వాన పడని ప్రాంతాలవారు, లేదూ ఈ టపా కాస్త వర్షం పడుతున్నప్పటి వాతావరణంలో చదవాలనుకునేవారు ఇక్కడ నొక్కి మిగిలిన భాగం చదువుకోండి.
ఏమైందో తెలియదు కానీ "అష్టాచెమ్మా, కర్ర బిళ్ళ, ఏడు పెంకులాట, గోదారి కాలవలో ఈతలు, ముంజెల బండి, కోతి కొమ్మచ్చి, నేలబండ, పైరాకు-పచ్చనాకు, సబ్ జావ్ ఇండోర్, ఏడు పెంకులాట, వెన్నెల్లో వెన్నముద్ద, వైకుంఠపాళి, వామనగుంటలు, చింతగింజలాటలు, తొక్కుడుబిళ్ళ, బంక మట్టి బొమ్మలు, గోళీలాటలు, తాటాకు బొమ్మల పెళ్ళిళ్ళు, కబడ్డీ, కోకో, చార్ పత్తర్, స్తంభాలాట, కోలాటాలు, పూలజడలు, ముంగిట ముగ్గులు..." వాన జల్లు కన్నా వేగంగా మనసుని చుట్టుముట్టి మీద పడ్డాయి.
అన్నీ విప్పి మీకిలా మాటల ఊటలుగా జారవిడుస్తూ.. అలాగే ఇది ఒక వ్యాసం కాదు కనుక ఒక పద్దతిగా రాయలేను. అలా మస్తిష్కం లో మెదులుతున్నవి ఇలా దింపేస్తున్నాను, మరొక్కరికైనా ఆ అమాయకపు బాల్యం తాలూకు స్ఫూర్తిని/ప్రేరణనీ ఇవ్వకపోతాయాని పేరాశ పడుతూ మరీ.
ఇక శీర్షిక చూసి నమ్మి వచ్చిన వారికి, బడి, పిల్లకాయలు, పంతుళ్ళు అంతా మనమే... మననం చేద్దాం, మరిచిపోలేనివి, మర్చిపోయినవీ ఒకరికొకరు చెప్పుకుందాం. నా అనుభవం వరకు నేను ఆడిన ఆటలు, ఈ తీరాన ఎలా ఎన్ని మేమూ ఆడి పిల్లలకీ నేర్పగలుతున్నాము అని పంచుకుంటున్నాను. అందువలన ఇక్కడ పాఠాలు లేవూ, వల్లె వేయటాలూ లేవు - అంతా వట్టిదే. :) అక్కడక్కడా ప్రశ్నలు వేయబడును. తమకి తోచిన సమాధానాలు రాసుకుని లేదా ఇక్కడ రాసి వెళ్లండి.
- ముంజెల బండి నడపడం ఎందరికి వచ్చును? పోనీ ముంజెలు తినటం ఎందరికి తెలుసు?
గచ్చకాయలు, అచ్చంగిల్లాలు ఆడని అరచేతికి ఎన్ని గోరింటలు పెట్టినా అందం రాదు. నేర్పుగా ఒకటి ఎగరేసి మిగిలిన నాల్గిట్టితో రకరకలా విన్యాసం చెయ్యని వేళ్ళకి వీణ మీటినా ఆ గొప్పతనం రాదు! కాదా?
- "తొక్కుడుబిళ్ళా ఆడే నాతో" ఇది ఎవరు ఏ సినిమాలో పాడారు?
- ఈతపళ్ళు కాక ఇంకేమేమి మీ పొలం గట్ల మీద చూసిన/తిన్న/తాగిన :) గుర్తు?
అప్పుడప్పుడు పక్క ఊరినుంచి వచ్చే బంజారా స్త్రీ దగ్గర గిద్ద బియ్యానికి రెండు గిద్దలు దుద్ది పళ్ళు (అచ్చంగా ఇక్కడి చెర్రీల్లా ఉండేవి) కొని లాగించేసేవాళ్ళం. జీడి మామిడి ముక్కల్లో ఉప్పూ కారం అద్దుకుని, నోరు కొట్టుకుపోయేదాకా తిన్న మధ్యాహ్నాలు మరవగలమా?
నాలుగు గింజలు కలిపి పుంజీ, రెండు పుంజీలు ఒక కట్టు, ఐదు కట్టులు ఒక గుర్రం...
చింతగింజలాటలో నిష్ణాతులెవరైనా ఎన్ని గుర్రాలు కలిస్తే ఒక ఏనుగు అవగలదో, ఆ లెక్క చెప్పగలరని గంపెడాశ. అప్పుడు అమ్మమ్మ గారిని నెగ్గలేదు కానీ ఇప్పుడు వచ్చీరాని ఆటగాళ్లలో మనమే ఆముద వృక్షం ;) (ఏ చెట్టూ లేకపోతే ఆముదం చెట్టే మహవృక్షం - ఒకనాటి పెద్దలు). ఇదిగో ఇవాళ కూడా ఆడేసి మా ఆమ్మాయి మీద నెగ్గేసా.. ఇండియన్ గ్రోసరీ షాప్ వాడి చింతపండంతా గింజలేనని గుంజుకున్నాగానీ ఇలా పనికొచ్చాయిలే అని సరిపెట్టుకుంటాం, మా స్నేహితులమంతా.
ఇలా పట్టిన గింజలు చేయి తిప్పి కంగ కుండా పట్టటం లో నేర్పరి ఎవరో ;)
ఆట మొత్తానికి ఇలా ముందు పట్టు పట్టి గింజలు జారవిడవకుండా పుంజీలుగా తీయటం పెద్ద విద్య.
చిన్నప్పటి దొంగదారి ఆట ఇది :) నా వంటి ఆటలో అరటి పండుని అమ్మమ్మ గారు వంటి ఘనాపాటీలు జాలి పడి ఆడనిచ్చేవారన్న మాట!
