అర్థ/రహిత/శాస్త్రం



చీకటి రెక్కలు విదిలిస్తే 
రాలిపడిన ఈకల్లా ఈ రాత్రులు

లయ తప్పుతూనో 
లయల నడుమ దీర్ఘం గా విశ్రమిస్తూనో
నగారాలు ఆపని కీచురాళ్ళు, వేకువ వరకు బానిసలు

వేదన దక్షత గా
నీ వృత్తం లోకి, బహుశా బరిలోకి దిగుతావు,
ఇదే నేపధ్యం తరుచుగా, వైవిధ్యం కొరతలో 

వాన ధారలకి ఉరేసుకుని
రాలిపడిన పూరేకుల్లా
నీ ఒడిలో తడి అడియాసలు 

గగుర్పాటు పుట్టల్లోంచి 
వెన్ను పాయల్లో పాకిపోతూ
స్వేదజలాలు నిన్ను వణికిస్తో 

పళ్ళ బిగింపులోనో,
గోళ్ళ కోతలోనో
రక్తచారికలై 
నీలో సంచలిస్తున్న క్షణాల సాక్షిగా

సత్యాలు వాస్తవం తో సంధి కుదుర్చుకుంటాయి
లావాదేవీలు ముగుస్తాయి

ఇకప్పుడు

తెలవారగానే వ్యాపారాలు మొదలౌతాయి
ముసుగులు తొడుక్కుని నువ్వు వెలికి వస్తావు-
డబ్బుగా, వస్తువులుగా, 
ఉద్వేగాలుగా, బంధాలుగా, 
అహంగా, జ్ఞానంగా, 
ద్వేషంగా, సంఘర్షణగా - 
పగటివేషాల పెట్టుబడులు మోసుకుంటూ

Blood, sweat and tears paid me a double dividend
అనుకుంటూ:

ఇక ఇప్పుడు చెప్పు

ఇంకొక రాత్రి విభిన్నంగా గడపటమెలాగో? 
వేలంపాటల్లో ఎంత వెచ్చిస్తావూ? నిద్ర కోసం, నీ కోసం

[12/24/2013- kavi sangamam*కవి సంగమం*(Poetry)]

5 comments:

  1. mee blog 2010 lo chadivinattu gurthu..chaalaa baagunnaayi kathalu...maLLee chaduvutunnaa

    ReplyDelete
  2. ధనుర్మాసపు చలిలో ముసుగేసి పడుకున్న మనసును నిదురలేపి చక్కని కవిత వినిపించారు.
    మనసుకు రాజీ లేనపుడు రాజీనామానే!

    ReplyDelete
  3. లయ తప్పుతూనో
    లయల నడుమ దీర్ఘం గా విశ్రమిస్తూనో....భలే నచ్చింది

    ReplyDelete
  4. ముగ్గురికీ నెనర్లు. ఉమాదేవి గారు, నిద్రాణమైపోతాననే ఈ జాగరూకత అనుకోండి.

    ReplyDelete

  5. తొడుగు ముసుగుల సంచారుల మధ్య...
    అర్థ/రహిత/శాస్త్రం...
    యెంత చక్కటి కవనం...

    ReplyDelete