అమ్మ అమ్మే - తను కాదా అనాది దేవత?

అమ్మ అమ్మే ...
ఆనందవేళల "అమ్మ" అని పిలిచినా
ఆసరాకొరకని "అమ్మా" అని అడిగినా,
ఆపన్నసమయాన "అమ్మా" అని అరిచినా,
అసలేమీ అనకుండా ఆమె చెంత చేరినా,
అవేమీ కాకున్నా తానే నా దరికి చేరినా,
అమ్మ అమ్మే, అనురాగాన ఆమెకన్నా ఎవరు మిన్న?

ఆకలని నాకెందుకు తెలియలేదు మా అమ్మకన్న ముందు?
అలిగి అరిచానని తిరిగి నవ్విందే కాని అసలేమీ అనదేం?
నాన్న కసిరితే అమ్మ వంతు మినహాయిస్తే నాకేం మిగలదేం?
నన్ను మందలించిన వారెవరైనా ఆగగలరా మా అమ్మ ఎదుట?
ఎవరేమన్నా నా చిరుచేతలే పొరుగూరు వరకు పాకేనెలాగట?
అసలేమిసంగతంటే అది కాదా నను కన్న అమ్మ ఆరాటం?

అలా వాగువంక పోతే ఆ ఒరవడి అమ్మ ప్రేమంత,
ఇలా మబ్బువంక చూస్తే ఆ వైశ్యాల్యం అమ్మ మనసంత,
పూల కొమ్మ విరబూస్తే ఆ సోయగం అమ్మ నవ్వంత,
పళ్ళ కొమ్మ బరువుగ వాలితే ఆ నిండుతనం అమ్మ వాత్సల్యమంత,
నిజానికి నేనెంత మా అమ్మైనా ఆమెను వర్ణించను?
అమ్మ ఒక అనాది దేవత, నేనూ కాదా ఆ అమ్మతనాన్ని అందుకున్న ఓ అతివ!

తరచి తరచి నిన్నే తలచినా, తనువు మరిచి నీలో మునిగినా ..

వస్తావని చూసినా, రావని వగచినా, రాలేదని నిలదీసినా
సమయానికి వస్తూనే వుంటావు, తలపే కనుక వాకిలీ లేదు.
తలపు వెలికి నేను వచ్చినా, తలపు లోకి నేను జారినా,
తరచి నిన్నే తలచినా, ఇది మనకి నిత్యపారాయణం కాదా?

తపించి, జపించి, నీ చేరువలో తరించి ఎద పొంగిపోయినా,
విడిచి, వేదన పడి, మౌన రోదన సుడిలో మునిగిపోయినా,
తిరిగి ఎదురుచూపున విసిగివేసారినా, నిన్నొదిలి పోదామన్నా,
అదే వలయం నా నిలయం, ఆ చక్రానికి ఇరుసు నీవే కాదా?

నను వీడిన మరునిమిషమే నీవెళ్ళిన దారుల గాలే పీల్చుతూ,
నీ అడుగులు సోకాయన్న నేల తిరిగి తిరిగి తాకుతూ,
కలలోనైనా నీవొస్తే ఏంచెప్పాలో మళ్ళీ మళ్ళీ అద్దంకి అప్పచెపుతూ,
ఇలా నీ తలపుల, ఇల వలపుల, కలల కవితల మాలలల్లుతాను కాదా?************************************************

మనవి: సమిధ ఆనంద్ గారు ఒకప్పుడు నా మాటలకి ఎంతో ప్రతిస్పందించి అంతే చక్కగా వ్రాసిన కవిత ఇది. పైన కవితలోని చివరి నాలుగు పంక్తులు అప్పుడు నా స్వగతంగా వ్రాసాను, తన పొడిగింపు అలానే సాగింది. అది కూడా చూస్తే కవితహృదయం పోకడలు మనసు మనసుకి ఎలా మారతాయో అర్థమౌతుంది.

నీవులేని మరువపుగాలి, నీవులేని సమిధపు వెలుగు: http://ayodhya-anand.blogspot.com/2009/02/blog-post_26.html

నిరీక్షణ - సమర్పణ

నా మానసవనాన తలవాల్చిన తరువు అనురాగం.
తల్లివేరుచీడ పూరేకుని తాకకూడదని తలపోసానాశగా.
కొమ్మంటు వేరుచేసా పదిలంగా నీ ఆనగా.
నీ హృదయసీమన నాటాను నా అభిమతంగా.

