ద్వైతం

ప్రేమారా ఆలింగనం చేసుకునే
ఏకాంతం అనే ప్రియుని వదిలి
ఒక్కోసారి
మెత్తగా పిలిచి చేయిచాపే
పాత మిత్రుని వంటి ఒంటరితనం
దరికి పారిపోవాలని ఉంటుంది
కనులారా నీరూరే
తన చెంతన తాకే వెచ్చదనం
కదలనీక నిలిపేసే
చెలికాని ఉనికిని మరిపిస్తుంది
ఎద నుంచి పదాల బరువు
తానూ మోస్తుంటాడు...
కాలపు అడుగుల సడిలో
ఉద్వేగపు ఊపిరి ధ్వనిస్తుంది
ప్రియుని సందిట ఆగిపోయిన
ఉద్రేకం, అనురాగం పిలుస్తూనే ఉంటాయి
అయినా సరే,

ఆలాపన మరిచి
లయ తప్పిన హృదయంతో
ఉడుకుమోత్తనపు అలుకతో
పసితనపు పలుకుతో
స్నేహితునితో
తలపడాలనే ఉంటుంది
మాట పెగనీయని మౌనపు మోముల
ప్రియునికి బందీ కావాలనిపించదు

పలుసార్లు జరిగే ప్రహసనం
ఒక్కోమారు మరీ ప్రియమైనదిగా ఉంటుంది
ప్రియుని చిరునామా కి
చిలిపి లేఖ రాయమని
స్నేహితుని అల్లరి మాట
మది లో పాటగా మారేవరకు

వేదన తో తలపడే తలపు
కోకిల స్వరాల ఊహగా
రూపాంతరం చెందేవరకు

ఇటుగా రానీయని ఆ ధ్యాస
పట్టుకునే ఉంటుంది

ప్రణయం, స్నేహం పల్లవిస్తూ
ఉండే ఉభయ సంధ్యల జీవితాకాశం
వర్ణాలు మారేవి కావు!

నిరాంతకం

పురాతనమే కావచ్చు ఈ చంద్రోదయం
కాస్త వెనుగ్గా రానున్న సూర్యోదయమూ...

చీకటి కమ్మిన హృదయాలు
నీడలో నివృతమైన పరిసరాలు
మరి కాస్త ప్రాచీన ఆచూకీకి
త్రోవ చూపవచ్చు

గమనించాలి, గుర్తించాలి, గమనం సాగించాలి

రిక్త హస్తాలు చాపగానే వెన్నెల నిండినట్లుగా
కనులు తెరవగానే కాంతి చేరినట్లుగా

గాలి, నీరు గలగలలాడుతూ
పూరేకుల్లో,  ఆకుదొన్నెల్లో
మబ్బుగిన్నెల్లో, అలల కుంచెల్లో
కొత్త పరిచయం చేసుకున్నట్లుగా
సరికొత్త పాత చిరునామాలు
గుండె నిండా రాసుకుంటూ ఉంటావు

నడవాలి, నర్తించాలి, ఆంతర్నేత్రం తెరిచి చూడాలి

సనాతనమే కావచ్చు ఆ ఆత్మావలోకనం
అనాది నిధనమనే హితవచనమూ...

తృప్తి, శాంతి పురివిప్పి
చేతనలో, చింతనలో
స్వరంలో, స్పందనలో
నిత్య చలనం గావించినట్లు
సతతం అనునయ స్పర్శనిచ్చే విశ్వజాడలు
ఆత్మ నిండా పరుచుకున్న స్థితిలో ఉంటావు

పయనాలు

పెనుగాలి లా తలపు
చెల్లాచెదురయే ఆకుల్లా ఊహలు
ధ్వనిస్తూన్న దారుల్లోకి
పదేపదే దెస మార్చుతూ
మనసు పరుగులు తీసిన తరుణాన..

నైసర్గిక స్వరూప దర్శనమైంది
లోలోని కాననం కానవచ్చింది

పరిచిత జాడలు
కొన్ని మోడులు
అల్లుకున్న అనుబంధపు లతికలు
ఎరుగని మోహపు పూలు
అలవి కాని తావులీనుతూ

ఇప్పుడక్కడ

చిగురుటాకు మోజుల సవ్వడి
మొగ్గ తొడుగుతున్న సన్ననవ్వుల
ప్రతిధ్వనులు
పరుగు నడకగా మారేటి వేళకి..

కోన దాటి
లోయ దాపున
మాయమైంది
నడిచివచ్చిన దారి

శకలాలుగా ప్రోగు పడిన కలలు
బద్దలువారి బండలైన ఆశలు
మాయ దర్పణమై ఎదుట నిలిచినట్లుగా...

నిశ్శబ్దం రూపు దాల్చి పిలిచినట్లుగా
మార్మికత
ఆజ్యపు ధారకే అణగారిన జ్వాలలా
నిమగ్నత

కదలిక మందగించిన క్షణానికి
కొత్త కుదుపు మొదలౌతుంది
ఝంఝూనిల ప్రభంజనంగా
మారనున్న అనుభవం
బలపడుతూ ఉంటుంది

నాటుకున్న అనుభూతుల
విస్తీర్ణత, ఎల్లలు ఎరగనట్లే
ఎదుగుతుండే
బ్రతుకు వనం లోకి
పయనాలు...!

కాలం లోకి

అప్పుడక్కడ
చీకటి కమ్మి చాలాసేపయింది
నేల కి సమీపంగా
తారకల వంటి మిణుగురులు
నింగిని తాకుతూన్న
మిణుగురుల వంటి నక్షత్రాలు
కంటిలోనూ, కాంతితోనూ చిత్రాలుగా
సర్దుకున్నాయి

ఆమె పెదవి విప్పుకుని
చిన్న నవ్వు మొలిచింది
'మోటబావి గోడలు చీల్చుకున్న పచ్చని మొలకలా'
దృశ్యం, సాదృశ్యం నడుమ
నడయాడే మది ఊసూ పుట్టింది
అంతలో-

ఏదో అసంబద్ధమనిపించింది..

