పిలుపొచ్చింది

చూడు మరి, ఈ నిద్రిత నగరాల్లో
ధూళి పరిమళం దొరకదు
ఒకసారి గూడు వదిలిరా..
పయనానికి ఆట్టే సమయం లేదు

ఇదిగో,  గాలివాలులో ఆ తుంగకాడ
వొంగి ఎలా వందనం సమర్పిస్తుందో
నువ్వూ అభివాదం చేసి చూడు
మరో లోకపు ద్వారం తెరుచుకుంటుంది..

చాపి ఉన్న ఊదాపూల హస్తం ఎవరిదో?
గుర్తు చేసుకో..
ఎర్రమన్ను తొక్కుకుంటూ ఆ తూటికొమ్మని తాకిరా

కిత్తనార, నాగజెముడు కలబడుతున్నాయి
మెత్తగా మందలించు

లేతజల్లులో, రాళ్ళ మీద ఆకులేవో
ఆనవాళ్ళు వదిలీ వదలక
దొర్లిపోతున్నాయి,
జాగు చేయక నువ్వూ వేగిరపడు

బురద నేలలో,
చెమ్మలూరే గుంటల్లో
పాదాలు పాతుకుని నిలిచిపో
దేహానికి తాకే ఆర్ద్రత వదులుకోకు

ఉదాసీనం గా ఉన్న పొదని తట్టి లేపు
మొగలి నవ్వులు వినపడే దాకా కదలకు.
వెదురు గుబురుల్లో గాలి కవ్వాల సడికి
ఒప్పుల కుప్పలు తిరిగిరా

బుడగతామర అలుగుతుంది
ఏటి దాపుల్లో ఆగకు
మోకాటిలోతుగా మునిగిరా

మర్రి ఊడలు
మోటుగా ఒరుసుకున్నా
మనసారా ఆలింగనం చేసుకో
అడవి రేగి ముళ్ళు గుచ్చినా
ముద్దు పుచ్చుకో
తంగేడు పూల ఒడిలో
కాసేపు సేద తీరిరా

ఊరడిల్లిన హృదయాన్ని,
నిర్మలమైన మనసుని
పదిలం గా చూసుకో.
లోయలంతా ధ్వనించేలా
ఎలుగెత్తి పాడుకో.
మిన్నంటేలా నాదమొకటి మ్రోగించు
నీ చెవిలో ఈ లోకపు జాడ చెప్పిన
ఆ అదృశ్యవాణికి వందనాలు పంపుకో

మరొక రేయిలో-నీ కొరకై నియమించిన-
దివ్య పరిసరాల్లో చరించే శ్వేతాశ్వం
దిగి రావచ్చు, ఇంకొక కలలో. 

జీవం తొణికే తనువులో
అనుభూతిబీజం నాటుకో..
నీలో కోటి విశ్వాలు అంకురిస్తాయి
ఇక వృక్షాలు పెరిగే వరకు
నీలోనే నీతోనే నీ వనవాసం,
ఏకాంత స్వప్నాలతో సహవాసం...

3 comments:

  1. మరువం అంటే, తప్పకుండా చూసేదాన్ని మీ బ్లాగ్ .
    మీరు నన్ను మరచిపోయి ఉండవచ్చు, మీ శైలి నాకు నచ్చుతుంది.

    ReplyDelete
  2. ఊరడిల్లిన హృదయాన్ని,
    నిర్మలమైన మనసుని
    పదిలం గా చూసుకో....నైస్

    ReplyDelete
  3. మిరాజ్ ఫాతిమా గారు, మరిచిపోవటం నా విషయం లో చాలా అరుదు. అపుడపుడు బ్లాగుల్లో "కవితలు" -కవిత్వం నా జీవితాన్ని, మనసుని, మేధని అల్లుకున్న పడుగుపేక కనుక- చదవటం మానలేదు ఈ మూడేళ్ళుగా...మీకు, పద్మార్పితకి నెనర్లు.

    ReplyDelete