెప్పగలరని గంపెడాశ. అప్పుడు అమ్మమ్మ గారిని నెగ్గలేదు కానీ ఇప్పుడు వచ్చీరాని ఆటగాళ్లలో మనమే ఆముద వృక్షం ;) (ఏ చెట్టూ లేకపోతే ఆముదం చెట్టే మహవృక్షం - ఒకనాటి పెద్దలు). ఇదిగో ఇవాళ కూడా ఆడేసి మా ఆమ్మాయి మీద నెగ్గేసా.. ఇండియన్ గ్రోసరీ షాప్ వాడి చింతపండంతా గింజలేనని గుంజుకున్నాగానీ ఇలా పనికొచ్చాయిలే అని సరిపెట్టుకుంటాం, మా స్నేహితులమంతా.

ఇలా పట్టిన గింజలు చేయి తిప్పి కంగ కుండా పట్టటం లో నేర్పరి ఎవరో ;)


ఆట మొత్తానికి ఇలా ముందు పట్టు పట్టి గింజలు జారవిడవకుండా పుంజీలుగా తీయటం పెద్ద విద్య.


చిన్నప్పటి దొంగదారి ఆట ఇది :) నా వంటి ఆటలో అరటి పండుని అమ్మమ్మ గారు వంటి ఘనాపాటీలు జాలి పడి ఆడనిచ్చేవారన్న మాట!


ఇది కాస్త వెన్ను ముదిరాక మొనగాళ్ళ ఆట. ;) పక్క గింజని తాకకుండా మనం పట్టిన గింజ లాఘవంగా తీయటం..

మా ఊర్లో గొడవల కారణంగా సగం నిర్మాణంలో ఆగిపోయిన రామాలయం ఉంది. ఇప్పుడు ఆ గొడవలు చేసినవారు, తెలిసినవారు గానీ లేరు. ఆ కట్టడాన్ని "బోడిమేడ" అంటారు. ఒక్క రామనవమికి మాత్రం పానకాలు అక్కడి నుంచే ఇళ్ళకి పంపుతారు, ఆ సందడి అంతా కుర్రకారుదే. పోతే, నా చిన్ననాటి నుంచీ మారనిది - అక్కడ రచ్చబండ మాదిరి దృశ్యం. ఆ అరుగుల మీదే తెగ పోటాపోటిలుగా సాగేవి దాడి, పులి-మేక, ఇప్పటికీ పేకాటలు లేదా పిచ్చాపాటీలు సాగుతున్నాయి.

నాకు
ఆడటం రాదు కానీ పిల్లలకి నేర్పాలని దాడి, పులి-మేక బోర్డ్స్ కొన్నాను.
అన్నట్లు చెన్నై లో క్రీడ అన్న సంస్థ దగ్గర చక్కగా అన్నీ దొరికాయి. ఇక్కడ పెట్టిన ఆ సాంప్రదాయ ఆటసామగ్రి అంతా వారి నుంచే కొన్నాను.


అష్టాచెమ్మా నేను ఇక్కడి పిల్లలతో ఎక్కువగా ఆడినది. నా తెలుగు బడి పిల్లలకి కొందరికి ఈ ఆట చాలా ఇష్టం. ఆ అట్ట మీద అలా గీసి తయారు చేసుకున్న అనుభూతి, చిన్నప్పుడు దీపావళికి మతాబులు, సిసింద్రీలు చుట్టినంత గాఢంగా అనిపించింది.


పులి-మేక నాకు నచ్చదు నిజంగానే


అప్పట్లో కాస్త వయోలెంట్ ఆట - ఇప్పటి హేలో కన్నా కాదు కాని

  • దాడి, పులి-మేక, అష్టాచెమ్మ - మీకు ఎక్కువగా ఏది ఇష్టం? ఎందుకు ఇష్టం? చివరిగా ఎప్పుడు ఎక్కడ ఆడారు?

కాస్త మొహమాటంగా ఉంది కానీ "
వామనగుంటలు" మాత్రం మా అమ్మాయి చేతిలో కూడా ఓడిపోతుంటాను. పదేళ్ల పిల్లది ప్రపంచాన్ని నెగ్గినంత ఆర్భాటాలు పోతుంది. ప్చ్..