ఇది కాస్త వెన్ను ముదిరాక మొనగాళ్ళ ఆట. ;) పక్క గింజని తాకకుండా మనం పట్టిన గింజ లాఘవంగా తీయటం..
మా ఊర్లో గొడవల కారణంగా సగం నిర్మాణంలో ఆగిపోయిన రామాలయం ఉంది. ఇప్పుడు ఆ గొడవలు చేసినవారు, తెలిసినవారు గానీ లేరు. ఆ కట్టడాన్ని "బోడిమేడ" అంటారు. ఒక్క రామనవమికి మాత్రం పానకాలు అక్కడి నుంచే ఇళ్ళకి పంపుతారు, ఆ సందడి అంతా కుర్రకారుదే. పోతే, నా చిన్ననాటి నుంచీ మారనిది - అక్కడ రచ్చబండ మాదిరి దృశ్యం. ఆ అరుగుల మీదే తెగ పోటాపోటిలుగా సాగేవి దాడి, పులి-మేక, ఇప్పటికీ పేకాటలు లేదా పిచ్చాపాటీలు సాగుతున్నాయి.
నాకు ఆడటం రాదు కానీ పిల్లలకి నేర్పాలని దాడి, పులి-మేక బోర్డ్స్ కొన్నాను. అన్నట్లు చెన్నై లో క్రీడ అన్న సంస్థ దగ్గర చక్కగా అన్నీ దొరికాయి. ఇక్కడ పెట్టిన ఆ సాంప్రదాయ ఆటసామగ్రి అంతా వారి నుంచే కొన్నాను.
అష్టాచెమ్మా నేను ఇక్కడి పిల్లలతో ఎక్కువగా ఆడినది. నా తెలుగు బడి పిల్లలకి కొందరికి ఈ ఆట చాలా ఇష్టం. ఆ అట్ట మీద అలా గీసి తయారు చేసుకున్న అనుభూతి, చిన్నప్పుడు దీపావళికి మతాబులు, సిసింద్రీలు చుట్టినంత గాఢంగా అనిపించింది.
పులి-మేక నాకు నచ్చదు నిజంగానే
అప్పట్లో కాస్త వయోలెంట్ ఆట - ఇప్పటి హేలో కన్నా కాదు కాని
- దాడి, పులి-మేక, అష్టాచెమ్మ - మీకు ఎక్కువగా ఏది ఇష్టం? ఎందుకు ఇష్టం? చివరిగా ఎప్పుడు ఎక్కడ ఆడారు?
కాస్త మొహమాటంగా ఉంది కానీ "వామనగుంటలు" మాత్రం మా అమ్మాయి చేతిలో కూడా ఓడిపోతుంటాను. పదేళ్ల పిల్లది ప్రపంచాన్ని నెగ్గినంత ఆర్భాటాలు పోతుంది. ప్చ్..
ఆ ఆటనే కాస్త మార్పుగా మాన్ కేలా అని ఇక్కడి పిల్లలు ఆడతారు. ఈ టపా చివరన ఇచ్చిన లింక్స్ లో ఉందా వివరం.
ఇక జీవితంలో వైఫల్యాలనీ, ఆనంద శిఖరాలనీ వైకుంఠపాళితో పోల్చనిదెవరు? నలుగురి పయనం ఒకసారే మొదలైనా, నిచ్చెనలు ఎక్కి పరమపదసోపానం చేరేదొకరు, పాము నోటికి చిక్కి చచ్చేదొకరు, చావు బతుకుల నడుమ మినుకు మినుకుమనే ఆశతో నడిచేదొకరు. కాస్త వేదాంతం లా మారింది. మరి ఉగాది పచ్చడి రుచి ఇంకా నాలుక దాటక, కలం లోకి జారిందిలేండి.
ఇక "చార్ పత్తర్" మేము హైదరాబాదు లో నేర్చుకున్న ఆట ఇది. ఇది ఐదుగురాడే ఆట. నాలుగు గదులు, వాటి నడుమ ఈ నాలుగు రాళ్ళు ఒకరు కాపు కాస్తుంటే, మిగిలిన నలుగురు కాపలాదారుని ఏమార్చి, కొట్టేసి, ఒక గది కి చేర్చే ప్రహసనం. మేము ఎంత లీనమై పోయేవాళ్ళమంటే చివరికి ఆ రాళ్ళతోనే బుర్రలు పగలు కొట్టుకునేంత.. :) ఇంకెవరికైనా తల మీద పడ్డ కుట్లు పలకరిస్తున్నాయా?
కోతి కొమ్మచ్చి, నేలబండ, పైరాకు-పచ్చనాకు, సబ్ జావ్ ఇండోర్, ఏడు పెంకులాట, వెన్నెల్లో వెన్నముద్ద అని మొదలెట్టి చెప్పటం అన్నం, పప్పు వండటం నేర్పటమే. నేలని చితక్కొట్టి వదిలిన ఆటలివి. తల్లి నేల పాపం ఎలా భరించిందో గానీ మా వానరమూక ఆగడాలని.
తంపటేసిన తేగలు నవులుతూనో, చెరుగ్గడలు పిప్పి చేస్తూనో, రేగివడియాలు చప్పరిస్తూనో అలా అలా అలవోగ్గా నేర్చేసుకుని ఆడేసి దుమ్ము కొట్టిన బట్టలతో, మట్టితో నలుగులు పెట్టుకుని కొండొకచో అమ్మమ్మ గారి చేత దేహశుద్దికి దగ్గరగా వెళ్ళి వచ్చిన వైనాలవి నా వరకు. మరి మీ మాటో?