మొలకది జీవితేచ్ఛ, అస్తిత్వ పోరాటం
మిణుగురు ఉనికితో చలిస్తున్న జీవి
రాలినదో, రగులుతున్నదో తెలియని తార
ముఖాన నిరంతరం వేసుకునే ముసుగు, నవ్వు..
సామ్యం లేని సంగతుల
అసహజచిత్ర ప్రదర్శన,
వ్యూహం పన్ని సాగిస్తున్న 
బతుకురణపు అర్థవిహీనత
నశించిపోయాయి

వేకువ కావచ్చింది..

ఆ వేకువని మించిన ఎరుక
మరేదీ కలగలేదు
అయినప్పటికీ
ఆ వెనుగ్గా నిశి కమ్ముతూనే ఉంటుంది

ఇక నుంచి,
ప్రతి అస్తిత్వం అనుపమం
అనునిత్యం అసమానం
సూత్రంగా
నిరాంతకంగా సాగే పయనంలో
ఆమె...!

సూచన

లోపల వాతావరణం నెలకుని ఉంది-

మిణుగురులు ముసిరిన మునిమాపుల్లో
పట్టువిడవని మబ్బుల మారాము వేళల్లో
ఉండుండి ఉరుము ఒకటి ధ్వనిస్తూ ఉంది,
మెరుపు ఉలిక్కిపాటున దాగినట్లుగా మాయమైపోతూ...
వాన మొదలైంది

మది నదిగా మారింది
వాగులు వచ్చి కలుస్తున్నాయి
దొంతరలుగా మేటవేసిన ప్రాయం
తెప్పలై సాగే కలల తాకిడిలో కరిగినట్లుగా...
జల్లులు వచ్చి పడుతూనే ఉంటాయి

ఎందుకంటే!?ముదమారా పెంచుకున్న
తోటలోకి
అనుదినం
అనురక్తితో నడిచినప్పుడు-
నేల ఫలకం మీద
నీటిజాడ, ఎండా చిత్రిస్తున్న
నిత్యనూతన దృశ్యాలు 
జీవితానికొక పోలికనిస్తూ...
మనసు కదంబంలో
తలపు, తపన మెలికపడి
పూలమడిలో
స్వీయ దర్శనమౌతూ...

ఒక్కసారిగా
తోట పిలిచినట్లౌతుంది,
పూలు నవ్వినట్లు తోస్తుంది.
ఊహ మాయమౌతూ
మనిషి రూపు ఎదురౌతుంది.
చేయి, చేయీ తాకిన క్షణాన
తనువు చేతన సంతరించుకుని
మేలువచనం పలుకుతుంది
అంతఃకరణలో
కొత్త నారు మొలకెత్తుతుంది
కాలం తీసుకొచ్చిన
శుభతరుణం
సారభూమిగా మారిపోతుంది

మరో మనిషి తోటగా
తనలో ఎదగాలి
ప్రతి మనిషీ తోటమాలిగా
అనుభవాలు, అనుభూతుల
విత్తులు వెదజల్లుతూ
కాలం గడపాలి, అందుకే!

ఉదయ నాదం

నీటి గుసగుసలు,  ఏటి గలగలలు, రెక్క హోరు, గాలి జోరు పందిరి గుంజలై నిన్ను అల్లుకోమంటే...పాదాలు పరుగిడి,  మళ్ళీ మళ్ళీ రావాలి ఈ ఉదయం అనిపించిన ఒకానొక వాహ్యాళి కథనం; ఈ నది, నేను అతి సమీపం గా ఉంటూ ఆ పిట్టల పాటలలో మునిగి తేలుతూ ఉంటాము. అవేమో నదితో, గాలితో కలిసి కచ్చేరీలు కడుతూ ఉంటాయి. 
 
 

ప్రతీక్ష

పుష్పించినదేదో ఫలించటానికి ఒదిగిన క్షణమా, ఒరిగిన తరుణమా అని అచ్చెరువున మునిగే మది ఆలోచన కి ప్రతీక! జీవితం సమస్తం ఈ స్థితి...


ఆత్మోల్లాసం!

అంటే..అంత ఆనందంగా ఉంది అని అన్నమాట!  ఆత్మ బంధువు,  ఆత్మీయ స్థానం అనిగాక మా మనిషి, మనవాడు అని చెప్పాలని లేదు. 


ఉత్సాహో వ్యవసాయ ప్రతీక వంటి ఒకరిని పదిలపరుచుకునే ఓ ఊసు. ప్రకాశం బారేజ్, నాగార్జున సాగర్ డాం, ధవళేశ్వరం అంటే నాన్నగారి ఉద్యోగానుభవాల విజయపరంపర మనోయవనిక మీద నాట్యమాడుతుంది.  ఇప్పుడు విజయవాడ, గన్నవరం అనుకోగానే హర్షాతిశయం మిన్నంటుతుంది నీ వల్లే నీ వల్లే...!జీవితం లోకి అడుగులు పడే తరుణంలో ఎవరేమి సాదిస్తామో, ఎవరెంత సవిస్తారంగా తమ తమ అనుభవం తో నలుగురికీ తోడ్పడుతామో తెలియని అమాయకత్వపు నాటి రోజుల్లో 'పలుకే బంగారం' అన్నట్లు ఉండే తను.. ఇలా తన వృత్తి రీత్యా ఎన్నెన్నో పరిధిలోనివి, ఇంకాస్త కార్యసాధన అవసరపడేవీ అధ్యయనం చేసుకుని, పూర్తి అవగాహనతో అత్యంత శ్రద్ధ వహించి సామర్థ్యం సమకూర్చుకుని, నిపుణతతో విధులు నిర్వహిస్తూ నలుగురి నోట మంచిమాట అందుకుని, పదుగురికీ సహాయకారిగా నిలవటం  నాకు ఎంతెంతో ఆనందం. 

