అభిజ్ఞా వైరుధ్యం

దారి పొడుగునా గరిక కుదుళ్ళు
నేల నుదుట తీర్చి దిద్దిన తిలకాల వలే-
నడుమన తళుకు లా చిన్ని ఊదా పూల గుబురు

కానీ, వనమాలి కళ్లకి అదొక కలుపుమొక్క
కంటపడిన మరుక్షణమే ఆ అస్తిత్వపు చివరి మజిలి

బాట పక్కగా గులాబీ పొదలు
తెల్లని పూల తోరణాలతో స్వాగతిస్తూ-
ఒద్దిగ్గా గరిక మొలక ఒకటి కొత్తగా పలకరిస్తూ

తెలుసు, పూలని తృటిలో తెంచిపారేసే వేళ్ళకి 
ఈ చిరువేళ్లని పెరికిపారేయటం రెప్పపాటు పని

ఎందుకో, వెలుపల అన్నీ సహజం గానే ఉంటాయి
యధావిధిగా ఏమీ జరగనట్టుగా--
ఏదో అసౌకర్యం ఎద నిండా అలుముకుని ఉంటుంది సదా...

లేమి

ధరలు పెరిగిపోతున్నాయి
ఎద్దడీ ఎక్కువైపోయింది


వేదన దప్పిక తీర్చి తీర్చి
మోటబావి నీరింకిపోయింది
ఎన్ని వెక్కిళ్ళ పోట్లు పడ్డా
జలపడదే నా గుంటకళ్ళలో


తలగడ వేడిగా ఉంది
చెమ్మగిల్లిన చెంప కావాలి
చెల్లీ! ఒక్కసారి నెప్పి గుర్తు చెయ్యి
పురిషెడు కన్నీరు చెల్లించనిదే రాదు నిదుర...


శ్వాసించే కంబళి కావాలి
ఈ రాత్రికి గుండె గంప కింద దాయాలి
కరువు కాటకాల పిగిలిన నేల
అరువు అడగాలంటే ఇంకెక్కడి అమ్మతనం?


దాహంగా ఉంది
ఎండమావి కావల నీటిచెలమ ఉండదా, ఒక్కటైనా!?
బాటసారీ! నీడ లేదిక్కడ
ఒకరి దేహమొకరికి గొడుగు పట్టాలి
ఈ ఒక్కటీ వెలకట్టకు
బాకీలు తీర్చటానికి తిరిగి వస్తాను
పిలుపుకందే మనిషి ఒక్కడే కలిమి నీకైనా నాకైనా....

[12/26/2013- kavi sangamam*కవి సంగమం*(Poetry)]

పోకడ

కొండ ఎక్కబోయి వెల్లకిలా పడిన మబ్బు
బండరాళ్ల కింద చెమ్మగా చిక్కుకుపోయింది

వేళ్ళని తడిమే వాగులోకి ఒరిగిన తరువు
ఘడియకొక దిక్కులో గొడుగు పడుతుంది

వెదురు పొదల్లో తనువు మరిచిపోయిన గాలి
మోదుగ కొమ్మతో మూగనోము పట్టించింది

వైనాలన్నీ సహజమేనే!

ఏమరుపాటుగా ఉన్న మనసు
పాత ఊసులే తిరగ రాసుకుంటుంది, ఎప్పటి మాదిరిగా. 

అమాశ రాతిరిలో విరిసిన గిన్నెమాలతి పూలద్యుతిని,
ఒంటరి క్షణాల్లో వెన్ను తట్టిన ధృతిని
విడదీయలేక సతమతమౌతుంది...

మండు వేసవి మధ్యాహ్నాల్లో
మేనికి అలుముకున్న వట్టివేరు గంధాలు,
పట్టి పట్టి చదువుకున్న పంక్తుల్లో
తేనియ మధురిమలు
ఒక్కటేనని పంతమాడుతుంది 

ఊహలన్నీ సహజమేగా!?

అర్థ/రహిత/శాస్త్రంచీకటి రెక్కలు విదిలిస్తే 
రాలిపడిన ఈకల్లా ఈ రాత్రులు

లయ తప్పుతూనో 
లయల నడుమ దీర్ఘం గా విశ్రమిస్తూనో
నగారాలు ఆపని కీచురాళ్ళు, వేకువ వరకు బానిసలు

వేదన దక్షత గా
నీ వృత్తం లోకి, బహుశా బరిలోకి దిగుతావు,
ఇదే నేపధ్యం తరుచుగా, వైవిధ్యం కొరతలో 

