గుర్తుకొస్తావు నువ్వు, ఎప్పుడో చెప్పనా?

మునిమాపు హస్తాలు వడిలిన ఎర్రపూల మీద 
చీకటి రంగు పులుముతుండగా,
తెలతెల్లని మొగ్గలు విచ్చుకుంటుంటాయి,

అప్పుడొక పరిచిత భావన మనసుకి తడుతుంది
స్వయం సమృద్ధమనిపించే సత్యమేదో గోచరిస్తుంది

అప్పుడు; వస్తుంది నీ తాలూకు జ్ఞాపకమొకటి,
గాలి కూడా కదల్లేని మత్తులో కూరుకుపోయే
సంపెంగి వాసనల వెల్లువ గా.

అప్పుడిక ఊరడిల్లుతాను, ఎందుకంటే:
ఒక పూవు వాడిపోతే, ఒక మొగ్గ రాలిపోతే,
వేయి గుత్తులు విరిసి పిలిచిన గతాలు దూసుకొస్తాయి

ఎద లోని తావి తలపుకి కనులెదుర పూవు అవసరమా?
ఇక ఇప్పుడు చెప్పు,

కళ్ళని బతికించాలా? దృగ్గోచరం కావాల్సిందే అంటావా?
ఎన్ని అరలు నింపుతున్నా కొత్త ఖాళీలు వెదికిచూపే,
నీ హృదయం, నా హృదయం కలిసి బతకాలి
వెలితిపడ్డ మనసు తో తేలిక పడాలి
ఆర్తి నిండిన కళ్ళ ఎరుపు కాంతులీనాలి. 

వసంతంమబ్బుపిట్టల రెక్కల హోరులో
మత్తెక్కినగాలిని మందలిస్తూ, 
మేలిముసుగు చాటుగా 
చిరునవ్వు పింజెలు విసిరినదెవరో

చెలి పలకరింత తొలకరి మొలకై
ప్రియుని ఊసులు పూచిందా,
పూతేనియ వలపు వరదలై
వనమాలి జాడలు తెలిపిందెవరో

ఎదురుచూపున కరగని క్షణాలే
పదాలుగా మారి, పుటలుగా పుడుతూ
కాలమే ఒక కావ్యమౌతుందని,
ఆ కావ్యమే కరుగనున్నదన్నదెవరో

ఎవరెవరన్నది ఎదసొదలకి వదిలి,
చెదరని మనసుల మందిరాల్లో
కరగని మమతల సోపానాలెక్కిన
జంటపక్షుల సురగానాలవి

ముక్తాయింపు

చిక్కగా పరుచుకున్నశూన్యాన్ని
తదేకం గా చూసుకుని-
సంగ్రహిస్తాను చిత్రాలెన్నో
ప్రదర్శనాభిలాష లేదు;
పదిలమైన నెలవు కావాలి,
మాతృక ని సృజన చేసే చూపు కావాలి,
నా కంటి ఆవరణ లో అలికిడి రావాలి. 

మెత్తగా ఆవరిస్తున్న మౌనాన్ని
మమేకమై ఆలకించి-
విరచిస్తాను కవనాలెన్నో.
సమ్మేళనాకాంక్ష లేదు;
నిండైన స్వరం కావాలి,
బాణీలు కట్టి ఆలపించే మనసు కావాలి,
ఈ నిశ్శబ్ద వాకిలిలో రాగాలు మ్రోగాలి.

చిద్రమైన పూరేకులు ఏరుకోవాలి,
సజ్జలో సర్దుకుని సాగిపోవాలి.
హిమోన్నత శిఖరాల బాట వెదుక్కోవాలి,
ఆచూకీ అడగని సీమలకి తరలిపోవాలి.
షరతులు పెట్టని సాంగత్యం కావాలి,
పునః సమీక్షల అలిసిన హృదయ తపన తీరాలి.
పరకాయించి చూడటానికిక మరేవీ మిగలకూడదు...

ఇంతే /గా!/నా?/లే!?/ తెలీదింకా...