ఎందరమో దేశం విడిచాము, తనవంటి కొందరు అక్కడే స్థిరపడి, ఇంకాస్త అభ్యుదయం సాధించటానికి పాటుపడి,  జనానికి జన్మభూమికి అందించే సేవలు ఎంతో స్ఫూర్తిదాయకం.  ప్రభుత్వ అధికారులలో ఇటువంటివారి శాతం పెరిగే కొద్దీ జన వికాసం, జాతి విజయం తప్పక సాధిస్తాము!

నాని! సదా నీ శ్రేయస్సు, యశస్సు మనసారా కోరుకుంటూ, నీ ఆయురారోగ్యాలు మరింతగా నాకూ ప్రేరణ కావాలని మురుసుకుంటూ, నీ జీవిత ధ్యేయాలన్నీ సిద్ధించాలని నీవారమైన 'మేమంతా' అభిలషిస్తున్నాము.  మనసైన మాట మహా బరువు సుమా, అందుకే నిన్ను ఇక్కడ నాకు తెలిసిన నలుగురిలో కూడా పడేస్తున్నాను..అలవి కానివి కొన్ని బయటకి చెప్పేయాలి కదు!?

*-----*-----*-----*
ఉత్సాహః = ప్రయాసమును ఓర్చుట
వ్యవసాయః = విశేషముగా నిశ్చయించుట

మొయిలు బొత్తి

నిర్నిమేఘ ఆకాశం అమాంతంగా అల్లికల పోగుల్లా గుట్టలు పోసింది
కొలను దాచుకున్నవన్నీ బింబాలై తేలియాడాయి 
మబ్బులు పుటలుగా కవిత రాసుకుంటూ ఉన్నానా..అంతలోనే
ఆకుల్లా పరిచి ఎవరో మరి చిత్ర రచనలు చేస్తూ పోయారు...
విస్తుపోతూ నేనూ కనుల యానం చేస్తూ గడిపాను,
గుమ్మాన ఆగిన నీలి మబ్బు కన్ను గీటి కదిలిపోయేవరకు!
పొడిగింత

పంతంగా నీడల్ని పరిగెత్తిస్తూ
మొండి దేహంతో ఎండ
రూపం, రంగు లేని నీటిలోకి జారిపడింది
భళ్ళుమని నిశ్శబ్దశ్రుతితో తెల్లారింది

వంతుగా ఆకుల్నీ, కొమ్మల్నీ ఊపుతూ
మొగ్గ దేహంలోకి గాలి
రూపం, రంగు అద్దుకుంటూ ఒదిగిపోయింది
రివ్వుమని రెక్కలతో పిట్టపాట హోరెత్తింది

నీళ్ళు, పూలు నవ్వుతున్నాయి
ముళ్ళు, రాళ్ళు నీడల్ని మోస్తున్నాయి
నిండుగా ఉనికి సంతరించుకుని జాగృతి
రెండుగా చూస్తున్న అద్వైతమే స్థిరమని ఖాయం చేసింది...!

పరవశం

చుక్కల మెడ తిప్పుతూ పావురాయి,
ముక్కున కరిచిన మేతతో కొక్కిరాయి
దిగువ పాయల వెంట ఎగిరిపోయాయి
కనుల కొలనులో చూపు ఎగువకి సాగింది

రంగురంగుల రేకులలో ఉషస్సు,
రంగు మీద రంగుగా ఇంద్రధనుస్సు
మెరుపు దాడుల దూతలమంటున్నాయి
మేని సీమలో మైమరపు  పరుగులు తీసింది

తనివి తీరని కాలం, ఋతువు దాటి ఋతువులోకి
అలవి కాని మోదం, అక్షర భారతి పాద సన్నిధికి
బిరబిరల గోదావరి మారురూపాలౌతున్నాయి
పదాల సంద్రాన భావం ముత్యాలరాశిగా మారింది!

కూరిమి

'మారాము చేసానులే...'
మూసిన తలుపుల నుంచి
దూసుకువచ్చే వాన సడిలా
బిగించిన ఆ పెదాల నుంచి
చిన్న మాట!

దుఃఖ మేఘం కమ్ముకున్న
తన కనులు
దిగులు భారం మోయనన్న
తనువూ
ఈ చేతులలో...

'గారాలు నీవంతు కదు!?'
నిమిరిన ఈ మమత,
సవరించిన మాటల ధార..
తేటపడ్డ ఆకాశమై
ఇరువురి అనుబంధం.

సాగరసౌధం

ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు శ్రీ చింతా సీతారామాంజనేయులు గారు మలిచిన నృత్య రూపకం "సాగరసౌధం" గూర్చిన అన్వేషణ తో పాటుగా నా చిరు అనుభవం కలగలిసిన అనుభూతి.  ఎవరికైనా ఈ నృత్య నాటిక పరిచయం ఉంటే పూర్తి పాటల సాహిత్యం సంపాదించటానికి సహాయపడండి.