ప్రేమ తీర్థమిస్తావో? వలపు వేడి పంచుతావో?
మళ్ళీ చివురు వేసినా, మొగ్గతొడిగి పూలు పూసినా,
ఆ చివురల మాల అల్లినా, ఆ పూల పక్కపరిచినా,
అవి నీకే స్వంతం, నీకు మాత్రమే పరిమితం.

ఏ కలల్లోనూ నీకై వెదకబోను, వూహల్లోనూ నీకై నిరీక్షణ మాత్రం ఆపను.
ఈ ప్ర్రాయమాని నను ప్రశ్నించుకోను, నీ రాకకై అనునిత్యం వేచివుంటా.
ఇది తరుణమాని నిను నిలదీయను, కల,ఇల,వూహ అన్నిటా స్వాగతిస్తా.
నా మానసమే నీకు కోవెల చేస్తా, ఈ సమర్పణమే నా కానుకగా ఇస్తా!

నా మారథాన్ - విశ్వమానవ ఆయురారోగ్యాలకి అంకితమిస్తు, నేగరిపిన యాగం!


నా మాట: brevity లేదేమని అడగకండి. "ఆనందమానందమాయె, మది ఆశలనందనమాయె, మాటలు చాలని హాయె ఒక పాటగ మారిన మాయె" అన్నట్లుగా, ఈ అనుభవం పూర్తిగా వ్రాసుకోనిదే నా మనసాగలేదు. చిరకాలవాంచితం ఈ marathon పరుగు. మొత్తానికి 13.1 మైళ్ళు పరిగెట్టేసాను ;) ఓ ఆశయం నెరవేరింది. దానికన్నా అలా స్ఫూర్తి చెందటం, వేలమందితో పరుగిడటం మరపుకు రాని అనుభూతి. 04/11/09 అనుకోని ఈ ఆనందాన్ని మిగిల్చివెళ్ళింది. ఇకపోతే మందాకిని వంటి నా పరుగు, పరవళ్ళ గోదారై మునుపెన్నడో జరిగిన సర్జరీతో మూలపడిన నా నృత్యం త్వరలో తిరిగి జీవం పోసుకోవాలని సాధన చేస్తున్నా. కృషితో నాస్తి దుర్భిక్షం, అక్షరాలా నిజం కదా! కాకపోతే "కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన" లో నమ్మకమున్నదాన్ని. ఆ నమ్మకంతోనే జీవితం కొనసాగిస్తున్నదాన్ని. మారథాన్ విజయాన్ని మీతో సంతసంగా, సవినయంగా పంచుకుంటూ బ్లాగ్మిత్రుల ఆశీస్సులు/ఆకాంక్షలు కోరుకుంటూ - మీ నేస్తం :)


*************************************************
ముందడుగు వేయమనిచెప్పింది చరిత్ర.
వెనుదీయకని హెచ్చరించింది గతం.
జతగా రారమ్మని స్వాగతించింది ప్రస్తుతం.
కలిసి సాగుదామని అరుదెంచిందీ పయనం.

ముందు వేలు వెనుక వేవేలు సజ్జనులు.
డెందము తొందరపెట్టిన వువ్విళ్ళూరింతలు.
అధరాలు విచ్చుకుని ఆనందహేలలు.
ఉదయం త్వరపడి తెచ్చిన వేకువవెలుగులు.

పాదచారులే అశ్వరూఢులన్నంత వేగం, ఆ జనసందోహం.
ఆదమరిచి నేనూ పరుగిడిన వైనం, సరిజోడైన చిత్రం.
చూపుకందని పయనమాపని అంతేలేని జనసంద్రం.
నదీనదాన్నై నేగరిపిన యోగం అందు సంగమం.

రోజూ చూసిన తరులే చివురాకుల స్వాగతించి,
పూరేకు అక్షతలు విసిరాయి.
విన్న కూజితాలే క్రొత్తరాగంలో వినిపించి,
మంగళవాయిద్యాలయ్యాయి పక్షులు.
నిన్న బుజ్జగింపు గుర్తుందేమో మలయమారుతమై,
వింజామరలు వీచింది గాలి.
నేల పచ్చని గరికతివాచి పరిచి తోవకందంతెచ్చింది,
నడుమ మెరిసాయి బాటలు.