ఉదయాన్నే కాఫీకప్పులోకి నోరు తెరుస్తూ:
పాత మిత్రుల పలకరింపుకని కిటికీలు
మూసి ఉంచిన పుస్తకమొకటి కూడా తెరిచాను

లోలోపలా తెరవబడుతున్న తలుపులు, తలపులు

తెలిసిన ఆస్వాదన,
తెలియని అనుభూతి, 
తెలిసీతెలియని ఆరాటం

ఎప్పటిలానే అసంబద్ధమనిపించే ప్రశ్నల ధాటి

రెక్కల ధ్వనితో, కూతల కుదుపుతో
ఆమని సంబరాలలో చిరకాల స్నేహితులు:
ఒక నిమిషం చిటారుకొమ్మన ఊయల ఊగుతాయి
చివాలున నేలకి వాలుతాయి
కిటికీ అంచున ఆగి, వెక్కిరించినట్లే ఉంటుంది
ఎందుకా అసహనం? కాదేమో, 
స్వేఛ్ఛావిహంగపు వైనమదేనేమో
మదిలో రెక్కలు కట్టుకున్న అనుభూతి
ఇంకాస్త చేరువగా జరిగి-
వాటి పాటలే వినమంటుంది

ఒడిలోంచి హఠాత్తుగా జారిపడిన పుస్తకంలో:
వేలికొసలకి తగిలిన పుట అంచున ఒక మడత
మరిచిపోకూడని ఒక చిరునామా వెన్నులో జలదరింపుగా
ఏనాడు జరిగిపోయాను ఆ జ్ఞప్తుల నీడల నుంచి,
వెన్నెల్లో ఆకుకొసల మీద వరసలు కట్టే నీలిమ మరిచి?

చివరి చుక్క చేదుగా గొంతులోకి దిగాక,
కిటికీ ఊగేలా చలిగాలి దూసుకువచ్చాక
గుండె లయ మాత్రం యధావిధిగా సాగుతుంటె
చిరు నిట్టూర్పుతో మూసిన పుస్తకం, కిటికీ వదిలి
ఖాళీ కప్పు, కరుగుతున్న మనసుతో కొత్త రోజులోకి నేనిలా,
ముసిరే తలపులు, మూసుకోని తలుపులు లోలోపల పదిలంగా !!!

చూపిస్తా నా తడాఖా అంటే ఊరుకుంటారా!?
అనుకోకుండా మా పొరుగింటివారబ్బాయి ఇలా బాతులతో మాట్లాడుతుంటే 'భలె భలే, నాకొక మిత్రుడు, దొరికాడు.' అనేసుకుని ఒక క్లిక్ చేసి, తిరిగి పనుల్లో పడ్డానా...మరొక పావుగంట లో గలాటా, ఆరాగా నా కిటికీలోకి తొంగి చూస్తే అతను స్వరం పెంచి ఆ జంట పక్షులను మందలించటం వినవచ్చింది, ఇంకొక 5 నిమిషాల్లో తుపాకీమోతలూను.  మరొక 10 నిమిషాలకి పోలీసుల ఆగమనం. సరే మీ ఉత్కంఠ నా ఉబలాటం మాచ్ అయ్యాయి కనుక, జరిగిన సంగతి ఇది- ప్రతి స్ప్రింగ్ లో ఆ పక్షులు వాళ్ళ బాక్యార్డ్ లో గుడ్లు పెట్టి పొదగటం, ఆ సమయాన ఆ సమీపాలకి వెళ్తే దాడి చెయ్యటం చేస్తున్నాయి, నిజానికి canadian gheese కి చాలా ఉగ్రంగా ఉంటాయని నానుడి; తోటపని ని అమితంగా ఇష్టపడే వాళ్ళమ్మ కు ఇదొక తలకాయ నెప్పిగా మారటం తో, ముందుగా మాటలతో అదిలించాలని చూస్తే ఆ పక్షులూ నోరు పారేసుకుని, రెక్కలెగరేసుకుని దూసుకువస్తే, తప్పనిసరై air pistol or pellet gun తో కాస్త ఎక్కువగా బెదిరించాలని చూసిన అతని ప్రయత్నం వికటించి, అవతలి పక్కింటి యజమాని ఫిర్యాదు గా పరిణమించి పోలీసులు, రచ్చగా ఫలించింది. నా వంతుగా చూసినది చెప్పి తప్పుకున్నాను, అతనూ శిక్ష తప్పుకున్నాడు...అమెరికానా మాజాకా, అందరికీ సమాన హక్కులు, సమస్థాయి దౌర్జన్యం చెయ్యగల అదును ఉన్నాయి...ఇంతకీ ఆ జంట కుటుంబంగా మారాక ఇలా 'కన్నతల్లి కన్నతండ్రి కన్న కలలే కుటుంబం' అని ఇలా పాడేసుకున్నాయి నా పెరటి చెరువులో. 