అలుపన్నది యెరుగక పరవళ్ళతో, ఉరవళ్ళతో ఉరికే నదిని చూస్తే- ఉప్పొంగే ఆనందం,  అలాగే- అంతులేని అనురాగం, ఆవేశం, అదుపులేని ఆరాటం కూడ కనిపించేది.  అలా కొండల్లో, కోనల్లో పరుగులు పెట్టి సాగరసంగమం అయ్యే నది ఈ ప్రకృతిలోని స్వేఛ్ఛకి ప్రతీక అనిపించేది.  ఎప్పుడోనే ఓ కవి మనసు నది గమనాన మరో కోణాన్ని చూసింది. నాగార్జుగసాగర్ ఆనకట్ట నిర్మాణానికి కొత్త భాష్యం వెదికింది.  ఈ నాట్యకారుని చేత "సాగరసౌధం" అనే రసవత్తరమైన సంగీతభరిత నృత్యనాటికగా రూపొందించబడ్డాక, కృష్ణానదిని ఒక స్త్రీగా అన్వయించి ఆమె కన్న కల తాలూకు వేదనని అలాపిస్తూ మొదలై,  ఆనకట్ట నిర్మాణ మానవ మేధా విజయకేతనం తో ముగిసే ఈ నృత్యనాటిక మేము చేసేవారం.  నాటి ప్రదర్శన నాకు కళ్ళకు కట్టినట్లు గుర్తు.  నేను నాగార్జునాచార్యుడిగానో, నదిగానో అభినయంచేదాన్ని.  పిన్న వయసులో పలుమార్లు ఈ ప్రదర్శనకై చేసిన నిరంతర సాధన వలన నాకు బాగా గుర్తుండిపోయింది. "సాగరసౌధం" నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణం లో భాగస్తులైన ప్రతి ఒక్కరు ఒడలంతా పులకించిన అనుభూతితో వీక్షించిన నృత్య నాటిక. 1975 నుంచి అభ్యసించి, పూర్వాభినయం తో ఆరితేరి ప్రదర్శించి, ఎందరినో అలరించిన అనుభవం గత స్మృతుల్లో ఎప్పుడూ గేట్స్ తెరవగానే దూకే కృష్ణమ్మలా ఉంది.  కానీ, 1980 తర్వాత చూడలేదు, వినలేదు. కనీసం వ్రాతప్రతి తెచ్చుకుని ఉంచుకోవాలి, ఒక పూర్తి నాటిక రికార్డ్ పదిలపరచాలి అని తెలీని ప్రాయం. ఇప్పుడు మనసు పొరలు తొలగించి ఆలాపనలు ఇలా పట్టుకునే ప్రయత్నం! తప్పక ఏదో ఒక మార్గంలో అందిపుచ్చుకోగలనని భావిస్తున్నాను.. సంగీత రూపకం గా చాలా బావుండేది ఈ ప్రదర్శన.

"నిజమేనా, నిజమేనా నేను కన్న కల నిజమేనా.... కష్టాలను నష్టాలను కవితలల్లుకున్నాను.. ఎటు తోచక పోయితినే సాగరమునకు" అని తన అపార జలశక్తి వృధాగా రాళ్ళలో, ముళ్ళలో ప్రవహించి, అడవుల్లో సాగి, సముద్రపు పాలవుతుందని విలపించే నదీమతల్లిని ఓదారుస్తూ ఆధునిక మానవుడు వస్తాడు. "రండి రారండి వెలుగు జెండా ఎగరేయండి, కృష్ణమ్మ ఎద నిండే ఖిల్లా నిర్మించండి..సుత్తులు మ్రోగించండి సుర దుందుబులెందుకండి" అని నినాదాలిస్తూ ఆనకట్ట నిర్మాణం తలపెట్టి పూర్తిచేసి "నీ ఆశలు, ఆశయములు నిండిన సాగరమిదే, సాగర సుధా సౌదామిని సాగరసౌధమ్మిదే.." అని ఆమెను సంతృప్తి పరచటం, ఆ సమయాన రిజర్వాయరు తవ్వకంలో నీట మునిగిన బౌద్ధారామాన్ని నాగార్జునకొండ పైకి మార్చటం జరుగుతుంది.  అపుడు నాగార్జునాచార్యుని పాత్ర వస్తుంది. "ఎవరో నను పిలిచినారు, విధియే పడత్రోసి చనిన శిధిలాలను కదలించి.. " అని సమాధి/తపో ముద్ర విడిచి లేచి జరుగుతున్న ఆధునికదేవాలయ నిర్మాణానికి సంతుష్టుడై నిష్క్రమిస్తాడు.  తన జలాల సద్వినియోగం కాంచిన ఆనంద నాట్యం చేసే కృష్ణమ్మ "ఆహా ఆహా ఎంతటి అమర పురాంగణమిది, విద్యా విజ్ఞాన శక్తి విజయ ప్రాంగణమిది.." అని సంతృపిగా రాగాలాపన చేయటం తో ఆ నృత్యనాటిక ముగుస్తుంది.

ఇలా నేను వినతి పంచుకుని, వెదికి సాహిత్యం అందబుచ్చుకుని యేమి సాధిస్తాను!? యేమీ లేదు- మా నాన్న గారి జీవితకాలంలో కృష్ణానది, నాగార్జునసాగర్ ప్రస్తావనలతో ఆయనలో జలపాత హోరు ఎగిసిపడేది అనుభవాల వరవడితో. నేను పుట్టిందీ, తొలిదశల నా జీవితకాలంగడిచిందీ అక్కడే.  మాకూ ఎక్కువ మూలాలు, బీజాలు నాగార్జునసాగర్ లోనే.  ఆయన అధ్వర్యం లో ఒకసారి పుష్కరాల పనులు కొనసాగాయి, 2016 లో మా కజిన్ ఒకరి పర్యవేక్షణ లో కీలకమైన పనులు జరిగాయి. నాన్నగారిని తలుచుకుంటూ,  తనని అభినందిస్తూ, నన్ను నేను గర్వంగా చూసుకుంటూ- ఆ ఘనమైన బాల్యపు కీర్తిశిఖరాలపై మేము ఎగురవేసిన బావుటా వంటి- ఈ నాటిక ని గుర్తున్నంత వరకు రాసుకోడమే ఆ యిద్దరికీ నా మనః పూర్వకం గా వేయగల పతకం.  నేను అమితంగా ఇష్టపడే నాన్నగారికి, అపరిమితంగా అభిమానించే తనకి ఎప్పటికీ అపారమైన అనురాగంతో ఇలా కృతజ్ఞత తెలుపగల అవకాశం జీవితం తిరిగి తిరిగి ఇవ్వాలని అభిలషిస్తూ...
*****

