తరచి తరచి నిన్నే తలచినా, తనువు మరిచి నీలో మునిగినా ..

వస్తావని చూసినా,
రావని వగచినా, 
రాలేదని నిలదీసినా
సమయానికి వస్తూనే వుంటావు, 

తలపే కనుక వాకిలీ లేదు.
తలపు వెలికి నేను వచ్చినా, 

తలపు లోకి నేను జారినా,
తరచి నిన్నే తలచినా, 

ఇది మనకి నిత్యపారాయణం కాదా?

తపించి, జపించి, 

నీ చేరువలో తరించి
ఎద పొంగిపోయినా,
విడిచి, వేదన పడి,

మౌన రోదన సుడిలో
మునిగిపోయినా,
తిరిగి ఎదురుచూపున విసిగివేసారినా,

నిన్నొదిలి పోదామన్నా,
అదే వలయం నా నిలయం, 

ఆ చక్రానికి ఇరుసు నీవే కాదా?

నను వీడిన మరునిమిషమే

నీవెళ్ళిన దారుల గాలే పీల్చుతూ,
నీ అడుగులు సోకాయన్న నేల

తిరిగి తిరిగి తాకుతూ,
కలలోనైనా నీవొస్తే ఏంచెప్పాలో

మళ్ళీ మళ్ళీ అద్దంకి అప్పచెపుతూ,
ఇలా నీ తలపుల,

ఇల వలపుల,
కలల కవితల
మాలలల్లుతాను కాదా?

************************************************

మనవి: 
నీవులేని మరువపుగాలి, నీవులేని సమిధపు వెలుగు: http://ayodhya-anand.blogspot.com/2009/02/blog-post_26.html

సమిధ ఆనంద్ గారు ఒకప్పుడు నా మాటలకి ఎంతో ప్రతిస్పందించి అంతే చక్కగా వ్రాసిన కవిత ఇది. పైన కవితలోని చివరి నాలుగు పంక్తులు అప్పుడు నా స్వగతంగా వ్రాసాను, తన పొడిగింపు అలానే సాగింది. అది కూడా చూస్తే కవితహృదయం పోకడలు మనసు మనసుకి ఎలా మారతాయో అర్థమౌతుంది. 

11 comments:

  1. బాగా రాసారు..కొన్ని చోట్ల కాస్త అర్దం కాలేదు మిగిలిన కామెంట్స్ చూడాలి :)

    ReplyDelete
  2. తలపుల తలుపులు దాటి ఊహల ప్రపంచంలోకి అడుగేసిన ఈ కవిత బాగుంది.

    ReplyDelete
  3. తలచిన తలపుగ తలవగనే తలపులలో వచ్చేవాడికి తలుపుల వాకిళ్ళు ఓ లెక్కా?
    కాస్త కలవరమైనా నీ కలలోనే ఉ౦టూ కలవరి౦తలు సహిస్తూ కనుసన్నలలోనే ఉన్నాడుగా?
    తలపుల వలపుల కలలతో వాడి ఊపిరిన౦తా కూర్చి కట్టి అల్లిన మాలలన్నీ నీకోసమే కదా?
    నిత్యపారాయణ ఫలమైన వాడి రాక నీకే కదా, చివరికి అతగాడికి మిగిలి౦దేమిటి పాప౦?

    చివరి నాలుగు ప౦క్తులతో నాకున్న చిన్ని అనుబ౦ధ౦ గుర్తు౦దా ఉషగారూ?

    ReplyDelete
  4. నేస్తం, నన్నొక అయోమయంలో పడేసారు. సరళంగా వ్రాస్తున్నానని మెచ్చేసుకుంటారనుకుంటే, ఇంకేదో అర్థంకాలేదంటున్నారు. చిత్రం :)

    ప్రదీప్, అందుకే ముందే చెప్పేసాను, నాకు వూహల విహారాలు ఎక్కువేనని. అవే నాకు వూపిరులు. వెన్నంటివుండే ఆలాపనలు. అవిలేని నేను లేను, అవి రాని రోజూ లేదు.