(As cleaning the space around the house and memory within the computer, an old pic reminded of this lighter vein humor) 

నిర్ద్వంద్వము

దుఖం అబద్దం కాదు, ఇప్పుడు పొందుతున్న సంతోషం అబద్దం కాదు... అలా అని ఏది పూర్తి గా సత్యం కాదు, అదే మనం కల్పించుకున్న వెలుగు నీడల వెతుకులాట. నాకోసం నేనే కల్పించుకున్న మాయే ఈ ప్రపంచం...ఈ బాధ, ఆనందం నే కల్పించుకున్న పాత్రలలో ఇమిడి నన్ను నవ్విస్తున్నాయి, ఏడిపిస్తున్నాయి. వీటికి మించిన అనుభవం, ఆనందం ఒకటి ఉంటుందంటే నా మనసు ఒప్పుకోవటం లేదు... కాని నా అంతశ్చేతనం చెపుతోంది వీటికి మించిన సత్యమొకటి, శాంతి ఒకటి వుందని.. అది దొరికినరోజు "అసతోమా సద్గమయా... తమసోమా జ్యోతిర్గమయా... మృత్యోర్మా అమృతంగమయా" అనే మానవ ధర్మానికి పూర్తి అర్ధం దొరుకుతుంది కాబోలు!?...

ఇన్నేళ్ళుగా, పుట్టింది లగాయతు గూడు కట్టుకున్న, నేను కూర్చుకున్న 'ఆ భావన' కి తగు సమాధానం దొరికింది. భక్తి, ఆథ్యాత్మికత, అన్వేషణ మూలాల నుంచి మొదలైన నా వేదన, శోధన లకి ఒక సాంత్వన, శాంతి అందాయి, అంతేకాదు నా జీవితంలో అనివార్యమైన భాగమయ్యాయి. జీవితంలో ఒక పెద్ద ఇముడ్చుకోలేని ఆనందమైపోయాయవి...జీవితం లోని వెలితికి పూరకం అందింది! సాగనున్న బాటలో పచ్చని భావి మొలకలు గా చివురించింది...

రాయ/లే/ని పుట

ఆకు వంపులో, గోడ మూల లో పొటమరిస్తున్న చీకటి,
కుంపటి సెగలో, ఊదొత్తుల పొగలో పట్టులేని వేడిమి,
గుప్పిళ్ళలో మూసివుంచిన వణుకు, భయం.
దేహంలో పాకుతున్న ఒంటరితనం...

గృహమంతా పరుచుకున్న కాగితాలు,
కాగితాల్లో ఇమడలేని భావనలు.
పరిసరాల్లో నాచువాసన,
పాకుడుపట్టిన జ్ఞాపకాలు. 

చీకటిలో గుడ్లు మిటకరిస్తున్న బల్లి
రెక్కలలిసిన కీటకం దిశగా పాకుతుంది.
గుండె మంట పదునెక్కింది,
కాలిపోయిన కల కవురు వాసన వేస్తుంది.

లోపలి గొంతుకి, వెలుపలి కన్నుకి భాష్యం ఒకటే
వినాళగ్రంథి కలగలిపి, విడగొట్టి విదిల్చిన ప్రేలాపనలో... 
దివారాత్రాలకి చెందని చీకటివెలుగుల్లో
కొట్టుకుంటున్న కవాటాల వ్యర్థ చరితలివి.

షి"కారు" లో

ఆకుల కాకులు అల్లరిగా ఎగిరెగిరిపోతే,
కొమ్మల పందిర్లు వెలవెలబోతూ,
రాలుగాయి గాలులకి, 
ఆకతాయి వానలకీ చిక్కాయని,
కిటికీ అద్దం కబురు చెప్పింది.

చక్రాలు ఉండుండి ఉలిక్కిపడి,
కుదుపొకటి ఊహని చెదరేస్తే,
మాటల మాటున మనసుని,
పాటల రూపుగ చిత్రిస్తూ,
నాకు నేనే ఊసులు చెప్పాను.