పాత్రధారులు: కృష్ణా నదీమతల్లి,  నాగార్జునాచార్యుడు, జనశక్తి

1) తన జలాలు ఊరకనే వ్యర్థంగా సాగరపాలు కావటం కలగాంచిన నదీమతల్లి శోకంంతో విచారాన మునిగి పాడే ఈ పాటతో మొదలౌతుంది
"నిజమేనా నిజమేనా నేను కన్న కలనిజమేనా"
2) సామాన్య ప్రజానీకం ఆమెని చూసి తల్లడిల్లుతూ పాడేపాట
"తల్లీ కృష్ణా నదీమ తల్లి
కష్టాలను నష్టాలను కవితలల్లుకున్నావు
ఎటుతోచక నీవే పోయితివె సాగరమునకు"
3) యువ రక్తం ఉరకలెత్తే నేతల గీతం ఆ తదుపరి ఇలా సాగుతుంది
"స్వంతంత్ర భారత ప్రభాత కాంతి
శాంతి దూతలం"
4) ప్రభుత్వ పర్యవేక్షణలో కార్మిక శక్తి నిర్మాణ సమయాన శ్రామిక గానం:
"రండి రారండి వెలుగుజెండా ఎగరేయండి
కృష్ణమ్మా ఎద నిండే ఖిల్లా నిర్మించండి
బండలెత్తుకుని రండి
బంగారమదేనండి
సుత్తులు మ్రోగించండి
సురదుందుభులెందుకండి"
5) ఈ సమూహ సందడి కాంచి తపస్సు నుంచి మేల్కొన్న నాగార్జునుని స్వగతం:
"ఎవరో నను పిలచినారు
విధియే పడద్రోసి చనిన శిధిలాలను కదలించి"
6) నిర్మాణం పూర్తి అయ్యక ఆనకట్ట మీద పరుగులిడుతూ కృష్ణమ్మ ఆనందహేల:
"ఆహా! ఆహా! ఎంతటి అమర ప్రాంగణమిది!
విద్యా విజ్ఞాన శక్తి విజయ ప్రాభవమిదె
ఆ కొండ పైనేమి వైకుంఠమా ఈ లోయ దరినిది కైలాసమా
ఏది నాగార్జున కొండ? ఏడి నాగార్జునుడు
ఓహో ఆ కొండ పైన ఉన్నారా, కొండ మీద నేమిటి నా గుండెలోనే ఉన్నారు..."
7) ప్రజానీకం అంతా ఏకమై హర్షధ్వనులతో పాడే పాట తో ముగుస్తుంది
"నీ ఆశలు ఆశయములు నిండిన సాగరమిదె
సాగరసుధా సౌదామిని సాగరసౌధమ్మిదే"

పూచేటి వేళాయే

మిసమిసల రేకుల పొది
వసంత వేడుకకి బాకా ఊదుతుంటే..

 
పుడమి లో పుష్పకాలం
పరవశాల పల్లకీలో ఊరేగుతుంటుంది...!

పిట్టగోడ-పిట్టఘోష: 5

Illinois State Bird- Northern Cardinal అంటూ కాస్త గౌరం ఎక్కువే ఇస్తుంది ఈ అమ్మి..కానీ, "బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే ఎవరే ఎవరే పిలిచేది నేనెట్టా ఎట్టా పలికేది," అని వెంట వెంట వస్తుంది.. ఎట్టా పలికేది నేను.. నా పక్షిగానం ఎరుగని మనసు కాదులే అని సరిపెట్టుకుంటా మరి! పెట్టిన మేత, పళ్ళు రుచి చూసి పోతా... 

 
  

వడియపు తెప్పలో గోంగూర ముద్ద!

ఆంధ్రమాత గోంగూర వరకు మరి నేను భోజనం పెట్టే మాతనే!

అలంకార ప్రియో విష్ణుః అభిషేక ప్రియో శివః |
నమస్కార ప్రియో సూర్యః బ్రాహ్మణో భోజనప్రియః ||

