కల - ఆశ

"కలల్నీ ఆశల్నీ వేరు చేస్తే మనగలుగుతాయా?" నేను వేసుకున్న ఈ ప్రశ్న కి ఇప్పటికి నా సమాధానం ఇది.

వాస్తవం నన్ను కలలో కూడా వదలదు. బహుశా తెలియని అనిశ్చితి కలలోని స్వేఛ్ఛని అదిమేస్తుంది కాబోలు. కనుక కల నిజం కాకూడదని [పేరాశ] ఆశ పడతాను. అడియాస/నిరాశ శాతం ఇంతని తెలియదు కానీ తీసిపాడేసేది కాదు. అలా ఓ కల-నిరాశ నడుమ మరో జ్ఞాపకం చిగురు తొడుగుతుంది. మనసు గొంగళి అది మేసి, నెమరేసుకుంటూ మరో చివురాకు కొరకు కల కంటుంది. ఎప్పటికైనా సీతాకోకచిలుకగా మారనా అని కూడా ఓ కల నేపథ్య సంగీతంలా సాగుతుంటుంది. కనుక నా వరకు కల-ఆశ విడివడి మనలేవిప్పటికి. అవే
జీవం ఉన్న జీవితానికి ఆయువుపట్టు, ఒకటి మరొకదానితోపెనవేసుకోపోయున్న నా ప్రాణ వాయువులు.

కలలు పెట్టే కలవరం, ఊరించే ఆశలు - నిత్య జీవన సంవేదనలు, జీవన రాగ శ్రుతిలయలు. "కల నిజమాయేగా" అన్నది
నాకు ఆనందం కన్నా వేదనలో ఎక్కువ అనుభవం. అయినా
కలలు కనటం, ఆశపడటం అన్న వర్ణనాతీత భావోద్వేగం అనుభవించాలే కానీ మనసుకి ఆపాదించలేనిది. ఇక ఆనందం అంటారా, దానికీ కొదవలేదు. వేదననుసరించి ద్వనికి ప్రతిద్వనిలా అదీను. వస్తూ పోతుంటుంది. [స్వగతమో/మనసు లోని మాటో] కల, ఆశ, వేదన, ఆనందం కట్టిన నాలుగు గోడలు పగలగొట్టి ఏదో ఒకనాడు స్వేఛ్ఛగా ఎగురుతాను రంగురంగుల రెక్కల సీతాకోకచిలుకనై.

మరొకచోట వ్రాసినదాన్ని [కాస్త మార్చి] ఇక్కడ పెడుతున్నాను. కరగటం కలకి, కాలానికి తప్పదు. మారటమో, మార్చబడటమో మనసుకీ తప్పనిది. ఇవి సహజ లక్షణాలు కావచ్చు. కనుక నేనూ ఆ పరిణామక్రమంలో మరికొంత కాలానికి మరొక అభిప్రాయం వ్యక్తం చేస్తానేమో కూడా!

6 comments:

 1. కొన్ని వాస్తవాలు గమనించినపుడు మార్చబడటం మనసు మారడం తప్పాడు కదండీ :-)

  ReplyDelete
 2. చిన్నీ, నిజమే. ఇక ఈ కల-ఆశ నుంచి మనసు-మార్పు అంశం ఎత్తుకుంటే మరో ఆలోచనాపరంపర సాగుతుంది. థాంక్స్.

  ReplyDelete
 3. కలలు పెట్టే కలవరం, ఊరించే ఆశలు - నిత్య జీవన సంవేదనలు, జీవన రాగ శ్రుతిలయలు. "కల నిజమాయేగా" అన్నది నాకు ఆనందం కన్నా వేదనలో ఎక్కువ అనుభవం. అయినా కలలు కనటం, ఆశపడటం అన్న వర్ణనాతీత భావోద్వేగం అనుభవించాలే కానీ మనసుకి ఆపాదించలేనిది. ..
  వాహ్.. ఏం చెప్పారండి. అన్నట్లు కలలకు ఆశకు కొదవే లేదండోయ్

  ReplyDelete
 4. నెలబాలుడు గారు, అసలు అదుపు, కొదవ ఎందుకు అన్న ప్రశ్నకి జవాబు దొరికితే అవి వేటికి అన్వయించాలో మనసే తెలుసుకుంటుందేమో. కామెంటుకి థాంక్స్.

  ReplyDelete
 5. Usha garu.. meeru em matladina kavitha la untundandi!

  ReplyDelete
 6. జాయ్ గారు, నేను అన్నదానికన్నా మీకనిపించినది ముఖ్యం. కనుక ఈ ప్రశంస నిజానికి మీకే. థాంక్స్.

  ReplyDelete