వాన ధారలకి ఉరేసుకుని
రాలిపడిన పూరేకుల్లా
నీ ఒడిలో తడి అడియాసలు 

గగుర్పాటు పుట్టల్లోంచి 
వెన్ను పాయల్లో పాకిపోతూ
స్వేదజలాలు నిన్ను వణికిస్తో 

పళ్ళ బిగింపులోనో,
గోళ్ళ కోతలోనో
రక్తచారికలై 
నీలో సంచలిస్తున్న క్షణాల సాక్షిగా

సత్యాలు వాస్తవం తో సంధి కుదుర్చుకుంటాయి
లావాదేవీలు ముగుస్తాయి

ఇకప్పుడు

తెలవారగానే వ్యాపారాలు మొదలౌతాయి
ముసుగులు తొడుక్కుని నువ్వు వెలికి వస్తావు-
డబ్బుగా, వస్తువులుగా, 
ఉద్వేగాలుగా, బంధాలుగా, 
అహంగా, జ్ఞానంగా, 
ద్వేషంగా, సంఘర్షణగా - 
పగటివేషాల పెట్టుబడులు మోసుకుంటూ

Blood, sweat and tears paid me a double dividend
అనుకుంటూ:

ఇక ఇప్పుడు చెప్పు

ఇంకొక రాత్రి విభిన్నంగా గడపటమెలాగో? 
వేలంపాటల్లో ఎంత వెచ్చిస్తావూ? నిద్ర కోసం, నీ కోసం

[12/24/2013- kavi sangamam*కవి సంగమం*(Poetry)]

'స్నేహ' కలం నుంచి: Holocaust సమయాన ఒక బాలిక భావాలుగా

స్నేహ నా కూతురైన నా ఆరోప్రాణం. ఇదివరలో ఓసారి తన కవితలు ఇక్కడ పెట్టాను. మరొకసారి పంచుకుందామని- 


One Step Closer

Shots heard ‘til the back of the line.
Ten shots, ten more,
The line is shortening.

Step-by-step I approach death.
His arms wide open,
Accepting.

Memories flashed past,
Family, mother, father, brother,
I will meet you soon.

Reality snaps back,
Three sets left, now two,
One.

I step,
Others step forward from behind
What thoughts have they?
It’s their last.

Time has come,
Fear is not what I have.
Goodbye Hell,

Hello Family.


ఒక అడుగు చేరువగా
------------------------
వరుస చివరికంటా గుళ్ళమోత వినవచ్చింది
పది తూటాలు, మరొక పది
వరుస తరిగిపోతూ ఉంది
అడుగు వెంట అడుగు వేస్తూ నేను మృత్యువుని సమీపిస్తున్నాను
వెడల్పుగా సాచివున్న అతని చేతులు
సమ్మతినిస్తున్నాయి
గతస్మృతులు వెలిగాయి
కుటుంబం, అమ్మ, నాన్న, సోదరుడు
మిమ్మల్ని నేను త్వరలోనే కలుసుకుంటాను
వాస్తవం చిటెకెవేసి వెనక్కి లాగింది
మూడు జట్లు మిగిలాయి, ఇకిప్పుదు రెండు
ఒకటి
నేను అడుగు వేసాను
నా వెనుగ్గా ముందుకు సాగుతూ వాళ్ళు
వాళ్ళు ఏ ఆలోచనల్లో ఉన్నారు?
అదే వారి చివరి యోచన
సమయం ఆసన్నమైంది
నా వద్ద ఉన్నది భయం కాదు
నరకమా, వీడ్కోలు
హలో కుటుంబం.

*****
Crematoria

A snatcher, a kidnapper,
Someone who drags,
Children, Men, Jews, Her.
Catch a breath,
Air, not fire
The taste, bitter.
Sound, dead.
Voice, calm.
She, Pale
Several begin to sing.
Didn’t they know?
No,
Not Death Camps
And
Not the Crematoria.
Open for her,
She knows.

సంగీతాభిమాని

బార్లాగా తెరిచి వుంచిన కిటికీ తలుపులు,
చెవులు రిక్కించి విశ్వపు అలికిడి వినటానికి

సృష్టి పెదవులు ఉచ్ఛరించిన స్వరాలేవో,
నీలోకి నిన్ను నడిపిస్తూ
రాగాల తోటలోకి దారి చూపుతాయి

కోకిల కుదురుగా హారాలు అల్లుతూ
మావికొమ్మలోకి ఒదిగిపొమ్మని ఊరిస్తో...

గున గునా నడిచిపోయే నిషాద స్వర జత
గల గలల సెలయేటి ఒడ్డుకో రమ్మనో... 

మరిక, వింటే తప్ప ఈ వ్యక్తావ్యక్త భావచిత్రాల రూపకల్పన జరిగేదెట్లా-
నిశ్శబ్దం గా కూర్చుంటావిక, ఆ కచ్చేరీ లో. 

నక్షత్రాలు నవ్వినట్లనిపిస్తుంది,
వాన నీటి గిలిగింతలకి. 
అదురులేని నిశ్చింతతో
నెమలి క్రేంకారం వినవస్తుంది. 

