ముంజె అంత పూర్ణం - తాటికాయంత తోపు

బ్లాగు లోకంలో మరో ఏడాది ఇట్టే గడిచిపోయింది [స్వగతంగా - ఈ ఏడాది చాలా నిండుగా నడిచింది, అన్ని వన్నెలనీ కంటికి చూపింది ] ఒక్క "Law of Entropy" కారణంగా మనసుని తొలిచేస్తున్న భీతి/బెంగ తప్ప. ఆ మాట ఎలావున్నా ముందుగా కాస్త మెదడుకి పదును పట్టిస్తున్న నీతిసూక్తం ఇది.

అయం బన్ధురయం నేతి గణనా క్షుద్రచేతసామ్। ఉదారచరితానాం తు వసుధైవ కుటుమ్బకమ్।।

[వాగ్విలాసం రాఘవ గారికి కృతజ్ఞతలతో] విడి పదాలుగా తాత్పర్యం

అయం - ఇతను
బంధుః - బంధువు
అయం - ఇతను
న - కాదు
ఇతి - అని
గణనా - లెక్కింపు
క్షుద్ర చేతసాం - హీనమైన మనస్సులు కలవారియందు (ఉంటుంది)
ఉదార చరితానాం - గొప్ప నడువడి కలవారియందు
తు - ఐతే
వసుధా ఏవ - భూమే
కుటుమ్బకమ్ - (చిన్న) కుటుంబము

అది ప్రపంచకవులను ఉద్దేశ్యించి ఒక వ్యాసకర్త అభిప్రాయం.

"మంచి కవిత్వం వింటే మనస్సుకి జ్వరం వచ్చినట్టు గుండాలి" - ఆరుద్ర

అలాగే "All that is best in the great poets of all countries is not what is national in them, but what is universal" - Henry Wadsworth Longfellow

అలా కవులు, కవితలు, కవిత్వం అన్న సాగరాన నేను ఒక అల తాలూకు నురగలో ఓ బొట్టుని.

ఇక, గడిచిన ఏడాది వరకూ, క్లుప్తంగా, రచనాపరంగా "నేను" అన్న చట్రాన్ని వదిలి విశాల ప్రపంచం వైపు కనుచూపు సారించింది ఈ ఏడే [భేషజాలు లేకుండా]. కారకులు ఎందరో, అందరికీ ధన్యవాదాలు. కవితల రచన పట్ల సాధన చేయాలన్న ఆలోచన. అదే నా ఎదుగుదల. చదవటం అన్నది మొదలైంది మాత్రం...

తల్లీ ! నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్త్తుల్ సుశబ్దమ్ము శో
భిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ!
ఫుల్లాబ్జాక్షి! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!

అన్ననాడే. నాన్నగారు, గురువులు నేర్పిన ఈ ప్రార్థనా శ్లోకం వలనే అయినా నా రచనా వ్యాసాంగం పరంగా ఎక్కడ ఏది కుంటువడింది, ఎందుకు అన్నది చాలా నిశ్శబ్దంగా జరిగిపోయింది. ఆగిన ఆ పయనం చలనం తెచ్చుకుంది అని కల/ఆశ కలిసిన భావన.

"ఇక మరువం మాట. అవును అచ్చంగా అలానే, ఆ శీర్షిక విప్పిచెప్పినట్లే" అంటారా.. మరే నేనూ కాదనను కానీ పూర్ణం కరిగిన నెయ్యిలో ముంచుకు తినేసాక, ఆ తోపుని కాస్త ఆవకాయ ఊటలో అద్దుకు తినే అలవాటు ఉన్నవారికి అంత బాధ కలిగించి ఉండనుగాక!

అలా "మరువం" రెండేళ్ళు సాగిపోయింది. ఇవాళ్టితో మూడో ఏట కాలిడింది. గత సంవత్సరం ఇదే రోజు అన్నీ విపులంగా వ్రాసాను కనుక ఈ ఏడు అనవసరమే కదా. కనుక కాసిని ఇతర ఊసుల్లోకి a.k.a జ్ఞాపకాలు వెళ్ళొచ్చా మరి?

*** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

ఈ మధ్య మారథాన్ కోసం దాదాపు పదిమైళ్ళ వరకు ప్రాక్టీస్ పరుగులు చేయాల్సివచ్చింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా నాలుగైదు సార్లు. ఆ రకంగా నాకు అనేకన్నా "నా మనసుకి" ఆ మూడు గంటల రన్ సమయం గొప్ప ఆటవిడుపు. అది నన్ను కాస్త మందలిస్తూ, కాసేపు నా మాటలకి లొంగిపోతూ.. నవ్విస్తూ, ఏడిపిస్తూ..వెరసి నేను నా మనసు ఎదురెదురుగా కాసేపు తూగుడుబల్ల, మరి కాసేపు ఒకరి భుజం ఒకరికి ఆసరా.