పొద్దుపొడుపులో గోరువెచ్చదనమే
గువ్వగూటికి చేరేవరకు నిలిపాడు సూరీడు.
పొద్దుబారెడైనా హద్దేలేని
ఆప్యాయత పంచారు స్వఛ్చందసేనలు.
అశ్వమేధమా, రాజసూయమా,
సత్యాగ్రహమా కానేకాదది, నిర్వచించలేనిది.
విశ్వమానవ ఆరోగ్య, ఉత్తేజపూరిత జీవనానికై
నిర్వహించబడింది, విజయవంతమైనది.

మొదటిమైలు అంతా గురిపెట్టి వదిలిన బాణాలే.
రెండోమైలు కాకలుతీరినవారు కదనంతొక్కిన వైనాలే.
మూడాయే,నాలుగాయే,
అయిదో మైలులో అందమైన హాసాలే.
పద పదమని తొందరించిన పలు ఉచ్చ్వాస నిశ్శ్వాసలే.

ఆరోమైల్లో "యు అర్ లుకింగ్ గ్రేట్ 8646" అదో నామకరణం,
నా పేరుకన్నా అదే పసందు.
ఎన్నోమైలో ఇక లెక్కవేయనన్న
నా మది చేసుకుంది కనులకి విందు.
లెక్కలేనన్ని మన్ననలు,
మనం చేసిందే జైతయాత్రేమోనన్నంత జేజేలు.
ఒక్కరినీ వదలక ఆఖరి అడుగు వరకు
నడిపించిన జననినాదాలు.

పదకుండోమైల్లో "యు హేవ్ వన్ లెవన్ మైల్స్"
ఎంత సుతారమా దాపరికం.
పడుచువాడొకడు కన్నుగీటితే
నాలో పరువపు పరుగులు పునరావృతం.
మరోమైలు నడవగానే "యు హేవ్ ట్వెల్వ్ మైల్స్ బిహైండ్"
అహా కల సాకారం.
పదమూడూ పూర్తిచేసా, వేదిక వరకు వెళ్ళిన
మానసాన ఆనంద విహారం.

అంతరాత్మలో జగం, అంతరంగాన అయినవారు,
అంతర్లీనంగా నేస్తం.
త్రివేణిసంగమ సామ్యం నా ఆలోచనా ప్రవాహం,
ఆగని ఆ ఉత్తేజం.
అడుగడుగున సౌభ్రాతృత్వం,
తారతమ్యానికి తావీయని సమతాభావ౦.
ఆయురారోగ్యయాగాన నేనొక సమిధనయ్యాను,
ప్రోదిచేసుకుంటు మరో అనుభవం.

పాటల సందడి - మా తెలుగు తల్లికి మల్లెపూదండ

"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" శిశువులు పశువులు పాములు వశులగుదురు గానమునకు. మరిక మనమెంతవారం ఆ కోవలకి చేరమనేన్దుకు. నాకు నాన్నగారి ద్వారానే మంత్రాలు, పద్యాలు, శ్లోకాలు, పాటలు ఆ వరస క్రమంలో పరిచయం చేయబడ్డాయి. పాఠశాలలో గురు సమక్షంలో అది కొంచం ముందుకు సాగింది. కానీ నాలో ఆసక్తి పొడిగించబడింది మాత్రం ఈ పాటతోనే. అప్పుడు ఎవరు వ్రాసారు, ఏ సందర్భంగా వ్రాసారు వంటి జిజ్ఞాస కలగలేదు. క్రమేణా ప్రతి పంక్తి ఒక క్రొత్త అభిరుచిని నా జీవితంలోకి ప్రవేశపెట్టింది. కృష్ణమ్మ వొడిలో పెరిగి గోదారి తీర్థం పుచ్చుకున్న జీవనమిది. శిలల్లో శిల్పాల్లో తనువు మరిచిన అనుభవాలు ప్రోది చేసుకున్నాను. కవనాలు, గానాలు మనసుకి పసందైన విందులు అందించాను. మన వెనుక తరం వారిని దర్శించాను. వారి గురించి తరిచి తరిచి శోధించాను. మొత్తంగా ఈ నాటి నా వ్యక్తిత్వానికి, మీ చేత మన్ననలు పొందుతున్న నాకు ఈ పాటే మొదటి స్ఫూర్తి.

