ప్రకృతి పాఠం

గట్టంట నడిచేదెవరో,
వాగుల్లో వెన్నెల ఈదులాడుతుంటే.
నీడకి అందక తిరిగే మనిషేమో..

కొమ్మనెవరూ చూడరే,
పొత్తిళ్ళలో మొగ్గలు కేరింతలాడుతుంటే.
దారి మరిచిన బాటసారులేమో..

గూడు చెదరగొడతారేం,
గువ్వలజంట ఒద్దిక ఓర్వలేకనేనా.
వాళ్ళంతా ఒకనాటికి పరాజితులవరా..

వానజల్లుకి వణికేదెందుకో,
అచ్చంగా అమ్మ చేతిస్పర్శ అందిస్తుందనా.
వీళ్లంతా నకిలీమనుషులెమో..

వాగు నవ్వు, మొగ్గ వన్నె,
గూటి పొందిక, ఎదలో నింపుకున్నదెవరు.
సహస్ర పున్నమికి వానలో తానాలాడే భాగ్యశాలి కాదా?

5 comments:

 1. ప్రతి లైనూ చక్కగా కుదిరింది.చాలా బావుందండి

  ReplyDelete
 2. పద్మార్పిత, శ్రీకాంత్, ప్రకృతిని విస్మరించి పరుగుల్లో గడిపేవారంటే నాకదో నిరసన. అదే ఈ వెల్లువ. థాంక్స్

  ReplyDelete
 3. పైన ఒకరు చెప్పినట్టు మీ భావం ఒక్కో పంక్తిలో ఇమిడిపోయింది.
  బాగుంది.

  ReplyDelete
 4. గణేష్ గారు, నా భావం మరొకటి కూడా ఉంది. ఈ ప్రకృతి బదులుగా సాటిమనిషి ప్రకృతిని కూడా అన్వయించవచ్చు. వివరణ నేను ఇచ్చేకన్నా పాఠకుని స్పందనకి వదిలేస్తే ఎవరి అనుభూతిని వారు పొందే స్వేఛ్ఛ ఉంటుందని సరిపెట్టుకున్నాను. మీ తొలి వ్యాఖ్యకి సంతోషం.

  ReplyDelete