ఇక అలా అలా పెరిగేస్తూ, నేర్చినవే తాటాకు బొమ్మలు చేయటం, కోలాటాలు. ముక్కోటి తిరనాళ్ళలో గోళీసోడా తాగుతూ గోళీలాటలు చూడటం. ఇది మా అన్న గారి కళ. మనకి దక్కింది ప్రేక్షక స్థానమే.
*** కోలాటం - జడ కోలాటం, ఒకటే కోలాహలం ***
ఇక్కడ గుజరాతీలు దేవి ప్రీత్యర్థం గర్బా నృత్యం చేస్తారు. అది మన కోలాటమే కాస్త మార్పుగా. మొన్న నా కలీగ్ అత్తగారు ఇండియా నుంచి వచ్చారు. ఆవిడ తన డెబ్బైలలో కూడా ఇంకా విసిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వైద్యురాలు. నాతో కోలాటం ఆడతావా అని మేళమాడి కవ్వించారు. కాస్త పంతంగా దిగాను. అలా ఇద్దరం గంట నాన్ స్టాప్ కోలాటం. ఆ దెబ్బకి ఇప్పుడు పట్టిన పిచ్చి జడకోలాటం. వచ్చే ఉగాదికి అభినయించాలని మందిని పోగేయటం, సాధన మొదలు పెట్టాను.
- తప్పెటగుళ్ళు అంటే ఏమిటి? అసలా గ్రామీణ క్రీడని చూసారా?
ఇక వేసవి సెలవులకి ఆటలంతా పిచ్చి పూలజడలు, మల్లెలు. మా ఊర్లో కన్నా, నందిగామలోనే ఎక్కువ. పక్కింటి ఖాన్ ఆంటీ గారు [మ్చ్.. అలానే పిలిచేవారం, కనీసం పేరు అడిగానో లేదో, అయినా నిండా ఏడేళ్ళు లేవు కనుక అప్పటికి అది అమర్యాద కాదు] మధ్య మధ్యలో పట్టు గుడ్డలతో చేసిన మొగ్గలు పెట్టి మరీ జడ వేసే వారు. దిష్టి తగలకుండా అలా వేసేవారని అమ్మ తర్వాత చెప్పారు.
ఇదిగో ఇంకా ఇలా ఇరుగమ్మనీ పొరుగమ్మనీ బతిమాలుకుని పోగేసి మనం మూడు మూరలు కొప్పులోకి తురిమేయటం, ఈ ఒక్క విషయంలో ఇంకా అమ్మ స్థాయి త్యాగాలకి అలవాటు పడలేదు మరి. :) అన్నెం పున్నెం ఎరగని కూతురికి రాళ్ళ పూల జడలు, చివర్లో కుప్పెలకి బదులు ఓ అర మూర మాల. పైగా అదో కొత్త వెరయిటీ/రకం కేశాలంకరణ అని మురిపించటం. ఇక్కడ సవరాలు దొరకవండి, ఇవి మా సహజ కురులే. అర్జునుడి బాణాల వారు మామీద ఎప్పుడో చెమక్కు విసిరారు స్త్రీలు జడలు, పూలు వదిలారని. మరి పంచెకట్టులు, తలపాగాలు వదిలినవారెవరో. :)
చివరిగా ఇక్కడి ఆటల్లో నేనూ మునిగి తేలేది ఈ ట్రయామినీస్ లోనే... పిల్లలకి ఆట, లెక్కలు అన్నీ నేర్పొచ్చు. ప్రయత్నించి కొని ఆడించండి/ఆడండి. ఇదే కాదు ఇంకా చాలా ఆడతాను. ఒక విధం గా నాకు పిల్లలకోడి అని కూడా పేరులేండి. ఆరు ప్రాణాలతో అహర్నిశలు అల్లరే..
కారంస్లో రెడ్ వేసినట్లే ఈ ఆటలో ఇలా బ్రిడ్జ్ కట్టటం చాలా కష్టం.. కానీ అసాధ్యం కాదు.
ఈత ఇంక మునుపటి జోరులో లేదు కానీ ఆక్వా ఏరోబిక్స్ మూలాన కాస్త గోదారి కాలవ, కృష్ణమ్మ నది స్నానాలు అవీ మరీ బెంగ పెట్టవు.
- స్విమ్మింగ్ పూల్ లోకి పైన దాదాపు పద్దెనిమి అడుగుల ఎత్తున ఉన్న డెక్ ఎక్కి, వెనక్కి తిరిగి ఎందరు దూకారు? పొట్టకి దెబ్బ తగలకుండా ఎందరు డైవ్చేయగలరు? (ఇవే ఇప్పటికి పూల్ ఆటల వరకు ఒక గెలుపు, ఒక ఓటమి నాకు)
కబడ్డీ, కోకో ఈ మధ్యనే వేసవికి ఒకటి, రెండు సార్లు పార్క్ లో పిక్నిక్/ వన భోజనాలు గా కలిసి ఆడటం మొదలు పెట్టాము. కొందరు గజ ఆటగాళ్ళు, కొందరు వర్థమాన తారలూను. అలాగే తాడాట, ఒప్పులకుప్ప అవీను. అసలు కబడ్డీ అంటే చేతి మీద మచ్చలు వెక్కిరిస్తున్నాయి.
ఒప్పులకుప్ప
వయ్యరి భామ
గూట్లో రూపాయ్
నీ మొగుడు సిపాయ్
ఇప్పటికీ నచ్చని పాట, అది కాక మరేమీ గుర్తుకూ రాదు అలా తిరిగేప్పుడు. పిల్లలూ తెగ ఉత్సాహపడి తిప్పమని అడుగుతుంటారు.
అలాగే ముగ్గులు. నాకు వచ్చినవేవీ మర్చిపోలేదు. ఇప్పటికీ అలా వేసుకుపోయే ముగ్గు ఇది. మొన్నా మధ్య ఆఫీస్ లో వేస్తే, ఎన్ని రోజులకి నాకు వస్తది నేర్చికోవాలంటేనని అడిగారు కలీగ్ ఒకరు. సమాధానం మీరు చెప్పండి మరి.