ఆటనే కాస్త మార్పుగా మాన్ కేలా అని ఇక్కడి పిల్లలు
ఆడతారు. టపా చివరన ఇచ్చిన లింక్స్ లో ఉందా వివరం.ఇక జీవితంలో వైఫల్యాలనీ, ఆనంద శిఖరాలనీ వైకుంఠపాళితో పోల్చనిదెవరు? నలుగురి పయనం ఒకసారే మొదలైనా, నిచ్చెనలు ఎక్కి పరమపదసోపానం చేరేదొకరు, పాము నోటికి చిక్కి చచ్చేదొకరు, చావు బతుకుల నడుమ మినుకు మినుకుమనే ఆశతో నడిచేదొకరు. కాస్త వేదాంతం లా మారింది. మరి ఉగాది పచ్చడి రుచి ఇంకా నాలుక దాటక, కలం లోకి జారిందిలేండి.ఇక "
చార్ పత్తర్" మేము హైదరాబాదు లో నేర్చుకున్న ఆట ఇది. ఇది ఐదుగురాడే ఆట. నాలుగు గదులు, వాటి నడుమ నాలుగు రాళ్ళు ఒకరు కాపు కాస్తుంటే, మిగిలిన నలుగురు కాపలాదారుని ఏమార్చి, కొట్టేసి, ఒక గది కి చేర్చే ప్రహసనం. మేము ఎంత లీనమై పోయేవాళ్ళమంటే చివరికి రాళ్ళతోనే బుర్రలు పగలు కొట్టుకునేంత.. :) ఇంకెవరికైనా తల మీద పడ్డ కుట్లు పలకరిస్తున్నాయా?

కోతి కొమ్మచ్చి, నేలబండ, పైరాకు-పచ్చనాకు, సబ్ జావ్ ఇండోర్, ఏడు పెంకులాట, వెన్నెల్లో వెన్నముద్ద అని మొదలెట్టి చెప్పటం అన్నం, పప్పు వండటం నేర్పటమే. నేలని చితక్కొట్టి వదిలిన ఆటలివి. తల్లి నేల పాపం ఎలా భరించిందో గానీ మా వానరమూక ఆగడాలని.

తంపటేసిన
తేగలు నవులుతూనో, చెరుగ్గడలు పిప్పి చేస్తూనో, రేగివడియాలు చప్పరిస్తూనో అలా అలా అలవోగ్గా నేర్చేసుకుని ఆడేసి దుమ్ము కొట్టిన బట్టలతో, మట్టితో నలుగులు పెట్టుకుని కొండొకచో అమ్మమ్మ గారి చేత దేహశుద్దికి దగ్గరగా వెళ్ళి వచ్చిన వైనాలవి నా వరకు. మరి మీ మాటో?

ఇక అలా అలా పెరిగేస్తూ, నేర్చినవే తాటాకు బొమ్మలు చేయటం, కోలాటాలు. ముక్కోటి తిరనాళ్ళలో గోళీసోడా తాగుతూ గోళీలాటలు చూడటం. ఇది మా అన్న గారి కళ. మనకి దక్కింది ప్రేక్షక స్థానమే.

*** కోలాటం - జడ కోలాటం, ఒకటే కోలాహలం ***

ఇక్కడ గుజరాతీలు దేవి ప్రీత్యర్థం గర్బా నృత్యం చేస్తారు. అది మన కోలాటమే కాస్త మార్పుగా. మొన్న నా కలీగ్ అత్తగారు ఇండియా నుంచి వచ్చారు. ఆవిడ తన డెబ్బైలలో కూడా ఇంకా విసిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వైద్యురాలు. నాతో కోలాటం ఆడతావా అని మేళమాడి కవ్వించారు. కాస్త పంతంగా దిగాను. అలా ఇద్దరం గంట నాన్ స్టాప్ కోలాటం. దెబ్బకి ఇప్పుడు పట్టిన పిచ్చి జడకోలాటం. వచ్చే ఉగాదికి అభినయించాలని మందిని పోగేయటం, సాధన మొదలు పెట్టాను.

  • తప్పెటగుళ్ళు అంటే ఏమిటి? అసలా గ్రామీణ క్రీడని చూసారా?

ఇక వేసవి సెలవులకి ఆటలంతా పిచ్చి పూలజడలు, మల్లెలు. మా ఊర్లో కన్నా, నందిగామలోనే ఎక్కువ. పక్కింటి ఖాన్ ఆంటీ గారు [మ్చ్.. అలానే పిలిచేవారం, కనీసం పేరు అడిగానో లేదో, అయినా నిండా ఏడేళ్ళు లేవు కనుక అప్పటికి అది అమర్యాద కాదు] మధ్య మధ్యలో పట్టు గుడ్డలతో చేసిన మొగ్గలు పెట్టి మరీ జడ వేసే వారు. దిష్టి తగలకుండా అలా వేసేవారని అమ్మ తర్వాత చెప్పారు.ఇదిగో
ఇంకా ఇలా ఇరుగమ్మనీ పొరుగమ్మనీ బతిమాలుకుని పోగేసి మనం మూడు మూరలు కొప్పులోకి తురిమేయటం, ఒక్క విషయంలో ఇంకా అమ్మ స్థాయి త్యాగాలకి అలవాటు పడలేదు మరి. :) అన్నెం పున్నెం ఎరగని కూతురికి రాళ్ళ పూల జడలు, చివర్లో కుప్పెలకి బదులు అర మూర మాల. పైగా అదో కొత్త వెరయిటీ/రకం కేశాలంకరణ అని మురిపించటం. ఇక్కడ సవరాలు దొరకవండి, ఇవి మా సహజ కురులే. అర్జునుడి బాణాల వారు మామీద ఎప్పుడో చెమక్కు విసిరారు స్త్రీలు జడలు, పూలు వదిలారని. మరి పంచెకట్టులు, తలపాగాలు వదిలినవారెవరో. :)చివరిగా ఇక్కడి ఆటల్లో నేనూ మునిగి తేలేది ట్రయామినీస్ లోనే... పిల్లలకి ఆట, లెక్కలు అన్నీ నేర్పొచ్చు. ప్రయత్నించి కొని ఆడించండి/ఆడండి. ఇదే కాదు ఇంకా చాలా ఆడతాను. ఒక విధం గా నాకు పిల్లలకోడి అని కూడా పేరులేండి. ఆరు ప్రాణాలతో అహర్నిశలు అల్లరే..