    ఆనంద్, నిజానికి ఒకింత సంశయించాను, నా మాటలే అయినా మీ కవితలో అంత పొందిగ్గా అమిరిన వాటిని తిరిగి ఇక్కడ కూర్చాలంటే, కానీ అదే భావన అపుడపుడు తిరిగివస్తే అవే మాటలు అమరుతాయి. కనుక మన్నించేయండి. మీ కవితా పొడిగింపు అమోఘం. అసలు మనిషికి, ఆ మనసుకి గోచరమైతే చాలు ఈ ఘోష.

    ముగ్గురికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెల్పుకుంటున్నాను. ఎంత వతనుగా వస్తారో అంతే ఒద్దిగ్గా వ్యాఖ్యలు వ్రాస్తారు. కృతజ్ఞతలు.

    ReplyDelete
  5. ""tapinchi japinchi nee cheruvalo eda ponginaa"ee bhaavana kavitha lu raayalane tapanalo eppudo anubhavamitadi chaala baavundi

    ReplyDelete
  6. నే తలన్చనే లేదు నేడు నేను ఇచ్చటకి అరుదెన్చెదనని..
    అయిననూ.. సంతసించితిమి దీనిని చదివిన పిమ్మట..
    in cine song language..
    కలలోనైనా అనుకోలేదు నేనోస్తాననీ.. దీనిని చూస్తాననీ..
    :) nice.. keep it up..

    ReplyDelete
  7. రిషి, CloseToReality నా బ్లాగుకి సాదర స్వాగతం. మళ్ళి మళ్ళీ రావాలి మీరు, వెళ్ళి వెళ్ళీ కనే నేను రప్పించాలి మరల మిమ్ములను. ఒకసారి ఎవరో అడిగారు. "నీది అనుభూతి కవిత? లేక అనుభవం కవిత?" అని. "స్పందన కవిత" అని సమాధానం ఇచ్చాను. నా మనసు హృదయచలనం కన్నా చలిస్తుంది. ఆ కదలికే నా మరువపు మొలకన కవితల చివుర్లు తొడుగుతుంది. నా భావాలు మీకు నచ్చటం నాకూ సంతోషం.

    ఆనంద్ బాబు, తమరూ భలే మంచోరే. మునుపెపుడోనే చెప్పాం ఈ మాట. నిజానికి మీరు వ్రాసిన కవిత లింకు పెట్టాలని మరిచిపోయాను. ఇంకా సమయాతీతం కాలేదు కనుక ఆ పని ఇపుడు చేస్తున్నాను.

    ReplyDelete
  8. అప్పుడప్పుడూ అవసర౦ లేని పనులు కూడా చేస్తారు మీరు. మీకు నా వ్యాఖ్యలో గుర్తుచేసి తప్పు చేసాను. మళ్ళీ నా మాట అదే, మీరు భలేవార౦డీ ఉషగారూ.

    ReplyDelete
  9. ఇది మరీ బాగుందండి ...కవితలంటే మాటలా ...ఒక్కో పదం ఎందుకు రాసారు యే భావం తో రాసారు అని ఆలోచించాలంటే కత్తి మీద సామునే మాలాంటోళ్ళకి .. ప్రదీప్ గారు ,ఆత్రేయ గారు ,ఆనంద్ గారు ఇలా వీరిలా చక చకా అర్దం చేసుకునే శక్తే ఉంటే ఆ పాటికి నేనూ ఒక బ్లాగులో రోజుకో కవిత రాసేసేదాన్ని :)

    ReplyDelete
  10. నేస్తం, సరదాగా అన్నానండి. నాకంత పరిజ్ఞానం లేదు. భాషా ప్రావీణ్యత విషయంలో ఇంకా విద్యార్ధినే. కాకపోతే కవితా రూపంగా వ్రాసేప్పటికి శైలి, శిల్పం, వస్తువు ఎంచుకున్న తీరుని బట్టి కొన్నిసార్లు సంక్లిష్టత వస్తుందేమో.

    ఆనంద్, అదేమీ కాదు. నేను ముందు చేయాల్సిన పనది.
    మీరిరువురకు వందనాలు.

    ReplyDelete