ద్వైతం

ప్రేమారా ఆలింగనం చేసుకునే
'ఏకాంతం' అనే ప్రియుని వదిలి
ఒక్కోసారి
మెత్తగా పిలిచి చేయిచాపే
పాత మిత్రుని వంటి 'ఒంటరితనం'
దరికి పారిపోవాలని ఉంటుంది
కనులారా నీరూరే
తన చెంతన తాకే వెచ్చదనం
కదలనీక నిలిపేసే
చెలికాని ఉనికిని మరిపిస్తుంది
ఎద నుంచి పదాల బరువు
తానూ మోస్తుంటాడు...
కాలపు అడుగుల సడిలో
ఉద్వేగపు ఊపిరి ధ్వనిస్తుంది
ప్రియుని సందిట ఆగిపోయిన
ఉద్రేకం, అనురాగం పిలుస్తూనే ఉంటాయి
అయినా సరే,

ఆలాపన మరిచి
లయ తప్పిన హృదయంతో
ఉడుకుమోత్తనపు అలుకతో
పసితనపు పలుకుతో
స్నేహితునితో
తలపడాలనే ఉంటుంది
మాట పెగనీయని మౌనపు మోముల
ప్రియునికి బందీ కావాలనిపించదు

పలుసార్లు జరిగే ప్రహసనం
ఒక్కోమారు మరీ ప్రియమైనదిగా ఉంటుంది
ప్రియుని చిరునామా కి
చిలిపి లేఖ రాయమని
స్నేహితుని అల్లరి మాట
మది లో పాటగా మారేవరకు

వేదన తో తలపడే తలపు
కోకిల స్వరాల ఊహగా
రూపాంతరం చెందేవరకు

ఇటుగా రానీయని ఆ ధ్యాస
పట్టుకునే ఉంటుంది

ప్రణయం, స్నేహం పల్లవిస్తూ
ఉండే ఉభయ సంధ్యల జీవితాకాశం
వర్ణాలు మారేవి కావు!

1 comment:

  1. ప్రేమారా ఆలింగనం చేసుకునే
    పసితనపు పలుకులతో స్నేహం పల్లవిస్తూ
    కాలపు అడుగుల సడిలో దారి తప్పిన పాత మిత్రుడి ఒంటరితనం ..అల్లరి
    మాటల మౌనపు మోములు మళ్లీ తడ పడాలని కోకిల స్వరాలు ఊహగా మదిలో పాట గా మారి నిన్ను మెత్తగా పిలుస్తున్నాయి.. మీరెక్కడున్నా క్షేమంగా ఉండాలని..
    చాలా చాలా బావుంది ఉష గారు

    ReplyDelete