ఇలా చెప్పుకుపోతే ఈ టపా ముగియదు. జ్ఞాపకాల వెల్లువ లో కొట్టుకుపోతాము. అక్కడే బొంగరాలాటలు ఆడుతూ, వీరీ వీరీ గుమ్మడిపండు అంటూ నిలిచిపోతాం. కనుక ఇక ముగిస్తున్నాను.
కనీసం మరొక పదుగురికైనా చిన్ననాటి తలపులు తట్టిపోయుంటాయి, ఉదయాన్నే కిటికి అంచున వాలి కిచ కిచలాడి ఎగిరిపొయే పిచ్చుకల్లా.
కనుక ఏతావాతా చెప్పొచ్చేదేమంటే, సాంప్రదాయ ఆటలు, పద్దతులు మానలేదు వీలుని బట్టి మా తరం వారం నడిపిస్తూ, తర్వాతి తరానికి అందిస్తూ... తెలుగు భాష, తిండి, ఆట ఇలా కనీసం మన తర్వాతి రెండు తరాలకి పదిలం. కాదంటారా?
నోటబుల్ లింక్స్:
వికిపీడియాలో కొంత సమాచారం ఈ ఆటల మీద:
http://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%9F%E0%B0%B2%E0%B1%81
మాన్ కాలా ఆట:
http://en.wikipedia.org/wiki/Mancala
హాప్ స్కాట్చ్ ఆట:
http://en.wikipedia.org/wiki/Hopscotch
క్రీడ సైట్:
http://kreedagames.com/
అమ్మాయ్ ఉషా. నాకు వచ్చు ముంజెల బండీ చెయ్యటం తింటం కూడా, అన్ని కొట్టీ తాటాకు లో మడీచి పెట్టీ ఇస్తే తింటం కాదు చిన్న చిల్లు పెట్టీ ముందు నీళ్ళు తాగేసి ఆ పైన తీరిక గా ముంజె తినటం.
ReplyDeleteనువ్వు మరీను. "తొక్కుడుబిళ్ళా ఆడే నాతో" పాట తెలియని తెలుగోళ్ళు ఎవరన్నా వుంటారా మరీ చోద్యం.
ఇంక ఈ చింత పిక్క లు అష్టా చెమ్మ లు గవ్వలు లాంటివి రావు కాని కోతి కొమ్మచి ముద్ర బాల్/ఏడూ పెంకులాట, కోకో షటీల్ రింగ్ (అలానే అంటారు కదు) తెగ ఆడేసే వాళ్ళం చిన్నప్పుడు.
తప్పెట గుళ్ళు మనం ఆడటం కష్టం కాదు...!!!! అవి చాలా బరువు వుంటాయి.
ఒప్పులకుప్ప
వయ్యరి భామ
సన్న బియ్యం
సాయి పప్పు
గూట్లో రూపాయ్
నీ మొగుడు సిపాయ్
ఇప్పటీకి నా ఫేవరేట్ ఒప్పుల కుప్ప తిరగటం. మా దొడ్లో కూడా తెగ తిరిగేస్తూ వుంటా నేను ఇప్పటీకి.
చాలా గుర్తు చేసేవు ..
అవును ఏంటీ బిడ్డా స్విమ్మింగ్ పూల్ లో వెనక్కి దూకాలా పని చూసుకోమ్మోవ్..
జడ కోలాటం సిలికాన్ ఆంధ్రా లో కాంతి వాళ్ళు ఒక సారి చేయించినట్లు వున్నారు వీడీయో లో చూసిన గుర్తు. బలే వుంటుంది కదా.నేను కూడా మీ వూరొస్తా నేర్పుతావా ఐతే?
మొత్తనికి తేనె తుట్టే కదిలించేవు జ్నాపకాల తూనిగల ముల్లు విరగకుండా చెదరగొట్టీ అనుభూతుల తేనె ఆస్వాదించాలి వస్తాను.
ఓ మీరు ఆటల గురించే చెప్పారా?....నా బ్లాగులో కూడా నా చిన్నతనంలో ఆడుకున్న ఆట గురించి చెప్పాను చూడండి.
ReplyDeleteఅబ్బో! పుట్టింది పెరిగింది పట్నంలోనైనా మేమూ ఆడాం బోల్ఢు ఆటలు. అప్పుడూ స్కూలులో చదువులూ, ఆటలు ఉన్నా ఆదివారం, వేసవి సెలవులు అంటే ఎన్ని ఆటలో. ఆప్పట్లో టీవీలు లేవు, కంప్యూటర్లు లేవు. బొమ్మల పెళ్లిల్లు, పూలజడలు , ఊయలూగడం మాత్రం తప్పనిసరి వేసవి సెలవుల్లో. ఒక్క బిజినెస్ గేమ్ తప్ప అన్నీ తెలుగు ఆటలే. వీటివల్ల శరీరానికి కూడా ఎంత వ్యాయామమో కదా ఉషా.. నా ఆటల ముచ్చట్టు నేను ఎప్పుడో చెప్పేసానుగా.
ReplyDeletehttp://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html
http://jyothivalaboju.blogspot.com/2009/10/blog-post_10.html
కోచింగ్ ఇవ్వటానికి నేను రెడీ. మగ పిల్లకాయలెవరన్నా ఉంటే చెప్పండి
ReplyDeleteఏంటి ఉషమ్మా..ఒక్కసారే ఇన్నేసి బాల్యస్మృతుల్ని గుర్తు చేసేస్తే ఎలా!
ReplyDeleteఅన్ని ఆటలు ఆడినవే..ప్రతి దాంట్లో గెలుపు కోసం పోరాటమే..ఓడిపోతే ఉక్రోషాలు..తొండాటలు..తగువులు..అలకలు..మూతి బిగించుకోవటాలు..ఇవన్నీ చెయ్యని తెలుగింటి పిల్లలు ఉంటారా?