కిటికీ అవతలి ఆకాశం,
బొగ్గుల కుంపట్లా ఉంది.
జొన్నకంకులు లేని చేలు,
చిన్నబోయి నేలలోకి కృంగాయి.
నీలాకాశం, పచ్చనిపైరు జ్ఞప్తికొచ్చాయి.

కంటికీ, ఆలోచనకీ లంకెలు వేస్తూనే,
ఒప్పేసుకున్నాను నిన్ను మరవలేనని.
అసలు విహారం, నీ తలపుల్లోనే అనునిత్యం
ఇక రేయికీ వేకువకీ నడుమ కలలగమనం,
నిదుర మెలుకువల  సహగమనం, నీ అనురాగం తోడుగా...

అనుకోనిది

నందివర్ధన గుబురు పక్కగా వెళ్తే,
ఎందుకో, ఆ నవ్వే పూలకన్నా-
ముదురు పచ్చ కాంతితో
మనసు ని ఊరడించే ఆకులు
పరిచయమౌతాయి

సందెపొద్దు జాజరల జడిలో-
పందిరి గుంజలకి అల్లుకున్న
కాశీరత్నం లతల లాలిత్యం
వెచ్చని హస్తాలతో
ఆలింగనం చేసుకుంటుంది

దృగ్గోచరమయ్యే సౌందర్యం పిలిచినా 
అవగతమయ్యే సత్యం నిలిచిపోతుందిలా.

ఉగ్గబట్టలేని ఆనందం తొణికినా
అంచులేని చషకం నిండిపోతుంటుంది తరుచుగా...

చెప్పలేదు కదు!?

నేనున్నానక్కడ అంటే తెలుసా? నేను ఇక్కడ మాత్రమే లేను అక్కడ కూడా ఉన్నాను అని అర్ధం. ఎక్కడా అంటావా- నీ ఎదలోను ఎదుటా ను! ఎందుకని అడగవు గానీ,

జీవిత బీజం మొన్న పుట్టి, నిన్న మొక్కై ఇవ్వాళ పూలు కాయలు వేస్తుందా, కాదుగా? జీవితం ఒక మహా వృక్షం అయ్యాక ఒకే ఫలాన్ని ఇస్తుంది: నా జాతి పేరు 'ప్రేమ', నమ్ము ఇది నిజం! అందుకే ఊహాత్మక అనుబంధాల ప్రేమామృతాన్ని తాగుతుంటాను. చెప్పనే లేకపోయానింత వరకు, నిజ జీవితం లో స్వార్థపు అగ్ని పర్వతం చిమ్మే లావాని, కలహాల మథనం లో పుట్టే హాలాహల ద్రవాన్ని తప్పనిసరై సేవించానని. నీకు చెప్పలేదు కదు, నేనొక నిశివేళ ఈ జీవన సంవిధానము అర్ధం చేసుకుని మౌలిక అంతరాలలో దాగున్న రహస్యాలని ఆవిష్కరింప చేసుకున్నానని? నీకు నిజం గా చెప్పడం మర్చిపోయాను నేనొక మామూలు మనిషినని; ఇన్నాళ్ళూ ఈ మరో ప్రపంచపు కోలాహలం లో, మహా జగత్ కల్లోలం లో కన్నీళ్ళు పెట్టుకుంటూనే నా జీవిత ఫలపు విత్తులని నాటటానికొక హృదయసీమకై వెదుకులాడుతున్నానని...నిను కనుగొన్నాక ఆ అన్వేషణ ముగిసిన ఘడియల్లో అలిసి డస్సిపోయి ఉన్నానని ఇంకా చెప్పేతీరాలా? 

