నా మారథాన్ - విశ్వమానవ ఆయురారోగ్యాలకి అంకితమిస్తు, నేగరిపిన యాగం!
నా మాట: brevity లేదేమని అడగకండి. "ఆనందమానందమాయె, మది ఆశలనందనమాయె, మాటలు చాలని హాయె ఒక పాటగ మారిన మాయె" అన్నట్లుగా, ఈ అనుభవం పూర్తిగా వ్రాసుకోనిదే నా మనసాగలేదు. చిరకాలవాంచితం ఈ marathon పరుగు. మొత్తానికి 13.1 మైళ్ళు పరిగెట్టేసాను ;) ఓ ఆశయం నెరవేరింది. దానికన్నా అలా స్ఫూర్తి చెందటం, వేలమందితో పరుగిడటం మరపుకు రాని అనుభూతి. 04/11/09 అనుకోని ఈ ఆనందాన్ని మిగిల్చివెళ్ళింది. ఇకపోతే మందాకిని వంటి నా పరుగు, పరవళ్ళ గోదారై మునుపెన్నడో జరిగిన సర్జరీతో మూలపడిన నా నృత్యం త్వరలో తిరిగి జీవం పోసుకోవాలని సాధన చేస్తున్నా. కృషితో నాస్తి దుర్భిక్షం, అక్షరాలా నిజం కదా! కాకపోతే "కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన" లో నమ్మకమున్నదాన్ని. ఆ నమ్మకంతోనే జీవితం కొనసాగిస్తున్నదాన్ని. మారథాన్ విజయాన్ని మీతో సంతసంగా, సవినయంగా పంచుకుంటూ బ్లాగ్మిత్రుల ఆశీస్సులు/ఆకాంక్షలు కోరుకుంటూ - మీ నేస్తం :)
*************************************************
ముందడుగు వేయమనిచెప్పింది చరిత్ర.
వెనుదీయకని హెచ్చరించింది గతం.
జతగా రారమ్మని స్వాగతించింది ప్రస్తుతం.
కలిసి సాగుదామని అరుదెంచిందీ పయనం.
ముందు వేలు వెనుక వేవేలు సజ్జనులు.
డెందము తొందరపెట్టిన వువ్విళ్ళూరింతలు.
అధరాలు విచ్చుకుని ఆనందహేలలు.
ఉదయం త్వరపడి తెచ్చిన వేకువవెలుగులు.
పాదచారులే అశ్వరూఢులన్నంత వేగం, ఆ జనసందోహం.
ఆదమరిచి నేనూ పరుగిడిన వైనం, సరిజోడైన చిత్రం.
చూపుకందని పయనమాపని అంతేలేని జనసంద్రం.
నదీనదాన్నై నేగరిపిన యోగం అందు సంగమం.
రోజూ చూసిన తరులే చివురాకుల స్వాగతించి,
పూరేకు అక్షతలు విసిరాయి.
విన్న కూజితాలే క్రొత్తరాగంలో వినిపించి,
మంగళవాయిద్యాలయ్యాయి పక్షులు.
నిన్న బుజ్జగింపు గుర్తుందేమో మలయమారుతమై,
వింజామరలు వీచింది గాలి.
నేల పచ్చని గరికతివాచి పరిచి తోవకందంతెచ్చింది,
నడుమ మెరిసాయి బాటలు.
పొద్దుపొడుపులో గోరువెచ్చదనమే
గువ్వగూటికి చేరేవరకు నిలిపాడు సూరీడు.
పొద్దుబారెడైనా హద్దేలేని
ఆప్యాయత పంచారు స్వఛ్చందసేనలు.
అశ్వమేధమా, రాజసూయమా,
సత్యాగ్రహమా కానేకాదది, నిర్వచించలేనిది.
విశ్వమానవ ఆరోగ్య, ఉత్తేజపూరిత జీవనానికై
నిర్వహించబడింది, విజయవంతమైనది.
మొదటిమైలు అంతా గురిపెట్టి వదిలిన బాణాలే.
రెండోమైలు కాకలుతీరినవారు కదనంతొక్కిన వైనాలే.
మూడాయే,నాలుగాయే,
అయిదో మైలులో అందమైన హాసాలే.
పద పదమని తొందరించిన పలు ఉచ్చ్వాస నిశ్శ్వాసలే.
ఆరోమైల్లో "యు అర్ లుకింగ్ గ్రేట్ 8646" అదో నామకరణం,
నా పేరుకన్నా అదే పసందు.
ఎన్నోమైలో ఇక లెక్కవేయనన్న
నా మది చేసుకుంది కనులకి విందు.
లెక్కలేనన్ని మన్ననలు,
మనం చేసిందే జైతయాత్రేమోనన్నంత జేజేలు.
ఒక్కరినీ వదలక ఆఖరి అడుగు వరకు
నడిపించిన జననినాదాలు.