సబ్ జావ్ ఇండోర్..మా సంక్షిప్త నామం..సబ్జా
చింతగింజలాటలో మనల్ని కొట్టినవాళ్లు లేరు. ఎండాకాలం..పచ్చళ్లకని చింతపండు మణుగులు మణుగులు తెచ్చేవాళ్లు..దాంట్లొ ఒక్క చింతగింజ పారేసినా ఊరుకునేవాళ్లం కాదు. అవన్నీ సంవత్సరాల తరబడి మా అమ్మ దాచిపెట్టి పుచ్చిపోయినాక పారబోసింది. చింతగింజల బదులు బాడిద గింజలతో కూడా ఆడేవాళ్లం..కానీ ఇవి పెద్దగా ఉండటాన ఎక్కువ పట్టలేకపోయేవాళ్లం.
ఐదు గుర్రాలు ఒక ఏనుగు.....వరసగా 5..4..3...2..1 లేక 7..6..5..4..3..2..1 గుర్రాలతో రథం కట్టేవాళ్లం...
ఇంకా ముక్కు గిల్లుడు ఆట..పిన్నీసులాట..కుందుళ్ళాట..ఉప్పాట..చెమ్మచెక్క..ఆసంబాయి..కరంటు పాస్...స్థంభాలాట..అబ్బో ఇంకో రెండు టపాలు వ్రాయవచ్చు.
మరి ఇప్పుడెవరైనా ఈ ఆటలు ఆడుతుంటే నేను రెడీ!:):)
ReplyDeleteఊపిరి బిగపట్టి మరీ చదివాను మీ టపాని..అమ్మో ఇన్ని ఆటలు ఒక్కసారిగా గుర్తుకు తెచ్చేస్తే ఎలాగండీ?
ReplyDeleteఇదిగోండి ఉష గారు, పిల్లకాయలకు ఆ ఏడుపెంకులాట నేర్పే కాంట్రాక్ట్ మాత్రం నాకే ఇవ్వాలండీ...:)
అలాగే వైకుంఠపాళీ లో పక్కనున్నోళ్ళకు తెలీకుండా పిక్కని ఎలా కదపాలి లాంటి టెక్నిక్స్ కూడా నా దగ్గర ఉన్నాయండోయ్..అలా ఎన్నిసార్లు తొండి( కింత్రి చేయటం )చేసి పాము నోట్లోకి వెళ్ళకుండా తప్పించుకున్నానో!!
నేను కూడా ఇప్పటికిప్పుడు ఈ ఆటలు ఆడటానికి రెడీ Including తొక్కుడు బిళ్ళ...:)
ఇంకా రావాలి సమాధానాలు. బాల్యపు ఆటలు సరేనర్రా..దాహంతో బావి గట్టున కూర్చున్న మనిషి తీరు నాది. గుక్కెడు నీళ్ళు తోడి ఎవరైనా పోయకపోతారాని ఆశ/కల. :) ఈ ఆటలు ఆడాము అని కాదు, కొన్నైనా తర్వాతి తరానికి అందించాము అనగల భిన్న స్వరం నా గళానికి కలిపే (నేను అనుకున్నది చేస్తున్నాను అన్నది సత్యం కనుక) ఒక జంటస్వరం వినాలపి ఇంకా చూస్తున్నాను.
ReplyDeleteచాలా దూరం తీసుకు వెళ్ళారండీ ఙ్ఞాపకలలో... మీ ప్రయత్నం బాగుంది. ఎవరు గళం కలుపుతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను :-)
ReplyDeleteఉష గారు మీరు చెప్పిన ఆటలన్నీ నేనూ ఆడేసానొఛ్.. గెలుపోటములు మాత్రం అడక్కండేం ..అన్నీ ఓడిపోవడమే నేను ఎప్పుడూ..ఎవరమ్మా అలా నవ్వేస్తున్నారు ..నాకు మీకులా దొంగాటలు ఆడటం రాదు అందుకే ఓడిపోవలసి వచ్చింది (ఇక్కడ ఒక బుంగమూతి ఊహించుకోండి :) తొక్కుడు బిళ్ళ,అష్టా చెమ్మా,వామన గుంటలు నా ఫేవరెట్ ఆటలు ..వైకుంఠ పాళి,కోకో పర్లేదు ఒక మాదిరిగా ఆడేదాన్ని. కరెంట్ పాస్ లో ఎప్పుడూ నేనే దొంగ :( కోకో .. కోలాటం కూడా ఆడేదాన్ని.. మా ఇంటిపక్కన తాతగారు పాడుతుంటే రెండు కర్రలు,పరికిణీ వేసుకుని తెగ ఆడేవాళ్ళం.. పాట కొద్దిగా గుర్తు ఉంది అటవి స్థలముల కేగుదమా ,వటపత్రంబులు కోయుదమా (కరెక్టేనా :)
ReplyDeleteబాల్యపు ఆటలంటే నేను ఎప్పుడూ పిల్లలతో నా బాల్యపు ఆటలే ఆడుతా...ఎందుకంటే నాకు అవితప్ప వేరే యే క్రొత్త ఆటలు రావు :) ఇంకా సమాజం పూర్తిగా మారిపోలేదు ఉష గారు మా ఊర్లో పిల్లలు ఇంకా ఆడుతున్నారు ఇవన్నీ కాకపోతే కార్టూన్ నెట్వర్క్ లో ఫెవరేట్ ప్రోగ్రాం రానపుడు మాత్రమే :)
ReplyDeleteమీ స్వరంతో జత కలపటానికి చాలా స్వరాలే ఉన్నాయి!