భాషా నియమాలు, యతి ప్రాసలు ఎందుకిక-
మణిప్రవాళ కృతులుగా సృష్టి విభజన జరిగిపోయాక-
నీ మోవిపై సీతాకోకచిలుక వదిలివెళ్ళిన పాటమరక కి!? 

మది తలుపులు తెరుచుకున్నాయి
మోసుకొచ్చిన రాగమాలికలు దించుకోవాలి
ఖాళీ లేదీ ఇంట్లో,  కలదిరిగి చూడాలి మరి!
కొత్త ఇల్లు కట్టుకోవాలి, కుదురుగా సర్దుకోవాలి
గళానికొక గది అమర్చుకోవాలి, ఇలా తీరిగ్గా...

పాటలు, పాఠాలు, పద్యాలు, పుస్తకాలు గూర్చి ఓ టపా!

మరువం అంటారని ఒక ప్రశ్న, గుర్తుకొచ్చామా నేను నా శిష్యగణం మరి? ;) 

ఏడాదికి పైగానే అయింది మా బడి కబుర్లు చెప్పుకుని, ఈ బ్లాగులో ఏమైనా రాసుకుని. అంచేత చిన్న పలుకరింపు, నా చిన్నారుల ఊసులు చెప్పుకుందామని,  సమీప భావిలోనో, ఆ తదుపరి కాలంలోనో నా పిల్లకాయలే చదువుకుని సంబరపడతారనీను కూడా-

ప్రస్తుతం వేరే ఊరికి నా నివాసం మార్చినా, పిల్లలు దూరశ్రవణం ద్వారాగానూ పాఠాలు నేర్చుకొనటానికి, చదువుకొనటానికి సంసిద్దత వ్యక్తం చేయడంతో స్కైప్ ద్వారా బడి నడుపుతున్నాను. అదే అనుకోని మార్పు నా బడి నిర్వహణలో. పిల్లలంతా ఒక్క వారం లోపే వినటం, ప్రశ్నలు వెయ్యటం, సందేహ నివృత్తి వంటివి ఒక క్రమంలో చెయ్యటమూ అనూహ్యమైన తృప్తి.  ఒక పంతులమ్మకి ఇంతకన్నా విలువైన గురుదక్షిణ ఉండదనే చెప్తాను.

పాఠ్యాంశాలు ఎప్పటిలా నేనే కూర్చుకుంటున్నాను.  ఆ పరంగా వెదుక్కుని కొన్న కొత్త పుస్తకాలు ఇక్కడ ఉంచుతున్నాను. 

1) నా సహోద్యోగి రేమాండ్ కి ఈ భాష పట్ల నాకున్న అభిమానం వలనే నేనంటే అభిమానమని నా గట్టి నమ్మకం వమ్ముకాలేదు. అతనికి పాత పుస్తకాల విక్రయశాలలకి వెళ్ళి ఎప్పుడూ ఏవో కొనటం అలవాటు(ట). ఒకానొక అటువంటి చోటులో ఈ పుస్తకం అతని కళ్ళబడటం, పదిలం గా కొని, రెండు చాక్లెట్స్ తో కలిపి నాకు కానుక గా ఓనాటి ఉదయాన్నే నా డెస్క్ మీద పెట్టి వెళ్ళటం నన్ను ఆశ్చర్యానందభరితురాలిని చేసింది.  పోతే ఇవి పంచతంత్ర కథలన్నమాట!


పుస్తకం లోని బొమ్మలు చాలా బావున్నాయి, మచ్చుక్కి ఒకటి:
ఈ పుస్తకం గూర్చిన వివరం:

2) ఈ రెండు పుస్తకాలూ నేను Best Book Centre,Hyderabad, AP వారి వద్ద కొన్నాను

ఇంకా బోలెడు విశేషాలు ఉన్నాయి ఇలా చెప్పుకుపోతే. కొన్ని:-


పోయినేడాది,

1. పాలగుమ్మి వారు స్వరపరిచిన 'సీతమ్మ వాకిట చిరుమల్లె చెట్టు చిరుమల్లె చెట్టేమొ చితుక పూసింది' పాటని వింటూ నేర్చుకుని పిల్లలు ఆ సాహిత్యాన్ని అచ్చుతప్పులు లేకుండా రాసారు.


2. జతపరిచిన పరీక్షాపత్రం తో వారి స్థాయి చూసుకుని కొత్త అంశాలు ఎంచుకున్నాను.ఈ ఏడాది,

1. పెద్ద పిల్లలు పద్యరచన అంశాలు, లక్షణాలు,  అలంకారాలు, ఛందస్సు నేర్చుకుంటున్నారు. సామాన్య, సాంఘిక శాస్త్రాలు వాడుక భాషతో అభ్యసిస్తున్నారు, ఆంగ్లం నుంచి తెలుగు కి, తెలుగు నుంచి ఆంగ్లానికి వాటిని అనువాదాలు చెస్తున్నారు (అమెరికా అధ్యక్షుని ఎన్నిక, స్ట్రాటస్ మేఘాలు...)