పదకుండోమైల్లో "యు హేవ్ వన్ లెవన్ మైల్స్"
ఎంత సుతారమా దాపరికం.
పడుచువాడొకడు కన్నుగీటితే
నాలో పరువపు పరుగులు పునరావృతం.
మరోమైలు నడవగానే "యు హేవ్ ట్వెల్వ్ మైల్స్ బిహైండ్"
అహా కల సాకారం.
పదమూడూ పూర్తిచేసా, వేదిక వరకు వెళ్ళిన
మానసాన ఆనంద విహారం.
అంతరాత్మలో జగం, అంతరంగాన అయినవారు,
అంతర్లీనంగా నేస్తం.
త్రివేణిసంగమ సామ్యం నా ఆలోచనా ప్రవాహం,
ఆగని ఆ ఉత్తేజం.
అడుగడుగున సౌభ్రాతృత్వం,
తారతమ్యానికి తావీయని సమతాభావ౦.
ఆయురారోగ్యయాగాన నేనొక సమిధనయ్యాను,
ప్రోదిచేసుకుంటు మరో అనుభవం.
Subscribe to:
Post Comments (Atom)
మీ విన్నపం చదివాక కవితంతా మళ్ళీ చదివానండి.. కొత్తగా అనిపించింది.. త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుంటున్నా..
ReplyDeleteశ్రేయోభిలాషిచ్చిన స్ఫూర్తె నీకు ఆశీస్సులు
ReplyDeleteశివతా౦డవమె నువు చేరు ఆ చివరి మైలు
నటరాజ పాదాల చుట్టుకొలత కాబోలు
పదమూడు మైలురాళ్ళ నీ పరుగు నీకు
ఆరోగ్యదేవతలకు సమియిష్టి వ్రతమేమొ
నీ చమట కార౦గా దీపాల నూనె వలె
నిత్యమై వెలగాలి ఆ దీపాలవెలుగు నీలోన
నృత్యమై రావాలి ఫలము నీ యాగదీక్షలోన
సర్వజనమును గూర్చి నీ ఆలోచన౦తా
అన్ని సుఖములను ని౦పాలి నీ లోకమ౦తా!
ఉషగారు, పదమూడు మైళ్ళ మీ పరుగునకు సిరి జోత ఈ పిల్లకవిత. చివరి ప౦క్తిలో చెప్పినట్టూ, నీ లోకమ౦తా అన్నదా౦ట్లో మీరు రె౦డు నానార్ధాలను చూడాల౦డోయ్. ఒకటి మీ కుటుబమ౦తా అని. రె౦డు, ఈ లోకమ౦తా అని. మీ రె౦డు కారణాల పరుగుకు (లోకకల్యాణ౦, మీ నిత్యనృత్య కల్యాణ౦ జరగాలని కదా) ఈ రె౦డు శుభాకా౦క్షలన్నమాట!
మీ దగ్గర్లో ఉన్న నటరాజును చూడ౦డి, మ౦దహాస౦తోనే తథాస్తు అని దీవిస్తు కనిపిస్తాడు.
టోపీలు తీసేశాం!
ReplyDeleteమీరే రకం నాట్యం చేస్తారు?
"అడుగడుగున సౌభ్రాతృత్వం, తారతమ్యం తావీయని సమతాభావం." మీకు రామ రక్షకాగా ...
ReplyDeleteఆయురారోగ్యాలతో కొనసాగించాలి మీ నృత్య సాధన ....ఇదే మా మనఃపూర్వక ఆకాంక్ష ....
ఉషగారు,
ReplyDeleteసంతోషం మీ రెండున్నరో, మూడున్నరో లేక మరెన్నో గంటల రేసును ఇంత తక్కువ పదాల్లో తెలిపినందుకు. మారథాన్ పూర్తి చేసినందుకు అభినందనలు.
మురళి, పరిమళం గార్లు, మీ అభినందనకి, ఆకాంక్షకీ కృతజ్ఞతలు.
ReplyDeleteఆనంద్, మాటలకందని భావన మీ కవిత చదివాక. కనులనీరు నింపావు నేస్తం. అది ఆనంద మూలాల్నుండి వెలికివచ్చింది.
కొత్తపాళీ గారు, వినూత్నంగా అభినందిచారు. సంతోషం. నా పదేళ్ళ నృత్య సాధనలో ఎక్కువగా కూచిపూడి, తర్వాత భరతనాట్యం అభినయించాను. కొంచంగా కథక్, కథాకళిలో ప్రవేశంవుంది. ఈ మధ్యనే ఆంధ్ర నాట్యం గురించి చదువుతున్నాను. నృత్యం, నాట్యం ఒక శాస్త్రంగా అభ్యసిస్తున్నాను నాకున్న పరిమితమైన తీరిక వేళల్లో.