హరిహరులు, సూర్యచంద్రులు అలరారిన లోగిలి మాది! నిత్యం లక్ష్మీ కళ ఉట్టిపడే పెరటి తోట, వాకిలి తట్టున వనం మా ఇంటికి చిరునామా... నువ్వుల నూనె/కాచిన ఆవనూనె నలుగుతో అభ్యంగన స్నానం అదీ కుంకుళ్ళు/శీకాయ పులుసుతో తలారా స్నానం కర్చూరాలు, బావంచాలు, వట్టివేర్లు పొడి చేసి ఇంట్లో తిరగలి లో విసిరి వస్త్రకాయం పట్టిన పెసరసున్నితో పూర్తికావాలి, ఇంటి పాడి గేదెకి వెన్న పూసి, వేడినీటి స్నానం కూడా పరిపాటి, అదన్నమాట మొదటిపంక్తి వైనం నా లోగిలిలో... అనునిత్యం యే పొద్దూ బ్రహ్మఘడియల్లో లేచి "కరాగ్రే.." శ్లోకం తో పాటుగా మరెన్నో వల్లె వేస్తూ/వేయిస్తూ ప్రతి శక్తికి, విద్వత్తుకీ నమస్కారం ప్రియం గా సమర్పిస్తూ, గాయత్రి మంత్రం జపిస్తూ మా నాన్నగారు తన శాయశక్తులా అవిద్య మా ఇంట చోటుచేసుకోకుండా బ్రహ్మజ్ఞానం తెలిసినవారు బ్రాహ్మలు అన్న వివేచనతో మమ్మల్ని పెంచారు.. అటువంటి మా నాన్నగారు మంచి భోజన ప్రియులు. భోజనం ఆస్వాదిస్తూ తినటం, రుచిని స్వఛ్ఛంగా ఆహ్వానిస్తూ వీలైనంత అమ్మకి చేరువగా ఉంటూ ఆహారం వండించటం, పక్కనుండి వడ్డించి రవ్వంత నిర్దయగానే ఎలా యేవి తినాలో నేర్పినందున, అనుభూతిస్తూ కుటుంబం అంతా చేరి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని స్వాగతిస్తూ తినేవారం...ఆయన గరిటె తిప్పి వండినవి ఇంతా అంతా వంటలు కాదు- బూందీ దూయటం తీయటం, కోడి కూర, చేపల పులుసు, బిరియానీ, కాజాలు... పదును మీద కూరగాయలు కోయటం, నౌజుల్లాంటి వాటి రుచికి లౌజు తిన్నంత రుచి రప్పించటం, మిరపకాయ బజ్జీ లో కూరిన వాము చింతపండు గుజ్జు కారం మా బొజ్జల్లోకి కూరిన వైనం అన్నీ ఇంకెన్నో ఆయన నాకు నేర్పినవే. నిజానికి 70వ దశకం లోనే కొత్తిమీర సలాడ్స్, బూడిదగుమ్మడి సూప్స్ మాతో తినిపించిన ఆధునిక ఆరోగ్య ప్రదాత తను. అలా ఆ రుచులు తెలిసిన జిహ్వ మూలానే అభిరుచులూ బాగుండేవి... పద్యాలు, పాటలు, భజనలు, గద్యాలు, నాటకాలు ఇల్లంతా భలే ఉండేది. పెళ్ళికాని బ్రహ్మచారులు, పెళ్ళైనా నోరూరి ఆగి వెళ్ళేవారు, స్వాములు, భోక్తలు, భక్తులు, అతిధులు, అభ్యాగతులు మా అమ్మ వంట నాన్నగారి వడ్డన మా విసుగుదలలు చవిచూసినవారే !!! ఒక్క విస్తరితో తినకూడదు, ఒక విస్తరైనా దానం ఇవ్వనిదే ధర్మం పూర్తికాదు అన్న నియమం, సహ పంక్తి ఉండాలి అన్నదీ అన్నిటికీను- నిజానికి నాన్నగారి తరం లో ఎందఱో ఎరుగని కొన్ని విషయాలు నా బిడ్డలకీ తెలుసునంటే అది ఆయన చలువే.


అటువంటి నాన్న గారు చెప్పినవన్నీ పచ్చబొట్టల్లే మెదడుని పరుచుకుని... వెంకటేశ్వరస్వామికి గోంగూర ముద్దపప్పు ఇష్టమట...శుక్రవారం అమ్మవారికి నేతి పాయసం, శనివారం గోంగూర పప్పు, పరవాన్నం వాడకం అలవాటు. 22 సం క్రితం దేశం వదిలినప్పుడు తెలిసింది శనివారం తాజా గోంగూర దొరకని ఇబ్బంది అంటే ఏమిటో...ప్రతి వారం వెలితి గా ఉండేది, ఉపవాసం ఉన్నట్లు తోచేది. క్రమేణా ఇల్లు ఏర్పరుచుకుని పెంచటం వచ్చే వరకు ఇండియా నుంచి తెచ్చిన పచ్చడి వాడకం ఉండేది. అలా అలా పిల్లలకీ మప్పేసాను. పెద్దమ్మ/యువ కి అల్లం, గోంగూర పచ్చళ్ళు ముద్ద పప్పు నప్పితే, చిన్నోడు/స్నేహ కి మాగాయ, కొత్తిమీర పచ్చళ్ళు, మరుగు చారు ఇష్టం - వడియాలు తప్పవు, కాచిన నెయ్యి సరేసరి... 

ఇలా సాగుతున్న నా జీవితంలో ఇపుడు శనివారం నియమం లేదు; నాన్న తలపు తినేస్తే ఆయన అమర్చిపెట్టిన జీవనశైలి ని చుట్టూరా సృజించుకుని గడపటం తప్పా! అటువంటి ఈ రోజు నాన్న గారు తిన్నట్లే వెల్లుల్లి పోపు వేసిన గోంగూర పచ్చడిలో తెల్ల ఉల్లిపాయ ముక్కలు, మెంతులు వేసి కాచిన నెయ్యి, పొత్తల్లే వండిన అన్నం, వడియాలు, గడ్డ పెరుగు (ఆయన చూస్తుంటారు ఎందుకంటే చిన్నప్పుడు ఆయనే తినిపించారు, ఇప్పుడూ ఆయన జ్ఞాపకాలతో తింటున్నాను కనుక సంబరపడతారు, నేను అర్థాకలితో ఉంటే విలవిలలాడింది ఆయనే కనుక...)  వడియపు తెప్పలోకి కూరిన ముద్దతో జీవుడు భవసాగరపు తీరాలు దాటి స్వర్గవాస కొలనుల్లో తేలిరావాలి. నలుగురికీ పెట్టిన మనిషి మిగిల్చి వెళ్ళిన వారసత్వం సాక్షిగా, అచ్చం తాతని పోలిన మనస్తత్వం తో యువ మీదుగా మరొక తరం వరకు మా ఇంటి కొంగుబంగారం పదిలం !!!పిట్టగోడ-పిట్టఘోష: 4