2. చిన్న పిల్లలు ఆ అక్కలు, అన్నల బాటలో నడుస్తున్నారు. వాక్య నిర్మాణం, కథలు చదవటం, సంభాషణలు నేర్చుకుంటున్నారు

ఇవండి ఇప్పటికి మా బళ్ళో పిల్లలకి నేను నేర్పుతున్నవి, పిల్లల వలన నేను నేర్చుకుంటున్నవి. పనిలో పనిగా సంస్కృతం సాధన మొదలుపెట్టాను. నేను గురువులుగా ఎంచుకున్న వారి తలతింటున్నాను నా పుష్టికి

అన్నట్లు నా బడి ఐదవ సంవత్సరంలోకి అడుగిడింది, అంతలోనేనా అనిపిస్తున్నా గానీ... 

పిలుపొచ్చింది

చూడు మరి, ఈ నిద్రిత నగరాల్లో
ధూళి పరిమళం దొరకదు
ఒకసారి గూడు వదిలిరా..
పయనానికి ఆట్టే సమయం లేదు

ఇదిగో,  గాలివాలులో ఆ తుంగకాడ
వొంగి ఎలా వందనం సమర్పిస్తుందో
నువ్వూ అభివాదం చేసి చూడు
మరో లోకపు ద్వారం తెరుచుకుంటుంది..

చాపి ఉన్న ఊదాపూల హస్తం ఎవరిదో?
గుర్తు చేసుకో..
ఎర్రమన్ను తొక్కుకుంటూ ఆ తూటికొమ్మని తాకిరా

కిత్తనార, నాగజెముడు కలబడుతున్నాయి
మెత్తగా మందలించు

లేతజల్లులో, రాళ్ళ మీద ఆకులేవో
ఆనవాళ్ళు వదిలీ వదలక
దొర్లిపోతున్నాయి,
జాగు చేయక నువ్వూ వేగిరపడు

బురద నేలలో,
చెమ్మలూరే గుంటల్లో
పాదాలు పాతుకుని నిలిచిపో
దేహానికి తాకే ఆర్ద్రత వదులుకోకు

ఉదాసీనం గా ఉన్న పొదని తట్టి లేపు
మొగలి నవ్వులు వినపడే దాకా కదలకు.
వెదురు గుబురుల్లో గాలి కవ్వాల సడికి
ఒప్పుల కుప్పలు తిరిగిరా

బుడగతామర అలుగుతుంది
ఏటి దాపుల్లో ఆగకు
మోకాటిలోతుగా మునిగిరా

మర్రి ఊడలు
మోటుగా ఒరుసుకున్నా
మనసారా ఆలింగనం చేసుకో
అడవి రేగి ముళ్ళు గుచ్చినా
ముద్దు పుచ్చుకో
తంగేడు పూల ఒడిలో
కాసేపు సేద తీరిరా

ఊరడిల్లిన హృదయాన్ని,
నిర్మలమైన మనసుని
పదిలం గా చూసుకో.
లోయలంతా ధ్వనించేలా
ఎలుగెత్తి పాడుకో.
మిన్నంటేలా నాదమొకటి మ్రోగించు
నీ చెవిలో ఈ లోకపు జాడ చెప్పిన
ఆ అదృశ్యవాణికి వందనాలు పంపుకో

మరొక రేయిలో-నీ కొరకై నియమించిన-
దివ్య పరిసరాల్లో చరించే శ్వేతాశ్వం
దిగి రావచ్చు, ఇంకొక కలలో. 

జీవం తొణికే తనువులో
అనుభూతిబీజం నాటుకో..
నీలో కోటి విశ్వాలు అంకురిస్తాయి
ఇక వృక్షాలు పెరిగే వరకు
నీలోనే నీతోనే నీ వనవాసం,
ఏకాంత స్వప్నాలతో సహవాసం...

చందమామ రావే

సూదిబెజ్జంలో దూరి దూకుతున్నట్లు చినుకులు-
సన్నసన్నని వాన 
సామూహిక విన్యాసాలకి ప్రారంభసూచిక.  

కుదుపుకి కదిలే పండుటాకులు,
పుడకలమీద మొగ్గలు వేస్తూ పిట్టలు,
ఆకతాయి కూనలూ, కుక్కపిల్లలు...
ఆటవిడుపులో హాయి వదిలేదెవరు!   