కారంస్లో రెడ్ వేసినట్లే ఆటలో ఇలా బ్రిడ్జ్ కట్టటం చాలా కష్టం.. కానీ అసాధ్యం కాదు.


ఈత ఇంక మునుపటి జోరులో లేదు కానీ ఆక్వా ఏరోబిక్స్ మూలాన కాస్త గోదారి కాలవ, కృష్ణమ్మ నది స్నానాలు అవీ మరీ బెంగ పెట్టవు.

  • స్విమ్మింగ్ పూల్ లోకి పైన దాదాపు పద్దెనిమి అడుగుల ఎత్తున ఉన్న డెక్ ఎక్కి, వెనక్కి తిరిగి ఎందరు దూకారు? పొట్టకి దెబ్బ తగలకుండా ఎందరు డైవ్చేయగలరు? (ఇవే ఇప్పటికి పూల్ ఆటల వరకు ఒక గెలుపు, ఒక ఓటమి నాకు)

కబడ్డీ, కోకో మధ్యనే వేసవికి ఒకటి, రెండు సార్లు పార్క్ లో పిక్నిక్/ వన భోజనాలు గా కలిసి ఆడటం మొదలు పెట్టాము. కొందరు గజ ఆటగాళ్ళు, కొందరు వర్థమాన తారలూను. అలాగే తాడాట, ఒప్పులకుప్ప అవీను. అసలు కబడ్డీ అంటే చేతి మీద మచ్చలు వెక్కిరిస్తున్నాయి.

ఒప్పులకుప్ప
వయ్యరి భామ
గూట్లో రూపాయ్
నీ మొగుడు సిపాయ్

ఇప్పటికీ నచ్చని పాట, అది కాక మరేమీ గుర్తుకూ రాదు అలా తిరిగేప్పుడు. పిల్లలూ తెగ ఉత్సాహపడి తిప్పమని
అడుగుతుంటారు.అలాగే ముగ్గులు. నాకు వచ్చినవేవీ మర్చిపోలేదు. ఇప్పటికీ అలా వేసుకుపోయే ముగ్గు ఇది. మొన్నా మధ్య ఆఫీస్ లో వేస్తే, ఎన్ని రోజులకి నాకు వస్తది నేర్చికోవాలంటేనని అడిగారు కలీగ్ ఒకరు. సమాధానం మీరు చెప్పండి మరి.

ఇలా చెప్పుకుపోతే టపా ముగియదు. జ్ఞాపకాల వెల్లువ లో కొట్టుకుపోతాము. అక్కడే బొంగరాలాటలు ఆడుతూ, వీరీ వీరీ గుమ్మడిపండు అంటూ నిలిచిపోతాం. కనుక ఇక ముగిస్తున్నాను.

కనీసం
మరొక పదుగురికైనా చిన్ననాటి
తలపులు తట్టిపోయుంటాయి, ఉదయాన్నే కిటికి అంచున వాలి కిచ కిచలాడి ఎగిరిపొయే పిచ్చుకల్లా.

కనుక
ఏతావాతా చెప్పొచ్చేదేమంటే, సాంప్రదాయ ఆటలు, పద్దతులు మానలేదు వీలుని బట్టి మా తరం వారం నడిపిస్తూ, తర్వాతి తరానికి అందిస్తూ... తెలుగు భాష, తిండి, ఆట ఇలా కనీసం మన తర్వాతి రెండు తరాలకి పదిలం. కాదంటారా?

నోటబుల్ లింక్స్:

వికిపీడియాలో కొంత సమాచారం ఈ ఆటల మీద:
http://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%9F%E0%B0%B2%E0%B1%81


మాన్ కాలా ఆట:
http://en.wikipedia.org/wiki/Mancala


హాప్ స్కాట్చ్ ఆట:
http://en.wikipedia.org/wiki/Hopscotch

క్రీడ సైట్:
http://kreedagames.com/