తెగిపడిన ముత్యాల సరాలు

ముందు మాట: ఇవి నా ఎనిమిది-పది తరగతుల్లో రాసుకున్న కవితలు. కాలంతో సాగిన నా గానం తీరు చూస్తారని.. నన్నూ నేనూ తిరిగి చూసుకోవచ్చనిన్ని :)

1 *** *** *** *** *** *** ***

ఈ వసంతాన కర్మసాక్షికి మేలుకొలుపై

కెందామరలు విరిసేను..
మలయమారుతం తొంగి చూసి
మంచుతెరలు వీడేను..
కోమల శీతల శిరీషంపై
ప్రత్యూష బిందువు మెరిసేను
ప్రకృతి పరవశించి వెల్లువై
పలికింది స్వాగతం ఉషోదయానికి
ఉప్పొంగింది నవ చైతన్యం జగతిలో, నేస్తం!

2 *** *** *** *** *** *** ***

ఇరు మేఘాల చిరు సందడిలో చినుకుల జడి
మేరు గర్జనల అలజడిలో మెరుపుల ఒరవడి
సరిసరి రాగాల నెత్తావి గుసగుసల గుంభన సడి
విరి తరుల వయ్యారి పూవుల పొంగారు పుప్పొడి
గోధూళివేళల, పున్నమి రాత్రుల జాలువారెడి
తెమ్మెరలు, వెన్నెలవెలుగులు
ఈ పుత్తడి జాడల పొంగిన వెల్లువ ఏదని, ఎలా చెప్పేది?

3 *** *** *** *** *** *** ***

గతపు చంద్రోదయానికి నే పలికిన మేలుకొలుపు
స్మృతుల వెన్నెలై నీలో వెల్లువవలేదా నేస్తం?
కాలం కదిలి బహుదూరంగా తోస్తున్న వాస్తవం
మదికడలిపై చిరుగీత కాబోలు..
నీ జాడల వెనుక నా నీడలు కావా అవి?
నేనొక నిశ్శబ్ద నిశీధి అవుతాను
ప్రతిరేయీ చిరుచుక్కవై పలుకరిమ్చిపోవా?
కాలం కలంగా ఒక పుఠని లిఖించాం
అది చాలు నా జీవితాంతానికి పఠనం

4 *** *** *** *** *** *** ***

సందెపొద్దుతో పందెం వేసి పరుగెత్తి
వెన్నెలమ్మని తోడ్కొని చల్లగా వచ్చింది వెలుగు
చుక్కలన్నీ చక్కగా ఎదురేగి
రేరాజు చెంతన పరిచాయి జిలుగు
వెలుగుని విశ్లేషించి,
జిలుగుని పరివేష్ఠించి
మది వాకిట ఆశల పరిమళం
పరిచిఉంచాను పదిలంగా
నీ జ్ఞాపకాల జాడలపై అద్దిన మధురిమ
సింధూరమై ఎగిసివస్తే
ఆ రంగుల నీడల్లో
నీ రూపుని పరావర్తించి
దాచిఉంచాను మౌనపు క్షణంలో
ఆ క్షణం వికిరణమై,
ఈ మౌనం శబ్దతరంగమై
అనురాగమేళావింపున
నను అలరించేదెపుడో..

5 *** *** *** *** *** *** ***

నింగమ్మ నేలమ్మ నవ్వేటియేళ
చెట్టమ్మ, పుట్టమ్మ పిలిచేటియేళ
గుండె ఊసులన్నీ పొంగేటియేళ
సడిరాని నీవులేని ఈ యేళ
ఏమి చేతును?

6 *** *** *** *** *** *** ***

ఆమని రాకల ఆనందం
కోయిల గొంతున కువకువలే
తీరని చూపుల ఆహ్లాదం
తీయగ చేరే చిరులేఖలే

7 *** *** *** *** *** *** ***

సఖి,
మనసనే పూలతోటలో
అనుభూతుల విరులన్నీ
ఏరి ఏరి తెచ్చేనా
ఎంచి ఎంఛి తురిమేనా
నీ నీలికురులలో..

8 *** *** *** *** *** *** ***

ప్రభు, నీవు పెంచిన ఈ పూలవనాన
పూచిన ఓ పిచ్చిపువ్వును
నా మధురిమ నిను చేరేలోపే
వసివాడిపోతానేమో..