మరిక,
మబ్బుపట్టి విడిచిన సాయంత్రాలు
విశ్రాంతిగా అలసట తీర్చుకుంటాయి

సగం తెరిచి ఉంచిన కిటికీల్లో-
రాలిపడుతున్న పసుపుపూల రేకుల్లా, దీపపు కాంతులు.
లంగరేసిన నావల్లా, గాలికి ఊగే నీడలు.
వరసకట్టి వానచిత్రాలే

వీధుల్లో వాహనాలు మందగించిన వేగంతో
వేళతప్పుతూ ఇళ్ళకి చేరుకుంటాయి

మసకచీకటి కమ్మిన సమయాలు
గమ్మత్తు గా అలసట తీరుస్తాయి

ఒక్కసారిగా నిదురమత్తు ఎక్కిస్తారు, ఎవరో?
హడావుడిగా పరుగు పెట్టిన ప్రపంచం
నిదానంగా మంచాల్లో, కుర్చీ కమ్మీల్లో ఒదుగుతుంది
ఇంకాస్త నెమ్మదిగా నక్షత్రాలు చలిస్తుంటాయి,
కొండలపాట వినాలని పృధ్వి మేలుకునే ఉంటుంది తెల్లార్లూ...

ఆహ్లాదం

సరస్సులో లోకం ఉంటుంది
వెళ్ళగలిగితే,
రాళ్ళ మీద ఆనవాళ్ళతో
దారి వెదుక్కుంటే... 

రాగరంజితమైన పొద్దులు
మోము దాచుకుంటూ ఉంటాయి

మంచుభాష్పాలకి నలిగిన కల్హారలు
నీ చేతుల్లోకి ముడుచుకుంటాయి

సిరి గంధపు రజను
ఒండ్రులో సురభిళంగా గుబాళిస్తుంది

వర్ణాలు మాయని పండుటాకులు
నీ కాలి అందెలుగా అమరిపోతాయి

భాష్యాలు తెలియని మొప్పల సైగలతో
రెప్పలార్చని మీనాలు వెక్కిరిస్తాయి

నీలోనూ సరస్సులు ఉంటాయి
నిశ్చలం గా కొన్నైనా,
నీ హృదయ శీతోష్ణస్థితి రీతులకి
అలవడి నిలబడితే...

మోక్షణము

(ముందుగా ఈ వచనం చదివి చిత్రం పంపిన ఆత్మీయురాలి ద్వారా, గూగుల్ సౌజన్యం తో) 


పక్కకి వత్తిగిల్లి- మనిషి పట్టేంత మనసు తో, 
బోలుగా, ప్రసరణ, ప్రకంపన, ప్రతిధ్వని తాకని దేహంతో-
తను నన్ను చేరువగా రమ్మని సైగ చేసింది. 
ఆ మునివేళ్లలో సవ్వడి చేసే గాలి:
మూసుకుంటున్న నా హృదయపు తలుపుల మీద
తోసిపుచ్చలేని మాటలా బరువుగా వాలింది. 

విద్యుద్దీపపు  కాంతులలో మెరిసే దుప్పటి మీద:
సజ్జలో మిగిలి పోయి వడిలిన మందారం లా, 
శస్త్ర చికిత్స గురుతులతో ముడుచుకున్న ఆ వదనం. 
మదిలోని మాటకన్నా, వాయుకోశాల లోని వేడినే
వెదజల్లుతున్న ఆ నోరు తెరుచుకున్న అగ్నిపర్వతం. 

కనుపలకల మీద తరుచుగా తారట్లాడే
చీకటివెలుగుల మౌనం: 
నీలిరంగు తెరల బింబాలు, నీలి నీడలుగా. 
సమీపానే బిరాబిరా సాగుతున్న ప్రవాహం, 
మిడిసిపడుతున్న వినీలాకాశం కలిసికట్టుగా
విశ్వపు గాథ ఆలపిస్తునట్లే-
ఆ/మె జీవితకాల/దేహపు గాయాల చరిత్ర వినిపిస్తూ... 
ఓడిపోతున్నాయి అల్పమైన వేదనలు
రాలిపడుతున్న నా అశ్రు కణాల రణంలో,
వీగిపోతున్నాయి విలువ లేని శోధనలు
కూడదీసుకుని తను విప్పుతున్నమానవతతో. 

మరణ స్పృహ తో కాంక్షా గ్రహణం విడిచిన చందమామ
లోకపు మరకలు అంటని తెల్లని మమత చుడుతూ,
మరుక్షణపు తీరు ఎరుగని పసితనపు దయ కురిపిస్తూ
ముడుచుకున్న నా ఆత్మలోకి పయనిస్తోంది. 
పరాజయం పాలుచేస్తూనే ప్రక్షాళనం చేస్తుంది