ReplyDeleteమా పిల్లలకి ఈ ఆటలు అన్నీ పరిచయమే. అష్టాచమ్మా(నాలుగు గవ్వల ఆట)బాగా ఇష్టం. చింతగింజలాట..వామనగుంటలు...అచ్చంగిల్లాలు తప్ప ఈ ఆటలన్నీ మా పిల్లలు ఆడతారు. మా ఇంట్లో మా అమ్మాయి తప్పితే అందరూ మగపిల్లలే..దాంతో తను కూడా వాళ్లతో పాటు వాళ్ల ఆటలే ఎక్కువ ఆడుతుంది.
ఇక ఎండాకాలం సెలవలకి మొన్న మొన్నటి దాకా మా పిల్లల్ని నెలరోజుల పాటు ఊర్లోనే ఉంచేసేవాళ్లం..అక్కడ ఇంకా మా కజిన్సు పిల్లలు అందరూ కలిసి పిచ్చపిచ్చగా ఆడుకునేవాళ్లు...తోటల్లో దొడ్లల్లో పడి తెగ తిరిగి కాకుల్లాగా మారి వచ్చేవాళ్లు. ఈ సంవత్సరమే ఇద్దరికీ చెరో సారి సెలవలవటం మూలాన మరియు మా అబ్బాయి ఇంటరు అవటం మూలాన వెళ్లలేదు పాపం.
good post :)
ReplyDeleteచాలా బావుంది. వర్ధమాన కథా రచయిత సుంకోజి దేవేంద్ర మా మంఛి ఆటలు అని ఒక బుల్లి పుస్తకం రాశారు. దీన్ని విశాలాంధ్ర వాళ్ళు ప్రచురించారు. కమ్మటి చిత్తూరు మాండలికంలో తాను చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ రాశారు. ఇంకా దొరుకుతూ ఉండొచ్చు పుస్తకం.
ReplyDeleteI and a couple of cousins of mine are the last of the advocates of such games in our circle. Now the generation of Jetix's world s(h)aving is ruling the roost atleast partially. అమెరికాలో ఉండీ ఇవన్నీ ఆలోచిస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది
ReplyDeleteచక్కని తెలుగు వారిగా పుట్టటం, ఈ ఆటలన్నీ ఆడుకోవటానికి చాలా అదృష్టం వుండాలి.
ReplyDeleteప్రస్తుతానికి కీ బోర్డు, మౌసు తో గోటీ బిళ్ళ ఆడుతున్న. చాలా బాగా వ్రాసారు. చాలా సంతోషం.
"వీరీ వీరీ గుమ్మడి పండు వీరి పేరేమి?" వీరి పేరు "కమ్మని బాల్యం" :) స్పందనలు, సమాచారం పంచుకున్న అందరికీ కృతజ్ఞతలు. అమ్మ చేతిముద్ద కమ్మన, అలాగే ఈ ఆటలన్నీ మనసుకి సాంత్వన ఎప్పటికీను. అమ్మమ్మ తోనో, మేనత్తతోనో ఆడే "అష్టాచెమ్మా" ఒక ఇంటి ఆప్యాయతలు, అనురాగాలు గుర్తుకి తెస్తే, వీధుల్లో ఆడే కర్రాబిళ్ళా, కావాలన్నది దక్కించుకోవాలన్న ఆశ, గెలవాలన్న పట్టుదల, ఓడిపోతున్న ఉక్రోషం, ఇలా కలగలుపు భావావేశాలకి మనసుని సిద్దం చేస్తుంది. ఇక ఆ చార్ పత్తర్ వంటి ఆటలు ఒక స్ట్రాటజీతో ఒక టీం గెలవటానికి కావాల్సిన ఎత్తులు రుచి చూపుతుంది. అందుకే ఆ మూడు శీర్షికకి వాడాను. ఇలాగే ప్రతి ఆటకీ ఓ అర్థం, పరమార్థం వెదకొచ్చు కదా. పైగా ఇవన్నీ జీవమున్న స్మృతులు. ఎప్పుడు నెమరేసినా తీయనే. మన మూలాల్నీ, మనవారితో అనుబంధాలనీ కలిపి పేనే పడుగుపేకలివి.
ReplyDeleteనిజానికి ఒక్కొక్కరికీ విడి సమాధానం ఇవ్వాలనున్నా సమయాభావం వలననే ఇలా క్లుప్తంగా రాస్తున్నాను. సమయం అనుకూలిస్తే మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తానిక్కడ. నెనర్లు.
ఉషా ,
ReplyDeleteమళ్ళీ రింగులు తిప్పించారు . మా అమ్మమ్మా వాళ్ళ ఇంట్లో ఒక గదిలో నేల మీద పచ్చీస్ గళ్ళు గీయించి వుండేవి . ఇహ అచ్చంగాయ లైతే కోడూఊరు నుండి మా పిన్ని ప్రత్యేకం గా తెచ్చి ఇచ్చేది . బొమ్మల పెళ్ళిళ్ళకు దర్జీ సాయెబు దగ్గర బట్ట ముక్కలు తెచ్చు కోవటానికి ఎంత కాంపిటీషనో ! ఎంత హంగామాలో ! తాటాకు బూరలు , చింతచిగురు పప్పు , కాగితం బుట్టలు , అబ్బో వేసవి ఎలా గడిచి పోయేదో తెలిసేదికాదు .
మా గ్రాండ్ చిల్డ్రన్స్ తో అష్టా చెమ్మా , కో కో , వైకుంఠపాళి , ఆదతాను . ఈ మద్య వైకుంఠ పాళిలో వోడిపోయాడని , ఆ పేపర్ చింపేసాడు మా చిన్నోడు . ఎంతైనా అబ్బాయిలు అల్లరోళ్ళు సుమా .