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు


ఎన్నో పాటలు విన్నాను, కొన్ని అలా ఆలాపనలుగా, మరి కొన్ని మళ్ళీ వినేలా, కొన్ని నా మనస్థితిని వ్యక్తం చేస్తున్నట్లుగా. నాకు నచ్చిన, ఇంకా నచ్చనున్న కొన్ని వేల పాటల్లో ఏ ఒక్కదాన్ని తక్కువ చేయలేను అలాగే ఈ పాటకున్న స్థానాన్ని పంచలేను.

ఇక మీ అందరికీ విదితమైన పాట గురించి నేను విదమరిచి చెప్పనవసరం లేదు.

పాట రచయిత: కీర్తిశేషులు శంకరంబాడి సుందరాచార్య

ఈనాటికీ ప్రబోధగీతంగా పలుమార్లు వినిపిస్తుంది. విన్న ప్రతిసారి అంతే పరవశంగా వింటాను. పాడటంలో పెద్దగా ప్రవేశంలేని నేను ఒక వేదికపై దాదాపు వెయ్యిమంది ముందు పాడిన ఒకేఒక పాట ఇది. ఆ అనుభవం చాలు నాకు ఈ పాట అంటే ఎంత ప్రీతో తెలుపను.

************************************
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి
మా తెలుగు ...
గలగలా గోదారి కదలి పోతుంటేను
బిరాబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
మా తెలుగు ...
అమరావతి గుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలిచి వుండేదాక

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మాచెవుల రింగుమని మారుమ్రోగేదాక
నీ పాటలే ఆడుతాం - నీ ఆటలే పాడుతాం
జై తెలుగు తల్లి ! జై తెలుగు తల్లి !
************************************

పాట వినాలనివుంటే క్రింద ఇచ్చిన లింకులకు వెళ్ళండి.


టంగుటూరి సూర్య కుమారి గారు ప్రైవేటు లలిత గీతంగా అలాపించినదిది:

http://surasa.net/music/lalita-gitalu/tsk/01matelugu.mp3


http://www.esnips.com/doc/a78e518f-8948-4e2c-9d87-6898b5c97890/Maa%20TeluguTalliki


దేశభాషలందు తెలుగు లెస్స.. నేను తెలుగమ్మాయినయినందుకు నా మనసు ఆనంద కడలిలో సాగుతూ పలికింది హైలెస్స..


Get this widget | Track details | eSnips Social DNA

జగదాధారా! జరామరణ జీవితం చాలదనా, ఇంకా లీలచూపుతున్నావు?

స్వామీ! నీ నిజరూపమేదని అడగలేననా ఇటుల పరీక్షిస్తున్నావు?
ప్రభు! నీ పాదాలచెంతకైనా చేరలేననా వెతల ముంచేస్తున్నావు?
దేవా! నీ నామస్మరణ మరిచాననా మిగుల నేరమెంచుతున్నావు?
తండ్రీ! నీ పావనచరిత పఠించలేదనా కఠిన శిక్షవేసినావు?

నిరాకారా, గుడిలో, శిలలో నీవుండవు నీవున్న నా గుండే నీ గుడన్నాను.
సమవర్తి, కలిమిలో, లేమిలో కలవన్నాను, కలతనిదురనందూ నిన్నేకన్నాను.
మహనీయ, మదిలో, హృదిలో స్మరించాను, మానవతకి నీవేమూలమన్నాను.
భక్తవత్సల, చెలిమిలో, బలిమిలో కాంచాను, జగమంతా నిన్నేదర్శించాను.

కరుణసాగరా, నీముందు ఒక సింధువునైన కాకపోతినే.
సుగుణశీలా, నీనుంచి ఒక దయాదృక్కునైన పొందనైతినే.
ఉత్తమోత్తమా, నీచెంత ఒక యుగముకైన నిలవనైతినే.
మోహనరూపా, నీయందు ఒక నిమిషమైన చూపునాపనైతినే.

నిర్వాణనాథ, కర్మము త్రుంచవా? సహజమార్గము నందు నను నడుపవా?
చిన్మయరూప, ఙానము, యోగము ఇరుకనులుగ నా దృష్టి లోపం సరిదిద్దవా?
సర్వాత్మక, భవసాగరం లోతు తెలుపవా, నా నావ నీవైపు మరల్చవా?
పరమాత్మ, తుదిశ్వాస నీ ధ్యానమందు ముగించనీవా, కడచూపు నీపైనే నిలుపనీవా?