బెరడు చీల్చుకుని మోడులోని పచ్చదనమై మిగిలిన స్పర్శ
రాతి పగుళ్ళలో మొలకెత్తిన అంకురమై తన స్ఫూర్తి. 
మలిగిపోతున్న దీపాన్నికాచే హస్తం, తన అమృత గుణం. 
ఆమె నన్ను బతుకు రాటకి బంధిస్తూనే,
నుదుటి మీద స్మృతిగా వెలుగుతూ  
నా శవం నుంచి నన్ను విడుదల చేసింది
శాశ్వత నిదురలోకి జారిపోతూ నన్ను మేలుకొలిపింది.
(ఈ చిన్ని వచనకవిత కారెన్ కి అంకితమిస్తూ.   దాదాపుగా మృత్యుఛాయలకి నేనూ వెళ్ళొచ్చాను. దీనివలన బ్రతకాలన్న ఆశకన్నా బ్రతకటం/బ్రతికి ఉండటం లోని విలువ ఇంకాస్త అవగాహనలోకి వచ్చింది.  అలాటి పరిస్థితిలో కలిసిన ఒకరి జీవితం మరొక పాఠం.  నాకు ఆమె ఆస్పత్రి లో పరిచయం.  

పేరు Karen  She is being treated for a disease that has no cure.  Up until 10 years ago she was an active sports person and energetic employee.  Now she is bed-ridden. She gets a drip of nutrients injected for about 14 hours each day.  No food through mouth given even in liquid form. Time to time she gets stomach upset and needs to use bed pan for 20-30 times.  She can't sit without support and tied up. Her body started to give up.  Not able to bear her pain her husband left her (it's a bitter fact but true).  She is alone.  Her body heats up so much she has to put ice packs around body to cool off.  In the middle of this trauma she does volunteer work - she gives counseling to parents that have kids of this disease and ease up their stress.  She runs fund raising programs.

She touched and talked to me in such a kind and inspiring voice and so keen looks.  I felt that I touched god. In recent days she is the only one that I felt at peace being with.  నందివర్థనం వంటి తన అరచేయి లో నా చేయి ఉంచుకుని ఆమె నాతో జోల పాడించుకుంది, నాకు వచ్చిన రీతిలోనే పాడిన 'జో అచ్యుతానంద...'   వింటూ పడుకుని "మర్నాడు నిన్న రాత్రి చాలా హాయిగా నిద్రపోయాను" అని తను అన్నప్పటి ఆనందం కన్నా నిదురలో ఉన్న ఆమె మోములోని ప్రశాంతత నన్ను నిలవరించింది. ఎన్నో రోజుల వ్యవధిలేని ఆమె జీవితం ఇంకాస్త పొడుగ్గా సాగితే ఆ ఛాయల్లో మరి కొందరికి నీడ/ఆలంబన దొరకవచ్చు. 

ఈ భావాలు ఏవీ మిగలకపోవచ్చు, బహుశా ఈ స్ఫూర్తి అనంత కాలప్రవాహం లో ఇంతే గాఢత తో ఉండకపోవచ్చు, కానీ ఈ జ్ఞాపకాన్ని దర్శించే ప్రతి సారీ అంతే ప్రభావాన్ని మాత్రం చూపుతుంది.   ఈ నలుపు తెలుపుల సమ్మిళిత బ్రతుకు లో కొన్ని కాంతిరేఖలు ఇలాంటి కొందరు. "వారి కొరకే వస్తారు సూర్య చంద్రులు...")

"మరువం" పుస్తకావిష్కరణ - మరువలేని స్మృతుల నెమరువేత

ఈ ఏడాది సహస్ర పూర్ణ చంద్ర దర్శన భాగ్యశీలి అయిన మా నాన్న గారికి అనురాగ పురస్కారం గా - తనకి అంకితమిచ్చిన - 'మరువం' కవితా సంకలనం ఆగష్టు నెలలో ఆయన చేతుల మీద గా  విడుదల అయింది.  ఆ సందర్భం గా హైదరాబాదులో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కాసిని కబుర్లు పంచుకుందామని- 

నాన్న చూపనిదేదీ నాకు అపరిచితం.
అస్థిత్వం విసిరిన సవాలుకి నా జవాబు,
ఆ నాన్న కూతురు నేనంటేనే నాకు ఇష్టం