"పిడికెడు బియ్యం పిచ్చుకకి వేసి, గంపెడు సంబరం నాదేనంటూ ఎగిరితే ఊరుకోనోచ్.. అరిచి గీ పెట్టి, 'చిన్ని నా పొట్టకి నీవే రక్ష' అని నీకు అనిపించేలా చేసి మరీ సాధిస్తా నా భుక్తి," అంటూ ఇదిగో యిలా ...!

గిన్నెలో చీకటి!

దుప్పట్లో మిన్నాగు లా ఇదేమిటో అనుకుంటున్నారా!?

స్నేహ కి నాకు నడుమ ఒకానొక ఉదయాన-
అమ్మా! ఇక్కడ చీకటిగా ఉంది
ఏమి పిల్లల్రా ఈ మాత్రం వెలుగు చాలదా?
నువ్వే చూడు..చాలా చీకటిగా ఉందమ్మా, Light అనకుండా Bright ఏంటి?
సరే! లైట్ వేసుకో
గిన్నెలో చీకటిగా ఉంది, లైట్ వేస్తే ఎలా పోతుంది? లైట్ చెయ్యాలిగా...
ప్చ్! స్నేహీ.. వస్తున్నా ఉండు
చూడు, ఎంత చీకటిగా ఉందో! ఇంకొంచం పాలేస్తావా
ఓ......ర్నీ, "టీ" సంగతా నువ్వనేది, చిక్కగా ఉందా :)
మరి "Dark" గా ఉంది కదా!? చీకటి అనరా!?
సరేరా.. అలా వెళ్లి కూర్చో (నేను నవ్వాపుకుని ఇంకాసిని పాలు కలిపి ఇస్తూ), పంచదార వేస్తారు, పాలు పోస్తారు/కలుపుతారు అనాలిరా
మరి...
చాలు చాలు..చల్లారిపోతుంది, తాగేయ్
అమ్మా! You're wrong! చలి ఆరదు, chill అవుతాయి టీ
అబ్బా! తల్లోయ్ తాగరా బాబు

పిట్టగోడ-పిట్టఘోష: 3

తెలుగు పాటలు విని కూనిరాగాలు తీసేవారికి ఓ క్విజ్ .. విన్నారా ఈ పాట? 


"కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా
చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా
...
అదేరా ప్రేమంటే కన్నా"


విని ఉన్నట్లయితే ఇంతకన్నా బాగా మరెవరైనా చిత్రీకరించగలరా...!

పిట్టగోడ-పిట్టఘోష: 2

Bird watchers/lovers! Hawk on my Deck..నేనీ ప్రకృతీ పరమైన పురా పునీత పరవశాన- పరవళ్ళు తొక్కుతూ- ఇలా...! ఏ మాట కామాటే చెప్పుకోవాలి; ఇంత దగ్గరగా, కేవలం 5 అడుగుల దూరం కి (నడుమ కిటికీ అడ్డుగా ఉన్నా) గ్రద్ద వచ్చి వాలటం అదేదో గండభేరుండ పక్షి వచ్చినంత సంబరం గా ఉంది.

దశదిశలా తన చూపు, తన రూపే దశావతారాలు నాకు... "ఏ సీమదానివో ఎగిరెగిరి వచ్చావు అలసి ఉంటావు" అని ఇరువురమూ ఒకరికొకరం...మేత వేసీవేయగానే ఇట్టే వచ్చి ముక్కులు పగిలేలా పొడుచుకుతిని తుర్రుమనే బుజ్జిగాళ్ళ కన్నా, తీరిగ్గా నాకోసమే అన్నట్లు వచ్చి నలుదిక్కులా పరికిస్తూ కళ్ళు ఒళ్ళు నిక్కపొడుచుకుని చూసే నన్ను పలుకరించే ఈ కృష్ణపక్షి కి నే దాసోహం! ఎక్కువగా నాకు కలలో గరుడ/గండభేరుండ పక్షి కనపడుతుంది... రెక్కలు విశాలంగా విస్తరించుకుని ఒక్కోసారి ఎగురుతూ, ఒక్కోసారి ఏవేవో శిలా రూపాలుగా మారిపోతూ.

That 180 degree turns of the neck on both to right and left is a "Oh, WOW!!!" I feed small birds and it came for its feed i.e. those birds! Food Cycle continues...!

పిట్టగోడ-పిట్టఘోష: 1

11/11/2016:  ఓరోరి నువ్వుండ్రా, ఆమె గోరు సూరీడ్ని చూస్తూ తచ్చిట్లాడేప్పుడు వచ్చి కాచుక్కూచ్చున్నాము. ఇదిగో మనం బొద్దు గా కాక స్థూలకాయం పెంచుతూ ఉన్నామంటే, రాబోయే చలికాలం లో ఉధృతి ఎక్కువంట, 
 ఇదిగో అందుకే ఈ బల్లలు బోర్లేసి "రండర్రా వర్కౌట్ చేద్దాము, చైర్ స్వింగ్, చీర్ఫుల్ సింగ్," అంటూ రొద; తన కొత్త పిట్టయోగ క్లాసులో చేరితేనే మేత పెడుతుందట.."నీ అల్పాహారం నువ్వే సాధించు, లే రెక్కలార్చి ఎగురు, నోరు పెగిల్చి పాడు," అని అదిగో చూడు ఆమె కూడా పెద్ద పిచ్చుక అయిపాయె! శుభ్రంగా గోడల మీద పెట్టేది మునుపు...ఆమె పిచ్చిగానీ మనం చిక్కితే మాత్రం తను చలికి చిక్కకుండా తప్పుకుంటుందా? ఏదోమాయ చేసి ఇవాళకి మేత సంపాదించాము,  కలిసి ఉందాంరా కలిసే ఉండాలి రా...!!!
పేరులో ఏముంది!?