నిజానికి వేదన పెంచిన తవ్వకాలే ఎక్కువ ఆ సమయంలో నన్ను కదిపినవి, గతం నుంచి నిన్నా మొన్నల కబుర్ల నుంచి ఎదురొచ్చినవీను. అలా ఎన్నెన్నో ఆలోచనలు, గతకాలాలు దొర్లిపోయినా ఎక్కువగా బాధించని జ్ఞాపకాలని తోడిన అంశం "రేగివడియాలు".

ఒక విధంగా బాల్యం నుంచీ అవంటే అంతే ఇష్టాన్ని, రేగివడియాలు తింటూ గడిపిన వేసవులు, ఆ కబుర్లు అంతే తాజాగా ఉన్నాయంటే అది రేగివడియాల మహిమే. అమ్మమ్మ గారింట్లో మేము ఇంటిదొంగలుగా మారింది వాటి వల్లనే. ఇప్పటికీ ఏడాది పొడుగూతా కాస్త పొదుపుగా అస్వాదించేవి అవే. ప్రస్తుతం అలా రేగి వడియాలు తింటూ చేసే పనే పుస్తక పఠనం. రెండూ ఇష్టమే - ఒకరితో ఇంత అని చెప్పలేనివీ - మరి ఎంత అని నన్ను నేను ప్రశించుకోనివీను. ఏమి చదివావు అంటే ఎదుటివారి మనసుకి నచ్చే జవాబు ఈయలేనివీను...హూ తప్పదు..

రేగి చెట్టుతో మరో అనుభవం - ముక్కు న గుచ్చుకున్న రేగి ముల్లు తీయటం. అదెలా సాధ్యం అనుకున్నారా? ఇది ఆ కథాకమామీషు. ఎన్నో వేసవుల్లానే ఆ వేసవీ అమ్మమ్మ గారి వూర్లో గడిపేస్తున్న ఒకానొకరోజు మా పొలాల్లో కల్లు గీసుకునే భాసి [గాడు] నా బుర్రకి ఎక్కించిన వెఱ్ఱి - రేగిముల్లుతో ముక్కు కుట్టించుకోవచ్చని. ఇక మనసాగదే.

ఈ పని చేయగల సమర్థురాలు కాకర్ల లక్ష్మి గారొకరే అని కూడా చెప్పాడు. అమ్మమ్మ గారికి చెప్పానో లేదో తెలియదు కానీ మంచి కొనదేరిన ముల్లొకటి పట్టుకుని ఆవిడ దగ్గరకి చేరాము. ఆవిడ ఎసరు కాగాక పొడుస్తాను అన్నాక కాస్త భయం పట్టుకుంది. అలా పొంగే పొంగే ఎసరు కుండ సిద్దం అయ్యేసరికి నా గుండెల్లో భయం కూడా ఉప్పొంగిపోతూవుంది గోదావరి కొత్తనీటి పొంగుల్లా.

ఆవిడ కొబ్బరినూనెలో ముంచి తీసిన ముల్లు నా ముక్కుకి దగ్గరకి తెచ్చేసరికే సగం బిక్కచచ్చిపోయాను. పొడవటం తెలిసే సరికే స్పృహ తప్పటం జరిగిపోయింది. మళ్ళీ కళ్ళు తెరిచే సరికి ఆవిడ గరిటెలో ఆ ఎసరు తెస్తున్నారు, ముక్కు కుట్టిన దగ్గర ఆ పొంగునీరు పోస్తే నెప్పి తీస్తుందని చెప్పారు తర్వాత. మళ్ళీ దాదాపుగా సోయ తప్పాను. కష్టపడి అలా బాకులా దిగిన ఆ ముల్లుని ఆ రాత్రికి భరించాను. తెల్లారేసరికి భరించలేనంత బాధ ఉన్నా అమ్మతో కలిసి మా ఊరికి ప్రయాణం.