పుస్తకం చేతిలో పడినా ఇంకా కలగానే ఉంది! గత సంవత్సరం గడిచిన తీరుకి ఇది సాధ్యపడుతుందనుకోలేదు కనుక-ముందు గా బ్లాగు ముఖం గా తప్ప నన్నెరుగకపోయినా, ఆహ్వానాన్ని మన్నించి, వీలు చేసుకుని, నాతో సమయం గడిపిన, లేదూ ఫోనుల్లో అభినందించిన బ్లాగు మిత్రులందరికీ కృతఙ్ఞతలు!!! ముఖ్యం గా జ్యోతి, శ్రీలలిత గారు, మాలాకుమార్ గారు, పి.యస్.యం లక్ష్మిగారు, సి.ఉమాదేవిగారు, జయ, నీహారిక, ఫణి ప్రదీప్, నూతక్కి రాఘవేంద్ర గారు, ఆచార్య ఫణీంద్రగారు, శ్యామలీయం గారు, కస్తూరి మురళీకృష్ణగారు - మరపురాని ఘటనలో మీరంతా పాలుపంచుకున్నందుకు చాలా సంతోషం. మమతల ఎద్దడిలో, పరుగుల రద్దీలో ఎప్పటిలా లేత వత్తిడిలో అల్లల్లాడుతున్నా గంపెడు జ్ఞప్తుల వొద్దిక ఇంకా రాలేదు కనుకా అవీ ఇంకా ఉక్కిరిబిక్కిరి జడిలో తడుపుతున్నాయి. (ఎవరినైనా మరిచిపోయుంటే మన్నించండి)-

అలాగే అడగగానే బ్లాగులో చదివిన గురుతులు నెమరువేసుకుని ఆప్తవాక్కులు అందించిన ఫణి ప్రదీప్, భావన, జ్యోతి, ఆనంద్, శ్రీలలిత, బాబాయ్, తృష్ణ, యన్. యస్. మూర్తి, కెక్యూబ్ వర్మ గార్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.  నా కవితలకి తన అనువాదాలు జతపరచటానికి అనుమతించిన మూర్తి గారికి నమస్సులు.  చిత్రకారునికి కళ అందుకునే అభినందన చాలునన్న - నా ఊహ ని తన సృజనతో చక్కని చిత్రం గా మలిచిన - స్నేహితునికి ప్రత్యేకాభివాదాలు. ఈ పుస్తక ప్రచురణ అనుకున్న ఘడియ నుంచి ఆ సంకల్పం సిద్ధించటానికి జ్యోతి చేసిన సాయం మాటల్లో ఇమిడ్చే నేర్పు నాకు లేదు.   సింహ భాగపు పని అందుకోవటం చాలా శ్రమతో కూడినది.  తను చాలా సమర్థవంతం గా దాన్ని నిర్వర్తించింది.  ఇక్కడ ప్రస్తావించటం సబబు కనుక చెప్పటం, అది స్నేహపూరిత భావన అయినా కూడా...సత్వరమే ఒక సమీక్ష ని అందించిన మాలిక పత్రిక యాజమాన్యానికి,  చిక్కని అభిప్రాయాలు ఇచ్చిన శైలజామిత్ర గారికి నా కృతఙ్ఞతలు.  
మరువమా నిన్ను మరవగలమా! అంటో మాలాకుమార్ గారు దాదాపుగా అన్ని కబుర్లూ చెప్పేసారు. ఇకిప్పుడు రెండు ముక్కలు చెప్పి తప్పుకుంటాను:

అపుడపుడూ నేను విడి కాగితాల మీద వ్రాసుకోవటం చూసి నాన్నగారు తనే స్వయంగా చేత్తో కుట్టి ఒక బుల్లి పుస్తకం ఇచ్చారు. ఆ అట్ట మీద "భావాలు-భాష్యాలు, కవితలు-కల్పనలు" అని వ్రాసుకున్నాను. నా 12-18సం. వయసు వరకు రాసుకున్నవి అందులోనే ఉంటాయి. 

పుస్తకంలో మొదటి పేజీ:
నేను అలా తొంగిచూసుకుంటే అసలు మొదటిది ఒక మతిస్థిమితం లేని అమ్మాయి "వస్తున్నా వస్తున్నా వట్లమ్మా.."  అని రోడ్ల వెంట పరిగెట్టేది.  తన మీద యేదో వ్రాసుకున్నాను కానీ గుర్తు లేవా పంక్తులు.  తెగిపడిన ముత్యాల సరాలు గా మునుపు పంచినవి ఈ పుస్తకం లోవే.  

నాన్న గారికి - ఆయన నా పదేళ్ళ ప్రాయం లో చేసిన ఓ చిన్న ఆపేక్షతో కూడిన చర్య నా కవితలకి శ్రీకారం కనుక - నా పుస్తకమే సరైన వందనం అనిపించింది. కంప్యూటర్ యుగపు తాకిడి ఆయన్ని ఇంకా తాకలేదు, అందుకే అచ్చు పుస్తకపు గోరువెచ్చని ఆపేక్షగా మిగిలింది ఈ అనుభూతి.  అమ్మ లేని లోటు తో వెలితి పడతారని వీలైనంత క్లుప్తం గా నాన్న గారి స్వస్థానం/గృహం లో - నేను, నా వాళ్ళు, అతి కొద్ది బంధు మిత్రుల సమక్షం లో (సమైఖ్యాంధ్ర బంద్ వలన ఇంకా కుంచించిన ఆహుతులతో) సహస్ర పూర్ణ చంద్ర దర్శన యజ్ఞం, సత్యనారాయణ వ్రతం, గీతాపారాయణం గరిపాక -నాన్న గారి చేత పుస్తకం ఆవిష్కరణ చేసాము. పుస్తకం విడుదల ముందు వెనుకల్లో మరి కొందరు సాహితీ మిత్రులతో భేటీ కూడా చిక్కని అనుభూతి.  