ఉరుము భేరి మ్రోగించి, మెరుపు దీపాలు వెలిగించి సమరం చేసె ఆకాశం!

నేనొకపరి తలపైకెత్తి చూపులు నిలిపితే దిగంతాల పర్యంతం ఆకాశం
తనొకతే పరుచుకుని పరవశిస్తున్న ఆ పోకడ ఎటులచేయను పరిచయం
ఆకాశం ఎంత విశాలమో ఆమె మనసంత ఉదారం
అవనిపట్ల ఆమె చూపు ఆదరణ ఎంత అనంతం?

దప్పిగొన్నదో, ఆర్తిచెందునో పుడమికెపుడూ పుట్టెడు శోకం
తపనతీరగ వాగులై, వంకలై, నదులుగా ఆమె కన్నీరే తనువంతా
బీటపడే గుండెల్లో అగ్నిగోళాలుంటాయో, ఎగిసిపడే కళ్ళు లావాలై పారుతాయో,
చెప్పలేని బాధలొకపరి ఉప్పెనై పోటెత్తునో, వ్యధలు సుడిగాలై చెలరేగునో
ఆ ఎత్తున వుంది కనుక ఆకసానికి మాత్రమే అన్ని గోచరమౌతాయేమో?

సమరం కావించినట్లే అవని భారం తన మీద వేసుకుంటుంది
మబ్బుతల్లి నీటి బిడ్డలు ఒకటొకటి సైనికులై వరసలు కడతాయి
ఉరుము భేరి మ్రోగించి, మెరుపు దీపాలు వెలిగించి కెంపురంగులద్దుకుని
ఆకసం అడుగిడదా అంబరమంత విజయసంబరం అందుకోను?

జల్లుజల్లుగ, పరవళ్ళుగా, వురవళ్ళుగా పుడమినంత తడిమి తడిమి
తన తనువంతా చల్లబరిచి, తపనతీర్చి, తాపమణిచి స్తబ్దమౌనా సైన్యం.
వుల్లము ఝల్లన వెల్లువ పొంగగ అవని తిరిగి నవ్వగా, గిరులు తరులు మెరవగా,
తన మనసంతా నిండునేమో వన్నెలు చిమ్ముతూ తాను నవ్వేస్తుంది ఆకాశం.
మునుపొకపరి వేరేతోచిన తానే పరి పరి విధముల నను ముగ్ధని చేయునే ఇలా!

చెలిమికేది చెలియలికట్ట, ఆగుతుందా సాగకుండా...

ఆ కొమ్మమీద పిట్టకి ఎందుకోనమ్మ అంత కినుక
నా కందనంత ఎత్తున ఎందుకే ఎగిరావన్నందుకా?
ఆ ప్రక్కపూవు మీద వాలిన తుమ్మెదకెందుకో నవ్వు
నే చెయ్యలేని దూర యానాలు తనొక్కతే చేసినందుకేమో?

పిట్ట పేరూ ఎరుగను, తుమ్మేదకింకో పేరు తలవను
ఇట్టె వాలి అట్టే పోయే ఆ పిట్ట రెక్క మాత్రం అరువడుగుతా
ఎక్కడినుంచో వచ్చి వాలి ఇంకేడకో పోయే తుమ్మెద దారి పడతా
నేనెగరలేని ఎత్తులు చేరిపోతా, నేచెయ్యలేని యానాలు పూర్తిచేస్తా

కొండలమీద కోయంటా, లోయల్లోకి తొంగిచూస్తా
వాగుల్లో మునకేస్తా, వంకల్లో వాలి సోలిపోతా
కొమ్మలమీద వూయలూగుతా, రెమ్మలతో వూసులాడుతా
పూవుల్లో దాగిపోతా, పుప్పొడితో తనువు కప్పుతా

పిట్టవుండగా నా తోడు, తుమ్మెద చేయదా నాతో చెలిమి
మరి నాకెందుకు వగపు, వారీ, వీరి తలపు
ఎకసెక్కమాడేటి కాలం ఇక జారుకోదా ఈ క్షణం
సరి ఎవరు నాకు ఎండమావిలో కూడా దప్తి తీర్చుకోను