ఓ గంట అలా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లోని అందరి జాలి దొరికాక, అమ్మ అడిగారు "నిజంగా ముక్కుపుడక పెట్టుకుంటావా, దానికి ఇంకా లావుకాడ మరి?" అని. అంతే కళ్లనీళ్ళ పర్యంతం అవుతూ తల అడ్డంగా ఊపేసి, ఆ ముల్లు పీకించుకుని తేలిక పడ్డాను. ఇప్పటికీ నాకు అర్థం కానిది - ఏ సంస్కారం పురిగొల్పి అలా ముక్కుని బాధ పెట్టి చివరికి ఏమీ బావుకోకుండానే మిగిలిపోయాను అని. :) నృత్యప్రదర్శన సమయాల్లో తప్పించి పెద్దగా అవసరం/మోజు లేని ముక్కుపుడక కోసం అన్ని పాట్లు/తిప్పలు.

ముచ్చటగా మూడోది - మొన్న జనవరిలో సంక్రాంతి రోజుల్లో ఒక భోగిపళ్ళ పేరంటం మిస్సయ్యాను. తర్వాత ఆ బుజ్జాయికి వాళ్ళ అమ్మమ్మ గారు అతి చాకచక్యంగా ఇండియా నుంచి తెచ్చిన రేగిపళ్ళు కలిపిన క్రాన్బెరీ భోగిపళ్ళు పోసారని విన్నాక తెగ బాధ పడిపోయాను. ఎన్నాళ్ళకి తినగలను, ప్రాప్తం లేకపోయిందే అని. అలా ఒక్క వడియాలుగా తప్ప, నాకు మరే రకంగానూ దక్కలేదు రేక్కాయలు గత కొన్ని ఏళ్ళగా. ప్రాప్తం అంటే చటుక్కున గతం నుంచి గొల్లుమంటూ జారిపడింది - నేరేడు.

అల్లనేరేడు - ఇది మా అమ్మమ్మ గారింట్లోనే పరిచయం. ఆ చెట్టుకి ఎన్నిరాళ్ళు వేసామో పాపం. ఎన్ని డొంకీ కర్రలతో గుచ్చామో ఇంకా పాపం. అలా వానాకాలం అవి తిననిదే వెళ్ళేది కాదు. నా ఉద్యోగం చేరిన మొదటిరోజు. అడ్మిన్ ఆఫీసుకి నడుస్తుండగా నిండు కాయలతో నిండారా కొమ్మలతో ఎదురుగా మళ్ళీ ప్రత్యక్ష్యం. ఎవరైనా చూస్తే బాగోదు. అదీ బాధ్యతాయుతమైన వృత్తిలో చేరుతూ, అలా రాళ్ళు అవీ విసిరే పరిస్థితి కాదు. కళ్ళప్పగించి చూస్తూ వదులుకోవాల్సివచ్చింది. అదే కాదు మరెన్నో... మ్చ్...

*** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

ఇక సాపేక్ష సిద్దాంతం - మా సుబ్బ/ఇంట్లో పనుల్లో సాయపడిన మనిషి (పనమ్మాయి అని మా అనుబంధాన్ని కించపరచలేను] నాకెప్పుడూ ప్రశ్నార్థకమే. తనకసలు బాధ/బెంగ రాదా/వచ్చినా తెలియదా అని. అది చేసే అమాయకపు పనులకి అంతు ఉండదా అనీను. నా వరకు తను AA - All India Amaayakuraalu.

అటువంటిది రెండేళ్ల క్రితం చాలా ధీమాగా నాతోనే అంది - "ఏమన్నా అనుకోండి ఉసమ్మ గోరు. తవరు సానా అమాయకులండే" దెబ్బకి నా భ్రమలు తొలిగిపోయాయి. తన లెక్కల్లో, నేను అమాయకురాలిని, నా అంచనాల్లో తనకు మాదిరే. ఎవర్నీ ఫలాన తరహా అని నిర్ణయించుకోకూడదని ఆ రోజే అనుకున్నాగానీ, మానలేదు...ప్చ్..

ఇక్కడ పైన రేక్కాయల్లో నేరేడు కథలా దూసుకొస్తున్నవాడు - కృష్ణ. హైదరాబాదులో ఉన్నప్పుడు మా లాబ్స్ లో అతని పని/రోల్ మర్చిపోయాను కానీ నా హైబ్రిడ్ గులాబీ మొక్కలకి గుర్రపు ఎరువు తెచ్చిపెట్టేవాడు.

నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని కారణాల వలన అందరికీ తెలియపరచలేకపోయాను. వారిలో తనూ ఒకడు.