ఇక చివరగా, ఒక మనవి:  ఈ పుస్తకం అమ్మకాలు అన్నవి ముందు నుంచి అనుకున్నవి కావు.  కానీ,  ఈ ద్వారా నాతోపాటు పుస్తకం లో పాలు పంచుకున్న కళాకారులు, సాంకేతిక నిపుణుల పనితనమూ మరిందరికి చేరుతుందని కొంత,  ఈ ద్వారా వచ్చే రాబడి కొందరు కళాకారులకి చేయూత గా ఇవ్వొచ్చని మరి కొంత భావనతో నవోదయ వారికి ఇవ్వటం అయింది. విడి గా ఇండియాలో జ్యోతి వద్ద, లేదా, అమెరికా లో నా నుంచి ప్రతులు కొనవచ్చును.  ఈ ప్రయత్నానికి మీరు అందించే సహకారానికి ముందు గానే ధన్యవాదాలు. నన్ను ushaaడాట్raani యట్ gmail డాట్ com ఐడి పై సంప్రదించండి లేదూ జ్యోతిని  jyothivalaboju యట్ gmail డాట్ com పై గానీ,  దిగువ ఇచ్చిన చిరునామా కి రాసి కానీ తెప్పించుకోవచ్చు. నిజానికి ఇవి కూడా ఒకరికి పురమాయించినవి కావు,  నీహారిక, బాబాయ్, బంధుమిత్రులు తమ తమ కామెరాల్లోవి పంచితే నేను ఒక సముదాయం గా ఇక్కడ పెట్టాను కనుక చాలా రాండం ఆర్డర్ లోను కవరేజ్ లేనట్లో ఉన్నాయి.  జ్ఞాపకాలు మాత్రం మెండు! విందు కి విచ్చేసిన మిత్రుల నుంచి నాకు అనుమతి ఉన్నంత వరకు పిక్స్ పంచుతున్నాను:  మరువపుతావి నద్దుకున్న పూవులు గా

మరువపు పుస్తకావిష్కరణ - విందు కు ఆత్మీయ ఆహ్వానం!!!


"ఎద చుట్టూ అదృశ్యం గా అలుముకున్న ఆవరణ
మునుపెన్నడూ ఎరుగని ఆఘ్రాణింపు తో కవ్విస్తుంది
అక్షరాలు ఊపిరి పోసుకుంటూ నన్ను పీల్చుకుంటాయి
వ్యక్తానువ్యక్తంగా వేయి ఆవరణలు 
వేచి ఉన్నాయి కల/పు/వేటు దూరాన"మరువపు మైత్రి వనవాసులకు, 

ఈ ఏడాది సహస్ర పూర్ణ చంద్ర దర్శన భాగ్యశీలి అయిన మా నాన్న గారికి అనురాగ పురస్కారం గా - తనకి అంకితమిచ్చిన - 'మరువం' కవితా సంకలనం ఈ నెల ఏకాదశి కి ఆయన చేతుల మీద గా  విడుదల అయింది.  ఈ ఆనంద ఘడియల్లో నన్నెరిగిన  మిత్రులను, అభిమానించే వ్యక్తులను కలవాలని అభిలషిస్తున్నాను.

ఈ నెల 13 (08/13/13) కి హైదరాబాదు లో విందు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  సాయంత్రం 4:30కి సమావేశమై, స్వల్ప సంభాషణ అనంతరం 6:30-7:00కి  విందు. ఈ వేడుకకి రాదలిచిన వారు నా స్నేహితురాలు జ్యోతి, jyothivalaboju యట్ gmail డాట్ com కి సమాధానం (08/11/13 లోగా ) పంపితే ఇతర వివరాలు అందిస్తాము.  నేను ప్రయాణం నడుమ ఉన్నందున తను నా తరఫున సహాయం ఇస్తుంది. 

ఎవరెవర్ని కలవగలనా అన్న కుతూహలం, ఇదంతా అతి త్వరలోనే అన్న  సంతోషం తో ఎదురుచూస్తూ,

మీ మరువం ఉష.

చివురుని చిదిమితే, మారాకు పల్లవించదా...

ఏమో తెలియదు నాకింకా ఏమనుకుని ఏమౌతున్నానో, ఇంకేమి అవనున్నానో! ఇప్పటికి మాత్రం అనుకున్న ప్రకారం 3 సంవత్సరాలు నేనే కలదిరిగిన తోటకి కట్టిన దడి తీసేస్తున్నాను.