లేమి

ధరలు పెరిగిపోతున్నాయి
ఎద్దడీ ఎక్కువైపోయింది


వేదన దప్పిక తీర్చి తీర్చి
మోటబావి నీరింకిపోయింది
ఎన్ని వెక్కిళ్ళ పోట్లు పడ్డా
జలపడదే నా గుంటకళ్ళలో


తలగడ వేడిగా ఉంది
చెమ్మగిల్లిన చెంప కావాలి
చెల్లీ! ఒక్కసారి నెప్పి గుర్తు చెయ్యి
పురిషెడు కన్నీరు చెల్లించనిదే రాదు నిదుర...


శ్వాసించే కంబళి కావాలి
ఈ రాత్రికి గుండె గంప కింద దాయాలి
కరువు కాటకాల పిగిలిన నేల
అరువు అడగాలంటే ఇంకెక్కడి అమ్మతనం?


దాహంగా ఉంది
ఎండమావి కావల నీటిచెలమ ఉండదా, ఒక్కటైనా!?
బాటసారీ! నీడ లేదిక్కడ
ఒకరి దేహమొకరికి గొడుగు పట్టాలి
ఈ ఒక్కటీ వెలకట్టకు
బాకీలు తీర్చటానికి తిరిగి వస్తాను
పిలుపుకందే మనిషి ఒక్కడే కలిమి నీకైనా నాకైనా....

[12/26/2013- kavi sangamam*కవి సంగమం*(Poetry)]

No comments:

Post a Comment