తిరిగి రెండేళ్ళకి వచ్చినపుడు కలిసాక - "ఏడ్కి పొయినవ్ మేడం,..." అని మామూలుగా అడిగాడు. అలా మాటలు ముగిసాక, "మరి తెచ్చేదా, పట్టుకుపోతవా" అని అడిగాడు. "అబ్బే కుదరదు, చాలా దూరం సిడ్నీ" అనగానే... "మంచిగున్నవ్ లే... పాక్ చేసిస్తా...పదిరోజులున్నా పాడుకాదు" అని హామీ ఇచ్చినా ఆ గుర్రపు ఎరువు తేలేదు కానీ - ఆ క్షణంలో అతని మొహంలోని నిజాయితీ ఇంకా గుర్తే. దానికీ, నీ పరుగుకి ఏం సంబంధం అంటే, నేను మారథాన్ కి ఇంకా సరైన సాధన చేయలేదు, నిజాయితీ తగ్గిందా అనుకున్న క్షణాన మెదిలినవాడు ఇతను.

*** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

కాలేజీలో చదువుకునే రోజుల్లో అనుకోకుండా వచ్చిన ఖాళీ అవర్ లో అంతా కాంటీన్ లో మైసూర్ బజ్జీలు తింటూ టీ తాగుతూ గడుపుతుంటే లైబ్రరీకి వెళ్ళటం అన్న పాపం చేసిన నేను హిమ, మా ప్రారబ్దం కొద్దీ బెల్ మోగటం వినక తర్వాత క్లాసుకి ఒక ఐదు నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాము. అంతే అగ్గిమీద గుగ్గిలమై పోయిన మా సరస్వతి మేడం బయట నిలబెట్టారు.

అలాంటి హర్టయ్యి, ఇంకేదో అయిన బాధాకర వేళల్లో తీసుకున్న నిర్ణయం/చేసిన శపధం ఆవిడ ఆ రోజు చెప్పినదేదీ మళ్ళీ మననం చేయనని. అదే The laws of thermodynamics ఇన్నేళ్ళకి మళ్ళీ నన్ను నిలదీసినదీ అదే. మనం చేస్తున్న పని/ప్రోగ్రామింగ్/బ్లా బ్లా... అంటూ నాకు జాన్ మధ్యన కాస్త వేడిగా భిన్న అంశాల్లోకి సాగిన చర్చలోకి చాప క్రింద నీరులా పాకివచ్చేసింది. The second law of thermodynamics. :) మా చర్చలోని కాసింత మెదడుకి మేతని రాసుకున్నాను.

తెలుగులో రాయటం లేదని విసుక్కోకండి... ఎలాగూ రాసుకున్న నోట్స్ ఉందని దింపేస్తున్నాను.

Easy to just let stuff just happen as it may but law of entropy will ensure that random events will lead to decay. This is true for body, mind, and spirit.

The hope for a humanist is that intelligence will evolve or be invented and increase despite the "Law Of Entropy", 2nd law of thermodymics (which allows for localized reversals of entropy) and come up with a way to survive.

philosophy about mind and spirit - that body, mind, and spirit are not separate entities where one can exist without the other. Since body is subject to entropy, it follows that the mind and spirit are also. Where life, through DNA and other mechanism cheats entropy using the copious energy from the sun, each new being has a chance to choose life or death in each and every little action. Humans through intelligence, are given the understanding to know the choice is being made.

ఒక విధంగా ఆఫిస్ వర్క్ మీదగా వచ్చినా మధ్యలో మరో నాలుగైదు అంశాలు తాకి చివరగా నా బ్లాగ్ పట్ల నా తీరు మీద అది సవాల్ విసిరింది. నేను ఆ పరంగా ఇంకాస్త అధ్యయనం చేయాలి కానీ మరొక్కరైనా అభిప్రాయం పంచుకోరా అన్న ఆశతో ఇక్కడ పెట్టాను.

*** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

ఇవన్నీ కలేసి చూస్తే కలగూరగంప వంటి ఈ రాండం థాట్స్ మీకూ రకరకాల ఆలోచనలు కలిగించవచ్చునేమో కానీ... నా వరకు ఇవన్నీ ఈ బ్లాగ్ మనుగడ, ఇక్కడ తారాడటం వలన కలుగుతున్న లాభనష్టాలు, వాటికి మునుపటి అనుభవసారం వలన అన్వయించాల్సివస్తున్న ఆలోచనలు, ఇకపై భవిష్య ప్రణాలికలు, సాధన పట్ల అవగాహన, ఏమి రాయాలి, ఎంత రాయాలి ఎలా రాస్తే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది - ఇన్ని బుర్రలో నలికీస్ పాముల్లా వేగంగా దొర్లి పోతున్నాయి.

