ఆహ్లాదం

సరస్సులో లోకం ఉంటుంది
వెళ్ళగలిగితే,
రాళ్ళ మీద ఆనవాళ్ళతో
దారి వెదుక్కుంటే... 

రాగరంజితమైన పొద్దులు
మోము దాచుకుంటూ ఉంటాయి

మంచుభాష్పాలకి నలిగిన కల్హారలు
నీ చేతుల్లోకి ముడుచుకుంటాయి

సిరి గంధపు రజను
ఒండ్రులో సురభిళంగా గుబాళిస్తుంది

వర్ణాలు మాయని పండుటాకులు
నీ కాలి అందెలుగా అమరిపోతాయి

భాష్యాలు తెలియని మొప్పల సైగలతో
రెప్పలార్చని మీనాలు వెక్కిరిస్తాయి

నీలోనూ సరస్సులు ఉంటాయి
నిశ్చలం గా కొన్నైనా,
నీ హృదయ శీతోష్ణస్థితి రీతులకి
అలవడి నిలబడితే...

3 comments:

  1. వావ్......మరువపు పరిమళాలు మరో మారు ఆస్వాధించే భాగ్యం ఎన్నాళ్ళకెన్నాళ్ళకి :-)

    ReplyDelete
  2. సరస్సులో లోకం ఉంటుంది
    వెళ్ళగలిగితే,
    రాళ్ళ మీద ఆనవాళ్ళతో
    దారి వెదుక్కుంటే... ఎంత బాగా చెప్పారు. పద్మగారన్నట్టు ఎన్నాళ్ళకెన్నాళ్ళకి మరువపు పరిమళం..

    ReplyDelete
  3. పద్మార్పిత, వర్మ గారు, నెనర్లు. మరువం అనునిత్యం కొత్త చిగుళ్ళు వేస్తూనే ఉంటుంది అన్నది మొక్కల పెంపకం రీత్యా అనుభవమే. ఈ మరువం -రాత కి రాత మాత్రమే కసరత్తు అని- అనుభూతమైనది. అనుభవైక వేద్యమైన స్థితికి చేరటానికి కొంత విరామం అవసరపడింది...

    ReplyDelete