ఉషాగారూ,
ReplyDeleteఎప్పుడో ఙ్ఞాపకాలలోకి జారిపోయిన అందమయిన సంఘటనలను మీ టపాతో తట్టి లేపారు. ఒక్కొక్కటీ నెమ్మదిగా, ఒకదాన్ని తోసుకుని మరొకటి తొందరగా, అన్నీ కలిసిపోయి చిందరవందరగా, మనసొక్కసారిగా తట్టుకోలేనంతగా కదిలిపోయింది. నన్ను నేను సర్దుకుని క్రమంలో గుర్తు తెచ్చుకుందుకు ప్రయత్నించాను. సీలు వేసిన ఙ్ఞాపకాలపెట్టెని తాళం పగలగొట్టి మూత తీసి ఆతృతగా పెట్టెలో చేయి పెడితే అచ్చంగా భావనగారి లాగే నాకూ అనిపించింది. చిన్నతనంలో ఆడుకున్నప్పుడు తగిలిన దెబ్బలు అప్పుడు తేనెటిగ కుట్టినట్టు మంట పెడితే, ఇప్పుడు ఆ ఙ్ఞాపకాలు తేనె తిన్నంత తియ్యగా వున్నాయి.
అందరిలాగే సెలవులకి అమ్మమ్మగారి వూరు వెళ్ళినప్పుడు చుట్టాల పిల్లలందరం కలిసి ఆడిన ఆటల్లో నాకు చాలా ఇష్టమైన ఆట "కోతికొమ్మచ్చి." ఆ ఆటలో ఎన్నిసార్లు దెబ్బ తగిలినా సరే ఆ ఆట ఆడడానికే ఎప్పుడూ నా వోటు.
ఇంకో ఆట "కుంటాట" అని ఆడే వాళ్ళం. ఒక కాలు పైకి మడుచుకుని ఒకే కాలితో కుంటుకుంటూ ఎవరినైనా ఔటు చెయ్యడం.
మరో ఆట "కళ్ళగ్గంతలు". పంట లేసుకుని దొంగ అయిన వాళ్ళకి కళ్ళకి గంతలు కట్టేసి వాళ్ళు చేతులతో తడుముకుంటూ పట్టుకుందుకు వస్తుంటే వెనకాల్నించి "జెల్లకాయ" కొట్టి ఇంకా ఏడిపించడం. అప్పుడు తెలీలేదు కాని ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తోంది.. యేమనంటే.. ఎదుటి మనిషి ఇబ్బంది పడుతుంటే చూసి ఆనందించడమన్నది మనిషికి నేచురల్ టెండెన్సీ యేమోనని..
ఇంట్లో కూర్చుని ఆడే ఆటల్లో అందరిలాగే నేనూ చింతగింజలూ, గచ్చకాయలూ లో ఛాంపియన్ ని. ఎన్ని గుర్రాలు సేకరించేదాన్నో.
"జోర్ బాల్" అని ఒక ఆట ఆడేవాళ్ళం. సరిగా గుర్తు లేదు కాని అందరూ రౌండ్ గా వుండి మధ్యనున్న దొంగ ని బాల్ తో కొట్టడానికి ప్రయత్నించేవారు. మధ్యనున్నవాళ్ళు ఆ దెబ్బలు తగలకుండా తప్పించుకుందుకు ప్రయతించేవాళ్ళు.
ఇంకో ఆట వుండేది.. అదే "చాకలిబాన ఆట" అనే వాళ్ళం. అందరూ గుండ్రంగా కూర్చుంటే ఒక్కళ్ళు చుట్టూ తిరుగుతూ, తెలీకుండా ఎవరి వెనకైనా రుమాలు వెయ్యాలన్న మాట. "అందాలరాముడు" సినిమా లో చూపించారు కదా.. అదన్నమాట.
ఇలా ఆలోచించుకుంటూ పోతే ఎన్ని గుర్తు వస్తాయో.
ఇవి కాక మా అంతట మేము కల్పించుకుని ఆడినవి బోలెడు ఆట లున్నాయి.
ఈ ఆటల్ని గుర్తు పెట్టుకుని తరవాతి తరానికి అందించాలన్న మీ అభిలాష హర్షణీయమే.
ఇంకా ఏమైనా గుర్తొస్తే చెపుతాను.
ఒప్పులకుప్ప పాట నాకు గుర్తున్నంత వరకూ.
ఒప్పులకుప్ప వయ్యారి భామ
సన్న బియ్యం చాయ పప్పు
చిన్ని మువ్వ సన్న గాజు
కొబ్బరికోరు బెల్లప్పచ్చు
గూట్లో రూపాయ్ నా మొగుడు సీపాయ్
రోట్లో తవుడు నీ మొగుడెవరు...
మాలాకుమార్ గారు, మూడో తరానికి ఈ ఆటలు అందాయని ఋజువు చూపినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteలలిత గారు, సగం చెప్పి వదిలిమ్ది అందుకే మీ నుంచి మిగిలిన సగం రాబడదామని. నెనర్లు.
ఎన్ని జ్ఞాపకాలని తట్టిలేపారండీ...నేనూ గవ్వలనూ,చింతగింజలనూ ఇంకా దాచుకున్నాను...గవ్వల బదులు గచ్చకాయలతో గులకరాళ్ళతో కుడా ఆడేవాళ్ళం.ఆ ఐదు గులకరాళ్ళనూ కూడా ఇంకా భద్రంగా దాచుకున్నాను..