కనుక ఇప్పటికి ఇకపై అదే మాట "పిడికెడు పూర్ణం - దోసేడు తోపు" అన్నది - కాస్త తారుమారు చేసే దిశగా సాగుతానని నాకు నేను నొక్కిచెప్పుకుంటూ, ఇందాక ప్రోత్సాహిస్తున్న చదువరులకు వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ.. మీ ఉష

ఆగండాగండి మరి - కొసరు మాట ఒకటి - నాలా మరొకరైనా ఉంటారేమో.. నాకు నచ్చిన కవితలకి, పాటలకి చిత్రం లిఖించటం ఒక అలవాటు..ఈ కవితకి బొమ్మ గీయటంలో మాత్రం దాదాపు నెలన్నరగా విఫలమౌతున్నాను - ఎవరైనా ఓ చేయి వేస్తారా? http://www.forughfarrokhzad.org/selectedworks/selectedworks1.asp#Another%20Birth

అలాగే మనసు నేను కోతినోచ్ అని కొమ్మచ్చిలాడినప్పుడు ఆడిన ఆట ఇది... ఎవరైనా నన్ను బీట్ చేయగలరేమో చూడండి మరి! ;)

http://totebo.com/mko.php?c=qporqUosEouuEorFBoUBopptotrrro-7Y3ouUFq

ఇకపై ఇలా జ్ఞాపకాల్లో నేను మునిగి, విసుగులో మిమ్మల్ని తేల్చనా వద్దా అన్నది ప్రస్తుతం ఈ కోతి చేతిలోనే ఉంది. భయపడకండి, ఇకపై ఇలా జరగదని హామీ ఇవ్వటానికే ఆ టపా. :)

[సశేషం]

13 comments:

  1. బ్లాగు అనేది సరదాకి రాసుకునేది కాదని నీ బ్లాగు నిరూపించింది. మా అందరి మనసుల్లో మరువం సువాసనలు ఎప్పటికి ఘుబాలిస్తూనే ఉంటాయి. రెండవ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు ఉషా.

    ReplyDelete
  2. బ్లాగు రెండవ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు!

    ReplyDelete
  3. మరువానికి రెండవ పుట్టినరోజు శుభాకాంక్షలు ఉష గారు :-)

    ReplyDelete
  4. ఉష గారు,
    బ్లాగు రెండవ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు!

    ReplyDelete
  5. ముందుగా శుభాకంక్షలు ..
    మనసుకు జ్వరం వచ్చిందెమొ అని అనుమానంగా వుందండి..
    :-)

    ReplyDelete
  6. Challenge me :-)

    http://www.totebo.com/monkey-kick-off.php?c=sorsUorBoUsorFBoUBouuouqBBog3MoEqpr

    ReplyDelete
  7. పుట్టినరోజుకి వచ్చి వెళ్ళేవారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు [సాంప్రదాయాలు సరీగ్గా తెలియవనుకోండి గాని]. అభినందించిన అందరికీ కొని పంపలేను కాని వీలైతే "Love that Dog" దొరికితే చదవండి. చిన్నపిల్లలదే కానీ చిన్నపిల్లల మనసున్న అందరికీ నచ్చుతుంది.

    Love That Dog is the story of Jack..

    Jack is both stubborn and warm-hearted, and he can be both serious and funny. Although he hates poetry at first, he begins to find poems that inspire him.

    At first, his responses are short and cranky: "I don't want to" and "I tried. Can't do it. Brain's empty." But as his teacher feeds him inspiration, Jack finds that he has a lot to say and he finds ways to say it.

    http://www.sharoncreech.com/novels/01.asp

    ఆ బుడతడు నాకు తెగ నచ్చాడు.

    ReplyDelete
  8. కొంచెం లేట్ గా బ్లాగ్ జన్మ దిన శుభాకాంక్షలు ....మీ బ్లాగ్ పేరులానే మీ కవితలను కూడా మరువం మేము

    ReplyDelete
  9. వంశీ, అభిమానంగా వ్యక్తపరిచిన అభిప్రాయానికి థాంక్స్. మరువం నన్నూ [ఆద]మరవనీయదు కనుకనే ఇలా రాయటం. వస్తూండండి.

    ReplyDelete
  10. సుజ్జీ, స్మైలీని వెక్కిరిస్తూ రాసాక కాస్త ఇబ్బందిగా ఉంది వాడాలాంటే...థాంక్స్...:)

    ReplyDelete