ప్రదీప్, సూటి ప్రశంస అయితే ధన్యవాదాలు. వ్యంగ్యమైతే, మన్నించండి.అంతకన్నా కుదించి క్లుప్తంగా వ్రాయలేని అనుభూతది. మీ అభినందనకి కృతజ్ఞతలు. అక్కడి volunteer - "వన్ లెవన్ మైల్స్" అన్నట్లు, మీ మూడున్నరకి మరో "లెవన్ మినిట్స్" కలపండి నా అత్యత్భుత అపురూప పయనం తీసుకున్న సమయం తెలుసుకునేందుకు. ;)
ఓర్నాయనో, మీరు 13మైళ్ళు నాలుగ్గంటల్లోగా పూర్తి చేసారా!!!. బాప్ రే!!
ReplyDeleteనాకు మూడున్నర రోజులు పడుతుందనుకుంటా..అది కూడా వాకింగ్ అయితే మాత్రమే సుమీ! రన్నింగ్ అంటే మనం రన్నింగే, అదేలెండి...వెనక్కి:-)
నిజంగా హేట్సాఫ్. పడుచువాడి కన్నుగీటు గురించి మీర్రాసింది నాకు మంచి మందహాసాన్ని మిగిల్చింది.
వ్యంగ్యం కాదు సుమా సూటి ప్రశంసే...
ReplyDeleteవ్యంగ్యంలా అనిపించినందుకు క్షమాపణలు
యన్ కె గారు, నా బ్లాగుకి సాదర స్వాగతం. మీ స్పందనకి ధన్యవాదాలు. నిజానికి అక్కడెంతో అనుభవజ్ఞులు, అతిరథులు, మొదటిసారే ఇంకా ప్రజ్ఞని చూపినవారున్నారు. కాని నేను సాధించినది నాకు తృప్తినిచ్చింది. మరింత సాధన చేయను స్ఫూర్తినిచ్చింది. మరేం, కుర్రచేష్ఠలు లేని పరువపు ప్రాయం పోపు లేని కూరే కదా!
ReplyDeleteప్రదీప్, ఇదే భాషలోని శ్లేషతెచ్చే తంటా. మీరు క్షమాపణలు కోరనవసరం లేదు. నేను అందుకే రెండు అర్థాలకి సమాధానమిచ్చాను. మీరు ప్రతిస్పందిస్తారా లేదాని ప్రతీక్షించాను. ప్రశంసకి మరోమారు కృతజ్ఞతలు.
అభినందనలు ఉష గారు. మీ ఆశయం నెరవేరాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. కళామతల్లి మీలోగిట్లో మీతో కలిసి ఆనందతాండవం చేయాలని ఆమెను ప్రార్ధిస్తున్నాము.
ReplyDeleteఆత్రేయ గారు, మీ అభినందన, ఆకాంక్షలకి సర్వదా కృతజ్ఞురాలిని. మీ ప్రార్థనకి వందనాలు.
ReplyDeleteఅందరికీ మరోమారు మీ సహృదయానికి ధన్యవాదాలు. త్వరలో మరో టపాలో కలుద్దాం. ప్రస్తుతానికి సెలవు.
హమ్మో.. ఉష గారూ.. మీరు మహా ఘటికులండీ బాబూ..!
ReplyDeleteబహుముఖ ప్రజ్ఞాశాలి అన్న మాట.!
13.1 మైళ్ళు పరిగేట్టేశారంటే సామాన్యుల మరి.?
మీకివే నా శుభాభినందనలు. మీ పరుగుని కవితగా మార్చిన వైనం బహుముచ్చటగా ఉంది.
త్వరలోనే మీ నాట్యం కూడా మిమ్మల్ని ఆనందంలో ముంచివెయ్యాలని.. ఆ పారవశ్యంలో మీ నుంచి మరిన్ని కవితలు మరువపు తోటలోకి పరుగులిడుతూ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
మధుర, చాలా సంతోషమండి, పది రోజులు ముగిసాక కూడా మళ్ళీ ఆ సంబరాన్ని జ్ఞప్తికి తెచ్చేంత బాగా ప్రశంసించారు. ఇలా ఒక నేస్తం ప్రొత్సాహంతోనే సాధన చేసి పరిగెట్టగలిగాను. నా కాలు కూడా 11 మైల్లో కాస్త బాధపెట్టినా చివరి వరకు ఆగలేదు. అంతా దైవికంగా జరిగినట్లుగా అనిపించింది. పదివేల మందిలో నేనొకరిని అన్న భావన కూడా బాగుంది. ఇక నృత్యం, అదీ సాగుతుంది కాని ముఖ్యంగా నా ఆత్మానందానికే అది పరిమితం, ఒకప్పుడు ఎంతో ప్రీతిగా నాట్యమాడాను, ఇప్పుడు అంతే పట్టుదలగా సాధన చేస్తున్నాను. మీ సహృదయానికి ధన్యవాదాలు
ReplyDelete