ReplyDeleteనిజానికి ఈ టపా రాసాక నేను గ్రామీణ క్రీడలకి ఆలవాలమైన పల్లెటూర్లలో ఇంతవరకు నా జీవితకాలంలో గడిపిన సమయం అంతా కలిపి కొద్ది రోజులే అన్నది గుర్తుకు వచ్చింది. సం. లో ఏదో ఒక పండుగ [సంక్రాంతి ఎక్కువగా] + వేసవిలో కొద్ది రోజులు. మిగిలిన కాలమంతా ప్రాజెక్ట్ కాలనీల్లోనో, కాన్వెంట్ చదువుల్లొనే.. కానీ ఇక్కడ సంగతి - అవెంత ప్రభావం నా మీద చూపాయి, నేను తర్వాతి తరానికి అందించగల సావకాశం, సదుపాయం, సమయం, ఆసక్తి వగైరాల మీద. మీరంతా కూడా వీటిని పదిలపరచమనే మనవి.
ReplyDeleteతృష్ణ, నెనర్లు.
మూడు రోజులైనా , మీ ఈ పోస్ట్ ఇంకా నా స్మృతులను తట్టి లేపుతునేవుంది . ఈ రోజే మా పిన్ని కి పోన్ చేసి చెడా మడా తిట్టేసాను . ఎందుకంటారా , నా చిన్నప్పుడు , బహుషా ఐదారేళ్ళుంటాయేమో , సెలవల్లో మా పిన్ని అత్తవారి వూరికెళ్ళాను . అప్పట్లో నేను మా పిన్ని కి తోకను లెండి . వాళ్ళ అత్తగారు , నన్ను , నా ఆటలను చూసి ముచ్చట పడి , ఆవిడ చిన్నప్పటి బొమ్మల పెట్టి నాకు ఇచ్చారు . ఎంత బాగుందో ! చెక్కపెట్టి లో బొమ్మల పెళ్ళికి పనికి వచ్చే బొమ్మలు , సామాగ్రీ అంతా వుందన్నమాట అందులో . నేనూ పిన్ని , అమ్మమ్మా వాళ్ళింటికి వెళ్ళేటప్పుడు , బస్ లో వళ్ళో ఐతే ఎక్కడైనా పడేసుకుంటానని , నేను ఏడ్చి రాగాలు పెడుతున్నా వినకుండా ఆ పెట్టి పరుపు చుట్టలో పెట్టి , బస్ టాప్ మీద భద్రంగా పెట్టించింది .( పాపం అనుకుంది ) . మేము విజయవాడలో బస్ దిగేసరికి ఆ పరుపుచుట్ట ఎవడో దింపేసుకున్నాడు ! ఇన్ని సంవత్సరాలైనా మా పిన్ని ని బామ్మగారిచ్చిన నా బొమ్మల పెట్టి పారేసావు అని గుర్తొచ్చినప్పుడల్లా సాదిస్తునే వుంటాను . అదో , మళ్ళీ నా బొమ్మల పెట్టి గుర్తు తెచ్చారు . అంతే ఈ రోజు మళ్ళీ ఫోన్ చేసి మరీ మా పిన్ని తో గొడవ పెట్టుకున్నాను . ఎలావున్నావు పిన్ని అని అడగకుండా ఈ సాధింపులేమిటే .ఇంకా ఎన్ని ఏళ్ళు సాధిస్తావే అని తనూ అరిచిందనుకోండి .
ReplyDeleteఏమిటో ఉషా మీరు ఇలా వుండీ , వుండీ నన్ను హిప్నటైజ్ చేసి భూతకాలానికి పంపుతున్నారు .
మాలాగారు, అన్నీ మన చేతుల్లోనివాండీ, జరిగేవాటిని కళ్ళెట్టుకు చూసి, మనసూరుకోనపుడు ఉసూరుమని ఇలా గోలపెడతం తప్పా :) నా రచన, మీ స్పందన అంతా మిథ్య. కాలపుతీరు అంతే! పారిపోయారా? మళ్ళీ మరువం వైపు రారిక.
ReplyDeleteగ్రామీణ క్రీడలపై విలువైన జ్ఞాపకాలు, సమాచారం పంచుకున్న అందరికీ మరోసారి ధన్యవాదాలు. ముఖ్యంగా సిరిసిరిమువ్వగారికి, మాలాగారికి - తర్వాతి తరం, దాని తర్వాతి తరంలో జీవిస్తూనే ఉన్నాయీ ఆటలని చూపినందుకు..నేను వచ్చి ఉండే ఆ నాల్రోజుల్లో నాకు తారసపడలేదవరూ పల్లెటూరల్లో కూడా - అంతా చదువులు, వీడియో గేమ్స్, టివి వగైరాలకి అతికిపోవటమే కాని. అవన్నీ ఎలాగున్నా ఇప్పుడు ఈ టపాని మాలతి గారి "బాలతూలిక -బ్లాగులింకులు" [http://tethulika.wordpress.com/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B1%82%E0%B0%B2%E0%B0%BF%E0%B0%95-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/ ] కలిపారు కనుక మరొక్కసారి ఇక్కడి సమాచారాన్ని చూసి మార్చే అవసరం కలుగుతుందేమో!
ReplyDeleteనెనర్లు.
జడ కోలాటం: అమెరికాలో ఉన్నవారికి - సిలికానాంధ్ర వారి వీడియో కాక, "ఉయ్యాల జంపాల" డివిడి అందుబాట్లో ఉంటే "అందాల రాముడు ఇందీవర శ్యాముడు. ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేముడు" పాట చిత్రీకరణ కూడా ఒక వనరు.
ReplyDeleteతెలిసిన వారు మరి కొన్ని ఆటలు/క్రీడలు సమాచారం పంచండి, ప్లీజ్! :)
ఇక్కడ వాడిన చిత్రాలు లింక్స్ తెగిపోయాయి [అనుకోకుండా ఆల్బం ప్రాపర్టీస్ మార్చటంతో]..తిరిగి సర్దాను..అసౌకర్యానికి మన్నించండి.
ReplyDeleteThanks for reminding me my childhood games. At the age of 63 I still cherish all these games once I played during my childhood at Rajahmundry. I was champion of Daadi aatta, Ashta chemma, Chintapikkalaata in our locality.
ReplyDelete