చందమామ రావే

సూదిబెజ్జంలో దూరి దూకుతున్నట్లు చినుకులు-
సన్నసన్నని వాన 
సామూహిక విన్యాసాలకి ప్రారంభసూచిక.  

కుదుపుకి కదిలే పండుటాకులు,
పుడకలమీద మొగ్గలు వేస్తూ పిట్టలు,
ఆకతాయి కూనలూ, కుక్కపిల్లలు...
ఆటవిడుపులో హాయి వదిలేదెవరు!   

మరిక,
మబ్బుపట్టి విడిచిన సాయంత్రాలు
విశ్రాంతిగా అలసట తీర్చుకుంటాయి

సగం తెరిచి ఉంచిన కిటికీల్లో-
రాలిపడుతున్న పసుపుపూల రేకుల్లా, దీపపు కాంతులు.
లంగరేసిన నావల్లా, గాలికి ఊగే నీడలు.
వరసకట్టి వానచిత్రాలే

వీధుల్లో వాహనాలు మందగించిన వేగంతో
వేళతప్పుతూ ఇళ్ళకి చేరుకుంటాయి

మసకచీకటి కమ్మిన సమయాలు
గమ్మత్తు గా అలసట తీరుస్తాయి

ఒక్కసారిగా నిదురమత్తు ఎక్కిస్తారు, ఎవరో?
హడావుడిగా పరుగు పెట్టిన ప్రపంచం
నిదానంగా మంచాల్లో, కుర్చీ కమ్మీల్లో ఒదుగుతుంది
ఇంకాస్త నెమ్మదిగా నక్షత్రాలు చలిస్తుంటాయి,
కొండలపాట వినాలని పృధ్వి మేలుకునే ఉంటుంది తెల్లార్లూ...

2 comments:

  1. వాన చిత్రాలన్నీ కళ్ళముందు కదలాడాయి మేడం. అభినందనలతో..

    ReplyDelete