కోన దాపున ఆమని శోభ

పటమటి నుదుటి బొట్టు నీడలు
నీటి వాలులో పసిడి దీధితులు

తెలవారి తిరిగొచ్చే ధవళ కాంతులు
గరికె మేనికి గంధపు చెమరింతలు

శిఖరకేతనపు పచ్చల వీవెనలు
మూసిన గుప్పిట మేల్కొలుపులు

విరిసీ విరియని నవ్వుల దొంతరలు
కిటికీ రెక్కకి తగిలించిన జ్ఞాపకాలు

వీక్షణ కాంక్ష

చుట్టుపక్కలకి చూపులు ప్రసరించటం
ఇంకాస్త తీవ్రతరం కావాలి,
కనుమరుగౌతున్నవన్నీ కళ్ళలోకి పట్టేయాలి. 
కబోదికి కళ్ళు వస్తే, 
దృగ్గోచర ప్రపంచ రూపురేఖల్లో 
ధీర్ఘకాల దుఃఖిత మమకారంతో
లీనమయ్యే రీతి చెందాలి:
కొత్త కళ్ళుంటే బాగుండునని ఉంది.

కళ్ళ నుంచి కాంతి పుంజం
నలుదిక్కులా పరావర్తనం చెంది
ప్రకృతి దర్పణంలో భాసిల్లే
ప్రతిరూపాలు పలుకరిస్తుంటాయి
రాతిలో రంగులు గమనిస్తున్నాను 
ఏటిలో కెరటాలు పసిగడుతున్నాను
వింత ఆకృతులూ ఊహిస్తుంటాను
మరి, ఇంకా ఎందుకీ వీక్షణ కాంక్ష?

స్మృతి పథంలో దృశ్యాలు
మనసు ఆవరణకి తేవాలి
విస్పష్టమైన రూపాలని
మరొకసారి పరిశీలించాలి
తిరస్కృతి లో చేజార్చుకున్న
జ్ఞాపకాలు ఉన్నాయేమో తరిచి చూడాలి 
చూపుని ఏమార్చి లోలోపల చోటుచేసుకున్న 
గురుతులని పదిలం గా పొదిగి వెలికి తీయాలి

నా కనులకి అలవోకడ అలవాటు కావాలి
రాతి గుండెలో కదలిక కనిపెట్టాలి
ఉదాసీనత పట్టి పీడిస్తున్న మనిషిని చుట్టుముట్టాలి
'సగటు', 'మామూలు' కొలతల్లో మునిగిన వారికి 
'శూన్యం', 'సంపూర్ణం', 'నిశ్శేషం' ఉంటాయని చూపగలగాలి
మూగ/వోతున్న/ జీవుల వేదన కంటిపాపకి అందాలి
సాగిపోతున్న కాల చరిత్ర ని కనులారా చదవాలి
లోపలా వెలుపలా నడిచే యోచనలకి సమన్వయం కుదర్చాలి...

అనాదిగా ఇదే ఉగాది

గగనాలు పోసిన చినుకుల తలంబ్రాలు-
సెలయేటి కాంతకి ఒడిబియ్యాలు,
ఊటనేలలో ఎదిగిన చెరుకు బెల్లాలు అవుతాయి.

కోయిలమ్మ చివురులతో సరిపెట్టుకుంటే,
చిలుకమ్మ పిందెలు చిదిమి వదిలితే,
మామిడికొమ్మ మళ్ళీ కాయలు కానుకిస్తుంది.

చింతలెరుగని బతుకుండదని,
ఈదులాడనంటే ఒడ్డు ఆమడదూరాన్నే ఆగిపోతుందని,
పులుపు మేళవింపు చింతచెట్టు తన వంతుగా పంపుతుంది.

కాకమ్మ ఎత్తుకెళ్ళిన పళ్ల లెక్కలడగని,
గాలిగాడు రాల్చిన ఆకుల అజ పట్టని,
వేపమ్మ చేదుమందే శాస్త్రమని పువ్వులో పెట్టి చెప్తుంది.

కారాలు చెపుతాయి ఊరూపేరూ వివరాలు-
ఆరబోసిన మిరప మిలమిలలే
ఉగాది నోటికి కారాలు, కంటికి నీరూను.

ఏడేడు సంద్రాలు ఎన్ని యుగాల కన్నీటి కాలువలో?
శోకాలు లేనిదే శ్లోకాలు పుట్టవనేమో,
రవ్వంత ఉప్పు కలపని ఉగాదికి నిండుదనం రానేరాదు.

గులకరాయంత కష్టానికి ఫలం,
బండరాయంత సుఖం...
కష్ట సుఖాల కలబోతల జీవితాలు
ఉగాదికి ఉగాదికీ నడుమ షడ్రుచుల విస్తర్లు.