చెప్పేస్తే ఒక పనై పోతుంది- నాకు హాయి, నలుగురికి నవ్వు లేదా ఎకసెక్కం కాదూ మూతివిరుపు కసింత ఊదాసీనత కొండొకచో యేదో భావన కలుగుతుందిగా!?
పుట్టగానే నాకు ఇవ్వబడిన పేరు "పార్వతి" అది మా సీతమ్మామ్మ పెట్టారు కనుక, నేను నానమ్మ కూచిని కనుక, క్రమేణా అమ్మ మార్చుకున్న 'ఉష' కన్నా "చిన్న సీతమ్మ" గా చలామణి అయ్యాను, ఆ పేరు విన్నప్పుడు కోపం వచ్చినా, "నేను 'పారు' ని లేదా 'ఉష' ని," అని అరిచి చెప్పినా ఆగలేదు కాలం.."జగన్మోహిని" చిత్రం సమయంలో కొత్తగా 'జూజ' అనేవారు "జూనియర్ జయమాలిని" :) బహుశా నా దెయ్యం చూపులో, మోహనాకారమో, రమణీయమైన నృత్యమో కారణం. నడుమ యూనివర్సిటీ లో DJ usha దుబ్బు జుట్టు ఉష అన్న నామధేయం కూడా దాటి వచ్చాక ..ఇంతలో ఎన్ని వింతలో అన్నట్లు ఒక పుష్కరం గడిచిపోయాక ఎవరో "రోజా" చూసి వచ్చి "ఉషాంటీ మధుబాల లా ఉన్నారు," అనేసరికి అలాగ..అలా అలా మళయాళీ, స్పానిష్ మార్కు పేర్లు/వైనాలు అద్దబడి, అతకబడి బొద్దుగానో/బక్కచిక్కిన భామిని గానో ఉంటుండగా "సమంత లా ఉన్నావు మొహం చూస్తే, వెనక జుట్టు రమ్యకృష్ణ స్టైల్," అంటూ నాకొక అహం, అస్తిత్వం ఉండనీయని రొదలు తాకి పోయాక (అవన్నీ కృత్రిమమైనవేనని తెలిసిపోతుండగా) పండుగ ఉదయం పరవాణ్ణం వంటి మాట వదిన నోటి వెంట వచ్చింది "నిన్ను చూస్తే అచ్చం మీ నాన్న గారు చుట్టూ ఉన్నట్లే ఉంది, నీ స్వభావం అంతా మావయ్యగారిదే, ఆలోచనలు, ప్లానింగ్ భలే భరోసాగా ఉంది," అని. ఎంత హాయిగా ఉంది నాన్న నాలో మూర్తీభవించడం..అదీ ఆహార్యం లో ఆహారపు అలవాట్ల నుంచి మొదలుకుని ఆలోచనాతీరు వరకు నాన్నగారిని పోలిన కారణం గా నేను ముచ్చటగా 'JK' aka (also known as) 'Junior Kesava' అని పిలుచుకునే నా బిడ్డ నాతో ఉన్న క్షణాల్లో-ఆ క్షణం నుంచి అలా తడిసిన కళ్ళలో ఒక కంట సీతమ్మ లోకం, ఒక చూపు ఆవరణ నాన్న ప్రపంచం లోకి త్రోవలు పరుస్తుంటే నా ముద్దుల కూతురు "నా పిల్లలకి అమ్మమ్మ కుడుములు, పొంగల్ చేసిపెడతా," అంటూంటే (ఆ ధ్వని తనకి నేను చెప్పి తినిపించిన అమ్మమ్మ వంటలది కావచ్చు, లేదా నాకు రాబోయే మనవలకి తను అమ్మగా చెప్పే ఊసులదీ కావచ్చు) ఈ తరతరాల తరగని రక్తబంధాల భావోద్వేగాలు నన్ను సంద్రాన పడవలా ఊపుతున్నాయి, ఇక నాకు కట్టబడిన తెరపైన బొమ్మల తెరచాపలు ఎన్నైనా సరే, సంతోషం గా స్వీకరిస్తాను- మీరు మరువలేని మరువపు గుభాళింపునై మిగిలిఉంటాను...!

ఉదయాన్నే- ఒకానొక ఉద్భవం!

మేఘపు మెరుపు రూపు మారుతుంటేనే ఈ బింబపు ఆకృతి ఊహామాత్రం గా తోస్తుంది కదా!? ఇప్పుడు నేను మేఘాన్ని చూస్తున్నానా..భ్రమణం తో నా చూపు ఆవరణ మార్చే మౌనమూర్తి భూమి ని కాంచానా..నిశ్చలంగా నిలిచినా కర్మసాక్షిని దర్శిస్తున్నానా..ప్రతి ఉదయం లో నాలోని ఒక నేను ఉద్భవిస్తూ వస్తున్నానని మాత్రం తెలుసుకున్నాను...! 
(సప్త అశ్వాల సాక్షి గా కొన్ని ఉదయాల పయనాలు ఈ చిత్రమాల తో సమాప్తం, అందరికీ నెనర్లు!)