9 *** *** *** *** *** *** ***

నేస్తం,

జీవితపు ఎలమావి తోటలో
స్నేహపు చివురింపు చిరుపంట కొరికిన
కాలపు కోయిల గళాన జీవనగీతమై,
రాగాలు రువ్వే ఈ తరుణం నిత్య శాశ్వతం చేద్దామా?
సాగిద్దామా నిండుగా ఈ ఆమని గానం?

10 *** *** *** *** *** *** ***

కాలపుటెడారిలో నా జీవిత జాడలు
నీకోసం మిగిల్చి పోతున్నా,
కాల్పనిక వాస్తవం కనిపించే ఋజువు కాదు
కన్నీరింకిన కళ్ళన్నీ ఆర్తి తప్త హృది తలుపులే
ఇగిరిపోని ఆ చెలమల్లో నిండు కలువ మన చెలిమి

9 comments:

  1. ఉష గారూ ....మీరు చెప్పారు కాబట్టి కాని ఇవి మీ చిన్నప్పుడు రాసినవంటే ...పువ్వు పుట్టుకతోనే పరిమళిస్తుందనే సామెత నిజమే సుమండీ !!

    ReplyDelete
  2. అమ్మో అప్పుడే అంత టాలెంటెడ్ అన్నమాట:)

    ReplyDelete
  3. parimalam gaaru meeru cheppinadi aksharaala nijam..

    ReplyDelete
  4. అందరికీ థాంక్స్..ఇవన్నీ ఎక్కువగా నేస్తం అంటూ రాసుకున్నవే - అప్పట్లోను, ఎక్కువగా ఇప్పటికీను ఇవి లౌకిక బంధాలని ఊహిస్తూ రాసేవి కావు.
    నన్ను ఉడికించటానికి ఒక స్నేహితురాలు..
    "నింగమ్మ నేలమ్మ నవ్వేటియేళ
    చెట్టమ్మ, పుట్టమ్మ పిలిచేటియేళ
    గుండె ఊసులన్నీ పొంగేటియేళ
    సడిరాని నీవులేని ఈ యేళ
    ఏమి చేతును"
    'ఆ వయసులోనే' -
    అని పంపిన లేఖకి జవాబిది. ఇవి నాలాంటి మరొక హృదయాన్వేషణలు.
    ఈ పదాలు బహుశా కోయిలకో, గాలికో ఎక్కుపెట్టినవైయుంటాయి. నిన్న మా పాప అదే అడిగింది "అవన్నీ నీకు రావా? ఆ నోట్ బుక్ మళ్ళీ తీసి చదువుతున్నావేమని?" "లేదురా రానివాళ్ళతో చదివిద్దామని" చెప్పానందుకే.. :)

    ReplyDelete
  5. చాలా బాగా రాసారండి .తెగిపడిన ముత్యాలు టైటిల్ సరికాదేమో .....ముత్యాలహారం అనవచ్చేమో .

    ReplyDelete
  6. చిన్ని, ఇందులో స్వాతి ముత్యపుచిప్పలో రూపుదిద్దుకున్నవెన్నో, కల్చర్ బాణీలో వెలికి వచ్చినవెన్నో - తెలియదు నాకింకా.. :) కనుక, ఎప్పుడో కలం ఆగేలోగా ఇలా పడేవన్నీ ఒక్కచోట చేర్చి, ఏరి ఎంచి గుది గుచ్చి చేరాల్సిన చోటుకి చేర్చాలి. థాంక్స్.

    ReplyDelete
  7. తెగిపోయిన ముత్యాల సరాలు మేము ఏరుకున్నాం లెండి.అయినా ఎనిమిది తొమ్మిది తరగతుల్లోనే ఈ రేంజిలో కవితలు వ్రాశారంటే ఇంక ఏం చెబుతాం.మీకు సరస్వతీ కటాక్షం సిద్ధించింది.

    ReplyDelete
  8. శ్రీకాంత్ గారు, ధన్యవాదాలు. ఆ చదువుల తల్లి కటాక్ష వీక్షణం త్రుటిపాటైనా జన్మ ధన్యమేగా!

    ReplyDelete